ఇట్లు కరోనా-12

0
7

[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]

12

[dropcap]నా[/dropcap] బుర్ర కాసేపు పనిచెయ్యలా. ఒక్కసారి నా రక్తం పొంగింది. నా మామ జ్ఞాపకం నా బిడ్డ. దాని బతుకు నాశనం చేస్తుండు ఆడు.

లాగిపెట్టి రంగడి కాళ్ళ మధ్య తన్నాను. అర్ధనగ్నంగా మారానన్న సోయి లేకుండా బిడ్డ వైపు పరుగెత్తాను.

బిడ్డ మీద వాలుతున్న వాడి నెత్తిమీద రాయి పెట్టి కొట్టాను. అరుస్తూ వాడు పక్కకు ఒరిగాడు.

బిడ్డ నోట్లో బట్టలాగి గుండెకి హత్తుకున్నాను. రక్తమంతా మొఖంలోకి వచ్చినట్లుగా ఎంతో భయంతో అల్లుకుంది నా బిడ్డ. అటు రంగడొచ్చి నన్ను వెనకి నుండా లాగాడు. బిడ్డను పట్టుకునే వెనక్కి తిరిగి కాలెత్తి మరో తన్ను తన్నాను. పక్కనున్న పెద్ద తుంగ తీసి ఇద్దరిని బాదుతూనే వున్నాను. వారి అరుపులతో చుట్టూ జనం చేరారన్న సంగతి కూడా పట్టలా..

బిడ్డని లాగారెవరో.. నా వంటిమీద బట్ట కప్పారెవరో.. నేను ఏడుస్తూనే వున్నా..

మెత్తటి చెయ్యి భుజం మీద పడింది. నాకు ఉప్మా పెట్టినమ్మాయి. ఆ చిట్టితల్లిని అల్లుకున్నాను. కాలేజీ పిల్లలందరూ చకాచకా పనులు చేశారు.

పోలీసులొచ్చి రంగడిని, సూపర్‌వైజర్ని పట్టుకెళ్ళారు.

నన్ను వాళ్ళింటికి తీస్కెళ్ళి మా అయ్యకు ఫోన్ చేసిండ్రు. రేపో, ఎల్లుండో మా అయ్య వస్తాడు పోలీసు బండ్లో నన్ను పంపిస్తమన్నారు.

కానీ నాకింకా నా బిడ్డకి తప్పిన ప్రమాదమే తొలుస్తుంది. పసిబిడ్డ మీద కూడా పడిన పాపిష్టి మగకళ్ళ గురించే నేను ఆలోచిస్తున్నాను. సావుని మించిన శరీర ఆకలి గురించే నేను భయపడుతున్నాను. నా బిడ్డ ఇంకా అందరినీ భయం భయంగా చూస్తునే నన్ను అట్టిపెట్టుకుని తిరుగుతుంది. రేపటి మా దారి ఎందో ఇంకా తెలియట్లే..

ఏమిటిలా నిర్వేదంగా కూర్చున్నావ్? చదివావుగా ఈ కథ. ఇలా ఎందరి బతుకులు మహా వలస యాత్రలో కూలిపోయాయో నువ్వు ఊహించగలవా?

నేల మీద పాదమైనా మోపకుండానే ఎంతమంది పసిబిడ్డలు రాలిపోయారో? మట్టిలో కలిసిపోయిన ముసలి పాదాల రక్త ముద్రలు ఇంకా తడిగానే కనిపిస్తున్నాయి. గర్భిణుల కాళ్ళవెంట కారిన నెత్తుటి మడుగులు మీ మానవీయ విలువల్ని ప్రశ్నిస్తున్నాయ్. నీడ కోసం, నీళ్ళ కోసం, రొట్టె ముక్క జాడ కోసం, కోట్లాది కూలీలు ఆశగా ఎదురు చూశారు. పెదాల ప్రార్థనలన్నీ అదృశ్యం అయ్యాక, రోడ్లను కొలుస్తున్న ఆడకూలీ ప్రసవంలో శూన్యమే గోచరించాక, ఆఖరి దిక్కైన దేవుడే క్వారంటైన్‌లో సమాధి అయ్యాక ఇక ఎవరికి చెప్పుకుంటే వాళ్ళ బాధల్ని అర్థం చేసుకుంటారో చెప్పు. నువ్వు మాత్రం నీకేం పట్టనట్టుగా ఏ.సి. గదుల్లో కూర్చొని టీవీల్లో ఈ మహా పాదయాత్ర చూస్తూ ప్రభుత్వ తప్పిదమంటూ లెక్చర్లు దంచుతూ వేడి వేడి చికెన్లు లాగించేశావ్. కరెన్సీ వాసన మాత్రమే నీవైపు నడిపిస్తుందని నమ్ముతున్నావ్ గానీ నిన్ను కాల్చాల్సిన కట్టెలు కూడా మోసుకు తేవాల్సింది ఆ బక్క చిక్కిన దేహాలు మాత్రమే అని నువ్వెప్పుడు గ్రహిస్తావ్? కష్టం వారి నిరంతర చుట్టం. ఎక్కడైనా కష్టాన్ని నమ్ముకుని బ్రతకగలమనే ధీమాతోనే కదా సాటి మనిషివని నమ్మి నీ చెంత చేరింది? నువ్వు మాత్రం మానవత్వానికి మచ్చను మిగులుస్తూ నిశ్చలంగా నిలబడిపోయావ్.

గుడ్డిలో మెల్లగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిరంతరం వలస కూలీ యాత్రలో తమ సహకారాన్ని అందిస్తూ వారి ఆకలిని తీర్చాయి. ‘భూమిక’ సత్యవతి, శ్రీనివాసరావ్ సజ్జా, పింగళి చైతన్య, మోషే-జ్యోతి ల సేవలు కూడా చిరస్మరణీయాలే.

నీకొక సజీవ సంఘటన చెప్పనా.. తండ్రి కష్టం చూడలేక నిజామాబాద్ డిచ్‌పల్లి నుండి ఓ వడ్రంగి పిల్లవాడు గల్ఫ్ కెళ్ళాడు. నాలుగు నెలలు బాగానే గడిచాయి. నెలకొక పదిహేనువేలు పంపిస్తూ కుటుంబాన్ని ఆడుకుంటున్నాననే ఆనందంలో వుండగానే లాక్‌డౌన్ వచ్చి ఆ ఆశల్ని హరించి వేసింది. రెండు నెలలుగా జీతాలు లేక, పస్తులు ఉండలేక నానా అవస్థలూ పడ్డారు. కనికరం లేని షేకులు కనీసం వారిని మన దేశానికి పంపించడానికి కూడా సాయం చేయలేదు. వందేమాతరం మిషన్‌లో భాగంగా మన దేశ విమానాలు ఆ దేశంలోకి దిగిన ఒక్కో మనిషికీ 90 దీనార్లు పెట్టి విమానం ఎక్కి భారత్‌కి రాగలుగుతాడా? ఇక్కడికొచ్చాక ఆ క్వారంటైన్ ఖర్చుల్ని భరించగలుగుతాడా? మిగతావాళ్ళతో వెళ్లలేకపోతున్నందుకు బాధ, ఆ తర్వాతైనా తన పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆవేదన కనీసం తన శవమైనా తన వాళ్ళకి చేరుతుందా అన్న ఆందోళనతో దుఃఖిస్తున్న వారు ఎందరో ఉన్నారు.

తెలంగాణ జాగృతి చేసిన సేవ ఇక్కడ ప్రస్తావనార్హం. దేశం కోసం ఆలోచిస్తూ దేశ దేశాల్లో చిక్కుపడిపోయి ఆక్రోశిస్తున్న అభాగ్యుల్ని అక్కున చేర్చుకొని భారతదేశానికి రప్పించడంలో కీలక భూమిక పోషించింది తెలంగాణ జాగృతి. దిగువ మధ్యతరగతి వర్గాన్ని ఆదుకోవడంలో ఎంతో ఆర్థికభారం అయినప్పటికీ వెరవక కల్వకుట్ల కవిత గారి నేతృత్వంలోని బృందం కరోనా కష్టకాలంలో ఆపన్న హస్తాన్ని అందించారు. కరోనా బాధితుల్ని వివిధ దేశాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా రప్పించి వారి కుటుంబాలకి అండగా నిలిచారు. కళాకారులకి, ఆకలితో అలమటించే వేల పీడిత బతుకులకి వెన్నుదన్నుగా నిలుస్తూ నిత్యావసర వస్తువుల్ని పంచారు. మానవసేవే మాధవసేవయని జనసేవయే జనార్దన సేవ అని భావించిన వాళ్లు ఇంకా చాలామందే ఉన్నారంటున్నావా..సరే. నీకు తెలిసిన వాళ్ళు, నేను చూసిన వాళ్ళు ఒకరే అయి ఉంటారంటావా? చూద్దాం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here