సంభాషణం: కవి మువ్వా శ్రీనివాసరావు అంతరంగ ఆవిష్కరణ

35
9

[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం ప్రసిద్ధ కవి మువ్వా శ్రీనివాసరావు గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]

సాహితీ సిరిసిరి మువ్వ శ్రీ మువ్వా శ్రీనివాసరావు!!

కవి మువ్వా శ్రీనివాసరావు (ఖమ్మం)

[dropcap]ఒ[/dropcap]కప్పుడు ఖమ్మం అనగానే కమ్యునిస్ట్ పార్టీ గుర్తుకొచ్చేది. తరువాతి కాలంలో మాజీ ముఖ్యమంత్రి (ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం) జలగం వెంగళరావు గుర్తుకువచ్చేవారు. సాహిత్యపరంగా ఇప్పుడు ఖమ్మం అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది కవి శ్రీ మువ్వా శ్రీనివాసరావు పేరు. ఇది ఎంతమాత్రమూ అతిశయోక్తి కాబోదు. పనిమంతులకు ప్రచారం అక్కరలేదు. ప్రచారం లేకుంటే, ఎన్ని మంచిపనులు చేసినా ప్రజలలోకి అవి చేరవు, అందువల్ల గొప్పవారు సైతం మరుగున పడిపోతుంటారు. నా దృష్టిలో అలాంటివారిలో కవి శ్రీ మువ్వా ఒకరు.

ఆయన ఒక్క కవి మాత్రమే కాదు, మంచి విద్యావేత్త, సాహిత్యాభిమాని, సాహిత్య ప్రచారకుడు. మంచి రచనలను, రచయితలని గుర్తించి వారిని ప్రొత్సాహించడం, గౌరవించడం, వారి రచనలను పుస్తక రూపంలో తీసుకు రావడానికి ఆర్థిక సహాయం చేయడం, అంతమాత్రమే కాకుండా, లేత… లేత… రచయితలను, రచయిత్రులను అనేక రకాలుగా ప్రోత్సహించడం, స్వంత డబ్బా కొట్టుకోకుండా శ్రీ మువ్వా శ్రీనివాసరావు గారు చేస్తున్న మంచి పనులలో కొన్నిమాత్రమే!

ఇంకా అనేక సేవాకార్యక్రమాలు ఆయన పద్దులో ఉన్నాయి. ఆయన రచనలు, స్వదేశంలో, స్వరాష్ట్రంలో మాత్రమే కాకుండా, అమెరికా దేశంలోని అనేక రాష్ట్రాలలో ఆవిష్కరింపబడ్డాయి. ఇంతెందుకు ఆయన సాహితీ ప్రస్థానం గురించి, ఇతర సేవా కార్యక్రమాల గురించీ శ్రీ మువ్వా గారి మాటల్లోనే చదువుదాం.

~

*శ్రీనివాసరావు గారూ… సంచిక అంతర్జాల మాసపత్రిక పక్షాన మీకు స్వాగతం.

**నమస్తే అండి… థాంక్యూ

*శ్రీనివాస్ గారూ.. మీ తల్లిదండ్రుల గురించి.. మీ గ్రామ నేపథ్యం గురించి.. మీ కుటుంబ నేపథ్యం గురించి.. మీ చదువు గురించి.. ప్రస్తుతం మీరు చేస్తున్న వృత్తి గురించి క్లుప్తంగా వివరిస్తారా?

**మా గ్రామం పేరు లంకపల్లి, పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా,తెలంగాణ. ఏ గ్రామానికి లేని విశిష్టత మా గ్రామానికి ఉంది, అదేమిటంటే ఎటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేని సమయంలోనే, వందల ఏళ్ళ క్రితం నుండి, మా గ్రామం పక్కనున్న అడవి నుండి ఒక జీవ(జల)ధార 365 రోజులు మా గ్రామంలోకి ప్రవహిస్తూ ఉంటుంది, వర్షాలు ఇబ్బంది పెట్టిన సంవత్సరాల్లో కూడా మా ఊళ్ళో వరి పంట పుష్కలంగా పండేది, వందల ఏళ్ల క్రితం నుండే ‘వరి అన్నం ముద్ద’ రుచి చుసిన గ్రామం మాది (గ్రామంలో ఉన్న అందరికీ అది సాధ్యం కాలేదు కానీ మా గ్రామానికి ఎందుకో ఆ ప్రత్యేకత మాత్రం ఉంది).

అమ్మా నాన్న లతో శ్రీ మువ్వా శ్రీనివాసరావు

అమ్మ గారి పేరు పద్మావతి, నాన్న గారి పేరు రంగయ్య, మాది మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం, అమ్మది నాన్నది అదే ఊరు అవ్వడం, అమ్మ తరఫున నలుగురు తాతలు నాన్న తరఫున నలుగురు తాతలు ఒక విధంగా చెప్పాలంటే ఊరంతా బంధువులే! మేము నలుగురు అన్నదమ్ములం, ఒక చెల్లెలు, నేను రెండవ వాడిని. (1984) ఎనభై నాలుగులో నా వివాహమైంది, నాకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు, ఇదీ మా కుటుంబ నేపథ్యం.

కవి గారి కుటుంబం: కుడినుండి మువ్వా శ్రీనివాసరావు, – లక్ష్మి, స్పందన (కూతురు) రాకేష్ (అల్లుడు) సంక్రిత్ ( మనవడు) సందీప్ (కొడుకు) శాంతి ( కోడలు) జోయా (మనవరాలు).

నేను ఒకటో తరగతి నుండి మూడవ తరగతి వరకూ రంగరాజు మాస్టారు దగ్గర ప్రైవేట్‌గా చదువుకున్నాను.

4వ తరగతి నుండి 10వ తరగతి వరకు లంకపల్లి ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్మీడియట్ సత్తుపల్లి గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో, డిగ్రీ ఖమ్మంలోని ఎస్.ఆర్. అండ్ బి.జి.ఎన్.ఆర్ కళాశాలలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ MSc (Tech) అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ లోనూ చదువుకున్నాను.

చదువు పూర్తయిన తరువాత కొంతకాలం ప్రైవేట్ ఇండస్ట్రీలో ఆర్ అండ్ డి ఇంజనీరుగా పని చేశాను, తర్వాత ఖమ్మంలో ‘క్రాంతి జూనియర్ కళాశాల’ను మిత్రులు కుటుంబ సభ్యులతో పాటు స్థాపించాను. తర్వాత ఎంబీఏ కళాశాల, ఎంసీఏ కళాశాల, బీఈడీ కళాశాలను స్థాపించి వాటికి కరస్పాండెంట్‌గా ఆ సంస్థలను నిర్వహిస్తున్నాను, ఇదండీ క్లుప్తంగా నా నేపథ్యం…

*శ్రీనివాసరావు గారూ ఒకప్పుడు మొత్తం ఖమ్మం ఎర్రజండా నీడకింద ఉండేది కదా! దాని ప్రభావం మీ వ్యక్తిగత జీవితంపైన, ఎంతవరకూ, ఎలా  పడింది.

 **నిజమేనండి, ఇప్పటికీ ఎర్రజెండా ప్రభావం ఏదో మేరకు కొనసాగుతూనే ఉంది, నా విషయానికి వస్తే నూరు శాతం ప్రభావం నా మీద ఉంది, మా బంధువు నున్నా ముత్తయ్య గారు సాయుధ పోరాట యోధులు, వారి గురించి కథలు కథలుగా చెప్పుకోవడం విన్నాను.

ఇప్పటికీ వారి ఊర్లో ఎక్కువ మంది కమ్యూనిస్టు పార్టీ లోనే ఉన్నారు, వాళ్ళు చుట్టపు చూపుగా మా తాత గారింటికి వచ్చే ప్రతిసారీ ప్రజాశక్తి పేపరు తెచ్చేవారు. తెలిసీ తెలియని వయసైనా దాన్ని పూర్తిగా చదవడం, వాళ్ళల్లో నా సమవయస్కుల ద్వారా పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి తెలుసుకోవడం జరిగేది. మా తాత పటేల్, వూళ్ళో తగాదాలన్నీ ఆయనే తీరుస్తూ ఉండేవారు, పక్కనే ఉన్న నాకు అన్యాయం అనిపించి నప్పుడల్లా వారితో గొడవపడే వాణ్ణి. అప్పుడు ఆయన నవ్వుతూ మా ఇంట్లో ఇంకో ముత్తయ్య పుట్టాడు అంటూ ఉండటం వల్ల, నాకు తెలియకుండానే మానసికంగా అవతలి పక్షంలో చేరిపోయాను, అప్పటి నుండి ఇప్పటి వరకూ ఎర్రజెండా నీడలోనే ఉన్నాను

*వామపక్ష భావజాలం, మీ కవిత్వంలో కంటే మీ చేతల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని వెనుక ఏదైనా ప్రత్యేక నేపథ్యం వుందా?

**ఇది చాలా తేలికైన ప్రశ్న ఎందుకంటే నేను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ CPIM మెంబర్ని, సహజం గానే చేతలు అలా అనిపిస్తాయి, ఇకపోతే కవిత్వం రాసే వరకే నాది, రాసి వదిలాక ఎవరికి ఏది కావాలో వారే ఎంచుకుంటారు కదా.

అందులో ఉన్న కేవలం కవిత్వంతో కొందరు, మానవీయ కోణంతో మరికొందరు, వామపక్ష భావజాలంతో కొందరు  ప్రయాణిస్తారు.

*కవిత్వం రాయాలనే ఆలోచన మీకు ఎప్పుడు ఎలా కలిగింది? దీని వెనుక ఎవరి ప్రేరణైనా ఉందా? 

** అది 1972. నేను ఎనిమిదో తరగతిలో ఉన్నాను. అప్పుడే మా స్కూల్‌కి ట్రాన్స్‌ఫర్ మీద వచ్చిన లెక్కల మాస్టారు శ్రీ తోటచర్ల వేంకట పూర్ణ చంద్ర రావు గారు నాకు కవిత్వ ప్రేరణ, ఆయనే కవిత్వ గురువు కూడా. ఆయన చేతి రాతతో దీపిక, ప్రతిధ్వని, అనే పత్రికలు వచ్చేవి. అందులోనే కవిత్వ అక్షరాలు దిద్దుకొన్నాను, తరువాత తెలుగు మాస్టారు పులిచెర్ల వసంతం గారు రేడియో సమస్యాపూరణంకి పద్యాలు రాయించడం, తరువాత శ్రీశ్రీ మహాప్రస్థానం చదవడం, ఆయనకు ఏకలవ్య శిష్యుడు అయిపోవడం జరిగింది.

ప్రముఖ హిందీ కవి మంగ్లేశ్ దబ్రాల్, శివారెడ్డి గార్లతో శ్రీ మువ్వా..

*చదువుకునే రోజుల్లో సాహిత్యం పట్ల మీకు అభిరుచి ఎక్కువ ఉండేదా? అలా అయితే… మీ చదువుమీద అది ఎలాంటి ప్రభావం చూపించింది?

**పదవ తరగతి పూర్తయ్యాక కల్లూరు జూనియర్ కళాశాలలో మహా కవి శ్రీశ్రీ ఉపన్యాసం (ముఖ్యంగా ఆర్టిస్టువి కావాలన్నా సైంటిస్టువి కావాలన్నా ముందు నీవో కమ్యూనిస్టువి కావాలోయ్ అన్న మాటలు) నన్ను కవిత్వం నుండి కమ్యూనిస్టు పార్టీల వైపు నడిపించేలా చేసింది. చదువుకొనే రోజుల్లో కవిత్వం చదవడం, కవుల ఉపన్యాసాలు వినడం, అరకొర మాగజైన్స్‌కు రాయడం మాత్రమే చేశాను. అధ్యయనం, పోరాటం మా విద్యార్థి సంఘ నినాదం. అందుకే ఆ రెండు (చదువు, పోరాటం) పెద్ద ఆటంకాలు లేకుండానే సాగిపోయాయి.

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కేదార్ నాథ్ సింగ్ గారితో ఒక రోజు అంతా (నాగార్జున సాగర్ లో) ఉన్న సందర్భంలో

*చాలా మంది కవులలో, వారి కవిత్వంలో వారి అభిమాన రచయితల కవిత్వ అనుకరణ కొద్దిగానైనా కనిపిస్తుంది. కాని మీ కవిత్వంలో ఒక ప్రత్యేకత, ఒరవడి కనిపిస్తాయి. మీకు ఇది ఎలా సాధ్యం అయింది?

**నిజమే, చాలా మంది కవుల రచనలలో అది కనిపిస్తుంది. నేనూ మినహాయింపు కాదు. తొలినాళ్ళ నా వాక్యాలలో శ్రీశ్రీ ప్రభావం పూర్తి స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు మీరు చదువుతున్న నా కవిత్వం అంతా నేను 52 ఏళ్ల జీవితం దాటి వచ్చాక, ఎన్నో అనుభవాలను, అనుభూతులను, మూట కట్టుకొన్నాక, నాదైన వాక్యంలో నేను స్థిరపడ్డాక రాసింది, అయినా సూక్ష్మంగా పరిశీలిస్తే ఎక్కడో అక్కడ ఆ ఛాయలు కనిపిస్తాయి. శ్రీశ్రీ జయంతి రోజునో, వర్ధంతి రోజునో, ఆయన స్మృతిలో అలానే వాక్యం నిర్మించిన సందర్భాలు ఉన్నాయి, అవీ నా సంపుటాలలో గమనించవచ్చు, కవిత్వ రహస్యం అంత తేలికగా అర్థం కాదు, ఆ ప్రయత్నంలో ఉంటే నీదే అయిన నడక ప్రారంభం అవుతుంది, నేను అలాంటి ప్రయత్నం ఏదో చేస్తూ ఉండటమే ఓ కారణం అయి ఉంటుంది.

నగ్నముని గారితో
సి.నా.రె…తో శ్రీ మువ్వా.

*ప్రపంచంలో సాదారణంగా ఎప్పుడూ ఏవో సంచలనాలు మనం ఎదుర్కొంటుంటాం. అలాంటి వాటిలో అసాధారణమైనది, కొద్ది సంవత్సరాల క్రితం యావత్ ప్రపంచాన్నీ గడగడలాడించిన కోవిడ్-19 (కరోన). దానికి స్పందించి మీరు ఒక తెలుఁగు కావ్యమే రాశారు. ఈ ఆలోచన మీకు ఎందుకు, ఎలా వచ్చింది? దీనిపై పాఠకుల స్పందన ఎలా ఉంది?

**ఈ ప్రశ్నకు పూర్తి సమాధానం ‘వైరాయణం’ కావ్యం నామాటలో రాశాను, అడిగారు కనుక క్లుప్తంగా చెబుతాను, లాక్దౌన్ ప్రారంభం మొదటి మూడు నాలుగు రోజులు సంబరంగానే సాగింది, తరువాత క్రమంగా ఉక్కపోత పోయడం మొదలయ్యింది, ఉక్కపోత తట్టుకోలేక దానిని నాలుగు వాక్యాలలో పారబోసి అంతటితో ఆగక నా సెల్ ఫోన్‌లో ఉన్న 2500 మందికి WhatsApp ద్వారా పంపడం మొదలెట్టాను. వాటిని గమనించిన సిరివెన్నల గారు, సుద్దాల అశోక్ తేజ గారు, బావున్నాయి వీటిని ఇలా కొనసాగించు, వచన మకుట శతకంగా వేద్దాం అని వారు అనడం జరిగింది, కానీ ఎన్నని రాయను అనుకొంటూ ఉన్నప్పుడు, కోవిడ్ సాకుగా అనేక సామాజిక, మానసిక రుగ్మతలను గురించి మాట్లాడుతూ పోదాం అనుకోని రాస్తూ పోతూ ఉన్నప్పుడు, పాఠకులు, అభిమానులు, అందించిన సహకారం మరువలేనిది. ఒక్కొక్కరు ఒక్కో సమస్యను నా దృష్టికి తీసుకురావడం, దాన్ని నేను అక్షరాల లోకి అనువదించడం చక చక జరిగిపోయింది. నేను అప్పుడు అమెరికాలో ఉండటం, ఇక్కడి మన వాళ్ళ సంవేదనలు వినడం మూలంగా సమస్త ప్రపంచ ప్రజల సామూహిక ఆర్తనాదాన్ని వినగలిగాను, ఆ కాలాన్ని చేతనైన మేర రికార్డ్ చేయగలిగాను. పాఠకుల స్పందన కావ్యం రాక ముందే తెలిసిపోయింది కదా, దానికి నిదర్శనమే, వైరాయణం పుస్తకం ఆవిష్కరణ నేను అమెరికాలో ఉండటం మరియు ఇంకా కోవిడ్ తగ్గక పోవడం మూలంగా జూమ్‌లో నిర్వహిస్తే 800 వందల మంది (జూమ్ 500 మరియు యూట్యూబ్ 300) హాజరై జయప్రదం చేయడం.

వెల్చేరు నారాయణ రావు గారితో
ప్రముఖ కవులతో ఓ..సాయంత్రం

*హైదరాబాద్ తర్వాత ఖమ్మం పెద్ద సాహిత్య కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నయి. ఇందులో మీ పాత్ర ఎలాంటిది?

**పెద్ద సాహిత్య కేంద్రం అంటే ఎక్కువ మంది రాస్తున్న కవులు ఉండటం, ఎక్కువ సాహిత్య కార్యక్రమాలు అలాగే ఎక్కువ సాహిత్య సేవ జరుగుతూ ఉండటం, ఈ రెండింటి దృష్ట్యా చూసినట్లయితే, ఖమ్మం పెద్ద సాహిత్య కేంద్రమే! ప్రస్తుతం ఖమ్మంలో శతాధిక కవులు వివిధ ప్రక్రియల్లో సాహిత్యాన్ని సృష్టిస్తూ ఉన్నారు, అనేక సంస్థలు ఖమ్మం కేంద్రంగా పని చేస్తూ ఉన్నాయి, తెలంగాణ సాహితీ, అక్షరాల త్రోవ, వికాస వేదిక, సునంద గారు నిర్వహించే ఫౌండేషన్ కార్యక్రమాలు, సీతారాం నిర్వహించే మాణిక్యమ్మ పురస్కారాలు, ఇంకా ధ్రువ కోకిల సంస్థ నిర్వహించే కార్యక్రమాలు, ఇలా చెప్పుకొంటూ పోతే చాలా ఉన్నాయి. ఖమ్మం సంస్థల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి అన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తాయి, ఖమ్మానికి – ఖమ్మం జిల్లాకు పరిమితమైన సందర్భాలు చాలా అరుదు. అందుకే మీరు ఖమ్మం హైదరాబాద్ తరువాత పెద్ద సాహిత్య కేంద్రంగా ఎదుగుతున్నదని అనగలిగారు, ఇకపోతే దాంట్లో నా పాత్ర ఏమిటనేది ప్రశ్న.

శివారెడ్డి గారికి ‘మువ్వా పద్మావతీ రంగయ్య పురస్కారం’ ఇస్తున్న సందర్భంగా….

ఎప్పుడూ నన్ను ఒక స్వప్నం వెంటాడుతూ ఉండేది అదేమంటే రాజకీయ బహిరంగ సభల లాగా సాహిత్య బహిరంగ సభలు జరపాలని, దాన్ని మొదటిగా మహా సంకల్పం పేరుతో ఖమ్మం మిత్రుల సహాయంతో నిర్వహించిన శ్రీశ్రీ శజయంతి సభల ద్వారా సాకారం చేసుకో గలిగాను. మొత్తం 27 సభలలో ప్రతి సభలో రెండు వేల పైచిలుకు విద్యార్థులు ఉండేలా నిర్వహించగలిగే అవకాశం దక్కింది. శ్రీశ్రీ విగ్రహ ఆవిష్కరణ సభలో వేలాది మంది విద్యార్థులతో మహా సభనే నిర్వహించాం, అయితే ఇక్కడ ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. సమాజం లోని వివిధ వర్గాల ప్రజలతో కూడా ఇటువంటి సాహిత్య సభలే నిర్వహించాలనే తలంపుతో మొదటిగా నా ‘సమాంతర ఛాయలు’ కవితా సంపుటి ఆవిష్కరణ సందర్భంగా దాన్ని నిజం చేసుకొన్నాను.

హైదరాబాదులో సమాంతర ఛాయలు ఆవిష్కరణ సందర్భంగా

వేలాది ప్రజల సమక్షంలో ఆవిష్కరణ జరుపుకున్నాను, ఇలా చేతనైన రీతిలో సాహిత్య ప్రచారం ప్రధానంగా ఎంచుకొని, మా అమ్మా నాన్నల పేరుమీదుగా ‘మువ్వా పద్మావతి రంగయ్య ఫౌండేషన్ ‘స్థాపించి ప్రతి ఏటా లబ్ధప్రతిష్ఠులైన వారికి వేలాదిమంది ప్రజల సాక్షిగా వందలాది మంది సాహిత్యకారుల సాక్షిగా పురస్కారాలు అందజేస్తూ, కొన్ని పుస్తకాల ప్రచురణ బాధ్యత స్వీకరిస్తూ, ‘నేను సైతం’ అంటూ మిగతా సంస్థల లానే నా పని నేను చేస్తూ పోతున్నాను. అలాగే ఖమ్మం సాహితీ మిత్రులతో కలసి రెండేళ్ల క్రితం ‘జాషువా సాహిత్య వేదిక’ ఏర్పాటు చేసుకొని, అనేక ప్రత్యక్ష అలాగే అంతర్జాల సమావేశాలు నిర్వహించి సాహిత్య సేవ చేస్తున్నాము.

మిత్రులతో కలిసి మహాకవి శ్రీశ్రీ విగ్రహం వద్ద (ఖమ్మం).

ఈ రెండు ఏళ్ల లోనే వందలాది మందితో 50 పైగా జూమ్ సమావేశాలు జరిపాం, తెలుగులో ప్రసిద్ధ సాహిత్యకారులంతా పాల్గొనేలా చేయగలిగాం. తానా (అమెరికా) వారితో కలసి దాశరథి సోదరుల విగ్రహాలు ఏర్పాటు చేసుకొన్నాము. సాహిత్య కార్యశాలలు నిర్వహించాం, పైన చెప్పిన అన్నింటిలోనూ నేను ప్రధాన పాత్ర వహించాను, అదే నా పాత్ర. ఈ సంవత్సరం నుండి కొంతమంది కవి మిత్రులం కలిసి ‘ఖమ్మం ఈస్తటిక్స్’ అనే సంస్థను ఏర్పాటు చేసుకొన్నాము, దాని ద్వారా ఉత్తమ కవితా సంపుటికి, అలాగే ఉత్తమ కథలకు పురస్కారాలు ఇవ్వాలని అనుకున్నాము. ప్రతి ఏటా నవంబరు నెలలో పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది.

హరిబట్టు మొదలు భక్త రామదాసు, చందాల కేశవదాసు నుండి హీరాలాల్ మొరియో వరకూ ఎందరో మహానుభావులు ఖమ్మం సాహితీ క్షేత్రాన్ని సారవంతం చేసి వెళ్లారు, వారందరినీ తలుచుకుంటూ ఖమ్మం సాహితీ గుమ్మం అనేది చిరస్థాయిగా నిలచి పోవాలని ఆశిస్తున్నాను.

ప్రజ్వలిత గౌరవ అధ్యక్షుడిగా ప్రసంగిస్తూ శ్రీ మువ్వా శ్రీనివాసరావు

ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇంకో రెండు విషయాలు మీకు చెప్పాలి ఒకటి నేను ‘ప్రజ్వాలిత’ తెనాలి గౌరవ అధ్యక్షునిగా ఉండి, సోదరుడు దుర్గా ప్రసాద్‌తో కలసి అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహించాము, అనేక పురస్కారాలు అందించాము. ఇప్పుడు ఆ మిత్రుడు అందరినీ వదలి వెళ్ళిపోయాడు. ఇంకో సోదరుడు ప్రఖ్యాత కవి, ‘అరుణ్ సాగర్ ట్రస్ట్’ నిర్వాహకులలో ఒకనిగా ఉన్నాను. ప్రతి ఏటా అరుణ్ సాగర్ స్మారకార్థం విశిష్ట పాత్రికేయ పురస్కారం, విశిష్ట సాహిత్య పురస్కారం అందజేస్తున్నాము.

*మీరు వృత్తిపరంగా విద్యారంగంతో పుర్తిగా మమేకమైపోయివున్నారు కదా! నేటి యువతీ యువకుల్లో తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల స్పందన ఎట్లా వుంటున్నది? ఎందుచేత?

**ఇది మీకు తెలియని విషయం ఏమీ కాదు. కానీ మళ్ళీ మరోసారి గుర్తుచేసుకుందాం, ఎక్కువ మంది విద్యార్థులు 10వ తరగతి తరువాత వృత్తిపరమైన కోర్సులు చదివే వాళ్ళు, వాళ్ళకి తెలుగు చదివే అవసరమే లేదు. ప్రయివేటు పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదివే వారికి ఆ స్పృహే లేదు.

ప్రవాసాంధ్రుల తరువాతి తరానికి తెలుగులో మాట్లాడటమే రాదు, ఇక ఎవరో కొంత మంది ఉత్సాహం ఉన్న విద్యార్థులు, లేదా అనివార్యంగా డిగ్రీ చదవాల్సి వచ్చిన విద్యార్థులు మాత్రమే తెలుగు చదువుతున్నారు. ఇంటర్‌లో మార్కులు ఎక్కువ సంపాదించాలని తెలుగుకు ఉరి ఎప్పుడో వేసాం.

ఈ డిజిటల్ జనరేషన్ పుస్తకాలు చదవటం చాలా తగ్గిపోయింది, కానీ చాలా ఆశ్చర్యంగా మనం గమనించినట్లయితే వేలాది మంది యువకులు ఇప్పుడు అంతర్జాలంలో కవిత్వం రాస్తున్నారు. నిత్యం బిజీగా ఉండే సాప్ట్‌వేర్ ఉద్యోగులు కూడా కవిత్వం రాస్తున్నారు. భాష పట్ల ప్రేమ లేకనో, సాహిత్యం పట్ల ఆసక్తి లేకనో యువతీ యువకులు దూరంగా ఉన్నారని నేను అనుకోవడం లేదు. ఈ పోటీ ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితంలో మనకు అలా అనిపిస్తుంది, కానీ, సమాజము, రాజ్యము, కలసి ప్రయత్నిస్తే అంతా సానుకూలంగా మారి, విద్యార్థులు తెలుగు భాష, మరియు సాహిత్యం పట్ల ఆసక్తిని అనురక్తిని ప్రదర్శిస్తారనే నమ్మకం నాకుంది.

*మాతృబాష తెలుగుగా గల యువతీ యువకులను, తెలుగుసాహిత్యం పట్ల ఆకర్షితులను చేయడానికి మన వంతు కృషిగా ఏమి చేయాలంటారు?

**లబ్దప్రతిష్ఠులైన వారి సాహిత్యాన్ని విద్యార్థులకు పరిచయం చేయడం వారిలో ఆసక్తిని రేకెత్తించడం చేయాలి, మేము శ్రీశ్రీ సాహిత్యాన్ని వేలాది మంది పిల్లలకు పరిచయం చేస్తే ఆ ఏడు జరిగిన బుక్ ఫెయిర్‌లో, మీకు ఇష్టమైన కవి ఎవరు, ఆయన గురించి రాయండి అంటే 90 శాతం విద్యార్ధులు మహాకవి శ్రీశ్రీ గురించి వ్రాశారు. అలాగే ఈ ఏడాది నుండి జాషువా సాహిత్య వేదిక తరపున జాషువా సాహిత్యాన్ని పరిచయం చేయాలని అనుకుంటున్నాం, అయితే నాకున్న అభిప్రాయం ఏమంటే సాహిత్యకారులను శిక్షణ ద్వారా తయారు చేయలేము, కానీ నిరంతరం వారి చుట్టూ సాహిత్య వాతావరణం నెలకొలపేందుకు కృషి చేస్తూ పోతే, కచ్చితంగా కొంతమంది మంచి సాహిత్యకారులుగా మొలుచుకు వస్తారు, అటువంటి సాహిత్య వాతావరణం మా బడిలో మా మాస్టర్లు అనాడు నెలకొల్ప బట్టే ఈనాడు నేను మీ ముందు నిలబడగలిగాను.

*మీరు తెలుగు కవిగా, సాహిత్య ఆరాధకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. మీ వెనుక వస్తున్న తరానికి సంబంధించి ఎంతమంది సాహిత్యకారులను మీరు తయారు చేసారు?

**మీకు ముందే చెప్పాను, మన శిక్షణ ద్వారా సాహిత్యకారులను నిర్మించలేము, చేతనైనంత సాహిత్య వాతావరణాన్ని నిర్మించుకుంటూ పోవడమే మనం చేయాల్సిన పని. నేను నా చేతనయిన మేరకు మా జిల్లాలో ఆ పని చేస్తూ పోతున్నాను, కొంతమంది యువ రచయితలకు యువ పురస్కారాల పేరుతో ప్రోత్సహించాను, ఇంకొంతమందికి బుక్ వేసుకోవడానికి చేతనైన ఆర్థిక సహాయం కూడా చేశాను.

* మీరు, మీ రచనలు, మనకి అందుబాటులో వున్న పత్రికలలో ప్రకటిస్తున్నట్టు లేదు? ఎందుచేత?

**బహుశా.. కట్టమంచి రామలింగారెడ్డి గారు అనుకుంట సరదాగా ఒక మాట అన్నారు, అదేమంటే “పాలు అమ్మకానికి దొరుకుతున్నప్పుడు గేదలను సాకడం ఎందుకు” అని. అద్భుతమైన సోషల్ మీడియా మన చేతుల్లో ఉండగా, పత్రికలకు పంపడం ఎందుకు? వచ్చేదాకా ఎదురుచూడటం ఎందుకు?, వచ్చాక ఫలానా పత్రికలో నా కవిత్వం వచ్చింది అని మళ్ళీ సోషల్ మీడియాలో ప్రచారం మొదలెట్టడం ఎందుకు? అందుకే, పత్రికలకు పంపడంలో వ్యతిరేకత లేదు కానీ అంత ఆసక్తి లేదు (ఇప్పుడు చాలా మంది పత్రికలను అంతర్జాలం లోనే చదువుతున్నారు)

*పార్టీల పరంగా అనేక పత్రికలు మనకి ఈనాడు అందుబాటులోవున్నాయి కదా! ఈ పత్రికల సాహిత్య సేవ గురించి వ్యాఖ్యానించండి.

**ఏవో కొన్ని పత్రికలను మినహాయిస్తే, మహాకవి శ్రీశ్రీ అన్నట్లు “ఈ పత్రికలు పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విష పుత్రికలు”. పత్రికలు సర్వే చేయించుకొని ఏ వార్తలకు ఎంత మంది రీడర్స్ ఉన్నారో తెలుసుకొని ఆ వార్తలే రాస్తున్న సందర్భంలో ఉన్నాము. కేవలం 2 శాతం మంది చదివే సాహిత్య విషయాలు గురించి ఎవరు ప్రచురిస్తారు. అయినా సంతోషం ఏమిటంటే ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, నవ తెలంగాణ, ప్రజాశక్తి, లాంటి కొన్ని పత్రికలు సాహిత్య సేవ చేస్తున్నాయి, ఆశ్చర్యంగా కొవిడ్ సమయంలో చాలా పత్రికలు కవిత్వ పోటీలను నిర్వహించాయి, ప్రజలను చైతన్యం చేయడానికి కవిత్వం మంచి సాధనమని గుర్తించాయి అందుకు చాలా సంతోషం.

*ఇప్పటివరకూ మీరు వెలువరించిన మీ రచనల గురించి చెప్పండి.

**మొదటి కవితా సంపుటి సమాంతర ఛాయలు 2013లో, రెండవది 6th ఎలిమెంట్ 2014లో, మూడవది వాక్యాంతం 2019లో, నాలుగు వైరాయణం 2020లో విడుదల అయ్యాయి. సమాంతర ఛాయలు కన్నడం లోకి సాహితీ మిత్రులు లక్కుర్ ఆనంద్ అనువదించారు. ఇప్పుడు రెండో ప్రింట్ పూర్తి చేసుకొంది, ఆయనే 6th ఎలిమెంట్ కన్నడం లోకి అనువదించారు, ప్రింట్లో ఉంది. ఆచార్య సత్య వాణి గారు సమాంతర ఛాయలు తమిళం లోకి అనువదించారు. ప్రింట్‌లో ఉంది. ముఖ్యంగా శాంత సుందరి గారు సమాంతర ఛాయలు హిందీ లోకి అనువదించారు. అనివార్య కారణాలవల్ల చాలాకాలంగా ప్రింట్ ఆలస్యం అవుతుంది, శాంత సుందరి గారు కీర్తిశేషులు అయ్యారు, త్వరలో వారికి అంకితం ఇస్తు ఆ గ్రంథం తీసుకొస్తాను (శాంత సుందరి గారికి క్షమాపణలు). మరో సాహితీ మిత్రుడు అర్ధాంతరంగా వెళ్లిపోయిన శ్రీరామతీర్థ, నా పద్యాలు కొన్ని ఇంగ్లీష్ లోకి అనువదించారు, దానిని తీసుకు రావాలి.

నా పద్యం ఒకటి కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థులకు సిలబస్‌ పెట్టింది, ఒక ఎంఫిల్, రెండు యూనివర్సిటీ లలో నా సాహిత్యం పై పరిశోధన జరుగుచున్నది.

*మీరు అందుకున్న అవార్డులూ, సన్మానాల గురించి వివరించండి.

 **అవార్డుల విషయానికి వస్తే మొదటిగా అవంత్స సోమసుందర్ గారి గురించి చెప్పాలి, వారు 92 ఏళ్ల వయసులో కాలు చేయి పనిచేయని దశలో, చూపు సరిగ్గాలేక చదవలేని దశలో, మేకా మన్మదరావు గారితో నా సాహిత్యం చదివించుకుని, క్రాంతి గీతాలు కవితా విపంచి అనే ఒక విమర్శా గ్రంథాన్ని రచించి ఇచ్చి, బోనస్‌గా వారు ప్రతి ఏటా ఇచ్చే ఆవంత్స సోమసుందర్ సాహిత్య పురస్కారాన్ని అందించారు.

ఆవంత్స సోమసుందర్ గారితో

అలాగే ఖమ్మం కవి మిత్రుడు సీతారాం వారి అమ్మ గారి పేరు మీద ఇచ్చే సాహితీ మాణిక్యం పురస్కారాన్ని అందజేశారు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా వారు సాహిత్య పురస్కారం అందజేశారు, అలాగే స్మైల్ పురస్కారాన్ని గిడుగు రామ్మూర్తి పురస్కారాన్ని, శిఖామణి ప్రతిభా పురస్కారాన్నికూడా అందుకున్నాను.

రామతీర్థ- జగద్ధాత్రి దంపతులు విశాఖపట్నంలో సన్మానం సందర్భంగా….
గిడుగు రామ్మూర్తి పంతులు గారి అవార్డు స్వీకరిస్తూ శ్రీ మువ్వా శ్రీనివాసరావు
శిఖామణి ప్రతిభా పురస్కారం సందర్భంగా
స్మైల్ పురస్కారాన్ని స్వీకరిస్తూ

అనేక సన్మానాలు పొందాను, అలాగే శాలువాలు మెమెంటోలతో కాకుండా అక్షర అక్షింతలతో నన్ను ఆశీర్వదించి సన్మానించినవారు ఉన్నారు. వారిలో ముందుగా సౌభాగ్య గారు ‘భ్రమలు లేని భావకుడు’ అనే విమర్శా గ్రంథాన్ని రాసి, ఆచార్య పులికొండ సుబ్బాచారి గారు ‘అదృశ్య రూప గ్రాహీ’ అనే విమర్శా గ్రంథాన్ని రాసి, చివరిగా నా మొత్తం సాహిత్యం మీద ‘దృశ్యం@576 మెగా పికల్స్’ అనే సమగ్ర విశ్లేషణా గ్రంథాన్ని రాసి కొండ్రెడ్డి వేంకటేశ్వర రెడ్డి గారు ఆశీర్వదించారు. ఇంకా ఈ గ్రంథం ఆవిష్కరణ చేయలేదు, త్వరలో ఉంటుంది.

తానా సంబరాల సందర్భంగా సన్మానం.

అంతెందుకు ఇప్పుడు మీ ఇంటర్వ్యూ జరుగుతున్న సందర్భంలోనే మా సాహితీ మిత్రులు నా నాలుగు పుస్తకాల మీద వ్యాస సంకలనం వేయాలని అనుకొని వ్యాసాల కోసం ఆహ్వానిస్తే ఇప్పటికే 300 మంది నా సమకాలీన సాహితీ మిత్రులు వ్యాసాలు పంపారంటే ఇంతకంటే గొప్ప గౌరవం, సన్మానం, పురస్కారం మాత్రం ఏముంటుంది. చివరిగా నేను సమాజానికి ఇచ్చిన సాహిత్యం కంటే రెట్టింపు గుర్తింపు గౌరవం తెలుగు సమాజం నాకిచ్చింది అనే సంపూర్ణ సంతృప్తితో ఉన్నాను.

*అనువాద ప్రక్రియలో మనం చాల వెనకబడి వున్నామన్నది తరచుగా వినబడే మాట. దీనిని మెరుగుపరుచుకోవడానికి ఎవరు, ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు?

**అవును నిజమేనండీ, అనువాదం విషయంలో వ్యక్తులు చేయాల్సిన దానికంటే ప్రభుత్వం చేయాల్సింది చాలా ఎక్కువ. ఆ పని అమృతోత్సవం జరుపుకొనే నాటికి కూడా సరిగ్గా లేనందువల్ల ఎప్పటినుండో వెనుకబడి పోయాం, అది చాలా ఖర్చుతో శ్రమతో కూడుకున్న పని. సాహిత్యం కోసం ఎంతో కృషి చేస్తున్న సాహిత్య సంస్థలు ఎన్నో ఉన్నాయి తెలుగు రాష్ట్రాలలో. వారి దృష్టిని ఆకర్షించడం ద్వారా కొంత సాధించవచ్చు, ప్రజా చైతన్యంతో ప్రభుత్వం ఆ పని చేసేలా ఒత్తిడి తేవడం వల్లనే మిగతాది సాధ్యం అవుతుంది.

* ధన్యవాదాలు శ్రీనివాసరావుగారు. సంచిక అంతర్జాల పత్రిక పక్షాన, నా పక్షాన మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలండి.

** ధన్యవాదాలు డాక్టర్ గారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here