33. సంభాషణం – శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి అంతరంగ ఆవిష్కరణ

51
11

[సంచిక కోసం ప్రముఖ కవయిత్రి, కథా, నవలా రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]

కోనసీమ సాహితీ ఆణిముత్యం శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి

[dropcap]కో[/dropcap]నసీమ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది అక్కడి పచ్చని పంటపొలాలు, కొబ్బరి తోటలు, గోదావరీ, బంగాళాఖాతం. వీటికి తోడు ఎందరో విద్యావేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్.లు వగైరా. అలాగే, రచయిత్రులు, రచయితలు, కవులు, కవయిత్రులు, చిత్రకారులూ, సినీ ప్రముఖులూను.

ఇందులో, మా ప్రాంతానికి (రాజోలు, మల్కీపురం, సఖినేటిపల్లి, అంతర్వేది పాలెం) చెందిన రచయితలు, కవులు, చిత్రకారులు నాకు తెలిసిన వారు కొందరు ఉన్నారు. వారిలో డా. అల్లూరి రాజ కుమారి (రచయిత్రి), శ్రీ కె.కె. మీనన్ (కథ/నవల), శ్రీ బత్తుల బాపుజీ (చిత్రలేఖనం), డా. కె. ఎల్. వి. ప్రసాద్ (కథ, కవిత, వ్యాసం). ఇలా ఇంకా నా దృష్టికి రానివారు చాలమంది వుండి వుంటారు. అలాంటివారిలో ఈ మధ్యనే పరిచయం అయినవారు శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు. వీరు ఒక ఉన్నతోద్యోగినిగా వుంటూనే, తెలుగుసాహితీ రంగానికి ఎనలేని సేవ చేస్తున్నారు.

అతి ప్రచారానికి ఇష్టపడని ఈ రచయిత్రి, అనేక నవలలు, కథలు రాశారు. రేడియో/దూరదర్శన్ మాధ్యమాల ద్వారా, లక్ష్మీగౌరి గారు, తెలుగు ప్రేక్షకులకు, శ్రోతలకు చిరపరిచితులే! సాహిత్య, సాంస్కృతిక వాతావరణంలో పుట్టి, పెరిగిన ఈ కోనసీమ/హైదరాబాద్ రచయిత్రి, తన సాహీతీ ప్రస్థాన విశేషాలు ఇంకా ఏమి చెబుతారో చూద్దాం.

~

డా. కె. ఎల్. ప్రసాద్: నమస్కారం అల్లూరి గౌరీలక్ష్మి గారూ.

అల్లూరి గౌరీలక్ష్మి: నమస్తే డాక్టర్ ప్రసాద్ గారూ! సంచిక మ్యాగజైన్ ద్వారా ఇలా మాట్లాడుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.

ప్రశ్న 1: మీ సాహిత్య రచనా వ్యాసంగం ఎప్పుడు, ఎలా మొదలయింది?

జ: నా రచనా వ్యాసంగం అనుకోకుండా మొదలైంది. 1983లో ఒక ప్రముఖ కార్టూనిస్టు ఆడవారి బలహీనత మీద వ్యంగ్యంగా ‘ఆడది’ అని ఒక కథ రాశారు. ఆ కథ చదివి, నేను చాలా ఆవేశపడి, (అప్పుడప్పుడే డిగ్రీ చేసిన కుర్రతనం కొద్దీ) దానికి రిపార్టీగా, అప్పటికప్పుడు మగవారికి కూడా అహం అనే బలహీనత ఉంటుంది అంటూ ఒక కథ రాసి దానికి ‘మగాడు’ అని పేరు పెట్టి, విజయ బాపినీడు గారి ‘విజయ మాసపత్రిక’కి పంపించాను. వారి నుండి నాకు ఎటువంటి జవాబు రాలేదు. కథ కూడా తిరిగి రాలేదు. చెత్తబుట్టలో పడేసి ఉంటారని తీర్మానించుకుని ఎవరికీ చెప్పకుండా ఊరుకున్నాను. ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా (నేనీ కథ ఎందుకు రాసానో అందరికీ తెలిసిపోయి నవ్వుకుని ఉంటారని) సిగ్గుగా ఉండేది. ఆరునెలల తర్వాత ఆ నెల విజయ మాసపత్రిక నా అడ్రస్‌కి వచ్చింది. ఆశ్చర్యంగా తెరిచి చదువుతూ ఉండగా మధ్యలో ఎక్కడో నా కథ ప్రచురించబడి ఉంది. నేను షాక్ తిన్నాను. ఎవరికైనా చూపించాలని కూడా తోచనంత షాక్ అది. కలో, నిజమో తెలీలేదు. కథకి పారితోషికం 75 రూపాయలు కూడా మరో నాలుగు రోజులకి వచ్చింది. ఆ షాక్ నుంచి నేను ఆనందంతో కోమాలోకి వెళ్ళిపోయాను. ఆ వెళ్లిపోవడం, వెళ్లిపోవడం పదేళ్ల వరకూ బైటికి రాలేదు. ఆ తర్వాత 1993 నుంచీ అంటే మూడు దశాబ్దాలుగా ఆపకుండా సాహితీ కృషి చేస్తూ ఉన్నాను.

శ్రీ గోపాల్ రాజు,గౌరిలక్ష్మి.అల్లూరి దంపతులు

నేను ఐదో క్లాస్ చదివే వయసు నుంచీ ఇంటికి వచ్చే మ్యాగజైన్లూ, పెద్దవాళ్ళు వారం వారం వచ్చే సీరియల్స్ కలిపికుట్టి దాచుకునే నవలలూ చదివేదాన్ని. అదే అలవాటుతో కాలేజీ డిగ్రీ అయ్యే వరకు చదువుతూనే ఉన్నాను. మా ఇంటి పక్క ఉండే లైబ్రరీలో పుస్తకాలన్నీనమిలేశాను. మా లైబ్రేరియన్, “ఏది చూపించినా చదివేశానంటావు. నువ్వు రాకు తల్లీ! కొత్త పుస్తకాలు వస్తే నేనే కబురు చేస్తాను” అంటూ విసుక్కునేవాడు.

హైదరాబాదులో 1990-91 ప్రాంతంలో, వేదగిరి రాంబాబు గారు నెలకొకసారి సాహిత్య కార్యక్రమాలు జరిపేవారు. సాహిత్యం మీద అభిరుచి ఉన్నకొందరు మిత్రులం వాటికి హాజరవుతూ ఉండేవాళ్ళం. ప్రముఖ రచయితలందరినీ అలా సభల్లోచూస్తూ, వారి మాటలు వింటూ మేమెంతో సంతోషపడేవాళ్ళం. తిరిగి వెళుతూ వాళ్ళు రాసిన రచనలన్నీ గుర్తుచేసుకునేవాళ్ళం. సరిగ్గా ఆ సమయంలోనే, శ్రీ వై. రాంబాబు అండ్ సాయి (ప్రముఖ రచయితలు) కలిసి ‘రజని’ అని ఒక పోస్టల్ డిప్లమా లాంటిది మొదలుపెట్టారు. నేనందులో జాయిన్ అయ్యాను. ప్రతినెలా ఒక ప్రశ్నావళి పంపించేవారు. వాటికి నేను జవాబులు రాసి పోస్ట్‌లో పంపేదాన్ని. వాళ్ళది దిద్ది తిరిగి వెనక్కి పంపేవారు. ఆ నెలలో వివిధ పత్రికలలో వచ్చిన మంచి కథ ఒకటి తీసుకుని అది ఎందుకు మీ దృష్టిలో మంచి కథ అయిందీ, అలాగే మీరు చదివిన బాలేని కథ ఏమిటి? ఎందుకు బాలేదు రాయమనేవారు. ఇంకా వోల్గా గారి ‘స్వేచ్ఛ’ లాంటి నవలల గురించి సమ్మరీ రాసి పంపమనేవారు. అలా ఒక పది నెలలు చేయడం జరిగింది. ఆ తర్వాత యండమూరి వీరేంద్రనాథ్ గారు కూడా వర్క్‌షాప్‌లు కండక్ట్ చేసేవారు. మేము వాటికి కూడా వెళుతూ ఉండేవాళ్ళం. వారు కూడా మమ్మల్ని ఒక సబ్జెక్టు ఇచ్చి కథ రాయమనేవారు. మేమంతా రాసిన కథలు ఓపికగా చూసి తప్పులుంటే నవ్వుతూ చెప్పేవారు. అవి అందరం వినేవాళ్ళం. ఈ ప్రాక్టీస్ అంతా అవుతూ ఉండగానే 1993 నుంచి సీరియస్‌గా రాయడం మొదలు పెట్టాను.

రచయిత్రి కుటుంబం

ప్రశ్న 2: ఈ విషయంలో మీకు ప్రేరణ ఎవరు?

జ: నా చిన్నతనం నుంచీ నేను చదివిన రచనలు చేసిన రచయితలు, ఇంకా నేను చూసిన సినిమాల కథలు రాసిన రచయితలు నాకు ప్రేరణ. ఇంకా నా చుట్టూ ఉన్న మనుషుల యొక్క ప్రవర్తన కూడా. పుస్తకాలు చదవడం అలవాటైన నాకు మనుషుల్ని కూడా చదవగలగడం (కనీసం నేనలా అనుకోవడం) కూడా ఒక రీజన్. వెరసి తోటి మనుషులతో నా భావాల్ని సాహిత్య రూపంలో పంచుకునే సాహసం చేశాను.

ప్రశ్న 3: మీరు కోనసీమలో పుట్టి పెరిగారు. మీ రచనా వ్యాసంగానికి ఆ ప్రాంతం మీకు ఏ విధంగా ఉపయోగపడింది?

జ: మా కోనసీమలో ఇళ్లు, కొబ్బరితోటల మధ్య ఉండేవి. ఒక పక్క మామిడి తోట, మరో పక్కకాలవ. దాన్ని దాటితే పచ్చని చేలు ఉండేవి. ఊరిలో ఉండే అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. తాతలు అన్నదమ్ములన్నమాట. అందువల్ల ఊరంతా ఒక్కటే ఫ్యామిలీలా, అన్నదమ్ములుగా ఒకే ఇంటి పేరుతో ఉండేవారు. దూరంగా అంతర్వేది సముద్రుడు, కాస్త దగ్గరగా గోదావరి పాయలు. పెరటి వైపు పంట కాలువలు. అలా ఎటు చూసినా పచ్చని ప్రకృతితో అలరారేది మా కోనసీమ. పుట్టి పెరిగిన ఆ ప్రాంతపు వాతావరణం ప్రభావం మా వ్యక్తిత్వాల మీద, మా రచనల మీద తప్పకుండా ఉంటుంది. చీకూ చింతా లేని ఆ బాల్యం, ఆ రిచ్ క్లైమేట్ మమ్మల్ని ఆశావహులుగా తీర్చిదిద్దింది. అందరితో స్నేహంగా, ప్రేమగా మెలగడం, అందరిలోనూ మంచి చూడడం అలవడింది. ఆనాటి ఊరు, స్కూలు, కాలేజీ మాకు ఎప్పటికీ మధుర జ్ఞాపకాలే. అవి మది గదిలో శాశ్వతంగా నిలబడిన మనశ్చిత్రాలు. చుట్టుపక్కల ఉన్న బంధువుల కుటుంబాలతో కజిన్స్‌తో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ, కాలేజీ పుస్తకాలూ, సాహిత్య పుస్తకాలూ చదువుకుంటూ వారానికి రెండు సినిమాలు చూస్తూ ఒక ఆనందకర, ప్రశాంతమైన పరిస్థితిలో మనసుకు హాయిగా ఉండేది. ఇప్పటికీ ఆ ప్రాంతం మలిచిన మనిషిగా, రచయితగా నేను పూర్తి పాజిటివ్ మనిషిగా నిలబడగలిగానంటే దానికి మా కోనసీమ గాలీ, నీరూ, నేలాలోనే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండడం ముఖ్య కారణం. అందువల్లే జీవితాన్ని ఏ వేళా భారంగా మార్చుకోకుండా సరదాగా, కాస్త హాస్యాన్ని నిత్య జీవితంలో మిళాయించుకుంటూ హ్యాపీ గో లక్కీ పర్సన్‌గా ఉండగలుగుతున్నాను.

గౌరీలక్ష్మి.అల్లూరి గారి రచనలు

అలా అని లోకంలో ఉన్న అన్యాయాల్నీ, దుర్మార్గాలని చూడలేదని కాదు. వ్యక్తిగత జీవితంలోనూ, ముప్ఫయి మూడేళ్ళ ఉద్యోగ ప్రస్థానంలోనూ వాటిని చూసినా, బెదిరిపోకుండా నిబ్బరంగా నిలబడి జీవితంలో ముందుకి సాగుతుంటాను. ఈ జీవన గమనంలో చివరికి మిగిలేవి తోటి మానవులతో స్నేహమూ, అభిమానమూ మాత్రమే అని నమ్మగలగడం, తదనుగుణంగా నడవగలగడం కూడా మా ప్రాంతం మాకిచ్చిన దీవెన అనుకుంటాను.

ప్రశ్న 4: మీకు తెలుగు సాహిత్య సీమలో బాగా నచ్చిన కవి, రచయిత ఎవరు? ఎందుచేత?

జ: ప్రతి రచనా అంటే కథ, కవిత, నవల, వ్యాసం, ఓ పాట మొదలైనవన్నీ మనకి పాఠాలే! ఆ రచయితలు మన గురువులు. అందరి నుండీ సారాన్ని గ్రహించడం వల్లనే ప్రస్తుతం నేను రచయితగా నిలబడ్డాను. ప్రతి పాఠమూ, దాని వెనుక గురువూ నాకు గౌరవనీయులు. ఎవరో ఒక రచయిత పై అభిమానం చూపించడం అంటే మిగిలిన పాఠాలనూ, గురువులనూ తక్కువ చేయడమే. అందువల్ల నేను ఎవరో ఒకరి పేరు చెప్పలేను.

ప్రశ్న 5: మీరు నవలలు, కథలూ, కవిత్వమూ రాశారు. ఈ ప్రక్రియలలో మీకు ఇష్టమైన ప్రక్రియ ఏది? ఎందుచేత?

జ: మూడు ప్రక్రియలలో నాకు కవిత్వం ఇష్టం. ఒక్కోసారి కవిత ఒక తారాజువ్వలా నింగికెగిరి మెరుపులు కురిపిస్తుంది. మనసులో ఒక కవితాభావం కలిగినప్పుడు అది ధారలా కాగితంపై ప్రసరించి ఒక చిన్న కొసమెరుపుతో ఆగుతుంది. నేను రాసిన ‘మీడియా చింతన’ అనే కవితలో, ‘ఫ్రీ ప్రెస్‌ని కడకంటా సమాధి చేసి, ఆ గోరీపై జెండా ఎగరేసింది కాస్ట్‌లీ ప్రెస్. సహప్రెస్ మిత్రుల మీటింగ్‍లో లాభ నష్టాలు కలబోసుకుని ఆఖర్న పాత్రికేయ పెద్దల చేత సరదాగా ఆశీర్వచనం తీసుకుంది’ అని రాసినప్పుడు మనసులోని ఒక భారం దిగి తృప్తిగా ఉంటుంది. పాఠకుడిని మనం అనుకున్నభావం సూటిగా చేరుతుంది. నేను చిన్న చిన్న రాజకీయ వ్యంగ్య వ్యాసాలు రాసినప్పుడు కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సినేరియో చూసినపుడు మనసుకు కలిగిన బాధకి నాకు నేను చేసుకునే ఊరడింపు అది.

గౌరీలక్ష్మి.అల్లూరి గారి రచనలు

అయితే పాఠకుల మనసులో కథ వేసే ముద్ర ఇంకొంచెం పెద్దది, శ్రమ కూడా పెద్దదే. అలాగే నవల మరింత పెద్దది. శ్రమ కూడా అంతే పెద్దది. జీవిత సత్యాలు చెబుతూ ఎవరో రాసిన కవిత మన మనసుని హత్తుకుని చాలా రోజులు వెంటాడుతుంది అందుకే కవిత అంటే నాకు చాలా ఇష్టం. తక్కువ శ్రమతో ఎక్కువ ఆనందాన్ని రచయితకీ పాఠకులకీ పంచేది కవిత. అల్పాక్షరాలలోనే అత్యధిక అర్థం మోసుకొచ్చేది కవిత.

ప్రశ్న 6: నవలకు గానీ, కథకు గానీ, కవితకు గానీ మీరు సాధారణంగా ఎన్నుకునే వస్తువు ఏమిటి? ఎందుచేత?

జ: మూడు ప్రక్రియలలోనూ నేను తీసుకునే వస్తువుల ద్వారా ఒక చర్చను పాఠకుల ముందు పెట్టి ఏదో చెప్పాలన్న ఉద్దేశంతోనే రాస్తాను. కొన్ని మనసును తేలికపరిచే వస్తువులు కూడా తీసుకుంటాను. హాస్యాన్నికూడా కొన్ని కథల్లో వస్తువుగా తీసుకున్నాను. హాస్య కవితలు కూడా రాశాను. జీవితాన్ని భారం చేసుకోకుండా, తేట పరుచుకోవాలనేది నా మనస్తత్వం. నేను వేరు. నా సాహిత్యం వేరు కాదు కాబట్టి అవి కూడా నన్ను ప్రతిబింబిస్తాయి.

ప్రశ్న 7: మీరు నవలను సీరియల్‍గా రాయడానికి ఇష్టపడతారా? ఎందుచేత?

జ: డైరెక్ట్ నవల నేను ఎప్పుడూ రాయలేదు. అసలు కథ అయినా, కవితైనా ఏదో ఒక మ్యాగజైన్‌లో ప్రచురితమైనప్పుడే దానికి విలువ ఉంటుంది అని మేము అనుకుంటాము. చాలా పాపులర్ అయిన రచయితలు కొందరు డైరెక్ట్ నవలలు రాసేవారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు రాసేవారు కాదు. ఇప్పుడు కొందరు ఎక్కడా ప్రచురితం కాని కథలు లేదా నవలలు డైరెక్ట్‌గా పబ్లిష్ చేయించుకుంటున్నారు. వాటిని సహజంగానే చదవడానికి పాఠకులు సందేహించే అవకాశం ఉంది. నేను పుస్తక రూపంలో తీసుకువచ్చే కవిత్వ సంపుటిలోని కవితలన్నీ ఏదో ఒక మ్యాగజైన్‌లో ప్రచురితమైనవే తప్ప డైరెక్టుగా ఒక్క కవిత కూడా వేసుకోలేదు. అలాగే కాలమ్స్, కథలు, నవలలు కూడా ప్రముఖ పత్రికలలో ప్రచురితమైనవే.

సినారె సన్మానం

ప్రశ్న 8: మీ అనుభవంలో పాఠకులు, డైరెక్ట్ నవలలు ఇష్టపడతారా? సీరియల్‍లా ఇష్టపడతారా? ఎందుచేత?

జ: ఈ బిజీ రోజుల్లో ఏకధాటిగా నవల చదివే తీరిక ఎవరికీ లేదు. గృహిణుల్లో చాలామంది శ్రమ లేకుండా సుఖంగా కూర్చుని చూసే టీవీ సీరియల్స్ వైపు వెళ్లిపోయారు. వారికిప్పుడు పుస్తకం పట్టుకుని చదివే, ఓర్పూ, శక్తీ రెండూ లేవు. అప్పటికీ, ఇప్పటికీ అక్షరాన్ని ప్రేమిస్తూ మమ్మల్ని ప్రోత్సహించే పాఠకులు కొద్ది మంది ఉన్నారు. అటువంటి వారి సమయాన్ని కొంచెం మాత్రమే వాడుకుంటూ వారం వారం సీరియల్స్ అందించి మర్యాద నిలుపుకోవడం మంచిది కదా రచయితలకి.

ప్రశ్న 9: కథల్లో, నవలల్లో మాండలిక పదాల వాడకంపై మీ అభిప్రాయం ఏమిటి? మీ రచనల్లో ఎప్పుడైనా మాండలిక భాష మీరు వాడారా? వివరించండి.

జ: శుద్ధ మాండలిక పదాల వాడకం, కొంత శాతం పాఠకులకు ఇబ్బందినీ, విసుగునూ కలిగిస్తుంది. దానితో వారు చదవడం మానేసే ప్రమాదం ఉంటుంది. సాహిత్యాన్ని చదివేవారు తగ్గిపోతున్న ఈ తరుణంలో ఆ రిస్క్ తీసుకోవడం రచయితగా నాకు ఇష్టం లేదు. నేను కొన్ని చిన్న, చిన్న పాత్రలకి సులువుగా అందరికీ అర్థం అయ్యే మాండలిక పదాలు వాడాను తప్ప పూర్తిగా ఆ పదాలతో కథ గానీ కవిత గానీ రాయలేదు. వ్యక్తిగతంగా నేను అన్ని మాండలికాలనూ ఇష్టంగా చదువుతాను.

లేఖిని సంస్ట పురస్కారం

ప్రశ్న 10: అంతర్జాల పత్రికలపై మీ అభిప్రాయం చెప్పండి.

ఆన్‍లైన్ మ్యాగజైన్లు నేటి కాలపు అవకాశం, ఇంకా అదృష్టం అని కూడా అనుకోవచ్చు. చదివేవారికి ఉచితం కూడా! కంప్యూటర్, ట్యాబ్ కనీసం స్మార్ట్ ఫోన్ ఉన్నా చాలు హాయిగా చదువుకోవచ్చు, చేతిలో పుస్తకం ఉన్న సౌఖ్యం అందం, ఉండకపోవచ్చు. కానీ చదివిన తర్వాత, ఆ పుస్తకాలన్నీ పడేయడానికి మనసొప్పకా, వాటిని దాచుకోలేకా పడే అవస్థ తప్పింది. ఓపికున్నన్ని మ్యాగజైన్స్ చదువుకోవచ్చు.

ప్రశ్న 11: మీరు నవలలు/కథలు రాయడానికి కలం-కాగితం వాడతారా? లేక డైరెక్టుగా లాప్‌టాప్ ఉపయోగిస్తారా? ఎందుచేత?

జ: పర్సనల్ కంప్యూటర్స్ వచ్చాక, ఆఫీస్‌లో అలవాటు కాబట్టి ఇంట్లో కూడా డైరెక్ట్‌గా ఆన్‌లైన్ లోనే టైపు చెయ్యడం అలవాటయ్యింది. అయితే ఆలోచన సడన్‌గా ఒక ఫ్లోలో వస్తుంది కాబట్టి, అప్పటికప్పుడు దాన్ని వెంటనే ఒక డ్రాఫ్ట్‌గా చిన్న నోట్ బుక్‌లో షార్ట్ హ్యాండ్‌లో రాసుకుని కంప్యూటర్ ముందు కూర్చుంటాను. అక్కడ ఆలోచిస్తూ టైమ్ వేస్ట్ కాకూడదని అలా చేస్తాను.

తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం

ప్రశ్న 12: మీ రచనల గురించి వివరించండి.

జ: నావి నాలుగు కథా సంపుటాలు అవి,1.మనోచిత్రం 2.వసంత కోకిల 3.కొత్తచూపు 4.అమ్మకో అబద్దం.

నవలలు నాలుగు. అవి,1. అనుకోని అతిథి 2. అంతర్గానం 3. ఎద లోపలి ఎద. 4. ‘మలిసంజ కెంజాయ’ (సంచికలోనే సీరియల్‍గా వచ్చింది. త్వరలో పుస్తక రూపంలో వస్తుంది).

కవిత్వం రెండు సంపుటాలుగా వచ్చింది. అవి,1. నిలువుటద్దం 2. నీరెండ దీపాలు. ‘ప్రవాహోత్సవం’ అనే కవితల సంపుటి ప్రచురణలో ఉంది.

గౌరీలక్ష్మి.అల్లూరి గారి రచనలు

‘భావవల్లరి’ అనే కాలమ్స్ పుస్తకం ఒకటి వచ్చింది. ‘కలర్‌ఫుల్ కదంబం’ అనే మరో కాలమ్స్ పుస్తకం ప్రచురణలో ఉంది. ఇంకా వివిధ పత్రికలలో కొన్ని వ్యాసాలు, రాజకీయరంగంపై ఉండే గౌరవం కొద్దీ అనేక రాజకీయ వ్యంగ్య వ్యాసాలు రాశాను.

ప్రశ్న 13: మీరు గెలుచుకున్న అవార్డులు, సన్మానాలు గురించి వివరించండి.

జ: నాకు అవార్డులు ఇబ్బడి ముబ్బడిగా ఏమీ రాలేదండి.

  1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నుండి ‘శ్రీ విళంబి ఉగాది పురస్కారం’
  2. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి ‘కీర్తి పురస్కారం’
  3. లేఖిని రచయిత్రుల సంస్థ నుండి ‘లేఖిని పురస్కారం’ వచ్చాయి.
మల్లెమాల పురస్కారం

ఇంకా

  1. విశాలాక్షి మాసపత్రిక వారి ‘ప్రతిభా పురస్కారం’,
  2. మల్లెతీగ మాసపత్రిక వారి ‘సాహితీ సేవా పురస్కారం’,
  3. నవ్యాంధ్ర రచయితల సంఘం వారి ‘సాహితీ పురస్కారం’ లభించాయి.

కొన్ని కథలకు, కవితలకు బహుమతులు వచ్చాయి.

ఉగాది పురస్కారం – అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా

ప్రశ్న 14: మీ పిల్లలు మీ రచనలు చదువుతారా? మీ రచనల పట్ల వారి స్పందన ఎలా ఉంటుంది?

జ: ఉద్యోగస్థులైన మా పిల్లలు, కొంచెం కష్టపడి నా కథలు, కవితలు చదువుతారు. అయితే వారి ప్రపంచం వేరు కాబట్టి తెలుగు సాహిత్యం గురించి వారికి ఎక్కువ అవగాహన ఉండదు. నా రచనల్లోని పాత్రలను మా బంధు, మిత్ర వర్గంలోని కొంతమందితో పోల్చడానికి ప్రయత్నిస్తూ నన్ను ఆట పట్టిస్తుంటారు. “రచనకు యథాతథంగా ఏ ఒక్కరి కథా పూర్తిగా పనికిరాదు. కొంత వాస్తవానికి కొంత కల్పన జోడించి పాఠకుడిలో ఆలోచన రేకెత్తించేలా, ఆశావాదంతో, కాస్త నీతిని చెబుతూ కథలు అల్లుతారు రచయితలు” అని చెబుతుంటాను.

విశాలాక్షి.. మాసపత్రిక ప్రతిభా పురస్కారం.

ప్రశ్న 15: మన తెలుగు సాహిత్యం, ఇతర భాషలలోకి అనువదించవలసిన అవసరం ఉందా? ఎందుచేత?

జ: ఇతర భాషలలో ఉన్న మంచి రచనల తెలుగు అనువాదాల్లో మనకి కొత్త కోణాలు కనబడతాయి. అవి చదివినప్పుడు మనకి ఎంతో ఎదిగిన భావన కలుగుతుంది. అలాగే మన తెలుగు రచనలు కూడా ఇతర భాషల్లోకి తప్పకుండా వెళ్లాలి. ఏ భాషలో రచించిన రచనలైనా ప్రపంచమంతా వ్యాపించినప్పుడే మనుషులు ఆరోగ్యంగా ఎదగగలుగుతారు. అప్పుడే అన్ని భాషలూ, వారి సాహిత్యమూ వైవిధ్యభరిత భావాలతో, ఉన్నత లక్ష్యాలతో సుసంపన్నం అవుతాయి. ఆ విధమైన సాహిత్యాన్ని చదివిన జనత చక్కని మనోవికాసంతో ఉత్తమ పౌరులుగా జీవిస్తూ విశ్వ ప్రేమికులుగా మారే అవకాశం ఉంటుంది. అదే సాహిత్యం యొక్క ఔన్నత్యం. గొప్పతనం. ముఖ్యంగా పరమార్థం కూడా! మనల్ని మనీషులుగా నిలబెట్టి సర్వమానవ సౌబ్రాత్రం వైపు నడిపించేదీ సాహిత్యమొక్కటే కదా!

***

డా. కె.ఎల్.వి. ప్రసాద్: ధన్యవాదాలు గౌరీలక్ష్మి గారు.

అల్లూరి గౌరీలక్ష్మి: ఇలా నా మనసులో భావాలను పంచుకునే అవకాశం కలిగించిన  సంచిక టీమ్ వారికీ, మీకూ నా ప్రత్యేక కృతజ్ఞతలు ప్రసాద్ గారూ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here