ఇంటి గోల – వీధి గోల

0
6

[dropcap]”అ[/dropcap]మ్మా!.. లారీ వచ్చేస్తోంది” ఇంటి బయట నిలబడి ఫోన్ మాట్లాడుతున్న గీతిక గబగబా ఇంట్లోకి వచ్చి చెప్పింది.

“సరే, రానీ, అన్నీ రెడీనేగా” అంది వెంకటలక్ష్మి.

ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చి అన్నీ సామానులు ప్యాక్ చేయటం మొదలు పెట్టారు. మాములుగా వాళ్ళు గుండు సూది కూడా వదలరు, అన్నీ పెద్ద పెద్ద అట్ట పెట్టెల్లో సర్దేస్తారు. చెత్త అంతా మళ్ళీ కొత్త ఇంట్లోకి చేరటం ఎందుకని, ముందుగానే అన్నీ ఏరి కేవలం అవసరమైనవి మాత్రమే ఉంచింది వెంకటలక్ష్మి.

వాళ్ళు అన్నీ వస్తువులు లారీలో సర్దేసి రేపు పొద్దున్నే ఆరు గంటలకల్లా హైదరాబాద్‌లో ఇంటి అడ్రెస్‌కు చేరుస్తామని వెళ్లిపోయారు.

వెంకటలక్ష్మి, గీతిక చుట్టుపక్కల తెల్సిన వాళ్లందరికీ వెళ్ళొస్తామని చెప్పి తొమ్మిది గంటలకల్లా బస్టాండ్ చేరుకున్నారు.

వెంకటలక్ష్మి, శేఖర్ దంపతులకు గీతిక, స్వాగత్ ఇద్దరు సంతానం. శేఖర్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్‌గా సౌదీలో పని చేస్తున్నాడు. మూడేళ్ళ తర్వాత ఇండియా వస్తాడు. స్వాగత్‌కి బి.టెక్. అయిపోగానే HCL లో జాబ్ వచ్చింది హైదరాబాద్‌లో. ఫ్రెండ్‌తో కల్సి అపార్ట్మెంట్ షేర్ చేసుకుంటున్నాడు. గీతికది ఈ ఏడు ఎం.బి.ఏ అయింది. అటు స్వాగత్‌కి ఇంట్లో వున్నట్లుంటుంది, ఇటు గీతికకి అక్కడైతే జాబ్ ఆఫర్స్ ఎక్కువ వుంటాయని ఆలోచించే ఈ షిఫ్టింగ్ కార్యక్రమం మొదలు పెట్టారు.

కిందటి నెల వెంకటలక్ష్మి వెళ్లి మోతీనగర్లో ఇల్లు వెతుక్కుని వచ్చింది, అటు హైటెక్ సిటీ వెళ్ళచ్చు, ఇటు అమీర్‌పేట్‌కి వెళ్ళచ్చు అని.

మర్నాడు పొద్దున్న ఐదు గంటలకల్లా ఇంటికి చేరారు. స్వాగత్ మెయిన్ రోడ్ మీద ఉండి తల్లిని, చెల్లిని రిసీవ్ చేసుకున్నాడు. వెనకే లారీ కూడా వచ్చింది. ఆ రోజంతా సర్దటం సరిపోయింది. తినడానికి బయట నుంచి తెచ్చాడు స్వాగత్.

అది జి+2 బిల్డింగ్. అన్ని ఫ్లోర్లలో రెండు పోర్షన్లు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇల్లుగల వాళ్ళు, వెంకటలక్ష్మి వాళ్ళు వుంటారు. ఫస్ట్ ఫ్లోర్ అద్దెల వాళ్ళు, సెకండ్ ఫ్లోర్‌లో ఇల్లుగల వాళ్ళ కొడుకులు ఇద్దరు వుంటారు. మంచి సెంటర్‌లో ఉంది ఇల్లు. ఎదురుగ కిరాణా షాప్, నాలుగు బిల్డింగ్స్ తర్వాత బస్టాప్. ఇంకా అన్ని సౌకర్యాలు దగ్గర్లో అందుబాటులో ఉంటాయి. ఆ రాత్రి ఎవరికీ నిద్రపట్టలేదు, కొత్త చోటు ప్లస్ బయట శబ్దాల గోల.

ఇంట్లో గదులు వరసగా ఉంటాయి. గీతికకి నచ్చలేదు. కానీ ఇల్లు సెంటర్‌లో ఉంది, పిల్లలకి ఎంత లేట్ అయినా భయం ఉండదు, పైగా సిటీకి రావటం ఇదే మొదలు. కొంచెం దూరం లోనే వెంకటలక్ష్మికి పిన్ని వరస అయ్యే వాళ్ళు వుంటారు. అందుకే ఇదే ఫిక్స్ చేసింది వెంకటలక్ష్మి. పన్నెండు వరకు బస్సులు తిరుగుతూనే ఉంటాయి. ఎంత తలుపులు వేసుకున్నా రణగొణ ధ్వని, రాళ్ల వాన.

“ఇల్లు సెంటర్ లో ఉంది అంటావు, ఇల్లు కాదు, సెంటరే ఇంట్లో ఉంది” విసుక్కుంది గీతిక.

ఎవరో ఒకరు సేల్స్ పర్సన్స్ తలుపులు కొట్టటం, మాకేం వద్దు అని చెప్పటం రోజువారీ కార్యక్రమమైపోయింది.

ఒకరోజు ఇలాగే దూరపు చుట్టాలెవరో వీళ్ళు ఇక్కడ వున్నారని తెలిసి, పెళ్ళికి పిలవటానికి వచ్చారు. వాళ్ళ చేతుల్లో సంచులు చూసి గీతిక ఎవరో సేల్స్ వాళ్ళు అనుకుని “మా అమ్మ లేదు వెళ్ళండి” అని వాళ్ళ మొహానే తలుపేసింది. ఆ తర్వాత ఆవిడ వెంకటలక్ష్మిని మొహం వచ్చేలా చీవాట్లు పెట్టింది పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా అని.

కాస్త సర్దుకున్నాక జాబ్స్‌కి అప్లై చెయ్యటం మొదలేసింది గీతిక. కొన్ని ఆఫర్స్ వచ్చాయి కానీ, దూరం అయిందనో, శాలరీ తక్కువనో, షిఫ్ట్ సిస్టం అనో రక రకాల కారణాలతో చేరలేదు. “కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏముంది, మంచిదే చేరుదువు” అంది వెంకటలక్ష్మి.

***

ఒక అర్ధరాత్రి అందరు మంచి నిద్రలో వున్న వేళ బయట గేటు చప్పుడైంది. ముందు గది లోనే పడుకున్న గీతిక, వెంకటలక్ష్మి ఉలిక్కిపడి లేచారు.

“దొంగేమోనమ్మా..” ఏడుపు గొంతుతో అంది గీతిక. అసలే స్వాగత్ నైట్ షిఫ్ట్‌లో వున్నాడు.

“చూద్దాం, భయపడకు” అని చిన్నగా వంట ఇంట్లోకి వెళ్లి కారం చేతిలో వేసుకుని వచ్చి కిటికీ పక్కగా పొంచి వుంది వెంకటలక్ష్మి.

తీరా చూస్తే వాళ్ళు పక్క అపార్ట్మెంట్ లోని స్టూడెంట్స్. ఒకడు ఫుల్‌గా తాగి వచ్చాడు. చేతిలోని బాటిల్ వీళ్ళ గేట్ కేసి కొట్టి గొడవ చేస్తున్నాడు. వాడి ఫ్రెండ్ కాబోలు “పోదాం రారా” చెయ్యి పట్టుకు లాగుతున్నాడు.

“నాకు పెళ్లి చేస్తానంటే వస్తా”

“ఇప్పుడేం పెళ్లి రా.. రూమ్ కి పోదాం రారా” ఇంకా బతిమాలుతున్నాడు ఫ్రెండ్.

“ఊహు. చెప్పు పెళ్లి చేస్తావా, అప్పుడొస్తా” ఇంకా తూలిపోతున్నాడు వాడు.

“ఒరేయ్ రారా.. ఇట్లా గొడవ చేస్తే ఖాళీ చేయిస్తార్రా”

“నో..నో.. టెల్ మీ.. టెల్ మీ. చేస్తావా?”

విసిగిపోయిన వాడి ఫ్రెండ్ ఎలాగైనా తీసికెళ్లాలని “సర్లే రా.. చేస్తా పెళ్లి” అన్నాడు.

“నిజం గా చేస్తావా.. థాంక్స్ రా..” తూలుకుంటూ, తూలుకుంటూ బుద్ధిగా వెళ్ళిపోయాడు.

తల్లీకూతుళ్లు పడి పడి నవ్వుకున్నారు.

***

ఇంటి ఓనర్ ఆమెకు మోకాళ్ళు నొప్పులు. వొంగి ముగ్గు వెయ్యలేదు. అందుకే రోజూ వెంకటలక్ష్మే వేస్తుంది. ఆరు గంటలకి వచ్చే నీళ్లు పట్టుకుని, వాకిలి కడిగి, ముగ్గు వేసి లోపలికెళ్ళింది.

పైన అద్దెకున్న ఆవిడ ఈ మధ్య కుండీలు కొని మొక్కలు పెట్టింది వాళ్ళ వరండాలో. తాను కూడా నీళ్లు పట్టుకుని ఆ తర్వాత ఆ పైప్ పెట్టి అన్ని కుండీల్లో నీళ్లు నింపింది. అవ్వి నిండిపోయి, మెట్ల మీదకుండా ప్రవహించి, కింద వరండా అంతా తడిపి, గేటు దిగి ముగ్గును తనలో కలిపేసుకుని పక్క బిల్డింగ్ కూడా దాటిపోయి చిన్నగా అంతర్వాహినిగా మారిపోయాయి.

వెంకటలక్ష్మి బయటికి వచ్చి చూసేసరికి, వాకిట్లో చెప్పులన్నీ తడిసిపోయి, ముగ్గు అంతా చిరిగిపోయి, భీభత్సంగా కనిపించింది. మనస్సులోనే తిట్టుకుని ఊరుకుంది.

కానీ రోజూ ఇదే తంతు. ఈ గంగా ప్రవాహం చూసి చిర్రెత్తి ఆవిడని పిల్చి చెప్పింది వెంకటలక్ష్మి “రోజూ కాస్తే పోయండి నీళ్లు. ఏంటిది రోజూ రొచ్చు, జారి పడితే ఏమన్నా ఉందా.”

“ఓలమ్మో..ఓలమ్మో..ఈ మడిసేంది.. ఇంత దాక నన్నెవరూ ఏటి అన్నేదు” వాళ్ళ యాసలో ముక్కు చీదింది.

వీటన్నిటికీ ఎలాగో సర్దుకుంటుంటే మరో ఉపద్రవం వచ్చి పడింది ఇంటి ఓనర్ కోడళ్ల రూపంలో.

కోడళ్ళు రోజూ కిందికి వచ్చి అత్తగారిని పలకరించి పోతుంటారు. ఒకటీ, రెండు సార్లు వాళ్ళొచ్చినప్పుడు వెంకటలక్ష్మి బయటే నుంచుని ఉండటంతో పలకరించింది బాగోదని. అంతే, అది అలుసు తీసుకుని రోజూ వచ్చి ఇంట్లో కూర్చుని ముచ్చట్లు పెడుతున్నారు తోటికోడళ్లిద్దరూ.

చిన్నకోడలికి నెలల పిల్లాడు. వాడిని చూసి ముద్దు చేసింది గీతిక. బిస్కెట్ పెడితే చక్కగా తిన్నాడు వాడు. కాస్సేపు ఆడుకుంటూ ఉంటుంది వాడితో.

ఓరోజు “గీతికా, వీడ్ని కొంచెం చూడవా, షాపింగ్ చేసుకుని వస్తా” అని ఇచ్చిపోయింది చిన్నావిడ. ముద్దుకొద్దీ సరే అంది గీతికా.

ఆ పోవడం, పోవడం సాయంత్రానికి వచ్చింది. ఈ లోపు వాడికి అన్నం పెట్టడం, అదనంగా వాడి ఒకటి, రెండులు కూడా గీతిక మీద పడ్డాయి. వాడు రెండుకి వెళ్తుంటే వాళ్ళ నాన్నమ్మకి ఇవ్వబోయింది. “నాకు మోకాళ్ళ నొప్పులమ్మా, వొంగలేను” దీర్ఘం తీసింది ఆమె.

ఓసినీ దుంప తెగ.. తిట్టుకుంటూ అన్ని క్లీన్ చేసింది. దెబ్బతో ముద్దు కాస్తా పోయింది.

ఇక అప్పటినుంచి రోజూ వాడ్ని తెచ్చి “అబ్బా.. నీ దగ్గరే భలే ఉంటున్నాడు. నువ్వు పెడితే బాగా తింటున్నాడు. నేను పెడితే నోరు తెరవట్లా” అనుకుంటూ గీతిక దగ్గర వదిలేసి వెంకట లక్ష్మితో ముచ్చట్లు పెడుతుంది సోఫాలో కూర్చుని.

ఇదంతా చూసి పెద్ద కోడలు కూడా దాడి చేసింది. పదేళ్ల కూతుర్ని రోజూ సాయంత్రం గీతిక దగ్గరకి తోలి హోమ్ వర్క్ చేయించమంటోంది. పొద్దున్న పూట చంటిగాడు, సాయంత్రం ట్యూషన్, ఉక్కిరి బిక్కిరి అయిపోయింది గీతిక.

ఇలా కాదని, బాగోలేదు, తలనొప్పి అని తప్పించుకుంది గీతిక రెండు రోజులు. అర్థం చేసుకుంటుందిలే అనుకున్నారు తల్లీకూతుళ్లు. ఏం లాభం లేదు. రెండు రోజులు ఊరుకుని, మూడో రోజు నుంచి దింపటం స్టార్ట్ చేసింది. స్వాగత్ నైట్ షిఫ్ట్ చేసినప్పుడు, పగలు పడుకుంటాడు. అప్పుడు మరీ ఇబ్బంది అవుతోంది. కానీ ఆమెకివేం అర్ధం కావు.

వద్దని చెప్పటానికి నిముషం పట్టదు. కానీ ఇంటివాళ్ల కోడళ్లయ్యే,హర్ట్ అయితే ఖాళీ చెయ్యమంటారు. ఇంత సామాను మళ్ళీ సర్దాలి అని భయం వేసి వూరుకుంటున్నారు.

మొగుడు వెళ్ళగానే, పిల్లాడ్ని తీసుకుని వస్తుంది. వాడిని వదిలేసి ముచ్చట్లేస్తుంది. లంచ్ టైం అయినా కదలదు. ఎంత సేపు తినకుండా వుంటారు?.. రా అమ్మాయి తిందాం అంటుంది వెంకటలక్ష్మి. అప్పుడు పైకి వెళ్లి రైస్ ప్లేట్ లో పెట్టుకొని వచ్చి, సూపర్ చేసారు ఆంటీ అని కూరలన్నీ ఖాళీ చేస్తుంది.

గీతిక చేతిలో రోజూ తిట్లే వెంకటలక్ష్మికి, ఎంత గోల ఇంట్లో తెచ్చి పడేశావు అని. నేనేమన్నా కలగన్నానా అని సమర్థించుకుంటుంది వెంకటలక్ష్మి.

వీళ్ళ గోల మధ్య ఇంటర్వూస్‌కి ప్రిపేర్ అవటం కష్టం అయిపోతోంది గీతికకి. ఎట్లాగో కొన్నాళ్ళకి, నానా తిప్పలు పడ్డాక, ఒక మంచి కంపెనీలో అసిస్టెంట్ HR మేనేజర్‌గా సెలెక్ట్ అయింది. గీతిక ఆనందానికి అంతు లేదు ఎన్నాళ్ళనుంచో ఎదురు చూస్తున్న జాబ్ రావటంతో. పైపెచ్చు ఇంట్లో వీళ్ళ గోల తప్పించుకోవచ్చు అని సంబరపడిపోయింది.

ఒకరికి మోదం అయితే, ఒకరికి ఖేదం అన్నట్లు ఇప్పుడు వెంకటలక్ష్మికి కొత్త భయం పట్టుకుంది, గీతిక జాబ్ కెళ్తే పిల్లవాడి డ్యూటీ తనకి పడుతుందేమో అని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here