కాజాల్లాంటి బాజాలు-39: ఇప్పట్లో…

2
9

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]అ[/dropcap]ప్పట్లో అంటే నేను చిన్నపిల్లగా వున్నప్పుడు నా అమాయకత్వాన్ని చూసి నవ్వుకున్న పెద్దవాళ్ల గురించి చెప్పేను కదా!

ఇప్పట్లో అంటే నేను అమ్మమ్మ నయ్యాక ఈ అమ్మమ్మ అమాయకత్వం చూసి నవ్వుకున్న పిల్లల గురించి చెప్పుకోకపోతే పాపం వాళ్ళు చిన్నపుచ్చుకోరూ! అందుకే ఇప్పటి పిల్లల గురించి కూడా చెప్తాను.

మొన్నామధ్య మా కజిన్ వాళ్ళ ఎనిమిదేళ్ళ మనవడిని తీసుకుని మా యింటికొచ్చింది. ముగ్గురం కలిసి మా సీతంపిన్ని దగ్గరికి వెళ్ళాం. మా సీతంపిన్నంటే మాకెంతో యిష్టం. మేమంటే ఆవిడకి చాలా అభిమానం. మమ్మల్ని చూడగానే తెగ సంబరపడిపోయింది. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక కాఫీ కలిపిస్తానని లేచింది. మనందరికీ అలవాటేగా… అలాగే అందరం వంటింట్లోకే పోయి అక్కడే కబుర్లు చెప్పేసుకుంటున్నాం. మాతో కబుర్లు చెపుతూనే వుంది మా పిన్ని, అలా యేవో రెండు మూడు డబ్బాలు తీసి, ఓ గిన్నెలోకి ఆ పిండిలన్నీ వేసి, చక్కగా కలిపేసి, ఎంచక్కా అట్లేసి పెట్టేసింది. ఇంకా అట్లు యెంత రుచిగా వున్నాయంటే.. అంతన్నమాట.. మేమంతా యేదో కొలతలు పెట్టుకుని, ఇంత మినప్పప్పనీ, ఇన్ని బియ్యమనీ, చారెడు మెంతులనీ, కప్పుడు అటుకులనీ నానా ప్రయత్నాలూ చేసి, వాటిని రుబ్బి, నానబెట్టి దోశెలు అనుకుంటూ వేస్తే అవి వచ్చినరోజు వస్తాయి.. రాని రోజు ముక్కలవుతాయి. మళ్ళీ యెక్కడ యే కొలత తప్పామా అని చూసుకోడమే. అలాంటిది మా సీతంపిన్ని అప్పటికప్పుడు పిండిలు కలిపేసి, అస్సలు ముక్కలు కాకుండా, అంత గుండ్రంగా అట్లెలా వేసిందా అని మహాశ్చర్య పడిపోయాం.

ఇవాళే కాదు.. ఇది మాకెప్పుడూ ఆశ్చర్యమే. ఇదివరకు కూడా మా సీతంపిన్నిని అడిగి, ఆవిడ కలిపిన కొలతలతోనే  పిండిలు కలిపి వేస్తే, అవి పెనాన్ని పట్టుకుని వదిలి రావే… మరి సీతంపిన్ని మాకు కొలతలు సరిగ్గా చెప్పలేదా అంటే అలాంటిదేమీ కాదు. మా ఎదురుగానేగా ఆ కొలతలతో కలిపింది. ఆమాటే సీతంపిన్నితో అంటే “అట్లెయ్యడానికి అంత ఆయాసపడిపోతారేంటర్రా…” అంటూ నవ్వేసింది. అంత సులభంగా అంత బాగా ముక్క కూడా విరగకుండా అంత గుండ్రంగా యెలా వేసిందా అని నేనూ మా కజినూ మాట్లాడుకుంటూంటే వాళ్ల మనవడు చెప్పేసాడు అసలు విషయం… “నేన్చెప్తా”నంటూ..

 ఆతృతగా వాడివైపు చూసేం.. వాడు “మరేం.. ముత్తమ్మమ్మ పెనం మీద అట్టుని జాగ్రత్తగా కాన్వాస్ మీద పెయింట్ వేస్తున్నట్టు వేస్తుంది. మీరేమో పెనం మీద పిండిని గోడకి సున్నం వేసినట్టు పూస్తారు…” అన్నాడు.  మా అంతటి అమ్మమ్మల్ని పట్టుకుని వాడంత మాట అన్నాడంటే వాడు పిల్లాడా పిడుగా అనుకోరూ!

వీడు సరే పోనీ ఎనిమిదేళ్ళవాడు… ఇంకోడున్నాడు, నిండా రెండేళ్ళు కూడా లేవు వాడికి. ఇంకా మాటలు కూడా పూర్తిగా రాలేదు. కానీ వాడిక్కావల్సినవన్నీ సైగలతో చెప్పేసి చేయించేసుకుంటాడు. వాడోరోజు మా ఇంటికొచ్చేడు.

సరే హాల్లో కూర్చుని కబుర్లూ గట్రా అయ్యాక మావారు పడుకుందుకు లేచేరు. అంతే, వాడు ఉన్నచోట్నించీ ఒక్కసారిగా లేచి, తాత చెయ్యి పట్టేసుకుని, బెడ్ రూం వైపు నడిపించేసి, వాళ్ల తాత మంచం మీద పడుకునేదాకా అక్కడే ఉండి, అప్పుడు మళ్ళి హాల్లోకి వచ్చేడు. మేమందరం వాడి తెలివితేటలకి ఆనందపడిపోతుంటే నా దగ్గర కొచ్చి నన్నూ లెమ్మన్నాడు సైగలతో. “ఆహా, నన్ను కూడా పడుకుని, రెస్టు తీసుకోమనే మనవడు దొరికాడ” ని సంబరపడిపోతూ లేచేను. వాడు నా చెయ్యి పట్టుకుని, వంటింట్లో స్టౌ దగ్గరికి తీసికెళ్ళి, బుర్ర గుండ్రంగా ఊపడం మొదలెట్టేడు. వాడు బుర్ర గుండ్రంగా ఊపేడంటే వాడికి దోశె కావాలని మాకు తెలుసు. అందరం అవాక్కయిపోయేం. పిల్లలు కాదు వీళ్ళు పిడుగులే అనడానికి ఇంతకన్న నిదర్శనం ఏం కావాలి చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here