సంభాషణం: శ్రీమతి నాగజ్యోతి శేఖర్ అంతరంగ ఆవిష్కరణ

102
8

[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం వర్థమాన కవయిత్రి శ్రీమతి నాగజ్యోతి శేఖర్ గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]

కమ్మని కవిత్వానికి చిరునామా… కాకినాడ కవయిత్రి శ్రీమతి నాగజ్యోతి శేఖర్

కవయిత్రి/రచయిత్రి శ్రీమతి నాగజ్యోతి శేఖర్ (కాకినాడ)

[dropcap]మ[/dropcap]నసు లోనికి రావాలే కానీ, దాన్ని సాధించే వరకూ నిద్రపట్టదు కొందరికి. అలాంటి వాటిలో సాహిత్యము అందులో మళ్లీ కవిత్వాన్ని కూడా చెప్పుకొవచ్చు. సమాజంలో ఎదురయ్యే సమస్యలకు స్పందించగలిగితే్, ఆ ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది. కవికి ఉండవలసిన సహజ లక్షణం కూడా అది. కొందరి విషయంలో ఇది జన్యుప్రధానమైనది, మరికొందరిలో, ఇది ప్రత్యేక కృషి ద్వారా అబ్బేది. సాహిత్య వాతావరణం అందుబాటులో లేకున్నా, కుటుంబంలో తగినంత ప్రోత్సాహం లేకున్నా, రాయాలన్న వారిని ఎవరూ ఆపలేరు. సాహిత్యానికీ, కవిత్వానికీ ఉన్న శక్తి అలాంటిది.

ఈ మధ్యకాలంలో చిక్కని కవిత్వంతో, చక్కని కవితలను వివిద పత్రికల ద్వారా పాఠకలోకానికి అందిస్తున్న వర్థమాన కవయిత్రి కాకినాడకు (తూ.గో.జి) చెందిన శ్రీమతి నాగజ్యోతి శేఖర్ దొండపాటి. రెండు పి.జి. డిగ్రీలు ఆస్తిగా పొందిన ఈ రచయిత్రి వృతిరీత్యా ఉపాధ్యాయురాలు. కథ, కవిత్వం సమానస్థాయిలో రాయగల సమర్థురాలు. ఏదో.. కాలక్షేపానికి అన్నట్టు కాకుండా, చదవడంలోనూ, రాయడంలోనూ ఒక తపన, సీరియస్‌నెస్ వున్న కవయిత్రి శ్రీమతి నాగజ్యోతి.

భర్త శేఖరబాబు కూడా ఉపాధ్యాయుడు మాత్రమే కాకుండా, శ్రీమతి జ్యోతి రచనా వ్యాసంగానికి మంచి ప్రోత్సాహకుడు కూడా! ఈ మద్యనే ఒక కవితాసంపుటిని ఆవిష్కరింప జేసుకున్న ఈ కవయిత్రి, తన సాహితీ ప్రస్థాన గమనం గురించి వారి మాటల్లోనే చదువుదాం.

~

ప్ర: జ్యోతి గారూ… సంచిక అంతర్జాల పత్రిక పక్షాన మీకు స్వాగతం.

జ: నమస్తే డాక్టర్ గారు. సంచిక పత్రిక వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా మీ వంటి సాహితీ పెద్దలతో ముఖాముఖి ఒక ఎడ్యుకేషన్ నాకు.

ప్ర: కవయిత్రిగా, కథారచయిత్రిగా మీకు అనుభవం ఉన్నప్పటికీ, కవయిత్రిగా మీ గురించి సాహితీ లోకంలో బాగా వినపడుతోంది. మీ రచనా వ్యాసంగం, ఎప్పుడు, ఎలా మొదలయింది?

జ: నేను కథలూ, కవితలూ రాసినప్పటికీ కథలు సంఖ్యాపరంగా తక్కువ అవ్వడం, కవితలు విరివిగా వివిధ పత్రికల్లో అచ్చు అవ్వడం వల్ల కావొచ్చు నన్ను కవయిత్రిగానే అందరూ గుర్తిస్తూ ఉండొచ్చు అని నా భావన. అయితే గమ్మత్తేమిటంటే నేను ముందుగా రాసింది కథలే. పత్రికల్లో ప్రచురితం అయ్యింది కూడా కథనే.

ముందు నుండీ పుస్తక పఠనం అలవాటు బాగా ఉండడంతో చదవగా చదవగా రాయాలనిపించి పాఠశాలస్థాయి లోనే కథలు, కవితలు రాయడం మొదలు పెట్టడం జరిగింది.

నేను టీచర్ ట్రైనింగ్ కాలేజీలో చదుతున్నపుడు దేవీ భాగవతం రాసిన శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు అధ్యక్షతన ఒక కవిసమ్మేళనం, పోటీ జరిగాయి. ఎందరో దిగ్గజ కవులు పాల్గొన్నారు దానిలో నేనే అత్యంత పిన్న వయస్కురాలిని. నాకు బహుమతి రాలేదు. కానీ నేను చదివిన కవితను విన్న రామబ్రహ్మం గారు ప్రత్యేకంగా వేదిక పైకి పిలిచి ‘ఈ అమ్మాయి కవిత్వం నాకెంతో నచ్చింది. నేను వ్యక్తిగతంగా ఈమెకు బహుమతి ఇస్తున్నాను’ అని అప్పటికప్పుడు నగదు బహుమతి ఇచ్చారు. అది నాలో ఎంతో స్ఫూర్తిని నింపింది. నా అక్షరాలపై నాకెంతో నమ్మకాన్ని ఇచ్చింది.

కళాశాల స్థాయిలో  2000  సంవత్సరంలో నేను ‘ఆంధ్రభూమి’లో ఒక పోటీ కొరకు రాసిన నా మొదటి కథ ‘మెరుపు తీగ’ సాధారణ ప్రచురణకు సెలక్ట్ అయ్యి తొలిసారిగా అచ్చుఅయ్యింది. మొదటి విద్యావ్యాసం కూడా ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితం అయ్యి కాలేజీలో నాకో ప్రత్యేకతను తెచ్చి పెట్టింది. అప్పటి నుండి స్నేహితుల అధ్యాపకుల ప్రోత్సహంతో పత్రికలకు కథలు, కవితలూ రాయడం కొనసాగించాను అండీ. పుస్తకాలు ఇచ్చే అనిర్వచనీయమైన అనుభూతి, రాయడం ద్వారా లభించే అమితమైన తృప్తి నన్ను ఈ సాహితీ లోకంలో పయనింప చేస్తున్నాయి. ఆయా స్థాయిల్లో నన్ను మార్గనిర్దేశం చేసే సాహితీ పెద్దలు లభించడం మరో ముఖ్య కారణం.

ఒక సాహిత్య కార్యక్రమంలో రచయితతో కవయిత్రి జ్యోతి (హన్మకొండ

ప్ర: కవయిత్రిగా మీకు గుర్తింపు రావడానికి వెనుకగల నేపథ్యం వివరించండి.

జ: నేను కవయిత్రిగా మారడానికి ముఖ్య కారణం నా అతి సామాన్య నేపథ్యమే. సజీవమైన సంఘటనల్ని చుట్టూ నిత్యం చూడడం, వివిధ స్థాయి భావోద్వేగాలను అనుక్షణం అనుభూతి చెందడం సమాజం పట్ల, చైతన్యం పట్లా నాకో భావావేశాన్ని కలిగించాయి.

ఆ నేపథ్యంలో నేను రాసిన పుస్తెల తాడు కవిత గానీ నాన్న పడక కుర్చీ కవిత గానీ పలువురు మన్ననలు పొందాయి. వాటితో పాటు బహుమతులు కూడా. నా అభివ్యక్తే నా బలం అదే నా గుర్తింపు అని నేను భావిస్తున్నాను.

రచయిత, విమర్శకుడు, సాహిత్యాభిలాషి ఆకాశవాణిలో(విశాఖపట్నం) పూర్వ అనౌన్సర్ డాక్టర్. మధుసూదన్. కానేటి గారితో కవయిత్రి శ్రీమతి నాగజ్యోతి.

ప్ర: తెలుగు కవితలోకంలో మీకు ఇష్టమయిన కవుల గురించి వివరించండి. వీరిలో ఎవరి ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంది?

జ: నాకు ఒక్కో వాదం నుండీ ఒక్కో కవి ఇష్టం. అందరూ నన్ను ప్రభావితం చేసినవారే. అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే భావ కవిత్వంలో కృష్ణశాస్త్రి గారి ఊర్వశితో ఊసులాడాను, అనుభూతి కవిత్వంలో తిలక్ వెన్నెల్లో ఆడపిల్లలతో నేనూ ఆటలాడాను. అభ్యుదయ కవిత్వంలో శ్రీశ్రీ జగన్నాధ రథచక్రాల వెంట నేనూ పరుగులు తీసాను, స్త్రీవాద కవిత్వంలో వోల్గా గారి  కవితల్లో అసలైన స్త్రీని నేనూ దర్శించాను. దళిత వాద కవుల్లో ఎండ్లూరి సుధాకర్ గారి ఆత్మను నేనూ ఆవాహన చేసుకున్నాను. గుర్రం జాషువా గారి విశ్వ నరునితో నేనూ కరచాలనం చేసాను. వివిధ బాణీల్లో వారి వారి ఆత్మలను వ్యక్తీకరించిన ఈ కవులంతా నాకు ఇష్టమైన కవులే. అయితే అత్యంత ప్రభావం నాపై చూపేది మాత్రం గుంటూరు శేషేంద్ర శర్మ గారు. వారి అద్భుత భావజాలంలో వోలలాడని వారు బహుశా ఈ ఆధునిక కాలంలో ఎవరూ ఉండరేమో. వారి ఆధునిక మహాభారతం ఎన్నిసార్లు చదివి ఉంటానో లెక్కలేదు. వారి ప్రతి అక్షరం మనల్ని వెంటాడుతోంది. అద్భుతమైన భావోద్వేగ జలపాతమై ముంచెత్తుతుంది. గుండెలోతుల్లోంచి వచ్చిన  వారి గొప్ప డిక్షన్, దాని వెనుక బలమైన నేపథ్యం మరో వెయ్యేళ్ళయినా నిత్య నూతనంగానే ఉంటుంది. బహుశా చాలా మంది కవులు వారి మాయాజాలంలో చిక్కిన వారే. అయితే ప్రభావపు ఛాయ మాత్రమే వారిది ఉంటుంది నాపై నా కవిత్వపు స్వరం నాదే. వాణి బాణీ నాదైన పంథాలోనే సాగుతుంది.

ప్ర: ప్రాచీనకవిత్వం – ఆధునిక కవిత్వం గురించి మీ అభిప్రాయం ఏమిటి? నేటి ఆధునిక కవులు ప్రాచీన కవిత్వం చదవవలసిన అవసరం ఉందా? ఎందుచేత?

జ: ప్రాచీనత్వం లేనిదే ఆధునికత లేదు. నూతనంగా పుట్టిందేదైనా ఇంతకు మునుపున్న దాని నుండే పుట్టాలి. ప్రాచీన కవిత్వం ఒక పునాది. ప్రాక్ నన్నయ్య కాలం నుండి క్షీణ యుగానికి చేరి ఆధునిక కాలానికి చేరే వరకూ మనకో అద్భుతమైన రసాస్వాదన కలిగించినవి ప్రాచీన కావ్యాలే. ఆనాటి మేటి రచనలు నేటికీ మన్ననలు పొందడం మన తెలుగు భాషా సౌందర్యం, బలమైన సాహిత్య విలువలే నిదర్శనం.

కొందరి నుండి అందరికీ సాహిత్యం చేరువవ్వాలనే మార్పుకు రూపం వ్యావహారిక భాషా వాదాన్ని తెర మీదికి తేవచ్చు కాక అయితే ప్రాచీన కవిత్వ విశిష్టత ఎప్పటికీ చెక్కు చెందరదు. ఇప్పుడు ఆధునిక యుగకర్తలుగ ఉన్న శ్రీశ్రీ వంటి వారు ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేసిన వారే. భావ వాదానికి సాంఘిక న్యాయాన్ని చేర్చి సామాన్యుని భాషలో రచనలు చేసిన కందుకూరి, గురజాడ నవీన శకానికి తెరలేపారు.

ఆధునిక కవులు అతర్ముఖులు. నర్మగర్భంగా విషయాన్ని వెలువరిస్తారు. అయితే ఆధునిక సాహిత్యం బలపరిచిన వచన, భావ, అనుభూతి, అభ్యుదయ, విప్లవ, దిగంబర, దళిత, స్త్రీ వాద కవిత్వాలతో పాటు ఇస్మాయిల్ హైకూల వరకూ మార్పు చెందిన ప్రాచీన సాహిత్యపు వారసత్వ రూపాలని భావిస్తాను. ఆధునిక కవిత్వం ఎంత స్వేచ్ఛగా రాసినా ప్రాచీన కవిత్వాన్ని అధ్యయనం చేయడం వల్ల భాషపై పట్టు, భాషలోని సౌందర్యం, ఆస్వాదించే మనస్సు పట్టు పడతాయి అని నమ్ముతాను. ఇప్పుడు ఆధునిక కవిత్వంలో నానీలు, మినీలు, హైకూలు, మొగ్గలు, మణిపూసలు, గజల్స్ మొదలైన చాలా ప్రక్రియలు భావాలు వెలువరించే స్వేచ్ఛను ఇస్తూనే ప్రాచీన కాలం నాటి భాషా, అక్షర నియమాల్ని చిన్నగా తీసుకొస్తున్నట్టే అనిపిస్తుంది. వచన కవిత్వం స్వేచ్ఛా ధారకు ప్రతీక. భాష ఎంత గతిశీలకమైనదో సాహిత్యామూ దాని వెంటే కదా మరి. ఆధునిక యుగంలో నవ్య భావనల్ని వెలువరించేందుకు సమాజాన్ని చదవడంతో పాటు ప్రాచీన కవిత్వం చదవ వలసిన అవసరం ఎంతైనా ఉంది. సాహితీ పథంలో పయనించే వారికి  ప్రాచీన సాహిత్యం దిక్సూచి తప్పక అవుతుంది.

కుమార్తె బేబి చైత్ర వర్జిత భర్త రాజశేఖర్ బాబు తో కవయిత్రి జ్యోతి.

ప్ర: మీ కవిత్వంలో మీరు వాడే పదజాలం ఇతర కవులకు బిన్నంగా ఉంటుందని వినపడుతుంటుంది. ఇది మీకు ఎలా సాధ్యమయింది?

జ: నా కవిత్వం పరిచయం ఉన్న స్నేహితులు, సన్నిహితులూ నాలో భావుకత ఎక్కువ అని భాషా సౌందర్యం పట్ల ఇష్టం ఎక్కువని అంటూ ఉంటారు. నిజమే నాకు భాషా సౌందర్యం అంటే ఇష్టం. ఆంగ్ల సాహిత్యం డిగ్రీ, పీజీ స్థాయిల్లో చదువుకొని ఉండడం వల్ల రొమాంటిసిసంకు ప్రభావవంతం అవడంవల్ల మెటఫర్స్, సిమిలీస్, పద చిత్రాలూ ఎక్కువగా నా కవితల్లో దొర్లుతుంటాయి.

కీట్స్, షెల్లీలను, విలియం వర్డ్స్‌వర్త్‌ని అత్యద్భుతంగా పరిచయం చేసిన మా ఆంగ్ల అధ్యాపకులు శ్రీ కృష్ణారావు గారు, తెలుగు భావ, అనుభూతి, అభ్యుదయ కవిత్వాన్ని అద్భుతంగా విశదీకరించి సాహిత్యం, భాష పట్ల ఇష్టాన్ని పెంచిన శ్రీమతి రాధా మేడం గార్ల శిష్యురాల్ని అవ్వడం వల్ల కావొచ్చు నాకు కొంత  భిన్నమైన పదజాలం అలవడింది. అది సాహితీ లోకానికి నచ్చింది అది నా అదృష్టం.

ప్ర: ఈరోజున ఫేస్‌బుక్ లో రకరకాల సాహితీ ప్రక్రియల కోసం అనేక గ్రూపులను మనం చూస్తున్నాం. వీటివల్ల సాహిత్యపరంగా ఎవరికి ఎలా ప్రయోజనం కలుగుతుంది? మీరేమైనా వీటివల్ల ప్రయోజనం పొందారా? ఎలా?

జ: వేదికేదైనా సాహిత్యాన్ని పదుగురికి పంచి, అత్యంత చేరువలోనికి తెచ్చి పూర్వ, వర్ధమాన కవిత్వాన్ని, రచనల్ని అధ్యయనం చేసే అవకాశం కల్పిస్తున్న సాంకేతికను మెచ్చుకొనే తీరాలి. చరిత్రను సాహిత్యాన్నీ విడదీయలేనప్పటికీ నేటి యువతకి సాహిత్యం, పుస్తక పఠనం చాలా దూరం అయ్యాయనే చెప్పాలి. ఆ దశలో ఈ ఫేస్‌బుక్ వంటి వేదికలో సాహిత్యాన్ని విరివిగా పండించే అవకాశం రావడం ఒక విధంగా మంచి పరిణామమే. ఎందరో మరుగున పడ్డవారు తమ హృదయాలను స్వేచ్ఛగా విప్పి కవన సంగీతం వినిపిస్తున్నారు. నాణ్యమైన రాగమేదో వినే చెవి గ్రహించక పోదు. పాఠక హృదయం సమర్థవంతమైన రచనకు ఎప్పుడూ పట్టం కడుతుంది. నా వరకూ నేను ఫేస్‌బుక్‍లో ఈ రకమైన సాహితీ గ్రూపుల్లో లేను కానీ వాట్సప్ వేదికగా నాలోని కవిత్వాన్ని నేను ఇతరులతో పంచుకోవడంతో పాటు ఇతరుల కవిత్వాన్ని అధ్యయనం చేసే అవకాశం లభించింది. సద్విమర్శల ద్వారా నన్ను నేను మెరుగు పర్చుకోవడం జరిగింది. సమర్థవంతమైన రచనలు చేయాలనే స్ఫూర్తి లభించింది. ఎండ్లూరి గోపీ గారు, వనపట్ల సుబ్బయ్య గారు, శిఖామణి గారు వంటి వారి తాజా కవితల్ని చదివే అవకాశం లభించింది. మన కవిత్వాన్ని ఫేస్‌బుక్‌లో ఉంచడం వల్ల విమర్శకులు, పేరొందిన రచయితలూ చదివే అవకాశం విరివిగా ఉంది. కవి సంగమం వంటి సమూహాలు ఎంతో మంది మంచి కవుల్ని అందించాయి. నా కవిత్వం  శ్రీ బొల్లోజు బాబా, శ్రీ రజా హుస్సేన్ వంటి వారి విశ్లేషణకు నోచుకుంది ఫేస్‌బుక్ లోనే. ఎవరు ఎన్ని విధాలుగా యత్నించిన అంతిమ లక్ష్యం సాహిత్యాన్ని ప్రజకు చేరువ చేయడమే. ఆ ప్రయోజనాన్ని  నేటి ఆధునిక సాంకేతికత తన వంతు ప్రయత్నం తను చేస్తున్నది ఈ ఫేస్‌బుక్‍ల రూపంలో.

ఆకాశవాణిలో కవిత్వం చదువుతూ కవయిత్రి జ్యోతి (విశాఖపట్నం)

ప్ర: కవిసమ్మేళనాల కోసం కొన్ని గ్రూపులు మనం చూస్తున్నాం. వీటివల్ల ఎవరికి ప్రయోజనం వుంటుంది? ఎలా?

జ: కవి అంటే కష్ట జీవికి ముందూ వెనుకా ఉండేవాడు. అతను సమాజం తరుపున తన స్వరాన్ని వినిపించేది కవి సమ్మేళనాల్లోనే. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక అయితే ఆ మేధో మెదళ్లన్నీ కలిసి భిన్న భావోద్వేగాల్ని వ్యక్తపరిచేది కవి సమ్మేళనాల్లోనే. విరివిగా కవి సమ్మేళనాలు జరగ వలసిన అవసరము ఎంతైనా ఉన్న కాలమిది. సాహిత్య స్వరం వినిపిస్తూ ఉంటేనే సమాజంలో చైతన్యం. అయితే సమర్థవంతంగా వీటిని నిర్వహించేవారు కావాలి. నాణ్యమైన కవిత్వాన్ని మరింత నాణ్యమైన వాతావరణంలో నడిపే సామర్థ్యం కావాలి. అప్పుడే ఏ సమూహాన్ని ఏర్పరిచినా ప్రయోజనం ఉంటుంది. ముందే చెప్పుకున్నట్టు సాహిత్యం జనాల్ని చేరేందుకు నిస్వార్థంగా, నిర్దేశిత ప్రణాళికతో ముందుకు సాగే ఏ ప్రక్రియనైనా మనం స్వాగతించాల్సిందే.

కవయిత్రి చదివిన జి.బి.ఆర్.కళాశాలలో కవయిత్రిగా గౌరవ సన్మానం.

ప్ర: యువతను తెలుగు సాహిత్యం వైపు మళ్లించి తెలుగుభాష పట్ల మక్కువ కలిగించాలంటే ఏమి చేస్తే బావుంటుందని మీరు భావిస్తున్నారు?

జ: ముందుగా బాల్యం నుండే పిల్లలకు పఠనంపై ఆసక్తి కల్పించాలి. ఇందుకు ముందుగా మారాల్సింది మనమే. మన చేతిలో పుస్తకం చూస్తేనే మన పిల్లవాడు మనతో చేరి నాలుగు వాక్యాలైనా చదువుతాడు. వాడి భావలోకంలోకి మనమూ వెళ్లిపోవాలి, వాడి బాల్యంలోకి మనమూ పయనించగలగాలి. ప్రకృతికి దగ్గరగా పెంచాలి. చిన్న చిన్న స్పందనల్ని అక్షరాలుగా మార్చి మనం అందించగలిగితే వాడో వాక్యమై ఏదో రోజు మన నట్టింట్లో మొలుస్తాడు. నేటి యువత నిజంగా చాలా చురుకైన వారు నాటి తరం కన్నా అన్ని విషయాల పట్లా అవగాహన ఎక్కువే ఉన్న వారు. ఇల్లూ, పాఠశాల స్థాయి నుండి వారికి ఏడాదికో మంచి పుస్తకాన్నైనా పరిచయం చేస్తూ పోతే వారికి సాహిత్యం పట్ల ఇష్టం పెరగొచ్చు. నేడు ఆడియో బుక్స్ కూడా విరివిగా లభిస్తున్నాయి. వాటిని పరిచయం చేయడం మంచి ప్రయోజన్నానే చేకూరుస్తుంది. ముఖ్యంగా ఈ-గ్రంథాలయాల్ని వినియోగించడం నేర్పాలి. ప్రతిలిపి వంటి ఆప్స్ యూత్‌ను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. వారికి మార్గం చూపిస్తే చాలు నేటి తరం దేని పట్ల మక్కువ పెంచుకోవాలన్నా వారికి సాధ్యమే. అన్ని అవకాశాలు కూడా వారి చుట్టూ నేడు అంతర్జాలం రూపంలో లభిస్తున్నాయి.

ప్ర: మీ రచనలు ఏమైనా పుస్తక రూపంలో వచ్చాయా?వివరించండి?

జ: అవును డాక్టర్ గారు ఈ 2021 డిసెంబర్‌లో నా తొలి కవితా సంపుటి ‘రెప్పవాల్చని స్వప్నం’ను తీసుకు రావడం జరిగింది. కీ.శే. శ్రీ అదృష్ట దీపక్ గారు చివరిగా ముందుమాట రాసిన పుస్తకం నాదే కావడం అదృష్ట, దురదృష్టాల సమ్మేళనం. సుమారు 20 ఏళ్లుగా కవిత్వం రాస్తున్నా పుస్తకం వేయడానికి సాహసించలేదు. శ్రీ కానేటి మధుసూదన్ గారు వంటి కొందరు పెద్దల నిర్దేశనంతో చివరికి నా అక్షరాలను అచ్చులోనికి తీసుకు వచ్చాను. నా ఈ పుస్తకం రావడానికి సహకరించిన వారందరికీ ఈ వేదిక మీదుగా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను.

కవయిత్రి జ్యోతి మొదటి కవితా సంపుటి రెప్పవాల్చని స్వప్నం

 

కవయిత్రి కవితాసంపుటి రెప్పవాల్చని స్వప్నం.. ఆవిష్కరణ (కాకినాడ)

ప్ర: మీరు, మీ వృత్తిని-ప్రవృత్తిని సమాన స్థాయిలో ఎలా కొనసాగించగలుగుతున్నారు? మీ రచనా వ్యాసంగానికి మీ కుటుంబ పరంగా మీకు ఎలాంటి ప్రొత్సాహం లభిస్తుంది?

జ: నేను వృత్తిపరంగా ఉపాధ్యాయురాల్ని కావడం వల్ల నా నిత్య సావాసం పుస్తకాల తోటే. పాఠ్య పుస్తకాలతో పాటు బడి గ్రంథాలయంలో ఎన్నో పుస్తకాలు చదివే అవకాశం, వాటిని పిల్లలకు వివరించే అవసరం, ఇష్టం ఉండడం వల్ల నా ప్రవృత్తి రచనా వ్యాసాంగం నాకు అదనపు భారం కాలేదు. వృత్తి, ప్రవృత్తి మధ్య అవినాభావ సంబంధం ఉండడం నా అదృష్టం. అందువల్లే సమాన స్థాయిలో వాటిని నిర్వర్తించ గలుగుతున్నాను.

రేపటి కవయిత్రి బేబి చైత్ర వర్జిత.

మనమేదైనా సాధిస్తే సంతోషించే వాళ్ళు, దాన్ని కొనసాగించమని ప్రోత్సహించేవాళ్ళూ ప్రతి ఒక్కరికీ కావాలి. ఆ ప్రోత్సహం మొదటిగా కుటుంబం కావాలి. అప్పుడే ఏ నైపుణ్యమైనా నలు వీధుల్లో విజయ పతాకం ఎగురవేస్తుంది.

నా రచనావ్యాసాంగం పెళ్లికి ముందు నుంచీ ఉన్నప్పటికీ పుంజుకుంది మాత్రం శ్రీ రాజశేఖర్ గారితో వివాహం తరువాతే. వారి పూర్తి సహకారంతోనే నేడు నేనో పుస్తకం అవ్వగలిగాను. సాహితీ పరంగా నేనే విజయం సాధించినా నాకన్నా ఎక్కువ ఆనంద పడేది తనే. కుటుంబ సహకారంతోనే నేనీ నాడు మీ ముందున్నాను.

రచయితకు ప్రియ మిత్రులు “రెప్పవాల్చని స్వప్నం ” కు ముందుమాట (అదే ఆయన ఆఖరు మాట అయినది) రాసిన,కవి,విమర్శకులు,సినీగేయ రచయిత శ్రీ అదృష్ట దీపక్.

ప్ర: సాహిత్యపరంగా మీ అవార్డులు, బహుమతుల గురించి చెప్పండి.

జ: ఇప్పటి వరకూ ప్రత్యేకంగా ఏ అవార్డులూ అందుకోలేదు. అయితే బహుమతులు పొందాను.

  • తానా 2020 ఫోటోగ్రఫీ కవితల పోటీలో బహుమతి
  • నాటా 2020 కవితల పోటీలో బహుమతి
  • తెలంగాణ అటవీశాఖ వారి ఓజోన్ కవితల పోటీల్లో ప్రథమ బహుమతి
  • తెలుగు జ్యోతి 2021 కథల పోటీల్లో తృతీయ బహుమతి
  • సహరీ వారి కవితల పోటీలో ప్రత్యేక బహుమతి
  • 2005లో రామచంద్రాపురంలో అదృష్ట దీపక్ గారు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన కవితల పోటీల్లో జిల్లా ద్వితీయ బహుమతి.
  • తెలుగు భాషా సంఘం,అనపర్తి వారి జిల్లా స్థాయి కవితల పోటీలో ప్రథమ బహుమతి
  • భిలాయి వాణి కవితల పోటీలో ప్రత్యేక బహుమతి
  • 2020 ఈనాడు కరోనా కదనం రెండు తెలుగురాష్ట్రాల్లో నిర్వహించిన కవితల పోటీలో ప్రథమ బహుమతి.
  • సేవ వారు నిర్వహించిన నిర్విరామ కవిసమ్మేళనంలో పాల్గొని ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో చోటు చేసుకోవడం జరిగింది.

అయితే అత్యంత విలువైన బహుమతి ఆకాశవాణి విశాఖపట్నం వారు నా కవితల్ని, కథల్ని ప్రసారం చేయడం.ఇది నా జీవితకాల వాంఛ. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.

ప్ర: కొత్తగా కవిత్వం రాసేవారికి మీరిచ్చే సలహా?

జ: సలహా ఇచ్చేయంత అర్హత నాకుంది అని నేను అనుకోవడం లేదు. అడిగారు కాబట్టి కొత్తగా రాసే వారికి భాష పట్ల పట్టు ఉండాలి. విషయావగాహన అత్యంత ఆవశ్యకం. మనం చెప్పాలనుకున్న విషయం పట్ల స్పష్టత, బలంగా చెప్పగలిగే భాషా, పదజాలం చాలా ముఖ్యం. ఇది అధ్యయనం వల్లే వస్తుంది అని నమ్ముతాను. నిరంతర సాహితీ విద్యార్థిగా ఉన్న వారే దానిలో మాస్టర్స్ సాధించగలరు. అలాగే కవిత్వం లోని సెన్సిబిలిటీనీ ఆస్వాదించగలిగే గుణం ఉండాలి. అప్పుడే మన అక్షరాలు ఎదుటి వారిలో ఆలోచనల్ని రేపగలవు. ఆ భావ సంద్రంలో ముంచగలవు.

ప్ర: సంచిక పాఠకులకు చక్కని సమాచారం అందించారు, ధన్యవాదాలు జ్యోతి గారూ.

జ: ఇంత విలువైన సమయాన్ని ఇచ్చి నా మనస్సులోని భావాలను పంచుకొనే అవకాశం కల్పించిన డాక్టర్ గారు మీకు, సంచికకు ప్రత్యేక ధన్యవాదాలు 🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here