నిజంగా ఇది ‘ఇంటింటి భాగోతమే’

0
7

[dropcap]వ[/dropcap]ల్లూరు శివప్రసాద్ మంచి కథకులు. వారు రాసిన 70 కథలలో 25 కథలు బహుమతులందుకున్నవే. వారు మంచి నాటకకర్త కూడా. వారు రాసిన నాటకాలు ఎన్నో బహుమతులందుకుని వారికి పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. ఒకవైపు నాటకోద్ధరణ వైపు కృషి చేస్తూనే, మరో వైపు అరుదైన, విస్మృత నాటక సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నారు.

వారికి పొత్తూరి విజయలక్ష్మి రాసిన “మా ఇంటి రామాయణం” కథ నచ్చి, దానిని నాటకంగా మలచడానికి పూనుకున్నారు. పేరుకు ఇది హాస్య కథ అయినప్పటికీ ఇందులో అంతర్లీనంగా వున్న సందేశాన్ని, మహిళా సాధికారికతను దృష్టిలో వుంచుకుని నాటకంగా మలచి ప్రజల్లోకి తీసుకు వెళితే బాగుంటుందని తలచారు. పురుషాహంకారంతో అత్తగారిపై దాష్టికం చేసే మామగారికి గుణపాఠం చెప్పే కోడల్ని ఈ కథలో గొప్పగా మలిచారు విజయలక్ష్మిగారు. ఈ అంశం నచ్చడంతో, స్త్రీవాద దృక్పథం లోంచి మంచి నాటకంగా మలచ వచ్చని శివప్రసాదగారు ఈ నాటకీకరణకు పూనుకున్నారు.

ఇందులో భార్య అంటే ఇంట్లో బానిసలా, బయటి ప్రపంచం దృష్టిలో గెజిటెడ్ ఆఫీసర్ భార్యగా స్టేటస్ మెయింటెయిన్ చేయాలని కుటుంబరావు అభిప్రాయం. కొత్త కోడలు ఇంటికి వస్తుంటే భార్యను ఇప్పడే చెప్పుచేతల్లో పెట్టుకోవాలని, భర్త మాటనే వేదంగా, భర్త అరుపు వింటే గజగజ వణికిపోవాలని కొడుక్కి నూరిపోసినా, కొడుకు పట్టించుకోడు. ముప్ఫయి ఏళ్ళుగా భర్త ఆధిపత్యాన్ని అహంకారాన్ని భరిస్తూ, సర్దుబాటు ధోరణిలో నోరెత్తకుండా పని చేసుకుంటూ పోతుంది భార్య సరస్వతి. ఇంట్లోకి అడుగు పెట్టిన మరు క్షణమే కొత్త కోడలు, మామగారి పురుషాహంకార ధోరణిని, ఆత్తగారి నిస్సహాయతను పసిగడుతుంది. దాంతో ముందు అత్తగారికి విముక్తి కలిగించి, ఆ తర్వాత ఇద్దరు కలిసి మామగారికి ఎలా గుణపాఠం చెప్పాలో తెలుసుకోవాలంటే ఈ నాటకం చూడాల్సిందే లేదా చదవాల్సిందే.

చివర్లో సరస్వతికి జ్ఞానోదమయై “బీరువా నిండా లెక్కలేనన్ని చీరలు.. మీ కొరకు అందంగా, ఆహ్లాదంగా కనబడటానికి ఏడువారాల నగలు కొనిచ్చారు. మిసెస్ కుటుంబరావుగా మీ ఇంజనీర్ హోదా, పలుకుబడిని మీ అంతస్తును నలుగురిలో ప్రదర్శించాడానికి చేశారు. కాని ఇంట్లో నాకే పాటి విలువుందో, ఎంత గౌరవంగా చూస్తూన్నారో మీకు తెలియదా? పెళ్ళయాక నాకంటూ లేకుండా పోయిందేమిటో, నేను కోల్పోయిందేమిటో నాకు తెలుసు. అమాయికంగా కనిపిస్తూ, అణిగిమణిగి వుండే భార్యలే ఈ మగాళ్ళకు కావాలి. దుర్గ (కోడలు) లాంటి గడుసు వాళ్ళు పనికిరారు. నాకేదో పెద్ద ఒరగబెట్టినట్లు మాట్లాడుతున్నారు. ఈ ముప్పయి ఏళ్ళ కాపురంలో నా కోసం మీరు చేసిందేమిటో చెప్పండి. నా జీవితంలో మీ కోసం నేను వెచ్చించిన సమయంలో నాకే మాత్రం వెచ్చించారు, గుండె మీద చెయ్యేసుకుని చెప్పండి” అని భర్తను నిలదీసే సన్నివేశం బాగా వచ్చింది.

తరతరాలుగా స్త్రీలపై కొనసాగుతున్న ఆధిపత్యాన్ని సమర్థిస్తూ కుటుంబరావు “సీతారాములు కళ్యాణాలు చేస్తూ వాళ్ళిద్దర్ని ఆదర్శ దంపతుల్లా కొలుస్తున్నంత కాలం మగవారి ఆధిపత్యానికి ఈ భూమ్మీద అడ్డే లేద”ని నిర్ధారిస్తాడు. ఈ వాదాన్ని ఖండిస్తూ చివర్లో కోడలు “నేను మగాడిని. నేనేం చేసినా చెల్లుతుంది. కట్టుకున్న భార్య నాకు కట్టుబానిస లాంటిదనుకునే పురుషాధిక్యత వుందే, అదంటేనే నాకు కోపం, అసహ్యం. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ వుంటుందని బులిపిస్తారు. కాని ప్రతి స్త్రీ పరాభావం వెనుక, పరాజయం వెనుక వుండేదే పురుషుడే అన్న విషయాన్ని కప్పిపెడతారు. కుటుంబంలో సుఖశాంతుల్ని నెలకొల్పడానికి కళ్ళూ నోరు మూసుకొని, తెలివితేటల్ని దాచుకుని, అవమానాల్ని దిగమింగుకుంటూ వంటింటికే పరిమితమవుతున్న అత్తయ్య లాంటి ఆడవాళ్ళకు ఒక గౌరవం, గుర్తింపు లభించాలన్న తాపత్రయంతో మీ మనసు నొప్పించి వుండొచ్చు. అందుకే సాటి స్త్రీగా అత్తయ్యగారి తరఫున నిలబడి మీతో పోట్లాడింది ఆవిడకు జరగుతున్న అన్యాయం చక్కదిద్దాలనే. ఒక మనిషిగా అత్తయ్యకు కొన్ని ఇష్టాయిష్టాలు, కోరికలు, స్వతంత్ర్య భావాలు వుంటాయని మీరు గుర్తించడం లేదన్న బాధతో మిమ్మల్ని వ్యతిరేకించాను తప్ప ఇందులో నా స్వార్థం ఏం లేదు. మీరు నన్ను అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా ఫర్వాలేదు. మీ ఇంటి కోసం అత్తయ్య చేసే శ్రమని, త్యాగాన్ని గుర్తించి మనిషిలా గౌరవించండి” అని కోరుతుంది.

పాత్రోచితమైన సంభాషణలు ఈ హాస్యానాటకాన్ని మరింత రక్తి కట్టించాయి. పెళ్ళిళ్ళ పేరయ్య కళ్యాణరావు “ఏదో మీలాంటి వాళ్ళ అభిమానం, అండదండలతో మూడు ఎంగేజ్‌మెంట్లు ఆరు పెళ్ళిళ్ళుగా జీవితాన్ని నెట్టుకొస్తున్నాను” అంటాడు. “పెళ్ళయి పదేళ్ళు సంసారం చేశాక ఈ మొగుడే నాకు దేవుడనుకునే ఆడది గాని, ఈ పెళ్ళమే నాకు దేవతనుకొనే మొగుడు కాని వుంటారంటారా” అని ప్రశ్నిస్తాడు. కోడలు దుర్గ ఎప్పుడూ ఏదో ఒక సామెత సందర్భనుసారంగా చెబుతుంది. అందుకుగాను పాత సామెతలను మార్పులు చేసి చెప్పడమో కొత్త సామెతలను సృష్టించడమో చేస్తుంది. దుర్గ తండ్రి శేషాచలం సర్దుబాటు చేస్తున్న ధోరణిలో మాట్లాడుతున్నప్పటికీ, ఆయన మాటల్లో వ్యంగ్యం కనబడుతుంది. కొడుకు రాంబాబుకు ఇంట్లో జరగబోయే నాటకం తెలిసినప్పటికీ తండ్రి దృష్టిలో భార్యా విధేయుడిగా కనబడటానికి ప్రయత్నిస్తూ ఆయన కోపానికి గురవుతుంటాడు.

కొత్తగా నాటకం రాయడం వేరు. అప్పటికే పేరు పొందిన కథను తీసుకుని నాటకంగా మలచటం వేరు. మూల రచయిత ఉద్దేశాలకు అనువుగా, మూలానికి విధేయంగా వుంటూ, ఆద్యంతం ఆసక్తిగా నాటకాన్ని మలచడం చాలా కష్టమైన పని. అందులో ఒక హాస్య నాటకాన్ని తీర్చిదిద్దడం కత్తి మీద సాము లాంటిదే. ఆ పనిని శివప్రసాద్ సునాయాసంగా చేసేశారని ఈ నాటకం నిరూపిస్తుంది. అందుకో ఈ నాటకం రచానా పరంగా, ప్రదర్శనా పరంగా బహుమతులను గెలుచుకోగలిగింది. మూల రచయిత తన కథను ‘మా ఇంటి రామాయణం’ అంది. కాని నాటక రచయిత దీన్ని ‘ఇంటింటి భాగోతం’గా తీర్చిదిద్ది అందరి దృష్టికి తీసుకు రావడంలో విజయం సాధించగలిగారు.

***

ఇంటింటి భాగోతం (స్త్రీవాద హాస్య నాటకం)
వల్లూరు శివప్రసాద్
ప్రచురణ: అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ
పేజీలు: 64, వెల: రూ. 70.00
ప్రతులకు: విశాలాంధ్ర మరియు నవచేతన అన్ని శాఖలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here