ఇట్లు కరోనా-16

0
6

[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]

16

[dropcap]చి[/dropcap]త్రమేంటంటే డాక్టర్లపై దాడులకు దిగితే కఠిన చర్యలు తప్పవంటూ కేంద్రం చట్టం తీసుకోచ్చేంత దిశగా కదిలిన ఆ సంఘటన గుర్తుందా నీకు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో కరోనా అనుమానితుల వివరాలు సేకరిస్తున్న ఇద్దరు మహిళా డాక్టర్లు తృప్తి కటారే, జకియా సయీద్‌ల మీద 13 మంది రాళ్ళ వర్షం కురిపిస్తూ దాడి చేశారు. ఆ సంఘటనతో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్‌గా భావిస్తూ చట్టం తీసుకొచ్చింది కేంద్రప్రభుత్వం.

ఎంతైనా భారతదేశంలో కరోనా సోకిన తొలి వ్యక్తి కేరళ లోని ఉషారాయ్ మనోహర్, వుహాన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తూ సెలవలకని ఇంటికొచ్చి వ్యాధిగ్రస్తురాలైనప్పటికీ త్వరలో మళ్ళీ వూహాన్‌కి వెళ్ళి వైద్య విద్యని పూర్తి చేస్తానని ధైర్యంగా చెప్పటం గొప్పగా అనిపించింది. అలా నడిచే దేవుళ్ళు తెల్లకోటు వేసుకొనే డాక్టర్లే. కనీసం మీ మనుషుల్లోని దేవుళ్ళ లాంటి ఆ త్యాగ జీవుల బలిదానాలనైనా గుర్తించి గౌరవించే సంస్కారాన్నైనా మీరు అలవాటు చేస్కోండి.

మశూచి వల్ల మూలంగా 17వ శతాబ్దంలో యూరోప్‌లో ఆరు కోట్ల మంది చనిపోయారని, 14వ శతాబ్దంలో ప్లేగ్ వల్ల ఏడున్నర కోట్ల మంది చనిపోయారని, భారతదేశంలో 19వ శతాబ్దంలో కోటి మందికి పైగా చనిపోయారని, 1945లో క్షయ వ్యాధి నివారణకి వాక్స్‌మెన్ స్టెప్టోమైసిన్‌ని కనిపెట్టేవరకూ కోట్లలో మనుషులు చనిపోయేవారని పక్కా లెక్కలు చెప్పుకుంటారే గానీ, అసలు మీ మనుషులు, మీ దేశాలు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం పెట్టుకుంటున్న సైనిక వ్యయంలో ప్రపంచం మొత్తం మీద కేవలం 10 శాతం తగ్గిస్తే చాలు భూమి మీద ఎక్కడా అవిద్య, అనారోగ్యం లేకుండా చూడగలమని ఎన్ని నివేదికలు వెలువడుతున్నా ఆ దిశగా మీరు ప్రయత్నాలు సాగించరే? ప్రపంచ ఉత్పత్తులో సగటున ముప్ఫై శాతం వరకూ యుద్ధాలకే సరిపోవటం లేదు. మీరు సిగ్గు పడాల్సిన విషయం ఏంటంటే, 800 కోట్ల జనాభాలో కనీసం 200 కోట్ల మందికి మంచినీటి సదుపాయాన్ని కూడా మీరు కలిగించలేకపోతున్నారు. నీటి కాలుష్యం మూలంగా ప్రతి ఏటా చనిపోతున్న వారు కోట్లల్లో వున్నారన్నది మీరు ఇకనైనా గుర్తించాలి. ఆ  దిశగా ఇకనైనా మీ ప్రయత్నాలు ముమ్మరం చెయ్యాలి.

2011లో న్యూజిలాండ్ లోని క్రైస్ట్‌చర్చ్ లో భూకంపంతో 180 మంది చనిపోయారని, వేలాదిమంది నిరాశ్రయులయ్యారని నీకు తెలుసుకదా… ఆ తర్వాత నిర్వహించిన సర్వే ప్రకారంగా వారంతా మరింత దృఢంగా కనిపిస్తూ, బలపడ్డ బంధాలతో మరింత మెరుగైన జీవితాల్ని గడుపుతున్నారని తేలింది. అంతెందుకు 2003లో సార్స్ ప్రబలినప్పుడు హాంకాంగ్‌లో పరిస్థితి హృదయవిదారకంగా అనిపించింది. మరింత బలంగా కొన్ని సంవత్సరాల్లోనే నిలబడగలిగింది ఆ దేశం. రెండో ప్రపంచ యుద్ధానంతరం శిథిలమైన జపాన్ తన ఉనికిని అత్యంత బలంగా ఆనతి కాలంలోనే చాటి చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. ఇవన్నీ నేనెందుకు చెప్తున్నానో తెలుసా..ప్రతి ఎదురుదెబ్బా మిమ్మల్ని మరింత దృఢంగా తయారు చేసింది. మీరు పొందిన ప్రతి వ్యథా మిమ్మల్ని మరింత వృద్ధిలోకే తెచ్చింది. ఆ సహనం, ఆ స్థైర్యం మీకు పుట్టుకతోనే అలవడింది.

మనిషీ, ప్రపంచదేశాల సమ్మేళనంలో స్వీడన్ అమ్మాయి గ్రేటా ధన్బర్గ్ చెప్పిన అభ్యర్థనని మరొక్కసారి ఆలకించు, ‘రేపటి మా తరానికి కావలసింది కాలుష్య రహిత ధరిత్రి మాత్రమే. అదే మాకు వెలలేని ఆస్తి. దయచేసి మా ఉమ్మడి ఆస్తిని భావి తరాలకి పదిలంగా ఇవ్వమని మాత్రమే నేను కోరుకుంటున్నాను’ అని అభ్యర్థించిన రేపటి తరపు బాలిక ఆశని ఇప్పటికైనా గౌరవించండి.

అడవులు భూమికి ఊపిరితిత్తులలాంటివి. వాటిని వాయుకాలుష్యంతో నింపేసి, విచ్చలవిడిగా నరికేస్తూ మనిషిని బ్రతకమంటే ఎలా బతుకుతాడు? పెరుగుతున్న జనాభా, రహదారుల నిర్మాణం అడవుల విస్తీర్ణానికి అడ్డుకట్ట వేస్తున్నాయి. మీ ఉదాశీనతే మీకు మీరు విధించుకున్న ఉరిగా భావించండి. అడవుల పెంపకాలు పెంచండి. హరితాన్ని కాపాడుకుంటే మనిషిని కాపాడుకున్నట్లేనని ఇప్పటికైనా గ్రహించండి.

అతి విచారకరమైన విషయం ఏంటంటే నేనున్న ఈ కాలంలో మహిళల మీద గృహహింసలు మరింతగా పెచ్చు పెరగటం. స్త్రీలను దేవతా స్వరూపాలుగా గౌరవించే భారతీయ సనాతన సంస్కృతిలో ఇలాంటి సంఘటనలు నన్నెంతో కలచి వేసాయి. అమ్మంటే కష్టాలకు, కన్నీళ్ళకు వీలునామా కాదు, కల్మషంలేని ప్రేమకు చిరునామా, కోడలంటే కూడికల తీసివేతల లెక్కకాదు, వాకిట్లో పెరిగే తులసి మొక్క, భార్య అంటే దించేసుకునే బరువుకాదు, ఇంట్లో వెలిసిన కల్పతరువు, కూతురంటే భద్రంగా చూడాల్సిన గాజుబొమ్మ కాదు మీ కడుపున పుట్టిన మీ అమ్మగా ఎందుకు ఆలోచించటంలేదు మీరంతా? ఇన్ని శిక్షలు పడుతున్నా నేరాలు తగ్గాల్సింది పోయి పెరుగుతున్నాయెందుకు? ఇంట్లోనే విచ్చలవిడిగా చొరబడుతున్న టీవీల్లోని అశ్లీల రేప్‌లు.. నీలి చిత్రాల మాయాజాలమా ఇది? విచ్చలవిడిగా దొరుకుతున్న డ్రగ్స్, పెచ్చుమీరిన పాశ్చాత్య ధోరణులదా ఈ తప్పంతా? నీడనుకుని.. కాపాడుతుందని నమ్మి చెంత నిలిస్తే పాము పడగై కాటేస్తున్న మానవత్వం, తోడనుకుని ఆదరిస్తే నల్ల తేలై కరిచిన బాంధవ్యం- ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో తెలియడం లేదు. అసలు స్త్రీని భోగవస్తువనో, కుతి తీర్చుకునే కామకేళి అనో ఎందుకనుకుంటున్నారు ఈ మగవాళ్ళు? స్త్రీ అంటే మనకు మాత్రమే కాదు.. ఈ లోకానికే అమ్మ – అన్న స్పృహ ఎందుకురావడం లేదు..ఈ క్యాన్సర్ నిన్నెంతగా బలహీన పరుస్తుందో ఇప్పటికైనా గ్రహించు. ఆకాశంలో సగం అంటున్నారు.. అవనిలో సగం అంటున్నారు ఆనందాల్లో సగం ఇవ్వకపోగా అవమానాలు మాత్రం హెచ్చుగానే చేస్తున్నారు. ఆత్మగౌరవాన్ని అందించకపోగా అడుగడుగునా విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు. ఏమిటి ఈ గృహహింసలు, మహిళల మీద అత్యాచారాలు? అసలు లాక్ డౌన్ లో ఏం జరిగిందంటావ్? మనుషులింత రాక్షసంగా మారడానికి కారణాలు అన్వేషించాల్సిందే, పద మనిద్దరం ఆ విషయం మీద పనిలో పడదాం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here