42. సంభాషణం – కవి శ్రీ రఘు శేషభట్టార్ అంతరంగ ఆవిష్కరణ

1
12

[సంచిక కోసం కవి రఘు శేషభట్టార్ గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]

నిజాయితీ గల న్యాయవాద కవి:

[dropcap]ని[/dropcap]జాయితీ గల కవిత్వాన్ని నిష్కర్షగా చెప్పగల కవులను బహు అరుదుగా చూస్తుంటాం. ప్రచారానికి, పొగడ్తలకు, సన్మానాలకూ, అవార్డులకు ఆశపడని కవులు కూడా మన సమాజంలో అరుదుగానే ఉంటారు. ఇలాంటి అరుదయిన కవిశ్రేష్ఠుడు శ్రీ రఘు శేషభట్టార్. చిక్కని కవిత్వం అందించటమే తన ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఈ కవి శ్రీ గుంటూరు శేషేంద్రశర్మ శిష్యుడు.

తన కవిత్వం మీద శ్రీ గుంటూరు శేషేంద్రశర్మ ప్రభావం వుందని బల్లగుద్ది చెప్పగల సాహసి ఈ కవి. న్యాయవాదశాస్త్రం చదువుకున్న ఖమ్మం వాసి అయిన శ్రీ రఘు శేషభట్టార్ పుష్టికరమైన కవిత్వం అందించగల దిట్ట! హైదరాబాద్‌లో, ఒక పేరు పొందిన ఇన్సూరెన్స్ కంపెనీకి న్యాయ సలహాదారుగా పనిచేస్తున్న శ్రీ రఘు, తన గురించి ఏమి చెబుతారో చూద్దాం.

~

* ప్రముఖ కవి శ్రీ రఘు శేషభట్టార్ గారికి సంచిక అంతర్జాల మాసపత్రిక పక్షాన స్వాగతం. రఘుగారు నమస్కారం.

జ: నమస్తే అండీ!

1. కవిగారూ.. తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు వున్నాయి కదా! మీరు మీ రచనా వ్యాసంగానికి కవితా ప్రక్రియనే ఎందుకు ఎంచుకున్నారు? వివరంగా చెప్పండి.

జ: తతిమ్మా ప్రక్రియల కన్నా నాకు కవిత్వం పట్ల ఉన్న వ్యామోహమే దానికి కారణం. ‘సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్‌’ అన్న భర్తృహరి సుభాషితమేదో నా మీద పని చేసి ఉంటుంది. కవిత్వ పంక్తులు నా ఒత్తిడిని మంచులా కరిగిస్తాయి.రాసేందుకు ప్రేరణనిస్తాయి. అది కలిగించే అనుభూతితో ఇతర ప్రక్రియల్ని బేరీజు వేయలేను. కవిత్వ పఠనం, మననం రెండూ నాకు ఇష్టమైన వ్యాపకాలు. బుచ్చిబాబు, మునిపల్లె రాజు తెలుగులో నాకిష్టమైన కథకులు.

2. కవిత్వంపై మీ మనసులో బీజం ఎప్పుడు పడింది? మీకు ఇష్టమైన కవి ఎవరు? మీ కవిత్వం పైన ఏ కవి ప్రభావం ఎక్కువగా ఉంటుంది?

జ: నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో శేషేంద్ర శర్మ రాసిన “వేళ్ళే కాళ్ళై నడిచే చెట్టు మనిషి/చెట్టుగా ఉంటే ఒక్క వసంతమన్నా దక్కేది/మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను” అనే కవితా పంక్తులు నన్ను పట్టి ఊపాయి. ఆ తర్వాత కొన్నాళ్ళకు మా పెదనాన్న ఇచ్చిన ‘శేషేంద్ర కావ్య భూమిక’ చదివాక కవిత్వం అంటే గౌరవం ఏర్పడింది. తదనంతర కాలంలో నేను శేషేంద్ర ప్రియ శిష్యుడిగా మారటం, కవిత్వ సృజన చేయటం అంతా పురాజన్మ సుకృతం.

కవిగారి కుటుంబం

3. మొట్టమొదట మీ కవిత్వాన్ని ఏ పత్రిక ప్రచురించింది? అప్పుడు మీ అనుభవం ఎట్లా ఉందో వివరిస్తారా?

జ: 1993 లో నేను విశాఖలో Law చదివే రోజుల్లో నా మొదటి కవిత ‘ఆంధ్రప్రభ’ లో అచ్చయింది. ఆ రోజు నా మిత్రులిద్దర్ని దస్‌పల్లా లో dinner కు తీసుకెళ్ళాల్సి వచ్చింది. ఐతే ఆ తర్వాత 2,3 సార్లు తప్ప నేను పత్రికలకు కవిత్వం పంపలేదు. కారణం ఏమిటంటే ఇంచుమించు అన్ని పత్రికలు స్త్రీ వాద కవిత్వాన్నో, దళిత కవిత్వాన్నో పట్టించుకున్నట్టు నా తరహా శుద్ధకవిత్వాన్ని పట్టించుకోలేదు. ‘వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవటం కాదు, మీరు వాళ్ళను పట్టించుకున్నారా లేదా అనేది ముఖ్యం’ అన్న నా గురువు శేషేంద్ర మాటలు నా మీద బాగా పనిచేశాయి. ఆ తర్వాత నేనెప్పుడూ పత్రికలకు కవిత్వం పంపలేదు. నాకంటూ కొంత గుర్తింపు వచ్చాక selective గా పంపటం అలవాటు చేసుకున్నాను. అది కూడా పత్రికల్లోని మిత్రులు అడిగినప్పుడే.

4. శేషేంద్ర శర్మ కాక మిమ్మల్ని ప్రభావితం చేసిన కవులెవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు? ఇప్పుడు రాస్తున్న వాళ్ళలో మీకు ఇష్టమైన కవి ఎవరు?

జ: కాళిదాసు, భవభూతి, భర్తృహరి లాంటి సంస్కృత కవుల ఉత్ప్రేక్షలు నాలో సబ్బుబిళ్ళల్లా కరిగిపోయాయి.

ఆధునిక వచన కవితా పంక్తులకు ఏ మాత్రం తీసిపోని ఉపమలు వాళ్ళ శ్లోకాల్లో దొరుకుతాయి. వాళ్ళను చదివాకే నాలో ఉక్తి వైచిత్రి కొత్త పుంతలు తొక్కింది.

పురాకవులు నాకొక జీవభాషనిస్తే సచ్చిదానందన్ నాకు వస్తు విస్తృతి నిచ్చాడు. సమకాలీన తెలుగు కవుల్లో మిత్రుడు BVV ప్రసాద్ తత్విక భూమిక నాకు నచ్చుతుంది.

సుప్రసిద్ధ కవి శ్రీ గుంటూరు శేషేంద్రశర్మ గారితో కవి రఘు

5. మంచి కవిత్వం అంటే ఏమిటి? మంచి కవిత్వం రాయడానికి మార్గదర్శక సూత్రాలు ఉన్నాయా?

జ: కళాత్మక విలువలున్న కవిత్వమే మంచి కవిత్వం. అది మరింత మందికి ప్రేరణనిస్తుంది. రాసేందుకు అధ్యయనం అనేది అవసరమే కానీ దాని కోసం బండ్ల కొద్దీ చెత్తను భరించనవసరం లేదు. ఏది చదివితే మనలో ఉత్తేజం కలుగుతుందో ఆ తరహా కవిత్వాన్నే చదవాలి, మననం చెయ్యాలి. కవిత్వం సహచరి అనుకొని నడవాలి.

6. కవిత్వ రచనలో భాష/యాస/మాండలీకం ఎంతవరకూ అవసరం? మాండలీకం గురించి వాదించే చాలామంది కవులు తమ రచనల్లో మాండలీకం వాడకానికి దూరంగా ఉండడానికి గల కారణం ఏమిటి?

జ: అన్ని మాండలికాల్ని నేను సమానంగా గౌరవిస్తాను. ఐతే మాండలికం అనేది కథకు కుదిరినంతగా కవిత్వానికి కుదరదు. బలవంతంగా చొప్పిస్తే అది కాలానికి నిలవదు.

పోల్చి చెప్పాలంటే ‘మృచ్ఛకటికం’ లాంటి ప్రాచీన కావ్యాల్లోని ప్రాకృతం ఎవరికి గుర్తుంది చెప్పండి? మాండలికాన్ని ప్రేమించినంత మాత్రాన అది కవిత్వంలో ప్రతిఫలించాల్సిన అవసరం లేదు.

ఇష్టమైన కవిBVV Prasad గారితో

7. ఈనాటి పాఠకుడు తెలుగుసాహిత్యంలో ఏ ప్రక్రియను ఎక్కువగా ఇష్టపడుతున్నాడు? ఎందుచేత?

జ: అది వ్యక్తిగత ఇష్టాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా రాయటం కన్నా చదవటం మీదే దృష్టి పెట్టేవాళ్ళు అన్ని ప్రక్రియల్ని ఇష్టపడతారు. తెలుగు నేలలో అన్ని రకాల ప్రక్రియలని సమానంగా ఇష్టపడే పాఠకులున్నారు కానీ విమర్శ మాత్రం మొహమాటాల మధ్య నలిగి చచ్చిపోయింది.

8. వచన కవిత్వంలో శ్రీ కుందుర్తి ఆంజనేయులు, శ్రీ శీలా వీర్రాజుగారు ఎంతగానో కృషిచేశారు. కథను కూడా వచనకవితలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ ప్రక్రియ పై మీ అభిప్రాయం చెబుతారా?

జ: వాళ్ళ వచన రచన పద్ధతి నాకు సరిపడదు. ఉపమలు, ఉత్ప్రేక్షలు లేని కవిత్వాన్ని నేనూహించలేను. ఆసాంతం కళాత్మకత ఉట్టిపడే వాక్యాల్నే నేను కోరుకుంటాను.

కవిత్వం అనే సురభోగాన్ని అందుకునేందుకు దాన్ని న్యూస్ పేపర్ స్థాయి భాషలోకి మార్చనవసరం లేదు.

ముఖ్యంగా శీలావి ‘పడుగు పేకల మధ్య జీవితం’ అనే పుస్తకం చదివినప్పుడు ఆయన మీద బోలెడంత జాలేసింది. కుందుర్తి ఉద్దేశ్యాలు మంచివైనా దాని నుండి స్ఫూర్తి పొందిన వాళ్ళకు బ్లాక్ టిక్కెట్లు అమ్ముకునే వాడికి కూడా కవిత్వం అర్థం కావాలనే concept ఏదో ఉండి ఉంటుంది. ఫలితంగా అకవిత్వం కుంభాలు కుంభాలుగా కురిసింది. ఐతే కాలం వీచిన గాలుల్లో అవన్నీ కొట్టుకొని పోయాయి.

అనల్పం.. పుస్తకావిష్కరణ సభలో రచయిత్రి శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టితో.. కవి రఘు దంపతులు

9. తెలుగు కవిత్వం అనుకున్నంత స్థాయిలో ఇతర భాషల్లోకి అనువాదం కాకపోవడానికి కారణం ఏమిటి? దీనికి కారణం కావలసినంతమంది అనువాదకులు లేకపోవడమా? లేక రచయితల నుండి పెద్దగా స్పందన లేకపోవడమా?

జ: ముందుగా మన కవిత్వం ఇతర భాషల్లోకి పోవాలనే సంకల్పం బలంగా ఉండాలి. అది అమలు చేసేందుకు అవసరమైన ఆర్థిక సంపత్తి కూడా ఉండాలి. అనువాదకుడిని వెతికి పట్టుకోవటం ఇంకో ప్రయాస. ఇన్ని అవస్థల మధ్య అనువాదం అనేది అందని ద్రాక్ష అవుతోంది. దీనికి పరిష్కారం ‘అనువాద అకాడమీ’ ని ఏర్పాటు చేయటం. అందులో పైరవీ కవులు చేరకుండా జాగ్రత్త పడితే మన కవిత్వ సౌరభం వేరే భాషల్లోకి వెళ్తుంది. ఐతే ఇప్పుడున్న మురికి ఆవరణలో అది అసాధ్యం.

సభలో ప్రసంగిస్తున్న కవి రఘు శేషభట్టార్

10. ఉత్తమ కవిత/కవిత్వంను ఎంపిక చేయడానికి మార్గదర్శక సూత్రాలు ఏమిటి? అకాడమీలు, వివిధ సాహిత్య సంస్థలు, బహుమతికి ఎంపిక చేసే విధానం ఎలా వుంటుంది?

జ: వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎంపిక అనేది సాహిత్యేతర కారణాలతోనే జరుగుతుంది. సాహిత్య అకాడమీ నిరుడు ఇచ్చిన యువపురస్కారం చూశాక ఈ విషయంలో ఎవరికైనా భ్రమలున్నాయనుకోను. ఈ ఏడాది కొంచెం సరిదిద్దినా ముందు ముందు కథ మళ్ళీ మొదటికొస్తుందనటంలో అనుమానం లేదు. తతిమ్మా అవార్డులు దీనికి మినహాయింపు కాదు. నిర్దిష్ట కాలంలో ఎన్ని పుస్తకాలు వచ్చాయో, వాటిని రాసిన వాళ్లెవరో తెలిపే catalogue ఎంపిక కమిటీల దగ్గర ఉండవు. అవార్డు ఇచ్చే వాళ్ళు ఎంపిక చేసుకున్న పుస్తకాలనే అవార్డు కమిటీకి పంపుతారు.

11. మీరు వృత్తికి ప్రవృత్తికి ఇచ్చే ప్రాధాన్యతలు ఎలా ఉంటాయి ?ఎందుచేత?

జ: నేనొక బహుళ జాతి సంస్థలో Head – Legal గా ఉన్నాను. నాకుండే పని ఒత్తిడికి పుస్తకాలు చదవటం, కవిత్వం రాయటం అనేవి సాధ్యమయ్యేది కాదు. ఐనా కవిత్వం పట్ల ఉన్న అపారమైన ప్రేమ, శ్రద్ధ నన్ను రాయగలిగేలా చేస్తున్నాయి. వృత్తి ప్రవృత్తులను సమర్థంగా handle చేయటం నాకిష్టం.

12. మీ కలం నుండి వెలువడ్డ మీ రచనల గురించి చెప్పండి.

జ: ఇంతవరకు 8 కవితా సంపుటాలు, ఒక వ్యాస సంకలనం వచ్చాయి. కవిగా నేనేమిటో నా కవితా సంపుటాలు చెబితే, పాఠకుడిగా నేనేమిటో నా వ్యాససంపుటి ‘సౌరభం’ చెబుతుంది. కవిత్వ పరామర్శ పేరుతో రుద్దబడ్డ పెడసరి వ్యాసాలకు విరుగుడుగా రాయబడ్డ సారస్వత పత్రాలివి. అన్ని కాలాల కవుల ప్రస్తావన ఉంటుంది అందులో.

కవి వెలువరించిన కొన్ని కవితా సంపుటాలు

13. అంతర్జాల పత్రికలు రచయితలకు/కవులకు, ఇతర సాహిత్యకారులకు ఎంతవరకూ ఉపయోగపడుతున్నాయి?

జ: అంతర్జాల పత్రికలు నడిపే వాళ్ళకు వాళ్ళ పాఠకులెవరో తెలుసు కనుక తదనుగుణంగానే పని చేస్తాయి. Print media తో విసిగిపోయి ఉన్న పాఠకులు వాటికి తొందరగా connect ఔతారు. ఇది మంచి పరిణామమే. ఐతే కవులను, రచయితలను పట్టించుకున్నంతగా అవి భాషా శాస్త్రాన్ని పట్టించుకున్నట్టు లేవు. అపభ్రంశ శబ్దాల గురించి, దుష్ట సమాసాల గురించి హెచ్చరించే వ్యాసాలు విస్తృతంగా రావాలి. భాష మనకు జీవనాడి కనుక దాన్ని నిలబెట్టే ప్రయత్నం బుద్ధిపూర్వకంగా జరగాలి.

14. మిమ్మల్ని వరించిన అవార్డులు – సన్మానాలు గురించి వివరించండి.

జ: అవార్డులు – సన్మానాలు పొందే technique లేవీ నాకు తెలీదు. నాకెవరూ అవార్డులివ్వలేదు ఇప్పటి వరకు. వాటి గురించి చింత కూడా లేదు. రాసుకోవటంలో ఉన్న శ్రద్ధ పైరవీల మీద లేదు నాకు. కవిత్వం పేరు చెప్పి సాము గారడీలు చేయలేను.

రవీంద్ర భారతిలో అనల్పం.. పుస్తకావిష్కరణ

15. కొత్తగా కవిత్వం రాస్తున్న కవులకు, కవయిత్రులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు?

జ: ముందుగా కవిత్వ నిర్మాణ శాస్త్రం (Poetics) అనేది ఒకటుందని తెలుసుకొమ్మంటాను. జాలరి వాడు చేపలు పట్టినట్టు రాసేందుకు పూనుకోవద్దని చెబుతాను. నేరుగా చెప్పాలంటే శేషేంద్ర శర్మ రాసిన ‘కవిసేన మేనిఫెస్టో’ చదవండి. ఏది చదివితే మీ నవనాడులు రొమాంచకమౌతాయో అటువంటి వాక్యాల నుండి స్ఫూర్తి పొందండి. ప్రతి మాటను ఆచి తూచి రాయండి

* మీ సమయాన్ని వెచ్చించి మీ గురించి తెలిపినందుకు ధన్యవాదాలు.

జ: డాక్టర్ గారూ! ధన్యవాదాలు!

~

(శ్రీ రఘు శేషభట్టార్ గారిని +91 96761 44904 అనే నెంబరులో సంప్రదించవచ్చు.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here