సంభాషణం: కవి బిల్ల మహేందర్ అంతరంగ ఆవిష్కరణ

11
8

[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం వరంగల్ ముద్దుబిడ్డ.. కవి బిల్ల మహేందర్ గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]

వరంగల్ ముద్దుబిడ్డ.. కవి బిల్ల మహేందర్

[dropcap]క[/dropcap]వులూ కళాకారులూ ఈ తెలుగుగడ్డ మీద చాలామంది ఉన్నారు. ప్రతిభ లేకపోయినా ప్రచారంతో తమకు తాము గొప్పలు చెప్పకుంటూ సాహితీలోకంలో తామే ప్రసిద్ధులమన్న స్వయంకీర్తిని ఆపాదించుకునేవారే ఎక్కువమంది కనిపిస్తారు. అంతమాత్రమే కాదు, వటవృక్షాలుగా మారి చిన్న మొక్కలను అసలు ఎదగనీయరు. స్వంత డబ్బాకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

కవి బిల్ల మహేందర్

ఇంటువంటి వారికి భిన్నంగా, కొందరు ప్రచారానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా, దానికి పూర్తిగా దూరంగా ఉండి నిశ్శబ్దంగా చక్కని, చిక్కని, కవిత్వం అందించటంతో పాటు, సామజిక సేవలో సైతం ముందుంటారు. ప్రశంసలకు సైతం దూరంగా ఉంటారు. ఇలాంటి బహుకొద్ది మంది మాత్రమే వేళ్ళ మీద లెక్క పెట్టదగ్గ సాహిత్యకారులు మనకు కనిపిస్తారు. అలాంటివారిలో ముందువరసలో నిలబెట్టదగ్గ వ్యక్తి – వరంగల్ (హన్మకొండ) ముద్దుబిడ్డ, కవి, వ్యాసకర్త, సహృదయుడు, మంచి ఉపాద్యాయుడు శ్రీ బిల్ల మహేందర్. పురస్కారాల కోసం తాపత్రయం పడని కవి ఈయన. పురస్కారాలే ఈయనను వరించి ఎదురు వస్తుంటాయి. కవిత్వపరంగా ఆయన మనసులోని అభిప్రాయాలను, ఆయన మాటల్లోనే చదువుదాం.

~

ప్ర: మహేందర్ గారూ… నమస్కారం. సంచిక.. అంతర్జాల పత్రిక పక్షాన మీకు స్వాగతం.

* నమస్కారం సర్, ధన్యవాదాలు.

ప్ర: మీరు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించడానికి వెనుక నేపథ్యం ఏమిటి?

* ప్రత్యేకంగా ఈ వృత్తిని స్వీకరించాలని ఏమీ అనుకోలేదు. ఆ కాల పరిస్థితులలో పదవ తరగతి తర్వాత ఎంసెట్‌లో సీటు రాకపోవడంతో డిగ్రీలో చేరడం, డిగ్రీ పూర్తి అయిన తర్వాత మిత్రులంతా బిఈడి ఎంట్రెన్స్ రాస్తున్నారని తెలుసుకుని నేను కూడా ఎంట్రన్స్ రాసి ఆ కోర్సును పూర్తి చేయడం, తర్వాత వెంటనే డీఎస్సీకి ఎంపిక కావడం.. ఇలా అంతా రొటీన్‌గా జరిగిపోయింది.

ప్ర: కవిగా మీరు అతికొద్దికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. సహజంగానే మీకు కవిత్వం అబ్బిందా? మీకు ప్రోత్సాహకులు ఎవరైనావున్నారా?

* డిగ్రీ నుంచే నాలో కలిగిన భావాలను అక్షర రూపంలో ఓ డైరీలో పొందుపరిచేవాడిని. వాటిని ‘కవితలు’ అని చెప్పలేను. హైస్కూల్ స్థాయిలో నాకు తెలుగు బోధించిన నాగభూషణ్ సారు బోధన నన్ను చాలా ఆకట్టుకునేది. అప్పటినుండే నాకు తెలుగు మీద మక్కువ ఏర్పడింది. దాంతో నేను ఇంటర్, డిగ్రీలో కూడా సెకండ్ ఆప్షన్‌గా తెలుగు తీసుకున్నాను. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న సమయంలో సమాజంలోని వివిధ అంశాల పట్ల మెల్లమెల్లగా అవగాహన ఏర్పరుచుకొన్నాను. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సాహిత్య సభలలో పాల్గొనడం వల్ల సాహిత్య పుస్తకాలకు, కవిమిత్రులకు దగ్గరయ్యాను. నేను కూడా కవిత్వం వ్రాయడం ఆరంభించాను. మొదటగా కవిత్వం రాసే సమయంలో చాలామంది వరంగల్ సాహితీ పెద్దలు నాకు పలు సూచనలు, సలహాలు అందించి నన్ను సాహిత్యం వైపు నడిచేటట్లు చేశారు.

బిల్ల మహేందర్ కుటుంబం
అమ్మా నాన్నలతో… బిల్ల మహేందర్

ప్ర: మీరు మొదటి కవిత ఎప్పుడు రాసారు? మీ కవితను ప్రచురించిన మొదటి పత్రిక ఏది? అప్పుడు మీ స్పందన ఎలాంటిది?

* స్పష్టంగా గుర్తులేదు. కాని చాలా సంతోషించాను. నేను కూడా కవిని కాగలనని, కవిత్వం రాయగలననే నమ్మకం నాలో స్థిరపడింది.

ప్ర: ఉపాధ్యాయ వృత్తిలో వుండి మీరు కవిత్వం రాయడానికి సమయం ఎలా కేటాయించగలుగుతున్నారు? మీరు కవిత్వం రాయాలంటే మీ పై అధికారుల అనుమతి అవసరమా? మీకు ఎప్పుడైనా ఇలాంటి సమస్య ఎదురైందా?

* ప్రత్యేకంగా సమయం కేటాయిస్తే కవిత్వం రాదు. హృదయంతరంగంలో అలజడులు చెలరేగాలి. ఎన్నో వేదనలకు, సంఘర్షణలకు గురి కావాలి. సంతోషం, బాధ, దుఃఖం, గాయం.. ఇలా అనేక అనుభూతుల ప్రవాహమే కవిత్వం. నా మట్టుకు నేను లోలోన సంఘర్షణ గురవుతుంటాను. ఒంటరిగా ఉన్నప్పుడో, ప్రయాణిస్తున్నప్పుడో లోలోన కవిత్వాన్ని అల్లుకుంటాను. పదే పదే ఎడిట్ చేసుకుంటాను. సమయాన్నిబట్టి దానిని కాగితంపై అక్షరరూపంలో పొందుపరుస్తాను. కవిత్వం ఓ మానసిక అంశం. దాన్ని ఎవరూ కట్టడి చేయలేరు.

అంపశయ్య నవీన్ గారితో

ప్ర: అంతర్జాల పత్రికలపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రస్తుతం వీటి అవసరం ఎంతవరకూ ఉంది?

* కాలం వేగంగా మారుతోంది. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు మారాల్సిందే. ప్రతి వ్యక్తిలో ఏదో ఒకటి తెలుసుకోవాలనే జిజ్ఞాస రోజురోజుకు పెరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఆ విషయాన్ని చేరవేయాలంటే ఇప్పుడున్న పత్రికా వ్యవస్థ ఏ మాత్రం సరిపోదు. అంతర్జాల పత్రికలు ఆ లోటును తీర్చుతున్నాయి. కాబట్టి వాటి ప్రాధాన్యత ఎంతో అవసరం.

దర్భశయనం గారితో……

ప్ర: రచనా వ్యాసంగంలో మీరు పూర్తి సమయాన్ని కవిత్వానికి మాత్రమే కేటాయిస్తున్నట్టు అనిపిస్తున్నది. మిగతా సాహిత్య ప్రక్రియలపై మీ అభిప్రాయం ఏమిటి?

* ఉద్యమ సమయంలో నేను కవిత్వం కంటే ముందు పాటలు రాశాను. తర్వాత కవిత్వం వైపు అడుగులేసాను. ఏ సాహిత్య ప్రక్రియ అయినా సమాజానికి దోహదపడాలనేది నా అభిప్రాయం. కవిత్వాన్ని ఎక్కువగా ప్రేమించిడం వల్ల వేరే సాహిత్య పక్రియ వైపు వెళ్ళలేదు. అప్పుడప్పుడు సందర్భానుసారంగా వ్యాసాలు కూడా రాస్తున్నాను.

మామిడి హరికృష్ణ గారితో
కవి శివారెడ్డి గారితో ….

ప్ర: వరంగల్ సాహితీ క్షేత్రంలో మీ పాత్ర ఏమిటి? వరంగల్ సాహితీ రంగానికి మీరు అందించిన సేవల గురించి చెప్పండి.

* ప్రత్యేకంగా నా పాత్ర అంటూ ఏమీ లేదు. అందరితోనూ సత్ససంబంధాలు కొనసాగిస్తున్నాను. సీనియర్ కవుల, రచయితల సలహాలు సూచనలు పాటిస్తూనే.. కొత్తగా కవిత్వం రాసే వాళ్ళతో తలలో నాలుకలా ఉంటూ, వాళ్ళతో మమేకమవుతూ వారిని వివిధ వేదికల ద్వారా సాహిత్యం వైపు మరింత దృష్టిని సారించేలా ప్రయత్నిస్తున్నాను. అవసరమైన సందర్భాలలో వారి కవిత్వాన్ని అచ్చువేసే పక్రియలో సహకారం అందిస్తున్నాను.

కొన్నిప్రశ్నలు-కొన్ని జ్ఞాపకాలు ఆవిష్కరణ

ప్ర: మీరు బోధనా రంగంలో ఉన్నారు. విద్యార్థులలో మీ కవిత్వ ప్రభావం ఎలా ఉంది?

* నేను ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిని. ఆ స్థాయి పిల్లలకు కవిత్వం సంబంధించిన ప్రభావం ఎక్కువగా ఉండదు. కాకపోతే సందర్భానికి అనుగుణంగా కొన్ని అంశాల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాను.

ప్ర: ప్రస్తుతం వస్తున్న కవిత్వంపై మీ అభిప్రాయం విశ్లేషణాత్మకంగా చెప్పండి.

* కవిత్వం ఇప్పుడూ రొటీన్‌గా కాకుండా కొత్త పంథాల్లో కొనసాగుతోంది. అనేకనేక అస్తిత్వాలకు వేదికగా నిలబడుతుంది. భాష పరంగా కొత్త వ్యక్తీకరణ జరుగుతోంది. ఈ దశాబ్ద కాలం నుండి కొత్తగా చాలా మంది కవులు కవిత్వం రాస్తున్నారు. వారిలో కొంతమంది వారి వారి మూలాల్లోంచి కవిత్వాన్ని రాయడం సంబురమనిపిస్తుంది. అయితే వచనానికి, కవిత్వానికి తేడా ఉంది. ఉన్నదున్నట్టు రాస్తే అది కవిత్వం ఎలా అవుతుంది? దానికి భిన్నంగా వ్యక్తీకరించడం నేర్చుకోవాలి. మనం ఏ భావాలనైతే వ్యక్తపరచాలనుకుంటామో వాటిని కవిత్వీకరణ చేయాలి. సంఘర్షణలోంచి పుట్టుకొచ్చిందే కవిత్వం. సామాజిక మాధ్యమాలు విరివిగా వచ్చినా తర్వాత పుంఖానుపుంఖాలుగా కవిత్వం వస్తున్నది. సీరియస్‌నెస్ లేని రాతల వల్ల కవిత్వం చాలా పలచనకు గురవుతోంది. దాన్ని అధిగమించాలంటే తప్పకుండా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.

సభలో..ప్రసంగిస్తూ…. బిల్ల

ప్ర: ‘దివ్యాంగులు’ అంశంగా, మీరు ఒక కవితా సంకలనం తీసుకువచ్చినట్టున్నారు. దీని వెనుక నేపథ్యం  ఏమిటి? ఈ విషయంలో మీకు కవుల సహకారం ఎంతవరకూ లభించింది?

* 2014లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కవులతో ‘కాలాన్ని గెలుస్తూ..’ (ప్రత్యేక ప్రతిభావంతులపై కవితా సంకలనం) అనే సంకలనాన్ని నా సంపాదకత్వంలో అచ్చు వేశాను. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న సమయంలో నాలాంటి దివ్యాంగ మిత్రులు చాలామందితో పరిచయం ఏర్పడింది. వారితో ఓ వైపు ఉద్యమంలో పాల్గొంటూనే మరోవైపు దివ్యాంగుల హక్కులు, అస్తిత్వానికి సంబంధించిన చర్చలను ఎప్పటికప్పుడు కొనసాగిస్తూ వచ్చేవాడిని. ఈ క్రమంలో దివ్యాంగుల కోసం, వారిలో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నంలో భాగంగా ఒక పుస్తకం అచ్చు వేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది. అప్పటికే నేను వ్యక్తిగతంగా రెండు పుస్తకాలను అచ్చు వేసిన అనుభవంతో మిత్రుల సహకారంతో ‘కాలాన్ని గెలుస్తూ..’ సంకలనాన్ని తీసుకొచ్చాను. దాదాపు వందమంది కవులు రాసిన కవితలను ఈ సంకలనంలో పొందుపరుచాను. ఇది తెలుగు సాహిత్యంలో దివ్యాంగులపై వచ్చిన మొట్టమొదటి సంకలనంగా పేరు పొందింది. దీని ద్వారానే రాష్ట్రంలోని చాలా మంది కవులు, రచయితల నాకు పరిచయమవ్వడం, తద్వారా నేను సాహిత్యం వైపు ఇలా!… ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం.

ప్ర: మీరు ప్రచురించిన పుస్తకాల వివరాలు చెప్పగలరు.

రచనలు

  • 2011లో పోరు గానం (తెలంగాణ గేయాలు) మరియు బలిదానాలు మరుద్దాం (బుక్లెట్)
  • 2012లో పిడికిలి (తెలంగాణ కవిత్వం)
  • 2015 లో గెలుపు చిరునామా (ప్రత్యేక ప్రతిభావంతుల పై కవిత్వం)
  • 2016లో కొన్ని ప్రశ్నలు కొన్ని జ్ఞాపకాలు (కవిత్వం)
  • 2020లో తను నేను వాక్యం (కవిత్వం) మరియు ఇప్పుడొక పాట కావాలి (కవిత్వం)

సంపాదకత్వం

  • 2014లో కాలాన్ని గెలుస్తూ.. (ప్రత్యేక ప్రతిభావంతులపై కవితా సంకలనం)
  • 2020లో కోవిడ్-19 (కరోనా విపత్తుపై ఓరుగల్లు కవుల కవితా సంకలనం)
  • 2020 వలస దుఃఖం (వలస కార్మికులపై కవితా సంకలనం)
బిల్ల మహేందర్ రచనలు కొన్ని
వలసదుఃఖం ఆవిష్కరణ

ప్ర: సాహిత్యపరంగా మీరు అందుకున్న అవార్డులు, సన్మానాల గురించి వివరించండి.

* బోయినపల్లి వేంకట రామారావు రాష్ట్రస్థాయి పురస్కారం – జగిత్యాల, డాక్టర్ ద్వా.నా.శాస్త్రి రాష్ట్రస్థాయి పురస్కారం – హైదరాబాద్, కాళోజి పురస్కారం – తెలంగాణ రచయితల సంఘం – కరీంనగర్, బి.ఎస్.రాములు స్ఫూర్తి పురష్కారం – హైదరాబాద్, డాక్టర్ రాధేయ కవితా పురస్కారం – అనంతపురం.

రాధేయ కవితా పురస్కారం

ప్ర: మహేందర్ గారు, మీ సాహిత్య ప్రస్థానంకు సంబందించి మంచి వివరాలు అందించారు, ఇవి రాబోయే లేత.. లేత.. కవులకు/కవయిత్రులకు తప్పక ఉపయోగపడగలవని ‘సంచిక’ నమ్ముతున్నది. సంచిక-అంతర్జాల పత్రిక పక్షాన మీకు ధన్యవాదాలు.

*నాచే నా అంతరంగ వీక్షణం చేయించిన మీకూ, సంచిక సంపాదక వర్గానికీ ధన్యవాదాలండీ. మీ ప్రోత్సాహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here