ఇట్లు కరోనా-15

0
6

[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]

15

[dropcap]స[/dropcap]రే ఇంత లంబా ఈ-మెయిల్ రాసావు గానీ, నువ్వు చెప్పొచ్చేదేమిటి అనేకదా విసుగ్గా చూస్తున్నావ్. నీ మంచి కోసమే కదా నేను చెప్పేది. మిత్రులారా! ఇన్ని రోజులూ మీతో పాటు ఉన్న మీ సహవాసిగా నేను కొన్ని విషయాలు మీకు నిర్మొహమాటంగా చెప్పాలనుకుంటున్నాను. ఇది విజ్ఞప్తా, హెచ్చరికనా మీరు నిర్ణయించుకోండి. సామూహిక రోగ నిరోధక శక్తి పెంచుకోవడమే మా వంటి వైరస్‌ల వ్యాప్తికి విరుగుడని తెలుసుకోండి. మీ మితి మీరిన కారుణ్య ప్రదర్శనతో పావురాలకి గింజలు వేస్తూ, నీళ్ళు పెడుతూ నగరంలో అసలు ఎగరలేని తనాన్ని వాటికి నేర్పిస్తున్నారు. ఎక్కడ కోతులు కనిపించినా వాటికి పండ్లు పెడుతూ వాటి అన్నాన్ని అవి వెతుక్కునే అవసరం లేకుండా చూస్తూ కొన్నాళ్ళకి నిరాదరిస్తూ మనుషుల మీద ఎదురుదాడి చేసే విపరీత ధోరణులను వాటికి అలవాటు చేస్తున్నారు.

మీరు గ్రహించాల్సిన సత్యం మరొకటుంది. పుట్టుకతోనే ప్రతి జీవికీ వాటి శరీర ధర్మాన్ని, అవసరాన్ని గుర్తించి వారి శరీరనిర్మాణం రూపొందించబడింది. మీ అలవాట్లని వాటి మీద రుద్దుతూ పెట్ యానిమల్స్ అంటూ, ఆహారాన్ని అందిస్తూ జన్యు ఉత్పరివర్తనాలకు కారణమౌతున్నారు. తద్వారా మిమ్మల్ని మీరే అనారోగ్యాలకి గురిచేసుకుంటున్నారు. కుందేళ్ళు, కోతులు, పావురాళ్ళు స్వేచ్ఛగా తమ ప్రపంచంలో తాము బతుకుతుంటే వాటి ఆవాసాల్ని కూల్చేసి వాటిని అభద్రతకు లోను చేస్తున్నారు.

మీరొక విషయాన్ని గమనించాలి, బోగన్ విలియా.. అదే కాగితంపూల చెట్టు నీరు పోసినంత కాలం ఆకులతో చివుళ్లు వేస్తుందే తప్ప పూలు పూయదు. ఎప్పుడైతే నీళ్ళు పోయడం ఆపేసామో, అప్పుడే పుష్పించి మనిషిని ఆకర్షిస్తుంది. ఆ అందంతో తన దగ్గరకొచ్చిన మనిషి నెర్రెలు వారిన భూమిని చూసి మరికొన్ని నీళ్ళు పోసి జవసత్వాలు అందిస్తాడని భావిస్తుంది. ఉడ్ చెక్ అనే ధృవ ప్రాంతపు జంతువు ఆపత్కాలంలో నిమిషానికి 80 సార్లు కొట్టుకొనే గుండెని, 5 నిమిషాలకి నాలుగైదు సార్లు మాత్రమే గాలి పీల్చుకొనేలాగా అలవాటు చేసింది. బల్లి, పీతలు తమ తోక, కాలు తెగినప్పుడు కొత్తగా వాటిని పునర్నిమించుకుంటాయి. ఇలా ప్రకృతిలోని ప్రతి ఒక్క జీవికీ తనదనుకున్న ఏర్పాటు ఉంది. మీ ఆలోచనల్ని అందరి మీదా రుద్దుతూ ప్రకృతి రీతిని, కాల గతిని మార్చాలని మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఏప్రిల్ 22న మీరు ధరిత్రీ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఎర్త్ డే నెట్ వర్క్ అనే సంస్థ నిరుపయోగంగా ఉన్నా సరే జీవరాశులన్నీ భూమి మీదే బ్రతకాలనే రీతిలో పాలకులకీ, ప్రజలకీ మధ్య అనుసంధానంగా పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం పెరుగుతున్న భూ తాపాన్ని తగ్గించే దిశగా ప్రపంచ దేశాల్ని ఒక తాటికి తీసుకొచ్చేలాగా పని చేస్తుంది. అలాంటి సంస్థలు చెప్పేవి వినండి.

మీలో ఎందుకు ఈ వైరుధ్యాలో నాకు అర్థం కావట్లేదు ఓ మనిషీ, ధన్వంతరి వారసులు, సుశ్రుతుడి వంశీకులు మీ డాక్టర్లు. తెల్లకోటు ధరించిన దేవతా రూపాల్లా ఎందరికో ప్రాణాల్ని దానం చేస్తారు. దేహ క్షేత్రంలో యుద్ధ వ్యూహాల్ని రచించే సేనానులు వారు. సూది, గోలీలో వారి శస్త్రాలు. శానిటైజర్, మాస్క్‌లే వాళ్ళ అస్త్రాలు. ఆకాశం దాకా ఎగిరెళ్ళిన మీ ప్రాణాల్ని సైతం స్టెతస్కోప్‌తో వెనక్కి లాక్కొచ్చే డాక్టర్లు ఉన్నంత కాలం మాలాంటి వాళ్ళం మిమ్మల్ని ఏం చేయగలుగుతాం?

డాక్టర్లు నడిచే దేవుళ్లంటూ కొవ్వొత్తులు వెలిగించేదీ మీరే, చప్పట్లు కొట్టి అభినందించేదీ మీరే. కానీ అదే డాక్టర్లు చనిపోతే ఖననం కూడా చెయ్యనీయనిదీ మీరే. వృత్తి ధర్మంగా మీకు సేవ చేస్తూ ఆగాపురాలో నివసించే మంచి హస్తవాసి కలిగిన యునానీ వైద్యుడు చనిపోతే ఖబరిస్తాన్‌లో ఖననం చేయటానికి కూడా నిరాకరించిన మీది ఎంత హేయమైన మనస్తత్వమో కదా. నా మీద మీ తరపున యుద్ధం చేసిన చెన్నై డాక్టర్ సైమన్ హెర్క్యులస్ పట్ల మీ మనుషులు ప్రవర్తించిన తీరు నాకు అసహ్యాన్ని కలిగించింది. వారి మిత్రుడు డా. ప్రదీప్ కుమార్ చూపించిన స్నేహ భావం ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించింది.

నాకు సైతం కన్నీరు తెప్పించిన సంఘటన ఒకటి నీకు గుర్తు చేద్దామనుకుంటున్నాను. ఇండోనేషియా యువ డాక్టర్ డా. అమీర్ రషీద్ మదానీ పాజిటివ్ కరోనా వార్డులో పనిచేస్తూ చివరకు తానే వైరస్ బారిన పడ్డాడు. తనకు తెలిసింది తన శరీరం మొత్తం నేను ఆక్రమించేస్తున్నానని. చివరిసారిగా తన భార్యాబిడ్డల్ని చూడ్డానికి అంబులెన్స్‌లో ఇంటికి వెళ్ళాడు. డాక్టర్ ఇంటి కొస్తున్నారని ముందుగానే తెలియజేయడం వల్ల భార్యాబిడ్డలు ఇంటి బయటే నిలబడ్డారు. భార్యకీ తెలుసు అదే చివరి చూపని. అయిదేళ్ళ లోపు పిల్లలిద్దరూ తండ్రి ఎందుకు ఇంట్లోకి రావడం లేదంటూ, తమనెందుకు తండ్రి ఎత్తుకునేందుకు పంపట్లేదంటూ ఒకటే ఏడుపు. బయటినుండే వాళ్ళని చూసి వెనుదిరిగారు డాక్టర్. ఆ చివరి చూపుల్ని ఎవరో రికార్డు చేసి ఫేస్బుక్‌లో పెట్టటం చూసి కంట తడిపెట్టని గుండె ఒకటైనా ఉందా. ఆ తర్వాత రెండుమూడు రోజులకే చనిపోయిన ఆ డాక్టర్ మీ అందరికోసం కాదా జీవితాన్ని బలిపెట్టుకుంది. అస్సామీ డాక్టర్ ఉత్పల్ బర్మన్, ముంబై డాక్టర్ చేవ్రాన్ వాలా తమ జీవితాల్ని మీ ఆరోగ్యాల కోసమే కదా త్యాగం చేసింది.

నాకు సంతోషం కలిగించే సందర్భం ఒకటి అమెరికాలో జరిగింది. అంకిత భావంతో కరోనా వార్డులో తన వృత్తి ధర్మాన్ని నిర్వహించింది డా. ఉమాదేవి. వ్యాధి నుండి కోలుకున్న ఎంతోమంది తమకు పునర్జీవితాన్ని అందించిన డాక్టర్‌కు కృతజ్ఞతను ఏవిధంగా తెలియజేశారో తెలుసా..ఏకంగా వందకు పైగా వాహనాలతో అమెరికాలోని కనెక్టికట్ సౌత్ విండ్సర్‌లో డాక్టర్ ఉమాదేవీ మధుసూనన్ ఇంటి ముందు కవాతు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకోవడం గర్వంగా అనిపించింది.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా బారిన పడ్డప్పుడు తనకెంతో సేవ చేసి ఇద్దరు డాక్టర్లు తనకెంతో ప్రాణదానం చేసారు. వారు నికోలస్, నిక్ హార్డ్‌లు. ఆ తర్వాత పుట్టిన తన బిడ్డకి విల్ఫర్ట్ రాలీ నికోలస్ జాన్సన్ అని పేరు పెట్టారు బ్రిటన్ ప్రధాని. విల్ఫర్ట్ ప్రధాని తాత పేరు. లారీ అనేది బోరిస్ ప్రియురాలు సైమండ్స్ తాత పేరు. ఇద్దరి డాక్టర్ల పేర్లు కలిపి నికోలస్ జాన్సన్ గా పెట్టుకున్నారు. అలా తన కృతజ్ఞత చాటుకున్నారు బ్రిటన్ ప్రధాని. అది మీ అందరికీ ఆదర్శం కావాలి.

అయితే ఈ హైదారాబాద్‌లో కుటుంబం కుటుంబమే కరోనా చికిత్సకు అంకితం కావటం డా. మహమూద్ ఖాన్‌కే చెల్లింది. ఛాతీ వైద్యశాల సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఆయన, గాంధీ హాస్పిటల్ లో పని చేస్తున్న ఆయన భార్య డా. షహనా ఖాన్ – గాంధీ మెడికల్ కాలేజీ విద్యార్థిని అయిన ఆయన కూతురు రషికా ఖాన్ కూడా అంకిత భావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడం గొప్పగా అనిపించింది. Dr. సచిన్ నాయక్ అనే భోపాల్ ఆస్పత్రి డాక్టర్ – కారునే ఇల్లుగా మార్చుకుని 10 రోజులుగా అలాగే గడిపిన స్థైర్యం గొప్ప గుణపాఠాల్ని మీకు నేర్పాలి.

మల్కాజ్‌గిరి వైద్యురాలు విజయశ్రీ కరోనా వార్డులో పనిచేసి వచ్చిందని అపార్టుమెంటు వాసులు తనమీద పూలు చల్లుతూ అభినందించటం కూడా మంచి స్పందనే. అంతెందుకు, నా మీద పోరు సాగిస్తున్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, జర్నలిస్టులు, పోలీసులకు, త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ఆదేశాలతో వైమానిక యుద్ధ విమానాలతో ప్రముఖ కరోనా హాస్పిటల్స్ మీద పూల వర్షం కురిపించటం, యుద్ధ నౌకాలను విద్యుత్ దీపాలతో అలంకరించటం నాకు బాగా నచ్చింది. మనిషీ నువ్వు మారితే నీ చుట్టూ ఉన్న ఈ ప్రపంచమంతా మారిపోతుంది. మన ప్రగతి, పురోభివృద్ధి ప్రకృతితోనే ముడిపడి ఉన్నాయన్నది గుర్తించాల్సిన తరుణం వచ్చేసింది. అనాలోచితంగానో, అహంకారంతోనో నువ్వు చేసిన కొన్ని పనుల పర్యవసానాలు ఎంత భీతావహంగా ఉన్నాయో చరిత్రలోకి తొంగి చూస్తే నీకే అర్థం అవుతుంది. తొందరపడకు, నన్నే చెప్పనీ. ఈసారి ఉత్తరంలో..

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here