పద్యరచనతో మొదలుపెట్టారు కదా, అది ఎంత కాలం కొనసాగింది? వచన రచనవైపు ఎప్పుడు మళ్ళారు?
1974 నుంచి 1984 వరకు పదేళ్ళ పాటు విస్తృతంగా పద్యాలు రాశాను.
ఏవైనా గుర్తున్నాయా?
ఉన్నాయండీ. చాలా పద్యాలను నేను ఇంకా ప్రచురించలేదు. తర్వాత ప్రచురిద్దామని అలా పెట్టుకుని కూర్చున్నాను. స్వదేశీ ఉద్యమం గురించి రాసిన ఒక పద్యం చెబుతాను. ఇప్పుడు మనం మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటున్నాం కదండీ, దీని మీద నేను ఓ పద్యం రాశాను. అది అప్పట్లో 1978లో ‘సమాచారమ్’లో ప్రచురితమైంది.
“నా దేశమ్మి ధరాతలంబునకు నానా ధర్మ విజ్ఞాన…” (వినిపించారు).
తర్వాత నాకు వావిలాల గోపాలకృష్ణయ్యగారంటే చాలా ఇష్టమండీ చిన్నప్పటి నుంచీ. ఆ వావిలాల వారి మీద నేను నా పద్దెనిమిదో ఏట ఒక పద్యం రాశాను. నాకు సీస పద్యం ఇష్టమని చెప్పాను కదండీ… ఈ పద్యమే నేను తర్వాత వారి జీవిత చరిత్ర రాయడానికి నాంది పలికింది.
వావిలాల వారి జీవిత చరిత్రా?
ఆఁ. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆ పద్యం తరువాత అనేక సంచికల్లో ప్రచురితమైంది. ‘సమాచారమ్’లోనూ ప్రచురితమైంది.
ఇదీ ఆ పద్యం
“గాంధేయ పోరాట ఘనతర నిలయమ్ము,
ఆంద్రోద్యమమునకు ఆటపట్టు,
గ్రంథాలయోద్యమ సంధానకత్వమ్ము
సామ్యవాదము నందు సత్యదీక్ష,
శాసన సభలలో చరియించు జనవాణి
ఆడంబరములేని అమృతమూర్తి
జాతీయ సేవలో జన్మసాఫల్యమ్ము
నీతికై నిలచెడి నియమవ్రతము
ప్రతిఫలాపేక్ష లేనట్టి ప్రజల సేవ
రమ్య ఉత్తేజ కరమైన రచనశక్తి
మేళవించిన నవ్యాంధ్ర మేటినేత
వసుధ నాదర్శ మూర్తి మా వావిలాల”.
వావిలాల వారి మీద నాకు చాలా భక్తి ఉండేదండీ. 1975లోనో, 76లోనో ఆంధ్ర దేశ గ్రంథాలయ మహాసభలు రాజమహేంద్రి గౌతమి గ్రంథాలయంలో జరిగాయి. అప్పుడు వావిలాల వారొచ్చారు. మొట్టమొదటిసారిగా అప్పుడే వారిని చూశాను. ఆ తర్వాత అనేకసార్లు వారిని చూడడం కలవడం జరిగింది.
దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు నేను ఈ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ వచ్చాను. డిగ్రీ పూర్తయ్యాకా ఎం.ఎ.కి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వెళ్ళాను. అక్కడ నేను అనువర్తిత అర్థశాస్త్రం (అప్లయిడ్ ఎకనామిక్స్)లో ఆచార్య గోగుల పార్థసారథి గారి వద్ద చదువుకున్నాను. ఆయన సుప్రసిద్ధ ఆర్థికవేత్త. అక్కడ డా. వి.ఎస్. కృష్ణ గ్రంథాలయం ఉంది. వాసిరెడ్డి శ్రీ కృష్ణ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఛాన్స్‌లర్‌గా చేశారు, యూజిసి ఛైర్మన్‌గా పని చేశారు. ఆయన పేరిట ఉన్న ఆ వి.ఎస్. కృష్ణ గ్రంథాలయంలో ఆ రెండేళ్ళూ కూడా చదువుకునేవాడిని. మాకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకే క్లాసులు ఉండేవి. 12.30కి రాగానే కాస్త అన్నం తిని ఒంటిగంట కల్లా వెళ్ళి లైబ్రరీలో కూర్చుని, రాత్రి తొమ్మిందింటి వరకూ పుస్తకాలు చదివేవాడిని. అప్పటికే సివిల్ సర్వీస్ సాధించాలనే ప్రగాఢమైన దీక్ష నాలో ఉండడం వల్ల అన్ని పోటీలలో పాల్గొనేవాడిని. ఇంటర్, డిగ్రీ చదివిన రోజుల్లో కూడా వక్తృత్వ పోటీలలో, వ్యాసరచన పోటీలలో, క్విజ్ పోటీలలో, గేయ రచన పోటీల్లో.. ఏ పోటీ ఉన్నా నేను పాల్గొనేవాడిని. అనేక బహుమతులు గెల్చుకున్నాను. ఆ విధంగా ఈ పోటీలల్ పాల్గొనడం వల్ల నేను ప్రతీ రోజూ కూడా అభివృద్ధి చెందుతూ వచ్చాను. ‘జ్ఞానాన్ని పంచకపోవడం అజ్ఞానం అని బలంగా నమ్మిన వాణ్ని నేను’. మనకున్న విజ్ఞానం నలుగురికీ పంచాలి. ఇది నేను పదో తరగతిలో మొదలుపెట్టాను. ఇప్పటికీ కూడా నాకు ఎప్పుడు వీలయితే అప్పుడు పదిమందినీ కూర్చోబెట్టి ఏదో ఒక పాఠం చెప్పడం అలవాటు. ఎం.ఎ.లో ఉండగా రచనా వ్యాసంగం తగ్గింది, ఎందుకంటే సివిల్ సర్వీసెస్ పరీక్షకి చదవాలి, నెగ్గాలి అన్న దృష్టి ఎక్కువైంది.
సివిల్స్ దేనితో రాయాల్ని అన్న ప్రశ్న వచ్చింది. అప్పట్లో రెండు ఆప్షనల్స్ ఉండేవి. నేను చదివింది అప్లయిడ్ ఎకనామిక్స్ అయినా, చరిత్ర, తెలుగు సాహిత్యం నాకిష్టం కాబట్టి వాటినే ఆప్షనల్స్‌గా ఎంచుకున్నాను. పరీక్ష మొత్తం తెలుగులో రాయాలని నాకు నేను నిర్ణయం తీసుకున్నాను. దీనికి ప్రధాన కారణం మా గురువుగారు కప్పగంతుల మల్లికార్జునరావుగారు. ఆయనన్నారు – నీకున్న శక్తికి నువ్వు తప్పకుండా రాయగలవు, నీకు రచనా సామర్థ్యం ఉంది. కాబట్టి హిస్టరీ, తెలుగు ఆప్షనల్స్‌గా పెట్టుకో. రెండూ నీకిష్టమైనవి కాబట్టి నువ్వు విజయం సాధిస్తావు” అని. అలా ఆయన మార్గనిర్దేశనం చేయడంతో ఆ రెండు ఆప్షనల్స్‌తోనే నేను సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడం జరిగింది. అయితే ఇంతకు ముందు సివిల్స్ పాసయినవారెవరూ నాకు తెలియదు. అందుకని హైదరాబాద్ వెళ్ళి అక్కడ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఆంధ్ర ప్రదేశ్ స్టడీ సర్కిల్‌లో వారు పెట్టిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడినై అక్కడ కోచింగ్‌లో చేరాను. ప్రిలిమినరీ పరీక్షకి మాత్రం నా సొంతంగా చదువుకుని పాసయ్యాను, 1983 ఆగస్టులో నేనక్కడ మెయిన్స్ కోచింగ్‌కి జాయినయ్యాను. అప్పుడు అక్కడి తెలుగు విద్యార్థులకు సుప్రసిద్ధ కవి దివాకర్ల వెంకటావధాని గారు పాఠాలు చెప్పేవారు. నా జీవితంలో నాకు లభించిన అదృష్టమేంటంటేనండీ – గొప్ప గొప్ప గురువులు దొరికారు. దివాకర్ల వారి వద్ద చదువుకోడం ఎంతో ఉపకరించింది. ప్రాచీన సాహిత్యమంతా దివాకర్ల వెంకటావధానిగారు చెప్పేవారు. ఆధునిక సాహిత్యాన్ని ఉప్పల సత్యనారాయణాచార్యులుగారు చెప్పేవారు. ఈయనా చాలా గొప్పవారు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందినవారు. అక్కడ ప్రసిద్ధి చెందిన ఎస్. రావ్… రావూస్ ఐఎఎస్ సంస్థ అధిపతి… వారు రాజమహేంద్రి వాస్తవ్యులే… వారు మాకు జనరల్ స్టడీస్ చెప్పేవారు. 1983 అంతా సిద్ధం చేసుకుని సివిల్స్ రాయడానికి వెళ్తుంటే… హైదరాబాదులో ఆటో తిరగబడి నాకు మేజర్ యాక్సిడెంట్ అయ్యింది. ఆ సంవత్సరం మెయిన్ పరీక్ష రాయలేకపోయాను. ఒక ఛాన్సు పోయింది. అప్పట్లో ఉన్నవి మూడే ఛాన్సులు. తర్వాతి సంవత్సరం మళ్ళీ ప్రయత్నించాను. రెండో ఛాన్సులో నాకు ఐపిఎస్ వచ్చింది. కాని ఐపిఎస్ నాకు ఆసక్తి లేనందువల్ల, ఐఆర్ఎస్‌లో జాయినయ్యాను, ఐఎఎస్ రాలేదు, కొద్దిలో మిస్ అయ్యింది. మళ్ళీ ఏడాది మూడో ఛాన్సు కూడా రాశాను. మళ్ళీ ఐపిఎస్ వచ్చింది. ఇంక నేను ఐఆర్‌ఎస్‌లో కొనసాగాను. ఆ విధంగా 1985 డిసెంబర్‌లో సర్వీసులో చేరాను.
సివిల్స్ ప్రిపేరవుతుండగానే, ఆంధ్ర ప్రదేశ్ స్టడీ సర్కిల్‍లో కోచింగ్ అయిపోయాకా, మళ్ళీ ఆంధ్రా యూనివర్సిటీకి వెళ్ళి మా గురువుగారు పార్థసారథి గారిని కలిసి, పి.హెచ్.డి.లో జాయినయ్యాను.
మీ పరిశోధనాంశం?
కోనసీమ కొబ్బరి మీద. కొబ్బరి పరిశ్రమ ఆర్థికాభివృద్ధి మీద పరిశోధన చేద్దామనుకున్నాను. కాని మా గురువుగారు సివిల్స్‌మీదే దృష్టి నిలపమనడంతో… పిహెచ్.డి. మధ్యలోనే ఆపేశాను. ఆ విధంగా ఆంధ్ర యూనివర్సిటీ ఉండగానే నాకీ సెలక్షన్ వచ్చింది. 1985 డిసెంబర్‌లో ఐఆర్ఎస్ స్వీకరించి నాగపూర్‌లో ఉన్న జాతీయ ప్రత్యక్ష పన్నుల అకాడెమీకి శిక్షణకి వెళ్ళాను. ఆ రోజుల్లో తెలుగు మీడియంలో చదువుకుని, తెలుగు సాహిత్యం, చరిత్ర ప్రధానాంశాలుగా చదివి నేను ఎంపికయ్యాను. 1979 లో కొఠారీ కమీషన్ నివేదిక ప్రకారం రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో ఉన్న అన్ని భారతీయ భాషలలోను సివిల్ సర్వీస్ పరీక్షలు రాయడానికి అవకాశం కల్పించారు. ఆ విధంగా 1979 నుంచి 1984 వరకు తెలుగు మీడియంలో తెలుగులో సివిల్స్ రాసినవారిలో అత్యధిక మార్కులు నాకే వచ్చాయని అప్పట్లో అనేవారు. ఆ విధంగా నేను 268వ ర్యాంకు తెచ్చుకున్నాను. ఐఆర్‌ఎస్‌కి ఎంపికయ్యాను. ఆదాయపు పన్ను శాఖలో ప్రవేశించిన తర్వాత అనేక ప్రాంతాలలో… భారతదేశం నలుమూలలా పనిచేశాను. 33 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని చెన్నై నగరంలో 2018 ఆగస్టులో చీఫ్ ఇన్‌కమ్ టాక్స్ కమీషనరుగా రిటైర్ అయ్యాను.
అయితే ఇవేవీ కూడా నాలోని సాహితీ తృష్ణనీ, రచనా కాంక్షని తగ్గించలేకపోయాయి. నిజానికి పెంపొందింపజేశాయి కూడా. సర్వీసులో ఉండగానే నేను అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాను. ముఖ్యంగా 1992లో నేను వ్రాసిన కవితలను నా మిత్రుడు ప్రముఖ ప్రచురణకర్త ఎక్స్‌రే పత్రిక అధిపతి, మిని కవితా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కొల్లూరి గారు ‘ఎక్స్‌రే పబ్లికేషన్స్’ తరఫున “పూలవాన” పేరిట సంకలనంగా తెచ్చారు. 1992లో విజయవాడలో జరిగిన ఎక్స్‌రే పత్రిక దశాబ్ది ఉత్సవాలలో నా ఈ తొలి పుస్తకాన్ని సుప్రసిద్ధ రచయిత మహీధర రామ్మోహనరావు గారు ఆవిష్కరించారు.
అది ప్రజాదరణ పొందడంతో, 1994లో మరికొన్ని కవితలు చేర్చి, ద్వితీయ ముద్రణ కూడా వెలువడింది.
ఆ తరువాత నేను అధికారికంగా అనేక కార్యక్రమాలలో బిజీ అవడం వల్ల ప్రచురణ కొనసాగించలేదు. రచనలయితే ఉన్నాయి, ఇక ఇప్పుడు రిటైర్ అయ్యాను కాబట్టి వీలునుబట్టి ప్రచురిస్తాను.
ఇప్పుడు ప్రచురిస్తామంటున్నారంటే… మీరు సర్వీసులో ఉండగా రాసి పెట్టుకుని ఉండి ఉండాలి…. మి బిజీ షెడ్యూల్‌నుంచి రచనలకి సమయం ఎలా చిక్కించుకునేవారు? ఏ సమయంలో రాసేవారు? మీకు ఎలాంటి సంఘటనలు ప్రేరణనిచ్చాయి?
అంటే నేను ఎప్పుడు రాయాలనుకుంటే అప్పుడు రాసేస్తానండీ.. అది స్పందనతో రాసినది తప్ప, ఒకరొచ్చి రాయమంటే రాసినవి కాదు. ఒకళ్ళొచ్చి ఫలానా ఆయన మీద పద్యం చెప్పండి అంటే నేను చెప్పను. నా మనసుకి ఎప్పుడు రాయాలనిపిస్తే అప్పుడే రాస్తాను. నేను రాసిన కొన్ని పద్యాలను చదివి వినిపిస్తాను…
అవి రాయడానికి దారితీసిన నేపథ్యం చెప్తూ చదవండి…
నేను ఆధునిక ఆంధ్ర చరిత్రని నేను క్షుణ్ణంగా చదువుకున్నాను. ఆధునికాంధ్ర దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది జరిగింది… రినాయ్‌జాన్స్ అని అంటాం కదా… దానికి మహా కారకులలైనటువంటి మహనీయులని స్మరించుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఉన్నప్పుదు ముత్యాల సరమనే ఛందస్సు నా మదిలో మెదిలింది. ఆ ఛందస్సు ఎలా రాయలో నేను నేర్చుకుని 1978లో 18 ఏళ్ళ వయసులోనే ముత్యాల సరాలలో ‘వైతాళికులు’ అని రాశాను. అవి నా పూలవానలో ఉన్నాయి. నేను చాలా రాయాలనుకున్నాను కానీ, తొమ్మిదిమంది గురించే రాయగలిగాను ( పద్యాలు వినిపించారు).
తరువాత నేను భావకవిత్వం మొదలుపెట్టాను.
మీరు ఛందోబద్ధ పద్యాలు రాశారు, ఛందోబద్ధ కవిత్వానికి, వచన కవిత్వానికి వారధిలాంటి ముత్యాలసరాలు రాశారు. వీటన్నింటిలోకి మీకు ఏది ఇష్టం?
అన్నీ ఇష్టమేనండీ. కాలానుగుణంగా నేను మారుతూ వచ్చాను. ఇప్పుడు నాకింక పద్యాలు రాయాలని అనిపించడం లేదు. వచన కవితలేవీ రాయాలనిపించడం లేదు. ఇప్పుడేమనిపిస్తోందంటే – అందరికీ అర్థమయ్యే భాషలో వ్యాసాలు రాయాలి, అందరికీ విజ్ఞానాన్ని పంచాలి అని అనిపిస్తోంది.
సరే, కవితల గురించి చెప్తాను
పూలవాన కవిత ఏంటంటే ఇది ప్రధానంగా ప్రణయ కవిత్వం అనచ్చు.
“ఆనందం నీవైతే… అంబరాన్ని నేను…
అభినందన నీవైతే… ఆకాంక్ష నేను…
మంచిమనసువు నీవైతే… మల్లెల పల్లకి నేను…
వనదేవత నీవైతే… వసంతాన్ని నేను…”
ఇదండీ పూలవాన.
బావుందండీ… శ్రీశ్రీ గేయం “ఆనందం అర్ణవమైతే…” గుర్తొచ్చింది.
అట్లా చిన్న చిన్న కవితలు రాశాను. ఇంకోటి….’రాగాభిషేకం’. నండూరి వారి ‘యెంకి’ నాకు చాలా ఇష్టం. ఆ బాణీలో రాశాను.
“రేయెల్ల నీ వలపు
పవలల్ల నీ తలపు
పాలించు నా హృదయ
ప్రణయ సామ్రాజ్యం
నీ కమల నయనాల
కజ్జలముగా మారి
పూబోణి నే మేని
పుష్పంబు నవుదునా
మధు రేతిహాసంబు
నీ మందహాసమ్ము
నీ నేత్ర రోచిస్సు
సుధా దివ్య వీక్షణలో
నాలోన నర్తించు
నవరాగ కింకిణులు…
బావుంది. పదాలు చాలా అందంగా వచ్చాయి. మరొక్కసారి వినిపిస్తారా?
(నవ్వుతూ మళ్ళీ వినిపించారు).
ఇలా ఎలా రాయగలిగానంటే, నేను విస్తృతంగా చదివేవాడిని. ఆ శబ్దం మీద ఒక రకమైనటువంటి అధికారాన్ని నేను సంపాదించుకున్నాను. నా గురువుల సాంగత్యం వల్ల నేనవన్నీ చదవగలిగాను. మహాకవులతో తిరగడం వల్ల నాకివి పట్టుపడ్డాయి.
తరువాత తరువాత ఏం తెలుసుకున్నానంటే ఇటువంటి కవితలు రాస్తే చాలా కొద్ది మందికే అర్థమవుతాయి. కాబట్టి రాయకూడదు తగ్గించాలి అని నిర్ణయించుకున్నాను. అంచేత పద్యాలలో కూడా అందరికీ అర్థమయ్యేలా రాయాలి అనే నియమం పెట్టుకున్నాను.
ఇక్కడొక సందేహం…. పాఠకులకి అర్థం కావడం కోసం రచయిత తన స్థాయిని తగ్గించుకోవాలా? లేక పాఠకుడ్ని రచయిత తన స్థాయికి పెంచాలా?
స్థాయి అనేది భాష మీద ఆధారపడి లేదండీ. నేను ప్రధానంగా వ్యవహారిక భాషావాదిని. అప్పట్లో గిడుగు రామ్మూర్తి గారూ, గురజాడ వారూ, చిలకమర్తి వారు, వీరేశలింగం గారూ అంగీకరించారు.. ఇక ఆధునిక కాలంలో తాపీ ధర్మారావుగారు, బూదరాజు రాధాకృష్ణగారు, రాంభట్ల కృష్ణమూర్తి గారు, నార్ల వెంకటేశ్వరరావు ముఖ్యంగా… వీళ్ళంతా ప్రజలకి జనరంజకమైన భాషలో రాయడమనేది అలవాటు చేసి పఠనాసక్తిని పెంపొందించారు. దానికి నేను కట్టుబడి ఉన్నాను. అంచేత ఏంటంటే నా వరకు నేను ప్రాచీన సాహిత్యాన్ని తప్పకుండా అభినందిస్తాను, చదువుకున్నాను కాబట్టి. అయితే ఇప్పుడు అందర్నీ కూర్చోబెట్టి మనం ప్రాచీన సాహిత్యం నేర్పడం చాలా కష్టసాధ్యమైన విషయం. అయితే తెలుగు భాషకి సంబంధించినంతవరకూ అందరికీ అర్థమయ్యే భాషలో రాయడం ప్రధానమని నేను అనుకుంటున్నాను. అయితే బాగా ఆసక్తి ఉన్నవాళ్ళు కావ్యాలు చదువుకోవచ్చు. ఎంతమంది ఉంటారండీ? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో తెలుగువాళ్ళం 15 కోట్ల మంది ఉన్నాం. ఇందులో ఒక లక్ష మంది వరకు భాష పైన ఆస్తకి కలిగి ఉంటారేమో… వాళ్ళకి ప్రాచీన సాహిత్యం కావాలి. మిగతావారికి….? అసలు ఇప్పుడు తెలుగులో మాట్లాడడమే తగ్గిపోతోంది. ఇంగ్లీషులో మాట్లాడడమే ఫాషన్ అనే స్థితికి మనం వచ్చాం. అలాగే తెలుగు రాష్ట్రాలలో కొన్ని పాఠశాలలలో పిల్లలు తెలుగులో మాట్లాడితే కొట్టారు. ఈ దుస్థితిలో మనం ఉన్నాం. ఈ దుస్థితి లోంచి బయటపడాలంటే తెలుగును ప్రధానంగా యువతలోకి తీసుకువెళ్ళాలి. వాళ్ళు తెలుగుని సంరక్షించుకునేలా చెయ్యాలి. ఇందుకు ప్రాచీన ఆధునిక సాహిత్యాల మేళవింపుని అర్థమయ్యే భాషలో వివరించాలని నా అభిప్రాయం.
“కొత్త పాతల మేలు కలయిక. క్రొమ్మెఱుంగులు చిమ్మగా” అన్నారుగా గురజాడ.
అవును. నేను అదే అంటాను. నార్ల వారు… మా గురువుగారు… నేను నా ప్రత్యక్ష గురువులతో పాటుగా, కొందరిని పరోక్ష గురువులుగా భావిస్తాను. తాపీ ధర్మారావు గారు, నార్ల వారు, కాళోజీ నారాయణ రావు గారు లాంటి వారిని నేను గురువులుగా భావిస్తాను. నన్ను ప్రభావితం చేసిన వీళ్ళందరి మీదా ‘దండాలోయ్ దండాలు‘ అని ఒక చిన్న గేయం రాశాను నేను (వినిపించారు).
వీరంతా నన్నెంతో ప్రభావితం చేసిన వ్యక్తులండీ. గోరా గారి అభిప్రాయాలలతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. కాని ఆయన గొప్ప గాంధేయవాది, సంస్కరణావాది అనే విషయాన్ని కాదనలేం. ‘జీవితం నేర్పిన పాఠాలు’ అని ఆయన ఆత్మకథ రాసుకున్నారు. అది నన్నెంతో ప్రభావితం చేసింది. అందులో ఆయన ‘సత్యం’ అంటే ఏమిటో చెప్తారు. ప్రపంచంలో ఎవరూ కూడా ఇంత గొప్పగా సత్యమంటే ఏమిటో ఇప్పటివరకు చెప్పలేదని నా ఉద్దేశం. ‘సత్యమంటే చేసింది చెప్పటం, చెప్పింది చెయ్యడం.’ ఈ మాటలు నన్నెంతగానో ప్రభావితం చేశాయి. అందుకే ఈ గేయంలో గోరా గారిని గొప్ప మానవుడు అన్నాను. ఈ రకంగా అనేక పుస్తకాలు నన్ను ప్రభావితం చేశాయండీ. అలాగే రాయప్రోలు గారన్నా నాకు చాలా ఇష్టం. ఆయన రాసిన ఆంధ్రావళి మొత్తం నాకు నోటికి వచ్చు. అనేక సభల్లో నేను ఆంధ్రావళిని ఉటంకిస్తూ ఉంటాను. తుమ్మల సీతారామమూర్తి గారి రాష్ట్రగానం, ఉదయగానం నాకు చాలా ఇష్టం. అయితే నాకు ఒక కవి ఇష్టం, మరొక కవి ఇష్టం లేదు అని ఉండదు. ఎందుకంటే సాహిత్యమనేది ఆలోచనామృతం. అందరూ ఇష్టమే. ఇప్పుడు నాకు విశ్వనాథ వారి ‘కిన్నెరసాని’ ఎంతిష్టమో, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కూడా అంతే ఇష్టం. ఆ సమన్వయ దృక్పథం వల్లే నేను జీవితంలో ఇంతవరకూ రాగలిగాను.
మీ వచన కవిత్వం వినిపించలేదు ఇంకా….
వినిపిస్తాను.
(ఆలోచన ఆకాశం… అనే కవిత వినిపించారు).
ఇది స్వకీయమైనటువంటి అనుభూతి అన్నమాట. జీవితాన్ని నేను ఎలా నెట్టుకొస్తున్నాను, ఏ ఎదురుదెబ్బలు తింటున్నాను, ఎలా ముందుకు వెళ్తున్నాను, వెనక్కెలా వెళ్తున్నాను… దీన్ని నేను ఈ కవితా రూపంలో పెట్టాను.
మీ వచన కవితలో కొంచెం భావుకత ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది…
భావుకతే కాదండీ, శబ్దాడంబరం కూడా ఉంది. ఆ రోజుల్లో అలా ఉండేదండీ. అయితే రాను రాను నా కవిత ఇంకా పరిణామం చెందింది. ఉద్యమాలు, ఉద్యమాల స్పృహ, పోరాటాలు ఇవన్నీ చూసిన తర్వాత, డా. బాబా సాహెబ్ అంబేద్కర్ రచనలు చదవడం వల్ల, సామాజిక ఉద్యమాలు, సమానత్వం కోసం జరిగిన ఉద్యమాలకి స్పందించి నేను అనేక కవితలు రాశాను. అందులో ముఖ్యమైనది ‘పునాదిరాళ్ళు’ అనే కవిత. సమాజంలో అన్ని వర్గాలు సమానమే అని చెప్పే కవిత అది. దళిత ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో 1991లో రాసిన కవిత ఇది. అప్పట్లో ప్రముఖ పత్రికలో ప్రచురితమైందీ కవిత. నా కవితా సంపుటి పూలవానలోనూ ఉంది. ఇది గేయ కవిత.
అంటే లయబద్ధంగా రాశారా…
అవును. గేయ కవితా రూపం నాకిష్టం.
(నాగరికత అని నడిచే సంఘపు పునాదిరాళ్ళు… అనే కవిత వినిపించారు).
బావుంది. ఇప్పుడు పదవీ విరమణ చేశారు కాబట్టి, భవిష్యత్తులో ఎలాంటివి రాయాలనుకుంటున్నారు?
దీనికి జవాబు చెప్పేముందు మరో విషయం చెబుతాను.
నేను నా ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూనే సమాజానికి ఏదైనా చేయాలనే ఆకాంక్షతో ఉండేవాడిని. నేను విద్యార్థిగా ఉండగానే నాలో ఈ ఆకాంక్ష మొదలయ్యింది. అప్పట్లో గౌతమి స్టడీ సర్కిల్ అనే సంస్థను నడిపాను. 1994లో రాజమహేంద్రిలో నా మిత్రులతో కలిసి సమతా సేవా సంస్థ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాను. ఎందుకంటే నేను సివిల్స్‌కి ప్రిపేరయినప్పుడు నేను అనేక ఇబ్బందులు పడ్డాను. ఏ పుస్తకం చదవాలో తెలియదు, ఎలా చదవాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. అలా కాకుండా సివిల్స్ రాసేవారికి ఒక గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సమతా సేవా సంస్థని ఏర్పాటు చేశాను. ఈ సంస్థ ద్వారా సమాజంలో అన్ని వర్గాల వారికి పోటీ పరీక్షలకి ఉచితంగా శిక్షణ నిస్తున్నాము. కొన్ని వందల మంది శిష్యులు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నారు నాకు. నేను ఎక్కడ పనిచేస్తున్నా, సంవత్సరానికి రెండు మూడు నెలలు సెలవు పెట్టి, అక్కడికి వెళ్ళి పలు పోటీ పరీక్షలకి శిక్షణ ఇచ్చేవాడిని. అలాగే నా మిత్రుల చేత ఇప్పించేవాడిని. ఆ సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, ఇప్పటికీ నడుస్తు ఉంది. ఈ సంస్థ తరపున ప్రభుత్వంతో పోరాడి ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ బ్రాంచిని రాజమహేంద్రిలో ఏర్పాటు చేయించాం. అక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వోద్యోగిగా నేను ఎన్నో చేశాను, నాకు వ్యక్తిగతంగా తృప్తినిచ్చింది ఈ ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ బ్రాంచి రాజమహేంద్రిలో వచ్చేలా చేయడం!
1992లో మా గురువు గారు వావిలాల గారికి భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారమిచ్చింది. అప్పట్లో పి.వి. నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. వావిలాల ఎవరని చాలామంది అడిగారు. పద్మభూషణ్ పురస్కారం వచ్చాకా ఆయన గురించి చాలామందికి తెలిసింది. కాబట్టి వావిలాల జీవిత చరిత్ర రాయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఉద్యోగబాధ్యతలతో తీరిక లేకుండా ఉండడం వల్ల ఏం చేయాలా అని ఆలోచించాను. రాజమహేంద్రి వెళ్లాను. మా గురువుగారు యాతగిరి శ్రీరామనరసింహారావు గారిని కలిశాను. అప్పటికి వారు కూడా ఉద్యోగంలో ఉన్నారు. సహకార శిక్షణా కేంద్రంలో లెక్చరర్‌గా ఉండేవారు. “అయ్యా, మనమిద్దరం కలిసి పుస్తకం రాద్దాం…” అని చెప్పాను. ఆయన అంగీకరించడంతో, ఆయన కొంత, నేను కొంత రాశాము. ఆ విధంగా మేమిద్దరం కలసి వావిలాల వారి మొదటి జీవిత చరిత్రని ‘మన వావిలాల’ పేరుతో రాశాము. ఆంధ్రకేసరి యువజన సమితి 1995లో ఈ పుస్తకాన్ని ప్రచురించింది. రాజమహేంద్రి లోని పురమందిరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాము. ఆవిష్కరణకి పెద్దలు కాళోజీ నారాయణరావుగారిని ఆహ్వానించాము. వావిలాల వారి సమక్షంలో, సర్దార్ గౌతు లచ్చన్న గారి ఆధ్వర్యంలో కాళోజీ గారి చేతుల మీదుగా ఆ పుస్తకం ఆవిష్కరించబడడం నా జీవితంలో గొప్ప మధురమైన సంగతి. 97 ఏళ్ళ పరిపూర్ణ జీవితం గడిపి 2003లో వావిలాల గారు పరమపదించారు.
2006లో వారి శత జయంతి జరిగింది. ఆ సందర్భంగా ఈ పుస్తకాన్ని సంస్కరించి పరిష్కృత కృతిగా ఎమెస్కీ వారు ప్రచురించారు. దానికి తెలుగు యూనివర్సిటీ వారు 2011లో నాకు కీర్తి పురస్కారం అందజేశారు.
ఇటీవల మీరు పొట్టి శ్రీరాములు గారి గురించి కూడా ఒక పుస్తకం రాస్తున్నారని తెలిసింది…
అవునండీ… 2017లో నాకు సేలం నుండి చెన్నైకి బదిలీ అయింది. ఇక్కడి అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనంతో నాకు దాదాపు 28 – 29 సంవత్సరాల అనుబంధం ఉంది. ఇంతకు ముందు నేను చెన్నైలో రెండుసార్లు పనిచేశాను. 1990 నుంచి 93 వరకూ, మళ్ళీ 97 నుంచి 2001 వరకు. ఈ ఏడు సంవత్సరాలలో అక్కడ జరిగిన అన్ని కార్యక్రమాలకు హాజరయ్యాను. ఈ స్మారక భవన నిర్వహణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ప్రైవేటు సంస్థ చేపట్టింది. కాలక్రమంలో అభిప్రాయభేదాలొచ్చి, భవన నిర్వహణకు, తమిళనాడు పుదుచ్చేరి ప్రాంతాలలో తెలుగు భాషాభివృద్ధికి ఒక కమిటీని ఏర్పాటు చేసి, దానికి నన్ను ఛైర్మన్‌గా నియమించింది. చైన్నై నగరంలో ఉన్న సుప్రసిద్ధులైన సాహితీవేత్తలు, రచయితలు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నేనప్పటికి సర్వీసులో ఉన్నాను కాబట్టి, పైగా అది రాష్ట్ర ప్రభుత్వపు నియామకం కాబట్టి… గౌరవ పదవే అయినా నేను కేంద్ర ప్రభుత్వానికి రాసి ప్రత్యేక అనుమతి తీసుకున్నాను. 2018 ఆగస్టు 15న ఈ పదవీ బాధ్యతలు స్వీకరించాను. అది జరిగిన 15 రోజులకి నేను రిటైరయ్యాను. ప్రస్తుతం అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనం తరఫున అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా తమిళనాడులో తెలుగు భాషా వికాసానికి అనేక కార్యక్రమాలు చేపట్టాం.
బావుందండీ. చాలా వివరాలు చెప్పారు. ఇంత బిజీ షెడ్యూల్‍లో కూడా మీరు మాకు సమయం కేటాయించి ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా సంతోషం తిరుమల కుమార్ గారూ, మీ కార్యక్రమాలన్ని విజయవంతమవ్వాలని ఆశిస్తూ, సెలవు తీసుకుంటున్నాము. నమస్కారం.
ధన్యవాదాలండీ. నమస్కారం.