సంభాషణం 24: కవయిత్రి శ్రీమతి ఉదయశ్రీ ప్రభాకర్ అంతరంగ ఆవిష్కరణ

1
11

[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం కవయిత్రి శ్రీమతి ఉదయశ్రీ ప్రభాకర్ గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]

హనుమకొండ నిశ్శబ్ద సంచలనం కవయిత్రి.. ఉదయశ్రీ ప్రభాకర్..!!

[dropcap]అ[/dropcap]ప్పటి వరంగల్ జిల్లాలోని పరకాల పట్టణంలో సాహిత్య వాతావరణం మద్య పెరిగి విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రీమతి ఉదయశ్రీ ప్రభాకర్ గారు చిన్నతనం లోనే కవిత్వం పై మక్కువ పెంచుకున్న కవయిత్రి. పుట్టినింట – మెట్టినింట, తన ప్రవృత్తికి ప్రొత్సాహం లభించడంతో అతికొద్ది కాలంలోనే మూడు కవితా సంపుటాలను పాఠకులకు అందించ గలిగారు. హంగులు, ఆర్భాటాలు, ప్రచారం ఆశించని ఈ కవయిత్రి నిశబ్దంగా తాను చేయదలచుకున్న పని చేసుకుంటూ పొతారు. ఫేస్‌బుక్ మాధ్యమంగా ఉన్న అనేక గ్రూపులలో సభ్యురాలిగా తన కవిత్వం అందించడమే కాకుండగా, ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా తన కవితా గానం వినిపించే ఈ కవయిత్రి శ్రీమతి ఉదయశ్రీ ప్రభాకర్, తన సాహిత్య ప్రస్థానం గురించి ఇంకా ఏమి చెబుతారో చూద్దాం.

~

సంచిక అంతర్జాల మాసపత్రిక పక్షాన కవయిత్రి శ్రీమతి ఉదయశ్రీ ప్రభాకర్ గారికి స్వాగతం.

* డా .కె ఎల్.వి.ప్రసాద్ గారూ నమస్కారం.

ప్ర: మీ దృష్టిలో స్త్రీవాదంఅంటే ఏమిటి? స్త్రీవాదాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు?ఎందుచేత?

జ: మన దేశ జనాభాలో సగం మంది స్త్రీలున్నా, సమాజ నిర్వహణ, అభివృద్ధిలో వారు ప్రధాన భూమిక పోషిస్తున్నా.. నేటికీ వారిని ఒక పనిముట్టుగానే భావిస్తున్నారు. అన్ని వర్గాలలో అనాదిగా స్త్రీలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. వారి హక్కులకై పోరాడటం, వారికి సాంఘిక న్యాయం కలిగేలా ప్రయత్నించడమే స్త్రీవాద లక్ష్యం.

సృష్టికి మూలం స్త్రీ అంటూ దేవతామూర్తులైన స్త్రీలను పూజిస్తూనే..స్త్రీని తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనే భావనలో ఈ పితృస్వామ్య వ్యవస్థ స్త్రీని బానిసను చేసింది. కుటుంబాలలో చాకిరీకి, వారసత్వపు అభివృద్ధికి స్త్రీని పరిమితం చేసి వారిపై అధికారం చెలాయిస్తూ సాగుతున్నది పురుషాధిక్య సమాజం.

శారీరకంగా, మానసికంగా బలహీనులంటూ స్త్రీలను అబలలుగా చిత్రీకరిస్తున్నారు. ఆమె సంరక్షణ తమ బాధ్యత అంటూ స్త్రీ జీవితపు ప్రతి మలుపులో ఎవరో ఒకరి అండ తప్పనిసరి అంటూ ఆమె ఉనికిని మసకబార్చారు.

కవయిత్రి, వారి శ్రీవారు.. ఉదయశ్రీ ప్రభాకర్

ఓపికా, ఒద్దిక, సహనం స్త్రీకి ఆభరణాలంటూ, కుటుంబమే ఆమె ప్రపంచం అంటూ భావవ్యక్తీకరణను, నిర్ణయాధికారనికి దూరం చేసారు. సమకూర్చడం పురుష ధర్మం అని, చక్కబెట్టడం స్త్రీ ధర్మం అంటూ విద్యా, ఉద్యోగ, రాజకీయాలు స్త్రీలకు తగవంటూ నినదించడం వలననే నాటి నుంచి నేటి వరకు అన్ని వర్గాలలోని స్త్రీల వెనుకబాటుతనానికి కారణమయ్యింది.

నేటికైనా ఆ తమస్సు తొలిగిపోయి స్త్రీకి భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యo, ఆర్థిక స్వాతంత్ర్యo, సాంఘిక స్వాతంత్ర్యం లభించాలి. దారులు వేరైనా గమ్యం ఒక్కటే. దీనికై ఎవరు ఎన్ని సభలు నిర్వహించి నినదించినా, ఎన్ని రచనలు చేసినా అందరి ఆశ, ఆశయం స్త్రీ సాధికారత. దురాచారాల కట్టుబాట్లు తెంచుకొని స్త్రీ స్వేచ్ఛగా తన ఉనికిని తాను చాటుకోవాలి. అది అందరి బాధ్యత. దీనిని నేను కూడా సమర్థిస్తూ.. దీనికై ఒక స్త్రీగా, కవయిత్రిగా నేను సైతం అంటూ అక్షరాన్ని ఆయుధంగా సంధిస్తూనే ఉంటాను.

కవయిత్రి కుటుంబం.. పిల్లలు ప్రణయ్ రాయ్, ప్రణీత రాయ్

ప్ర: తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు ఉండగా మీరు కవితా ప్రక్రియను ఎన్నుకోవడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా?ఉంటే ఏమిటిది?

జ: కవితలు రాయాలనో.. ప్రత్యేకంగా కవితా ప్రక్రియను ఎంచుకోవాలనో నేను అనుకోలేదు.. కనులు వీక్షించిన ఎన్నో దృశ్యాలు.. నా మనసులో ఎగసిపడే భావాల ఉత్తుంగ ఝరి.. అక్షర రూపం దాల్చి ఓ అందమైన కవితయ్యినన్నలరించి సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తించింది. అలా భావ కవిత్వంతో మొదలైన నా కవితా ప్రస్థానం.. ‘ఒక్క సిరా చుక్క వేయి మెదళ్ళను కదిలిక’ అన్న ప్రజాకవి ఓరుగల్లు బిడ్డ కాళోజీ గారి స్పూర్తితో.. సమస్య మార్పు దిశగా సాగింది. ఈ ప్రయాణంలో సాహిత్య పరంగా నన్ను తీర్చిదిద్దిన గురువులు ఎందరో, ఎందరెందరో వారందరికీ ఈ పత్రికా సమక్షంలో హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

తొలి కవితా సంకలనం “గునుగు పూలు” గురువర్యులు శ్రీ అంపశయ్య నవీన్ గారిచే ఆవిష్కరణ

ప్ర: మీకు కవిత్వం రాయాలని ఎప్పుడు, ఎందుకు అనిపించింది? దీని వెనుక ఎవరి ప్రోత్సాహం అయినా ఉందా??

జ: అవిపదో తరగతి పరీక్షలు రాసిన తర్వాత వచ్చిన సెలవులు. అప్పుడే పరకాల లైబ్రరీలో మా నాన్న నా కోసం సభ్యత్వం తీసుకొని, అక్కడి పుస్తకాలతో పరిచయం చేశాడు. అక్షరం నన్ను ఆకర్షించింది. ప్రేమగా ఆహ్వానించింది. ఆ పుస్తకాల పఠనం వల్ల నన్ను ఏవేవో భావాలు పలకరిస్తూ ఉండేవి.అందులో కొన్నింటిని కాగితంపై పెట్టేదాన్ని. దానికి కవిత్వం అని పేరు ఇవ్వలేను కానీ అవి రాసి మా అమ్మకు చూపిస్తే, ఆమె నన్ను మెచ్చుకుంటుంటే ఏదో సాధించినట్లు చాలా గర్వంగా అనిపించేది. ఆ రోజులలో పాత వార, మాస పత్రికలలో వచ్చే బొమ్మలు చూపించి.. ఏదో ఒకటి రాయమని ప్రోత్సహించేది. ఆ విధంగా మా అమ్మ నాకు అక్షరాభ్యాసమే కాదు, కవితా బీజాలు కూడా నాటిందనిపిస్తుంది ఇప్పుడు.

ప్ర: మీ మొదటి కవిత ఎప్పుడు రాశారు? పత్రికల పరంగా ఏ పత్రిక ముందు ప్రచురించింది? అప్పుడు మీ అనుభూతి ఎలాంటిది?

జ: అవి నేను డిగ్రీ చదివే రోజులు. పరకాల నుండి వరంగల్‍కు వచ్చాను. కొత్త మిత్రులు ఎందరున్నా.. చిన్ననాటి నేస్తాలు పదే పదే గుర్తుకు రావడంతో స్నేహంపై ఓ కవిత రాసి ఆంధ్రభూమి వార పత్రికకు పంపించాను. తరువాత వస్తుందని వరుసగా రెండు, మూడు వారాలు కొన్నాను. నా కవిత్వమస్తుందేమో అన్న ఆశతో.. కాని రాలేదు. నిరుత్సాహ పడ్డాను.

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా కవి సమ్మేళనం.. శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారు, బండా ప్రకాష్ గార్లచే సన్మానం

కానీ.. చాన్నాళ్ల తర్వాత కొందరు మిత్రులు నా కవితను చదివామని, అది చాలా బాగుంది అనడంతో చాలా సంతోషం వేసింది. ఫ్రెండ్స్‌కు తెల్సి అడుగుతుంటే నేనో కవయిత్రిని అయిపోయినట్లు మురిసిపోయాను. అదో గొప్ప మధురానుభూతి. కాకపోతే నేను నా కవితను చూసుకోలేక పోయానని చిన్న అసంతృప్తి అంతే. మీ పత్రిక పరంగా నాటి ఆంధ్రభూమి వార పత్రిక ఎడిటర్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

ప్ర: మీ రచనా వ్యాసంగానికి ఎక్కువ ప్రోత్సాహం పెళ్ళి కాక ముందు లభించిందా?పెళ్ళి అయిన తర్వాత లభించిందా? ఎందుచేత?

జ: పెళ్లికాక ముందు అమ్మ ప్రోత్సాహంతో రాసేదాన్ని. తన మెప్పు పొందుతూ మురిసిపోయేదాన్ని.

పెళ్లయ్యాక ఒకవైపు వృత్తి, మరోవైపు పెళ్లి, పిల్లలు కుటుంబ బాధ్యతల వల్ల నేను అంతగా రాయలేకపోయాను.. తర్వాత నా భర్త, పిల్లల ప్రోత్సాహంతో మళ్లీ రాయడం మొదలు పెట్టాను. కాకపోతే అవన్నీ ఇంటికి, మిత్రులకు పరిమితమయినా నా అక్షరాలకు ప్రశంసల మణులు అద్దాయి. కానీ పాఠశాల వేదికపై మెరుపులా మెరిసి విద్యార్థుల మనసు చూరగొన్నాయి.

లాంతర్ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ వారిచే లాంతర్ అవార్డ్

ప్ర: మీ కవిత్వానికి మొదటి పాఠకులు/శ్రోత ఎవరు? ఎందుచేత?

జ: పెళ్ళి కాక ముందు నా కవితలకు మొదటి శ్రోత/పాఠకురాలు మా అమ్మ. పెళ్ళి అయిన తర్వాతమా శ్రీవారు. ఆయన తెలుగులో ఎం.ఏ చేసినందున నా కవితలను చదవడమే కాకుండా కొన్నిసార్లు తగు సలహాలు ఇస్తూ, అప్పుడప్పుడు టైప్ చేసి పెడుతూ ఉంటారు. మా పిల్లలు, మా అల్లుడు కూడా నా కవితలను ఇష్టంగా చదువుతారు. గొప్పగా తమ మిత్రులకు చూపించి మురిసిపోతారు.

ప్ర: మీకు ఒక కవయిత్రిగా పేరు వచ్చిన తర్వాత మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉంది?

జ: నాకు కవయిత్రిగా కాస్త గుర్తింపు వచ్చాక మా పిల్లలు చాలా సంతోషించారు. వారి వారి మిత్రులకు గొప్పగా నా కవితలను పరిచయ చేస్తూ మురిసిపోతారు. మా శ్రీవారు తన పేరును నా పేరుతో జత చేసి రాస్తున్నానని, తనకు కూడా సాహిత్య ప్రపంచంతో పరిచయం లభించిందని చాలా గర్వపడతారు. సాహిత్య సమావేశాలకు నన్ను తీసుకెళుతూ, ఆ సభల్లో కవితా పఠనాన్ని ఆస్వాదిస్తూ, సాహితీ మిత్రులతో స్నేహంచేస్తూ కలిసిపోతారు.

ప్రముఖ సాహితీవేత్త శ్రీ వి .ఆర్ విద్యార్థి గారిచే మూడవ పుస్తకం “ఆశల విరులు” కైతికాల సంకలనం ఆవిష్కరణ

ప్ర: మీరు ఏదైనా కవితకు వస్తువు ఎన్నుకునేటప్పుడు మీకు ఏవైనా ప్రాధాన్యతలు ఉన్నాయా? ఎందుచేత?

జ: నన్ను ఏదైనా సంఘటన కానీ, పత్రికలలో వచ్చే కథనం కాని కదిలిస్తే ఆ భావాలకు రూపం ఇచ్చి కవిత రాసుకుంటాను. ప్రత్యేకించి ఏదైనా కవితా వస్తువు ఎన్నుకుంటే.. ఆ అంశంపై పూర్తి అవగాహన పెంచుకొని, నా చుట్టూ ఉన్న వారిని పరిశీలించి, నా ఆలోచనలను జోడించి అందరి అంతరంగాలను చేరేలా కవితా గమనాన్ని సాగిస్తాను.

సమస్యల చిక్కుముడి తీస్తూ.. ఆత్మవిశ్వాసం కల్పిస్తూ పరిష్కార దిశగా కవిత సాగేలా చూసుకుంటాను. అందరికి అర్ధం అయ్యేలా వాక్య నిర్మాణం చేస్తుంటాను. ఇలా రాయడానికి నన్ను ఎందరో తీర్చిదిద్దారు..

హైదరాబాద్ లో శ్రీ శ్రీ జయ జయ సాయి ట్రస్ట్ వారిచే సాహితీ రత్న పురస్కారం

ప్ర: ఈ రోజుల్లో వివిధ సాహిత్య ప్రక్రియలకు సంబంధించి, ఫేస్‌బుక్ మాధ్యమంలో అనేక గ్రూపులు వెలిశాయి. మీరు దేనిలోనైనా సభ్యులా? అయితే వాటి మీద మీ అభిప్రాయం? మీరు ఎంచుకున్న గ్రూప్, మీ రచనా వ్యాసంగానికి ఎంత వరకు ఉపయోగ పడింది?

జ: ఫేస్‌బుక్ మాధ్యమంగా జరుగుతున్న సాహిత్య సేవ శ్లాఘనీయం. నన్ను మా బాబు ఫేస్‌బుక్‍కు పరిచయం చేసాక నా భావాలకు పదును పెట్టే అవకాశం ఎక్కువగా లభించింది. మిత్రుల లైక్‍లు కామెంట్స్ నాకు ఉత్సాహాన్ని పెంచాయి.

ఫేస్‌బుక్ పరిచయం చేసిన సమూహమే తారాసుమం. దీని అడ్మిన్ సురేంద్ర శీలం గారు. వీరు చక్కటి చిత్రాలు ఇస్తూ ప్రోత్సహించేవారు. ఆ విధంగా నేను ఏక వాక్య కవితలు రాసాను. నా భావాలకు పదును పెట్టుకోగల్గినాను. ఈ విధంగా రచన నా జీవితంలో ఒక భాగం అయ్యింది. సురేంద్రగారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

శ్రీ శ్రీ కళావేదిక సాహిత్య సంస్థ అధినేత శ్రీ కత్తిమండ ప్రతాప్ గారిచే జాతీయ కవితా పురస్కారం

తర్వాత వాట్సప్ సాహిత్య గ్రూపులు వెలిసాయి. వాటి వల్ల ఎందరో తమ తమ భావాలను కవితా రూపంలో వ్యక్తం చేసుకోడానికి ఒక చక్కటి వేదికై ఎందరో కవుల కలాలకు పదును పెట్టి,చక్కటి చిక్కటి సాహిత్యం వస్తుంది.

ప్ర: పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు ఎంతవరకు తెలుగు భాష పట్ల ఆసక్తి చూపిస్తున్నారు? ఉపాధ్యాయినిగా మీరు గమనించిన విషయాలు ఏవి?

జ: నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగులోనే బోధన జరిగేది. ఇప్పుడు కాన్వెంట్ పాఠశాలలే కాక ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతున్నందున తెలుగు ప్రాధాన్యత తగ్గిందనే చెప్పాలి. అయినప్పటికీ పిల్లలు పద్యాలు, గేయలు, కథల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. సామెతలు, పొడుపు కథలపై ఇష్టం వ్యక్తం చేస్తున్నారు. వాటికై పాఠశాల లైబ్రరీకి రావడం.. పద్యాల అంత్యాక్షరిలో పాల్గొనడం, కథలు చెప్పడం, పాటలు సేకరించి పాడటంలో వారి ఆసక్తి గమనించి, వారికి వారి వారి ఇష్టాన్ని బట్టి వారిని ప్రోత్సహిస్తున్నాను. ఈ విధంగా విద్యార్థులు భాష పట్ల అభిరుచి కలిగి యుండడం హర్షణీయమని చెప్పుకోవచ్చు.

శ్రీ త్యాగరాయ గాన సభలో..వైస్సార్ మూర్తి చారిటబుల్ ట్రస్ట్ వారిచే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నగదు బహుమతి మరియు ప్రతిభా పురస్కారం

ప్ర: తెలుగు భాషాభివృద్ది దిశగా, ఉపాధ్యాయినిగా మీరు పాఠశాలలో ఎటువంటి కృషి చేస్తున్నారు?

జ: నేడు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతున్నందు వల్ల, సమాజ గమనం వ్యక్తి ఉద్యోగ, వ్యాపారాల్లో ఆంగ్లభాష ప్రాధాన్యత పెరగడం వల్ల మాతృభాష అయినప్పటికీని తెలుగుభాష వాడకం తగ్గిపోయింది. భాషా ఉపాధ్యాయురాలిగాతెలుగు భాషాభివృద్ది దిశగాపిల్లలకు భాషలోని మాధుర్యాన్ని అందిపుచ్చుకొనేలా శతకాలు, కథల పుస్తకాలపై ఆసక్తి చూపించేలా ప్రోత్సహిస్తున్నాను. నిఘంటువుల ఉపయోగంతో పదజాలం పెంచుకొనేలా.. చిన్న చిన్న పదాలతో భావాలు వ్యక్తం చేసేలా కవితలు, కథలు రాసేలా ప్రోత్సహించడం వారాంతంలో వారికి చిన్న చిన్న పోటీలు పెడుతున్నాను. పత్రికలలో వచ్చిన పదబంధాలను పూర్తి చేయించడం, సూక్తులు సేకరించేలా చేస్తున్నాను. వీటికి గాను పాఠశాల గ్రంథాలయాన్ని వాడుకొనేలా తమకు తాముగా నేర్చుకొనేలా శ్రద్ధ వహిస్తున్నాను.

ప్ర: మీ రచనల గురించి, అవార్డులు, బిరుదులు వగైరా గురించి వివరించండి?

జ: హితులు, స్నేహితుల ప్రోత్సాహం.. నా తల్లిదండ్రుల ఆశీర్వాదం.. నా అభీష్టం నెరవేరింది. నా అక్షరాలను ముస్తాబు చేసి, పుస్తక పల్లకి ఎక్కించి పాఠకులను మెప్పించమంటూ సమాజంలోకి సాగనంపాను. ఇప్పటి వరకుమూడు పుస్తకాలుఆవిష్కరించుకొన్నాను.

  1. గునుగు పూలు
  2. తింగరోడు(హాస్య కవితలు)
  3. ఆశల విరులు(కైతికాలు)
కవయిత్రి గారి కవితా సంపుటాలు

ఇవే కాకుండా ఏక వాక్య కవితలు, ద్విపాద కవితలు, రెక్కలు, నానీలు, హైకూలు, శ్రీపదాలు, గజల్స్(కొన్ని) కథలు, సమీక్షలు రాసాను. వాట్సాప్‍లో నిర్వహింప బడుతున్న సాహిత్య సమూహాలు, కొన్ని సాహిత్య సేవా సంస్థలు అందించిన కవితా భూషణ్, కవితా రత్నా, కవితా విభూషణ్ బిరుదులు, సాహితీ రత్న, లాంతర్ అవార్డు, తెలుగు వెలుగు లిటరరీ పుర్కస్కారం పొందాను.

ప్రభుత్వం వారు నిర్వహించిన ఉగాది పురస్కారం, వసంతోత్సవ పురస్కారం అందుకున్నాను. వీటన్నింటి ప్రోత్సాహంతో మరింత ఉత్సాహాన్ని అందిపుచ్చుకుంటూ మరింత ముందుకు సాగుతున్నాను.

ప్ర: ప్రభుత్వ పరంగా అందిస్తున్న అవార్డుల గురించి మీ అభిప్రాయం ఏమిటి?

జ: తెలంగాణ వచ్చాక సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేసింది. సాహిత్య పరంగా కవులకు, కళాకారులకు చక్కటి ప్రోత్సాహం లభించింది. సమయ సందర్భానుసారంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ తెలుగు భాషకు పట్టం కడుతున్నారు. ఎన్నెన్నో సాహిత్య సేవా సంస్థలు వెలిసి కవులను ప్రోత్సహిస్తూ బిరుదులు, అవార్డులు ఇస్తూ సాహిత్య సేవ చేస్తున్నారు. ప్రతి చోట అక్షరం మెరిసిపోతోంది.

ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు నిర్వహిస్తున్న సభలు సమావేశాలు కవిత్వం రాయాలనే ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. భాష పై మక్కువ పెంచుతుంది. కవిత్వం రాయడం వల్ల వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకొని నలుగురికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తాడు.

‘తింగరోడు ‘ కవితా సంపుటిని ఆవిష్కరిస్తున్న ప్రొ.బన్నా అయిలయ్య గారు

ప్ర: క్రైస్తవ కుటుంబాలలో ఎక్కువగా మతపరమైన సాహిత్యానికి తప్ప మరో దానికి చోటు ఉండదు కదా! మరి మీకు ఈ రచన వ్యాసంగం ఎలా సాధ్యమైంది?

జ: చక్కటి ప్రశ్న అడిగారు సర్. నిజానికి నేను కూడా మిషనరీ స్కూల్స్ లోనో, మిషనరీ సంస్థల్లోనూ చదువుకొని ఉంటేను ఇలా రాసేదాన్ని కాదేమో. మా ఇంటికి మిషన్ స్కూల్ దూరంగా ఉండటం వల్ల ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుకోవడం జరిగింది. మా అమ్మ నాన్నల పరిచయాల వల్ల, మా చుట్టూ ఉన్న పరిసరాలు, మా పరకాల లైబ్రరీతో నేను అనుబంధాన్ని పెంచుకోవడం జరిగింది. దానితో నాకు అన్ని రకాల పుస్తకాల పరిచయం, అన్ని మతాల వారి సహవాసం లభించింది.

నాకున్న ప్రాణ స్నేహితులలో హిందువులు, ముస్లింలు కూడా ఉండడంతో మా స్నేహం, వారి కుటుంబాలతో నాకున్నఅనుబంధం మతానికి అతీతంగా ఆలోచించేలా చేసింది. భిన్న సంస్కృతి సాంప్రదాయాలను ఒడిసి పట్టుకోగలిగాను. అదే ఈ రోజు ఇలా అన్ని అంశాలతో కవిత్వం రాసేలా రూపుదిద్దింది.

* మేడం సాహిత్య రంగానికి సంబందించి మీ అనుభూతులు, అనుభవాలు చక్కగా చెప్పారు, మీకు హృదయపూర్వక ధన్యవాదాలండీ.

* సర్ మీకు, సంచిక సంపాదక వర్గానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here