[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]
13
[dropcap]కొ[/dropcap]న్ని వాస్తవ గాథల్ని కూడా నీకు తెలియపరచాల్సిందే. హైదరాబాద్‌లో పని దొరుకుతుందని నమ్మి మధ్యప్రదేశ్ కుడేమో గ్రామ కూలీ భార్యాబిడ్డలతో సహా వలస వచ్చాడు. లాక్‌డౌన్‌లో రెండేళ్ల బిడ్డతో నిండు గర్భిణీ అయిన భార్యతో ఎన్ని రోజులని పస్తులుంటాడు చెప్పు.. సాయం చేసే చేతుల కోసం చూసీ చూసీ చివరికి తన రెక్కల కష్టాన్ని నమ్ముకొని తన చుట్టూ ఉన్న చెక్కలతో ఓ తోపుడు బండిని తయారు చేసి భార్యనీ బిడ్డనీ కూచోబెట్టుకొని, 700 కిలోమీటర్ల దూరాన్ని 17 రోజులపాటు లాగుతూ సొంతూరికి చేరుకున్నాడు. తల్లిదండ్రుల్ని కావడి కుండల్లో కూర్చోబెట్టుకొని తీర్థయాత్రలకి తీసుకెళ్లిన శ్రావణ కుమారుడి కథను వ్రాసారే కానీ ఇలాంటి భర్తల కథలు కూడా ఎన్ని రాయొచ్చో కదా!
అది నాసిక్, ఆమె ఓ నిండు గర్భిణీ. తమతో వచ్చిన వాళ్ళంతా చావైనా, బతుకైనా ఊళ్లోనే తమ కుటుంబాల మధ్యే ఉందామనే తెగింపుతో బిడ్డల్ని చంకలకెత్తుకొని, సామాన్లు నెత్తిన పెట్టుకొని, తమ కాళ్ళనే నమ్ముకొని రోడ్లెక్కుతున్నారు. తన భార్య శకుంతలను చూసుకొని ఆ భర్త చింత పడుతుంటే తానే ధైర్యం చెప్పి నాసిక్ నుండి మధ్యప్రదేశ్ లోని సాత్నాకు అంటే దాదాపు 1000 కిలోమీటర్లు పైగా నడక మొదలుపెట్టింది. 250 కిలోమీటర్లు నడిచాక బీజాపూర్‌లో రోడ్డు పైనే బిడ్డను ప్రసవించింది. 150 కిలోమీటర్లు నడిస్తేనే కానీ వైద్య సదుపాయం అందదని తెలుసుకొని పురిటి తడి ఆరకుండానే రెండు గంటల్లోనే బిడ్డనెత్తుకొని నడక సాగించింది. ఎవరో చెప్తే విని అక్కడికొచ్చిన అధికారులు ప్రసావానంతరం తీసుకోవాల్సిన వైద్య సదుపాయాల కోసం ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఇక్కడ నేను ఆ మహిళ మనోనిబ్బరం గురించి చెప్పానా లేక మృగ్యమైపోతున్న మానవీయ విలువల గురించి హెచ్చరించనా అన్నది నువ్వే నిర్ణయించుకో.
కర్ణాటకలోని కోలార్ కు చెందిన మహమద్ పూర్ వాస్తవ్యులు అజముల్, ముజామిల్ పాషాలు తమకున్న కాస్తంత స్థలాన్ని అమ్మేసి వచ్చిన 25 లక్షలతో గుడారాలు వేసి, ఊరిని, వలస కూలీలని పస్తులు అన్న మాట లేకుండా ఆదుకోవటం ఆనందాన్ని కలిగించింది.
నిజంగా నీ గొప్పతనమేంటో ఒక్కసారి చెప్పు మానవా, ప్రకృతి కంటే ఏవిధంగా నువ్వు అధికుడివో ఒక్కసారి పునః సమీక్ష చేసుకో. 10 లక్షల తుంపర్లు కలవడం వల్ల ఏర్పడే నీటి బిందువుని నువ్వు రూపొందించలేదు. హవాయి దీవుల్లో మౌంట్ బైలెల్లి ప్రాంతంలో 350 రోజులూ కురిసే వర్షాన్ని నువ్వు సృష్టించలేదు. చిలీ దేశం లోని ఒక ప్రాంతంలో వంద సంవత్సరాలకు ఒకసారి వర్షం పడటాన్ని కానీ, అదే దేశంలో అటకామా ప్రాంతంలో నాలుగు వందల సంవత్సరాలకి ఒక్కసారి వర్షం పడటం కానీ, ఫ్రాన్స్ లో టౌకాన్ పట్టణంలో కప్పల వర్షం కురిపించటం కానీ, సూర్యుని కంటే 5 లక్షల రెట్ల ప్రకాశవంతమైన దోరాడస్ అనే నక్షత్ర నిర్మాణాన్ని కానీ, 24 గంటల్లో 5 లక్షల టన్నుల ఒండ్రు మట్టిగా కొండలను తింటూ తన వెంట తీసుకెళ్తున్న డొలరాడో నదిని నువ్వు సృష్టించలేదు కదా. గాలిని ఎంతో తేలికంటావు కదా, భూమిని ఆవరించిన గాలి బరువెంతో తెలుసా నీకు-56 కోట్ల కోట్ల టన్నులు. సూర్యుడి కిరణాల వేడినుండి మనల్ని కాపాడేదీ, సూర్యాస్తమయం తర్వాత చలితో మనం గడ్డ కట్టకుండా జీవజాలాన్ని సమతుల పరిచేదీ ఈ వాతావరణమే. దక్షిణ అమెరికాకు చిందిన సఫేమియా క్రిమి గంటకు 450 మైళ్ళ వేగంతో కదలటం, ఆస్ట్రేలియా జంతువు కోమ్లా బతికినంత కాలం ఒక్క చుక్క నీటిని కూడా ముట్టకపోవటం, హెమటిడ్ అనే దారం లాంటి పురుగు 28 సంవత్సరాలు ఆహారం లేకుండా బతకటం, 56 రోజుల్లో పట్టుపురుగు తన బరువు కన్నా 86 వేల రెట్లు తిండి తినడం నువ్వు అలవాటు చేసినవి కావు కదా… ఇప్పటికైనా నువ్వెంత అల్పుడివో తెల్సుకో!
ఈ భూమికి నువ్వూ ఓ అతిథివే అన్నది ఎందుకు మర్చిపోతున్నావో నాకు అర్థం కావడం లేదు. భూమిని అమ్మ అనుకోవాలే గానీ, అమ్ముకునే సరుకుగా చూసే నీ స్వార్థపూరిత తత్వం చూసి నా భూమి అని గొప్పగా చెప్పే నిన్ను చూసి నెల తల్లి నవ్వుతోంది. భూమాత గుండెల్లో గునపాలు దించుతూ గనుల్ని తవ్వుతూ, కొండల్ని పిండి చేస్తున్నావ్. ఒక చిన్న భూ కదలికలకే దేహ దేశాలు కూలిపోతున్న దృశ్యాలు చూసైనా నీకెందుకు బుద్ధి రావడంలేదు. ఒక్క సునామీతో కట్టుబట్టలతో వీధిన పడ్డ ఆగర్భ శ్రీమంతుల్ని చూసైనా నీవెందుకు మారడం లేదు. నువ్వూ మా లాగా భూమికి అతిథివే తప్ప మా అందరి పాలకుడివి మాత్రం కావు. కాస్తంత మేథో వికాసం కలిగిన బుద్ధిజీవిగా పుట్టిన నువ్వు పుడమిని మరింత వికసనం దిశగా తీసుకెళ్లాలే తప్ప వినాశనం దిశగా నడిపించకూడదు కదా. అణ్వాయుధాలు సైతం ఛేదించలేని బంకర్లు కట్టుకున్నానని బడా ఫోజు కొట్టే నువ్వు మాలాంటి వైరస్‌లని ఆపగలిగే ఆవాసాల్ని నిర్మించుకోగలిగావా?
ఓ నా సహవాసీ, రెండు అడుగుల ఎత్తైన పుట్టలో 90 వేల చీమలు సామూహిక జీవనం గడపంగా లేనిది, ఇద్దరిద్దరుగా వ్యష్టి జీవితాన్ని గడిపే మీకు వందల విస్తీర్ణం గల గృహాలు అవసరమా? అత్యల్ప జీవి అమీబా నుండి 150 టన్నుల తిమింగలం వరకూ ఈ భూమ్మీద 20 లక్షల జీవులు నివసిస్తున్నాయి. నీ శరీరంలో ఉన్న 200 ఔన్సుల రక్తం నుండి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సాటి మనిషికి 350 మీ.లీ. రక్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడని నువ్వు, మా లాంటి జీవుల పట్ల దయగా ఉంటావని ఎలా ఆశించగలం.
వలస కూలీలు మీ పనులకి అవసరం కానీ వారిని మీ సాటి మనుషులుగా గుర్తించారా. వెలివాడలుగా వాళ్ళ గుడిసెలే కాదు, మీ గుండెలు కూడా మారాయి కదా. మరలు, యంత్రాలుగా గుర్తిస్తూ వాళ్ళని మీ మానవీయ ప్రపంచంలోకి లాక్కురావడానికి మీకింకా ఎన్ని దశాబ్దాలు కావాలి. మీ చిన్న రక్తపు చుక్కలో ఎనిమిదివేల తెల్ల రక్త కణాల్ని, యాభై వేల ఎర్ర రక్త కణాల్ని సృష్టించిన విధాత, మా లాంటి సూక్ష్మ జీవులు నీ శరీరంలోకి ప్రవేశించినప్పుడు తెల్ల రక్త కణాలతో వాటిని హరించివేస్తూ, గాయమైన ప్రాంతంలో ఒక దాని మీద ఒకటి చేరిన తెల్ల రక్తకణాలు ఆ గాయాన్ని మాన్పేలా నీ శరీర నిర్మాణం ఉండటం దేవుడు మీకిచ్చిన అతి గొప్ప వరం కదా, అయినా మీకు సంతృప్తి లేదా? ఎందరి అసువుల్నో సునాయాసంగా తీసేయగలిగిన మీకు ప్రాణ భయంతో ఇంత వణుకు ఎందుకో?
భారతదేశంలో ఇంతవరకూ నాలుగు కోట్ల మంది వలస శ్రామికులు ఉన్నారని వాళ్ళు ప్రతి యేటా లక్షన్నర కోట్ల రూపాయాల్ని తమ కుటుంబాలకు కష్టపడి పంపిస్తుంటారని ప్రపంచ బ్యాంక్ అందించిన నివేదిక ద్వారా తెలుసుకొన్న మీరు ఇప్పటికైనా ఈ వలస కూలీల మీద జాతీయ వ్యూహాన్ని ఏర్పాటు చేయటం సముచితం అన్న నిర్ణయానికి రావలసిన అవసరాన్ని మీరు గుర్తెరగాల్సిన తరుణం ఇది.
నిజం చెప్పాలంటే వాళ్ళు వందల వందల కిలోమీటర్లు నడుస్తూ పోతుంటే నమ్మకం మానవాళి నుండి వీడ్కోలు తీసుకుంటున్నట్టుగా అనిపించింది. మనిషిని మనిషే నమ్మని తత్వం కనిపించింది. చావైనా సరే.. మనవాళ్ళ మధ్యనే పోవాలి తప్ప అనాథలుగా పోకూడదు. ఏ ఆకలైతే తమను వలస కూలీలుగా ఇంత దూరం పంపించిందో, అదే ఆకలితో జీవితం మీద కసితో వేల కిలోమీటర్లు వాళ్ళు దాటుతున్నట్టుగా అనిపించింది.
దూరపు కొండలు నునుపు అంటూ ఆశతో కుటుంబాల కోసం తమను తాము బలి పెట్టుకుంటున్న ఈ బడుగు జీవులకి ఉపాధి తమ ప్రాంతాల్లోనే దొరికితే ఇన్ని కష్టాలుండవుగా. కనీసం ఈ విషయంలోనైనా మీరు సానుకూల దృక్పథాన్ని కనపరిస్తే మనిషిగా మీకు ఓ సార్థకత నెరవేరుతుంది. పాపం వీళ్ళే ఇలా ఉంటే జీవిత చరమాంకానికి చేరుకున్న వృద్ధుల స్థితిగతులు ఎలా ఉండి ఉంటాయో ఆలోచించు. ఆగు..ఆగు.. ఆ విషయాలు నన్నే చెప్పనీ…మళ్ళీ కలిసినప్పుడు..
(సశేషం)