రంగుల హేల 51: ఇంటిలోన పోరు ఇంతింత కాదయా!

19
7

[box type=’note’ fontsize=’16’] ముళ్ళ గులాబీ లాంటి స్వీట్ అండ్ హ్యాపీ హోమ్ ముచ్చటలు వివరిస్తున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల’ కాలమ్‌లో. [/box]

[dropcap]ఈ[/dropcap]స్ట్ ఆర్ వెస్ట్ హోమ్ ఈజ్ బెస్ట్ అంటారు. నిజమే బెస్టే. అలా అని మనిల్లు మనకి హంసతూలికా తల్పంలా గొప్ప సౌఖ్యాన్నిస్తూ మనల్ని ఊయల ఊపుతుందనుకుంటున్నారా! అబ్బే! అలాంటి ఆశే లేదు. సవాలే లేదు.

మనిల్లు ముఖ్యంగా మన సొంతిల్లు మనల్ని చక్కగా నిరంతరం రోస్ట్ చేసుకుని తింటూ ఉంటుంది. మన పిల్లలు చికెన్ పాప్ కార్న్ ఇష్టంగా తింటారు కదా అలాగన్నమాట. మన ఇంటికి మనం జన్మ జన్మల బాకీ తీరుస్తూ ఉంటాం.

రెండో తారీఖున పంపు విరిగిపోతే మళ్ళీ ఫస్ట్ దాగా ఆగాల్సిందే అన్న ఓనర్ మొదలుకొని, బాత్రూంలో బకెట్ లను కూడా (నీళ్లు దుర్వినియోగం అవుతున్నాయేమో అని) తనిఖీ చేసే ఓనర్‌ల బారి నుంచి తప్పించుకుని దొరికినన్ని అప్పులు చేసి కట్టుకున్న మనింట్లో మనం చాపేసుకుని కాళ్ళు బార్లా చాపి పడుకుంటే ఊరుకుంటుందా ఏంటి మనిల్లు? అది ప్రతీ క్షణం మనల్ని గిల్లుతూ, సూదితో గుచ్చుతూ ఎవరికీ చెప్పుకోవడానికి ఆనవాలు దొరక్కుండా మనల్ని నలుపుతూ ఉంటుంది. కనబడకుండా సలిపే గాయం పేరే ఇల్లు. అది సింగల్ బెడ్ రూమ్ ఇల్లైనా, విల్లా అయినా ఒకే పరిస్థితి. ఎంత ఇంటికి అంత అప్పు తప్పదు. తత్సంబంధమైన తిప్పలూ తప్పవు.

ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టి కట్టినా, ప్రతీ ఇంట్లోనూ ఒక పెద్ద లోపం ఉంటుంది. వంటిల్లు ఇరుకనో, దేవుణ్ణి పెట్టుకోవడానికి లేదనో, బాల్కనీలు చిన్నవనో, మరీ పెద్దవనో, ఎప్పుడూ ఎండ పడుతుందనో, అసలు పడదనో శాశ్వతమైన అవకరం ఒకటుంటుంది. దాన్ని మెల్లగా అరిగించుకుని బతుకు సాగిస్తుండగా గెస్ట్ గారెవరో వచ్చి ఆ ఇబ్బందిని గుర్తు చేసి కారం జల్లుతూ ఉంటాడు. అప్పుడు మనం ఆపాలజీ లాంటిది చెబుతూ ఆయన గారిని బుజ్జగించాలన్నమాట. అక్కడికి ఆ ఇల్లేదో అతనికి మనం అమ్మబోతున్నట్టు అతను కొనబోతున్నట్టు మొహం పెట్టి వింటుంటాడాయన. ఇంట్లో ఉన్న ప్లస్ పాయింట్లను మాత్రం మెచ్చుకోడు. లోక సహజ రీతి అదే కదా!

మగవాళ్ళకయితే ఇంటికి రాగానే నిత్యం ఏదో ఒక సరుకు అయిపోయిందని రేపటికి లేదనీ ఇల్లాలి సణుగుడు ఉంటుంది. అప్పటికప్పుడు బైటికి వెళ్లి తేవాల్సిందే. ముందే చెప్పొచ్చుకదా అంటే ‘ఎప్పుడో చెప్పేం మీరు మర్చిపోయారు’ అంటారు. ఇది కాక వంటింట్లో పంపో, వాష్ బేసిన్లో పంపో లీక్ అవుతూ ఉంటాయి. ఇంకా బాత్రూంలో గీజరో, వాషింగ్ మెషినో ట్రబుల్ ఇస్తూ ‘మాకు వయసయిపోయింది, ఇంక నడవలేము’ అని కుంటుతూ ఉంటాయి. మనం కట్లు కడుతుంటే అవి ఊడిపోతూ ఉంటాయి. ఓ శుభ ముహూర్తాన అవి రెస్ట్ ఇన్ పీస్ లోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటాయి. అప్పుడిక ఓ పెద్ద బడ్జెట్ పదో, పదిహేను వేలో వదుల్తాయి. అమ్మయ్య అనుకుని కాస్త ఆనందపడేలోగా గ్యాస్ స్టవ్ కేదో అస్వస్థత వస్తుంది. మళ్ళీ పరుగు తప్పదు ఇంటాయనకి. అలాంటప్పుడు “మీది సొంతిల్లా సార్? హాయి కదా” అనే బ్యాచిలర్ గాడి పీక నొక్కకుండా ఉండాలంటే గొప్ప స్థితప్రజ్ఞత అవసరం అవుతుంది. ఎంత ఖరీదైన ఫ్యాన్‌లు కొన్నా అయిదులో పెడితేనే బాగా సౌండ్ చేసుకుంటూ తిరుగుతాయి. అంటే వాటికీ మ్యూజిక్ సెన్స్ ఉంటుందన్నమాట. తగ్గిస్తే, కోపగించి అసలు గాలే రానియ్యవు. ఈ ఇబ్బంది గురించి గట్టిగా అనుకుందామనుకుంటే ‘హాల్ లో కూడా ఏ.సి. ఉంది మా ఫ్రెండ్స్ ఇళ్లలో’ అంటారు పిల్లలు. అందుకే కొన్ని విషయాల గురించి బాహాటంగా చర్చించకూడదు.

ఇంక ఆడవాళ్ళకి సొంతిల్లు ఎంత ఆనందాన్నిస్తుందో వాళ్ళను ఇంటర్వ్యూ చేసి తెలుసుకుంటే జన్మ జన్మల అంతులేని సీరియల్ అవుతుంది. అపార్టుమెంట్ కొనుక్కుంటే (ఇంటి విశాలతకీ, సౌఖ్యానికీ) సొంతానికీ, అద్దెకీ తేడా ఏమీ ఉండదు కదా అని ఆశ పడ్డ ఇల్లాళ్లు సొంత ఇల్లు అయిదారు గదులూ, చుట్టూ కాంపౌండ్ గోడా ఉండేట్టుగా కట్టుకుందామని కోరతారు. ఆనందంగా అందులో చేరాక కొత్తలో గొప్పగా ఇంటిచుట్టూ వేసుకున్న మొక్కలు (కొందరికి కుక్కలు కూడా) పీకకు వేసుకున్న ఉరితాళ్లవుతాయి. ఊరికి వెళ్ళేటప్పుడు వాటిని ఎవరో ఒకరికి అప్పచెప్పి వెళ్ళకపోతే అవి హరీ మంటాయి. మొక్కల్ని ఎంత బాగా చూసుకున్నా, రోజూ మన మొహం చూసీ చూసీ బోర్ కొడితే అవి గుటుక్కుమంటూ ఉంటాయి. ఖాళీ కుండీల మొహం చూడలేక కొత్తమొక్కల కోసం మనం పరుగు తియ్యాలి.

ఇల్లు ఖాళీగా ఉంది కదాని కొనుక్కున్న డిన్నర్ సెట్‌లూ, టీ సెట్‌లూ,డజన్ల కొద్దీ గాజు గ్లాసులూ కబోర్డుల నిండా ఆక్రమిస్తాయి. అవి సిటీ బస్సులో జనాల్లా కొంచెం కూడా జరగవు. అద్దాలతో కట్టించుకున్న షో కేసులలో కొండపల్లి నుంచి ఏటికొప్పాక దాకా బొమ్మల్ని సేకరించి బార్బీ డాల్స్‌తో సహా చేర్చి వాటిని నింపుతాం. కొన్నేళ్ల తర్వాత ఆ బొమ్మలు కాస్త కాస్త వెలిసి పోతాయి. వాటిని తీసేయలేక, ఉంచలేక,కొత్తవి కొనలేక ఒక నరకం పడాల్సి వస్తుంది.

పిల్లలు చిన్న వాళ్లయితే ఇల్లంతా బొమ్మలతోనూ, పెద్దయ్యాక వాళ్ళ పుస్తకాలతోనూ మూల మూలలా నిండి పోతుంది. దుప్పట్లూ, రగ్గులూ, సోఫా కవర్ సెట్లూ, స్వెట్టర్ లతో గోడ అల్మైరాలు కిటకిటలాడుతూ ఉంటాయి. ముట్టుకుంటే మీద పడిపోతూ కసి తీర్చుకుంటూ ఉంటాయవి. ఇంటి ఇల్లాలికి మాత్రం తనకి నచ్చిన నాలుగు మంచి మాటలు లేదా ఒక చక్కని పాట రాసుకుందామంటే ఓ పెన్నూ, కాగితమూ, పాడ్ కానీ ఉండవు. వాటికసలు చోటే కేటాయించబడదు. ఆమె కాస్త స్థిమితంగా, సొంతంగా ఇది నాది అని కూర్చునే స్థలం కానీ, కుర్చీ కానీ ఉండదు ఆ ఇంట్లో. ఆఖరికి ఫోన్ పెట్టుకునే స్టాండ్ కూడా ఉండదామెకి. పేరుకి మాత్రం ఆ ఇంటి మహారాణి. నిజానికి ఆవిడ ఆ ఇంటికి నిరంతర చాకిరీదారు.

ఈ సంకటాలు చాలక నిత్యం బోర్ కొట్టకుండా రక రకాల ఇబ్బందులుంటాయి. ఒక రోజు వంటింట్లో కొళాయిలో నీళ్లు రావు. మరొక రోజు సింక్‌లో నీళ్లు గోదారి వరదలై పోటెత్తుతాయి. ఇంకో నాడు బాత్రూంలో నీళ్లు రానంటాయి. వాష్ రూమ్‌లు ఎంత శుభ్రం చేసినా నీట్‌గా ఉండవు. సమ్మర్లో నీళ్ల కరువు వస్తే గిస్తే స్నానాల గదుల్లో డ్రమ్ములు నింపుకోవాలి అప్పుడా నీళ్ల డ్రమ్ములు మనల్ని గట్టిగా చేతులు చాపుకోనివ్వవు. లేదా వర్షం వస్తే బాల్కనీలన్నీ జలమయం. అక్కడ పెట్టిన వస్తువులన్నీ గోడలమీద మట్టితో స్నానం చేస్తాయి. ఇవి సదా ఉండే ఈతి బాధలు.

ఇవి కాక ఇంకో బాధ మన సిటీలో జరిగే పెళ్లిళ్లు. కుర్రకారంతా హైదరాబాద్ లోనే జాబులు వెలిగిస్తారు కాబట్టి ఏదో పెళ్ళికి మన గ్రామం నుంచి బంధుగణం విచ్చేస్తారు. వాళ్ళు దిగగానే మనం వాళ్ళకి ఠక్కున గుర్తొచ్చేస్తాం. మనోడు ఇల్లు కట్టుకున్నాడంట చూడొద్దా? (అక్కడికి మనమేదో మహారాజా పాలస్ కట్టినట్టు) అంటూ ఫోన్‌ల మీద ఫోన్ లొస్తాయి. ముందుగానే అమ్మానాన్నలనుండి రికమండేషన్ లొస్తాయి. ఆ వచ్చిన వాళ్ళకి ఇల్లు తెలీదు కాబట్టి ఆ పెళ్లయ్యాక ఆ గ్యాంగ్‌ని వాళ్ళు దిగిన ప్రదేశానికి వెళ్లి వాళ్ళని సాదరంగా మనింటికి తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఒక రోజు సెలవు పెట్టి వాళ్ళకి నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లి చూపించాలి. మర్నాడు వాళ్ళని మనూరికి వెళ్లే బస్సో, ట్రైనో ఎక్కించడం మన బాధ్యత. వీళ్ళెవరూ మనల్ని పిలిచి ఒక్కరోజూ మనూర్లో టీ ఇచ్చిన వాళ్ళు కాదు. ఎంకి పెళ్లికి సుబ్బికి తిప్పలన్నట్టు వాడెవడో పెళ్లి చేసుకుంటే మనకి పాట్లు. తీరాచేసి వీళ్లంతా మనూరికి వెళ్లి వేసేది ‘మనోడిల్లు అగ్గిపెట్టెలా ఉందిరా. కులాసాగా కాళ్ళు చాపుకోవడానికే లేదు’ అని చాటింపు. చూశారా? మనం ఇల్లు కట్టుకోవడం వల్లే కదా ఈ కష్టాలు?

మొదట్లో మనం ఇంటిని అద్దంలా తళ తళ లాడేలా పెట్టుకోవాలని తెగ ముచ్చట పడతాం. ఓ నాలుగైదేళ్లకి సున్నాలు వెలిసిపోయి, ఇళ్ళు వైట్ వాష్ కోసం ఎదురు చూస్తుంటాయి. తరచుగా చేతులు తగిలే చోట గోడలు నల్లగా మారతాయి. కుర్చీలని పిల్లలు బర్రున వెనక్కి గెంటటం వల్ల ఆ మేరా గోడమీద మార్కులుంటాయి. వంటింట్లో వాల్స్ జిడ్డోడుతూ ఉంటాయి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్నా చిమినీ ఉన్నా కూడా. నిజం చెప్పాలంటే వంటగది ఆడవాళ్ళనీ, మగవాళ్ళనీ వివిధ కారణాలతో ఒక్కలాగే నిర్దాక్షిణ్యంగా వేపుకు తింటూ ఉంటుంది.

వంటింట్లో గ్యాస్ స్టవ్ ఆడవాళ్ళకి ఒక మాయల మరాఠీలా ఉంటుంది. ఇష్టమైనవి వండుకు తిన్నప్పుడు అది చల్లని తల్లిలా కనబడినా, పొయ్యి మీద ఏదైనా గిన్నె పెట్టి కాస్త న్యూస్ పేపర్ అందుకున్నా, ఫోన్ అందుకున్నా అది రాక్షసిలా మారిపోతుంది. వెంటనే గిన్నెలోని ద్రవం పొంగి పొరలి బీహార్ నదిలా ఇల్లంతా వరద పోటెత్తి రెండు గంటల పని చెబుతుంది. అందులో ఉన్నపదార్థం ఘనమైతే గిన్నె మాడి మసి బొగ్గై పొగ చిమ్మి ఆనక ఆ గిన్నె అవతారం చాలిస్తుంది. మనం పక్కనున్నంత వరకూ పొంగని పాలు, కాస్త చూపు పక్కకి తిప్పగానే రథసప్తమి నాడు సూర్యనారాయణ మూర్తి పూజకి పొయ్యంతా పొంగినట్టు పొంగి మనపై కసి తీర్చుకుంటాయి.

ఇంటి ఇల్లాళ్ళకి ఎన్ని గిన్నెలు కొన్నా ఏదో ఒకటి లేదన్న లోటు ఉంటూనే ఉంటుంది. సరికొత్త మోడల్ కుక్కరో, జూసరో, దోశల పెనమో వాళ్ళ నోరూరిస్తూ ఉంటుంది. అలా కొనడం వల్లే ఇల్లు రోజురోజుకూ ఇరుకైపోతూ ఉంటుంది. రెండు నెలలకోసారి కిచెన్ అలమార్లు దుమ్ము కొట్టుకుని ‘కాస్త దులపరాదూ, పేపర్లు మార్చరాదూ’ అని వాళ్ళ తలపై మొట్టికాయలు వేస్తుంటాయ్. ఎంత మంది అసిస్టెంట్ లని పెట్టుకున్నా ఇల్లాలి భారం మాత్రం ఆమెకి దాచి పెట్టి రాచి రంపాన పెట్టేదే వంటిల్లు. ఎన్ని వంటింటి ఆధునిక పరికరాలు వచ్చినా ఆడవాళ్ళ జీవితాలు ఆ నాలుగు గోడల మధ్య అనార్కలీ సమాధే. స్త్రీ హితులు వంటిళ్ల గోడలని కూల్చమన్నారందుకే మరి.

సంతానం చిన్న వాళ్ళుగా ఉన్నప్పుడు విశాలంగా ఉన్న ఇల్లు, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక చాలనట్టనిపిస్తుంది. ఒక్కో గదినీ నెమ్మదిగా వాళ్ళు ఆక్రమించుకుంటారు. తలుపు తియ్యరు. అదొక హోటల్ రూంలాగా అయిపోతుంది. వాళ్ళు అడిగినప్పుడు శుభ్రం చెయ్యడానికి మాత్రమే అందులోకి ప్రవేశించాలి. ఊరికే జొరబడిపోకూడదు మనం. బంధువులొస్తే పడుకోవడానికి ఒకరోజు వాళ్ళ రూమ్ ఇమ్మంటే పిల్లలు మొహం గంటుపెట్టుకుంటారు. ‘ఇంకా పెద్దిల్లు కట్టి, గెస్ట్ రూంలు కట్టాలి’ అని సలహాలిస్తారు కూడా. మనం నిజమే అని మెత్తబడి ఛాన్స్ ఇస్తే రీమోడల్ పేరుతో లక్షలొదిలిస్తారు మనకి.

మోజుపడి మనం కొనుక్కున్న కొన్ని వస్తువులు కాలక్రమేణా చిన్నవైపోతుంటాయి. ఉదాహరణకి టీవీ, ఫ్రిజ్, డైనింగ్ టేబుల్ మొదలైనవి. అప్పుడు పెద్ద టీవీ, పెద్ద ఫ్రిజ్జు, ఆరు కుర్చీల డైనింగ్ టేబుల్ కావాలి. ఆడపిల్లలు ఎడా పెడా డ్రెస్‌లు కొనుక్కుని కొత్త కబోర్డ్‌లు చేయించమని గారాలు పోతారు. వుడ్ వర్క్ పనులు బంగారం కన్నా ఖరీదుగా ఉన్నాయీ రోజుల్లో. పొరుగింటి వాళ్లెవరో పెళ్లి చేసుకుంటూ ఇంటికి రంగులు వేసుకుంటారు. పక్కనున్న మనిల్లు మరీ పాతగా ఉందని పిల్లల పోరు. సరే అని లెక్కలు వేసుకుని రంగులు వేయించాక సోఫా పాతదిగా మనకే అనిపిస్తుంది. ఇంతలో ఇంటావిడ ఉదయాల్లో హడావిడి అవుతోంది కనుక గ్యాస్ స్టవ్ కొత్తది అయిదారు బర్నర్లది కావాలని టెండర్ వేసి నిమ్మళంగా కూర్చుంటుంది. అమాయకంగా కనబడితే వంటావిడ కూడా మీ వంటింట్లో ఇంకేవో లేవు కొనమంటుంది.

రూమ్‌లు పెరిగే కొద్దీ, బెడ్‌లూ, ఏసీలూ కావాలి. ఇల్లు పెద్దదయ్యే కొద్దీ సహాయకులు ఇద్దరినుంచి ముగ్గురు కావాలి. వాళ్ళ జీతాలు తడిసి మోపెడు. ఏమైనా అందామంటే ఇల్లాలికేమో మెడా, నడుమూ, జబ్బలూ లాంటి పార్ట్ లన్నింటికీ నెప్పులే. మరొక్క మాటంటే ‘ఒక వారం ఫీజియోథెరపీకి తీసుకెళ్లండి, అప్పుడు కాస్త శక్తి రావచ్చేమో నాకు’ అంటుంది. వేలకి వేలు వదిలించే ఆ థెరపీలు టైం పాస్ బఠాణీలు తప్ప ఫలితం శూన్యం అని ముందే అనుభవం ఉండబట్టి నోరు మూసుకోవాల్సిందే భర్త గారు. ఇంటికి మనం పెట్టుకున్న లక్ష్మీ నిలయమో, నివాసమో మరొకటో మనకి జేబుకి చిల్లులు పెట్టే అవతారంగా కనబడుతుంది. ఆ పేరు చూసుకున్నపుడల్లా మనకి పులకరింతల బదులుగా ఖర్చుల కలవరింతలు కలుగుతాయి. ఎవరికైనా చెప్పుకుందామంటే అవి వినేవాళ్ళకి బీదార్పుల్లా అనిపిస్తాయి. మౌనం మంచిది.

ఇంటికి ఎంత పెట్టినా కాదనదనీ, మరొకటి కోరుతుందనీ అనుభవజ్ఞులనే మాట నిజమే. ఈ బాధలన్నీ పడీ పడీ మన పూర్వీకులు ఒక వయసు దాటాక ‘శంభో శంకరా!’ అంటూ మూటా ముల్లె సర్దుకుని హాయిగా కాలాంతం పేరుతో కాశీకి పోయేవారట. ఇంటికి దూరంగా ఉందామనే కావచ్చు.ఇంటి దెబ్బ అలాంటిది మరి. ఇదండీ మన ముళ్ళ గులాబీ లాంటి స్వీట్ అండ్ హ్యాపీ హోమ్ ముచ్చట. బాలేదా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here