సంభాషణం: నవలా రాణి… శ్రీమతి అంగులూరి అంజనీదేవి అంతరంగ ఆవిష్కరణ

55
6

[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం నవలా రాణి… శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]

[dropcap]క[/dropcap]థ రాయడం ఎంత కష్టమో, నవల రాయడం అంత సులభం అని కొందరు చెబుతుంటారు. నా దృష్టిలో రెండూ కష్టమే! కథను తక్కువ మాటల్లో ఎక్కువ విషయాన్ని చొప్పించాలి. నవల కాన్వాస్ పెద్దది, ఎంతైనా రాయవచ్చు. కానీ పాత్రల అన్వయం విషయంలో ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. అయితే రాయాలని దీక్ష పట్టుదల గలవారికి, సమయం దొరకాలి గానీ, ఏ ప్రక్రియ అయినా అవలీలగా రాసేస్తారు. ఓపిక కూడా తోడుంటేనే గానీ, ఈ రచనా వ్యాసంగం సత్ఫలితాలను ఇవ్వదు.

గతంలో కొన్నాళ్ళు ఈ రచనా వ్యాసంగంలో, పత్రికలలో మహిళామణులు రాజ్యమేలారు. ముప్పాళ్ల రంగనాయకమ్మ, యద్దనపూడి సులోచనా రాణి, మాదిరెడ్డి సులోచన, సి. ఆనందారామం, శ్రీమతి పరిమళా సోమేశ్వర్, మాలతీ చందూర్, రామలక్ష్మి, డి. కామేశ్వరి, ద్వివేదుల విశాలాక్షి, మన్నెం శారద, అబ్బూరి ఛాయాదేవి .. ఇలా, నాకు గుర్తు లేని స్త్రీమూర్తులు చాలామంది కథలు, నవలలు రాశారు. అందులో కొందరు ఉద్యోగినులు వున్నారు, మరికొంతమంది నూరు శాతం గృహిణులు వున్నారు.

ఇలాంటి కోవకు చెందిన హన్మకొండకు చెందిన గృహిణి శ్రీమతి అంగులూరి అంజనీదేవి. వారు సంసార బాధ్యతలు సజావుగా సాగిస్తూనే, ఇప్పటి వరకూ కొన్ని కథలు,19 నవలలు రాసారు. ఈ రచయిత్రి ప్రచారానికి చాలా దూరంగా వుంటారు. అంజనీదేవి గారి రచనా వ్యాసంగ విశేషాలు ఆవిడ మాటల్లోనే చదువుదాం.

***

1) నమస్కారం అంజనీదేవి గారూ – మీ విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం వివరించగలరా?

♣ నమస్కారం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారూ! నేను కందుకూరుకు చెందిన శ్రీ తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ కళాశాలలో బి.ఏ. (లిటరేచర్) చేసాను. అప్పట్లో మాది ఉమ్మడి కుటుంబం. చిన్న సైజు జమీందారీ కుటుంబంలా ఉండేది. మా నాన్నగారు మామిడేల రాఘవయ్య గారు. అమ్మ వెంకట సుబ్బమ్మ గారు. వారి ఏకైక సంతానం నేను. మా నాన్నగారు ఏ విషయంలో నైనా చాలా తెలివిగా, హుందాగా, నాయకత్వ లక్షణాలతో ఉండేవారు.

2) తెలుగు భాష పై మీకు మక్కువ ఎప్పుడు, ఎలా ఏర్పడింది?

♣ మా కాలేజీలో తెలుగు అధ్యాపకులుగా వున్న డా. మొవ్వ వృషాద్రిపతి గారి ప్రోత్సాహం వల్ల తెలుగు భాష పట్ల ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టంతోనే తెలుగు సాహిత్యానికి సంబందించిన పుస్తకాలు, ముఖ్యంగా నవలలు ఎక్కువగా చదివేదాన్ని.

3) మీ మొదటి రచన ఎప్పుడు, ఏ పత్రికలో వచ్చింది? అప్పటి మీ ఫీలింగ్ ఎలాంటిది?

♣ నా మొదటి రచన మా కాలేజీ మ్యాగజైన్‌లో వచ్చిందండీ! అప్పుడే రెండు కథలు ప్రగతి వారపత్రికలో అచ్చు అయ్యాయి. ఆ తరువాత నవల రాసాను. దాని పేరు ‘మధురిమ’. అది ప్రగతి వీక్లీలో సీరియల్‌గా వచ్చింది. అప్పుడు నా వయసు 17 మాత్రమే! ఆ సీరియల్ చూసి మా కళాశాల లెక్చరర్ శ్రీ మొవ్వ వృషాధిపతి గారు, ‘నవల సరళంగా, బాగుంది’ అని ఆశీర్వదించారు. ఆయన కనక ఆ రోజున నా నవలను ప్రశంసించక పోయినా, నవల అచ్చుకాకుండా తిరిగి వచ్చి వున్నా, ఈ రోజున మీకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయిలో నేను ఉండేదాన్ని కాదు! పెద్ద మనసు వున్న పెద్దల ఆశీర్వాదం అద్భుతాలను సృష్టిస్తుంది అంటారు కదా! అదే జరిగింది నా విషయంలో కూడా.

4) మీ రచనా వ్యాసంగాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహించిన వారు ఎవరైనా ఉన్నారా? లేక మీరే స్వంతంగా అలవర్చుకున్నారా? వివరించండి.

♣ నేను హై స్కూల్లో చందమామ, బొమ్మరిల్లు, బుజ్జాయి, కథల పుస్తకాలు చదివిన ఉత్సాహంతో, కొంచెం, కొంచెం వ్రాస్తున్నానని తెలిసి మా నాన్నగారు, నన్ను మా పక్క వూరిలో వున్న ప్రముఖ నవలా రచయిత్రి శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారి ఇంటికి తీసికెళ్ళారు. నన్ను వారికి పరిచయం చేశారు. అప్పుడు నేను పదవ తరగతి చదువుతున్నాను. నేను రాసిన పేపర్స్‌ని అప్పటికప్పుడే ఆవిడ చదివారు. “వీటిని నువ్వు ఏ పత్రికకు పంపాలన్నా ఒక కవర్లో పెట్టి, హామీ పత్రం వ్రాసి పంపాలి అంజనీదేవీ..” అంటూ హామీ పత్రం ఎలా రాయాలో చెప్పి ప్రగతి వీక్లీ, చిరునామా కూడా ఇచ్చారు. ఆ సమయంలో ఏ రచయితకైనా ప్రధానంగా కావలసింది అలాంటి ప్రోత్సాహమే కనుక ఆవిడ సూచనలు నాకు బాగా నచ్చాయి/ఉపయోగ పడ్డాయి.

అంత మాత్రమే కాదు, నిర్మల గారిని కలిసి మేము తిరిగి వచ్చేస్తుంటే, “బుక్స్ బాగా చదవాలి” అంటూ శరత్ బాబు వ్రాసిన ‘గృహ దహనం’ నవల ఇచ్చారు చదవమని. ఆ పుస్తకం తీసుకుని ఇంటికి వచ్చాము. నా పక్కనే వుండి ఆవిడ మాటలు విన్న మా నాన్నగారు, విశ్వనాథగారి ‘వేయి పడగలు’, ఉషశ్రీ గారి భారతంతో పాటు, అప్పుడు మార్కెట్‌లో వున్న మాలతీ చందూర్, రంగనాయకమ్మ, మాదిరెడ్డి, యద్దనపూడి, వాసిరెడ్డి, శరత్, చలం వ్రాసిన నవలలు కొన్ని కొని నన్ను చదువుకోమని ఇచ్చారు. “నువ్వు ఏది వ్రాసినా దేని కోసం వ్రాస్తున్నావో ఆలోచించి వ్రాయమ్మా!” అన్నారు మా నాన్నగారు.

ఆ తర్వాత పత్రికల్లో వస్తున్న నా కథల్ని చదివి “ఎలా రాస్తావమ్మా ఇలా? ఈ ఆలోచనలు నీకు ఎలా వస్తాయి?” అని మా నాన్నగారు సంతోషపడినప్పుడు నాలోకి ఏదో కొత్త శక్తి వచ్చినట్లయ్యేది. అమ్మ అన్నం పెడితే- నాన్న అక్షరం పెట్టారు. ఇది నాకు మా నాన్న గారు పెట్టిన అక్షర భిక్షే నండీ!

అంజనీదేవి గారి నవలలు కొన్ని

5) మీ వైవాహిక జీవితం రచనా వ్యాసంగానికి ఎలా తోడ్పడింది? ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా?

♣ ఎలాంటి సమస్యలు ఎదుర్కొనలేదు. కానీ మావారు బ్యాంకు ఉద్యోగి కావడం వల్ల తరచుగా బదిలీలు ఉండేవి. ఆయన వల్లనే నేను ఎక్కడికి వెళ్లినా, ఆయా ప్రాంతాల సాహిత్యకారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పుడు సమయం తక్కువగా ఉండడం వల్ల కవితలు, కథలు మాత్రమే వ్రాసాను. కవితలు కొన్ని సాహిత్య పత్రికలలో ప్రచురింపబడ్డాయి. సాంస్కృతీ సమాఖ్య ద్వారా పరిచయం అయిన డా.ఎస్వీ. సత్యనారాయణ గారూ, డా.అద్దేపల్లి గారూ, డా. రాధేయగారూ, వ్రాసిన విలువైన ముందు మాటలతో, నా కవితలన్నీ ‘గుండెలోంచి అరుణోదయం’ కవితా సంపుటిగా వచ్చాయి. ఈ కవితా సంపుటికి, ‘ఉమ్మెత్తల సాహితీ అవార్డు’ వచ్చింది. ఆ కవితల్లోని అభ్యుదయ దృక్పథం, సామాజిక స్పృహను ప్రముఖ అవధాని, కవి శ్రీ నరాల రామారెడ్డి గారూ, డా. ఆర్. అనంత పద్మనాభరావు గారు అభినందించారు. ‘వయసు చిన్నదైనా, కవితలు ఒక స్థాయిలో వున్నాయి’ అని నాటి దిగంబర కవి ‘మహా స్వప్న’ గారు ప్రశంసించారు.

అలాగే, ప్రముఖ కవయిత్రి డా.శిలాలోలిత గారు తన పరిశోధనా సిద్ధాంత గ్రంధమైన ‘కవయిత్రుల కవితా మార్గం’లో నా ‘గుండెలోంచి అరుణోదయం’ ఉదాహరణగా తీసుకుని, నేను ఏ ఉద్దేశంతో ఆ కవితల్ని వ్రాసానో, అందులో రికార్డు చేయడం గర్వంగా ఉంటుంది.

సులోచనారాణి గారితో అంగులూరి అంజనీదేవిగారు

ఇకపోతే, నా కథలన్నిటితో ‘జీవితం అంటే కథ కాదు’ అనే కథల సంపుటి వచ్చింది. ఈ కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీతలు అబ్బూరి ఛాయాదేవి గారూ, అంపశయ్య నవీన్ గారూ, దిగంబర కవి మహాస్వప్న గారూ ముందుమాటలు రాయడం విశేషం! ఇవన్నీనాకు మధుర జ్ఞాపకాలే.

6) చదవడంలోనూ, రాయడంలోనూ మీకు నవల ఇష్టమా? కథ ఇష్టమా? ఎందుచేత?

♣ కథలు చదువుతాను, కానీ నవలలు బాగా ఇష్టంగా చదువుతాను. కథలు వ్రాసినప్పుడు, చాలా ఇష్టంగానే కథలు రాసాను. ఇప్పుడు నవలలు మాత్రమే, చాలా.. చాలా.. ఇష్టంగా వ్రాస్తున్నాను.

7) మీరు నవలా రచయిత్రిగానే చాలామందికి తెలుసు. ఇప్పటివరకూ ఎన్ని నవలలు మీరు రాశారు? అవి ఎక్కడెక్కడ పబ్లిష్ అయినాయి?

♣ ఇప్పటివరకూ నేను19 నవలలు వ్రాసాను. నా నవలల్లో కొన్ని నవ్య, స్వాతి వారపత్రిక, తెలుగు తేజం వంటి మాస పత్రికలలో సీరియల్స్‌గా వచ్చాయి. కొన్నినవలలు- మధుప్రియ, సాహితీ పబ్లికేషన్స్ ద్వారా డైరెక్ట్ నవలలుగా వచ్చాయి. ప్రస్తుతం కొన్నినవలలు, ప్రముఖ తెలుగు అంతర్జాల పత్రికలలో, వివిధ వెబ్‌సైట్లలో సీరియల్స్‌గా వస్తున్నాయి. కొన్నిఆడియో-నవలలుగా యుట్యూబ్‌లో వచ్చాయి.

అంజనీదేవి నవలలు మరికొన్ని

అంత మాత్రమే కాకుండా ‘నీకు నేనున్నా’, ‘మౌన రాగం’ అనే నవలలు కన్నడంలోనికి అనువదించ బడ్డాయి. ‘మౌనరాగం’ నవల ఆంగ్లంలోకి కూడా అనువదించ బడింది.

అలాగే, ఆకాశవాణి-కడప కేంద్రం నుండి, నా కవితలు, కథానికలూ ప్రసారం అయ్యాయి. వరంగల్ ఆకాశవాణి వారి నిర్వహణలో జరిగిన కవిసమ్మేళనంలో పాల్గొన్న విషయం మర్చిపోలేను.

8) గృహిణి పాత్రకు న్యాయం చేస్తూనే, మీ రచనావ్యాసంగాన్ని ఎలా విజయవంతం చేసుకోగలిగారు?

♣ నా జీవితం లోకి, నా భర్త గానీ, పిల్లలు కానీ, నేను రచయిత్రిని అయ్యాకే వచ్చారు. నేను పెళ్ళికి ముందే రచయిత్రిని! అయినా నా కుటుంబాన్నీ నా రచనలతో నేనుఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ నుండి నాకంటూ మిగిలిన సమయాన్నిమాత్రమే నా రచనల కోసం వినియోగించుకున్నాను.

కుటుంబసభ్యులతో

నాకు ఏం కావాలో స్పష్టంగా తెలుసు కాబట్టి నన్ను నేను కంఫర్ట్‌గా వుంచుకుని, వాళ్ళను కూడా కంఫర్ట్‌గా ఉంచగలిగాను. లేకుంటే ఎలాంటి సాహిత్యపు సువాసన లేని నా కుటుంబ సభ్యుల మధ్యలో ఉంటూ ఇన్ని నవలల్ని నేను సాహిత్య లోకానికి అందించగలిగి ఉండేదాన్ని కాదు. నా ఈ విజయానికి కారణం, నా చుట్టూతా వున్న ప్రపంచాన్ని సునిశితమైన దృష్టితో పరిశీలించడం, దీనికి తోడు సాహితీ అభిలాష! ఇవన్నీనా పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటాను.

9) నవలకుగానీ, కథకు గానీ, వస్తువును ఎన్నుకునే విషయంలో మీకు ప్రత్యేకమైన ప్రాధాన్యతలు ఏమైనా ఉన్నాయా? వివరించండి.

♣ నేను వ్రాసే కథలు గానీ, నవలలుగానీ ఒకదానితో ఒకటి పోలిక లేకుండా చూసుకుంటాను. వస్తువును ఎన్నుకునేటప్పుడే, ఇది ఎంతవరకు ఉపయోగ పడుతుంది చదివేవాళ్ళకు -అని ఆలోచిస్తాను. చెప్పాల్సిన అవసరం వున్న అంశాలను మాత్రమే తీసుకుంటాను.  ఏది వ్రాసినా సరళంగా, సహజంగా నాకు తెలిసింది మాత్రమే రాస్తాను. మనిషి పరివర్తనకు, సమాజ శ్రేయస్సుకు స్ఫూర్తి నిచ్చేలా వ్రాస్తాను.

పోల్కంపల్లి శాంతాదేవి గారి నుంచి అవార్డు అందుకుంటూ

10) మీరు జీవితంలో రచయిత్రిగా సంతోషం పొందిన ప్రత్యేక క్షణాలు ఏమైన ఉన్నాయా?

♣ నా రచనలే నా సంతోషం! నా మొదటినవల ప్రింట్ అయినప్పటినుండి ఈ సంతోషాన్ని పొందుతూనే వున్నాను. ఏదీ ఒక్క రోజులో రాదు కదండీ! అన్ని సంతోషాలకూ అతీతమైన సంతోషం ఇది. నేను ఏది వ్రాయాలన్నా ఒంటరిగా, ఏకాగ్రతతో, ఎంత శ్రమించి, తపించి వ్రాస్తానో, అవి పబ్లిష్ అయ్యాక అంతే ఒంటరిగా కూర్చుని సంతోష పడుతుంటాను. దాని కోసం నేను వాడుకునే సమయం నాకు చాలా విలువైనది. కానీ దీనివల్ల నేనుకొన్ని ముఖ్యమైన ఫంక్షన్లను మిస్ అవుతున్నానన్న బాధ కూడా లేకపోలేదు సుమండీ!

యద్దనపూడి మాతృమూర్తి నవలా పురస్కారం

11) మీరు వ్రాయాలనుకున్నవి ఇంకా ఏమైనా ఉన్నాయా? వివరించండి.

♣ నేను ఇంకా వ్రాయాలనుకున్నవి చాలా వున్నాయి. సముద్రపు అలల్లా నిరంతరం నా రచనా వ్యాసంగం కొనసాగుతూనే ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు.

డా. సి. నారాయణ రెడ్డి గారితో

12) నేడు మనకు అందుబాటులో వున్న పత్రికల పైన, ముఖ్యంగా అంతర్జాల పత్రికల పైన మీస్పందన తెలియజేయండి అంజనీదేవి గారు.

♣ పత్రిక లేకుంటే రచయిత లేడు. ఒక రచయితగా మీకు తెలియని విషయం కాదు ఇది! అశేష జనాదరణ పొందిన పత్రికలలో మన రచనలు రావడమే ఒక అదృష్టంగా భావిస్తాము కదా.

ఇక అంతర్జాల పత్రికల విషయానికొస్తే, వాటి అవసరం ఎంత ఉందో ఈ కరోనా కాలంలో బాగా అర్థం అయింది, ఈ సంవత్సర కాలంలో ప్రధాన పత్రికలు చాలా మట్టుకు ఆగిపోయాయి. వాటి స్థానాన్ని కొంతవరకు ఈ అంతర్జాల పత్రికలు భర్తీ చేశాయని చెప్పక తప్పదు. ఇకపోతే రచయితకు ఈ పత్రికల వల్ల ఒక సౌలభ్యం వుంది. ఈ పత్రికల్లో రచన వచ్చిన కొద్దీ క్షణాల్లోనే పాఠకుడి స్పందన రచయితకు తెలుస్తుంది. దానికి సరిపడా ప్రతిస్పందన వెంటనే ఇచ్చే అవకాశం రచయితకూ ఉంటుంది. ఈ పద్ధతి వల్ల మంచి జడ్జిమెంట్‌తో పాటు రచయితకు అవసరమైనంత ఎనర్జీ కూడా లభిస్తుంది.

పుస్తకావిష్కరణ సభలో

13) మీరు పొందిన సన్మానాలు —-

♣ 1) ఉమ్మెత్తల సాహితీ పురస్కారం 2) యద్దనపూడి మాతృమూర్తి నవలా పురస్కారం 3) జాతీయ పురస్కారం 4) హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ పురస్కారం 5) భారత మహిళా శిరోమణి పురస్కారం. ఇలా చాలా సందర్భాలలో పురస్కారాలు పొందాను.

14) చాలా సంతోషం అంజనీదేవి గారు. సంచిక -పాఠకులకు మాత్రమే కాకుండా అనేకమంది వర్ధమాన రచయితలకు,రచయిత్రులకు స్ఫూర్తినిచ్చే మీరచనా వ్యాసంగ విశేషాలు చాలా బాగున్నాయి. మీరు మరిన్ని రచనలు తెలుగు పాఠకలోకానికి అందించాలని మనసారా కోరుకుంటూ ‘సంచిక’ పక్షాన మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు.

♣ సంచిక పత్రికకూ, మీకూ ధన్యవాదాలు డా. ప్రసాద్ గారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here