ఇర్తఫా

0
12

[dropcap]ఆ[/dropcap] గదిలో నిశ్శబ్దం శబ్దాలేవీ లోపలికి రాకుండా పహరా కాస్తోంది. బెడ్‌లైట్ లోంచి వెలువడుతున్న పల్చటి నీలి కాంతి కిటికీలకున్న తెల్లటి కర్టెన్ల మీద పడి నీటి పెయింటింగ్స్‌ని చిత్రిస్తోంది. మంచం మీద గాఢ నిద్రలో ఉన్న అరవై నాలుగేళ్ళ శ్రీధర్ ఏదో శబ్దం రావడంతో ఉలిక్కి పడి కళ్ళు తెరిచాడు. గది నిండా గులాబీరంగు కాంతి పర్చుకుని ఉంది. ఎక్కడినుంచి వస్తోంది కాంతి అని ఆశ్చర్యపోతూ లేచి కూచున్నాడు. అతని ఎదురుగా ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. మొహాలు మనుషుల్లానే ఉన్నాయి. కానీ వాళ్ళ భుజాలకు అంటుకుని గులాబీ రంగు రెక్కలున్నాయి. ఇద్దరూ బలంగా, దృఢంగా, దాదాపు ఏడడుగుల ఎత్తుగా ఉన్నారు.. అందులో ఒకరు స్త్రీ, మరొకడు పురుషుడని గ్రహించాడు. వాళ్ళ మొహాలు వింత తేజస్సుతో వెలిగిపోతున్నాయి.. దేవతల మొహాల్లాగా..

“ఎవరు మీరు? తలుపుకి గడియ పెట్టి ఉండగా లోపలికి ఎలా రాగలిగారు?” ధైర్యాన్ని కూడగట్టుకుంటూ అడిగాడు.

అతనడిగిన దానికి సమాధానం చెప్పకుండా, “సైన్స్ ఫిక్షన్ రచయిత శ్రీధర్ మీరేనా” అని అడిగిందా స్త్రీ.

ఆమె మొహంలోకి పరిశీలనగా చూస్తూ “అవును. నేనే” అన్నాడు. ఆమె కళ్ళు స్వచ్ఛమైన నీలి తటాకాల్లా ఎంతందంగా ఉన్నాయో.. ఎర్రటి పెదవుల మీద తీయటి తేనెపూతలా పూసిన చిర్నవ్వు.. దేవతలైతేనే ఇంతందగా ఉండగలరు. లేక గంధర్వ స్త్రీయా? ఇరవై ఒకటో శతాబ్దంలో దేవతలు, గంధర్వులు, యక్షిణులు ఉండటం సంభవమా? మరి ఎవరై ఉంటారు? చాలా వేగంగా ఆలోచిస్తున్నాడు శ్రీధర్.

“మీరు మాతో పాటు రావాల్సి ఉంటుంది. తొందరగా తయారై బయల్దేరండి” అన్నాడు పురుష ఆగంతకుడు.

“ఎక్కడికి?”

“మా గ్రహానికి.”

“మీరు గ్రహాంతరవాసులా?” ఆశ్చర్యపోతూ అడిగాడు. ఇన్నాళ్ళూ కథల్లో నవలల్లో చివరికి సైఫై సినిమాల్లో కూడా ఏలియన్స్ వింత వింత ఆకారాలతో ఉంటారని చూపించారు. కానీ ఇంత అద్వితీయమైన, అపురూపమైన అందంతో ఉంటారని ఎవ్వరూ వూహించలేదు.

వాళ్ళనుంచి సమాధానం రాకపోవడంతో “మీకు అతీంద్రియ శక్తులు కూడా ఉన్నాయా?” అని అడిగాడు.

“అంటే ఏమిటి?” స్త్రీ అడిగింది.

“తలుపులు వేసి ఉన్నాయిగా. మీరు లోపలికి ఎలా వచ్చారు? అదృశ్యరూపంలో లోపలికి ప్రవేశించారా? మీకు మాయలు, మంత్రాలు కూడా వచ్చా?” అలా అడుగుతున్నప్పుడు అతని గొంతు భయంతో కొద్దిగా వణికింది.

ఆమె తన సహచరుడి వైపు అయోమయంగా చూసింది. అతను కూడా ఆ ప్రశ్నకు అర్థం ఏమిటో తెలియనట్టు మొహం పెట్టాడు. ఆమె శ్రీధర్ వైపు తిరిగి, “మేము అవసరమైనప్పుడు సూక్ష్మ శరీరంలోకి మారిపోగలం. మనోవేగంతో సంచరించగలం. ఇవేవీ మాకు ప్రత్యేకంగా సంక్రమించిన విద్యలు కావు. మా గ్రహంలో అందరికీ పుట్టుకతో వచ్చేవే” అంది.

“ఇంతకూ నన్నెందుకు మీ గ్రహానికి పిల్చుకెళ్లాలనుకుంటున్నారు? నాతో మీకేం పని?”

ఆ ప్రశ్నకు పురుష గ్రహాంతరవాసి సమాధానమిచ్చాడు. “మీరు విశ్వంలో ఉన్న అనేకానేక గ్రహాల గురించి, అందులో నివసించేవాళ్ళ గురించి కథలు, నవలలు ఎలా రాస్తారు?”

“వూహించి రాస్తాను. ఫ్యాంటసీ.. కల్పన.. అంతే.”

“మీరు మా గ్రహం గురించి రాయాలి. వూహించి కాదు. ప్రత్యక్షంగా చూసి, అక్కడి పరిస్థితుల్ని అర్థం చేసుకుని, మాలో ఒకరిగా కలిసి తిరిగి, రాయాలి. మా గ్రహం లాంటి గ్రహం ఒకటుందని మీ మనుషులందరికీ తెలియాలి. అదే మా కోరిక.”

అతని మాటలు వినగానే శ్రీధర్‌లో ఉత్సాహం ఉరకలు వేసింది. గ్రహాంతరవాసుల్తో వాళ్ళ గ్రహానికి వెళ్ళి, అక్కడి జీవన విధానాన్ని చూసి, వాళ్ళ గురించి రాస్తే, తనకెంత పేరొస్తుందో తల్చుకోగానే ఒళ్ళు పులకరించింది. ఇన్నాళ్ళూ సైఫై రచయితలందరూ, తనతో సహా, ఏవేవో వూహించుకుని రాశారు. తను నిజంగానే చూసి, చూసింది చూసినట్టు రాస్తాడు. ఇంత గొప్ప అవకాశాన్ని వదులుకోకూడదనుకున్నాడు. వెంటనే లేచి, పక్క గదిలోకెళ్ళి, బట్టలు మార్చుకుని వచ్చి “నేను ప్రయాణానికి సిద్ధం. ఎలా తీసుకెళ్తారు? నన్ను కూడా సూక్ష్మ శరీరంలోకి మార్చి తీసుకెళ్తారా?” అని అడిగాడు. అతని భార్య అమెరికాలో ఉన్న కొడుకు దగ్గరకెళ్ళి రెండు నెలలు కావస్తోంది. యింట్లో ప్రస్తుతం తనొక్కడే ఉండటంతో ఎవ్వరికీ చెప్పాల్సిన అగత్యం కన్పించలేదు.

ఆమె వెన్నెల కురిసినట్టు నవ్వింది. “లేదు. మా గ్రహవాసుల జీన్స్ ఆ విధంగా పరిణామం చెందాయి తప్ప, వేరే వాళ్ళని అలా మార్చటం మాకు సాధ్యం కాదు. మిమ్మల్ని పిల్చుకెళ్ళడానికే మేము స్పేస్ షిప్‌లో ప్రయాణం చేసి వచ్చాం” అంది.

యింటి వసారాలోకి వచ్చాక వాళ్ళిద్దరూ శ్రీధర్‌ని మోసుకుంటూ గాల్లోకి ఎగిరారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే నగరం వెలుపల ఉన్న విశాలమైన ఖాళీస్థలాన్ని చేరుకున్నారు. అక్కడ వాళ్ళొదిలి వచ్చిన స్పేస్ షిప్ గులాబీ రంగు కాంతిని విరజిమ్ముతూ నిలబడి ఉంది.

వాళ్ళు లోపలికెళ్ళి కూచున్నాక, ఆమె ఓ బటన్ నొక్కగానే, స్పేస్ షిప్ నిశ్శబ్దంగా ఆకాశంలోకి కాంతివేగంతో దూసుకెళ్ళసాగింది. యాక్సిలేటర్ నొక్కగానే కారు ముందుకు దూసుకెళ్ళినట్టు.. అప్పుడైనా కొంత శబ్దం వస్తుందేమో.. కానీ ఈ ఏలియన్ స్పేస్ షిప్ నుంచి ఎటువంటి శబ్దం రాకపోవడాన్ని, రాకెట్లు పేలి నిప్పులు ఎగజిమ్ముతూ యాక్సిలరేట్ కావడం కానీ లేకపోవడాన్ని శ్రీధర్ గమనించాడు.

“మొదట మా గ్రహం గురించి మీక్కొంత సమాచారం తెలియచేయడం అవసరం” అంటూ ఆమె చెప్పడం మొదలెట్టింది. “మీ భూగ్రహంతో పోలిస్తే మాది చాలా చిన్న గ్రహం.. మూడోవంతు కూడా ఉండదు. మా గ్రహం పేరు ఇర్తఫా. స్పైరల్ గెలాక్సీలో ఉన్న కొన్ని కోట్ల నక్షత్ర సముదాయాల్లో ఓ జంట నక్షత్రం చుట్టూ మా గ్రహం పరిభ్రమిస్తూ ఉంటుంది. మీ సూర్యుడికి చంద్రుడున్నాడు. మా జంట సూర్యులకు ఉప గ్రహాలేవీ లేవు. మీ సూర్యుని పరిమాణంతో పోలిస్తే మా జంట నక్షతాలు ఆరోవంతు కూడా ఉండవు. గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ సమాచారం చాలనుకుంటాను” అంది.

ఆమె పేరు టియాన్షీ అని అతని పేరు వూస్వోరా అని తెల్సుకున్నాడు. ఇర్తఫా గ్రహం మీద కాలు మోపిన క్షణమే అతనికి అర్థమైంది. తను ఓ అద్భుత లోకంలోకి ప్రవేశించాడని.. ఎటు చూసినా పచ్చదనం.. స్వచ్ఛమైన తీయటి నీటితో నిండిన తటాకాలు.. విరబూసిన పూల చెట్లు.. విరగ కాసిన పండ్ల చెట్లు.. ఎవర్ని చూసినా అందమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్న దానికి గుర్తుగా సంతృప్తితో కూడిన చిర్నవ్వుతో కన్పిస్తున్నారు.

“కొద్దిసేపు విడిది గృహంలో విశ్రాంతి తీసుకున్నాక, మనం ఓ సభాస్థలికి వెళ్ళాలి. మీకోసమే ఏర్పాటు చేసిన మహా సభ. మీడియా వాళ్ళందరూ వస్తారు. మిమ్మల్ని చూడటానికి మా ఇర్తఫా వాసులు వేలాది మంది ఎదురుచూస్తున్నారు” అన్నాడు వూస్వోరా.

“నన్ను చూడటానికా? ఎందుకు?” ఆశ్చర్యపోతూ అడిగాడు శ్రీధర్.

“ఓ ఏలియన్ని ప్రత్యక్షంగా చూడాలన్న కోరిక సహజం కదా” అంటూ నవ్వింది టియాన్షీ.

“ఏలియనా? ఎవరు?”

“మీరే. మేము మీకు గ్రహాంతరవాసులమైతే మీరు మాకు గ్రహాంతరవాసి కదా. మిమ్మల్ని వెంటపెట్టుకుని తెస్తున్న విషయం మా గ్రహంలో బాగా ప్రచారం జరిగిపోయింది. మీరు మావాళ్ళకంటే ఎంత విభిన్నంగా ఉన్నారో చూడాలని అందరిలో ఉత్కంఠ” అంది.

విశాలమైన మైదానంలో సభ.. వేదిక మీద ఇర్తఫా గ్రహాధిపతితో పాటు పదిమంది పరిపాలనాధికారులు, శ్రీధర్ ఆసీనులై ఉన్నారు. సభాప్రాంగణమంతా నిండిపోయింది. ఐనా ఇర్తఫియన్లు తమ విశాలమైన గులాబీ రెక్కల సాయంతో పక్షుల్లా ఎగురుకుంటూ వచ్చి వాలిపోతున్నారు. శ్రీధర్‌కి తన చిన్నప్పుడు చందమామలో చదివిన గండభేరుండ పక్షులు ఆకాశంలో గుంపులుగా ఎగురుకుంటూ వస్తున్నట్టనిపించింది.

“మీ భూగ్రహవాసులు వాడే రకరకాల ప్రయాణ సాధనాలేవీ మా ఇర్తఫాలో ఉండవు. వాటి అవసరం మాకు లేదు. కొద్ది దూరాలైతే నడుచుకుంటూ పోతాం. ఎక్కువ దూరమైతే ఎగురుకుంటూ పోతాం. మరీ వందల వేల మైళ్ళ దూరాల్ని చేరుకోవాలంటే సూక్ష్మ రూపంలో మనోవేగంతో ప్రయాణిస్తాం” శ్రీధర్ పక్కనే ఆసీనుడై ఉన్న గ్రహాధిపతి చెప్పాడు.

ఇర్తఫియన్లు అందరూ ఏడడుగుల పైనే ఎత్తుండటం గమనించాడు శ్రీధర్. పిల్లలు సైతం ఐదడుగులకు తక్కువ కాకుండా ఎత్తున్నారు. ‘మా గ్రహంలో గ్రావిటేషనల్ ఫోర్స్ భూగ్రహంతో పోలిస్తే మూడోవంతు ఉంటుందని చెప్పా కదా. మా ఇర్తఫియన్లు అందరూ ఎత్తుగా ఎదగడానికి కారణం అదే’ అని టియాన్షీ చెప్పిన విషయం అతనికి గుర్తొచ్చింది.

మీడియా వాళ్ళు ప్రశ్నలడగడం మొదలైంది. వాటికి సమాధానాలు చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాడు శ్రీధర్. వాళ్ళతో పొడవులోనే కాదు, శాస్త్రసాంకేతిక రంగాల్లో, పర్యావరణాన్ని కాపాడుకునే విషయంలో, తమ ప్రజల సంక్షేమం విషయంలో, ఇర్తఫా గ్రహాన్ని పరిరక్షించుకునే విషయంలో భూగ్రహవాసులు కుంచించుకుపోయి లిల్లీపుట్స్‌లా కన్పించడంతో చాలా సిగ్గనిపించింది.

“మిమ్మల్ని మా గ్రహానికి పిల్చుకొని రావడానికి కారణం మిమ్మల్ని తక్కువ చేసి మా ఆధిపత్యాన్ని చూపడానికి కాదు. మీ భూమితో పాటు నివాసయోగ్యమైన మరికొన్ని గ్రహాల అధిపతులు, అధికార్లు మా ఇర్తఫా గురించి తెలుసుకుని, తమ గ్రహాల్ని కూడా స్వర్గధామంలా మల్చుకోవాలని మా కోరిక. మరణం తర్వాత స్వర్గం ఉంటుందో లేదో, ఉన్నా మనకు ప్రవేశం లభిస్తుందో లేదో తెలీని సందిగ్ధావస్థలో కదా ఉన్నాం. అందుకే మనం బతికున్నప్పుడే మన చుట్టూ ఉండే పరిసరాల్ని, పరిస్థితుల్ని స్వర్గాన్ని తలపించేలా చేసుకోవడం ఉత్తమం కదా. ఇర్తఫా అంటే అర్థం స్వర్గం” అంటూ నవ్వాడు గ్రహాధిపతి.

సభ ముగిశాక వూస్వోరా శ్రీధర్‌ని తోడ్కొని విడిది గృహానికి పిల్చుకెళ్ళాడు. రకరకాల భోజన పదార్థాలు అమర్చి ఉన్న టేబుల్ చూపిస్తూ “భోజనం చేసి, విశ్రాంతి తీసుకోండి. రేపుదయం మా గ్రహం మొత్తం తిప్పి చూపిస్తాను” అన్నాడు.

భోజనం నిజంగా అమృతంలానే ఉంది. అంత రుచికరమైన పదార్థాలు అతనెప్పుడూ తిని ఉండలేదు. కాయగూరల రుచి అమోఘం. పండ్లు కొరికితే తేనె కారినట్టు రసాలు వూరి, ఎంత మధురంగా ఉన్నాయో.. మృష్టాన్న భోజనం అని తన గ్రహం మీద వర్ణించే ఆహారం దీని ముందు దిగదుడుపు అనుకున్నాడు. తన విస్మయాన్ని దాచుకోలేక “వీటికి యింత రుచి ఎలా వచ్చింది?” అని అడిగాడు.

వూస్వోరా నవ్వి, “మేము పంటలు పండించడానికి క్రిమిసంహారక మందులు వాడం. సేంద్రీయ ఎరువుల్నే వాడతాం. మాకు వేల ఎకరాల సారవంతమైన సాగుభూములున్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా గృహ సముదాయాలు కట్టడానికి ఉపయోగించం” అన్నాడు. శ్రీధర్‌కి చెంప మీద ఎవరో ఛెళ్ళున చరిచినట్టనిపించింది.

మరునాడుదయం వూస్వోరాతో పాటు టియాన్షీ కూడా వచ్చింది. “మనం వీలైనంత దూరం నడుస్తూ వెళ్దాం. మీరు అలసిపోయినపుడు చెప్పండి. మిమ్మల్ని మోసుకుని గాల్లో ఎగురుతూ తీసుకెళ్తాం” అన్నాడు వూస్వోరా.

ముగ్గురూ మెల్లగా నడవసాగారు. ఎటుచూసినా యిళ్ళన్నీ ఒకేరకంగా ఉండటం గమనించాడు శ్రీధర్. “మా ఇర్తఫాలో ఎవరికీ స్వంత యిళ్ళంటూ ఉండవు. అన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. ఇర్తఫియన్లు అందరూ సమానమే అని మా నమ్మకం. ఇక్కడ అధికార్లకు పెద్ద పెద్ద భవంతులు, కార్మికులకు, రైతులకు చిన్నచిన్న యిళ్ళు అంటూ ఉండవు. అన్ని యిళ్ళు ప్రభుత్వమే కట్టిస్తుంది. చివరికి మా గ్రహాధినేత కూడా ఇటువంటి యింట్లోనే ఉంటారు” అంది టియాన్షీ.

“మరి పొలాలూ, వాటిలో పండే పంటలూ.. ఇవి కూడా ప్రజలకు స్వంతం కాదా?”

“యిక్కడ పొలాలు, స్థలాలు, యిళ్ళు, కర్మాగారాలు, వ్యాపార సముదాయాలు.. ఏవీ మా స్వంతం కాదు. మాకెవ్వరికీ ఆస్తులుండవు. అన్నీ ప్రభుత్వానికే చెందుతాయి. ఆస్తులు ప్రజల స్వంతం అయినప్పుడే కదా పేద ధనిక తారతమ్యాలు, ఈర్ష్యలూ వైషమ్యాలు, వాటిని చేజిక్కించుకోడానికి కుట్రలూ, కుతంత్రాలు, దోపిడీలూ, దుర్మార్గాలు చోటుచేసుకుంటాయి. మా గ్రహవాసుల్లో ఈ అవలక్షణాలు, మానసిక వైకల్యాలు ఏమీ ఉండవు. అందరూ ప్రశాంతంగా, సంతోషంగా, సుఖంగా ఉండటానికి కారణం ఇదే” అన్నాడు వూస్వోరా.

పంటపొలాల మధ్యలోంచి నడుస్తున్న సమయంలో పొలాల్లో పనిచేసేవాళ్ళు చాలా ఉత్సాహంగా పనులు చక్కబెడున్న విషయం గమనించాడు శ్రీధర్. తన దేశంలో రైతుల మొహాల్లో కన్పించే దైన్యం వీళ్ళలో మచ్చుకైనా కన్పించడం లేదు. ‘ఏమిటీ మీకూ మాకూ వ్యత్యాసం?’ అనే అర్థం వచ్చేలా టియాన్షీ వైపు చూశాడు.

“వీళ్ళు పంట పండించడానికి అప్పులు చేయక్కరలేదు. ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుంది. నాసిరకం విత్తనాల బెడద లేదు. సకాలంలో వర్షాలు పడవన్న భయం లేదు. విపరీతంగా వర్షాలు కురిసి, వరదలొచ్చే ప్రమాదం లేదు. అంతా ఓ పద్ధతి ప్రకారమే ఉంటుంది ప్రకృతి ఇక్కడ. మీకు మరో విషయం చెప్పడం మర్చిపోయాను. మా గ్రహంలో అందరికీ సమానమైన వేతనం ఉంటుంది. అధికార్లకు, సైంటిస్ట్‌కు, డాక్టర్లకు నెలకెంత జీతమో రైతుకి కూడా అంతే జీతం” అంది టియాన్షీ.

“అదేమిటి? అన్యాయం కదా?” అన్నాడు శ్రీధర్.

“ఎవరికి అన్యాయం?”

“కష్టపడి ఉన్నత చదువులు చదువుకుని తమ మేధోశక్తితో సైంటిస్టో డాక్టరో అయిన వ్యక్తికి అన్యాయం జరిగినట్టు కాదా. అతనికి రైతుకిచ్చే జీతమే ఇవ్వడం అతని ప్రతిభాపాటవాల్ని, అతను పడిన శ్రమనీ కించపర్చడం కాదా?”

“ఐ.క్యు. తక్కువ ఉండి, చదువు సరిగా అబ్బక కాయకష్టం చేసేవాళ్ళని తక్కువగా చూడటమే తప్పు. తక్కువ ఐ.క్యు.తో పుట్టడం వాళ్ళ తప్పు కాదుగా. దాన్ని సాకుగా చూపి వాళ్ళని పేదరికంలో మగ్గమని వదిలేయడమే తప్పు. సైంటిస్టులది, డాక్టర్లది మేధోగత శ్రమ ఐతే కార్మికులదీ, కర్షకులదీ శారీరక శ్రమ. రెండూ శ్రమలే. ఏది ఎక్కువ ఏది తక్కువ అని నిర్ణయించి దాని ప్రకారం వాళ్ళ ఆర్థిక స్థాయిని నియంత్రించడం తప్పు. మా గ్రహంలో ఎవరికిష్టమైన వ్యాపకం వాళ్ళు ఎంచుకోవచ్చు. ఇక్కడ ఎవరూ ఎవరికీ బాస్ కాదు. ఎవరే పని చేసినా ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానమే.”

శ్రీధర్‌కి అంతా వింతగా, కొత్తగా ఉంది. అర్థమయ్యేకొద్దీ అద్భుతంగా కూడా ఉంది. “మా అడవుల సౌందర్యాన్ని తలకిద్దురుగానీ పదండి” అన్నాడు వూస్వోరా.

దట్టమైన అడవులు.. వాటినిండా రకరకాల పూల, పళ్ళ చెట్లు.. స్వేచ్ఛగా సంచరిస్తోన్న జింకలు, దుప్పులు, కుందేళ్ళు.. పురులు విప్పి నాట్యం చేస్తున్న నెమళ్ళు, రకరకాల రంగురంగుల పక్షులు.. సెలయేళ్ళు.. జలపాతాలు..

“పులులూ సింహాలు కూడా ఉంటాయా?” అని అడిగాడు.

“మా అడవుల్లో క్రూర జంతువులు ఉండవు. అన్నీ సాధు జంతువులే” అంటూ నవ్వాడు వూస్వోరా. “మా గ్రహంలో పాములు తేళ్ళలాంటివి కూడా ఉండవు. విషప్పురుగులేవీ ఇక్కడ కన్పించవు.”

“మీకు అదెలా సాధ్యపడింది? ఇర్తఫియన్స్‌కి కానీ మిగతా సాధుజంతువులకు కానీ హాని చేసే జంతుజాలం లేకుండా ఎలా చేయగలిగారు?” ఆశ్చర్యపోతూ అడిగాడు శ్రీధర్.

“దానికి సమాధానం కావాలంటే పది తరాల వెనక్కి వెళ్ళాలి. అప్పుడు మా వాళ్ళందరూ వేరే గ్రహంలో ఉండేవాళ్ళు. వాళ్ళ అత్యాశ, పర్యావరణాన్ని తమ అవసరాల కోసం ధ్వంసం చేయడం, అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదన, కల్తీ వ్యాపారం.. వీటన్నిటివల్ల గాలి, నీరు బాగా కలుషితమైపోయాయి. రక రకాల బ్యాక్టీరియాలు వైరస్లు ప్రబలిపోయి, మావాళ్ళు రోగాలో వందల సంఖ్యలో మృత్యువాత పడటం సాధారణమైపోయింది. అప్పుడే నివాసయోగ్యమైన గ్రహం కోసం అన్వేషణ మొదలైంది. ఆ వెతుకులాటలో

మా పూర్వీకులకు ఈ వర్జిన్ ప్లానెట్ కంటబడింది. ఆ గ్రహంలో చేసిన తప్పులు ఈ గ్రహంలో చేయకూడదని బలంగా నిర్ణయించుకుని, ప్రాణాల్లో మిగిలిన కొద్దిమంది ఈ గ్రహానికి అంచెలంచెలుగా వలసొచ్చారు. అలా వచ్చే క్రమంలో తమ స్పేస్ షిప్‌లో తమకవసరమైన జంతువుల్ని మాత్రమే ఒక్కోదానికి రెండు జంటల చొప్పున తీసుకుని వచ్చారు. అక్కడి వైరస్‌లనీ బ్యాక్టీరియాలని ఇక్కడికి మోసుకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు” అంటూ ముగించాడు వూస్వోరా.

శ్రీధర్‌కి తనని ఇర్తఫా గ్రహానికి తోడ్కొని వచ్చేముందు తనను డిస్‌ఇన్‌ఫెక్ట్ చేయడానికి వాళ్ళు తీసుకున్న అనేక రకాల జాగ్రత్తలు గుర్తొచ్చాయి.

ఎన్ని ప్రదేశాలు తిరిగినా అతనికి పోలీసుల్లాంటి రక్షకభటులు కానీ సైనికులు కానీ కన్పించలేదు.

అదే విషయం అడిగితే, “మాకెందుకు పోలీసులు, జైళ్ళు, కోర్టులు? ఇక్కడ నేరాలే జరగవుగా. నేరాలు జరగడానికి ముఖ్య కారణం డబ్బు, ఆస్తులు, పేదరికం, ఆకలి, తమకు లేనిదేదో పక్కవాడికుందన్న దుగ్ధ.. మా గ్రహంలో వీటికి ఆస్కారమే లేదుగా. నేరాలే లేనప్పుడు పోలీసులెందుకు, కోర్టులెందుకు? సైనికులంటారా? మేము ఎవరితో యుద్ధం చేయాలి? మాకిక్కడ ఎవ్వరూ శత్రువులు లేరే” అన్నాడు వూస్వోరా.

“అందరికీ ఒకే విధమైన ఆదాయం ఉన్నా ఖర్చుల్లో ఎక్కువ తక్కువలుండొచ్చుగా. నలుగురైదుగురు సభ్యులున్న కుటుంబానికీ, ఇద్దరో ముగ్గురో ఉన్న కుటుంబానికి తేడా ఉంటుందిగా, విద్య, వైద్యం తప్ప ప్రభుత్వం ఏదీ ఉచితంగా ఇవ్వదని చెప్పారుగా. అప్పుడు ఖర్చులు పెరగడం వల్ల వాళ్ళలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది కదా” అని అడిగాడు శ్రీధర్.

“మా ఇర్తఫియన్స్ ఆడా మగా అందరూ పని చేసి సంపాయిస్తారు. దంపతులు ఒక్క బిడ్డనే కంటారు. ప్రభుత్వ నిబంధన ఏమీ లేకున్నా, అధిక జనాభా వల్ల తలెత్తే సమస్యలు రాకుండా మాలో కొన్ని తరాల నుంచి స్వచ్ఛందంగా పాటిస్తున్న నియమం అది. అన్నీ చిన్న కుటుంబాలే కాబట్టి తమ అవసరాలకు డబ్బులు సరిపోవన్న సమస్యే తలయెత్తదు” అంది టియాన్షీ.

ఇర్తఫా గ్రహవాసుల గురించి సైన్స్ ఫిక్షన్ నవల రాయడానికి సరిపడా సమాచారం సేకరించాక, శ్రీధర్‌ని వూస్వోరా, టియాన్షీ అతని యింటి గుమ్మం ముందర దింపి శెలవు తీసుకుంటూ “బహుమతులిచ్చి వీడ్కోలు చెప్పే సాంప్రదాయం మా ఇర్తఫాలో లేదు. ఏమనుకోకండి” అన్నారు.

“మీ గ్రహంలో నేను చూసిన అద్భుతమైన విషయాలు, రుచికరమైన భోజనం, ఎప్పటికీ జ్ఞాపకం ఉండే అనుభూతులు.. ఎన్ని బహుమతులిచ్చారో నాకు.. అంతకన్నా ఏం కావాలి? మీరు కోరుకున్నట్టు మీ ఇర్తఫా గ్రహం గురించి అందరికీ తెలిసేలా నవల రాస్తాను. ఇదే నేను మీకూ, మీ గ్రహాధిపతికి తిరిగిచ్చే బహుమతి” అన్నాడు శ్రీధర్.

మరునాటి నుంచి నవల రాయడానికి పూనుకున్నాడు. ఇది ఫిక్షన్ కాదు. ఫ్యాక్చువల్ నవల. ఆ నవలకు పేరు కూడా ‘ఇర్తఫా.. ఏ ప్యారడైజ్’ అని పెట్టాడు. నవల పూర్తయి, పబ్లిష్ అయ్యాక, పుస్తకావిష్కరణ రోజు ప్రింట్ మీడియా, విజువల్ మీడియా వాళ్ళని పిలిచి పెద్ద సభ ఏర్పాటు చేశాడు. “నేను స్వర్గాన్ని చూశాను. నిజం. గులాబీ రెక్కలతో ఆకాశంలో విహరించే దేవతల్ని కూడా చూశాను. నా అనుభవాల్నే ఈ నవలలో పొందుపరిచాను. నేనిప్పటివరకు వందకు పైగా సైఫై కథలు, ఇరవై నవలలు రాశాను. ఎక్కువగా సైన్స్ ఫ్యాంటసీ సాహిత్యాన్నే సృజించాను. ఇది నా ఇరవై ఒకటో నవల. చాలా ప్రత్యేకమైన నవల. ఎందుకంటే ఇది ఫ్యాంటసీ కాదు. వూహించి రాసింది కాదు. ప్రత్యక్షంగా ఇర్తఫా అనే గ్రహానికి వెళ్ళి, అక్కడి పరిస్థితుల్ని ఆకళింపు చేసుకుని రాసిన నవల. అసలటువంటి గ్రహం ఒకటి మన గెలాక్సీలో ఉందని ఎవరైనా చెప్పినా నమ్మేవాణ్ణి కాదు. అభూత కల్పన అని కొట్టిపారేసేవాణ్ణి.

కానీ ఆ గ్రహం ఉన్న మాట నిజం. నేనక్కడికి స్పేస్ షిప్‌లో వెళ్ళిన మాట నిజం.

ఇర్తఫియన్స్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనకంటే కొన్ని దశాబ్దాలు ముందున్నా ఇప్పటికీ ప్రకృతితో మమేకమై జీవిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఒత్తిడి లేని జీవితం. వాళ్ళు ఫ్రిజ్‌లు వాడరు. ఏ రోజుకారోజు తాజా కూయగారలు తెచ్చుకుని వండుకుంటారు. ఎయిర్ కండిషన్లు వాడరు. స్మార్ట్ ఫోన్ల లాంటి పరికరాలు లేవు. రోగాలూ రొష్టులూ ఉండవు. రవాణా సాధనాలు లేవు కాబట్టి యాక్సిడెంట్లకు అవకాశమే లేదు. అందరూ వందేళ్ళకు పైగా బతుకుతారు. ఈ పుస్తకాన్ని శ్రద్ధగా చదవండి. ఇర్తఫాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. స్వర్గధామం లాంటి ఓ లోకాన్ని నా అక్షరాల్లో వీక్షిస్తారు. నాకైతే మన పూర్వీకులు వూహించి, వర్ణించిన దేవతలు తిరుగాడే స్వర్గం అదే అన్పించింది” అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు.

టీవీల్లో ఆ విషయం మీద రకరకాల చర్చలు జరిగాయి. ‘ఈ మధ్య అతని నవలల అమ్మకాలు దారుణంగా పడిపోయాయిగా. అందుకే మళ్ళా అమ్మకాలు పెంచుకోడానికి ఆడుతున్న జిమ్మిక్ ఇది’ అని కొందరు విమర్శించారు. “తను నిజంగానే ఆ గ్రహానికెళ్ళినట్టు పాఠకుల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఇదంతా. అభూత కల్పన కాకపోతే సూక్ష శరీరాలుగా మారడం, మనోవేగంతో ప్రయాణించడం సైన్సపరంగా సాధ్యమా చెప్పండి. అదంతా పురాణాల్లోంచి సంగ్రహించిన సమాచారం. ఇక స్థిరాస్తులన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉండటం, అందరికీ సమానమైన వేతనం.. ఇలాంటివన్నీ మనకు పరిచితమైన కమ్యూనిజం ఐడియాలజీ నుంచి కాపీ చేసిన ఐడియాలు. ఒకవేళ అతను ఇర్తఫా అనే గ్రహానికి నిజంగా వెళ్ళిఉంటే ఒక్క రుజువు చూపించ మనండి” అంటూ హేతువాదులు దాడికి దిగారు.

తను నిజాలే చెప్తున్నా ప్రజలు వాటిని అబద్దాలని కొట్టిపారేస్తుండటంతో శ్రీధర్‌కి చాలా బాధనిపిస్తోంది. తను చాలా సీనియర్ రచయిత. తనకు రావాల్సిన గుర్తింపు ఎప్పుడో వచ్చేసింది. ఆర్థికంగా కూడా సమస్యలేవీ లేని జీవితం. మరి పుస్తకాల అమ్మకాలు పెంచుకోవడం కోసం అభూత కల్పనల్ని నిజాలని నమ్మించాల్సిన అగత్యం తనకేముందని? ఎవ్వరూ ఎందుకు లాజికల్‌గా ఆలోచించడం లేదు?

అదే సమయంలో టీవీలో మరో చర్చ మొదలైంది. “శ్రీధర్ నా సమకాలికుడు. మంచి రచయిత. అందులో ఎటువంటి సందేహమూ లేదు. నా ఉద్దేశంలో ఇర్తఫా అనే గ్రహం గురించి కలగని ఉంటాడు. కెకులే అనే శాస్త్రవేత్త బెంజిన్ నిర్మాణాన్ని కలలో చూసినట్టు , ఇతను స్వర్గం లాంటి గ్రహాన్ని కలలో చూసి ఉంటాడు” అంటూ ఓ సైఫై రచయిత అదో రకంగా నవ్వాడు.

“మరి దాన్ని కలగన్నానని చెప్తే సరిపోయేదిగా. నిజమని నమ్మించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? ఎవర్ని మోసగించడానికి? ఏ స్వలాభాపేక్షతో అతను ఈ నాటకం ఆడుతున్నట్టు?” శ్రీధర్‌కి గొప్ప సైఫై రచయితగా పేరొచ్చినప్పటినుంచి ఈర్ష్యతో మండిపోతున్న మరో రచయిత తన మనసులోని విషాన్నంతా వెళ్ళగక్కాడు.

“అది కలే. కానీ నిజంలా భ్రమింపచేసే కల కావొచ్చుగా” అంటూ మరొకతను శ్రీధర్‌ని సమర్థించే ప్రయత్నం చేశాడు.

ఇదంతా వింటున్న శ్రీధర్‌కి బుర్ర తిరిగిపోతోంది.

పిచ్చి పట్టేట్టుంది. తను ఇర్తఫా గ్రహానికి వెళ్ళి రావడం నిజం కాదా? నిజంగా అది కలేనేమో.. తనే భ్రమలో ఉన్నాడేమో.. చర్చల్లో ఒకతను ఛాలెంజ్ చేసినట్టు తన దగ్గర ఒక్క రుజువు కూడా లేదుగా. ఆ నవల కల్పితం కాదని నిజమని నిరూపించే ఒక్క రుజువు.. ఒక్క ఆధారం.. ఎందుకు తన దగ్గర లేదు? శ్రీధర్ విపరీతమైన మానసిక వేదనకు గురౌతున్నాడు.

ఆలోచించే కొద్దీ తన మనసులో కూడా అనేకానేక అనుమానాలు…

రాత్రంతా ఆలోచనలో నిద్రకు దూరమైన శ్రీధర్ ఉదయం తలుపు తీసుకుని, యింటి వసారాలో నిలబడ్డాడు. అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉండటం వల్ల లేత నారింజరంగు కాంతి అక్కడంతా పర్చుకుని ఉంది. ఆ కాంతిలో వసారాలో ఓ మూల పెట్టి ఉన్న పూల మొక్కల కుండీల్లోని ఓ కుండీలో గులాబీ రంగు రెక్కల్లోంచి వూడిపడిన ఓ ఈక అతని కంట పడింది.

దాన్ని చూడగానే ప్రాణం లేచొచ్చింది. ఎవరు నమ్మినా నమ్మకున్నా తను ఇర్తఫా గ్రహానికి వెళ్ళింది నిజం. తనను వూస్వోరా, టియాన్షీ అనే దంపతులు ఆ గ్రహానికి పిల్చుకెళ్ళి, దగ్గరుండి అన్నీ చూపించింది నిజం. స్వర్గంలాంటి గ్రహం నిజం. అందులో దేవతల్లాంటి మనుషులు నిజం అనుకోగానే అతని మనసుకి గులాబి రెక్కలు మొల్చుకొచ్చాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here