కాజాల్లాంటి బాజాలు-69: ఇంటికంటె గుడి పదిలం

2
11

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఏ[/dropcap]విటో ఈ వదిన నాకస్సలు అర్థం కాదు. అసలేం జరిగిందంటే…..

ఇవాళ పొద్దున్నే పనయ్యేక అలవాటుగా వదినకి ఫోన్ చేసేను. ఔట్ ఆఫ్ కవరేజ్ యేరియా అని వచ్చింది. కుతూహలం ఆపుకోలేక లాండ్ లైన్ నంబర్‌కి కలిపేను. ఇంట్లోంచే పని చేసుకుంటున్న అన్నయ్య పలికేడు ఫోన్‌లో.

“వదిన ఫోన్ చార్జ్‌లో లేదా అన్నయ్యా” అనడిగేను.

“అదేం లేదమ్మా. మీ వదిన ఊరెళ్ళింది.” అన్నాడు కామ్‌గా అన్నయ్య..

ఆశ్చర్యపోయేను. మొన్ననే కదా ఊర్నించి వచ్చిందీ.. మళ్ళీ ఊరెళ్ళిందా… అందులోనూ ఇలాంటి టైమ్‌లో.

ఈ కరోనా మహమ్మారి వచ్చినప్పట్నించీ మా ఇంట్లోవాళ్లం మెయిన్ రోడ్డు దాకా వెళ్ళడానికే ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని, వందరకాల జాగ్రత్తలు తీసుకుని, తప్పని పనిని అర్జంటుగా ముగించుకుని, ఇంటికొచ్చి పడుతున్నాం. అలాంటిది వదిన ఇలా ఊళ్ళు తిరిగేస్తోందేవిటీ! తనకసలు భయమనేదే లేదా!

“అదేంటన్నయ్యా.. బైట అస్సలు బాగులేదని వింటున్నాం కదా, ఇలాంటప్పుడు మొన్నీమధ్యే వచ్చిన వదిన్నిమళ్ళీ ఊరెందుకు పంపించేవూ! ఇంతకీ ఏ ఊరెళ్ళిందీ! ఎందుకూ!”

“ఏవోనమ్మా.. ఏదో చెప్పింది. నాకు సగం అర్థమైందీ.. సగం కాలేదూ.. నాకెందుకు మధ్యన.. మంచీ చెడూ తనకామాత్రం తెలీవూ!” అంటూ ఫోన్ పెట్టేసేడు అన్నయ్య.

హూ.. ఈ అన్నయ్యకి ఏం మందు పెట్టిందో ఏవో వదిన.. అన్నయ్య అమాయకుడు కాబట్టే వదిన వేషాలు సాగుతున్నాయి. తను చెప్పినవాటన్నింటికీ డూడూ బసవన్నలా తలూపుతుంటాడు. నాకు వదినని తల్చుకుంటే విసుగూ, భయమూ కూడా ఒక్కసారే వచ్చేయి.

ఈ కరోనా వచ్చినప్పట్నించీ అందరూ ఎంత జాగ్రత్తగా వుంటున్నారో మా వదిన అంత నిష్పూచీగా వుంటోంది. అసలు లాక్‌డౌన్ టైమ్ లోనే బంధువులింటికి పరామర్శకి వెళ్ళింది.

టీవీలో వార్తల్లో రోడ్డు మీద కనిపించిన వాళ్ళనల్లా లాఠీలతో కొడుతున్న పోలీసులని చూసిన నేను భయంతో వదినని అడిగేను.

“అలా ఎలా వెళ్ళేవు వదినా.. పోలీసులు ఆపలేదా!” అంటూ..

“డాక్టర్ పర్మిషన్ చేతిలో పట్టుకునే వెళ్ళేను” అంది గొప్పగా.

“బైట అస్సలు బాగులేనప్పుడు అంత పని కట్టుకుని వెళ్ళకపోతేనేం!” అన్న నా ప్రశ్నకి

“ఇలాంటప్పుడే మనం వెళ్ళి వాళ్లకి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి..” అంది.

సరే పోనీ ఏదో బాధలో వున్నవాళ్ళకి మోరల్ సపోర్ట్ యిచ్చిందని వదిన విశాలహృదయాన్ని మెచ్చుకుని, అంతటి మంచి హృదయం నాకు లేనందుకు విచారించేను.

అది జరిగి నాల్రోజులు కాలేదు. అప్పుడే లాక్‌డౌన్ తీసేసేరు. ఇంకా మనుషులు బైటకి రావడానికి భయపడుతున్నారు. అలాంటి టైమ్‌లో వదిన పదిహేనురోజులపాటు ఉత్తరభారతదేశ సందర్శనకి బయల్దేరింది.

“ఈ పనేంటమ్మా..బయట తిరగడం అస్సలు మంచిది కాదు..” అని నేనన్న మాటకి “ఇంట్లో వుంటే మరీ పిచ్చెక్కిపోతోంది. కాస్త నాలుగూళ్ళు తిరిగొస్తే మనసుకి బాగుంటుంది. నువ్వూ రావచ్చుగా..” అంటూ నన్నూ బయల్దేరతీయబోయింది.

వామ్మో.. మొత్తం ప్రపంచమంతా ఎక్కడివాళ్ళక్కడ బందీలైపోయిన ఈ రోజుల్లో ఇంకా మనసుకి ఎక్కడి కెడితే మటుకు ప్రశాంతత వస్తుందీ! అందుకే నేను రానన్నాను. వదిన చక్కగా పదిహేనురోజులూ ఉత్తరదేశ పర్యటన చేసొచ్చింది.

ఆ విశేషాలన్నీ తెగ వర్ణిస్తూ చెప్పింది. పోనీలే.. ఏదో జాగ్రత్తగా తిరిగొచ్చిందీ అనే ఉద్దేశంతో వదిన చెప్పినవన్నీ ఎంతో ఆసక్తి కనపరుస్తూ విన్నాను.

ఓ పదిరోజులు బుధ్ధిగా ఇంటిపట్టున వుందో లేదో వాళ్ళమ్మగారినీ, నాన్నగారినీ చూడడానికంటూ వాళ్ళూరు వెళ్ళింది.. అక్కడో పదిరోజులుండి పెద్దవాళ్ళంటూ వాళ్లకి కావల్సిన ఏర్పాట్లు చేసి, ధైర్యం చెప్పి ఓ వారం క్రితవే ఇల్లు చేరింది.

అంతే.. మళ్ళీ ఇప్పుడు ఇలా! అసలు ఈ సమయంలో వదిన ఇలా ఊళ్ళు పట్టుకుని యెందుకు తిరుగుతున్నట్టూ!

ఆపుకోలేక ఆ మాటే అడిగేసేను వదిన్ని ఫోన్ చేసినప్పుడు. అప్పుడు ఫోన్‌లో మా వదిన ఇలా చెప్పింది..

“ఏంటి స్వర్ణా.. ఆమాత్రం తెలీట్లేదూ నీకూ.. ఈ మహమ్మారి కాదుకానీ దాని వల్ల చాలామంది మగవాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మీ అన్నయ్య కూడా అంతే కదా! చేసుకుంటే చేసుకున్నారు.. ఏదో మూల కూర్చుని ఆ పనేదో చేసుకోవచ్చుగా.. అబ్బే…వాళ్ళకి ఆఫీసులో లాగా తడవ తడవకీ మధ్యే మధ్యే పానీయాలు అందించవలసొస్తోంది. అసలు టీలు అలా పెట్టీ పెట్టీ స్టౌ కీ నాకూ కూడా విసుగొచ్చేసింది. పోనీ ఒక్కసారే చేసేసి ఫ్లాస్క్ లో పోసిపెడదామంటే “కాస్త ఫ్రెష్ గా చెయ్యొచ్చుకదా!” అంటూ కామెంట్లూ.

సరే పోనీ అనుకుంటే టీలతో సరిపెడతారా.. ఇంట్లో కూర్చుంటున్నారు కదా పిండిమరలాగా అస్తమానం ఆ నోరు ఆడుతూనే వుండాలి. అయిదు నిమిషాలకోసారి ఆ ఆఫీస్ వీడియో ఆఫ్ చేసి ఇంత కారప్పూసో, ఇన్ని జంతికలో పటపటలాడించేసి మళ్ళీ ఆన్ చెయ్యడం.

సరే దానిక్కూడా పోనీలే పాపం అనుకుందామంటే వాళ్ళు కాల్‌లో వున్నంతసేపూ ఇల్లంతా నిశ్శబ్దంగా వుండాలి. ఓ టీవీ సౌండ్ పెట్టుకుందుకు లేదు, మిక్సీ తిప్పుకుందుకు లేదు, సరిగ్గా చెప్పాలంటే కాస్త ఘాటుగా పోపు వెయ్యడానికి కూడా వుండడంలేదు. వాళ్ళకి కావల్సినప్పుడు ఆడియో, వీడియో ఆఫ్ చేసేసుకుంటారు. మనం చెయ్యమంటే మటుకు అర్జంట్ కాల్ కుదర్దు.. అనేస్తారు.

ఏదో వాళ్ళు పదింటికి ఆఫీసుకెళ్ళి, సాయంత్రం యింటికొస్తే యింట్లో పగలంతా మన యిష్టం వచ్చినట్టుండేవాళ్లం. ఇప్పుడు ఇంట్లో కాళ్ళూ, చేతులూ కట్టేసుకుని కూర్చోవలసొస్తోంది.

అందుకే రైళ్ళు తిరగడం మొదలెట్టగానే ఉత్తరదేశయాత్రలంటూ వెళ్ళిపోయేను. హాయిగా పదిహేనురోజులు తిరిగొచ్చేక మళ్ళీ ప్రాణం పోసుకున్నట్టనిపించింది. ఇదేదో బాగానే వుందనుకుంటూ ఓ పదిరోజులయ్యేక మా అమ్మావాళ్లనీ చూడాలనే వంకతో మా ఊరెళ్ళేను. వాళ్లకి నేనేం చూడాలీ నా మోహం. వాళ్ళకి ఊళ్ళో వున్న పలుకుబడికి ఫోన్ చేస్తే చాలు ప్రతీదీ ఇంటికొచ్చేస్తోంది. ఇదింకా బాగుందని అక్కడింకో పదిహేను రోజులుండి వచ్చేను.

మళ్ళీ ఓ పదిరోజులు ఏదో వున్నానన్నట్టు యింట్లో వుండి ఇప్పుడు ఇదిగో ఈ దక్షిణదేశయాత్రలంటూ యిటువైపొచ్చేను.”

వదిన వాక్ప్రవాహాన్ని ఒక్కసారి ఆపి, “వదినా, ఈ టైమ్‌లో నువ్విలా తిరుగుతుంటే అన్నయ్యకి ఇబ్బంది కాదూ! ఒక్కడే అన్నీ చూసుకోవాలికదా పాపం..” అన్నాను.

“ఏవీ పరవాలేదు. మనం యేది నేర్పితే దానికే అలవాటు పడిపోతారీ మగవాళ్ళు. నాల్రోజులయ్యేటప్పటికి అన్ని పన్లూ అవే అలవాటౌతాయి.”

“అంటే, నువ్వు వెడతానంటే అన్నయ్య ఒప్పుకున్నాడా!”

“పిచ్చిదానా.. ఇలా ఊళ్ళు తిరిగొస్తానంటే ఏ మొగుడు ఒప్పుకుంటాడూ! ఒప్పించడం లోనే వుంది గొప్పతనవంతా.”

“అదే.. ఎలా ఒప్పించావూ అని..” దీర్ఘం తీసేను.

“చాలా సులభం. మనం మనకోసం ఇంత కష్టపడి యాత్రలు చెయ్యటంలేదనీ, కేవలం భర్తలు సుఖంగా, ఆరోగ్యంగా వుండడం కోసమే మనం ఇలా ఇల్లు పట్టకుండా దేవుళ్ళచుట్టూ తిరుగుతున్నామనీ చెప్పెయ్యడమే..”

“ఆ.. చెప్పేస్తే మా అన్నయ్య అమాయకుడు కనక నమ్ముతాడేమో కానీ అందరూ ఎందుకు నమ్ముతారూ!”

“ఎందుకు నమ్మరూ! ఈ గ్రహం మీకు ఇప్పుడు బాగులేదండీ. ఎదురింట్లోంచి మిమ్మల్ని వక్రంగా చూస్తున్నాడు. ఆ వక్రమమైన చూపు సక్రమమవాలంటే ఫలానా గుళ్ళో శాంతులు చేయించాలండీ.. అని చెప్పెయ్యడమే.. సెంటిమెంటు మీద కొడితే పడని వాళ్ళెవరైనా వుంటారా!..”

“వామ్మో.. అలా చెప్పొచ్చా!”

“ఎందుకు చెప్పకూడదూ! మనం పెద్దవాళ్ళు చెప్పిన మంచిమాటలు ఆచరించాలా వద్దా!”

వదిన సూటిగా అడిగినదానికి నేను విధేయంగా “అవును.. చెయ్యాలి.” అన్నాను.

“మరదే నేనూ చేసింది.. వాళ్ళే అన్నారుగా ఇంటికంటే గుడి పదిలం అని.. నేను చేస్తున్నదదే కదా!”

“హాఆఆఆ”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here