34. సంభాషణం – శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి అంతరంగ ఆవిష్కరణ

4
13

[సంచిక కోసం ప్రముఖ కథా, నాటక, నవలా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]

ఉత్తమ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి..!!

[dropcap]శ్రీ[/dropcap]మతి అత్తలూరి విజయలక్ష్మి గారు తెలియని తెలుగు పాఠకులు లేరనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు! తెలుగు సాహిత్యంలో నవల, నాటకం, కథ వంటి ప్రక్రియలలో, అనేక గ్రంథాలు వీరి ఖాతాలో ఉన్నాయి. రచనా జీవితంలో ఇరవై నవలలు రాయటం అంటే మామూలు విషయం కాదు. ఉద్యోగినిగా, వృత్తిపరంగా క్రమశిక్షణతో తన విధులు నిర్వర్తిస్తూనే ప్రవృత్తిపరంగా తెలుగు సాహితీ రంగానికి శ్రీమతి విజయలక్ష్మి గారు చేస్తున్న సేవ వెలకట్టలేనిది, ప్రశంశనీయమైనదీనూ!

లేఖిని అనే పూర్తి మహిళా సాహిత్య సంస్థకు అధ్యక్షురాలిగా ఉండి, అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఎంతోమంది రచయిత్రులకు సాహిత్యపరంగా ఎంతో ప్రొత్సాహాన్ని అందిస్తున్నారు.

అనేక అవార్డులూ, సన్మానాలూ అందుకున్న విజయలక్ష్మి తన సాహిత్య అంతరంగాన్ని మన ముందు ఉంచుతున్నారు. మరి పదండి ముందుకు.

~

డా. కె. ఎల్. ప్రసాద్: నమస్కారం అత్తలూరి విజయలక్ష్మి గారూ.

అత్తలూరి విజయలక్ష్మి: నమస్కారం డాక్టర్ గారు!

ప్రశ్న 1: తెలుగు సాహిత్యం పట్ల తెలుగు రచనా వ్యాసంగం పట్ల అభిరుచి ఎప్పుడు, ఎలా కలిగింది?

జ: ఈ ప్రశ్నకి జవాబు సాధారణంగా అందరు రచయితలది ఒకటే ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎలాంటి వాతావరణంలో పెరుగుతామో, ఆ వాతావరణ ప్రభావం మన మీద పడడం సహజం. మా ఇంట్లో అమ్మ, నాన్న, అక్క, అన్నలు, చెల్లెలు, తమ్ముడు అందరూ సాహిత్యం అంటే అభిమానం, ఆసక్తి చూపేవారు. ఇంట్లో అనేక రకాల మాగజైన్లు, నవలలు అందుబాటులో ఉండేవి. అందరూ చదువుతుంటే అందులో ఏముందో నేనూ చదవాలని ఆసక్తి కలిగి అలా చదవడం మొదలుపెట్టాను. కొంతకాలం అలా చదవగా, చదవగా నాకూ రాయలన్న ఆసక్తి కలిగింది. చందమామ కథలతో మొదలు పెట్టాను కానీ నా వల్ల కాలేదు.. ఆకాశవాణిలో చందమామ అనే స్కెచ్‌తో అసలు రచన మొదలైంది.

ప్రశ్న 2: చాలా మంది రచయితల రచనల మీద ఆంగ్ల సాహిత్య ప్రభావం ఉంటుందని చెప్తారు. మీ అనుభవాలు చెప్పండి?

జ: నిజానికి నేను అనువాద సాహిత్యం చదివాను కానీ direct గా ఇంగ్లీష్, హిందీ వంటి ఇతర భాషల సాహిత్యం ఎక్కువగా చదవలేదు. అంచేత నా రచనల మీద మాత్రం అలాంటి ప్రభావం ఏమి లేదు. ఏది రాసినా ప్రతి వాక్యం నా స్వంతం.. ఆంగ్ల సాహిత్య ప్రభావం తెలుగు సాహిత్యం మీద ఎలా ఉంటుంది? మన సంస్కృతి వేరు, ఆ సంస్కృతీ వేరు. మన పత్రికల వారు తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉండాలి సాహిత్యం అంటారు కదా!

కుమార్తె కుటుంబంతో రచయిత్రి

ప్రశ్న 3: సుమారు ఇరవై నవలలు రాసిన అనుభవం మీకు ఉంది. మీ దృష్టిలో, నవల /కథ రాయడంలో ఏ ప్రక్రియ కష్టమైనది? ఎందుచేత?

జ: కథ రాయడం చాలా కష్టం అని నా అభిప్రాయం. తక్కువ పదాల్లో గాఢమైన భావం వ్యక్తం చేయడం, క్లుప్తత పాటించడం ఇవి నా వల్ల కాదు. నేను రాసిన వాటిలో ఎన్నో మంచి కథలు ఉన్నాయి. మంచి కథలు అని ఎందుకు అంటున్నానంటే, నాకు మూడు కథా సంపుటులకి చాలా విశిష్టమైన పురస్కారాలు లభించాయి. అనేక కథలకు బహుమతులు లభించాయి. ప్రముఖుల ప్రశంసలు లభించాయి. కాబట్టి అవి మంచి కథలు అనుకుంటున్నాను. కానీ ఇటీవల నవల మీద ఎక్కువగా ఫోకస్ చేయడం వలన కథలు రాయలేకపోతున్నాను. కొందరు కథల పోటీలు పెట్టినపుడు వారు పెట్టే నిబంధనల ప్రకారం రాయడం కూడా నాకు కష్టంగా అనిపిస్తుంది. నవలకి పరిధి లేదు.. వేయిపడగలు లాగా వేయి పేజీలు రాయచ్చు, డిటెక్టివ్ నవల లాగా చిన్న నవలలు రాయచ్చు. వస్తువుని బట్టి ఎలాంటి నిబంధనలు లేకుండా చక్కగా అల్లికలా రాయచ్చు. అంచేత నాకు నవల అంటే ఇష్టం. అదే సులభంగా రాయచ్చు అనిపిస్తుంది.

లేఖిని సమావేశంలో ప్రసంగిస్తున్న శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి

ప్రశ్న 4: మీ కలం నుండి జాలువారిన మొదటి సాహిత్య ప్రక్రియ ఏమిటి? అప్పటి మీ అనుభవం చెప్పండి.

జ: నా మొట్టమొదటి సాహితీ ప్రక్రియ స్కెచ్.. 1974లో మొట్టమొదట చందమామ, పల్లెటూరు అనే స్కెచ్‌తో స్టార్ట్ చేసాను. దాన్నే గల్పిక అంటారు అనుకుంటా.. కథ, వ్యాసం కాకుండా ఉంటుంది. ఆ తరవాత వర్ధమాన రచయిత్రి అనే కథ రాసాను. ఈ రెంటితో పాటు అనేక కథలు ఆకాశవాణిలో ప్రసారం అయినాయి. నా అచ్చయిన మొదటి కథ ఈ క్షణం దాటనీ.. మయూరి పత్రికలో ప్రచురించారు. ఆ రోజు నా ఆనందం అనూహ్యం.. ఎవరూ ఊహించలేరు. అలాగే రెండు, మూడు, నాలుగు కథల వరకు కథని అచ్చులో చూసుకుని ఎంతో మురిసిపోయాను. నేనూ రచయిత్రిని అని అనుకున్నాను. కానీ ఒక నవల పబ్లిష్ అయేవరకు నేను రచయిత్రిని అని ఎవరికీ చెప్పలేదు.

లేఖిని.. కార్యక్రమంలో.. రచయిత్రి (శ్రీకృష్ణ దేవరాయభాషా నిలయం, సుల్తాన్ బజార్, హైదరాబాద్)

ప్రశ్న 5: మీరు నవలకు గానీ, కథకు గానీ వస్తువును ఎన్నుకునే విషయంలో, అది యాదృచ్ఛికమా? లేక మీకు ప్రత్యేకమైన అంశాలు ఉంటాయా?

జ: అలా ప్రత్యేకంగా ఇదే రాయాలి అనుకోనండి. కొన్ని సంఘటనలు లేదా అనుభవాలు మనసుని స్పందింపచేస్తాయి. అలాగే కొన్ని జీవితాలు, ఆ జీవితాల్లోని సమస్యలు నన్ను కదిలిస్తాయి. కొన్ని అనుభూతులు ఎవరికైనా షేర్ చేయాలి అనిపిస్తుంది. అలాంటివి నేను కథా వస్తువులుగా తీసుకుంటాను. కాల్పనిక సాహిత్యానికి కాలం చెల్లిపోయింది. ఇప్పుడు వాస్తవిక, అంటే జీవితాలకు దగ్గరగా ఉండే రచనలు ఆదరణ పొందుతున్నాయి. కాకపోతే, నేను ఆనాడు, ఈనాడు కూడా జీవితంలో జరిగినవి, చూసినవి రాసాను. నాకు ఊహల్లో బతకడం అసలు చేతకాదు.

ప్రశ్న 6: సమీక్షకు, విమర్శకు తేడా ఏమిటి? ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో సమీక్ష/విమర్శల పట్ల మీ అబిప్రాయం చెప్పండి.

జ: సమీక్ష వేరు, విమర్శ వేరు. ఒక కథ కానీ, నవల కానీ, సమీక్షించబడడం అంటే, కథా వస్తువు, కథా గమనం, ముగింపు మొత్తంగా చదివి, కథకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా లేదా! చెబుతూ, తగిన సూచనలు ఇస్తూ సాగేది సమీక్ష. అంటే మొత్తం రచన యొక్క సారాంశాన్ని, రూపాన్ని వారి, వారి పరిజ్ఞానంతో రచయితకి ఒక్కసారి తన రచనని తాను మరోసారి దర్శించుకునే ఆలోచన రేకెత్తించాలి. కానీ విమర్శ అలా కాదు. నిజానికి విమర్శ సద్విమర్శ అయితే తప్పకుండా స్వాగతించవచ్చు. కానీ కొందరు రచనల్లోని లోపాలు ఎంచడమే తమ డ్యూటీ అన్నట్టు విమర్శిస్తారు. కొందరు కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి ప్రయత్నం చేస్తారు. అదేంటి నీ నవలలో హీరో అన్ని సార్లు స్నానం చేసాడు.. అన్ని సార్లు కాఫీ తాగాడేంటి? నాకు విసుగు పుట్టింది చదువుతుంటే అంటారు. హీరో ఎన్ని సార్లు కాఫీ తాగాడు అని లెక్కపెట్టుకుంటూ కూర్చునే వాళ్ళకి రచనలోని సారం కనిపించదు. అసలు రచయిత తీసుకున్న అంశం ఏమిటి? అది ఎలా చెప్పాడు? ఎంత ఆసక్తి కలిగేలా అంటే readability ఉందా? లేదా? అందులో ప్రస్తావించిన అంశం సమాజానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందా.. పాత్రల్లో జీవం ఉందా! సంభాషణలు సహజంగా ఉన్నాయా.. సంఘటనలు, సన్నివేశ రూపకల్పన ఎక్కడన్నా అసహజంగా ఉందా ఇవన్నీ కనిపించవు. ఇలాంటి విమర్శలు ఒక prejudice తో చేస్తారని నేను అనుకుంటాను. రచయితని తన రచన పట్ల పునసమీక్షించుకునే అవకాశం కలిగించాలి.

 

ప్రశ్న 7: తెలుగు సాహిత్యంలో మీకు నచ్చిన విమర్శకుడు/విమర్శకురాలు ఎవరు? ఎందుచేత..?

జ: నిజానికి నేను సమీక్షలు, విమర్శలు చదవను. నా రచనల పట్ల ఎవరన్నా సమీక్షిస్తే తప్ప నేను పట్టించుకోను. ఇటీవల నాకు బాగా తెలిసిన విమర్శకురాలు ప్రొఫెసర్ సుశీల గారు. ఆమె సమీక్ష అయినా, విమర్శ అయినా నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా చేస్తారు. అలాగే చక్కగా సమీక్షించి, రచయితకు ఊపిరి పోసేవాళ్ళు మృణాళిని గారు, కాత్యాయని గారు. వాళ్ళు మంచి సమీక్షకులు, విమర్శించాలి అని విమర్శించడం వలన రచయిత ముఖ్యంగా కొత్త రచయితలు discourage అయే అవకాశం ఉంటుంది.

ప్రశ్న 8: తెలుగు సాహిత్యం, మిగతా భాషలతో పోల్చి చూస్తే తక్కువగా ఇతర భాషలలోకి అనువాదానికి నోచుకుంటున్న విషయం అందరికి తెలిసిందే! దీనికి కారణం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఈ అంశంపై మన విశ్వవిద్యాలయాల పాత్ర ఎలాంటిది?

జ: మీరన్నట్టు తెలుగు సాహిత్యం అనువాదం విషయంలో వెనుకబడి ఉంది. అలాగని పూర్తిగా కాదు. ఉత్తమ నవల లేదా కథ అనేది, పాఠకులు మెచ్చి, ఆయా భాషల అనువాదకులు పూర్తిగా వారి ఆసక్తితో, ఆ రచనలోని గొప్పదనం గమనించి, వారంతట వారు అనువాదం చేసేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు, ఇతర భాషల్లోకి అనువదించబడినవి గొప్ప రచనలు అవుతాయి అనే అపోహతో చాలా మంది డబ్బులు ఇచ్చి అనువాదం చేయించుకుంటున్నారు. ఈ సంస్కృతి వచ్చాక, డబ్బు కోసం ఏది పడితే అది అనువాదం చేసేవాళ్ళు బాగా ఎక్కువ అయినారు, చేయించుకునే వారు కూడా ఎక్కువ అయినారు. కానీ, ఇతర భాషల్లోకి మన తెలుగు సాహిత్యం వెళ్ళినప్పుడు మన సాహిత్యం మీద చులకన కలిగేలాంటి రచనలు వెళ్ళిపోతే ప్రమాదం.. ఓహో తెలుగు సాహిత్యం ఇలా ఉంటుందా అనుకుంటారు. ఒక కథ, నవల చదివాక ఆయా భాషల పాఠకులు కూడా చదివి ఎంత బాగుంది ఈ రచన అనుకోవాలి.. అనువాదాల వలన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక రకాల, సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచారాలు, జీవన శైలి, అభిరుచులు, చరిత్ర అన్నీ కూడా అందరికీ తెలుస్తాయి. అలాంటప్పుడు మంచి రచనలు అనువాదం అయినందువలన మన ప్రతి ప్రాంతం లోనూ ఉన్న విలువలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని కథలు మనమే చదవలేము.. అలాంటి వాటివలన దుష్ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే అనువాదం అనేది అవసరం అయినా, అందులో కూడా ఒక పద్ధతి పాటించాల్సిన అవసరం ఉందని నా భావన. ఇప్పుడు అందరికీ తెలిసిందే ప్రతి చోటా డబ్బు శాసిస్తోంది. ఆ డబ్బుతో ఏదైనా కొనుక్కోగల సామర్ధ్యం ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు.

ప్రశ్న 9: కథ/నవల, నాటకం వ్యక్తి జీవన శైలి మీద ఎలాంటి ప్రబావం చూపిస్తున్నాయి? ఎందుచేత?

జ: సాహిత్యానికి సామాజిక ప్రయోజనం ఉందా అనేది ఒక ప్రశ్న.. ఈ ప్రశ్నకి సమాధానం నేను ఎప్పటికీ ఒకటే చెప్తాను ఉంది అని. సామాజిక ప్రయోజనంలో వ్యక్తి ప్రయోజనం కలిసే ఉంటుంది అనేక వ్యక్తుల సమూహం సమాజం అయినప్పుడు. అంచేత కచ్చితంగా వ్యక్తి జీవన శైలి మీద ప్రభావం ఉంటుంది. ఒకప్పుడు సాహిత్యం మన జీవితాల్లో ఒక భాగం అయి ఉండేది. ముఖ్యంగా మహిళల మీద సాహిత్యం చాలా ప్రభావం చూపించేది. అసలు చెప్పాలంటే అప్పుడు సాహిత్యం, సినిమాలు, ఇప్పుడు టివి సీరియల్స్ అన్నీ కూడా మహిళలను ప్రభావితం చేసినట్టు పురుషులను చేయలేదు, చేయవు కూడా. ఎందుకంటే మహిళల పరిధి చాలా చిన్నది. కుటుంబం, సాహిత్యం, లేదా కుటుంబం సీరియల్ ఇలా తమ చుట్టూ ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టించుకుని అందులో లీనమై పోతారు. అందుకే వాటి ప్రభావం స్త్రీల మీద బాగా ఉంటుంది. స్త్రీలు చదువుకుని, ఉద్యోగాల పేరుతో బయట ప్రపంచంలోకి వచ్చాక వాళ్ళ పరిధి కొంత విశాలం అయింది. ఒక సాహిత్యం, సినిమా, సీరియల్ వీటిని వారి దినచర్యలో భాగం చేసుకున్నారు కాబట్టి ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. పురుషులకు ఇంటి బాధ్యత కన్నా, బయట యావగేషన్స్ ఎక్కువ కదా! స్నేహితులు, క్లబ్బులు, ఇలా అనేక రకాల కాలక్షేపాలు వారికీ ఉంటాయి. అందుకే వారు సాహిత్యం తక్కువ చదువుతారు. సీరియల్స్ చూడరు. అందుకే మహిళల జీవన శైలి మీద చూపినట్టు పురుషుల జీవన శైలి మీద వీటి ప్రభావం పడే అవకాశం తక్కువ.

రచయిత్రి మొదటి కదా సంపుటి ‘అపూర్వ’ release సందర్భంగా సినారె

ప్రశ్న 10: సినిమా రంగంలో స్త్రీమూర్తులు రచనాపరంగా ఎక్కువగా రాణించక పోవడానికి కారణాలు ఏమై ఉంటాయని మీరు భావిస్తున్నారు?

జ: రాణించడం కాదు.. నవలా రచయిత్రిగా రాణించిన వాళ్ళు సినిమా రచన చేయలేరా! కాకపోతే సినిమా రచన వేరు, మామూలు నవల, కథ వేరు. సినిమాకి అనుగుణంగా ఆలోచించి రాసే అవకాశం స్త్రీలకు తక్కువ లభిస్తుంది.. ఒకవేళ లభించినా మార్పులు త్వరగా స్త్రీలు ఇష్టపడరు. అంతేకాక, సినిమా కథ రాయాలాంటే సెట్‌లో చాలా సమయం వెచ్చించాల్సి వస్తుంది. అంత సమయం స్త్రీలకూ ఉండదు. కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే వారి, రచనలు కొనసాగించగలరు కానీ, సెట్‌లో ఉండడం, సీన్స్‌కి తగినట్టు దర్శకుడి సూచనల మేరా కథ మారుస్తూ పోవడం స్త్రీలు చేయలేరు. పైగా మీకు తెలియంది ఏముంది? సినిమా ప్రపంచంలో ఇమిడి పోగల స్వభావం కొందరికే ఉంటుంది.. నాకు తెలిసీ ఇంతకన్నా పెద్ద కారణం ఉండదు. ఆడవాళ్ళు సినిమా కథ రాయలేరు అన్న వాదన మాత్రం correct కాదు.

ప్రశ్న 11: లేఖినిఅనే సంస్థకు మీరు అధ్యక్షురాలుగా ఉన్నారు కదా! ఆ సంస్థ ప్రదాన లక్ష్యాలు ఏమిటి? ఈ సంస్థ ద్వారా సాహిత్యపరంగా మీరు సాధించిన విజయాలు ఏవి?

జ: లేఖిని సంస్థతో నాకు ప్రారంభం నుంచి ఒక అనుబంధం ఉంది. డాక్టర్ వాసా ప్రభావతి గారు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ సంస్థ బాధ్యతలు నాకు అప్పగించారు నా మీద నమ్మకంతో. ఎందుకంటే ఆవిడకి లేఖిని మరో ప్రాణం. ఆవిడ ఉన్నంత కాలం అధ్యక్ష పదవి ఎవరికీ ఇవ్వలేదు. సమర్థవంతంగా ఎవరు నిర్వహించగలరు అనే సందేహం బాగా ఉండేది అనుకుంటాను. నాకు అప్పగించారు అంటే నా మీద ఎంతో నమ్మకం ఉంటేనే కదా! అందుకే నేను కూడా ఒక చాలెంజ్‌గా తీసుకున్నాను. అప్పటికన్నా ఇప్పుడు సభ్యుల సంఖ్యా బాగా పెరిగింది. ఇతర ప్రాంతాల రచయిత్రులు కూడా లేఖిని సభ్యత్వం తీసుకోవడం నాకు చాలా ఆనందంగా, గర్వంగా అనిపిస్తుంది. మేము ప్రతి ఏడాది రెండు సార్లు కథల పోటీ పెట్టి, కొత్త రచయిత్రులను ప్రోత్సహిస్తున్నాము. ఇప్పుడు హైదరాబాద్‌కి పరిమితం అయిన మా సంస్థ త్వరలో ఉభయ రాష్ట్రాలకు విస్తరించాలని నా ఆశ. ఇప్పుడు ఉన్న office bearers కూడా నాకు ఎంతో సహకరిస్తున్నారు. నేను ఒక కార్యక్రమం ప్లాన్ చేస్తే ఎవరూ కాదు, వద్దు అనరు. నా మీద వాళ్లకి నమ్మకం ఉంది. మంచి మనసు, మంచి అభిరుచులు ఉన్నవాళ్ళు మా సభ్యులు. పైగా అందరూ మంచి రచయిత్రులు. త్వరలో మేము లేఖిని ద్వారా పుస్తక ప్రచురణ కూడా చేయాలని అనుకుంటున్నాము. చేస్తాము. ఎందరో సుప్రసిద్ధులైన రచయిత్రులు involve అయి ఉన్న సంస్థ ఇది. చాలా prestigious గా నేను భావిస్తాను. చిన్న, పెద్ద అని లేకుండా ప్రతిభ గల రచయిత్రులను మేము పురస్కారాలతో గౌరవిస్తాము. ప్రతి ఏడాది లేఖిని వార్షికోత్సవం నాడు మాతృదేవోభవ పురస్కారాలు ఇస్తాము. ఫలానా వాళ్ళకే ఇవ్వాలి అని కాక, ప్రతిభ ఉన్న వారిని గుర్తించి ఆ పురస్కారాలు ఇస్తున్నాము.

లేఖిని.. కార్యక్రమంలో.. రచయిత్రి

ప్రశ్న 12: ఇంతవరకూ పుస్తకరూపం పొందిన మీ రచనల గురించి వివరించండి.

జ: నావి 7 కథా సంపుటాలు, 10 నవలలు, మూడు నాటక సంపుటాలు పుస్తక రూపంలో వచ్చాయి. మా నాన్నగారి జీవితంలో కొన్ని సంఘటనలు ఒక జీవిత చరిత్ర కూడా రాసాను. 21 నవలలు వివిధ పత్రికల్లో వచ్చినా పుస్తకరూపంలో వచ్చినవి మాత్రం పదే కావడం నాకు బాధగానే ఉంది. కానీ పుస్తకాలు కొని చదివే అలవాటు లేనివారు మన తెలుగువారు. పుస్తకాలు అమ్ముడు పోవు.. ప్రచురించే సంస్థలు లేవు. వేలకి వేలు పెట్టి స్వంతంగా ప్రచురించుకుని ఏం చేసుకోవాలి? ఇంట్లో పెట్టుకుని పూజించుకోవాలి. కాకపోతే ఏదో ఒక నాటికి అన్నీ పుస్తకరూపంలో రావాలి, తప్పదు. ఆ ప్రయత్నాల్లో ఉన్నాను.

ప్రశ్న 13: మీరు గెలుచుకున్న అవార్డులు, సన్మానాల గురించి చెప్పండి.

జ: నాకు అపూర్వ, అపురూప కథల సంపుటికి జ్యేష్ట, నార్ల లిటరరీ పురస్కారం, అబ్బూరి రుక్మిణమ్మ స్మారక పురస్కారం వచ్చాయి. అలాగే నాటకాలకి కూడా ఆకాశవాణి కేంద్ర బహుమతి, యునిసెఫ్ అంతర్జాతీయ పురస్కారం, టివి సీరియల్‌కి, కోడూరి పార్వతి – సిరికోన విశిష్టరచయిత్రి, జొన్నవిత్తుల శ్రీరామకృష్ణ స్మారక పురస్కారం, తెలుగు విశ్వ విద్యాలయం వారి కీర్తి పురస్కారం, అపురూప అవార్డ్, బాదం సరోజాదేవి స్మారక పురస్కారం, కొలకలూరి విశ్రాంతమ్మ పురస్కారం, ఇలా చాలా వచ్చాయి. నా నాటకాలకు కూడా అనేక బహుమతులు వచ్చాయి. అన్నీ కౌంటింగ్ కష్టం.

కొలకలూరి విశ్రాంతమ్మ పురస్కారం అందుకున్న సందర్భం

 

ప్రశంసాపత్రాలు

***

డా. కె.ఎల్.వి. ప్రసాద్: ధన్యవాదాలు విజయలక్ష్మి గారు.

అత్తలూరి విజయలక్ష్మి: సంచిక టీమ్ వారికీ, మీకూ నా కృతజ్ఞతలు ప్రసాద్ గారూ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here