[box type=’note’ fontsize=’16’] ‘జ్ఞానాన్ని పంచకపోవడం అజ్ఞానం అని బలంగా నమ్మిన వాణ్ని నేను’ అని చెప్పే కవీ, సాహిత్యాభిమాని మేడిశెట్టి తిరుమల కుమార్ గారితో సంచిక జరిపిన సంభాషణం ఈ నెల ప్రత్యేకం. [/box]
[dropcap]ప్ర[/dropcap]ముఖ సాహిత్యాభిమాని, రచయిత అయిన శ్రీ మేడిశెట్టి తిరుమల కుమార్ గారు రాజమహేంద్రవరంలో 1960 ఫిబ్రవరి 2 న మేడిశెట్టి తాతబ్బాయి మేడిశెట్టి నాగమణి దంపతులకు జన్మించారు. డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలో చదివి, సివిల్ సర్వీస్ పరీక్షలలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కి ఎంపికై ఆదాయపు పన్ను శాఖలో వివిధ హోదాలలో పనిచేసి చీఫ్ ఇన్‌కమ్ టాక్స్ కమీషనర్‌గా రిటైరయ్యారు.
తిరుమల కుమార్ గారు ‘పూలవాన’ అనే కవితా సంకలనాన్ని వెలువరించారు. 2003లో రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ వారికి ‘డా. వావిలాల గోపాలకృష్ణయ్య పురస్కారం’ అందజేసింది. తెలుగు యూనివర్సిటీ వారు అందజేసే కీర్తి పురస్కారాలలో 2010 సంవత్సరానికి “ఇల్లిందుల సీతారామారావు సరస్వతీ స్మారక పురస్కారం” పొందారు.
మేడిశెట్టి తిరుమల కుమార్ గారితో సంచిక జరిపిన ఇంటర్వ్యూ ఇది.
***
నమస్కారమండీ మేడిశెట్టి తిరుమల కుమార్ గారూ, మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది. మీరు మీ బిజీ షెడ్యూల్ నుంచి మా పాఠకుల కోసం సమయం కేటాయించినందుకు కృతజ్ఞతలు.
మీ రచనల గురించి మనం మాట్లాడుకునే ముందుగా, మీ కుటుంబ నేపథ్యమూ, బాల్యమూ, బాల్యానుభవాలూ.. ఇవన్నీ మిమ్మల్ని ఏ రకంగా సాహిత్యం వైపు మళ్ళించాయో వివరిస్తారా?
నమస్కారమండీ. ముందుగా నాకీ అవకాశమిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. నేను పుట్టింది తెలుగువారి సాంస్కృతిక రాజధానిగా ఖ్యాతి పొందిన రాజమహేంద్రవరంలో. 1960 ఫిబ్రవరి 2 న మా అమ్మమ్మ గారింట్లో జన్మించాను. అయితే మా నాన్నగారిది ద్రాక్షారామ శైవక్షేత్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుయ్యూరు అనే గ్రామం. నా ఐదో తరగతి వరకు నా బాల్యం పల్నాడు ప్రాంతంలో గడిచింది, అప్పట్లో మా నాన్నగారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగిగా అక్కడ ఉండేవారు. నేను అయిదో తరగతి వరకు మాచర్ల ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాను. తరువాత ఆరవ తరగతి, ఏడవ తరగతి రాజమహేంద్రవరంలో ‘నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్’ అనే స్కూల్లో చదువుకున్నాను. ఎనిమిది నుండి పది వరకు దానవాయిపేట మునిసిపల్ హైస్కూల్‌లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ రాజమహేంద్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నాను. బిఎ డిగ్రీ చారిత్రక ఖ్యాతి పొందిన, ఆర్ట్స్ కాలేజ్‍గా సుప్రసిద్ధమైన రాజమహేంద్రి ప్రభుత్వ కళాశాలలో చదివాను. అయితే నేను ఒకటో తరగతి నుండి డిగ్రీ వరకూ పూర్తిగా తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నాను. ఆ తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. ‘అనువర్తిత అర్థశాస్త్రం’ (అప్లయిడ్ ఎకనామిక్స్) చదివాను.
అదీ తెలుగు మీడియంలోనే చదివారా?
లేదండీ. అప్పటికింకా ఎం.ఎ.లో తెలుగు మీడియం లేదు. అదొక్కటే ఇంగ్లీషులో చదుకువుకున్నాను.
మరి తెలుగు మీడియం నుంచి హఠాత్తుగా ఇంగ్లీషు మీడియంలోకి మారటం వల్ల ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కున్నారు?
నేను పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదండీ… దానికి కారణం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి తెలుగులో పాటు ఇంగ్లీషు కూడా కొంత కొంత చదువుకుంటూ వచ్చాను. దానివల్ల నాకు పెద్దగా ఇబ్బంది కలగలేదు. అయితే మా తాతముత్తాతలంతా చదువుకు దూరంగా ఉన్నవాళ్ళే, నిరక్షరాశ్యులు. మా తండ్రిగారి తల్లిదండ్రులు గానీ, మా తల్లిగారి తల్లిదండ్రులు గానీ చదువుకోలేదు. అయితే మా అమ్మగారు ఆ రోజుల్లో ఏడో తరగతి వరకు చదువుకున్నారు. అప్పట్లో ఏడో తరగతి చదవడమంటేనే గొప్ప. మా నాన్నగారు అప్పట్లో ఎస్.ఎస్.ఎల్.సి. వరకూ చదువుకున్నారు. ఆయన ఉద్యోగం చేస్తూ పై చదువులు చదివారు. అయితే రాజమహేంద్రవరం తిరిగి వచ్చి ఆరో తరగతిలో చేరిన తర్వాత మా జీవితం గొప్ప మలుపు తిరిగింది. అదేంటంటే మా స్కూల్లోనే చిన్న గ్రంథాలయం ఉంది. పుస్తకాలు చదవాలి అనే ఒక కోరిక కలిగింది. చిన్నప్పటి నుండి కూడా మా నాన్నగారు “నువ్వెంతో గొప్ప అధికారివి అవ్వాలి, మనమెంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాము. బాగా చదవాలి” అని అనడం వల్ల నేను గ్రంథాలయానికి వెళ్ళి చదవడం అలవాటు చేసుకున్నాను. అయితే నేను మొట్టమొదట చదివిన పుస్తకాలేంటంటే వ్యవహారిక భాషలో ఉద్దండులైన వారు రాసినటువంటి, వచనంలో రాసినటువంటి రామాయణం ఏడు కాండలు, మహాభారతం 18 పర్వాలు, అలాగే భాగవతం అన్ని స్కందాలు, దేవీ భాగవతం… ఇటువంటి పౌరాణిక నేపథ్యం ఉన్న ఇతిహాసాలు, పురాణాలు మొదలైనవి. చిన్నప్పుడు వాటి మీద ఆసక్తి ఉండడం వల్ల నేను అవన్నీ కూడా వచనంలో ఆరు, ఏడు, ఎనిమిదో తరగతులలో చదవడం జరిగింది. అది నాలో సాహిత్యం పట్ల కొంచెం ఆసక్తిని కలిగించింది. తరువాత ఎనిమిదో తరగతి నుండి మేము రాజమహేంద్రిలో దానవాయిపేట వచ్చాము. అక్కడ నేను మునిసిపల్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను. అక్కడ గాంధీ పార్క్ అని ఉండేది. ఇప్పటికీ ఉంది… చాలా సుప్రసిద్ధమైనటువంటి గాంధీ పార్కు. ఆ గాంధీ పార్కులో తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ వారి శాఖాగ్రంథాలయం ఉంది. మా ఇంటికి దగ్గరగా ఉండడం వల్ల ప్రతీ రోజు గ్రంథాలయానికి వెళ్ళడాన్ని అలవాటు చేసుకున్నాను. దానికి కారణం – మా నాన్నగారు! “రోజూ పేపర్ చదవాలి, గ్రంథాలయానికి వెళ్ళాలి, అప్పుడే నువ్వు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలవు…” అంటూ ఒక స్ఫూర్తినిచ్చారు. మా నాన్నగారు మేడిశెట్టి తాతబ్బాయి గారు, మా అమ్మగారు మేడిశెట్టి నాగమణి గారు. వారిద్దరూ కూడా ఇప్పుడు రాజమహేంద్రవరంలో ఉన్నారు. మా నాన్నగారు హెల్త్ సూపర్‍వైజర్‌గా పనిచేసి రిటైర్ అయి, రాజమహేంద్రిలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. అది బహుశా 1971 అయ్యుండచ్చు, నేను దానవాయిపేట శాఖా గ్రంథాలయానికి వెళ్తుండే రోజులు… అప్పుడు నా వయసు 11 సంవత్సరాలు. నేనప్పుడు ఆ ఉప (శాఖా) గ్రంథాలయంలో సభ్యుడిగా చేరాను. అప్పట్లో ఒక ఐదు రూపాయలు గ్రంథాలయానికి కట్టినట్టయితే, మనం పుస్తకాలను ఇంటికి పట్టుకెళ్ళి చదువుకోవచ్చన్నమాట. ఆ విధంగా నేను సభ్యుడిగా చేరి, రెండు రోజుల కొకసారి ఏదో ఒక మంచి పుస్తకం తీసుకుని ఇంటికెళ్ళి చదివేవాడిని. ఉదయం స్కూలుకి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి గ్రంథాలయానికి సాయంత్రం పూట వెళ్ళేవాడిని, సాయంత్రం నాలుగు గంటలకి తెరిచేవారు. సోమవారం సెలవు ఉండేది. సాయంత్రం గ్రంథాలయం తెరిచినప్పటి నుండి వాళ్ళు మూసేసేవరకు అంటే నాలుగు నుంచి ఏడు గంటల వరకూ కూడా అక్కడే ఉండేవాడిని. ఎందుకంటే అన్ని పత్రికలు… దినపత్రికలు, మాసపత్రికలు, వారపత్రికలు ఇవన్నీ చదివేవాడిని. అదే నాలో ఒక జిజ్ఞాసనీ, ఒక జ్ఞాన తృష్ణనీ రగిలించింది, దాంతో నేను అన్ని విషయాలు నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పట్లో నేను బాగా విస్తృతంగా చదివినవి ఏంటంటే – ఆంధ్రప్రభ దినపత్రిక, వారపత్రిక; ఆంధ్రపత్రిక దినపత్రిక, వారపత్రిక; ఆంధ్రజ్యోతి దిన, వారపత్రికలు; భారతి మాసపత్రిక; విశాలాంధ్ర; ప్రజాశక్తి; తెలుగు విద్యార్థి అనే పత్రిక… ఇంకా అనేక పత్రికలు, తెలుగులో నాకు కనిపించిన ప్రతి పత్రికను కూడా చదివేవాడిని. ఆ గ్రంథాలయంలో గ్రంథాలయ ఉద్యోగి ఒకాయన ఉండేవారు. ఆయన పేరు గోవిందు. నేను చిన్నపిల్లవాడినైనా అన్ని రకాల పత్రికలు శ్రద్ధగా చదువుతూండడం ఆయన గమనించి, మంచి మంచి పుస్తకాలు వెతికి మరీ తెచ్చి నాకు ఇచ్చేవారు. ఆయన్ని ఎన్నడూ నా జీవితంలో మరిచిపోలేను. “తిరుమలకుమార్ ఇది చదివారా?” అంటూ ఆయన చక్కని పుస్తకాలను నా చేత చదివించారు. నేను నవలలు, కథలు ఎక్కువగా చదివేవాడిని కాను, నేను ప్రధానంగా చరిత్ర, దేశ చరిత్రలు, భాషా చరిత్ర, కవుల జీవితాలు, కవిత్వం చదివేవాడిని. ఇలా చదవడం వల్ల ఇంచుమించు మూడున్నర ఏళ్ళలో ఆ శాఖా గ్రంథాలయంలోని (చిన్నదేనండీ, రెండే గదులుండేవి) అన్ని పుస్తకాలు చదివేశాను. అప్పుడు గోవిందుగారు చెప్పారు, “ఏవండీ, మీరిక్కడి అన్ని పుస్తకాలు చదివేశారు, ఇక మీరు పెద్ద గ్రంథాలయానికి వెళ్ళాలి. గౌతమి గ్రంథాలయానికి వెళ్ళండి” అని. ఆ విధంగా చదువుకుంటూ 1974లో నేను పదో తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాను. నేను చదివిన చదువు నాకెంతగానో ఉపయోగపడింది, జనరల్ పుస్తకాలు చదవడం వల్ల పదవతరగతిలో… నేను జీవితంలో మర్చిపోలేని ఒక విజయం… నాకు లభించింది. అదేంటంటే పదవ తరగతి సాంఘిక శాస్త్రంలో నాకు వందకి 95% మార్కులు వచ్చాయి. అది అప్పట్లో రాష్ట్రంలోనే ఒక రికార్డు. అలాగే లెక్కల్లో వందకి 92% మార్కులతో నేను ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాను. అయితే పుస్తకాలు చదవడంపై అథిక సమయం వెచ్చించడంతో, నేను క్రీడలకి దూరమైపోయాను. జీవితంలో మనం అనుకున్నవన్నీ సాధించలేం. పుస్తకాలు చదవాలంటే – క్రీడలు ఉండవు. క్రీడారంగానికి నేను పూర్తిగా దూరమైపోయి, పుస్తకాల పురుగుగా మారాను.
ఆ తరువాత నా జీవితాన్ని మలుపు తిప్పిందేంటంటే – ఇంటర్మీడియట్. నేను మొదట ఇంటర్మీడియట్ వీరేశలింగంగారి కళాశాల – వీరేశలింగం జూనియర్ టి.ఎస్.టి. కళాశాలలో ఎం.పి.సి. గ్రూపులో చేరాను. ఇంకో విషయం ఏంటంటే – నేను తొమ్మిదో తరగతి నుంచి సభలకు వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. సాహిత్య సభలకీ, రాజకీయ సభలకీ వెళ్ళడం అలవాటయ్యింది. ఇలా పుస్తకాలు చదవడం, సభలకి వెళ్ళడం బాగా అలవాటయిన కారణంగా, నేను ఎం.పి.సి. గ్రూపులో ఇమడలేకపోయాను. హోం వర్కు అదీ చాలా ఎక్కువగా ఉండడంతో నాకు ఇతర పుస్తకాలు చదవడానికీ, సభలకి వెళ్ళడానికి సమయం ఉండేది కాదు. అప్పుడు మా నాన్నగారికి చెప్పాను, “ఈ ఎంపిసి గ్రూపులో ఇమడలేకపోతున్నాను, నాకు చరిత్ర అంటే ఇష్టం… అదే చదువుతాను” అని. అదృష్టవశాత్తు అప్పుడే రాజమహేంద్రిలో మొదటిసారిగా ప్రభుత్వ జూనియర్ కళాశాలని స్థాపించారు. నవంబరు 1974లో. నేను మొదటి బ్యాచ్ స్టూడెంట్‌గా హెచ్.ఇ.సి. గ్రూపులో చేరిపోయాను. అయితే మా కళాశాలకి ప్రాంగణం లేదు. కళాశాల అయితే ప్రారంభయ్యింది కానీ, భవనం లేదు. అందుకని రాజమహేంద్రి ట్రైనింగ్ కాలేజీలో… ఇప్పుడు దాన్ని గరిమెళ్ళ సత్యనారాయణ సమగ్ర విద్యా కళాశాల అని పిలుస్తున్నారు… అక్కడ మాకు తాత్కాలికంగా వసతి ఏర్పర్చి పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. ఇంకా లెక్చరర్స్‌ని పూర్తిగా నియమించకపోవడంతో… రాజమహేంద్రి నైట్ కాలేజీలో ఉన్న లెక్చరర్స్‌ని (ఇప్పుడు ఈ కాలేజీ లేదు) డే కాలేజీలో మాకు ఇంటర్ పాఠాలు చెప్పడానికి నియోగించారు. అక్కడ నాకు కలిగిన అదృష్టం ఏంటంటే- ఆ రోజుల్లో 1974-75 ప్రాంతాల్లో నైట్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్‌గా ఉన్న – సుప్రసిద్ధ కథా నవలా నాటక రచయిత, సాహితీవేత్త, చరిత్ర పరిశోధకులు అయిన కప్పగంతుల మల్లికార్జునరావుగారితో పరిచయం అవడం! నా జీవితాన్ని మలుపు తిప్పిన మహానుభావుడు కప్పగంతుల మల్లికార్జునరావుగారు. నా తండ్రి తరువాత నాకు తండ్రిలాంటి వారు, అంత కంటే ఎక్కువే కూడా. ఎందుకంటే ఆయన ఇంటర్మీడియట్ ఫస్ట్ యియర్‌లో మాకు చరిత్ర పాఠాలు చెప్పారు. ఆయన నాకు చరిత్ర పాఠాలు చెప్పినది ఆరు నెలలో, ఎనిమిది నెలలో. తర్వాత రెగ్యులర్ లెక్చరర్స్ వచ్చేశారు. కానీ ఆ ఆరు నెలలు ఆయన చరిత్ర పాఠాలు చెప్పడమే నా జీవితాన్ని గొప్ప మలుపు తిప్పిందని నేను సగర్వంగా చెప్పగలను. మేము చరిత్ర క్లాసులో ఇరవై ఐదు మంది ఉండేవాళ్ళం. ఆయన మాకు పాఠం చెప్పడానికి వచ్చిన మొదటి రోజునే ఒక్కొక్కరిని నిలబెట్టి, ‘నీ జీవిత లక్ష్యం ఏమిటి?’ అని అడిగారు. అందరూ తమ తమ లక్ష్యాలు చెప్పారు. నా వంతు వచ్చినప్పుడు నేను లేచి సివిల్ సర్వీస్ పరీక్ష పాసై ఐఎఎస్ అవ్వాలనుకుంటున్నానని చెప్పాను. ఆయనకి నా మీద నమ్మకం కలగలేదు. “ఎందుకు ఐఎఎస్? నీకెవరు చెప్పారు దీని గురించి” అని అడిగారు. “అయితే నీకు సోషల్‌లో ఎన్ని మార్కులు వచ్చాయి?” అని అడిగారు. “సోషల్‍లో నాకు 95 మార్కులు వచ్చాయి సార్” అన్నాను. ఆయన అసలు నమ్మలే. సరే కూర్చో అన్నారు. ఎందుకంటే, ఏదో ఆటపట్టించడానికి అంతా ఇలా మాట్లాడుతున్నారు అని అనుకున్నారాయన. క్లాస్ అయిపోయిన వెంటనే ఆయన ప్రిన్సిపాల్ రూమ్‌కి వెళ్ళి ఫలానా మేడిశెట్టి తిరుమలకుమార్… అతని టెన్త్ క్లాస్ మార్కు లిస్ట్ చూపించమని అడిగారట. చూస్తే అందులో వందకి 95 వచ్చినట్టు ఉంది. అప్పట్నించి ఆయనకు నేను ప్రియ శిష్యుడ్ని అయిపోయాను.
మీకసలు సివిల్ సర్వీస్ గురించి ఎలా తెలిసింది?
సివిల్ సర్వీస్‍ల గురించి నాకు తెలియడానికి కారణం మా నాన్నగారేనండీ. చిన్నప్పటి నుండి అయన నాతో “నువ్వు ఐ.ఎ.ఎస్. అవ్వాలి… తప్పనిసరిగా…” అంటూ ఉండేవారు. “నువ్వంత స్థాయికి వెళ్ళాలి. సమాజంలో మనం పెద్ద స్థాయిలో లేము. అటు ఆర్థికంగా, ఇటు సామాజికంగా తక్కువ స్థాయిలో ఉన్నాం. ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే.. నువ్వు గనుక సివిల్ సర్వెంట్ అయితే, నిన్ను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది ముందుకొస్తారు” అనే వారు. ఆ స్ఫూర్తితో నేనిదంతా మొదలుపెట్టాను.
అప్పట్నించీ కప్పగంతుల మల్లికార్జునరావు నన్నెంతో ఆదరంగా చూశారు. ఆయనకి నలుగురు కుమార్తెలు. నన్ను వారి కుమారుడిగా చూసేవారు. నన్ను దత్తపుత్రుడిగా పరిగణించేవారు. ఆయనో గొప్ప రచయిత. అప్పటికే మా రాజమహేంద్రవరంలో ‘అభ్యుదయ రచయితల సంఘం’ (అరసం) ఉండేది. అరసం రాజమహేంద్రి శాఖకి ఆయన అధ్యక్షుడిగా ఉండేవారు. సుప్రసిద్ధ రచయిత పడాల రామారావు గారు కార్యదర్శిగా ఉండేవారు. ఆ విధంగా నాకు ఆయన శిష్యరికం లభించింది. ఒకరోజున ఆయన నన్ను వారింటికి రమ్మన్నారు. వెళ్ళాను. మల్లికార్జునరావు గారి సతీమణి కాంతాదేవి గారు నన్ను సొంత తల్లికంటే ఎక్కువగా ఆదరించారు. ఈ రోజున మల్లికార్జునరావు గారు, కాంతాదేవిగారు ఇద్దరూ కూడా లేరు; అయితే ప్రతీ రోజూ కూడా నేను వారిద్దరిని తలచుకుంటూ ఉంటాను. ఎందుకంటే నా తల్లిదండ్రులతో పాటుగా వారు కూడా నన్ను చేరదీసి అన్నీ నేర్పించారు. మల్లికార్జునరావుగారు చాలా గొప్ప ఆదర్శవాది, వామపక్ష భావాలు చాలా ఉధృతంగా ఉన్న రోజులలో ఆయన రచనారంగంలోకి వచ్చారు. ఆయన కూడా ఎడ్యుకేషన్ డిపార్టుమెంటులో చిన్న గుమాస్తాగా ఉంటూ స్వశక్తితో బిఎ, ఎంఎ అన్నీ చదువుకుని ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‍గా చేరారు, రాష్ట్రప్రభుత్వం వారి ఉత్తమ అధ్యాపక అవార్డు పొందారు. చాలా గొప్ప వ్యక్తి. అనేక రచనలు చేసి ఉన్నారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధులు.
ఇక వారి శిక్షణలో ప్రతీ రోజు నా సమయాన్ని విభజించుకుని కాలేజీ టైములో కాలేజీ, కాలేజీ అయిపోయిన తర్వాత కొంత సమయం లైబ్రరీలో, కొంత సమయం గురువుగారి ఇంట్లో గడిపేవాడిని. ఆ విధంగా ఆయన శిక్షణలో నేను అనేక విషయాలు నేర్చుకున్నాను. 1974-75లలో ఆయనతో కలిగిన పరిచయం 2007లో ఆయన పరమపదించేవరకు కొనసాగింది. 32 సంవత్సరాల పాటు నాకు చేయూతనిచ్చి ముందుకు నడిపించిన మహానుభావుడాయన. ఆయన సాహిత్యభారతి అనే సంస్థని నడిపేవారు. ఆ సంస్థ ద్వారా నా చేత అన్ని కార్యక్రమాలు చేయించేవారు. ఆయన ఏ కార్యక్రమం చేసినా నేను ముందుండేవాడిని. ఒక సంస్థని ఎలా నడపాలి, సభలు ఎలా నిర్వహించాలి ఇటువంటివి అన్నీ నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను.
ఆయన ఏం చేసేవారంటే – రోజూ సాయంకాలం ఇంటికి వెళ్ళగానే, ఒక మంచి పుస్తకం ఇచ్చేవారు. ‘ఈ పుస్తకం చదివి నువ్వు, రెండు రోజుల్లో నాతో చర్చకి రావాలి’ అనేవారు. అదీ నా జీవితాన్ని నిజంగా మలుపుతిప్పింది. ఎందుకంటే నేను ఆ పుస్తకాన్ని చదివి, అందులోని విషయాన్ని అర్థం చేసుకుని గురువుగారితో చర్చించేవాడిని. అలాగే ఒక్కోసారి ఓ పుస్తకం ఇచ్చి “తిరుమలకుమార్, ఇది పిచ్చి పుస్తకం, కానీ చదువాలి. ఎందుకంటే ఎలా రాయకూడదో తెలియడానికి. మనకి ఎలా రాయాలో తెలియాలి, ఎలా రాయకూడదో కూడా తెలియాలి. ఈ పిచ్చి పుస్తకం చదువు. ఈ పిచ్చి పుస్తకానికి అనేక మంది ప్రముఖులు ముందుమాటలు వ్రాశారు. అవి కూడా చూడు”అన్నారు. ఇది నా ఆలోచనను పదునుపెట్టిన విషయం. ఈ విధంగా నేను పుస్తకాలను చదవడం వల్ల నాకు కొంచెం పరిజ్ఞానం పెరిగింది, సాహిత్యంలో అభినివేశం కలగడం జరిగింది. అలాగే గురువుగారి ద్వారా ఆనాడు నగరంలో ఉన్న ప్రముఖ రచయితలు, కవుల పరిచయాలు కలిగాయి. ఆ స్ఫూర్తితోనే నేను ఇంటర్మీడియట్ కూడా హెచ్.ఇ.సి. గ్రూపుతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాను, కాలేజ్ ఫస్ట్ వచ్చాను. ఇదే స్ఫూర్తితో నేను రాజమహేంద్రి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఆర్థికశాస్త్రం, చరిత్ర, రాజనీతిశాస్త్రంతో బిఎలో జాయిన్ అయ్యాను. అప్పటికీ గురువుగారు నైట్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్‌గా ఉంటూనే వున్నారు. అందుచేత మా అనుబంధం కొనసాగుతూనే వచ్చింది. 1977లో నేను మా మిత్రులతో కలిసి, ‘మనం కుర్రవాళ్ళం… అంతా అటూ ఇటూ తిరగకుండా అందరం కలిసి సమాజానికి ఏదైనా చెయ్యాలి’ అనే ఉద్దేశంతో మేము ‘గౌతమి స్టడీ సర్కిల్’ అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించాము. తొమ్మిది మందితో మొదలైన ఈ సంస్థ 35 మంది వరకు చేరింది. అప్పటి నుండి మేము తెలుగునాట ఉన్న అత్యంత ప్రాచీన గ్రంథాలయాలలో ఒకటీ, 1891లో ప్రారంభమైన గౌతమీ గ్రంథాలయానికి వెళ్ళి అక్కడి గ్రంథపాలకులు దేవదాసుగారిని కలిసి, “అయ్యా, మా గౌతమి స్టడీ సర్కిల్‌లో 15-20 మంది విద్యార్థులం ఉన్నాం, మేము ప్రతీ వారం ఇక్కడ మా గౌతమి స్టడీ సర్కిల్ తరఫున సభలు ఏర్పాటు చేసుకుంటాం, మాకు ఉచితంగా ఒక స్థలం ఇవ్వండి” అని అడిగాం. ఆ గ్రంథాలయం పరిధిలోనే ఒక ప్రత్యేకమైనటు వంటి యోగాసనాలు వేసుకునే గౌతమీ రాజయోగ సాధనాశ్రమం ఉండేది. వాళ్ళు తెల్లవారు ఝామున యోగాసనాలు వేసుకుని వెళ్ళిపోయాకా, ఆ ప్లేస్ ఖాళీగానే ఉండేది. అది మాకు కేటాయించారు. ప్రతీ ఆదివారం కూడా మేమక్కడ సభలు జరుపుకుని పెద్దల్ని పిలిపించి మాట్లాడించేవాళ్ళం. అలాగే మాలో మేము కాంపిటీషన్స్ పెట్టుకుని.. ఇట్లాగ అనేక కార్యక్రమాలు నిర్వహించాం. దాని వల్ల కూడా ఎప్పుడూ ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక కాంక్ష నాలో బలంగా బయలుదేరింది. ఇదే సమయంలో కప్పగంతుల మల్లికార్జునరావు గారు కాకుండా నాకు మరో ముగ్గురు గురువులు ఏర్పడ్డారు. వీరు నలుగురు నా జీవితానికి నాలుగు స్తంభాలుగా నిలిచారు. ఇంకొకరు ఎవరంటే, రాజమహేంద్రవరంలో ఆంధ్రకేశరి టంగుటూరి ప్రకాశం పంతులు స్మారకార్థం ‘ఆంధ్రకేసరి యువజన సమితి’ అనే స్వచ్ఛంద సంస్థని 1962లో శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు గారు స్థాపించారు. ఆ సంస్థ స్వర్ణోత్సవం జరుపుకుని ఇప్పటికీ నడుస్తోంది. 1975 వేసవికాలంలో అంటే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయి రెండో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాను… ఆ వేసవిలో వారు విద్యార్థులకి వేసంగి సాంస్కృతిక పాఠశాల అనే కార్యక్రమాన్ని నడిపారు. నేను దాంట్లో పాల్గొని ఉత్తమ విద్యార్థిగా బహుమతి స్వీకరించాను. ఆ క్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపకులైన యాతగిరి శ్రీరామ నరసింహారావు గారు నాకు గురువుగారయ్యారు. ఆయన రాష్ట్ర సహకారశాఖలో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైరయ్యారు. వారి ద్వారా నేను రాజమహేంద్రిలో ఎన్నో కార్యక్రమాల నిర్వహణలో పాల్గొన్నాను. ఎంతో నేర్చుకున్నాను. వారి ఇప్పటికీ రాజమహేంద్రిలో 82 ఏళ్ళ వయసులో ఊరిపెద్దగా, అందరికీ తలలో నాలుకగా ఉంటున్నారు. గొప్ప రచయిత. అనేక పుస్తకాలు రాశారు. వారు వీరేశలింగం స్థాపించిన రాజమహేంద్రి పురమందిరం… టౌన్ హాల్ ట్రస్ట్ బోర్డ్ ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. అక్కడ జరిగే ప్రతీ కార్యక్రమంలో కూడా నాకు భాగం కల్పించారు. అలాగే ఆయన చేపట్టే పలు ఉద్యమాలలో నేను పాల్గొంటూ ఉండేవాడిని. ఈ విధంగా యాతగిరి శ్రీరామ నరసింహారావు గారు నాకు రెండో గురువు.
అప్పట్లో రాజమహేంద్రి నైట్ కాలేజీలో రాపాక ఏకాంబరాచార్యులు గారు హిస్టరీ లెక్చరర్‌గా ఉండేవారు. నా అదృష్టం ఏంటంటే – మా నాన్నగారూ, ఆయన యానాం దగ్గరున్న కోలంక హైస్కూలులో కలిసి చదువుకున్నారు. ఒకరోజు నేను ‘సమాచారమ్’ అనే స్థానిక దినపత్రిక చదువుతుంటే అందులో ఆయన పేరు వినబడగానే, మా నాన్నగారు “అతను నా క్లాస్‌మేట్, నాకు బాగా తెలుసు. మేమిద్దరం కలిసి చదువుకున్నాం. ఇప్పుడెక్కడ ఉన్నాడు?” అన్నారు. నేను ఆయన ఇల్లు కనుక్కుని నాన్నగారితో కలిసి వెళ్ళాను. ఆయన చాలా సంతోషించారు. తర్వాత ఆయన నన్ను అడిగారు, “నాయనా, నువ్వేం చేయాలనుకుంటున్నావు?” అని. నేను సివిల్ సర్వీసెస్ రాద్దామనుకుంటున్నాని చెప్పగానే ఆయన ఆనందించారు. నన్ను శిష్యుడిగా స్వీకరించారు. ఆయన మహా పండితుడు. తర్వాత ఆయన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి గ్రూప్ 1 పరీక్షలు పాసై సహకారశాఖలో చేరి. వివిధ హోదాలలో పనిచేసి అడిషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్ సొసైటీస్‌గా రిటైర్ అయి ఇప్పుడు హైదరాబాదులో ఉంటున్నారు. చాలా గొప్ప పరిశోధకులు, రచయిత. వారు నా మూడవ గురువు.
ఇక నాల్గవ గురువు – రాజమహేంద్రవరంలో 1956లో ‘సమాచారమ్’ అనే స్థానిక దినపత్రికను స్థాపించిన గంధం సీతారామాంజనేయులు గారు. నేను రోజూ ‘సమాచారమ్’ చదువుతూ, ఈ సభలకు వెళ్తుంటే, ఒక సభలో సీతారామాంజనేయులుగారు చూసి, “రేపటి నుండి నువ్వు ‘సమాచారమ్’లో ఉండాలి, పార్ట్-టైమ్ జర్నలిస్టుగా ఉండాలి” అన్నారు. అప్పటికింకా నేను డిగ్రీ చదువుతూ ఉన్నాను. కాని నాన్ను ఆయన పార్ట్-టైమ్ జర్నలిస్ట్‌గా ఉంటూ అన్నీ రాయమని ప్రోత్సహించారు. అప్పటి నుంచి అంటే 1976 నుంచి ఇప్పటి వరకూ కూడా నాకు ఆ ‘సమాచారమ్’ దినపత్రికతో అనుబంధం కొనసాగుతోంది. 1976 నుండి 1985లో నేను ఉద్యోగంలో చేరేదాకా తొమ్మిది సంవత్సరాల పాటు విస్తృతంగా నేను ఆ పత్రికలో అనేక వ్యాసాలు, కవితలు, రిపోర్ట్‌లు అన్నీ రాసి ఉన్నాను. ఆ విధంగా ఆయన కూడా స్వంత బిడ్డలా నన్ను ఆదరించారు. ఈ విధంగా నా జీవితాన్ని మలుపుతిప్పిన మహనీయులు – కప్పగంతుల మల్లికార్జునరావు గారు, యాతగిరి శ్రీరామ నరసింహారావు గారు, రాపాక ఏకాంబరాచార్యులు గారు, గంధం సీతారామాంజనేయులు గారు.
ఇక్కడ ఒక చిన్న సందేహం ఉందండీ… ఈ వాతావరణంలో మీరు తొలి రచన ఎప్పుడు ఆరంభించారు? గుర్తుంటే కాస్త దాని గురించి చెప్పండి. ఇంకొక చిన్న ప్రశ్న ఏంటంటే సాధారణంగా అందరూ రాజమండ్రి అంటారు… మీరు మాత్రం ప్రత్యేకంగా రాజమహేంద్రవరం, రాజమహేంద్రి అని అంటున్నారు. కారణం ఏంటి?
రాజమండ్రి అనేది బ్రిటీషు వాళ్ళు పెట్టిన పేరు. నాకిష్టం లేదు. అసలు ఏమిటంటే దీని పేరు రాజమహేంద్రవరము, రాజమహేంద్రి. మన చారిత్రక ఆధారాలు ఈ రెండు పేర్లతోనే ఉన్నాయి. మా గురువుగారు యాతగిరి శ్రీరామ నరసింహారావు గారు ఊరి పేరును రాజమహేంద్రవరంగా పెట్టాలని పెద్ద ఉద్యమమే చేశారు. ఆ స్ఫూర్తితో ఆరుద్ర గారు ‘ఆంద్రకేసరి’ చలన చిత్రంలో ఒక పాట రాశారు, “వేదంలా ఘోషించే గోదావరి… అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి…” అంటూ. రాజమహేంద్రి అన్నది ఒక చారిత్రక నామం. 2014 తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఊరి పేరుని గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ‘రాజమహేంద్రవరం’ అని మార్చింది. అదీ కారణమండి.
ఇక నా రచనా వ్యాసంగం ఇంచుమించుగా నేను తొమ్మిది, పదో తరగతులు చదువుతున్నప్పుడు ప్రారంభమైంది. నేను పద్యాలు రాయడం మొదలుపెట్టాను.
ఛందోబద్ధంగానా?
అవును. ఛందోబద్ధ పద్యాలు నేర్చుకున్నాను. సుప్రసిద్ధ కవి డా. చేబోలు చిన్మయబ్రహ్మ కవిగారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. చేశారు. గొప్ప కవి. దానవాయిపేట మునిసిపల్ హైస్కూలులో ఆయన మాకు తెలుగు అధ్యాపకుడిగా ఉండేవారు. ఆయన చెప్పే విధానం ద్వారా నాకు ఆసక్తి ఏర్పడి నేను సొంతంగా ఛందస్సు నేర్చుకుని పద్యాలు రాయడం మొదలుపెట్టాను. ఇంకో విషయం ఏంటంటే రాజమహేంద్రవరంలో అందరికీ తెలిసిన గొప్ప వ్యక్తి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు. ఆయన వీరేశలింగం పాఠశాలకి ప్రధానోపాధ్యాయుడిగా ఉండేవారు. వారి పరిచయం కూడా ఇట్లాగే ఈ సభలలోనే కలిగింది. ఆయన కూడా నన్ను శిష్యవాత్సల్యంతో చూశారు. అప్పుడు నేను మధునాపంతులగారిపైన ఒక పద్యం రాశాను, దాన్ని ఇప్పటి వరకూ ప్రచురించలేదు…
మీకు గుర్తుందా అది?
ఆఁ. నాకు సీసపద్యాలు చాలా ఇష్టమండీ. సీసపద్యాలు ఇష్టమవడం వల్ల…
యెవ్వాడు అఖిలాంధ్రమున కీర్తిగాంచిన
ఆంధ్రపురాణ కావ్యంబు వ్రాసె
యెవ్వాడు ఆంధ్రీయ సమారాధనంబుతో
పత్రికారంగాన పేరునొందె
ఆణిముత్యము వంటి ఆంధ్ర రచయితల
నెవ్వాడు వ్రాసి యశస్సుగాంచె
హితభాషణంబుతో, మితభాషణంబుతో
యెవ్వాడు అందరి నతులనొందె
మాన్యుడైనట్టి మహనీయమూర్తి
ఇతడు మధురమైనట్టి కవితా కుమారుడతడు
సాటిలేనట్టి బ్రతుకుకు సాక్షి అతడు
అతడే సత్యనారాయణార్యుండు గురుడు
ఇది తిక్కన ధర్మరాజు గురించి చెప్పిన పద్యంలా ఉంది…
తిక్కన “యెవ్వాని వాకిట నిహమద పంకంబు రాజభూషణ రజో రాజి నడఁగు” అన్నాడు. అలాగే శ్రీనాథుడు రాసిన ‘ఎవ్వడు డాచేతి క్రొవ్వాడి రకమున చిదిమి భాషా దేవి చిగురు ముక్కు’ అనే పద్యాలు నాకు బాగా ఇష్టం. ఆ శైలిలో నేను రాయడానికి ప్రయత్నించి మా గురువుగారికి నివాళిగా రాశాను. ఈ సంవత్సరం మధునాపంతుల వారి శతజయంతి. ఆయన 1920లో జన్మించారు. శతజయంతి ఉత్సవాల సంఘం పనులు బాగా జరుగుతున్నాయి. ఈ విధంగా నాపై మధునాపంతుల గారి ప్రోత్సాహం ఉండేది. నాకు పదహారేళ్ల వయసులో నేను ‘సమాచారమ్’ పత్రికలో రాయడం మొదలుపెట్టాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా, 1976 ఆగస్టు 15న నా మొట్టమొదటి రచన ప్రచురింపబడింది. ఆగస్టు 15 అరవింద్ ఘోష్ పుట్టినరోజు. ఆరోజు మన స్వాతంత్ర్య దినోత్సవం కూడా. చాలా విలువైనది. నేను అరవింద్ ఘోష్ గురించి చదివాను. ఆయన ఆలీపూర్ కుట్ర కేసులో ముఖ్యమైన నిందితుడు. ఆ తరువాత ఆయన తరఫున చిత్తరంజన్ దాస్ గారు వాదించారు. ఇదంతా నేను చదివి ఉండడంవల్ల ఒక చిన్న వ్యాసం రాసి ‘సమాచారమ్’ పత్రికకి పంపించాను. వాళ్ళు దాన్ని ప్రచురించారు. అప్పటికి సీతారామాంజనేయులు గారితో నాకు పరిచయం లేదు. మామూలుగా నేను పోస్టులో పంపించాను, వారు ప్రచురించారు. అదే ‘మహనీయులు అరవింద ఘోష్’ పేరిట 1976 ఆగస్టు 15న ప్రచురితమైన నా మొట్టమొదటి రచన.