40. సంభాషణం – కవయిత్రి, రచయిత్రి శ్రీమతి సునీత గంగవరపు అంతరంగ ఆవిష్కరణ

0
12

[సంచిక కోసం కవయిత్రి, రచయిత్రి శ్రీమతి సునీత గంగవరపు గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]

ప్రేమకవిత్వానికి చిరునామా శ్రీమతి సునీత గంగవరపు:

[dropcap]వృ[/dropcap]త్తిపరంగా ఉపాధ్యాయిని అయినా, ప్రవృత్తిపరంగా మంచి కవయిత్రి, కథా రచయిత్రి శ్రీమతి సునీత గంగవరపు.

వృత్తిపరంగా, కుటుంబపరంగా బాధ్యతలు నిర్వహిస్తూనే, సాహిత్య పిపాసతో, అంతే బాధ్యతగా కథలు, కవిత్వం రాయడం సునీతగారి క్రమశిక్షణకు మంచి సూచికలు.

అంతమాత్రమే కాదు, స్వంత గృహంలో సాహిత్య వాతావరణం కల్పించి, తన ఇద్దరు కుమార్తెలను రేపటి కవయిత్రులుగా తీర్చిదిద్దుతున్న తీరు నిజంగా ప్రశంసనీయం. సామజిక సమస్యలు తన కవిత్వంలో చోటు చేసుకుంటున్నా, తన రచనలలో ‘ప్రేమ కవిత్వం’కు, పెద్దపీట వేస్తున్న ప్రముఖ కవయిత్రి/రచయిత్రి, శ్రీమతి సునీత తన సాహితీప్రస్థానం గురించి ఇంకా ఏమి చెబుతారో చూద్దాం..

~

1.కవయిత్రి సునీత గారికి, సంచిక అంతర్జాల మాసపత్రిక పక్షాన స్వాగతం. నమస్కారం సునీత గారు.

జ: నమస్తే అండీ..

2.మీరు కవిత్వం ఎప్పటినుండి రాస్తున్నారు? మీ మనసు కవిత్వం వైపు మొగ్గిన నేపథ్యం గురించి వివరించండి.

జ: నాకు తెలిసి కవులు పుడతారు. తయారు చేయబడరు. పుట్టుక ద్వారా అబ్బిన సహజమైన సృజన నైపుణ్యాన్ని చుట్టూ లభించే సాహితీ వనరుల ద్వారా మెరుగుపరుచుకుంటారు కవులు.

భర్త పొదిలి కుమార్‌తో రచయిత్రి సునీత

నాకు జ్ఞాపకం తెలిసినప్పటి నుంచి అంటే దాదాపు మూడు నాలుగు తరగతుల్లోనే మిగతా వారికి భిన్నంగా నాలో కొత్త కొత్త ఊహలు, ఆలోచనలు ప్రవహిస్తుండేవి. మా అమ్మ నాన్నలు ఉపాధ్యాయులు. ఐదవ తరగతి వరకు అమ్మ నాన్న స్కూల్ లోనే చదివాను. నాన్న స్కూలుకి చందమామ, బాలచంద్రిక లాంటి కథల పుస్తకాలు తెప్పించేవారు. ముందుగా వాటిని నేనే చదివేదాన్ని. ఆ రకంగా సాహిత్యం పట్ల ఇష్టం ఏర్పడింది. మూడు నాలుగు చదివేటప్పుడే చిన్న చిన్న కథలు, కవితలు రాశాను. అయితే నేను రాసిన ఆ కథలు చదివి ఇంట్లో అందరూ “ఎక్కడ చూసి రాశావు? ఎక్కడ కాపీ కొట్టావు?” అంటూ నవ్వేవాళ్ళు. నేను రాశాను అంటే ఎవరు నమ్మే వాళ్ళు కాదు. పదేళ్ల వయసులోనే అందమైన ప్రకృతిని పువ్వులను చూసి పులకించిపోయేదాన్ని. ఓసారి మా అక్క సుజాత మల్లెపూలు అల్లుతూ ఉండగా ఆమె పక్కనే కూర్చుని పూలను చేతుల్లోకి తీసుకొని “మధురమైన భావనలు విరజిమ్మే మల్లెపూలు” అన్నాను ఆ మాటకు మా అక్క ఎంత నవ్విందో నాకు ఇప్పటికీ జ్ఞాపకమే.

పాఠశాల స్థాయిలో నాకు గుర్తింపు తెచ్చిన ఓ రచన గుర్తు చేస్తాను. నేను 9వ తరగతి చదివేటప్పుడు మా సెక్షన్ విద్యార్థులందరూ పిక్నిక్ కోసం నరసింహస్వామి కొండకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మా క్లాస్ టీచర్ చంద్రమౌళి సార్ గారు. ఆ పిక్నిక్ వెళ్ళినప్పుడు సహ విద్యార్థులందరూ ఉరుకులు పరుగులతో కొండ ఎక్కుతూ, దిగుతూ స్వామిని దర్శించుకొనే పనిలో నిమగ్నమై ఉండగా నేను మాత్రం ఓ చెట్టు కింద చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ కూర్చున్నాను. అదే రోజు రాత్రి ఇంటికి వచ్చాక నేను పొందిన అనుభూతులను అనుభవాలను జోడిస్తూ ఒక వ్యాసం రాశాను. మరుసటి రోజు తరగతి గదిలో నేను పక్కనే ఉన్న నా స్నేహితులకు దానిని చూపించగా వారు మా క్లాస్ టీచర్ అయిన చంద్రమౌళి సార్‌కు చూపించారు. ఆయన దానిని పెద్దగా చదవమని చెప్పారు. నేను దానిని క్లాస్‌లో చదివాను. అదంతా విన్నాక ఆయన “నీకు గొప్ప రచయిత అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మే గాడ్ బ్లెస్ యు” అన్నారు. ఆ మాటలు నాకు ఇప్పటికీ గుర్తు వస్తూనే ఉంటాయి.

3.మీరు కవిత్వపరంగా ఏ కవిని ఇష్టపడతారు? ఎందుచేత?

జ: నేను మొదట చదివిన కవి శ్రీశ్రీ గారు. మహా ప్రస్థానం లోని దేశ చరిత్రలు, ఖడ్గ సృష్టి కవితలు మాకు తొమ్మిదో తరగతి తెలుగు టెక్స్ట్ బుక్‌లో ఉండేవి. అలాగే సినారే ప్రపంచపదులు, జాషువా గారి శిశువు వంటి పాఠాలు నన్ను బాగా ఆకట్టుకొన్నవి. నాకు వారి సాహిత్యం చదివాకే కవిత్వం అంటే ఏమిటో ఎలా ఉండాలో కొద్దికొద్దిగా తెలిసివచ్చింది. శ్రీశ్రీ కవిత్వం పాడుకోవడానికి అనువుగా ఒక లయతో ఉంటుంది కాబట్టి అప్పట్లో అయన కవిత్వం ఇష్టం  చదివేదాన్ని. నిజానికి నేను యావరేజ్ స్టూడెంట్‌ని. కానీ సాహిత్యం పట్ల సహజంగా ఏర్పడిన ఇష్టంతో తెలుగు బుక్ చేతికి రాగానే ముందు పాఠాలన్నీ ఓసారి తిరగేస్తాను. అందులో కొన్ని కవితలు, కథలు మళ్ళీ మళ్ళీ చదువుతాను. కొన్ని కవితలయితే టీచర్ ఆ పాఠం చెప్పడానికి ముందే కంఠత వచ్చేవి. టీచర్ ఆ పాఠం చెబుతూ చదవమన్నప్పుడు నేను చేతులు కట్టుకొని పుస్తకం చూడకుండానే ఆ పాఠాన్ని అప్పచెప్పేదాన్ని. ఏమి చదవకపోయినా తెలుగులో మాత్రం నాకు మిగతా సబ్జెక్ట్స్ కంటే ఎక్కువ మార్కులు వచ్చేవి.

ఇద్దరు కూతుళ్లతో సునీత దంపతులు

దిగంబర కవులు, అభ్యుదయ కవులు రాసే కవితలు ఇష్టం నాకు. అలాగే స్త్రీవాద సాహిత్యంలో ఓల్గా, రంగనాయకమ్మ గారి రచనలు చదువుతుంటాను. జాషువా గారి గబ్బిలం, ఎండ్లూరి సుధాకర్ గారి కొత్త గబ్బిలం కూడా అనేక సార్లు చదివాను.

ఇప్పుడు సాహిత్యం కోసం ప్రత్యేకంగా షాప్‌కు వెళ్లి పుస్తకాలు కొనాల్సిన అవసరం లేదు కదా! చదివే సమయముండాలి కానీ వాట్సాప్‌లో ఫేస్‌బుక్‌లో వివిధ సాహితీ గ్రూపుల్లో అనేకమైన సాహితీ అంశాలు కోకొల్లలుగా వస్తుంటాయి. కావాల్సిందల్లా నేర్చుకోవాలనే ఆసక్తి, కాసింత సమయం మాత్రమే. ఈ మధ్య చదువుతున్న కవిత్వాల్లో చాలా అద్భుతంగా రాసేటువంటి కవులు ఉన్నారు. వారందరి పేర్లను ఇక్కడ ప్రస్తావించడం సాధ్యం కాదు.

4.విద్యార్థి దశలో ఆడపిల్లలు తెలుగు సాహిత్యం పట్ల ఆకర్షితులు కావాలంటే, ఏమి చేస్తే బాగుంటుంది? మీ అనుభవాన్ని జోడించి చెప్పండి.

జ: ఆడపిల్లలైనా, మగ పిల్లలైనా సాహిత్యం పట్ల ఆకర్షితులు కావాలంటే ముందు వారికి సాహిత్యం లోని సౌందర్యం తెలిసి ఉండాలి. స్వభావరీత్యా కవిత్వాన్ని ఆస్వాదించగలిగిన గుణం కూడా కొంత ఉండాలి. అసలు ఏమాత్రం అభిరుచి లేని వారికి కవిత్వాన్ని ఎంత బోధించినా ‘ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు’ అన్నట్లు నేర్పడం వలన ప్రయోజనం ఏమాత్రం ఉండదని నా అభిప్రాయం.

ఉపాధ్యాయురాలిగా బడి పిల్లలతో..

నేను ప్రస్తుతం బాపట్ల జిల్లా లోని ఓ ఉన్నత పాఠశాల లో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. నేను ఎక్కడ పని చేసినా ఆ పాఠశాలలో విద్యార్థులకు సాహిత్యం పట్ల కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటాను. గజల్స్, నానీలు, చిన్న కథలు, కవితలు, లేఖలు వంటి అంశాలపై వివరణ ఇస్తూ రాయిస్తుంటాను. కొద్ది మంది పిల్లలు చాలా చురుగ్గా రాస్తుంటారు. చెప్పినవి ఆసక్తిగా అందుకుంటూ ఎంతో ఉత్సాహం కనపరిచేవారు. ఇంకొంత మంది మాత్రం ఏమాత్రం ఆసక్తి లేకుండా కూర్చొని ఉంటారు. ఇది ప్రతి తరగతిలో ప్రతి బడిలో సహజంగా ఉండేదే. ఇలా సాహిత్యంలో చురుగ్గాను మధ్యస్థంగాను ఉండే విద్యార్థులను గుర్తించి వారి చేత మరింత సాధన చేస్తే తప్పకుండా మంచి ఫలితాలను రాబట్టవచ్చు. అదే విధంగా ఖాళీ సమయాల్లో విద్యార్థులకు మంచి నీతితో కూడిన కథల పుస్తకాలను ఇచ్చి వారి చేత చదివించి మళ్లీ ఆ కథలను తరగతి గదిలో సందర్భానుసారంగా చెప్పిస్తూ.. సాధన చేయించడం ద్వారా కూడా వారిలో సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందించవచ్చును.

5.మంచి కవిత్వము అంటే ఏమిటి? మీ దృష్టిలో మంచికవిత్వం రాయడానికి మార్గదర్శక సూత్రాలు వివరించండి.

జ: కవిత్వంలో చెడ్డ కవిత్వం కూడా ఉంటుందని నేను అనుకోను.

ఒకవేళ ఏదైనా చెడు ఉన్నది అంటే అసలు అది కవిత్వమే కాదని నా అభిప్రాయం. కవిత్వంలో ఖచ్చితంగా ఇలాంటి లక్షణాలు ఉండాలి అని కూడా నేను చెప్పలేను. అలా చెప్పడానికి బహుశా నాకు ఉన్న కవితా పరిజ్ఞానం సరిపోదు.

నా మట్టుకు కవిత్వం ఓ ఆహ్లాదాన్ని పంచాలి. చెట్టు మీద నుంచి సుగందాల పూలు జలజలా రాలినట్లు కవిత్వం ఓ అనుభూతిని మిగిల్చి పోవాలి.

ఓ కవిత చదివాక అందరికీ అన్నివేళల్లో ఓకే అనుభవం ఒకే అనుభూతి మిగలకపోవచ్చు. ఒక రచన అందరికీ ఒకే ప్రయోజనాన్ని కల్పించదు కూడా. కవిత్వం కొందరి ప్రశ్నలకు జవాబు ఇస్తుంది. కవిత్వం కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తుంది. భావ తీవ్రత, క్రమానుగతమైన పదాల పొందిక, భాష మీద పట్టు ఉన్న కవిత్వం ఎల్లప్పుడూ పాఠకుల హృదయాలలో ప్రవహిస్తూనే ఉంటుంది.

6.కొత్తగా కవిత్వం రాసేవాళ్లకు ఎలాంటి కవిత్వ౦ చదవమని మీరు సూచిస్తారు? ఎందుచేత?

జ: అందుబాటులో ఉన్న కవిత్వమంతా చదవాలి. కొందరి కవిత్వం కవిత్వం ఎలా రాయాలో చెబితే మరికొందరి కవిత్వం కవిత్వం ఎలా రాయకూడదో నేర్పిస్తుంది. రాయడంలో కొంత పరిపక్వత వచ్చాక ఆ కవికే అర్థమవుతుంది ఎలాంటి పుస్తకాలు చదవాలో ఎవరి కవిత్వం చదవాలో అని.

7.మీరు కవిత్వ౦ రాయడానికి ఎలాంటి వస్తువుకు ప్రాధాన్యత ఇస్తారు? ఎందుచేత?

జ: నేను ఒకప్పుడు ప్రేమ కవితలు, భావ కవితలు చాలా ఎక్కువగా రాసేదాన్ని. కారణం మిగతా విషయాల పట్ల నాకు అంతగా పరిజ్ఞానం లేకపోవడమే. నా ప్రపంచ పరిధి చాలా చిన్నది. ఇల్లు, పిల్లలు, బడి, సంసారం అనే నాలుగు గోడల మధ్యనే నా ఆలోచనలు పరిభ్రమిస్తూ ఉండేవి. అప్పుడు నా హృదయానికి తెలిసింది, నా మనసు కోరుకున్నది ఒక ప్రేమ మాత్రమే. అందుకే ప్రేమ, అనుభూతి నా కవితా వస్తువులు అయ్యాయి. కానీ ఇప్పుడు నేను సమాజాన్ని చూస్తున్నాను. సమాజంలోని సమస్యలను తెలుసుకుంటున్నాను. కేవలం అనుభూతిని మిగిల్చే కవిత్వమే కాకుండా సమాజానికి ఉపయోగపడే కవిత్వం కూడా రాయాలని తెలుసుకున్నాను. నా కవితల్లో ఎక్కువగా సంఘటనాత్మక కవిత్వం ఉంటుంది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా నా చుట్టూ పరిస్థితులు, వాతావరణం అనుకూలంగా ఉంటే కవిత రూపంలో నేను స్పందిస్తుంటాను. అయితే నేను రాసే సామాజిక అంశాలు ఏవీ ఇంకా పాఠకుల హృదయానికి చేరలేదు. ఒక ప్రేమ కవి గానో, భావ కవి గానో మాత్రమే నేను చాలామందికి తెలుసు. నాలోని విభిన్న కోణాలను కూడా పాఠకులు గుర్తిస్తే బాగుంటుందని నా ఆకాంక్ష.

ఒక సాహిత్య సభలో శ్రీమతి అరుణ గోగులమండ… తదితరులతో కవయిత్రి సునీత

8.కొందరు కవులు/కవయిత్రులు, ‘ప్రేమకవిత్వంమాత్రమే కవిత్వంగా బావించి కవిత్వ౦ రాస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీరేమంటారు?

జ: ప్రేమ నుండి మనిషిని, మనిషి నుండి ప్రేమను వేరు చేసి చూడలేము. అలా చూడకూడదు కూడా. అరిస్టాటిల్ అన్నట్లు మానవుడు సంఘజీవి మాత్రమే కాదు, ప్రేమ జీవి కూడా! మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో.. ప్రేమ కూడా అంతే అవసరం. ప్రేమ అనేది మనిషికి ఆరోగ్యాన్నిచ్చే తీయని పదార్థం. అయితే ఏ పదార్థమైన ఎక్కువగా తింటే శరీరానికి అనారోగ్యం ఎలా కలుగుతుందో ప్రేమ కవిత్వం కూడా మరీ ఎక్కువైయితే పాఠకులకు వెగటు పుడుతుంది. అప్పుడప్పుడు.., అవసరం మేరకు.. మందుటెండలో చిరు జల్లులా, పసిపాప బోసి నవ్వులా.. ప్రేమ కవిత అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే బాగుంటుంది. అయినా ప్రేమను మాత్రం ఎప్పుడూ తప్పు పట్టకూడదు. ప్రేమ అనే పదం ఇచ్చినంత హాయి, ప్రేమను పొందడంలో ఉండే ఆనందం ఈ సృష్టిలో ఇంకేది ఇవ్వదు. (ఎంత వద్దనుకున్నా నేనూ ప్రేమ కవినే మరి..)

మన చుట్టూ మనం దృష్టి పెట్టాల్సిన అంశాలు చాలానే వున్నాయి. ఆర్ధిక, సామజిక అసమానతలు, లింగ వివక్ష, కులమతాల వైరుధ్యాలు, పేదరికం, అంటరానితనం, రాజకీయాల్లో వుండే అనారోగ్యకరమైన వాతావరణం.. ఇలా ఎన్నెన్నో! ఇవన్నీ వస్తువులుగా మారడానికి కవుల కలాల వైపు ఆశగా చూస్తున్నాయి..

9.విద్యాబోధనలో తెలుగుభాష (మాతృభాష) ప్రాదాన్యత గురించి మీరేమంటారు?

జ: మాతృభాష అనేది ఏదైనా కావచ్చు కానీ. మాతృభాష మాధ్యమంగా చెప్పడంలో, అర్థం చేసుకోవడంలో ఉండే సౌలభ్యం ఇంకెందులోనూ దొరకదు. తల్లి ఒడిలో నుంచే విద్యార్థి వింటూ ఉన్న భాష కాబట్టి ఇతర భాషల కంటే మాతృభాషను సులభంగా అర్థం చేసుకోగలడు. అంతే స్పష్టంగా తన అభిప్రాయాలను రాతపూర్వకంగానూ, మాట పూర్వకంగాను వెల్లడించగలడు. నేటి కంప్యూటర్ యుగంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న యువత ఇతర భాషలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఆ క్రమంలో మాతృభాషను మాత్రం నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు.

10.మీ రచనల (ప్రచురించినవి) గురించి చెప్పండి.

జ: కచ్చితంగా చెప్పలేను కానీ నేను కవితలు సుమారుగా 1000 వరకు రాసి ఉంటాను. కథలు, వ్యాసాలు, పాటలు కూడా రాస్తుంటాను. కొన్ని కథలు ప్రముఖ దినపత్రికల్లో కూడా వచ్చాయి.. కవితలు కూడా తరచుగా వివిధ పత్రికల్లో వస్తుంటాయి. ఇప్పటికీ రెండు కవితా సంపుటాలు ముద్రించాను. మొదటి పుస్తకం పేరు ‘ఇట్లు ఓ ఆడపిల్ల!’, రెండవ పుస్తకం ‘వెన్నెల చివుళ్ళు’. ఇంకా మరో కవిత, కథా సంపుటులు వేసే ప్రయత్నంలో ఉన్నాను.

11.మీ రచనలు, మీ కుటుంబ సభ్యులు చదువుతారా? ఇంట్లో రచనా వ్యాసంగం పరంగా ఎలాంటి ప్రొత్సాహం మీకు లభిస్తుంది?

జ: మా వారు కూడా ఉపాధ్యాయులు. వారికి సాహిత్యం పట్ల అంతగా ఆసక్తి లేదు కానీ.. సాహిత్య పరంగా నేను ముందుకు వెళ్లడానికి మాత్రం అడ్డు చెప్పరు. నేను సాహితీ సమావేశాలకు వెళ్లేందుకు, పుస్తకాల ముద్రణకు ఆయన ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటారు

నాకు ఇద్దరు ఆడపిల్లలు. వారిద్దరికీ సాహిత్యం పట్ల ఎంతో ఆసక్తి, అభిరుచి ఉంది. ఇద్దరూ ఇంగ్లీషులో మంచి పోయెట్రీ రాస్తుంటారు. కథలు, వ్యాసాలు కూడా రాస్తుంటారు. నా కవిత్వానికి రచనలకు మొదటి పాఠకులు నా పిల్లలే. అప్పుడప్పుడు వారి చిట్టి చిట్టి సలహాలు కూడా నేను తీసుకుంటాను. ఒక్కోసారి రాత్రి నిద్ర పట్టని వేళల్లో నేను పిల్లలకు, పిల్లలు నాకు ఒక్కో పదాన్ని టాస్క్ లాగా ఇచ్చి దాని మీద ఆశు కవిత్వం చెప్పుకుంటాం. సాహితీ సువాసనలతో ఆ రాత్రి మొత్తం పరిమళ భరితమవుతుంది. భవిష్యత్‌లో నా బిడ్డలు నా వారసత్వాన్ని నిలబెడతారన్న నమ్మకం నాకుంది.

12.మీకు జరిగిన సన్మానాలు, అవార్డుల గురించి చెప్పండి.

జ: నాకు జరిగిన సన్మానాలు, లభించిన అవార్డులు

  • 2018 లో ఒంగోలు కళామిత్ర మండలి వారి రాష్ట్ర స్థాయి ప్రతిభా పురస్కారం.
  • 2019 మార్చి 8 వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాకళా వేదిక ఒంగోలు వారి సత్కారం.
  • 2020లో కడప జిల్లాలో నా పుస్తకానికి శ్రీ శ్రీ కవితా పురస్కారం లభించిన సందర్భంగా జరిగిన సన్మానం.
  • 2022 ఆగస్టులో దళిత్ యూనివర్సిటీ వారి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జాతీయ పురస్కారం.. ఫిరంగిపురంలో జరిగిన సభలో స్వీకరించడం జరిగింది.
  • 2022 అక్టోబర్ 2వ తేదీ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఐడియల్ టీచింగ్ అవార్డును ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి చేతులమీదుగా స్వీకరించడం జరిగింది.
  • 2023వ సంవత్సరం ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ వారి ఉత్తమ సాహిత్య సేవా రత్న పురస్కారం లభించింది.
  • 2024లో తెనాలిలో జరిగిన పద్మభూషణ్ డాక్టర్ గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో, ఉగాది పురస్కారం మరియు సాహిత్య భూషణ్ బిరుదును ప్రదానం చేయడం జరిగింది.
సాహిత్య భూషణ్ బిరుదుతో సన్మానం స్వీకరిస్తూ.. కవయిత్రి సునీత.
అద్దంకిలో సన్మానం పొందుతూ కవయిత్రి

13. లేత.. లేత.. కవులకు/కవయిత్రులకు, కవిత్వపరంగా మీరిచ్చే సూచనలు ఏమిటి?

జ: సాహిత్యం అనేది సామాజిక ప్రయోజనం కలిగి ఉండడంతో పాటు సాధారణ జీవిత సత్యాల్ని ఆవిష్కరించగలగాలి. ప్రతి కవిత ఓ కొత్తదనాన్ని, మెత్తదనాన్ని, సొంత సౌందర్యాన్నీ పొంది ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే.. కొత్త కవులయినా, పాత కవులైనా పుస్తకాలు చదవాలి. ఇంకా ఇంకా చదవాలి. మళ్ళీ మళ్ళీ.. పదే పదే చదవాలి. అందుకు మరో ఆప్షన్ లేదు. అప్పుడే కాగితం మీద పరుచుకున్న భావాలు పాఠకుని మదిలోకి నేరుగా చేరుకోగలవు.

14.మీ సమయాన్ని వెచ్చించి మీ గురించి తెలిపినందుకు ధన్యవాదాలు.

జ: డాక్టర్ గారూ! నాకు ఈ అవకాశం ఇచ్చి, ‘సంచిక’ పాఠకులకు నన్ను పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.  సంచిక అంతర్జాల మాస పత్రిక ద్వారా నన్ను మరింతగా పాఠక లోకానికి పరిచయం చేస్తున్నందుకు పత్రిక యాజమాన్యం వారికి నా కృతజ్ఞతలు. నమస్తే!

~

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here