ఇసుక గూళ్ళు

0
18

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన పాలేగారు ఇందుమతి గారి ‘ఇసుక గూళ్ళు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]దు[/dropcap]బాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం.. వేలాది మంది జనాలు లాంజీలలో ఎదురు చూస్తున్నారు.

విమానాలు పక్షుల్లాగా కొన్ని వాలుతుంటే మరికొన్ని ఎగిరిపోతున్నాయి.

ఎప్పటికప్పుడు కొత్త మార్పులతో దుబాయ్ ఎయిర్‌పోర్ట్ కొత్తగా ముస్తాబై అందరినీ ఆకర్షిస్తూ ఉంది

నా చిన్నప్పుడు ఎయిర్‌పోర్ట్ అంటే సినిమాల్లో వచ్చే క్లైమాక్స్‌లో హీరో/హీరోయిన్ కలుసుకునే చోటని మాత్రమే తెలుసు. కాని నిజ జీవితాల్లో అలాంటి క్లైమాక్స్‌లు ఉండవని ఓ వయోసొచ్చాక కాని తెలీలేదు.

ఫైనల్ బోర్డింగ్ పాస్ చెకింగ్ పూర్తయ్యింది.

ఆఫీసు పని మీద దుబాయ్ వచ్చి వారం రోజులైంది. తెలియని ప్రదేశంలో భాష తెలియక వారం రోజులు గడవడం సాహసంగానే అనిపించింది. ఉన్నన్ని రోజుల్లో చూడగలిగింది బుర్జ్ ఖలీఫా, అక్కడి మాల్స్ మాత్రమే. ఆకాశాన్ని తాకే గాజు మేడలు, ఆ గాజు అద్దాల మేడని తుడుస్తూ అక్కడ పని చేస్తూ ఉన్న విదేశీయుల్లో మన దేశం వాళ్లు ఉన్నారు.

ఫ్లైట్ ఎక్కగానే బ్యాగ్ సర్దే పనిలో బడి నా పక్క సీట్‌లో ఎవరో వచ్చి కూర్చోవడాన్ని కూడా గమనించనే లేదు.

ఎయిర్ హోస్టెస్ అనౌన్స్‌మెంట్స్ పూర్తవగానే విమానం గాల్లోకి ఎగరడానికి సిద్ధంగా ఉంది.

బయటకి చూస్తూ ఉంటే ఎదురుగా మబ్బులు పలకరించి వెళ్లిపోతున్నాయి. కిందనేమో చూస్తున్నంత దూరం ఇసుక తప్ప మరేం కనబడట్లేదు. అయినా సముద్రపు ఇసుకకి, ఎడారి ఇసుకకి ఎంత తేడా? ఏ మాత్రం ఆర్థ్రత లేని ఈ ఎడారి ఇసుకని చూస్తే నాకెందుకో అంతగా నచ్చదు. అందుకే ఎడారి వైపు అసలు వెళ్లనే లేదు.

నా పక్క సీటులో కూర్చున్న అతను ఏదో కింద పడేసుకుని తీసుకోడానికి ఇబ్బంది పడుతుంటే నా చేతికి సులువుగా అందడంతో తీసి అతని చేతికి ఇచ్చేసాను.

“మీరు తెలుగేనా” అన్నాడు నా వైపు చూసి.

“అవును..” అన్నాను పరిచయం చేసుకుంటూ

మాటల్లోనే తన పేరు రాజా అని, దుబాయ్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడని సెలవుల్లో ఇంటికి వెళ్తున్నాడని చెప్పాడు. ఫోన్ లేని కొన్ని గంటల ప్రయాణానికి అతని పరిచయం కాలక్షేపం అనిపించింది.

మాట కలుపుతూ “దుబాయ్, గల్ఫ్ కంట్రీస్‍లో వర్క్ చాలా కష్టంగా ఉంటుందని విన్నాను. ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అవడం కూడా చూసాను. ఏజెన్సీ వాళ్లు మోసం చేసారని, అక్కడ ఉండలేము వెనక్కి తీసుకెళ్లండి అని వీడియోస్ వైరల్ అయ్యాయి” అన్నాను.

“అవును కష్టంగానే ఉంటుంది. వాతావరణానికి జీవన విధానానికి తట్టుకుని నిలబడ్డ వాళ్లు ఉంటారు. ఉండలేని వాళ్లు కూడా ఉండాల్సి వస్తుంది. పద్మవ్యూహంలోకి వెళ్ళడం మాత్రమే తెలిసిన అభిమన్యుడిలాగా చెప్పింది విని ఇక్కడి రావడం మాత్రం తెలిసి తిరిగి ఎలా వెళ్లాలో తెలీక అక్కడే ఉండిపోయిన వాళ్లు ఎందరో! ఎవరో ఒకరిద్దరూ ఇలా ప్రభుత్వసాయంతో తిరిగి వచ్చేస్తూ ఉంటారు, మిగిలిన వాళ్లు తప్పని పరిస్థితుల్లో గడిపేస్తూ ఉంటారు” అన్నాడు నిస్సారమైన నవ్వుతో.

“అక్కడి వాతావరణానికి మీరు ఎలా అలవాటు పడ్డారు?” అన్నాను.

ఆ మాట విని అతను జీవం లేని ఓ నవ్వు నవ్వి “ఎడారి మొక్కలు తెలుసా మీకు? వాటిలాగానే అలావాటు అయిపోయింది అక్కడి వాతావరణానికి పరిస్థితులకి తట్టుకుని ఉండటం” అన్నాడు.

“అవును.. ఎడారి మొక్కలకి పువ్వులు పూస్తాయా?” అన్నాను సందేహంగా చూస్తూ.

“మీకేమనిపిస్తుంది?” అన్నాడు నా వైపు చూస్తూ.

“నాకు అసలు ఈ ఎడారుల గురించి చిన్నప్పుడు బుక్‌లో చదవడం తప్ప అంతగా తెలియదు. ఏవో కాక్టస్ మొక్కలు పెరుగుతాయని తెలుసు” అన్నాను.

“ఎడారి పువ్వులని చూస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను” అన్నాడు నవ్వేస్తూ.

ఎడారి పువ్వులు ఏమో కాని చాలా సేపటి తర్వాత అతని మొహంలో నవ్వుని చూసాను.

అతని మాటలు కూడా కొత్తగా లోతుగా ఆలోచించేలా ఉన్నాయి. చుట్టు పక్కల్లో ఉన్న వాళ్లు గల్ఫ్ కంట్రీస్‌కి పనుల కోసం వెళ్లడం గురించి అప్పుడప్పుడు వింటూ ఉంటాను. సగంలో చదువులు ఆపేసిన వాళ్లు, అక్కడ వేతనం ఎక్కువ అని ఇంకా అక్కడ పనులు ఎక్కువగా ఉంటాయని వర్కింగ్ వీసా మీద ఎంతో కొంత డబ్బులు కట్టి వెళ్ళడం గురించి కూడా తెలిసిన వాళ్ల ద్వారా తెలిసింది.

అక్కడ ఎలా ఉంటుందో తెలుసుకుందామని “ఇందాక ఎయిర్‌పోర్ట్‌లో కూడా చూసా, ఎక్కడెక్కడి నుండి వస్తున్నారో? అందరూ ఎందుకని మన దేశంలో ఏదో పని చేసుకుని ఉండక, ఇక్కడికొచ్చి కష్టపడుతూ ఉంటారు? సంపాదన ఎక్కువనా?” అన్నాను మళ్లీ.

ఆ మాటకి చివుక్కున చూసి “ఎక్కడి సంపాదనా? ఈ మాట వింటుంటే నవ్వొస్తుందండి! ఇక్కడికొచ్చే ప్రతి ఒక్కరికి ఏదో ఒక కథ ఉంటుంది. ఎన్నో కష్టాలుంటాయి. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు అన్నట్టు ఇక్కడి బాధలు కష్టాలు తెలిసినా వాళ్ళ కష్టాల ముందు పెద్దగా అనిపించవు. మీరన్నట్టే ఎక్కువ డబ్బులొస్తాయనే ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఏదో విధంగా కష్టపడి ఎంతో కొంత సంపాదించి బతుకుల్ని మార్చుకుందాం అనుకునేవాళ్లే తప్ప. ఏదో సాధించేయాలని కాదు. ఇక్కడ ఏళ్ళ తరబడి పని చేసుకునే వాళ్లకి సిటిజన్‌షిప్‍౬లు, రిటైర్నెంట్లు లాంటివి ఉండవు. ఈ దేశాల్లో ఎన్నేళ్లు ఉన్నా ఎప్పటికి పరాయి వాళ్లగానే మిగిపోవాల్సిందే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు పనుల్లోనూ ఏ మార్పు ఉండదు. ఇంకా వయస్సు ఒంట్లో ఓపిక ఉన్నంత వరకే ఉండగలం. మళ్లీ ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్లిపోవాల్సిందే. ఇక్కడ కాస్తో కూస్తో నాలుగు రాళ్లు సంపాదించి బాగుపడ్డ జీవితాలు కూడా ఉన్నాయి. ఎక్కడైనా నాణేనికి ఇరువైపులా అన్నట్టు మంచి చెడూ రెండూ ఉంటాయి” అన్నాడు నిస్సత్తువగా నవ్వి.

“ఇదంతా తెలిసి కూడా జనాలు కేవలం డబ్బుల కోసమే వెళ్తున్నారన్న మాట” అన్నాను.

“కేవలం డబ్బుల కోసమే కాదు, డబ్బుల కోసం మాత్రమే వస్తూ ఉంటారు. పూట గడవని కుటుంబాలకి అప్పు అనేది ఒక రకమైన రోగం లాంటిది. డబ్బులు చేతికొస్తే తప్ప రోగం తగ్గదు. మీరన్న కేవలం డబ్బు కోసమే ఈ తిప్పలంతా. సంతోషాన్ని డబ్బులతో కొనలేం అంటూ ఉంటారు. అది విన్న ప్రతిసారి నవ్వొస్తుంది. ఈ పదేళ్లలో మా కుటుంబ సంతోషాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. ఈ మధ్య గౌరవ మర్యాదలు కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాయి. అందుకేనేమో డబ్బు మనిషిని ఎంత దూరమైనా వెళ్లేలా చేస్తుంది” అని అన్నాడు.

అతని మాటలు విన్నాక ఆలోచించి మాట్లాడాల్సిందేమో అనిపించింది. మనుషుల మధ్య ఆర్థిక అసమానతలు ఉంటాయి. పది రూపాయలతో పొట్ట నింపుకునే వాళ్లు ఉన్నారు. అదే పది రూపాయలు టిప్‌గా ఇచ్చేసి వెళ్లిపోయే వాళ్లు ఉన్నారు. అందరి జీవితాలు ఒకలా ఉండవనిపించింది. అదే విధంగా డబ్బుతో కొనలేనివి జ్ఞానం లాంటివి ఉన్నాయని చెప్పాలనిపించింది కాని ఆగిపోయాను.

“అయినా మన దేశంలోను ఎన్నో పనులు ఉన్నాయి కదా. ఇక్కడ చేసే పనులేవో అక్కడే చేసుకోవచ్చు. కుటుంబానికి దగ్గరగా ఉండొచ్చు” అన్నాను సానుభూతిగా.

“మన దేశంలో పనులు ఉన్నాయి కాని అక్కడ పదేళ్లు కష్టపడాల్సింది ఇక్కడ ఐదేళ్లలో సంపాదించుకుని తిరిగి వెళ్లిపోదామనే చిన్న ఆశ. ఇక కుటుంబ విషయం అంటారా? దూరంగా ఉంటున్నామన్న బాధ ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. ఈ అరబ్బు దేశాల్లో కుటుంబాలు చాలా పెద్దవి. కలిసి ఉండే వాళ్ల కుటుంబాల్ని చూసినప్పుడు ఖచ్చితంగా మనస్సు కలుక్కుమంటుంది. ఇక్కడి వచ్చి తిరిగి ఊర్లకి వెళ్ళేటప్పటికి ఎన్నో మారిపోయి ఉంటాయి. పిల్లలంతా పెద్దవాళ్లై పోయి ఉంటారు, పెద్ద వాళ్లంతా వయస్సు పై బడిపోయి ఉంటారు. పుట్టుకలు మరణాలు ఎన్నో జరిగిపోయి ఉంటాయి. ఇక్కడ ఉండి పోగొట్టుకున్న కాలం సంపాదించిన సంపాదనకి అస్సలు సరితూగదు” అన్నాడు బాధగా.

అతని మాటల్లో ఏడుపు జీర సన్నగా వినిపిస్తూ ఉంది. కనుసనల్లోను నీటి తేమ కనిపిస్తూ ఉంది.

“ఇన్నేళ్లుగా అక్కడ ఉంటున్నారంటే ఖచ్చితంగా దుబాయ్‌లో ఏదో ఒక్కటన్నా నచ్చి ఉండాలి. అక్కడ ఫ్రెండ్స్ లేదా ప్లేస్” అన్నాను అతన్ని ఉత్సాహపరచడానికి ప్రయత్నిస్తూ.

“ఫ్రెండ్స్.. అంటే అక్కడికొచ్చాక పరిచయమైన వాళ్లే. నాలాగే ఏదో కొంత జీవిత స్థితిగతులని మార్చుకోవాలని వచ్చిన వాళ్లే. నేను ఉంటున్న రూమ్‌లో కలిసి ఉన్న వాళ్లు తప్ప ఇంకెవరూ లేరు. ఇక ప్రదేశాలంటారా దుబాయ్ నచ్చిన ప్రదేశాలంటే రోజు చూసే గాజు మేడలు, అందులోను బుర్జ్ ఖలీఫా.. అని మాత్రం చెప్పను. వాటి నీడల్లో మాత్రమే తిరిగే నాకు అంతగా నచ్చలేదు కూడా. అక్కడి ఎడారి అంటే ఇష్టం. టూరిస్ట్‌లు వచ్చినప్పుడు నైట్ స్లీప్ ఓవర్‌కి ఎడారికి తీసుకెళ్తూ ఉంటాను.

అక్కడ సంపన్నులు, పేదవారు అన్న అసమానతలు ఉండవు. ఆ ఒక్క ఎడారి మాత్రం అందరికీ సమానం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది.

రాత్రిళ్లు ఆ ఇసుక తిన్నెల మీద పడుకుని ఆకాశంలో చుక్కల్ని కలుపుకుంటూ ఎన్నో కలలు కంటాను. కొన్ని కలలు అయితే నిజం అన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. మెలకువ వచ్చిన తర్వాత కూడా ఆ కలని తలుచుకుంటూ గడిపేస్తూ ఉంటాను” అన్నాడు చిరునవ్వుతో.

“ఈ సారి దుబాయ్ వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని కలిసి ఎడారిని చూస్తాను” అన్నాను నవ్వుతూ.

“తప్పకుండా..” అన్నాడు నవ్వుతూ

“అవును గల్ఫ్ కంట్రీస్‍లో వర్క్ కోసం వెళ్లిన ఆడవాళ్లకి సేఫ్టీ ఉండదని విన్నాను నిజమా?” అన్నాను సందేహంగా చూస్తూ.

“ఎక్కడ ఉందనీ?” అని ఆగిపోయాడు.

ఆ మాట వాస్తవమని అనిపించి మౌనంగా ఉండిపోయాను.

ఇద్దరి మధ్య మౌనాన్నీ చీరుస్తూ “మళ్లీ దుబాయ్‌కి వస్తారా?” అన్నాను మెల్లగా.

“రావాలి.. ఊర్లో ఓ చిన్న ఇల్లు కట్టుకునే వరకూ ఇసుక గూళ్ల చుట్టూనే నా జీవితం” అన్నాడు.

“ఇలా గల్ఫ్ కంట్రీస్‌కి రావాలనుకునే వాళ్లకి మీరేం చెప్తూ ఉంటారు?” అన్నాను ఉత్సుకతతో.

“రావొద్దనే చెప్తాను. ఇప్పటికీ మా ఊర్లో కుర్రాళ్లకి చదువుకోమని బాగా చదువుకోమని చెప్తూ ఉంటాను” అన్నాడు. ఆ మాటలు విన్నాక ఊరటగా అనిపించింది. తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను.

ఎయిర్ హోస్టెస్ అనౌన్స్‌మెంట్‌తో మెలకువ వచ్చింది. నా పక్కనున్న రాజా అప్పటికే దిగడానికి సిద్ధంగా కూర్చుని ఉన్నాడు. నా వైపు చూసి చిరునవ్వుతో “ఈ కొన్ని గంటలు మీతో మాట్లాడుతూ సమయం గడిచిందే తెలియలేదు” అన్నాడు.

“అవును.. మీతో మాట్లాడాక చాలా విషయాలు తెలుసుకున్నాను” అన్నాను నవ్వుతూ.

“మీ పేరు?” అన్నాడు చివరగా దిగిపోతూ

“శిశిర..” అని చెప్పి అక్కడి నుండి కదిలి వచ్చేసాను.

రోజుకి ఎన్నో మొహాలని చూస్తూ ఉంటాం కాని అందరి మొహాలు గుర్తుండవు. ఎందరో పరిచయం లేని వాళ్లతో మాట్లాడి ఆ రోజుకి అక్కడితో వదిలేస్తూ ఉంటాం. కాని కొన్ని పరిచయాలు మాత్రం మనతో మోసుకెళ్తూ ఉంటాం.

అలాంటి పరిచయాల్లో రాజా, ఇంకా అతను కట్టుకున్న ఇసుక గూళ్లు కూడా ఒకటి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here