సంభాషణం: నవలా శిరోమణి శ్రీమతి పెబ్బిలి హైమావతి అంతరంగ ఆవిష్కరణ

48
8

[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం నవలా శిరోమణి శ్రీమతి పెబ్బిలి హైమావతి గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]

రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి, విశాఖపట్నం

[dropcap]మ[/dropcap]న తెలుగు సాహితీ ప్రపంచంలో, నవలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒకానొక కాలంలో కేవలం రచయిత్రులు మాత్రమే నవలాకారులుగా ఒక వెలుగు వెలిగారు. రచనా వ్యాసంగాన్ని వృత్తిగా తీసుకుని కృషి చేసిన మహిళామణులు కొందరైతే, ప్రవృత్తిగా తీసుకుని సమయం చిక్కినప్పుడల్లా తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన గృహిణులు మరికొందరు. డా. సి. హెచ్. సుశీల గారిలాంటి అతికొద్దిమంది సమీక్ష/విమర్శకు సంబంధించిన వ్యాసాలు రాస్తున్నప్పటికీ, ఎక్కువమంది మహిళలు, కథ/నవలలకు అధిక ప్రాధాన్యత నిచ్చి ముందుకు సాగుతున్నారు. స్త్రీలు గృహిణులు అయినా, ఉద్యోగినులు అయినా వారికి విశ్రాంతి సమయం దొరికేది అతి తక్కువే అని చెప్పాలి. ఆ కొద్దీ సమయాన్నీ రచనా వ్యాసంగం కోసం త్యాగం చేయగలగడం మామూలు విషయం కాదు! అలాంటి మహిళామణుల్లో, విశాఖకు చెందిన నవలా రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమావతి గారు ముందు వరుసలో ఉంటారు. రెండు పదులకు పైగా నవలలు రాసిన హైమావతి గారు తమ రచనా వ్యాసంగ విశేషాలు మనకోసం ఇలా అందించారు, ఆస్వాదించండి మరి!

~ ~

1) హైమావతి గారూ.. నమస్కారం! చాలామంది రచయితలూ/రచయిత్రులూ, తమ విద్యార్హతలతో ఎలాంటి సంబంధం లేకుండానే, చక్కని సాహిత్యం అందిస్తున్నారు. ఇంతకీ మీ విద్యాభ్యాసం ఎక్కడ, ఎలా జరిగింది?

జ) నమస్కారం.. డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారూ… డిగ్రీలూ, విద్యార్హతలూ రచనా వ్యాసంగానికి కొలబద్దలు అని నేను అనుకోను. నేను మట్టుకు నా ప్రాథమిక విద్యను మా వీధి బడిలోనే కొనసాగించాను. అంటే తొమ్మిదవ తరగతి వరకూ బాలికోన్నత పాఠశాలలో చదువుకున్నాను. అది 1967 అన్నమాట! ఆ సంవత్సరమే, నాకు వివాహం కూడా అయింది. మా వారు అప్పటికి ఇంకా డిగ్రీ చదూతుండడం వల్ల, మా పెద్దన్నయ్య యెన్నేటి రామారావు గారు తాను జిల్లా పరిషత్ ఇంజనీరుగా పనిచేస్తున్న పార్వతీపురం తీసుకు వెళ్లి, అక్కడి సెయింట్ జోసఫ్ ఆర్. సి. ఎం. బడిలో చేర్చడం జరిగింది. అక్కడే పదోతరగతి, ఎస్.ఎస్.ఎల్.సి పూర్తి చేసాను. అనంతరం, దూర విద్యా విధానం ద్వారా బి. ఏ. (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) పట్టా పొందగలిగాను.

హైమవతి గారి కుటుంబం

2) తెలుగు సాహిత్యం పట్ల మీకు అభిరుచి ఎట్లా ఏర్పడింది? మీ మొదటి రచన ఏ వయసులో, ఏ పత్రికలో వచ్చింది?

జ) చిన్నతనం నుండీ ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండేది. ముఖ్యంగా మా నాన్నగారు సాహిత్య పిపాసి. పురాణాలు మొదలుకొని ప్రతి మంచి పుస్తకం కొని తెచ్చి, కేవలం తాను చదవడమే గాక అందరితో చదివించేవారు నాన్నగారు. దురదృష్టావశాత్తు ఆయన నా ఏడవ ఏటనే స్వర్గస్తులైనారు. మా పెద్దన్నయ్య ఇంటి బాధ్యతతో పాటు సాహిత్య వారసత్వాన్ని కూడా అందుకున్నారు. అన్నయ్య సారథ్యంలోనే ప్రముఖులైన అందరి సాహిత్యమూ చదవగలిగాను. చదివిన అంశాలపై అన్నలు వదినలు, అక్కలు బావలు చర్చలు జరిపేవారు. వారి చర్చలు ఎంతో కుతూహలంగా వినేదాన్ని. అంతమాత్రమే కాకుండా, మా ఇంట్లో పెద్ద గ్రంథాలయం ఉండేది. అలా నాలో సాహితీ బీజం పడింది.

ఉపన్యాసకురాలిగా శ్రీమతి హైమవతి

నా పదునాల్గవ ఏటనే ‘చెదిరిన మనసు’ అనే కథ రాసాను. కానీ అది ఎక్కడా అచ్చుకాలేదు. ఇకపోతే, చదువు పూర్తయ్యాక, అత్తవారిట, పెద్దకోడలిగా కుటుంబ బాధ్యతలు తీసుకోవడం వల్ల నా రచనా వ్యాసంగానికి గండి పడినట్లు అయింది. బాధ్యత తీరేదాకా పదేళ్లు పిల్లలు వద్దనుకున్నాము. అలా 1980లో మాకు బాబు, 1982 లో పాప పుట్టారు. అలాగే 1986లో నా డిగ్రీ పూర్తి చేసాను. నాలో సాహిత్యాభిలాష ఎంత ఉన్నా అప్పుడు కేవలం పఠనం వరకే పరిమితమైనాను తప్ప రచనలు ఏమీ చేయలేక పోయాను.

తర్వాత, మా అమ్మాయి కాకినాడలో మెడిసిన్ చదూతున్నప్పుడు నాకు కొంత వెసులుబాటు చిక్కింది. నా మొదటి కథ ‘ఎందాక ఈ పరుగు?’ ఆంధ్ర భూమి మాస పత్రికలో (2001-మార్చి)లో వచ్చింది. నా మొదటి నవల ‘నాతి చరామి’ అదే మాసపత్రికలో 2001-జులైలో వచ్చింది.

3) మీ రచనా వ్యాసంగానికి ఎవరి ప్రోత్సాహం అయినా ఉందా? మీకై మీరు మొదలు పెట్టారా? దానికి మీ ఇంటి వాతావరణం ఎలా సహకరించింది?

జ) పుట్టింటిలో దీనికి బీజ రూపం పడిందనే చెప్పాలి. అత్తవారింట్లో రచనలు చేసే ఆలోచన చేసేందుకు కూడా తీరని పరిస్థితి! 2000 సంవత్సరం నుండి నేను రచనలు చేయడం ప్రారంభించాను. మా వారి సంపూర్ణ సహకారం ఈ రోజున నన్ను ఒక రచయిత్రిగా మీ ముందు నిలబెట్టింది.

శ్రీ నేరెళ్ల _గరికపాటి గారి సమక్షంలో

4) హైమావతి గారూ, మీరు కథలు, నవలలు కూడా రాస్తున్నారు. వీటిలో ఏ ప్రక్రియ అంటే మీకు ఎక్కువ ఇష్టం? ఎందుచేత? మీ దృష్టిలో అనుభవంలో, సాధారణ పాఠకులు ఏ ప్రక్రియను అమితంగా ఇష్టపడుతున్నారు?

జ) కథ – నవల, రెండూ ఇష్టమే నాకు. రెంటిలో ఏది ఇష్టం అంటే తేల్చి చెప్పలేను. కథలో మనం చెప్పేది సూటిగా, స్పష్టంగా, అనవసరమైన వర్ణనలు లేకుండా వుండే కథలు పాఠకులను బాగా ఆకట్టుకుంటాయి. అలాగే, నవల విషయానికి వస్తే, పాఠకులకు విసుగు కలిగించకుండా, ఉత్కంఠభరితంగా రాయగలగాలి. ఇలా రాయగలిగిన నాడు, ఈ ప్రక్రియ నైనా, పాఠకులు ఇష్టపడతారన్నది నా అభిప్రాయం. అప్పుడప్పుడూ.. పాఠకుల స్పందన ద్వారా ఇది నేను తెలుసుకోగలిగాను.

5) వైవాహిక జీవితాన్ని సజావుగా నడిపిస్తూ, రచనా వ్యాసంగంలో పట్టు సాధించడం మామూలు విషయం కాదు! ఇది మీకు ఎలా సాధ్యపడింది?

జ) ఇది చాలా మంచి ప్రశ్న. నిజంగా చాలా కష్టమైనా పనే! రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణించడం లాంటిదే ఇది! అందుచేతనే, సంసార బంధాలకు బందీని అయిన నేను 1969లో స్కూల్ వదిలేశాక, తిరిగి కలం పట్టింది 2000 సంవత్సరంలోనే! కాకపొతే రాయాలనే నిరంతర తపన బాధ్యతలు తీరాక కార్య రూపం దాల్చింది. ఆ పైన మా వారి పూర్తి సహాయ సహకారాలవల్ల ఈ ప్రయాణం ఇంకా ఇలా ఉత్సాహంగా కొనసాగుతోంది.

హైమావతి గారి నవలలు కొన్ని

6) ఇప్పుడు అధిక ప్రాచుర్యం పొందుతున్న అంతర్జాల పత్రికలపై మీ అభిప్రాయం ఏమిటి? మామూలు పత్రికలు అటు పాఠకులకు, ఇటు రచయితలకు ఎంతవరకూ న్యాయం చేకూర్చగలుగుతున్నాయి?

జ) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మనమందరం స్వాగతించాలిసిందే! ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. ఒకానొకప్పుడు తాటాకు మీద ఘంటంతో రాయబడిన సాహిత్యం (తాళపత్ర గ్రంథాలు) ఈనాడు వింత – వింత పరిణామాలు చోటు చేసుకుని, ఈనాడు ‘కీ బోర్డు’ సహకారంతో మన భావాలను అందరితో పంచుకోగలుగుతున్నాం. కానీ నా లాంటి కొందరికి ఈ రూపంలో చదవడం కొంచెం కష్టమే! పుస్తకం చేతిలోకి తీసుకుని చదివిన తృప్తి అందులో లభించక పోవచ్చు, అది వేరే విషయం అయితే, అదే సమయంలో మరొక సమస్యను కూడా మనం బాగా గమనించ గలుగుతున్నాం. అదేమంటే ఈ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, రక రకాల చానెళ్లలో అందుబాటులోనికి వచ్చిన జీడీపాకం లాంటి సీరియల్స్ వగైరాల వల్ల పుస్తకాలు కొని చదివేవారి సంఖ్య గణనీయంగా పడిపోయిందనే చెప్పాలి. అందుచేత కూడా కొన్ని పత్రికలు మూతపడ్డాయి. సంవత్సర కాలంనుండి తరుముకొస్తున్న ‘కరోనా’ కూడా దీనికి తోడయింది. మిగిలిన ఒకటి రెండు పత్రికలు, తమ ఆధిపత్య ధోరణిలో వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా అనేక అంతర్జాల పత్రికలు వెలుగు చూస్తున్నాయి. మారిపోతున్న పరిస్థితులను బట్టి ఎదురయ్యే మార్పును తప్పక స్వాగతించవలసిందే!

7) మీరు ఇంతవరకూ ఎన్ని నవలలు కథలు రాశారు? సాధారణంగా మీ కథాంశాల నేపథ్యం ఎక్కడినుండి తీసుకుంటారు?

జ) నేను ఇప్పటి వరకూ వివిధ పత్రికలలో, ఇరవై ఏడు నవలలు రాసాను, నూట మూడు వరకు కథలు రాసాను. ఇక నేను తీసుకునే కథాంశాల నేపథ్యం విషయానికొస్తే నా చుట్టూ వున్న మనుష్యులు వారి జీవన సంఘర్షణలు, విన్నవి, వార్తా పత్రికల్లో చదివిన సంఘటనలకు స్పందించడమే ఈ నా రచనా వ్యాసంగానికి కేంద్ర బిందువులైనాయి.

ప్రముఖ రచయిత/నటులు శ్రీ రావి కొండలరావు దంపతులతో శ్రీ &శ్రీ మతి హైమావతి పెబ్బిలి

8) నేటి యువత, తెలుగు భాష పట్ల అంతగా ఆకర్షితులు కాకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? ఈ విషయంలో ఎలాంటి మార్పులు తీసుకు వస్తే మంచి ఫలితాలను సాధించగలుగుతాం?

జ) ఇప్పుడు యువతలో నెలకొన్న ఈ పరిస్థితికి బాధ్యులు ముమ్మాటికీ తల్లిదండ్రులే! తమ పిల్లలు విదేశాలకు వెళ్ళాలి, బాగా డబ్బు సంపాదించాలి అనే ఆలోచనతో, అత్యాశతో, చదువు అంటే కేవలం మెడిసిన్, ఇంజనీరింగ్ తప్ప మరొకటి లేదని, నర్సరీ స్థాయి నుండే, రకరకాల కోచింగ్‌లు ఇచ్చే బడులలో చదివిస్తున్నారు! అందువల్ల ఎవరూ, తెలుగు నేర్చుకోవాలనే ఆసక్తి చూపించడం లేదు. ఆ అవసరం గుర్తించడం లేదు. ఆశ్చర్యం ఏమిటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో తప్ప, అన్ని ఇతర రాష్ట్రాల్లోనూ, మన తెలుగు వాళ్ళు మన భాషా సంస్కృతులు సజావుగా కాపాడుకుంటున్నారు. విదేశాల్లో కూడా వారి స్థాయిలో చక్కని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా అంతకు మించి మన పయనం కొనసాగాలి.

9) పాలనా భాషగా/బోధనా భాషగా తెలుగును మీరు సమర్థిస్తారా? లేదా? ఎందుచేత?

జ) తప్పకుండా సమర్థిస్తాను! కానీ, నేటి విద్యా విధానం అందుకు అనుకూలంగా లేదనే చెప్పాలి. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేశారు. గతంలో మన విద్యార్థులు ఇంత మార్కుల/రేంకుల రేసులో పరిగెత్తలేదు. ఇప్పుడు పరిస్థితి దీనికి భిన్నంగా మారింది. తెలుగు కాకుండా వేరే భాషను చదివితే మార్కులు ఎక్కువ వస్తాయనే భావన, ఇటు తల్లిదండ్రులలోనూ, అటు విద్యార్థుల్లోనూ ప్రబలి తెలుగు పట్ల నిర్లక్ష్య ధోరణి ఏర్పడింది. తెలుగు చదువుకునేవాళ్ళు తగ్గిపోయారు. తెలుగురానివారు పాలనాయంత్రాంగాన్ని తెలుగులో ఎలా నడిపించగలుగుతారు? అక్కడే అసలు సమస్య. కనుక ముందు సంస్కరణలు అనేవి మననుండే ప్రారంభం కావాలి. పరభాషా వ్యామోహంతో పాటు, మాతృ భాష పట్ల కూడా ఆసక్తి మెండుగా పెరిగాలి. అప్పుడే ఇది ఆచరించగలం!

10) తెలుగులో మీకు నచ్చిన కథ/నవలా రచయిత ఎవరు? ఎందుచేత?

జ) అలా తేల్చి చెప్పడం నా మట్టుకు నాకు చాలా కష్టమైన పనే! మంచి కథ రాసిన ప్రతి ఒక్కరూ ఇష్టమే! ఉదాహరణకి కాళీపట్నం రామారావు గారు రాసిన ‘జీవధార’ కథ అంటే నాకు ఇష్టం. అలాగే శ్రీ తిలక్ రాసిన ‘ఊరి చివరి ఇల్లు’ ఇష్టం. చా. సో. గారి ‘ఎందుకు పారేస్తాను నాన్నా?’… ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నెన్నో.

అలాగే, నవలల విషయానికొస్తే అనువాద నవలల్లో నా దృష్టికి వచ్చిన ‘స్వయం సిద్ధ’ నవల ఇష్టం. అలాగే వాసిరెడ్డి సీతాదేవి గారి ‘మట్టి- మనిషి’, మాదిరెడ్డి సులోచన గారి ‘అగ్ని పరీక్ష’ అలాగే,సి. ఆనందారారామం గారి, ‘తపస్వి’, ‘నానృషిః కురుతే కావ్యం..’ ఇలా నవలలు కూడా చాలా ఇష్టం! ముఖ్యంగా ఈ నవలలో జీవితాన్ని సవాలుగా తీసుకుని, పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడి విజయం సాధించిన తీరు నాకు బాగా నచ్చింది. ఏదీ ఆకాశము నుండి ఊడిపడదు, శ్రమించి సాధించాలి అనే నీతి వుంది.

11) ఈనాడు అనేక పత్రికలు, కథ/నవలల పోటీలు ఏదో ఒక సందర్భంగా పెడుతున్నాయి, సంతోషమే! కానీ అలాంటి పోటీల్లో అప్పటికే పేరున్న గొప్ప రచయితలు కూడా పాల్గొంటున్న విషయంలో మీ అభిప్రాయం స్పష్టంగా చెప్పండి.

జ) మంచి ప్రశ్న ఇది. చాలామంది బయటికి వ్యక్తపరచలేక పోతున్న ప్రశ్న కూడా. పేరున్న రచయితలు/రచయిత్రులు, ఇప్పటికే తమ సత్తా చాటుకుని అనేక బహుమతులను, అవార్డులను పొందుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే వారు పోటీ చేసినా, చేయకున్నా, వారి కథలు తప్పక ప్రచురింపబడతాయి. లేత లేత రచయితలకు మార్గదర్శకంగా కూడా ఉంటాయి. గతంలో మాలతీ చందూర్, కె. రామలక్ష్మి, వాసిరెడ్డి సీతాదేవి, రాచకొండ విశ్వనాధ శాస్త్రి, కా. రా. మాస్టారు వంటి పెద్దలు, నాకు వూహ తెలిసాక ఏ పోటీల్లోనూ పాల్గొన లేదు! అయినా, వారు వారి రచనలూ చిరస్మరణీయాలు. అలాగే నాకు తెలిసి, మొండెపు ప్రసాద్ గారు “నాకు వచ్చిన బహుమతులు చాలు, ఇక నేను ఎలాంటి పోటీలలోనూ పాల్గొన్నాను” అన్నారు. అలాంటి అరుదైన రచయితలను నేను ఆదర్శంగా తీసుకుంటాను. నా దృష్టిలోకి రాని ఇలాంటి కొందరు ఇంకా ఉండవచ్చు. నా విషయానికి వస్తే, నేను పెద్దగా బహుమతులు సాధించక పోయినా, ఒక రచయిత్రిగా నాకు తగిన గుర్తింపు వచ్చింది, ఇది చాలు నాకు.

12) మీ సాహితీ పయనంలో మీరు సాధించిన విజయాలు, అవార్డులు/సన్మానాలు గురించి వివరించండి.

జ) ఇప్పటి వరకూ నాకు ఆరు కథలకు రెండు నవలలకు బహుమతులు వచ్చాయి. బలివాడ కాంతారావుగారి సాహితీ పురస్కారం అందుకున్నాను. 2020 జనవరి 5 న అనకాపల్లిలో నేను పుట్టిన చోట చిన్ననాట నేను తిరిగి ఆడి పాడిన చోట! నిర్వాహకులకు ఆ సంగతి తెలియదు. మా పెద్దన్నయ్య మా నాన్నగారి పే‌రున కట్టించిన లైబ్రరీ హాల్‌లో ఆయన విగ్రహం ముందు సన్మానం చేశారు.. నేను సభ జరగక ముందే విషయం చెబితే సభ నిర్వాహకులు ఇమ్మిడిశెట్టి చక్రపాణి గారు ఆశ్చర్యపోయారు.. ఇది నా జీవితంలో మరపురాని మధురానుభూతి.

అలాగే ఇటీవల ప్రియమైన రచయితల సమూహం ఆధ్వర్యంలో ప్రచురించిన ‘జీవితం అందమైనది’ నవల చదివి ప్రముఖ రచయిత విహారిగారు రాసి పంపిన ఉత్తరం నాకు పెద్ద అవార్డులా ఉంది.

అలాగే ‘తిలాపాపం తలా పిడికెడు’ కథ 2005లో నవ్యలో వచ్చినపుడు కారా మాస్టారు చదివి స్వయంగా నాకు ఉత్తరం రాశారు. శ్రీకాకుళంలో జరిగే కథానిలయం వార్షికోత్సవానికి రమ్మని ఆహ్వానించారు. అక్కడికి వెళ్లాక ‘నీవు నవలల కంటే కథల మీద శ్రద్దపెట్టు, నీకు మంచి భవిష్యత్ ఉంద’న్నారు.. వారే నామొదటి కథాసంకలనం ఆవిష్కరించారు. అలాగే కారా మాస్టారు మెచ్చిన ‘తిలాపాపం’ కథ 2014 ఉత్తరాంధ్ర కథాసంకలనంలో గురజాడ, చాసో, కారా మాస్టారు వంటి పెద్దల కథల సరసన చోటు సంపాదించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

‘సాలెగూడు’ కథ ‘మకడ్ జాల్’ పేరుతో హిందీలోకి అనువదించబడింది. ‘సారీ నాన్నా’ కథను అమరికాలో స్కిట్ గామలచి రేడియో వన్ లో ప్రసారం చేశారు.ఇపుడు మార్గదర్శనం, సంకల్పమే నాబలం ప్రసారం చేయబోతున్నారు. మార్గదర్శనం కథని ఇంగ్లీష్ లోకి అనువదించి ఉమన్స్ ఎరాకి పంపాను wing chimes పేరున.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా స్నేహసంధ్య ఆర్గనైజేషన్ నుండి సన్మానం పొందాను.

ముంబై ఆంధ్రమహా సభ వద్ద జరిగిన ఉగాది కవితాగోష్టిలో పాల్గొని సత్కారం పొందాను.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంనుండి 15 కథలు చదివాను. పుస్తకం హస్తభూషణం మాత్రమేనా? చర్చా కార్యక్రమంలో ఆదిమద్యం రమణమ్మ గారు, నందుల సుసీలాదేవిగారు, వాడ్రేవు వీరలక్ష్మీదేవి గార్లతో పాటు నేను కూడా పాల్గొన్నాను. మరపురాని మహిళలు పేరిట వనితావని కార్యక్రమంలో స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రత్రక్షంగా పరోక్షంగా పాల్గొన్నమహిళల గూర్చి మాట్లాడాను.

కథారచనలో నాడూ నేడూ అనే చర్చా కార్యక్రమంలో 2018 జూన్లో పాల్గొన్నాను. విశాఖపట్నం సీనియర్ సిటిజన్స్ఆర్గనైజేషన్ స్నేహసంధ్య నుండి వెలువడిన సంధ్యారాగం బులిటెన్‌కి ఎడిటర్‌గా కొంతకాలం పని చేశాను.

రాయడం కంటే చదవడం ఇష్టం. 8 కథాసంకలనాలలో నా కథలు ఉన్నవి.

ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థి దేవరపు ఈశ్వర రావు వెలుగునీడలు అమృతవాహిని నవలపై పరిశోధన చేసి యం ఫిల్ సాధించాడు. నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి పులి చినబాబు నా కథలపై పి.హెచ్.డి. చేస్తున్నాడు.

** సంతోషం హైమవతి గారూ….చక్కని మీ సాహితీ విజయాలు,సంచిక పాఠకులకు అందించారు. సంచిక పక్షాన మీకు హృదయపూర్వక దన్యవాదాలు

* కృతఙ్ఞతలు.. డా.ప్రసాద్ గారూ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here