ఇట్లు కరోనా-14

0
6

[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]

14

[dropcap]వ[/dropcap]లస కూలీల పరిస్థితే ఇలా ఉంటే ఇక వృద్ధుల స్థితిగతులు ఎలా ఉంటాయో నీవు ఊహించాల్సిందే. వృద్ధాప్యం ఒక అనుభవం. ఒక తరం నుండి మరొక తరానికి ఆచారాలు, అనుభవాలు అందించే వాళ్ళే వృద్ధులు. వృద్దులు అంటే వృద్ధిలోకి వచ్చిన వాళ్ళే. క్రింది మెట్టు లేకుండా పై మెట్టుకు ఎక్కగలుగుతామా.. బాల్య, యవ్వనాల్లో ప్రేమను పంచి బాధ్యతల బరువును మోసీమోసీ అలసి సొలసి తిరిగి తిరిగి అదే ప్రేమను అందరి నుండీ ఆశించటం, సహజమే. కానీ ఆశించటం తోనే అసలు సమస్య వస్తుందని భావించటం మాత్రం నిజంగా వారి తప్పే. అందుకనే వ్యాధి తగ్గిపోయినా హాస్పిటళ్ళలోనే వదిలేశారు తప్ప ఇంటికి తీసుకెళ్ళటానికి చాలామంది సంసిద్ధత వ్యక్తం చెయ్యలేదు. చనిపోతే చివరి చూపుకు కూడా మహాప్రస్థానానికి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా రాలేదు. ఎంత సిగ్గుపడాల్సిన విషయమది? గెరాంటాలజిస్టులు అంటే వృద్ధాప్య శాస్త్రవేత్తల సూచనల మేరకు ఊతమందించి సాంత్వన చేకూర్చే బలమైన మానవ వనరుగా సమాజం మిగలాలంటూ పదే పదే హెచ్చరిస్తున్నా మీరు మారకపోవటం ఎంత హేయం. వృద్ధుల మానసిక, శారీరక రక్షణలతో పాటు భావోద్వేగాల పట్ల కూడా ఓ కన్నేసి ఉంచాలంటూ WHO ఒక ఉమ్మడి వ్యూహాన్ని రచిస్తున్న తరుణంలో వృద్ధాప్యం జీవితానికి ఒక బహుమతిగా మిగలాలంటూ తపిస్తున్న సమయంలో వృద్ధుల పట్ల మీ నిర్లిప్తత, అలసత్వం క్షమార్హం కావు.

ఇటలీలో వృద్ధుల్ని చావుకు వదిలేస్తే, అమెరికాలో కరోనా సోకిన వృద్ధులు చావు త్యాగం చేయాలని మరికొందరు సంభాషిస్తే మాయమైపోయిన మానవత్వాన్ని నేనెక్కడని వెతుక్కోను. పేదవాడి ప్రాణానికి ఒక ధర, పెద్దవాడి దర్పానికి మరొక ధర. ఏదైనా చావు బతుకుల మధ్యలోదే కదా జీవితం. ముసలివాళ్ళంటే పనికిరారని, పనికి వేరై పోయిన వారని , పనికిమాలిన వారై పోతున్నారని – భావించటం సబబుగా అనిపిస్తుందా మీకు? వృద్ధాప్యం ప్రతి మనిషి జీవితంలో తప్పని సరిగా వచ్చే ఆఖరి పేజీ – అది లేకపోతే పుస్తకం సంపూర్ణం కాదు. గుర్తింపు కూడా ఉండదు. మీకు తెలియకుండానే పుట్టారు. ఏం చేయాలను కుంటున్నారో చెప్పకుండానే బాల్యం గడిచింది. యవ్వనంలో బరువుల మధ్యనే కాలం గడిచింది – మరి మీకు యెంతో చేసిన పెద్దవారి ఋణం ఎప్పుడు తీర్చుకొనేది. జీవితంలో ఏవరికీ ఋణపడి పోకూడదు. అందుకే రేపటి మీ బ్రతుకుల్ని ఈరోజు వృద్ధుల్లో చూసుకుంటూ వారిని ఆదరించి గౌరవించాల్సిన అవసరం మీకు లేదంటారా..ఆలోచించండి, వృద్ధుల్ని ఆదరించండి.

ఈ కష్ట కాలంలో నేను మీకు నేర్పిన మరో కొత్త అంశం ప్లాస్మా దానం. ఒకప్పుడు అన్నదానం గొప్పదన్నారు, ఆ తర్వాత విద్యాదానం గొప్పదన్నారు. పిదప రక్తదానాన్ని మించిన దానం లేదన్నారు. అన్నిటికీ మించిన దానం ప్లాస్మా దానమే. ద్రవరూపంలో ఉన్న బంగారంగా మీరు అభివర్ణిస్తున్న ఈ ప్లాస్మా నా నుండి కోలుకున్న బాధితుల రక్తం నుండి సేకరించి మరికొంతమంది కరోనా బాధితులకి అందించటం వల్ల వారి ప్రాణం నిలబడుతుందని తెలుసుకోవడం సంతోషమే. కానీ, కరోనా బాధితులంటూ మీ మనుషుల్నే మీరు అంటరానివారుగా చూస్తూ భయంతో దూరంగా జరిగిన మీరంతా ప్రాణ భయంతో కాస్త ప్రాణ భిక్ష పెట్టమంటూ అదే కరోనా బాధితుల దగ్గరికి పరుగులు పెడుతున్నారే, అదే చిత్రంగా అనిపించింది నాకు. మీరంతా వెలివేసి వివక్ష చూపిన వాళ్ళే మీకు ప్రాణదానం చేసేలా చేసింది నేనే కదా. నీకు గుర్తుందో లేదో కానీ దేశంలో తొలి ప్లాస్మా దాత అహ్మదాబాద్‌కు చెందిన స్మృతి టక్కర్. హైదారాబాద్‌లో మాత్రం పోలీస్ వ్యవస్థ నుంచి శ్రీనివాస్ తొలి ప్లాస్మా దాత. ఒక్కో కణం ఒక్కో ప్రాణ వాయువై చావుబతుకుల మధ్య ఉన్న మనిషికి ప్లాస్మా రూపంలో పునర్జన్మ నందిస్తున్న కొంతమంది మనుషుల స్పందన చూసాక మనుషుల మధ్య మానవత ఇంకా మాయమైపోలేదు అనిపిస్తోంది.

ఇన్ని సీరియస్ విషయాల్లో సైతం నవ్వుకునే విషయాలు కొన్ని వున్నాయ్… ఇటలీలో వెదజల్లబడిన కరెన్సీ చూశాక ఇప్పటికైనా తెల్సిందా ఈ విషయం, కావాల్సింది కరెన్సీ కాదని.. బుక్కెడు అన్నమని, అని నవ్వుకున్నాను. క్షవరాలు లేక మీరంతా ఋషులయ్యామని హాస్యంగా ట్వీట్లు చేస్తున్నారు కానీ ఒడీషా కందమాల్ జిల్లాలో గిరిజనులు కొన్ని తరాలుగా ఒకరికొకరు క్షవరాలు చేసుకుంటారే తప్ప ఒక్క క్షవర శాల కూడా అక్కడ వుండదన్న సంగతి మీరు తెలుసుకోగలిగారు. మధ్యప్రదేశ్ షాపూర్ జిల్లా రఘునాథ్, మంజుల దంపతులకు పుట్టిన మగపిల్లాడికి ‘లాక్‌డౌన్’ అని పేరు పెట్టటం, ఛత్తీస్‌ఘడ్‌కి చెందిన దంపతులు తమ కవలలకు కరోనా, కోవిడ్ అని పేర్లు పెట్టడం బలే సంతోషం అనిపించింది.

పొలాల్లో పురుగులు తిని రైతులకు మేలు చేసే గబ్బిలాల్లో 64 రకాల వైరస్‌లు ఉన్నాయని, ఎలుకల్లో 65 వైరస్‌లు ఉన్నాయని, అందుకే శాస్త్రవేత్తలు ఎలుకల మీద పరిశోధనలు చేస్తారని మీ అందరికీ తెలిసిందే. నిజానికి పక్షుల వల్ల మనుషులకి ప్రమాదం లేదు, అయితే, వైరస్ రూపాంతరం చెందితేనే వాహకాలుగా మారతాయన్నది మీరు గ్రహించని అసలు వాస్తవం.

ఆలోచింపజేసిన విషయాలు ఎన్నో వున్నాయి… 19వ శతాబ్దంలో ప్రారంభమైన ధూమపానం వల్ల ఎంత మంది బలవుతున్నారో నీకు తెలుసా.. పొగాకు కాదది పగాకు అని ఎంత చెప్పినా మీరు వినిపించుకోవట్లేదు. మా అక్క ప్లేగ్ చెప్పిన ఒక వింతైన విషయం నీకిక్కడ గుర్తు చేయనా, అమెరికా టూబాకో కంపెనీ లిమిటెడ్, లండన్ అనే పెద్ద పొగాకు సంస్థ 1976 లో ఒకే ఒక్క సంవత్సరంలో అమ్మిన సిగిరెట్ల సంఖ్య ఎంతో తెలుసా నీకు.. 56వేల కోట్లు. అంటే ఇప్పటికి ఎన్ని లక్షల మంది ఈ పొగాకు బారిన పది అశువులు బాసి ఉంటారో ఊహించగలవా? దీన్ని ప్రారబ్ధ కర్మ అందామా, స్వయంకృతాపరాధం అందామా? 1972 లో అమెరికాలో కల్తీ మందులు నిల్వ చేసి అమ్ముతున్నారని రెండు లక్షల పైచిలుకు మందిని అరెస్టు చేసారు. అంటే ఎంత పెద్ద విపత్తు మీ మనుషుల స్వార్థం మూలంగా జరిగేదో ఊహించు. ఎంతమంది చనిపోయినా, నోటి క్యాన్సర్‌తో బాధ పడుతున్నా మీరు పొగాకు ఉత్పత్తుల్ని మాత్రం నిషేధించరు. ప్రాణాలు తీసుకొని సాధించే అభివృద్ధీ ఓ అభివృద్ధేనా అని ఆలోచించకపోవటం మీ దౌర్భాగ్యం.

పంజాబ్‌లో మత్తు బానిసలకి ఎన్ని చట్టాలు చేసినా ఏమీ చేయలేకపోయారు, కానీ దాదాపు 7.5 లక్షల మంది నా మూలంగా డీ అడిక్షన్ సెంటర్లలో చేరడం, బుద్ధిగా వాళ్ళు చెప్పింది విని వ్యసనం నుంచి బయట పడటం గొప్ప ఆనందాన్ని కలిగించింది.

పులియబెట్టిన తాటి కల్లుని హేండ్ శానిటైజర్‌గా వాడాలి అన్న ఆలోచన రావటం, IIT బోంబే నిపుణులు నాజిల్ జెల్‌ని తయారు చేయడం; స్టెతస్కోప్ అంటే రోగి గుండె మీద పెట్టి గుండె కొట్టుకొనే వేగాన్ని గణించేది.. అసలు గుండెనే ముట్టుకోకుండా దూరంగా వస్తున్నప్పుడే హార్ట్ బీట్‌ని చూపించే డిజిటల్ స్టెతస్కోప్‌ని ఆయు డివైజ్ అనే అంకుర సంస్థ కనిపెట్టటం, చైనా 10 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రిని, బ్రిటన్ 9 రోజుల్లో 4 వేల పడకల ఆస్పత్రిని, రష్యా 106 ఎకరాల్లో 872 కోట్లతో భారీ హాస్పిటల్‌ని నా మూలంగా నిర్మించాలని తలపోయటం గొప్ప థ్రిల్‌గా అనిపించింది. 1400 పడకలతో ‘టిమ్స్’ని అతివేగంగా సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం, దానితో పాటు మూడు విడతల్లో 1000 పరీక్షలు చేయగలిగిన మొబైల్ వైరాలజీ లేబ్‌ని కూడా దేశంలోనే మొదటి సారిగా ప్రారంభించడం గొప్ప విశేషం.

ఛత్తీస్‌ఘడ్‌లో ఇంజినీరింగ్ ఫైనలియర్ చేస్తున్న యోగేష్ సాహు ఇంటర్నెట్ ద్వారా కంట్రోల్ చేసే రోబోను తయారు చేయటం, కేరళలోని 10 ఏళ్ల కుర్రోడు అలోక్ శానిటైజ్ చేసే రోబోను తయారు చేయటం గొప్పగా అనిపించింది. వీడియో ద్వారా పెళ్లి చేసుకున్న నౌకాధిపతి ముంబైకి చెందిన ప్రీత్ సింగ్, దిల్లీ అమ్మాయి మియా కౌర్ పెళ్లి ముచ్చట్ల మీద సాగిన చర్చలు కాలక్షేపాన్ని కలిగించాయి. అసలు మనిషి శరీరధర్మాన్ని గురించి, నీ చుట్టూ ఉన్న ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి నీకు తెలిసింది చాలా తక్కువని నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. ముఖ్యంగా మీ ప్రాణదాతలైన డాక్టర్ల పట్ల మీ దాడులు క్షమార్హం కాదు. నువ్వు చేసిన దాష్టీకాలెన్నో, చూపించిన అభిమానం ఎంతో నువ్వు గుర్తు చేసుకుంటూ ఉండు. మరొక ఉత్తరంలో ఆ విశేషాలు ప్రస్తావిస్తాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here