సంభాషణం: కవి శ్రీ మల్యాల మనోహర రావు అంతరంగ ఆవిష్కరణ

7
11

[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం కవి శ్రీ మల్యాల మనోహర రావు గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]

నిజాయితీ కవిత్వానికి నిలువెత్తు సంతకం శ్రీ మల్యాల..!!

[dropcap]హ[/dropcap]నుమకొండ కవులు అనగానే తళుక్కున మెరిసే కవిమిత్రుడు శ్రీ మల్యాల మనోహర రావు. భేషజాలు  ఏ మాత్రం లేని సహృదయుడు. వరంగల్ ‘సహృదయ సాహిత్య, సంస్కృతిక సంస్థ’లో చురుకుగా పాల్గొని తన వంతు సేవలు అందిస్తున్న కవి శ్రీ మల్యాల మనోహరరావు. వృత్తి రీత్యా ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో, పొలీసు శాఖ (పరిపాలనా విభాగం) లో, వివిధ హోదాలలో పని చేసి, పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం నల్లకోటు ధరించి న్యాయవాదిగా వృత్తిని చేపట్టారు. తెలుఁగు సాహిత్యంలో, మరో ప్రక్రియ వైపు కన్నెత్తి చూడకుండా, కేవలం కవిత్వం వైపు మాత్రమే దృష్టి సారిస్తున్న కొద్దిమంది కవులలో శ్రీ మల్యాల ఒకరు. కవిత్వం రాయడమన్నా, కవి సమ్మేళనాల్లో పాల్గొనాలన్నా అమితోత్సాహం చూపించే ఈ కవి అంతరంగ కథనం.. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మరి, పదండి ముందుకు..

*మల్యాల మనోహర రావు గారు, ‘సంచికఅంతర్జాల మాసపత్రిక పక్షాన మీకు స్వాగతం. మీ ఇంటి పేరులోనూ, మీ పేరులోనూ, ఏదో తెలియని మధురత్వం వినిపిస్తుంది. ఈ పేరు వెనుక ప్రత్యేక నేపథ్యం ఏమైనా వుందా?

కవి మల్యాల మనోహరరావు, హన్మకొండ

నమస్కారం!!

మా ఇంటి పేరు మల్యాల. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు, 1955లో జనగాంలో.. మా అమ్మ మనోహర అనే తెలుగు సినిమా చూసిందట. ఎందుకో కొడుకు పుడితే మనోహర అనే పేరు పెట్టుకుందామని అనుకుందట.

నేను మా గ్రామమైన ‘కళ్లెం’లో ది.వి 24.05.1955న జన్మించాను. ఎందరు ఎన్ని పేర్లు సూచించినా మా అమ్మ తనకు నచ్చిన పేరే పెట్టుకుంది. అమ్మ పెట్టింది కాబట్టి మధురంగా ఉంది.

*మీ బాల్యం ఎక్కడ గడించింది? మీ విద్యాభ్యాసం ఎక్కడ, ఎలా ముగిసింది?

మా తండ్రి గారు కీ.శే. పాపారావుగారు ఉపాధ్యాయులు. వారి వృత్తి రీత్యా జరిగిన బదిలీల కారణంగా నా బాల్యం కుందవరం, నవాబుపేట, జనగాం, చిన్నమడూర్ (మా అమ్మమ్మ ఊరు)లో గడచింది. నా ప్రాథమిక విద్య SSC వరకు నవాబుపేటలో జరిగింది. నా ఇంటర్‌మీడియట్ విద్య జనగాంలో, ఉన్నత విద్య సూర్యాపేట, వరంగల్‌లో.

*మీరు ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు శాఖలో మీ సేవలు అందించారు కదా! రచనా వ్యాసంగాన్ని దృష్టిలో వుంచుకుని అక్కడ మీకు ఎలాంటి ప్రోత్సాహం లభించేది?

నేను నా గ్రాడ్యుయేషన్ తర్వాత, ట్యూషన్లు చెబుతూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండే వాడిని. మా మామగారైన పెండ్యాల జయసేనరావు ప్రొద్బలంతో వరంగల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రాగా, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ద్వారా పంపబడి 1979లో నియామకం పొందాను. ఉద్యోగం చేస్తూనే K.U. సాయం కళాశాలలో L.L.B లో join అయ్యాను. నా రచనా వ్యాసాంగం విషయంలో.. సర్వశ్రీ డా. మాగంటి కాంతారావు, CSRKLN రాజు, శ్రీమతి అనురాధ IPS, అప్పటి జిల్లా Addl. SPలు నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చారు. నా రచనా వ్యాసంగానికి నా వృత్తిలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు.

*పోలీసు శాఖలో, ముఖ్యంగా పోలీసు సిబ్బంది వారి కార్యనిర్వహణను దృష్టిలో ఉంచుకుని సాహిత్యం పట్ల అభిరుచి పెంచుకునే అవకాశం ఉంటుందా? పోలీసుశాఖలో మీకు తెలిసిన ప్రసిద్ధ రచయితల గురించి చెప్పండి.

తప్పని సరిగా. పోలీస్ శాఖలో ఉన్నతధికారులు శ్రీ H.J. దొర IPS లాంటి ఆఫీసర్లు రచనా వ్యాసంగానికి మంచి ప్రోత్సాహం ఇచ్చారు. ‘సురక్ష’ అనే మాస పత్రికను ప్రారంభించారు. శ్రీ రావులపాటి సీతారామారావు IPS మంచి సాహితీవేత్త. దానికి ఎడిటర్‌గా చాలా కాలం వ్యవహారించారు.

అప్పట్లో స్థానిక కళాకారులతో ‘భారతి’ నాటకాన్ని కూడా పోలీస్ శాఖ గ్రామీణ ప్రాంతంలో ప్రదర్శించింది. అంతే కాక జాగృతి కళా బృందాన్ని ఏర్పాటు చేసి పలు సామాజిక అంశాలపై జానపద గీతాల బాణీలలో, గేయ రూపకాలను ప్రదర్శిస్తూ ప్రజలలో అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. పోలీస్ శాఖలో రాంనారాయణ, IPS, లాంటి కవులు, సదశివరావు IPS, Addl. DGP రచయితలు ఉన్నారు.

శ్రీమతి తో శ్రీ మల్యాల

* తెలుఁగు సాహిత్యం పట్ల (ముఖ్యంగా కవిత్వం) మక్కువ ఎక్కువగా ఎప్పుడు ఏర్పడింది?

నేను ZPSS నవాబుపేటలో 10th క్లాసులో ఉన్నప్పుడు పాఠశాల విద్యార్థి సంఘం ఎన్నికల్లో కల్చరల్ సెక్రటరీగా ఎన్నికైనాను. మా పాఠశాలలో కీ.శే. శ్రీ నెల్లుట్ల శ్యామసుందర్ రావు గారు, గొప్ప గాయకుడు, రచయిత, చిత్రకారుడు ఉపాధ్యాయులుగా ఉన్నారు. మాకు తెలుగు చెప్పేవారు. వారి సంకల్పంతో పాఠశాలలో ‘లిఖిత ‘పత్రికను ప్రారభించి విద్యార్థులచే కవితలు, కథలు, వ్యాసాలు వ్రాయించేవారు. నేను తొలిసారిగా అందులో ఒక బాల గేయం మరియు నాకు తెల్సిన కథను వ్రాసాను.

విద్యార్థి దశలోనే నేను బాలమిత్ర. చందమామ కథల పుస్తకాలే కాకుండా, గ్రామ పంచాయితీ గ్రంథాలయంలో ఉన్న అనేకానేక పుస్తకాలు చదివాను. ముఖ్యంగా Emesco పాకెట్ బుక్స్ చదివాను.

అనేక మంది రచయిత, రచయిత్రుల ముఖ్యంగా కోడూరు కౌసల్యదేవి, ముప్పాళ్ల రంగనాయకమ్మ గారి నవలలు చదవడంతో.. నాలో కొంత హేతువాద దృక్పథం వామపక్ష భావజాలం పెంపొందింది. జనగాం, సూర్యాపేట, వరంగల్‌లో జరిగే సాహితి సమావేశాలు, కవి సమ్మేళనాలలో పాల్గొని నేను వ్రాసిన కవితలు వినిపించేవాడిని. స్థానిక సాహితీ మిత్రులు ప్రోత్సాహంతో కవిత రచన ప్రక్రియలో మాత్రమే రచన కొనసాగిస్తున్నాను.

*మీరు మొదటి కవిత ఎప్పుడు రాసారు? మీ కవిత మొదట ఏ పత్రికలో ప్రచురింపబడింది? అప్పుడు మీ స్పందన ఎలాంటిది?

నా కవిత ‘అంతిమరూపం’ ఈనాడులో కొత్తపాళి శీర్షికలో తొలిసారిగా ప్రచురితమంది. ఈ కవితను మా బాబాయ్ కూతురు ‘అంజలి’ పేరుతో పంపించాను. దానికి నాకు ₹20/-పై పారితోషికం లభించింది. దీనితో నాలో వ్రాయాలనే ఉత్సాహం ఇనుమాడించింది.

కుటుంబ సభ్యులతో శ్రీ మల్యాల

*అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం, దళిత కవిత్వం, స్త్రీవాద కవిత్వం, ముస్లింవాద కవిత్వం – వీటిపై మీ అభిప్రాయం ఏమిటి?

కథా, కవిత, నవల రచనా ప్రక్రియలో కాలనుగుణంగా సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల కనుగుణంగా వచ్చిన ఉద్యమాల కారణంగా అనేక వాద కవిత్వాలు రచనలు వచ్చాయి.

దాదాపు అన్ని వాదాల రచనలు సాహిత్య పరిపుష్టికి, విస్తృతికి దోహదం చేశాయ్. సమాజాన్ని జాగృతం చేయడానికి, సంస్కరణలకు తోడ్పడినాయి, సమాజ హితానికి దోహదం చేసే ఏ వాదమైన ఆశించ, ఆహ్వానించదగినదే.

*కవిత్వంలో మాండలిక భాషాప్రయోగం ఎంతవరకూ అవసరం? ఎందువల్ల?

కవిత్వంలో మాండలికా భాషా ప్రయోగం సమర్థించదగినదే.. దీని ద్వారా.. జానపద సంస్కృతి, జీవన, ఆలోచనా విధానం భావ పరిపక్వతతో పాటు పామర జనాన్ని కూడా సాహిత్యానికి చేరువ చేస్తుంది.

*కవిత్వం మాధ్యమంలోనే మీ పేరు వినిపిస్తుంటుంది. కథ, నవల, వ్యాసం పట్ల మీకు అభిరుచి లేదా? ఎందుచేత?

కవితా ప్రక్రియనే కాకుండా ఇతర ప్రక్రియలపై కూడా అభిరుచి ఉంది. కాకపోతే రచన చేసేంత నేర్పు లేదు. ఎందుకంటే కథ, నవల, వ్యాసం వ్రాయాలంటే తగిన విషయ పరిజ్ఞానం ఉండాలి. అందుకే పెద్దగా ప్రయత్నం చేయలేదు. చేస్తే వ్రాయగలననే నమ్మకం ఉంది.

*నేటి యువతీయువకుల్లో, తెలుగుభాష పట్ల అభిరుచి కలిగించడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బావుంటుందని మీరు అనుకుంటున్నారు?

నేటి యువతలో తెలుగు భాషాభిమానం పెరగాలంటే పాఠశాల, కళాశాల స్థాయిలో తెలుగు అధ్యాపకులే కాకుండా కళలు, సాహిత్య అభిమాన ఉపాధ్యాయుల చొరవ, కృషి ఉండాలి. ప్రతి పాఠశాల కళాశాల గ్రంథాలయాలలో సాహిత్యానికి సంబందించిన పుస్తకాలు, వాటిని అందుబాటులో ఉంచే సాహిత్య వాతావరణం. తరచుగా సాహితీ కార్యక్రమాలు, గోష్ఠులు, ప్రముఖ సాహితీవేత్తల ప్రసంగాలు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా మన సంసృతి సంప్రదాయాలను పరిచయం చేయాలి. మంచి భాషా జ్ఞానానికి పద్యవాఙ్మయం మంచి దోహదకారి.

*ఒక కవిగా, తెలుగు వ్యక్తిగా మీ ప్రభావం మీ పిల్లలపై ఎంతవరకూ పడింది? ఎందుచేత?

కవిగా నా ప్రభావం మా పిల్లల పై అంతగా లేదు.. దానికి అంతగా నేను నా రచనల ద్వారా ప్రభావం చూపలేక పోవడం ఒకటైతే – కవులపట్ల, కవిత్వం పట్ల నేటి తరంలో ఉన్న చిన్న చూపు వల్ల.

*ఒకప్పుడు కవి సమ్మేళనాలు ఉగాదికి మాత్రమే జరిగేవి. అది కూడా ఆకాశవాణివారు ఘనంగా నిర్వహించేవారు. శ్రోతలలో మంచి స్పందన ఉండేది. ఇప్పుడు సమయం సందర్భం లేకుండా కవి సమ్మేళనాల జోరు ఎక్కువయింది. దీనిపై మీ ఉద్దేశం ఏమిటి?

ఆ రోజుల్లో ఆకాశవాణి ఉగాది పర్వదిన సందర్భంగా ఏర్పాటు చేసే కవి సమ్మేళనానికి విశేష ప్రాచుర్యం స్పందన ఉండేది. లబ్ధ ప్రతిష్ఠ కవుల కవితా గానం కోసం శ్రోతలు ఎదురు చూసేవాళ్ళు.

ఇంతెందుకు ధార్మిక కార్యక్రమాలపై ఆకాశవాణి ప్రత్యక్ష ప్రసారానికి కూడా మంచి స్పందన ఉండేది. నావరకైతే ఆకాశవాణి చక్కని ప్రోత్సహాన్నిచ్చింది. అనేక మార్లు నా కవితలు ప్రసారం చేయబడినాయి. తొలిసారిగా ఆకాశవాణిలో పాల్గొనే అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన ఆనాటి స్టేషన్ డైరెక్టర్ డాక్టర్ శ్రీ పాలకుర్తి మధుసూదన్ రావు గారిని నేను ఎప్పటికి గుర్తుంచుకుంటాను. ఇక ఎక్కువగా కవి సమ్మేళనలు నిర్వహించడంలో సాహితీ సంస్థల పాత్ర ఎంతో ఉంది. వీటి వలన యువ కవులు రచయితలు వెలుగులోకి వస్తున్నారు.

*మీరు పుస్తక రూపంలోకి తెచ్చిన మీ రచనల గురించి వివరంగా చెప్పండి?

నేను గత నాలుగున్నర దశాబ్దాలుగా కవితా రచన చేస్తున్నాను. ప్రస్తుతం న్యాయవాదిగా వరంగల్, హన్మకొండ జిల్లా న్యాయస్థానాలలో పనిచేస్తున్నాను.. నేను ఇప్పటివరకు 3 (మూడు) కవితా సంకలనాలు విలువరించాను. నాల్గవ కవిత సంకలనాన్ని త్వరలో విలువరించాలనుకుంటున్నాను. నా కవితా సంకలన వివరాలు.

1) 1993లో ‘వాస్తవంలోకి…’ ప్రజాకవి, పద్మవిభూషణ్ కీ.శే. కాళోజీ నారాయణరావు గారితో ఆవిష్కరించబడినది.

2) 1996లో ‘క్రాంతి యాత్ర…’ శ్రీ రావులపాటి సీతారామారావు., IPS., IGP of Police గారిచే ఆవిష్కరించబడినది.

3) 2012లో ‘శ్వేతపత్రం…’ శ్రీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, IPS., IG of Police గారిచే నా పదవి విరమణ సందర్భంగా ఆవిష్కరించబడినది.

నా తొలి కవితా సంకలనాన్ని కీ.శే. ఆచార్య రేగులపాటి మాధవరావు గారు హిందీలో ‘సత్య్ కీ ఓర్..’ అనే పేరుతో అనువదించారు.

నా రచనలన్నీ నేటి.. నాటి.. సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశాల నేపథ్యంతోనే వ్రాయడం జరిగింది.

‘నిజం నా నినాదం
నిష్కర్షే నా నైజం
సంఘం నా నివాసం
సంఘీభావం నా సందేశం’

పై మూడు కవితా సంకలనాలలో.. ఇదే అంతఃసూత్రం.

*తెలుగుభాష అభివృద్ధికి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వపరంగా, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? వాటి పై మీ స్పందన ఎలాంటిది?

స్వతః కవి, సాహితీవేత్త అయిన తెలంగాణ ముఖ్యమంత్రి గౌ. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చూపిస్తున్న శ్రద్ధ వలన మన రాష్ట్రంలో సాహిత్యం శోభాయమయం అవుతున్నది.

*వరంగల్ సాహితీ రంగంలో మీ పాత్ర ఎలాంటిది? అక్కడి సాహిత్య సంస్థలు మీకు ఇస్తున్న ప్రోత్సాహం ఎలాంటిది?

వరంగల్‌లో నేను స్థానిక సహృదయ సాహిత్య సంసృతిక సంస్థలో సభ్యునిగా 1995 నుండి కొనసాగుతూ వారు నిర్వహించే కార్యక్రమాలకు తోడ్పాటునందిస్తూ యథోచిత సాహితీ సేవ చేస్తున్నాను.

*ఆధునిక తెలుగు సాహిత్యంలో మీకు నచ్చిన కవి ఎవరు? ఎందుచేత?

నాపైన మహాకవి శ్రీశ్రీ దాశరథి, డా. సి.నారాయణ రెడ్డి, కాళోజిగారి ప్రభావం ఉంది.

* మీ అవార్డులు-సన్మానాల గురించి చెప్పండి.

నాకు అవార్డులు ఏమీ రాలేదు. వాటిని ఆశించే స్థాయి రచన నేను చేయలేదేమో. 1986లో అనుకుంట వరంగల్ కళావాహిని వారు ఉత్తమ కవిగా సన్మానించి కీ.శే. ప్రజా కవి, పద్మవిభూషణ్ శ్రీకాళోజి నారాయణ రావు గారి చేతుల మీదుగా అవార్డు అందించారు. ఇది ఒక అపురూప జ్ఞాపకం.

కాళోజీ గారితో శ్రీ మనోహరరావు

నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు హృదయ పూర్వక ధన్యవాదములు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here