సంభాషణం 26: శ్రీ సర్వసిద్ధి హనుమంత రావు అంతరంగ ఆవిష్కరణ

1
6

[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం రచయిత, కవి శ్రీ హనుమంత రావు గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]

నిశ్శబ్ద రచయిత (ఆకాశవాణి) శ్రీ హన్మంతరావు..!!

[dropcap]హం[/dropcap]గులు-ఆర్భాటాలు, అనవసర ప్రచారాల జోలికి పోకుండా, స్వంతడబ్బా కొట్టుకోకుండా, తనకున్న సాహిత్యాభిలాషను, సాహిత్య పిపాసను, తమ తమ రచనలను ద్వారా నలుగురికి పంచి తద్వారా మానసిక తృప్తిని పొందే అతి కొద్దిమంది సాహిత్యకారులలో శ్రీ సర్వసిద్ధి హనుమంతరావు గారు ఒకరు.

ఆకాశవాణి సంస్థలో పనిచేస్తూ, రచయితలుగా, కళాకారులుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నవారు అనేకమంది తెలుగు పాఠకలోకానికి తెలుసు. శ్రీ హనుమంత రావు గారు ఆకాశవాణిలో చేరకముందు నుంచే, సాహిత్యపిపాస మెండుగా ఉండడంవల్ల ఆకాశవాణిలో సహజంగా లభించే సాహిత్య సాంసృతిక వాతావరణం హనుమంత రావు గారిని ఒక మంచి రచయితగా నిలబెట్టిందని చెప్పక తప్పదు. ఆయన ఇతర సాహిత్య అంతరంగ అంశాలను ఆయన అక్షరాల్లోనే ఆస్వాదిద్దాం. మరి, పదండి ముందుకు..

~

ప్రశ్న:    హనుమంతరావు గారూ.. ‘సంచిక’ అంతర్జాల మాసపత్రిక పక్షాన మీకు స్వాగతం.

జవాబు: నమస్కారం డాక్టర్‌గారూ. ముందుగా మీకు, ఈ అవకాశం ఇచ్చిన ‘సంచిక’ సంపాదకులకు, మిగతా బాధ్యులకు నా ధన్యవాదాలు.

ప్రశ్న: ఆకాశవాణి పరిపాలనా విభాగంలో మీరు పని చేశారు కదా! ఆ ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగడ్డ విద్యార్హతలేమిటి? మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది?

జవాబు: నేను 1980 అక్టోబర్‌ చివరలో ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రంలో ఎల్‌.డి.సి.గా జాయిన్‌ అయ్యాను. స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ నిర్వహించే పరీక్ష పాస్‌ అవ్వడంవల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. నా విద్యార్హత బి.కాం. నేను 27.10.1957 తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, సిద్ధాంతం గ్రామంలో జన్మించాను. నా తల్లిదండ్రులు కీ.శే. శ్రీ ఎస్‌. రామారావు, రాజేశ్వరి. మా తాతగారి ఉద్యోగరీత్యా నా చదువు పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ గ్రామాల్లో జరిగింది. మార్టేరు, సిద్ధాంతం, దువ్వ, తాడేపల్లిగూడెంలలో స్కూలు చదువు సాగింది. ఇంటర్‌మొదటి సం॥ మాత్రం అనకాపల్లిలో చదివాను. ఇంటర్‌ రెండవ సం॥ ప్రైవేట్‌గా, డిగ్రీ తాడేపల్లిగూడెం డి.ఆర్‌.జి. ప్రభుత్వ కళాశాలలో చేశాను.

రచయిత కుటుంబం..

ప్రశ్న: రచనా వ్యాసంగం మీకు విద్యాభ్యాస సమయంలో వంటబట్టిందా? లేక ఉద్యోగంలో చేరిన తర్వాత మొదలైందా? అది ఎట్లా సాధ్యపడింది?

జవాబు: నేను 1975-78 సం॥ మధ్య బి.కాం. చదివాను. మా కాలేజ్‌ మ్యాగజైన్‌ కోసం, నేను కామర్స్‌వాడినైనా పత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగా ‘అంతరిక్షంలో ఆర్యభట్ట’ అన్న వ్యాసం రాశాను. మన దేశం 19 ఏప్రిల్‌, 1975 న ‘ఆర్యభట్ట’ పేరుతో ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఆ వార్తని చదివి ఉత్తేజితుడినై ఆ వ్యాసం రాశాను. దాన్ని కాలేజి మ్యాగజైన్‌లో అచ్చు వేశారు. అచ్చులో ఇదే నా తొలి రచన అని భావించవచ్చు.

నేను ఇంటర్‌మొదటి సం॥లో ఉండగా తీరాంధ్రను జై ఆంధ్ర ఉద్యమం తాకింది. ఆ సమయంలో కాలేజీలు మూతపడ్డాయి. ఆ సమయంలో గ్రంథాలయమే నా విద్యాలయంగా మారింది. మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా నా చదువు ఒడిదుడుకుల్లో పడింది. ఇంటర్‌ తర్వాత నా చదువు ఆగిపోయింది. ఒక సం॥ పూర్తిగా (1974-75 విద్యా సం॥) పొద్దుటా, సాయంత్రం లైబ్రరీలోనే గడిపేవాణ్ణి. అన్ని రకాల పుస్తకాలు చదివినా, సాహిత్యానికి ప్రాధాన్యం వుండేది. నేను స్వాభావికంగా సిగ్గరిని. అందువల్ల, వ్యక్తులను కలవడానికి సంకోచించేవాణ్ణి. పుస్తకాలే నా స్నేహితులు. డా. దాశరథి ‘మహర్నవం’ కావ్యం చదివి కవిత్వం రాయాలని అనుకున్నాను. ఇక చెలం నన్ను ఊపేశాడు. నా మొదటి కథ ‘పువ్వు`తుమ్మెద’ ఆయన ప్రభావంతో రాసిందే. 1975 సం॥లో డిగ్రీలో అనుకోకుండా చేరాను. డిగ్రీ తర్వాత రెండున్నర ఏళ్ల నిరుద్యోగ లేదా చిరుద్యోగ పర్వం. ఆ సమయంలో మా ఊరు తాడేపల్లిగూడెంలో వుండే చైతన్యవంతమైన వాతావరణం నాకొక దిశను చూపింది. అందుకే మా ఊరిపై 2004 ప్రాంతంలో ఓ కవిత రాశాను. అది ‘ఒక వైయక్తిక పద్యం’ పేర విశాలాంధ్రలో ప్రచురితమైంది.

స్వంత ఊరి మీద కవిత

ఆ రోజుల్లో అభ్యుదయ రచయితల సంఘం గూడెం శాఖ పక్షాన ‘కాహళి’ అనే సైక్లోస్టైల్‌ పత్రిక నడిపాం. రాష్ట్ర వ్యాప్తంగా మిత్రులకు ఆ పత్రిక వెళ్లేది. మందలపర్తి కిషోర్‌, కోరాడ నాగేశ్వరరావు, డి. సోమసుందర్‌, డి.బి. వెంకటరత్నం, నేను ఆ పత్రిక నిర్వహణలో పాలుపంచుకున్నాం.

అలాగే స్థానికంగా వున్న ప్రముఖ సాహితీ సంస్థ ‘తెలుగు సాహితీ సమాఖ్య’ (ఇంకా నడుస్తోంది) కు ఒక సం॥ సహాయ కార్యదర్శిగా వున్నాను. ఎందరో సాహితీవేత్తల్ని పిలిచి ప్రసంగాలను ఏర్పాటు చేసేవాళ్లం. ఆ రోజుల్లోనే నా కవితలు.. అప్పట్లో మినీ కవితలు వివిధ ప్రసిద్ధ పత్రికల్లో అచ్చు కావడం మొదలయ్యాయి. కథలు అచ్చు కావడానికి చాలా సం॥లు వేచి వుండాల్సి వచ్చింది. అప్పట్లో రోజులు సాహిత్యమే ప్రాణంగా నడిచేవి.

తర్వాత ఉద్యోగం వచ్చి హైదరాబాద్‌ వచ్చాను. కళలకు కాణాచి అయిన ఆకాశవాణిలో చేరాను. ఆఫీసు సాహిత్య, కళా వాతావరణం, బయట ఆబిడ్స్‌ ఆదివారం పాత పుస్తకాలు, రవీంద్ర భారతి, వై.ఎమ్‌.సి.ఏ., సారస్వత పరిషత్‌, కృష్ణదేవరాయ భాషా నిలయం సభలు నన్ను విపరీతంగా ప్రభావితం చేశాయి.

అల్లుడు,కూతురు,మనుమలతో శ్రీమతి&శ్రీ హనుమంత రావు గార్లు.

రేడియోలో ‘యువవాణి’లో గ్రూప్‌ డిస్కషన్లలో మోడరేటర్‌గా వ్యవహరించేవాణ్ణి. కొన్ని పరిచయ కార్యక్రమాలు కూడా. అయితే మొదటి నుండి నా దృష్టి పత్రికల పైనే ఎక్కువగా వుండేది. బహుశా నాలో చొరవ లేకపోవడం, సిగ్గు, మొహమాటం వల్ల ఆకాశవాణిని పెద్దగా ఉపయోగించుకోలేదనిపిస్తోంది. కాని ఆఫీసులో వున్న లైబ్రరీ నాకు బాగా ఉపయోగపడింది. రెండవ శనివారం సెలవు కాబట్టి హైదరాబాద్‌లో వున్న ప్రభ ఆఫీసుకు వెళ్లి రచనలు గేట్లో ఇచ్చేవాణ్ణి. ఆ సమయంలో ఏమాత్రం పరిచయం లేకపోయినా అప్పటి ప్రభ సారస్వత అనుబంధం ఇన్‌ఛార్జ్‌ శ్రీ జి. శ్రీరామూర్తి (నిజం) నన్ను చాలా ప్రోత్సహించారు. ఎప్పుడో తర్వాత కలిసినపుడు “బాగా రాస్తున్నారు. ఇంకా రాయండి” అని భుజం తట్టారు. ఇక ‘విశాలాంధ్ర’ సరేసరి. ఎన్నో మినీ కవితలు వేసింది.

ప్రశ్న: పత్రికల్లో మీ రచన మొదట అచ్చయిన సాహితీ ప్రక్రియ ఏమిటి? అది ఏ పత్రికలో అచ్చయింది? అప్పటి మీ అనుభూతి?

జవాబు: పత్రికలో అచ్చయిన రచన కవిత. ‘నేటి హెచ్చరిక’ అని దాని పేరు. అది 1976 సం॥ విశాలాంధ్ర సాహిత్య పేజీలో వచ్చింది. హఠాత్తుగా నా పేరు నేను రాసిన కవిత అచ్చులో చూసేసరికి చాల థ్రిల్‌ ఫీలయ్యాను. పత్రిక కొనడానికి డబ్బులు కోసం లైబ్రరీ నుండి ఇంటికి వెళ్లి, ఎక్కడెక్కడో తిరిగి పత్రిక ప్రతిని సంపాదించాను. ఆ కటింగ్‌ ఇప్పటికీ నా దగ్గరుంది. అచ్చయిన మొదటి కథ ‘పువ్వు`తుమ్మెద’. ఇది ఆనాటి ప్రముఖ మాసపత్రిక ‘జ్యోతి’ 1979 నవంబరు సంచికలో వచ్చింది.

ఒక సాహిత్య సభలో మాట్లాడుతూ రచయిత

ప్రశ్న: మీరు కథలు రాశారు. బాల సాహిత్యం రాస్తున్నారు. ఈ రెంటిలో మీకు ఇష్టమైన ప్రక్రియ ఏది? ఎందుచేత?

జవాబు: బాల సాహిత్యంలో నాది చాలా లేట్‌ ఎంట్రీ. ప్రక్రియలంటే నా వరకు కవిత, కథలే. ఈ రెండు ప్రక్రియల పైనా నాకు సమాన ప్రేమ వుంది. ఈ భావాన్ని వ్యక్తంచేస్తూ ‘కవిత`కథ’ అన్న కవితను రాశాను. దాన్ని నవ్య వారపత్రిక ప్రచురించింది.

అయితే నా కథల పుస్తకం ముందుగా ప్రచురితం కావడంవల్ల నన్ను సాహితీ మిత్రులు కథకుడిగానే గుర్తిస్తారు. కాని నా ఫస్ట్‌ లవ్‌ కవితనే! నా కవితలు అలనాటి భారతి మాసపత్రిక, ప్రభ వీక్లీ, ప్రభ ఆదివారం, ఆంధ్రజ్యోతి వీక్లీ, జ్యోతి దినపత్రిక సాహిత్య పేజి, ఆంధ్రభూమి సాహితీ, ఆంధ్రప్రదేశ్‌ మాసపత్రిక, ప్రజాశక్తి, విశాలాంధ్ర ఆదివారం అనుబంధాలు, సాహిత్య ప్రస్థానం, నవ్వ వారపత్రికలలో వచ్చాయి. అయితే సంకలనం రాకపోవడంతో “మీరు కవిత్వం రాస్తారా?” అన్న ప్రశ్నలు వస్తూనే వుంటాయి.

పుస్తకావిష్కరణ కార్యక్రమం లో,శ్రీ కె.వి.రమణాచారి,శ్రీ వేదగిరి రాంబాబు గార్లతొ రచయిత

ప్రశ్న: రాజులూ, రాజ్యాలూ, దెయ్యాలూ, మాయలు మంత్రాలకు కాలం చెల్లిపోయింది కదా! మరి ఈ వైజ్ఞానిక యుగంలో కూడా పిల్లల కథావస్తువులుగా వాటినే తీసుకుని రాయడం ఎంతవరకు సమంజసం అని భావిస్తున్నారు? విపులీకరించండి.

జవాబు: చెప్పాను కదా, బాల సాహిత్యంలో నా ప్రవేశం చాలా ఆలస్యంగా జరిగిందని.. తొంభయ్యో దశకంలో ప్రముఖ దినపత్రిక ఆంధ్రప్రభ శనివారం నాడు ‘చిన్నారి’ అనే అనుబంధాన్ని చక్కని బొమ్మలతో పిల్లల కోసం ప్రచురించేది. దీనికి మంచి ఆదరణ వుండేది. దీని ఉత్తరాల శీర్షికలో 8-9 తరగతుల పిల్లలు రచనలు నచ్చాయని ఉత్తరాలు రాసేవారు. నేను ఆ రోజుల్లో ప్రభని చదివేవాణ్ణి. ఆ రకంగా ‘చిన్నారి’ నాకు పరిచయమైంది. బాలలకి రచనలు చెయ్యాలనే ఆసక్తి కలిగింది. అలా రాయడం మొదలెట్టాను. అంతకు ముందు కవితలు, కథలు, సాహిత్య విమర్శల పైనే నా దృష్టి వుండేది. ‘చిన్నారి’లో నా కథలు, కొన్ని వ్యాసాలు వచ్చాయి. తర్వాత ‘నవ్య’ వారపత్రికలో శ్రీరమణ గారు సంపాదకులుగా వుండగా ‘పాలపిట్ట’ అనే శీర్షిక కింద ఆకర్షణీయమైన బొమ్మలతో పిల్లల కథలు వేయడం మొదలెట్టారు. అప్పుడు మళ్లీ పిల్లల కథల్ని రాయడం ప్రారంభించాను. నా పిల్లల కథలు కొన్ని ‘బాలజ్యోతి’ మాసపత్రిక, ప్రజాశక్తి ‘స్నేహం’ విశాలాంధ్ర ఆదివారంలో కూడా ప్రచురితమైనాయి.

ఇక బాల సాహిత్యంలో మంత్ర తంత్రాలు మొదలైన కాలం చెల్లిన విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న సంగతి కరక్టే. ఈ మూస ధోరణి నుండి రచయితలు బయటపడాలి. నేనైతే వీటి జోలికి పోను. ఇప్పటి బాలల్ని, వారి ‘ఎక్స్‌పోజర్‌’ని దృష్టిలో వుంచుకుని రచనలు చేస్తాను. కాకపోతే కాస్త ఫాంటసీని అద్దుతాను.

మక్కెన రామసుబ్బయ్య అవార్డు స్వీకరిస్తూ

ప్రశ్న: మీరు ఆకాశవాణి హైదరాబాద్‌, విశాఖపట్నం కేంద్రాల్లో పని చేశారు కదా, మీ రచనా వ్యాసంగానికి అవి ఎంతవరకు ఉపయోగడ్డాయి?

జవాబు: 1989 సం॥లో పదోన్నతిపై విశాఖ కేంద్రానికి బదిలీ అయ్యింది. ఇది నా సాహితీ జీవితంలో కీలక మలుపుగా నేను అనుకుంటాను. అంతకు ముందు రాయడం పూర్తిగా తగ్గిపోయి ఒకరకంగా సాహితీ రంగానికి దూరం అయ్యే స్థితికీ వచ్చాను. అయితే విశాఖ సాహితీ వాతావారణం, ఆఫీసు మిత్రుల ప్రోత్సాహం నేను మళ్లీ రచనా రంగంలో పుంజుకోవడానికి దోహదం చేశాయి. విశాఖలోనే నేను ఎక్కువగా కథలు రాశాను. అవి ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం అనుబంధం, ఆంధ్రప్రభ వారపత్రిక, ఆంధ్రజ్యోతి వీక్లీ, ఆంధ్రజ్యోతి ఆదివారం, ఆంధ్రప్రదేశ్‌ మాసపత్రిక, యోజన మాసపత్రిక, స్వాతి వీక్లీ, నవ్వ వారపత్రికలో అచ్చయ్యాయి. మొత్తంమీద విశాఖలో నేను సాహిత్యపరంగా ఎక్కువగా రాణించానని చెప్పొచ్చు. అందుకే విశాఖ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ‘విశాఖ.. విశాఖ’ అన్న కవిత రాశాను.

విశాఖ రచయితల సంఘం పుస్తకావిష్కరణ సభ

ప్రశ్న: మీరు చేసిన రచనలు, ముద్రణకు నోచుకున్న గ్రంథాల గురించి వివరిస్తారా?

జవాబు: నా కథలను ‘సొల్లు ఫోను’ పేర సంకలనం చేసి శ్రీ వేదగిరి పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌వారు ప్రచురించారు. ఈ పుస్తకం 2017 అక్టోబర్‌నా ఉద్యోగ విరమణ సందర్భంలో వచ్చింది. దీన్ని ప్రచురణలో ప్రధాన భూమిక నా కుమారుడు ఎస్‌. భాను తేజ, నా తమ్ముడు ఎస్‌. గుర్నాధ్‌లదే. ‘సొల్లు ఫోను’ పుస్తక ఆవిష్కరణ కీ.శే. శ్రీ వేదగిరి రాంబాబు ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభ వేదికపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు గౌరవ శ్రీ కె.వి. రమణాచారి, ఐఎఎస్‌.(ఆర్‌) చేతుల మీదుగా జరిగింది. ఈ సభలో ఎందరో ప్రముఖ రచయితలు పాల్గొన్నారు. అలాగే మా ఆఫీసులో నా పదవీ విరమణ సభలో మా సహోద్యోగుల సమక్షంలో ఆవిష్కరించారు. శ్రీ పి.వి. రాంగోపాల్‌, కార్యక్రమ నిర్వాహణాధికారి చక్కటి సమీక్ష చేశారు. విశాఖలో విశాలాంధ్ర, పుస్తక ప్రదర్శన వేదికపై కూడ పరిచయ సభ జరిగింది. అలాగే మరో పరిచయ సభ మా ఊరు తాడేపల్లిగూడెంలో, నేను చదువుకున్న కళాశాలలో నేను గతంలో పని చేసిన ‘తెలుగు సాహితీ సమాఖ్య’ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభలో కథా సదస్సు కూడా జరిగింది. కథలు రాయడంలో నా అనుభవాలను విద్యార్ధులతో పంచుకున్నాను.

నా పిల్లల కథలు ‘స్నేహ ధర్మం’ పేరిట పుస్తకంగా వచ్చింది. ప్రగతిశీల సాహిత్య ప్రచురణలో అగ్రగామి సంస్థ అయిన విశాలాంధ్ర ప్రచురణాలయం వారు దీన్ని ప్రచురించారు. తర్వాత రాసిన పిల్లల కథలతో మరో పుస్తకం త్వరలోనే విశాలాంధ్ర ప్రచురిస్తుంది. ఇంకా నా కవితలు, వ్యాసాలు పుస్తకాలుగా రావల్సి వుంది. ఆ ప్రయత్నంలోనే వున్నాను.

ప్రశ్న: ఇంకా మీ సాహిత్య కృషి గురించి వివరించండి?

జవాబు: నేను కథలు, కవితలతో పాటు సాహిత్య వ్యాసాలు, సాహిత్యేతర వ్యాసాలు కూడా చాలా రాశాను. ఎనభయ్యో దశకం నుండి ఈ కృషి కొనసాగుతోంది. ఇవి ప్రభ, జ్యోతి, భూమి సారస్వత పేజీలు, ప్రభ వీక్లీ, సాహిత్య ప్రస్థానం, మిసిమి లాంటి ప్రసిద్ధ పత్రికల్లో వచ్చాయి. సమీక్షలు విశాలాంధ్ర, విశాఖ సంస్కృతి పత్రికల్లో అచ్చయ్యాయి. మొదటి నుండి నాకు సాహిత్య విమర్శపై కూడా ప్రత్యేక దృష్టి వుంది.

ఆంధ్ర విశ్వవిద్యాలం తెలుగు శాఖలో ‘ఉత్తరాంధ్ర బాల సాహిత్యం’ అన్న అంశం మీద జరుగుతున్న పి.హెచ్‌డి. పరిశోధనలో నా బాలల కథల్ని పరిగణనలోకి తీసుకున్నారు. గతంలో తెలుసు అకాడమీ ప్రచురించిన ‘కథాకోశం’ పుస్తకంలో నా వివరాలు వున్నాయి. అలాగే ‘కథా నిలయం’లో నా కథల వివరాలు, పుస్తకాలు వున్నాయి. నాకు హాస్యం అంటే ఇష్టం. నా కథల్లో కొన్ని హాస్య కథలు. తొంభయ్యో దశకంలో ఆంధ్రజ్యోతి వారపత్రిక నా జోక్స్‌ని ఇ.వి.ఆర్‌. కార్టూన్స్‌లో ప్రచురించేది. ఒకే అంశాన్ని తీసుకుని జోక్స్‌రాసేవాణ్ణి. ఈ అంశాల ఎంపికలో రొటీన్‌కి దూరంగా వుండేవాణ్ణి.

సమీక్షకునిగా సన్మానం

‘విశాఖ సంస్కృతి’ మాసపత్రిక నిర్వహించిన కథల పోటీకి, అలాగే బాలల కథల పోటీకి.. న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. ఈ పత్రికలో కొన్నాళ్లు ‘పాప్‌కార్న్‌కార్నర్‌’ అన్న శీర్షిక నిర్వహించాను. సాహిత్యంలో ఆసక్తికర ‘ఎనెక్‌డోట్స్‌’ గురించి రాసేవాణ్ణి. 2004 సం॥లో వచ్చిన ఉత్తమ కవితలను ‘కవిత 2004’ పేర సంకలనం విశాఖ నుండి తెచ్చాం. దీనికి సంపాదక బాధ్యతను వహించాను.

ప్రశ్న: రచయిత కథల రచనలు ముద్రణ దశకు వచ్చే సమయానికి ముద్రించాలా వద్దా? అన్న అయోమయ స్థితిలో పడిపోతున్నారు సాహిత్యకారులు. కారణాలు.. ఆర్థిక భారం, అమ్ముకోలేని దుర్భర పరిస్థితి, ఏమి చేస్తే ఈ సమస్యను అధిగమించవచ్చునో మీ అనుభవాల్ని ఉటంకిస్తూ వివరించండి?

జవాబు: ‘రచయితే తన రచనలను ముద్రించుకోవడం అంత దౌర్భాగ్య స్థితి మరోటి లేదు’ అంటారు శ్రీపాద. సరిగా తెలుగు సాహిత్య రంగంలో ఇదే పరిస్థితి వుంది. రచయితలు తన స్వంత డబ్బు ఖర్చుచేసి పుస్తకాలు వేసుకోవడం, అవి అమ్ముడు కాక ఇళ్లల్లో దుమ్ముకొట్టుకొని పడి వుండటం చూస్తూనే వున్నాం. నా అనుభవం కూడా భిన్నమైందేమీ కాదు. రచనలకు పారితోషికం, పుస్తకాలకు రాయల్టీలు, అమ్మకాల మీది ఆదాయం ఇప్పట్లో తెలుగు రచయితలకు గగన కుసుమాలే! పుస్తకాల్ని కొని చదవడం మన తెలుగువారిలో చాలా తక్కువ. ప్రభుత్వాలూ పుస్తకాల్ని కొనడం తక్కువే. గ్రంథాలయాలలో కొత్త పుస్తకాలు కనబడటం లేదు. కేరళలో వున్నట్టు రచయితల సహకార సంఘాల ద్వారా పుస్తక ప్రచురణ జరిగి ప్రతి సభ్యుడూ పుస్తకాలు కొని చదివితే కొంతవరకు పరిస్థితి మారొచ్చు. ఈ మధ్య కొన్ని కొత్త ప్రచురణ సంస్థలు పుస్తకాల్ని అందంగా ముద్రించి తమ పుస్తకాల్ని మార్కెట్‌ చేయగలగడం చూస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితులు మారాలని అందరం కోరుకోవడం, ఆ దశలో పాటుపడటం చేయాలి.

ఎ. జగన్నాథ శర్మగారి చేతుల మీదుగా సత్కారం

నా కథల పుస్తకం ‘సొల్లు ఫోను’ను ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వ పుస్తక కొనుగోలు ప్రకటన సందర్భంగా మూడు జిల్లాల గ్రంథాలయ సంస్థలు కొన్నాయి. నూట నలభై వరకు కాపీలు చెల్లుబాటు అయ్యాయి. నేను 50% రాయితీ ఇచ్చాను. మిగతా కాపీలు మిత్రులకు పంచాను. కొన్ని మిగిలాయి. ఇదీ నా అనుభవం. ఇది నా మిత్రుల అనుభవం కూడా.

ప్రశ్న: విశాఖ తెలుగు సాహితీ రంగంలో మీ పాత్ర ఎటువంటిది? నేటి లేత లేత రచయితలకు మీ ప్రోత్సాహం ఎటువంటిది?

జవాబు: విశాఖ శాఖ అరసానికి ఉపాధ్యక్షుణ్ణి, అలాగే నగరంలో సాహితీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వుంటాను. విశాఖ రచయితల సంఘం అధ్యక్షుడు అడపా రామక్రిష్ణ తదితర మిత్రులతో ఆత్మీయ అనుబంధం వుంది. వారి కార్యక్రమాల్లో పుస్తక సమీక్షలు, ప్రసంగాలు చేస్తూంటాను. సభలకు వెళ్లి ప్రసంగాలను శ్రద్ధగా వినడం నాకు తొలి నుండి అలవాటు. ఈ అనుభవంతోనే ‘సాహిత్య ఆతిథ్యం’ అన్న వ్యాసం రాశాను. దీన్ని ‘సాహిత్య ప్రస్థానం’ మంత్లీ ప్రచురించింది.

ఇక వర్ధమాన రచయితలకు నేనిచ్చే సందేశం సాహిత్యం బాగా చదవాలనే. క్లాసిక్స్‌ చదవడంవల్ల శిల్పం, శైలి, వస్తువుల విషయంలో మెరుగుపడే అవకాశం వుంది. అలా అని వర్తమాన రచనలను నిర్లక్ష్యం చేయడం కుదరదు. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాలి. టెక్నాలజీని కూడా వంట బట్టించుకోవాలి. రచన అనేది సామాజిక బాధ్యత అని గుర్తెరగాలి.

ఆకాశవాణి.. విశాఖపట్నం కేంద్రంలో కథ చదువుతూ రచయిత

ప్రశ్న: మన తెలుగు భాషా సాహిత్యం ఇతర భాషల్లోకి ఎక్కువగా అనువాదం కాకపోవడానికి వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయా? మన విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖలు ఉండి కూడా, ఈ విషయంలో ఆశించిన ఫలితాలు లభించకపోవడానికి కారణం ఏమిటి?

జవాబు: ఏ భాషకైనా ఆదాన ప్రదానాలు అవసరమే. అది ఆ భాష వృద్ధి చెందడానికే కాకుండా ఆ భాషా ప్రాంతీయుల సాంస్కృతిక జీవిత అభివృద్ధికి కూడా ఉపయోగపడేది. అనువాదాలు తక్కువగా ఉండటానికి కారణం మన విద్యా వ్యవస్థలో వుందని నా అభిప్రాయం. భాషల అధ్యయనానికి విద్యా వ్యవస్థలో తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అనువాదాలు చేయాలంటే ఉభయ భాషల్లోను సమాన అధికారం వుండాలి. అనువాద రంగంలో వ్యవస్థల కంటె ఉత్సాహవంతులైన కొంత మంది వ్యక్తుల కృషే ఎన్నదగినదిగా వుంది.

గురజాడ గృహంలో(విజయనగరం)డా.మధుసూదన్ తదితర మిత్రులతో.. రచయిత

ప్రశ్న: మీ సన్మానాలు, అవార్డులు, బిరుదుల గురించి వివరించండి?

జవాబు: నా కథల సంపుటి ‘సొల్లు ఫోను’కు మక్కెన రామసుబ్బయ్య స్మారక అవార్డు 2018 సం॥లో లభించింది. త్యాగరాయ గానసభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి పూర్వ ఛైర్మన్‌ చక్రపాణి గారి చేతుల మీదుగా ఆ అవార్డు అందుకున్నాను. నా పిల్లల కథల సంపుటి ‘స్నేహ ధర్మం’కు నారంశెట్టి బాల సాహిత్య పీఠం పోటీలో ప్రశంసాపత్రం లభించింది.

** చాలా చక్కని సమాచారం అందించారు హన్మంతరావు గారు, సంచిక పక్షాన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు సర్.

**ధన్యవాదాలు ప్రసాద్ గారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here