ఇతర రాష్ట్రాల్లో తెలుగు భాషాప్రాభవము

0
10

[ఆగస్టు 29 తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా – శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘ఇతర రాష్ట్రాల్లో తెలుగు భాషాప్రాభవము’ అనే వ్యాసం అందిస్తున్నాము.]

[dropcap]తె[/dropcap]లుగు మాతృభాష కాని, భారతదేశంలోని, ఇతర రాష్ట్రాలలో సైతం తెలుగు భాష తన ప్రాభవాన్ని చాటుకుంటూ ఉంది. తెలుగువారు దేశమంతా స్థిరపడినవారు. వారు ఎక్కడ ఉన్నా, తమ భాషా సంస్కృతీ మూలాలను మరచిపోరు. వారి కృషి వల్ల చాలా ఇతర రాష్ట్రాలలో మన తెలుగు ఎలా వెలుగుతూ ఉందో ప్రామాణికంగా వివరించడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.

గ్రంథ విస్తర భీతిచే, కొన్ని రాష్ట్రాలను మాత్రం ఈ పరిశోధనా వ్యాసం కోసం ఎన్ను కోవడం జరిగింది. అవి ఒడిషా, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్ర. ఆయా రాష్ట్రాలతో తెలుగువారు, తాము ప్రవాసులుగా ఉన్నా, తమ భాషను, తమవారిని కలుపుకొని, సంఘాలు స్థాపించి, సభలు నిర్వహించి, తమ రాష్ట్రం నుంచి కవులను, పండితులను, రచయితలను ఆహ్వానించి వారితో ఉపన్యాసాలనిప్పించి వారిని సన్మానిస్తారు. తామూ స్వయంగా రచనలు చేస్తారు. అక్కడి ప్రభుత్వాల సాయంతో మన పిల్లల విద్యా బోధన తెలుగు మాధ్యమంలో జరిగేలాగా చూస్తారు. తెలుగు రాష్ట్రాలలో ఉన్నవారికంటే, ఇతర రాష్ట్రాలతో ఉన్న తెలుగు వారికీ తమ భాషను అక్కడ కూడా బ్రతికించుకోవాలనే తపన సహజంగానే ఎక్కువగా ఉంటుంది. ఇదంతా ప్రతిఫలించే సమాహారమే ఈ వ్యాసం.

అవతారిక:

శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహరావుగారు తమ ‘సాక్షి’ ఉపన్యాస పరంపరలో ‘స్వభాష’ అన్న శీర్షికన వ్రాసిన వ్యాసంలో అన్నట్లు “మనిషి జీవనోపాధి కోసం ఎంత దూరాన ఉన్నా, తన మాతృభాష మీద మక్కువ తగ్గదు”. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అన్న శ్రీరామచంద్రు ప్రభువు మాటలకు మాతృభాషాచ అని చేర్చితే సముచితంగా ఉంటుంది. మన ప్రాంతం కాని చోట మన భాషను బ్రతికించుకోవడం, పైగా సుసంపన్నం చేయడం నిజంగా కత్తిమీద సామే!

ఒడిషా (ఒరిస్సా) రాష్ట్రంలో తెలుగు భాషాశేముషి:

ఈ రాష్ట్రంలోని గంజాం, కోరాపుట్, పూరి జిల్లాలలో తెలుగువారు అధికంగా నివసిస్తారు. పర్లాకిమిడి సంస్థాన ఆస్థాన పండితులు, కావ్యతీర్థ బిరుదాంకితులు, శ్రీమాన్ బంకుపల్లి మల్లయ్యశాస్త్రిగారు. జయపురము సంస్థానాధీశుడు విక్రమదేవవర్మ స్వయముగా కవి. ఆయన ఆస్థాన కవులంలో ఎక్కువ మంది తెలుగువారు. వారు పెనుమత్స సత్యనారాయణరాజు, భట్టిప్రోలు కృష్ణమూర్తి, త్రిపురాన వెంకట సూర్యప్రసాదరావు గారలు.

వ్యావహారిక భాషావాదముతో సంచలనం సృష్టించిన గిడుగు రామ్మూర్తి పంతులుగారు పర్లాకిమిడి వాస్తవ్యులే. ‘కళాప్రపూర్ణ’ పురిపండా అప్పలస్వామి గారు అనేక ఓఢ్ర గ్రంథాలను తెలుగు లోకి అనువదించారు. తెలుగులో తొలి డిటెక్టివ్ నవల ‘వాడే వీడు’ రాసిన శ్రీ దేవరాజు వెంకట కృష్ణారావు బరంపురము వారే. డా. ఉప్పల లక్ష్మణ రావు గారు తమ నవల ‘అతడు-ఆమె’ ద్వారా ప్రసిద్ధులు.

సంత్ గోస్వామి తులసీదాస్ మహారాజ్ హిందీ భాషలో వ్రాసిన ‘శ్రీరామచరిత మానస్’ను శ్రీ భాగవతుల నరసింహశర్మగారు తెలుగులోనికి అనువదించినారు. అందులో గంగావతరణ ఘట్టమును మనోహరముగా వర్ణించినారు.

కం:

గంగన్, రంగత్తుంగత

రంగన్, భర్గోత్తమాంగ భ్రమదురు భృంగీ

భృంగన్, భావఘ్నాభి

ష్యంగన్, భక్తానుషంగ, సాగరసంగన్.

మందాకిని అందములు ఈ కందములో సందడి చేసినవి.

సెట్టి నరసింహంగారు జయపురవాసి. ఆయన ‘గోవర్ధనోద్ధరణము’ అన్న కావ్యము వ్రాసినారు. పద్యకావ్యములను పండించిన కృషీవలులలో శ్రీ బక్‍షీ వాసుదేవరావు, శ్రీ డొంకాడ గోపీనాధ కవి, శ్రీ వేమూరి జగన్నాథశర్మ, శ్రీ భాగవతుల నరసింహ శాస్తి గారలు ప్రసిద్ధులు. శ్రీయుత మండపాక పార్వతీశ్వర కవి ‘పాలవెల్లి’ అను కావ్యమును రచించి దేశోద్ధారక శ్రీ నాగేశ్వరరావు పంతులుగారికి అంకితమిచ్చినారు. ఇందులో ‘అలసిపోయితిని’ అన్న శీర్షికన వారు వ్రాసిన రచనలో ‘ఆర్తి’ మన హృదయాలను తాకుతుంది.

“ఏ వంక నుందువో యెఱుక లేదయ్య/త్రోవ తప్పితినయ్య, త్రోపు పాటయ్యె

త్రోవ చెప్పినవాడు తోడురాడయ్యె! ఈ వేళ నీ కేల నిట్టిపాటయ్యే

అలసిపోయితినయ్య! అలసిపోయితిని, కటకటా! నీ కింత కాఠిన్యమేల?”

‘తేనెపట్టు’ అన్న కావ్యము కూడా వారిదే. ఇందులో తేనెటీగను గురించి, “లోకాని కర్పించి లోకంపు సేవ” అంటారు. ఇక్కడ ‘విశ్వశ్రేయః కావ్యమ్’ అను లాక్షణిక స్ఫూర్తి కనపడుతుంది. ఆల్‌ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ అను ప్రఖ్యాత ఆంగ్లకవి రాసిన ‘ఈనక్ ఆర్డెన్’ (Enoch Arden) అన్న కావ్యం ఆధారంగా శ్రీ వజ్జల వెంకటేశ్వర్లు ‘నౌకాభంగము’ అను ఖండకావ్యమును వ్రాసినారు.

తెలుగువారైన శ్రీ కె. అప్పలస్వామి గారు ఆంధ్ర భాషాచార్యులు. వారి సిద్ధాంత గ్రంథం ‘ఒరిస్సా ప్రవాసాంధ్ర రచయితలు – రచనలు’ ఆ రాష్ట్రంలోని తెలుగు భాషాభివృద్ధికి ప్రామాణికమైనది.

తమిళనాట తెలుగు బావుటా:

శ్రీ కాశీపాండ్యన్, శ్రీ సుబ్రహ్మణ్య మలయాండి వంటి ప్రముఖ పరిశోధకుల వల్ల పరిశోధన వల్ల, కర్నూలు జిల్లాలోని తుంగభద్ర లోయలో దొరికిన శిలాఫలకాలలో క్రీ.పూ. 3 వేల ఏండ్ల నాటి తెలుగు మాటలు వెలుగు చూశాయి. ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. బౌద్ధ జైన సాహిత్యాలలో కూడా.

క్రీ.పూ. 2వ శతాబ్దం నుండి క్రీ.శ. 5వ శతాబ్దం వరకు గల తమిళ సాహిత్యాన్ని సంగ సాహిత్యం అంటారు. ఇందులో తెలుగువారి గురించి చాలా విషయాలున్నాయి. ముల్లయి, కురింజ, మిరుదం, కదల్, పాలై ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా నివసించేవారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడం వల్ల, ఆంధ్ర రాష్ట్రంలోని కొన్ని సరిహద్దు ప్రాంతాలు ఇతర రాష్ట్రాలలో కలిసిపోయినాయి. ప్రపంచంలో, మొత్తం 18 కోట్ల మంది తెలుగు వారుండగా, సగంమంది తెలుగు రాష్ట్రాలు, మిగతా సగం మంది. ఇతర రాష్ట్రాలలో నివసిస్తున్నట్లు, ఒక సర్వేలో తేలింది. ఇంచుమించు ఒక కోటి మంది ఇతర దేశాలలో ఉన్నారట. తెలుగువారు సహజంగానే కలుపుగోలు స్వభావం కలవారు. అక్కడి ప్రజలతో మమేకం అవుతూనే, తమ సంస్కృతిని, భాషను నిలబెట్టుకొంటారు.

సంగ సాహిత్య చరిత్ర ప్రకారం తమిళులు తెలుగు వారిని ‘వడుగర్’ అని పిలిచేవారని తెలుస్తూన్నది. అంటే, ఉత్తరదిక్కున ఉన్నవారని అర్ధం. ఆర్. సంపత్ అనే రచయిత 2000 సంవత్సరంలో ‘ది హిందూ’ పత్రిక ‘Tamil-Telugu Affinity’ (తమిళ-తెలుగు సాన్నిహిత్యం) అన్న వ్యాసం వ్రాశారు. అందులోని ఒక వాక్యంలో ఆ సాన్నిహిత్యం ఎంత గాఢమైనదో చెప్పారు.

“If the Tamil take pride in singing the Telugu Keerthanas of Sri Thyagaraja, the Telugus scale ecstatic heights while reciting the Tamil Hymn Thiruppavai of Sri Andal.”

తమిళనాడు ప్రభుత్యం తెలుగు కళాకారులకు పద్మభూషణ్, పద్మశ్రీ, కలైమామణి లాంటి అత్యున్యత పురస్కారాలకు సిఫారసు చేస్తుంది. ఇటీవల చెన్నయ్ లోని ఒక ఫ్లైఓవర్‌కు శ్రీ బాలమురళి కృష్ణగారి పేరు పెట్టడం విదితమే. 12వ శతాబ్దంలో కాటమరాజు వంశానికి చెందిన తెలుగు గొల్లవారు (యాదవులు) కళంబత్తూరుకు వలస వెళ్లారు. వారిని వడుకాయర్ అని పిలుస్తారు. నాయకర్లుగా మారిన వారే కట్టబొమ్మన్ వంశీయులు. బళ్లారి ప్రాంతం నుంచి వచ్చిన వారు కంబళం వాళ్లు. వీరి తెలుగు మాండలీకం బళ్లారి మాండలీకానికి దగ్గరగా ఉంటుంది.

క్రైస్తవ మత ప్రాబల్యం వల్ల అనేకమంది తెలుగువారు ‘కీలచ్చేరి’ అన్న చోటికి వలస వెళ్లారు. తమిళనాట వెలసిన, విలసిల్లుతున్న తెలుగు సంఘాలు కొన్ని.. 1) తమిళనాడు తెలుగు సమ్మేళనం 2) ప్రపంచ తెలుగు సమాఖ్య 3) పొట్టి శ్రీరాములు స్మారక సమితి 4) జనని 5) మద్రాస్ తెలుగు అకాడమీ (ఇవన్ని చెన్నై కేంద్రంగా పనిచేస్తాయి) 6) ఆంధ్ర సాంస్కృతిక సమితి (హోసూరు) 7) కృష్ణగిరి జిల్లారచయితల సంఘం (కృష్ణగిరి) 8) ఆంధ్ర సాంస్కృతిక మంజరి (తిరువళ్ళూరు).

తమిళనాట తెలుగు జానపదకళలు తెలుగువారికీ ప్రత్యేకమైనవి, ఇతర భాషలవారు తెలుగులో ప్రదర్శించేవి. గుడియాత్తం ప్రాంతంలో పెరుమాళ్లపల్లి గ్రామం ‘భారతం’ ఆటకు ప్రసిద్ధి. ‘కేళిక’ అన్నది ‘బయలాట’ దీనిని దళితులు ఆడతారు. తెలుగు నాట ఉన్న కళారూపాలన్నీ, ఇక్కడ లేనివి కూడ తమిళనాట నిలిచి ఉన్నాయి. ఉదా: ‘సుందరేశా నలుగిడవయ్యా, మధురమీనాక్షికి నీవు నలుగిడవయ్యా’ అన్నపాట తెలుగు ప్రాంతంలో లేదు. ఒప్పారి పాటలు దుఃఖాన్ని కలిగిస్తాయి. అందుకే నెల్లూరు చిత్తూరు జిల్లాలతో “దక్షిణానికి పోయి, ఏడ్చి, సంపాదించుకొని, బ్రతుకుతా!” అంటారు. తెలుగు సామెతలు కూడా యిక్కడ ప్రాచుర్యం పొందాయి. వాటిని ‘పాంతనుడి’, ‘సామిత’ అంటారు. ఉదా:

“ఓట్రుమిగా ఉంటే ఎంత బాగుణ్ణు అనేది రామాయణమైతే.. కొట్టుకుంటే ఏమి గతి ఔననేది భారతం.”

తెలుగు భాష – తమిళనాట దాని రూపాంతరాలు:

కోతిని కోంతి, పామును పాంబు, నేడును నేండు, తోటను తోంట, కూతురును కూంతురు అంటారు. గర్భవతిని ‘వేంకటి’ అని కొంగు మండలంలో అంటారు. కర్నూలు జిల్లాలో ఇప్పటికీ “ఆ పిల్ల యాకటితో ఉంది” అంటారు. మహా ప్రాణాలను. సంయుక్తాక్షరాలను అల్పప్రాణులుగా, విద్యావంతులు కాని వారు పలుకుతారు ఉదా: స్వామి- సామి, ఫలహారం- పలగారం

మనం గ్రాంథిక భాషలో వాడే వాక్యనిర్మాణం అక్కడ వ్యవహార భాషలో సహజంగా ఇమిడిపోతుంది. ఉదా: మా కూంతురిని గొనిపోయి అత్తవారింట విడచివస్తిని (కోయంబత్తూరు ప్రాంతం) ఆపాటి చేయనేరవా? (కరూరు)

తమిళనాడులో, చెన్నై నగరంలో శ్రీ గుడిమెట్ల చెన్నయ్యగారు తెలుగు భాషకు గణనీయమైన సేవ చేస్తున్నారు. తెలుగు రచయిత లెవరైనా తమ పుస్తకాలను చెన్నయిలో ఆవిష్కరించుకోవాలనుకుంటే ఆయన తమ ‘జనని’ సంస్థ ద్వారా అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇంతవరకు 48 పుస్తకాలను ప్రచురించారు, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి (రాయపేట) అధ్యక్షలు ‘అజంతా’ డా. కె.శంకర్రావుగారు, ప్రధాన కార్యదర్శి శ్రీ వై. రామకృష్ణగారు ‘నెలనెలా వెన్నెల’ అన్న పేర సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బెనారస్ హిందూ యూనివర్శిటీ భాగస్వామ్యంలో శ్రీమతి మాలతీ చందూర్ గారి నవలలపై సిద్ధాంత గ్రంథ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. ఆమె ‘శతాబ్దిసూరీడు’ నవలపై ఈ వ్యాసరచయిత వ్రాసిన గ్రంథానికి అవార్డు, 25 వేల రూపాయల నగదు పురస్కారము లభించినాయి అని సవినయ మనవి.

ఉత్తరప్రదేశ్ – వారణాసి:

బెనారెస్ హిందూ యానివర్శిటీ, తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొ. డా. బూదాటి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో తెలుగు భాషాప్రాభవం విలసిల్లుతూ ఉన్నది. వారు ద్రావిడ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నపుడు (2014) పొట్టి శ్రీరాములు స్మారక సమితి వారి కోరికపై మాలతీ చందూర్ గారి స్మారక ఉపన్యాసాల కోసం, వారు ఇచ్చిన ఐదు లక్షల రూపాయలతో ఒక ‘ధర్మనిధి’ని ఏర్పాటు చేసినారు. అదే సంస్థతో కలిసి, సిద్ధాంత గ్రంథాల పోటీని నిర్వహించి, ఎన్నికైన అత్యుత్తమ గ్రంథాన్ని వారే ప్రచురింప చేస్తున్నారు. దాని వెల ఉచితం. గ్రంథ రచయిత కూడా కాపీలు ఇవ్వడం వారి ఔదార్యం. ఆ ఔదార్యానికి పాత్రులైన వారిలో ఈ వ్యాసరచయిత కూడా ఒకరు.

ఢిల్లీ తెలుగు తల్లి:

దాదాపు 2 కోట్లున్న దేశరాజధాని జనాభాలో పదిలక్షల మంది వరకు తెలుగువారుంటారని ఒక అంచనా. ‘ఢిల్లీ సాహితీ వేదిక’ 1995 లో స్థాపించబడింది. దానిలో ప్రముఖ రచయితలు సర్వశ్రీ దాసరి అమరేంద్ర, జె. లక్ష్మిరెడ్డి, టి. సంపత్‍కుమార్. తోలేటి జగన్మోహన రావు గారల వంటి ఎందరో ఉద్దండులతో బాటు మరెంతమందో సృజనశీలురున్నారు. ఆ సంస్థకు 2020లో 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా ‘రజతకిరణాలు’ అన్న పుస్తకాన్ని వెలువరించారు. ఒక సాహితీ సదస్సును రెండో రోజుల పాటు నిర్వహించి, ఎందరో సాహితీ దిగ్గజాలను ఆహ్వానించి, తెలుగు కథ, కవిత్వం, నవల, విమర్శ, ప్రవాసాంధ్ర సాహిత్యం లాంటి పక్రియ లలో గత 25 సంవత్సరాలలో వచ్చిన పరిణామాలపై విశ్లేషణలు జరిపారు. ఈ గ్రంథానికి శ్రీయుతులు దర్భశయనం శ్రీనివాసాచార్య, శ్రీనివాస్ బందా గార్లు సంపాదకులుగా వ్యవహరించారు.

1997లో ‘కథ 1996’ను ఢిల్లీలో, ‘ఇండియన్ లిటరేచర్’ ఎడిటర్, ప్రముఖ మళయాల కవి శ్రీ సచ్చిదానందన్ గారు ఆవిష్కరించడం విశేషం. “Music has no language” అన్నట్లు “Literature has no linguistic barriers” కదా! 1998లో ‘సాహితీ వేదిక’ కవితా సదస్సు నిర్వహించింది. శ్రీయుతులు సోమసుందర్, కత్తి పద్మారావు, వాడ్రేవు చినవీరభద్రుడు వంటి దిగ్దంతులు పాల్గొని, దానిని కవితా పరిమళభరితం చేశారు. తర్వాత నవలా సదస్సును నిర్వహించారు. ఆర్.గణేశ్వరరావుగారి కథ ‘త్రిశంకుని మీద తిరుగుబాటు’ గొప్ప కథ. వారి సతీమణి శాంతసుందరిగారు తెలుగు సాహిత్యాన్ని హిందీలోకి అనువదించడంలో విశేషకృషి చేశారు. ఆమెకు అనువాదరంగంలో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

సర్వశ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు, మెడికో శ్యామ్ గారు, పులిగడ్డ విశ్వనాధరావు గారు, ఆర్. అనంత పద్మనాభరావు గారు, శ్రీమతి వి.ఎన్.రమాదేవి గారు ఢిల్లీ తెలుగు తేజాన్ని వెలిగించారు. 1990లలో ‘ఢిల్లీ తెలుగువాణి’ అన్న మాసపత్రిక వెలువడింది. దాని సంపాదకులు కంభంపాటి గోవర్థన్ గారు.

తర్వాత తరం ఢిల్లీ సాహితీవేత్తలతో ‘నేషనల్ బుక్ ట్రస్ట్’ తెలుగు విభాగం సంపాదకులు, కవి, డా. పత్తిపాక మోహన్ గారు, ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉప ఆచార్యాలు శ్రీ గంపా వెంకట్రామయ్య గారు, ప్రముఖ చిత్రకారులు కవి, ఎస్వీ రామారావు గారు ముఖ్యులు. 2010లో విలక్షణ పుస్తకాల పరిచయం, సమీక్షలు, విశ్లేషణలు – సర్వశ్రీ రాచపాలెం, ఓల్గా, కాత్యాయనీ విద్మహే గార్ల వంటి సాహితీ ప్రముఖలతో చర్చాగోష్ఠులు జరిగాయి. ప్రబల జానకి గారు ‘భారతంలో స్త్రీృపాత్రలు’ అన్న గొప్ప పుస్తకం వ్రాశారు. 2013లో, ‘సాహితీవేదిక’ – ‘జీవితము సాహిత్యము’ అన్న విషయం మీద ఒకరోజంతా సెమినారు నిర్వహించింది. వాసిరెడ్డి నవీన్ గారు కీలకోపన్యాసం చేశారు. 2014లో శ్రీ రావిశాస్త్రిగారి కథలపై సెమినార్ జరిగింది. కాత్యాయనీ విద్మహేగారు కీలకోపన్యాసం, వివినమూర్తి, అట్టాడ అప్పలనాయుడు గార్లు తమ వ్యాసాలని పంపారు. 2015లో కొడవటిగంటి కుటుంబరావు గారి సాహిత్యంపై జరిగిన సెమినార్ తలమానికమైనది. శ్రీ. ఎ. కృష్ణారావుగారు ఆయన రచనలకు గల సార్వజనీనతను విశదం చేశారు. 2016లో యాత్రా సాహిత్యం మీద ఒక సింపోజియం జరిగింది. ఇలా ఢిల్లీలో తెలుగు బావుటా ఎగిరింది.

కర్నాటక – తెలుగు భాషకు చక్కని వేదిక:

కన్నడ దేశంలో ‘కువెంపు భాషా భారతి’ తెలుగు భాషావృద్ధికి ఎనలేని దోహదం చేస్తూంది. కన్నడిగుల ఆదికవి తండ్రి తెలుగువాడు. మన ఆదికవి నన్నయ్యకు చేదోడు వాదోడుగా నిలిచిన అంతేవాసి కన్నడిగుడు. కన్నడ మత ప్రవక్త బసవేశ్వరుని జీవితగాథ తొలుత తెలుగులోనే వెలువడింది. నాచన సోముడు కన్నడ దేశములో జన్మించి తెలుగులో మహద్భుత కావ్యాలను రచించాడు. పురందర దాసులవారు అన్నమాచార్యుల వారికి సంగీతసోదరుడు. వారిరువురికీ కన్నతల్లి ‘భక్తి’!

ఎం. ఆర్. చంద్రమౌళిగారు సంగీత సాహిత్య సమలంకృతులు. తెలుగు సాహిత్యం అయిన మనోధర్మం. వారి ‘ఘంటసాల గానశాల’ అంతర్జాలంలో అత్యంత ప్రాచుర్యం పొందింది. అందులో వారు, ఘంటసాల వారి సంగీత సంయోజన పద్ధతిలోని సూక్ష్మాలనీ సుదీర్ఘ వ్యాసాల ద్వారా ధారావాహికంగా ప్రచురించారు. ఆయన శ్రీమాన్ డి. వి. గుండప్ప గారి మహాకావ్యం ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగు లోనికి అనువదించారు. వారు పుట్టి పెరిగింది కోలారు ప్రాంతం. వారి మాతృభాష తమిళం! తెలుగు భాష వారికి ఆరవ ప్రాణం!

శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు ‘కర్నాటాంధ్ర సవ్యసాచి’ బిరుదాంకితులు. వారికి చంద్రమౌళిగారు ఆత్మీయ మిత్రులు. శతావధాని డా. ఆర్.గణేశ గారు పండిత కవి. ‘మంకు తిమ్మన మిణుకు’ గుండప్ప గారి కావ్యానికి తెనుగు సేత. దానిని ‘కువెంపు భాషా భారతి ప్రాధికార సంస్థ’ ప్రచురించింది. అది కలా గ్రామం, జ్ఞానభారతి, మల్లత్తహళ్లిలో ఉంది. దాన్ని అధ్యక్షులు డా. అజక్క గిరీశభట్ గారు. అదే గ్రంథాన్ని బాణాల శ్రీనివాస రావు తెలుగు లోనికి అనువదించారు.

ఇక కల్లూరు జానకి రామారావుగారు తెలుగు, కన్నడ, ఆంగ్ల భాషలలో పండితులు. ఎన్నో తెలుగు కథలని కన్నడంలోకి, కన్నడ కథలను తెలుగులోనికి అనువదించారు. వీరి అనువాద కథాసంకలనం ‘కన్నడ కుసుమాలు, తెలుగు కోమలాలు’ ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. ఈ వ్యాసరచయిత కథలు (జ్వలితుడు, మాకేం తక్కువ) రెండింటిని వారు కన్నడం లోకి అనువదించారు. జ్వలితుడు – ‘సులిగె’ అన్న పేరుతో ‘మంజుల’ అనే కన్నడ వారపత్రికలో ప్రచురింపబడింది.

బెంగుళూరు నగరములో ఎన్నో సాహిత్య సంస్థలు తెలుగు భాషా వికాసానికి ఇతోధికమైన కృషి చేస్తున్నాయి. వాటిలో ‘కర్నాటక తెలుగు రచయితల సమాఖ్య’ ముఖ్యమైనది. ఇది 2013లో ప్రారంభించబడింది. దీని అధ్యక్షులు శ్రీ మాల్యాదిగారు. కార్యదర్శి కట్టే వెంకటేశ్వర శాస్త్రిగారు. తర్వాత, ‘తెలుగు విజ్ఞాన సమితి’ కూడ తన వంతు పాత్ర పోషిస్తున్నది. దీని అధ్యక్షులు శ్రీ రాధాకృష్ణన్ గారు.

‘సి.పి.బ్రౌన్ సేవాసమితి’ బెంగుళూరులో పేరెన్నిక గన్న సంస్థ. ఎన్నో సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. మహానటుడు, రాజకీయవేత్త శ్రీ నందమూరి తారకరామారావు గారి శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని, శతక పోటీలను నిర్వహించింది. ఈ వ్యాసరచయిత వ్రాసిన శతకము అందులో ఎంపికై ‘ఎన్.టి.ఆర్ స్మారక శతకరత్న’ అవార్డు పొందింది. ‘శ్రీరస’ అనే సంస్థ కూడా విశేష కార్యక్రమాలు నిర్వహిస్తూన్నది.

మైసూరు నగరంలో ప్రవాసాంధుల సంఘం, తుంకూరు, షిమోగా (శివమొగ్గ పట్టణాల్లో తెలుగు సంఘాలు తెలుగు భాషోన్నతి కోసం శ్రమిస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ – లక్నో, కాన్పూరు:

‘తెలుగు సాంస్కృతిక సంఘం’ కాన్పూరు వారు తెలుగు పండుగలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఈ సంస్థ ఐ.ఐ.టి. ఆవరణ లోనే ఉంది. అలహాబాద్ తెలుగు అసోసియేషన్ (ఇప్పటి ప్రయాగరాజ్) లో రాజ్ మరియు ఛార్లెస్ గార్లు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. నోయిడా తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్ వారు భాషాసేవతో పాటు ఎన్నో సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారణాసి నగరంలో ‘కాశీ తెలుగు సంఘం’ వారి సభలో, మన ప్రధాని నరేంద్రమోడీ గారు కూడా ప్రసంగించి, వారణాసి పట్ల తెలుగువారి అభిమానాన్ని కొనియాడారు. గంగానదీ ప్రాంతంలోని చాలా వ్యాపార సంస్థలకు తెలుగు భాషలో బోర్డులుంటాయి.

లక్నో లోని ‘తెలుగు సంఘం’, నెం 44. కల్యాణ్‌పూర్‌లో ఉంటుంది. వీరు తెలుగు ప్రవచనకర్తలను ఆహ్వానించి, ధార్మిక ప్రసంగాలు ఏర్పాటు చేస్తారు.

మహారాష్ట్ర – తెలుగు భాషకు మహోత్సవం:

శ్రీ అంబళ్ల జనార్దన్ గారు 1998లో ‘బొంబాయి కథలు’ అన్న వారి కథాసంపుటాన్ని ప్రచురించారు. వాటిలో ఆయన, బొంబాయి లోని తెలుగువారి సమగ్ర జీవితాన్ని ఆవిష్కరించారు. 1864 లోనే కొందరు తెలుగు పెద్దలు తెలుగు సెకండరీ గ్రేడ్ ఆంగ్లో వర్నాకులర్ స్కూలు స్థాపించారు. జాయాకారాది లింగూ గారు 1916లో ఉచిత తెలుగు గ్రంథాలయాన్ని స్థాపించారు. శ్రీ శంకరరావు పర్లా గారు అదే సంవత్సరంలో ‘తెలుగు సమాచార్’ అనే పత్రికను స్థాపించారు. శ్రీ కోన ప్రభాకరరావు గారు ఆ రాష్ట గవర్నర్‌గా ఉన్నపుడు, ఆయన చొరవతో, ‘మహారాష్ట్ర పాఠ్యపుస్తక మండలి’ తెలుగు పాఠ్యపుస్తకాలను ముద్రించసాగింది. 1925 లో రెండవ తెలుగు సమ్మేళనం జరిగింది. 2002 జూలై నెలలో ఈనాడు దినపత్రిక ముంబయి ఎడిషన్ ప్రారంభమైంది. 2008లో సాక్షి దినపత్రిక కూడ వచ్చి, భాషాచైతన్యం వెల్లివిరిసింది. ‘తెలుసా’ (తెలుగు సాహిత్య సమితి) చెంబూర్ ప్రాంతంలో క్రియాశీలక సంస్థ. నెహ్రూ సెంటర్ లోని షణ్ముఖానంద హలులో కూచిపూడి నృత్యప్రదర్శనలు జరుగుతాయి.

తెలుగు నాటకరంగం బొంబాయి కూడ వెలుగు లీనుతూంది. సి. కనకాంబరరాజు (సికరాజు – ఆంధ్రభూమి మాజీ సంపాదకులు), శ్రీ సోమంచి యజ్ఞన్న శాస్త్రి గారి ‘రంగభూమి’ నాటకానికి దర్శకత్వం వహించి నటించారు కూడా. ముంబయి తెలుగు కవులు, రచయితలలో శ్రీ అల్లంరాజు రామశాస్త్రి, శ్రీమతి తురగా జయ శ్యామల, శ్రీమతి సుధారమ ప్రముఖులు. సర్వశ్రీ ఎ. మల్లికార్జున రెడ్డి, సంగెవేని రవీంద్ర, నదిమెట్ల ఎల్లప్ప, అత్తిలి అనంతరామ్, డా. కె.వి. నరసింహరావు, థామస్ రెడ్డి గారల కవితా కృషి గొప్పది. 2005లో ‘తెలుగు సాహిత్య వేదిక’ అవతరించింది. ‘ముంబయి కెరటాలు’ (2006), ‘అరేబియా అంచుల్లో’ (2007), ‘సహ్యద్రి సౌరభాలు’ (2009) మొదలగు కవితాసంకలనాలు కవిత్వాభిమానులను అలరించాయి. ఇలా, మహారాష్ట్రంలో తెలుగుకు మహోత్కృష్ట దశ!

ఉపసంహరం:

భారతదేశంలో ఇతర తెలుగు రాష్ట్రాలన్నింటిలో తెలుగు భాష తన ఉనికిని కాపాడుకుంటూ, తన సాహితీ పరిమళాలను ప్రపంచానికి పంచుతున్నది. ఇంకా చాలా విషయాలున్నాయి. ‘Unheard melodies are sweeter’ అన్నట్లు, ఇక్కడ ప్రస్తావించడానికి అవకాశం లేని తెలుగు భాషాప్రాభవం, ఇంకా గొప్పది. తెలుగు ప్రపంచమంతా చిందాలి వెలుగు.

తేజస్వినావధీతమస్తు!

ఉపయుక్త గ్రంథ సూచి:

  1. ‘ఒరిస్సా ప్రవాసాంధ్ర రచయితలు రచనలు’ – శ్రీ కె అప్పలస్వామి, విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు, పలాస, శ్రీకాకుళం జిల్లా
  2. ‘తమిళనాట తెలుగు ప్రజలు – జానపద విజ్ఞానం’ – డా. సగిలి సుధారాణి (పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, డిసెంబరు 2012)
  3. ‘రజతకిరణాలు’ – ఢిల్లీ సాహితీ వేదిక – మార్చి సంపాదకులు – శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య, శ్రీ శ్రీనివాస్ బందా
  4. ‘మహారాష్ట్రలో తెలుగువారు’ – శ్రీ అంబళ్ల జనార్దన్ (పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ)

కృతజ్ఞతలు:

ఈ పరిశోధక వ్యాసం రచించుటలో తమ అమూల్య సహాయ సహకారాలను అందచేసిన

  1. శ్రీ దాసరి అమరేంద్ర (ఢిల్లీ)
  2. శ్రీ అంబళ్ల జనార్ధన్ (ముంబయి)
  3. శ్రీమతి డా. ఎస్. సుధారాణి (హైదరాబాద్)
  4. శ్రీ డా. కె.అప్పలస్వామి (పలాస)
  5. శ్రీ గుడిమెట్ల చెన్నయ్య (జనని, చెన్నై)
  6. శ్రీ వై. రామకృష్ణ (చెన్నై)
  7. శ్రీ మహమ్మద్ బాషా (ఆంధ్రజ్యోతి బ్యూరో చీప్, చెన్నై)
  8. శ్రీ కె.యస్. ఆర్.శాస్త్రి (లక్నో, రిటైర్డ్ డిప్యూటీ పోస్ట్ మాస్టర్ జనరల్, బెంగుళూర్ సర్కిల్)
  9. శ్రీ కల్లూరు జానకి రామరావు (బెంగుళూరు)

గార్లకు నా కృతజ్ఞతలు – వ్యాసరచయిత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here