సంభాషణం: కవి, కథకుడు, నవలాకారుడు సంగెవేని రవీంద్ర అంతరంగ ఆవిష్కరణ

24
8

[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం కవి, కథకుడు, నవలాకారుడు సంగెవేని రవీంద్ర గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]

ముంబై సాహితీ సూరీడు.. శ్రీ సంగెవేని రవీంద్ర..!!

భాషా, యాస, సాహిత్యం, సంస్కృతి -సంప్రదాయల మీద నమ్మకం, గౌరవం ఉన్నవాళ్లు, వారి మాతృభూమిని వీడి, మరోచోటికి వలసపోవలసి వచ్చినపుడు, తమ మూలాలు మరచిపోకుండా మాతృభాషను, ముందుతరాలకు అందించే ప్రయత్నాలు చేసిన/చేస్తున్న, కుటుంబాలు, సంస్థలు మనకు చాల ఉన్నాయి. విదేశాలలో అయితే, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, దుబాయ్, కువయిట్ వంటి దేశాలను ప్రముఖంగా చెప్పుకొవచ్చు.

స్వదేశం విషయానికొస్తే, పొట్టకూటి కోసం, తమ పూర్వీకులు, చిన్న చిన్న ఉద్యోగాల కోసం, కూలీపని కోసం, ముంబై వంటి నగరాలకు వలసపోయి, క్రమంగా అక్కడే స్థిర పడిపోయి, వారు వదిలివెళ్లిన మూలలను అందిపుచ్చుకుని, తమ మాతృబాష కోసం, తెలుగు సాహిత్యం కోసం, అది ముందుతరాలకు అందించడం కోసం కృషిచేస్తున్న ప్రముఖంగా చెప్పుకోదగ్గ సాహిత్యకారుల్లో, అతిముఖ్యులు శ్రీ సంగెవేని రవీంద్ర గారు.

ఉభయ తెలుగు రాష్ట్ర సాహిత్యకారులతో సత్సంబంధాలు పెట్టుకుని, తాను సాహిత్యకారుడిగా ఎదగడమే కాకుండా, ముంబై వంటి నగరంలో ఔత్సహిక రచయితల కోసం, తనవంతు సాహిత్య సేవలు అందిస్తున్నారు శ్రీ రవీంద్ర.

కవిగా, కథకుడిగా, నవలాకారుడిగా, వ్యాసకర్తగా, పత్రసమర్పకుడిగా, పత్రికా సంపాదకుడిగా, అయన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు,ఆంగ్లం, హిందీ భాషల్లో ఆయనకు మంచి పట్టు ఉంది. మరాఠీ భాష ఎట్లాగూ మాట్లాడక తప్పదు. శ్రీ రవీంద్ర సాహిత్య ప్రస్థానాన్ని గురించి ఆయననే అడిగి తెలుసుకుందామా.. పదండి మరి ముందుకు..

~

ప్ర: రవీంద్ర గారు..! సంచిక అంతర్జాల మాసపత్రిక పక్షాన మీకు స్వాగతం..

స: ధన్యవాదాలు సర్..

ప్ర: ముంబై నగరంతో మీకు సంబంధం ఎలా కుదిరింది? మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి..!

స: ప్రస్తుతం పరిస్థితులు కాస్త మారాయి కానీ, మూడు నాలుగు దశాబ్దాల క్రితం, తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన గ్రామాల్లో దాదాపు ప్రతి ఇంటి నుండి ఒకరిద్దరు ముంబైకి వలస వచ్చేవాళ్ళు.. మా తల్లితండ్రులు కూడా ఆ విధంగా పొట్ట చేతబట్టుకొని ముంబైకి చేరుకున్నవాళ్లే.. నేను పదవ తరగతి మధ్యలో ఆపేసి, తల్లితండ్రుల అభీష్టం మేరకు ముంబై చేరుకోవాల్సి వచ్చింది.. ఆర్థిక పరిస్థితులే అసలు కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటాను.. తాతయ్య, అమ్మమ్మల దగ్గర పెరిగాను.. మా శెకల్ల గ్రామ జ్ఞాపకాలు ఇప్పటికీ నాలో స్ఫూర్తి రగిలిస్తూనే ఉన్నాయి.. నేను చదువుకున్న వెనుగుమట్ల, బుగ్గారం స్కూళ్ళు నా జీవన ప్రస్థానానికి దారి దీపాలు..

కుటుంబంతో.. రవీంద్ర

ప్ర: తెలుగు సాహిత్యం వైపు మక్కువ ఏర్పడడానికి అనుకూలించిన పరిస్థితిని, ముంబై నగరం ఈ విషయంలో ఎలా సహకరిస్తున్నదో చెప్పండి..!

స: తెలుగు సాహిత్యంతో నాకు బాల్యం నుండే సంబంధం ఉంది.. ప్రాథమిక పాఠశాల స్థాయి నుండే నాకు పుస్తకాలు చదవడం అలవాటు.. ముఖ్యంగా చందమామ, బాలమిత్ర లాంటివి.. అయితే మా పల్లెటూళ్ళో అవి చాలా అరుదుగా లభించేవి.. పుస్తకాలు చదివే అలవాటు ఎంత వ్యసనంగా మారిందంటే.. రెండు మూడు మైళ్ళు నడిచి పక్కూర్లలోని పరిచితుల ఇంటికి వెళ్లి పుస్తకాలు అడిగి మరీ తెచ్చుకొని చదివే వాడిని..

మా ఊళ్ళో నారాయణ్ సింగ్ అనే ఒక డాక్టర్ ఉండేవారు.. ఆయనింటికి సోవియట్ ల్యాండ్ లాంటి పత్రికలు వచ్చేవి.. మందుల కోసం ఆయన జగిత్యాల వెళ్ళినప్పుడు పేపర్, పత్రికలు లాంటివి తెచ్చేవారు. ఆ విషయం తెలుసుకుని ఆయన పిల్లలతో స్నేహం పెంచుకొని, వాళ్ళింటికి వస్తూ పోతుండేవాడిని.. తర్వాత నేను ఆ ఇంట్లో ఒక సభ్యుడిగా మారిపోయాననుకోండి.. డాక్టర్ గారి పెద్దకూతురు సుజన చదువులో చాలా చురుగ్గా ఉండేది. ఆమెకు కూడా పుస్తకాలు చదవడం అలవాటుగా ఉండేది.. ఆ రకంగా నాకు చదవడం రాయడం అలవాటైంది.. సుజనను వయసులో చాలా చిన్నవాళ్ళం గనుక మేం ‘జీజీ’ అని పిలిచేవాళ్ళం.. నన్ను సాహిత్యం వైపు అడుగులు వేయించింది సుజన జీజీ యే..! తల్లి తండ్రులకు దూరంగా, ఒంటరిగా ఉండడం వల్ల కూడా నేను సాహిత్యం వైపు మొగ్గు చూపాననుకుంటాను.. కన్నవారికి దూరంగా.. బాల్యాన్ని గడపడం ఒకరకంగా విషాదమే..! ఆ ఒంటరితనాన్ని మరిచిపోయేందుకు నేను పుస్తక లోకంలోకి వెళ్లిపోయాననుకుంటాను..

ఇక ముంబై విషయానికి వస్తే ఇక్కడా అదే ఒంటరితనం నన్ను వేటాడేది.. 15 సంవత్సరాల వయసులోనే, బాల కార్మికుడిగా నేను మా బాపు పనిచేసే బట్టల మిల్లులోనే పనికి కుదిరాను.. వయసు ఎక్కువగా రాసి మిల్లులో చేరినా.. ఎక్కువగా నన్ను నైట్ షిఫ్ట్ లోనే ఉంచేవారు.. పగలైతే ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్ లాంటి వారు తనిఖీకి వస్తారని నన్ను దాచేవారు..

కవి కాళిదాసు అవార్డు – నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాసరావు దేశ్ ముఖ్ చేతుల మీదుగా.

పగలంతా గుడిసెలో ఒంటరిగా ఉండడంతో.. వర్లీ ప్రాంతంలోని సరస్వతి బుక్ డిపోకు వెళ్లడం అలవాటు చేసుకున్నాను.. ఆ పుస్తకాల దుకాణమే నా సాహితీ జీవితానికి ఆలంబనగా మారిందని చెప్పుకోవచ్చు.. కొన్ని వందల పుస్తకాల్ని.. అన్ని విషయాలకు చెందిన పుస్తకాల్ని.. వార, పక్ష, మాస పత్రికలన్నీ చదివేవాడిని.. షాపు యజమాని లింగం బలరాం గారు నా ఆసక్తిని గమనించి.. ఒక్క నయాపైసా కూడా తీసుకునేవారు కాదు.. డబ్బులు ఖర్చుపెట్టి పుస్తకాలు చదివే పరిస్థితి కాదు నాది.. మా మిల్లు బయట ఒక హిందీ లైబ్రరీ ఉండేది.. అప్పట్లో పుస్తకాలు రెంటుకు ఇచ్చేవారు.. ఆ విషయం మీకు తెలుసు. పుస్తకాలు అద్దెకు తెచ్చుకొని చదివేవారం అంటే ఈ తరం వాళ్ళు నవ్వుకుంటారిప్పుడు.. నేనా లైబ్రరీలో నెలకు 5 రూపాయలు చందా చెల్లించి విపరీతంగా హిందీ బుక్స్ చదివే వాడిని.. ఆ రకంగా నాకు హిందీ సాహిత్యంతో పరిచయం ఏర్పడింది..

ప్ర: ముంబై స్థానికుల మాతృభాష వేరు.. మీ మాతృభాష వేరు.. మీ నిత్య జీవితంలో ఈ భాషా బేధాల ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోగలిగారు?

స: ముంబై మహారాష్ట్ర రాజధాని అయినప్పటికి.. మరాఠీ స్థానికుల మాతృభాష అయినప్పటికీ.. ముంబై నగరంలో మరాఠీయుల జనాభా 35 శాతమే.. ముంబై ఒక మినీ ఇండియా లాంటిది.. దేశంలో ఉన్న భాషాలన్నీ ఇక్కడ మాట్లాడతారు.. నేను మిల్లులో పని చేసే వాడిని గనుక మరాఠీ, నగరంలో ఎక్కడైనా హిందీ మాట్లాడతారు గనుక హిందీ, సహజంగానే తెలుగు.. ఇలా మూడు భాషలు బాగా అలవాటయ్యాయి..

నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ రోశయ్య గారి సన్మానం

భాషా విషయంలో మరాఠీయులదీ చాలా గొప్ప మనసు.. అసెంబ్లీలో హిందీలో కూడా చర్చలు జరుగుతాయి.. అట్లాగనీ మరాఠీ మాట్లాడని వాళ్లంటే కూడా స్థానికులు చిన్నచూపు చూస్తారు.. మరాఠీయులు ఇతర భాషల్ని ఎంతగా గౌరవిస్తారో, తమ మాతృభాషని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తారు.. నిజం చెప్పాలంటే భాషా సమస్య నాకెప్పుడూ రాలేదు..

ప్ర: నవల, కథ, కవిత్వం, వ్యాసం, సమీక్ష, విమర్శ వీటిల్లో మీకు ఏ ప్రక్రియ అంటే ఎక్కువ ఇష్టం? ఎందుచేత..?

స: సాహిత్య ప్రక్రియలన్నీ నాకిష్టమే.. కాకపోతే అందులో కవిత్వమంటే నాకు చాలా ఇష్టం.. ఎందుకంటే కవిత్వం రాయడం చాలా క్లిష్టమైన పని గనుక.. ఇప్పటి వరకు ప్రచురితమైన నా 18 పుస్తకాల్లో 11 పుస్తకాలు కవిత్వమే.. ఇందులో నానీలు.. దీర్ఘకవితలు.. మినీ కవితా సంపుటాలు కూడా ఉన్నాయి.. కవిత్వం ఎందుకు ఇష్టం అంటే సరిగ్గా చెప్పలేను కానీ, చిన్నప్పటినుండి కవిత్వం బాగా చదవడం వల్లో.. ఆ తత్వమేదో నాలో ఉండడం వల్లో కవిత్వమంటే నాకు చాలా ఇష్టమని మాత్రం చెప్పగలను.. కవిత్వం రాయడంలో ఒక థ్రిల్లుంటుంది.. సంతృప్తిగా కూడా ఉంటుంది..

నాకు satirical గా రాయడమంటే కూడా చాలా ఇష్టం.. బెంగుళూరు నుండి వెలువడే బెంగుళూరు తెలుగు తేజం మాసపత్రికలో 5 సంవత్సరాల పాటు ‘రవీంద్రజాలం’ పేరుతో కరెంట్ అఫైర్స్ పై వ్యంగ్యాత్మక వ్యాసాలు రాసాను.. మంత్రులు, ప్రముఖ పాత్రికేయులు కూడా చదివి స్పందించేవారు..

నేను కథలు కూడా రాసాను.. ‘ముంబై మేరీ జాన్’ పేరుతో వెలువరించిన నా కథల సంపుటి పాఠకులతో పాటు, సమీక్షకుల, విమర్శకుల మన్ననలు కూడా పొందింది..

ప్రముఖ సీనియర్ జర్నలిస్టు, సంపాదకుడు శ్రీ ఎ.బి.కె.ప్రసాద్ గారి సన్మానం

చాలా పత్రికల్లో సమీక్షలు కూడా రాసాను.. రాస్తూనే ఉన్నాను.. రాజకీయ విశ్లేషణలంటే కూడా నాకు చాలా ఇష్టం.. ముంబై తెలుగువారి చరిత్రల్ని తెలుసుకోవడానికి నిత్యం పరిశీలన/పరిశోధన చేస్తుంటాను.. ముంబై తెలుగు వారి చరిత్ర పై వివిధ పత్రికల్లో పదుల సంఖ్యలో వ్యాసాలు కూడా రాసాను.

వ్యంగ్యాత్మక వ్యాసాలు రాసినందుకు నాకు మునిమాణిక్యం నరసింహారావు సాహిత్య పురస్కారం కూడా లభించింది.

ప్ర: ముంబైలో ఎన్ని సాహిత్య, సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి? తెలుగు భాషా వికాసానికి ఆయా సంస్థలు చేస్తున్న కృషి ఎలాంటిది?

స: ముంబైలో దాదాపు రెండు వందల వరకు తెలుగు సంస్థలు ఉన్నప్పటికి, సాహిత్య, సాంస్కృతిక సంస్థలు తక్కువే అని చెప్పాలి.. మిగతా సంస్థలన్నీ వివిధ కులాలకు చెందినవే..!

సాహిత్య, సాంస్కృతిక సంస్థలకు మాతృసంస్థ లాంటిది ఆంధ్ర మహాసభ. తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆంధ్ర మహాసభ నిర్విఘ్నంగా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఈ మరాఠీ గడ్డ పై తెలుగు పతాకాన్ని ఎగురవేస్తోంది.. ప్రస్తుతం ఆంధ్రమహాసభలో, సాహిత్య, క్రీడా విభాగానికి నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నాను.. ‘దర్పణం’ పేరుతో నా సంపాదకత్వం లోనే మాసపత్రిక తీసుకొస్తున్నాం.. గతంలో కూడా ఆంధ్ర మహాసభ తరఫున, నేను సంపాదకుడిగా.. 2015లో దర్పణం, 2016లో దూరతీరాలు, 2017లో మాకు మేమే, పేర్లతో ముంబై కవుల సంకలనాలు వెలువరించాం. తెలుగు భాషా వికాసానికి పాటుపడుతున్న ముంబై తెలుగు సంస్థల్లో అగ్రశ్రేణి సంస్థ ఆంధ్ర మహాసభ..

డా.సినారె.. చేతుల మీదుగా, నేరెళ్ల వేణుమాధవ్ తదితరుల సమక్షంలో.. తేజా అవార్డు అందుకుంటూ

ముంబైలో రెండవ అతి పెద్ద సంస్థ.. నవీ ముంబైలోని తెలుగు కళా సమితి.. తెలుగు భాషా వికాసానికి, తెలుగు కళల పరిరక్షణకు తెలుగు కళా సమితి అపూర్వమైన సేవలందిస్తోంది.. గత రెండు సంవత్సరాలుగా ‘దిక్సూచి’ పేరుతో online మాసపత్రికను వెలువరిస్తోంది.. దానికి మాదిరెడ్డి కొండారెడ్డి గారు ప్రధాన సంపాదకులు కాగా, నేను సంపాదకునిగా ఉన్నాను.. అంతే కాకుండా, నా సంపాదకత్వంలోనే, తెలుగు కళా సమితి వారు 2018లో ‘మహారాష్ట్ర తెలుగువారి శతాధిక కవుల సంచిక’ వెలువరించి రికార్డ్ సృష్టించారు.. ఇంతమంది తెలుగు కవులతో సంచిక వెలువరించడం ముంబై తెలుగువారి చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు. అంతేగాక, 2019లో ‘మహారాష్ట్ర తెలుగు రచయితల కథా సంకలనం’ వెలువరించాం.. దానికి కూడా నేనే సంపాదకత్వ బాధ్యతలు వహించాను..

ఈ రెండు సంస్థలే కాకుండా తెలుగు సాహిత్య సమితి, వివేకా గ్రంథాలయం లాంటి కొన్ని తెలుగు సంస్థలు తెలుగు భాషావికాసానికి, తెలుగు కళల పరిరక్షణకు తమ వంతుగా పాటు పడుతున్నాయి..

ప్ర: మహారాష్ట్రలో, ముఖ్యంగా ముంబైలో, తెలుగు మాధ్యమంగా చదువుకునేవారికి ప్రభుత్వపరంగా ఎలాంటి సహకారం లభిస్తోంది? ఇలాంటి వారికి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటై..?

స: మహారాష్ట్రలో, ముఖ్యంగా ముంబైలో తెలుగు పాఠశాలలు క్రమక్రమంగా మూతబడిపోతున్నాయి.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ విషయంలో అనుకున్నంతగా చొరవ చూపడం లేదు.. ముంబై విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం లేదు.. తెలుగు పట్ల ప్రభుత్వాల వైఖరి వల్ల తల్లితండ్రుల్లో కూడా అనాసక్తత పెరిగిపోయి పిల్లల్ని ఇంగ్లీష్ స్కూల్స్ లోనే చేర్పిస్తున్నారు.. ఇంకా కొన్నేండ్ల తర్వాత ముంబైలో తెలుగు పరిస్థితి ఎలా వుండబోతుందోనని ఆలోచిస్తే ఆందోళన కలుగుతుంది.. నిక్కచ్చిగా చెప్పాలంటే ప్రభుత్వాల పరంగా జరుగుతోంది శూన్యం.. ఇక ఉద్యోగాల గురించి చెప్పాలంటే.. మన తెలుగు రాష్ట్రాల్లో లాగా, ఇక్కడి యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ కూర్చోరు.. ఆర్థిక రాజధాని కనుక ప్రైవేట్/ కార్పొరేట్ ఉద్యోగ అవకాశాలు ఎక్కువే.. ప్రతిభావంతులైన యువకులకు ఏదో ఒక ఉద్యోగం వెంటనే దొరికిపోతుంది.. ఇందులో ప్రభుత్వాల ప్రమేయం ఏమీ లేదు.. ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువే..!

ప్ర: ముంబై నగర తెలుగు సాహిత్య లోకంలో మీ పాత్ర ఎలాంటిది?

స: ముంబై తెలుగు సాహిత్య రంగానికి వీలైనంతగా ఊతమివ్వాలన్నదే నా లక్ష్యం.. 2005 కంటే ముందు ముంబైలో తెలుగు సాహిత్యమంటే ఒకరిద్దరి పేర్లే వినిపించేవి.. కొత్తవారిని ప్రోత్సహించడం కానీ, కొత్తవారికి ఒక వేదిక కల్పించడం కానీ జరగలేదు.. కొత్తవారొస్తే ఎక్కడ తమ సొంత ప్రభ తగ్గిపోతుందోననే భయంతో ఎవరినీ ప్రోత్సహించేవారు కాదు.. అప్పటి ఆంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరెడ్డి ప్రోత్సాహంతో నేను సాహితీ రంగంలోకి ప్రవేశించాను.. అప్పుడు నాకు అనిపించింది.. ‘ముంబైలో తెలుగు సాహిత్యం అంటే ఒక్కరి పేరే ఎందుకు వినిపించాలి?’ అని..

డా.ద్వానా శాస్త్రి డా.కసిరెడ్డి వెంకట రెడ్డి గార్ల చేతుల మీదుగా సన్మానం

మల్లికార్జునరెడ్డితో కలసి ‘ముంబై తెలుగు సాహిత్య వేదిక’ ఏర్పాటు చేసి, ముంబై కవులతో 2006లో ముంబై కెరటాలు, 2007లో అరేబియా అంచుల్లో 2009లో సహ్యాద్రి సౌరభాలు పేరుతో కవితా సంకలనాలు వెలువరించాం. రెడ్డి గారు బిజీ గా ఉండడం, నేను అప్పుడప్పుడే సాహిత్యరంగంలో ప్రవేశించడం వల్ల.. పరోక్ష విమర్శలకు చోటు ఇవ్వొద్దనే అభిప్రాయంతో.. ఒక సీనియర్ రచయితను అధ్యక్షుడిగా పెట్టుకున్నాం.. అప్పుడు తెలిసింది ఆయన తెలుగు సాహిత్య వేదికను తన ప్రచారవేదికగా తప్ప కొత్త రచయితలను ప్రోత్సహించడంలో ఎలాంటి ఆసక్తి ఆయనకు లేదని..

అతడ్ని అక్కడే వదిలేసి నా ప్రస్థానాన్ని కొనసాగించాను.. ఆంధ్ర మహాసభలో చురుగ్గా ఉంటూ, కార్యవర్గ సభ్యులు సహకారంతో కవి సమ్మేళనాలు నిర్వహించడం ద్వారా.. కొత్త కవుల పుస్తకాలు తయారుచేసి ఇవ్వడం ద్వారా ఎందరో కవుల్ని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేసాను.. తెలుగు కళా సమితి సహకారంతో మహారాష్ట్రలోని 13 నగరాల్లోని శతాధిక కవుల్ని ఒక్క చోట చేర్చి సంకలనం తీసుకొచ్చాను.. కథకుల్ని ప్రోత్సహించాను.. రవీణా చవాన్ గారి అధ్యక్షతలోని ‘తెలుగు రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర (త్వమ్) కు ప్రధాన కార్యదర్శిగా ఉంటూ, రవీణా గారి నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గత రెండు దశబ్దాల్లో ముంబై నుండి వెలువడిన ముంబై వన్ పక్షపత్రికకు, మార్పు మాస పత్రికకు, దర్పణం మాస పత్రికకు, దిక్సూచి online మాసపత్రిక కు సంపాదకుడిగా ఉంటూ ఎందరెందరో ముంబై తెలుగు కవులకు వేదికనివ్వడానికి ప్రయత్నించాను..

కొత్త రచయితల పుస్తకావిష్కరణలకు సహకరిస్తున్నాను.. ప్రధానంగా తెలుగు సాహితీవేత్తలందరిని ఒకే వేదికపైకి తేవాలన్నదే నా ప్రయాస.

ప్ర: మీరు స్వయంగా గానీ, ఇతరత్రా గానీ ప్రచురించిన మీ రచనల గురించి చెప్పండి..

స: ఇప్పటి వరకు.. అన్వేషణ, వలసపత్రం, లోలోన, ఒకానొక సందిగ్ధంలో.., ఆమె కోసం, చౌరస్తాలో సముద్రం, నిర్బంధకాలం అనే కవితా సంపుటాలు, వర్లీ పేరుతో వలస నానీలు, మూడు దీర్ఘ కవితా సంపుటాలు, ముంబై మేరీ జాన్ అనే కథల సంపుటి వెలువరించాను.. అంతేకాకుండా..వారెవా పేరుతో మినీ కవితా సంపుటి, సామాన్యుడి సణుగుడు పేరుతో వ్యాస సంపుటి, శూన్యం నుండి, Amchee Mumbai పేరుతో ముంబై చరిత్రను, ముంబై ప్రముఖుల చరిత్రకు అక్షర రూపం ఇచ్చాను.. కే.వి.నరేందర్ తో కలిసి తెలంగాణా గడీలు తీసుకొచ్చాను. 40 సంవత్సరాల తెలుగు కళా సమితి చరిత్రను అక్షరబద్దం చేసాను.. మొత్తం 18 పుస్తకాలు వెలుగు చూశాయి.. త్వరలో ఒక నవల రాబోతుంది..

రవీంద్ర రచనలలో కొన్ని

ఇప్పటి వరకు 10 ముంబై కవుల సంకలనాలకు సంపాదకత్వం వహించాను. 4 పత్రికలకు ఎడిటర్ గా సేవలందించాను.. ముంబై తెలుగు వారి గురించి పలు పత్రికల్లో ఆర్టికల్స్ రాసాను.. పత్ర సమర్పణలు చేసాను.. హైద్రాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా రవీంద్ర భారతి ప్రధాన వేదికపై జరిగిన ‘రాష్ట్రేతర తెలుగువారి సమస్యలు’ పై జరిగిన సదస్సుకు అధ్యక్షత వహించాను.. అంతే గాకుండా కృష్ణా జిల్లా రచయితల సంఘం, ప్రకాశం జిల్లా రచయితల సంఘం లాంటి సంస్థలు వెలువరించిన ప్రత్యేక సంచికల్లో ఆర్టికల్స్ రాసాను.. కేంద్ర సాహిత్య అకాడమీ వారి పత్రికల్లో నా తెలుగు కవితల అనువాదాలు ప్రచురితమయ్యాయి.

ప్ర: ముంబైలో నివసిస్తున్న తెలుగు యువతీ యువకుల్ని తెలుగు భాష పట్ల ఆకర్షితులు కావడానికి మీరు చేస్తున్న కృషి ఎలాంటిది??

స: ముంబైలో తెలుగు వికాసం జరగాలని కొన్ని సంస్థలు.. నాలాంటి కొందరు రచయితలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ అనుకున్నంతగా స్పందన రావడం లేదని చెప్పడానికి సంకోచ పడడం లేదు.. అయితే ఒకప్పటికంటే ఇప్పుడు కవులు, రచయితల సంఖ్య పెరగడం శుభసూచకం.. ప్రయత్నాలైతే జరుగుతున్నాయి.. ఎంత మంది భాషపట్ల ఆకర్షితులవుతారో చూడాల్సి ఉంది..

‘నేటి నిజం’ పత్రికా సంపాదకుడు శ్రీ బైస దేవదాసు గారితో..

ప్ర: ముంబై ఆకాశవాణిలో తెలుగు కార్యక్రమాలకు చోటు వుందా??

స: ముంబై ఆకాశవాణిలో.. నాకు తెలిసి ఎలాంటి తెలుగు కార్యక్రమాలు ప్రసారం కావడం లేదు.. అలాంటి వాటికి ఆస్కారం కూడా కనిపించడం లేదు.. కారణం? ఒకరిద్దరు తెలుగు రచయితల సంకుచిత వైఖరి వల్ల రచయితల్లో ఐక్యత కొరవడింది.. అలాకాకుండా, తెలుగు రచయితల ప్రతినిధి మండలిని ఏర్పాటు చేసుకొని,ఆకాశవాణి అధికారుల్ని సంప్రదించినట్లైతే.. ముంబై ఆకాశవాణిలో తెలుగు కార్యక్రమాలకు చోటు దక్కేదెమో!!

ముంబైలో.. ఒక కార్యక్రమంలో సినీ గేయ రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ, పూర్వ తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అనుమాండ్ల భూమయ్య గార్లతొ శ్రీ రవీంద్ర.

ప్ర: మీ మొదటి అచ్చయిన రచన ఏమిటి? అది ఏ పత్రికలో ప్రచురింపబడింది? అప్పటి మీ స్పందన ఎటువంటిది?

స: నా మొదటి కవిత ఆంధ్రభూమి వార పత్రికలో ‘పల్లవి’ శీర్షికలో అచ్చయింది.. నా కవితతోనే పల్లవి శీర్షిక మొదలుకావడం విశేషం..ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఆ కవిత ఇచ్చిన కిక్కుతోనే.. 2005 లో ‘అన్వేషణ’ పేరుతో మొదటి కవితా సంపుటి వెలువరించాను.. దానికి 22 పత్రికల్లో సమీక్షలు రావడం గొప్ప అనుభూతి..

ప్ర: ముంబై సాహితీ మిత్రులతో కలిసి మీరుదిక్సూచి’ అనే మాసపత్రికను నడుపుతున్నారు కదా..! రచయిత/రచయిత్రులు స్పందన ఎలా ఉంది?

స: దిక్సూచి ఆన్లైన్ పత్రికను విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు చదువుతున్నారని వారి స్పందనలనుబట్టి అర్థం అవుతోంది.. ఇందులో మాదిరెడ్డి కొండారెడ్డి గారి పాత్ర ఎంతో ఉంది.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ రచయితల రచనల్ని కూడా అందుకోవడం సంతోషంగా ఉంది.. ఈ పత్రిక ద్వారా ముంబై రచయితల రచనల్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం..

త్రివేండ్రంలో డా.కె.శివారెడ్డి, డా.కేతు విశ్వనాథ రెడ్డి, తదితరులతో శ్రీ రవీంద్ర.

ప్ర: మీ అవార్డులు, సన్మానాలు గురించి చెప్పండి!

స: ఇంతవరకు నాకు 30 ప్రతిష్ఠాత్మక అవార్డులు లభించాయి.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా కవి కాళిదాసు అవార్డు అందుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య గారి చేతుల మీదుగా సన్మానం పొందాను.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతుల మీదుగా సన్మానం పొందిన ఏకైక తెలుగు ముంబైకర్‌ను నేనే అవడం సంతోషంగా ఉంది..

కేంద్ర సాహిత్య అకాడమీ తరఫున తమిళనాడు, కేరళలో జరిగిన సాహిత్య కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాను.. హైద్రాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా రవీంద్రభారతి ప్రధాన వేదికపై జరిగిన ‘రాష్ట్రేతర తెలుగు వారి సమస్యలు’ అనే సదస్సుకు అధ్యక్షత వహించాను.. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఒక సదస్సుల్లో తెలంగాణ గడీలు అనే అంశం పై పత్ర సమర్పణ చేసాను..

ప్ర: మీ జీవితంలో మరిచిపోలేనివి?

స: ఎన్నో వున్నాయి.. వ్యక్తిగతంగా, ఏ బట్టల మిల్లులో నేను ఆఫీస్ బాయ్‌గా చేరానో.. అదే బట్టల మిల్లులో 10 సంవత్సరాల తర్వాత మేనేజర్ స్థాయికి ఎదిగాను.. అదో అద్భుతమైన అనుభూతి నాకు.. సాహిత్యపరంగా చూస్తే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతులమీదుగా సన్మానం పొందడం.. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఒక సదస్సుకు అధ్యక్షత వహించడం.. పైగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా కవి కాళిదాసు అవార్డు పొందిన ఏకైక తెలుగు రచయితను నేనే కావడం.. కొన్ని మరచిపోలేని సంఘటనలు..

‘లోలోన’ కవితా సంపుటి ఆవిష్కరణ…త్యాగరాయ గానసభ (హైదరాబాద్)లో.

** ముంబై సాహిత్య రంగం గురించి, అందులో మీ పాత్రకు సంభందించి చక్కని వివరాలు అందించిన మీకు, నా పక్షాన, సంచిక పక్షాన మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్.

* ధన్యవాదాలు డాక్టర్ ప్రసాద్ గారూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here