ఇట్లు కరోనా-18

0
7

[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]

18

[dropcap]నా[/dropcap]కో సందేహం ఉంది మిత్రమా, కాస్త తీర్చేద్దూ… ఇసకేస్తే రాలనంత మందితో నిరంతరం నిండి ఉండే మీ ఆసుపత్రులేంటీ లాక్‌డౌన్‌లో వెల వెల పోయాయి? రోగాలు తగ్గాయా లేక రోగాలే లేని సమాజం వచ్చేసిందా…! ఒకప్పుడు పల్స్ చూసి వైద్యం చేసేవారనీ, ఇప్పుడు పర్స్ చూసి వైద్యం చేస్తున్నారనీ, వైద్యశాలలు కాస్తా వధశాలలుగా మారుతున్నాయనీ, వైద్యో నారాయణో హరిః గా ఇప్పుడెవరూ లేరని బాధపడతావు గానీ, అన్నిటికంటే పెద్ద రోగం, అదే ‘అనుమానరోగం’ నీకుందని మాత్రం అంగీకరించవు. నిరంతరం మీ అనుమాన రోగంతో మిమ్మల్ని మీరు హింసించుకోకండి. అన్నిటికంటే పెద్ద డాక్టరు ప్రకృతే. ఆధునికులం మేము అంటారే కానీ, ఆధునికత వేషభాషల్లో, ఆహారంలో తప్ప ఔషధాల్లో ఏం చూపిస్తున్నారు మీరు.. జనరిక్ మెడిసిన్, జండర్ మెడిసిన్‌ల పట్ల మరింత పరిశోధన జరగాల్సిన అవసరాన్ని గుర్తెరగండి.

అన్నట్టు నా కాలంలో మీ హాస్పిటల్స్ చూసారుగా, ఎంతెంత ఛార్జీలు వసూలు చేసాయో. ఒక్క రోజు మీ కిడ్నీ చేసే పని డయాలసిస్ చేస్తే పదిహేనువేలు తీసుకున్నారు. మీ లంగ్స్ ఆడుతూ పాడుతూ చేసే పనిని వెంటిలేటర్ చేసినందుకు నలభైవేలు తీసుకున్నారు. శరీర ఉష్ణోగ్రతని సహజంగానే కంట్రోల్ చేసుకోగలిగిన నీ జీవన విధానం చేజారినందుకు లక్షల్లో మీరు పెనాల్టీ కట్టాల్సి వచ్చింది. చూసావుగా మీ శరీరం ఎంత విలువైనదో! కోట్లలో విలువ కట్టాల్సిన మీ శరీరంలోని కొన్ని అవయవాలకు అసలు రీప్లేస్‌మెంటే లేదు. బ్రెయిన్, రక్తం అలాంటివే. వీటినెవరూ ఇంతవరకూ తయారు చెయ్యనే లేదు. అత్యంత విలువైన శరీరాన్ని మత్తుకో, మందుకో, మగువలకో, వ్యసనాలకో లోబడి నాశనం చేసుకోవడం మీ అవివేకం కాదా?

రోగ బలం తగ్గాలంటే రోగి బలం పెరగాలని మీ ఆయుర్వేదం ఎప్పటినుంచో చెప్తూనే ఉంది కదా. రోగనిరోధక శక్తిని పెంచుకోడానికి ఆహారం దోహదం పడుతుందని చరకుడు ఎప్పుడో చెప్పాడు కదా. జనపదో ధ్వంశక వ్యాధులు ప్రబలేది వ్యక్తి తన దేహ ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్లనే అని ఘంటాపథంగా చెప్పటం వినలేదా. అయినా మితిమీరిన భయం కన్నా మితమైన భయంతో ఉంటేనే శరీరంలో అవయవాలన్నీ సక్రమ పంథాలో పనిచేస్తాయన్నది నిజం. ఏ వ్యాధి కన్నా మందు దొరుకుతుంది కానీ, భయానికి మందు కనుక్కోగలమా చెప్పు.

అన్నీ సాధించాననే అహంభావాన్ని ప్రదర్శించే ఓ అల్ప మానవా, మీ పుస్తకాల్లోని ఒక కథ విన్నాను నేను. ఒక కాకి తన మీద రెట్ట వేసిందని ఆగ్రహించిన ఓ రాజు, దేశంలోని కాకులనన్నింటినీ చంపించేస్తాడు. రాజ్యమంతా కంపు కొడుతోందంటూ ప్రజలంతా దర్బారుకొచ్చి విన్నవిస్తారు. ఏమిటీ దుర్వాసన అని అడుగుతాడు మంత్రిని రాజు. పారిశుధ్య లోపమని, ఎంత మంది సేవకుల్ని పెట్టినా కాకులు చేసే పారిశుధ్యం కంటే మిన్నగా చేయలేకపోతున్నారని చెప్తాడు మంత్రి. దాంతో తన ఆజ్ఞానాన్ని తెలుసుకున్న రాజు పొరుగు దేశాల నుండి కాకుల్ని పట్టి తమ రాజ్యంలో వదిలే ప్రతి మనిషికీ రెండు బంగారు నాణాలు ఇస్తానని ప్రకటిస్తాడు. ఇప్పటి ఆధునిక ప్రపంచంలో సైతం ఒక దేశం పిచ్చుకలు రైతుల పంటల్ని దెబ్బతీస్తున్నాయని భావించి వాటిని చంపేయించింది. ఆ తర్వాత పంటల దిగుబడి విపరీతంగా తగ్గిపోవడం గమనించి, కారణాల్ని అన్వేషిస్తే, తమను తినే పిచ్చుకలు లేక పురుగులన్నీ విచ్చలవిడిగా పెరిగి పంటల దిగుబడిని దెబ్బతీసాయని గమనించి పక్క దేశాల నుండి పిచ్చుకల్ని దిగుమతి చేసుకుంది. చూశారు కదా, ప్రకృతిలో సమతుల్యత దెబ్బతింటే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో!

శబ్ద కాలుష్యంతో మసక బారిన వాతావరణం ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో గమనించావా. నదులన్నీ తమంతట తాముగానే శుద్ధి చేయబడటం గమనించావా లేదా. ప్రజల తాకిడి లేక వీధులన్నీ స్వచ్ఛతకు కేరాఫ్ అడ్రస్‌లుగా మిగిలిపోయాయి. అవసరం ఉన్నా లేకున్నా… పొరుగు వారితో పోటీ పడుతూ మీరు చేసే దుబారా షాపింగ్ మిమ్మల్ని నేరపూరిత వ్యక్తులుగా తీర్చి దిద్దుతాయే తప్ప నిజాయితీపరులుగా మిగల్చవనే సంగతి గమనించారా.

మీ సౌకర్యాల పేరిట చేస్తున్న ఈ దోపిడీని ఇకనైనా ఆపండి. చెట్ల చల్లని గాలి పీల్చి ఎన్నాళ్ళైందో. కుటుంబ సభ్యులతో మనసారా మాట్లాడుకొని ఎన్ని వత్సరాలు గడిచాయో. ఏ ఆస్తులు ఇవ్వని భద్రత కుటుంబం అందిస్తే ఏ సౌకర్యాన్నీ అందించని భరోసా ప్రకృతి మాత్రమే అందివ్వగలుగుతుంది. ఆరడుగుల నేల మాత్రమే శాశ్వతమనే సత్యాన్ని గ్రహించి భూ దోపిడీని ఆపేయండి. మీ భస్మాసుర హస్తాల్ని మీ మీదే పెట్టుకొని మీ జాతి నాశనాన్ని మీరే కొని తెచ్చుకోకండి.

అన్ని జీవాలకూ ఆవాసం ఈ పుడమే. దాని గుండెల్లో ప్రేమ చెమ్మను కొల్లగొట్టకుండా ఉన్నంత కాలమే మన బతుకులు పదిలం. ప్రేమలో ఉన్నంత స్వచ్ఛత స్వార్థంలో లేదు. సేవలో ఉన్నంత ఆనందం దోపిడీలో దొరకదు. నీకేం కావాలో ప్రకృతికి మాత్రమే తెలుసు. తన మనసు మాట విను. రాజ్యాల మధ్య ఆధిపత్య పోరు, మనుషుల మధ్య ఆస్తుల పోరు, ప్రాంతాల మధ్య అస్తిత్వపు పోరు… నిరంతరం ఘర్షణలేనా? ఏం సాధించాలని ఈ పరుగులు? నమ్మకాలున్నప్పుడు, ప్రేమలు పరస్పరం పంచుకున్నప్పుడు, నిస్వార్థంగా జీవితాల్ని నింపుకున్నప్పుడు ఏ యుద్ధాలు కూడా అవసరంలేదు. ఏ అస్తిత్వాలు నిన్ను నిలదీస్తాయి.. సర్వం మన మనస్సుల్లోనే, మన చేతుల్లోనే ఉంది. నిస్వార్థంతో పుడమిని నింపుకుందాం. ప్రేమే సత్యమని నమ్ముకుందాం. ఓ మనిషీ ఆ దిశగా ఒక్కసారి ఆలోచించవూ…

జాతిపిత గాంధీ చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. భూమి మనిషి అవసరాల్ని మాత్రమే తీరుస్తుంది, దురాశల్ని కాదు. సమానత్వాన్ని పాటించు, సహ జీవుల్ని గౌరవించు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్టుగా 3T (టెస్ట్, ట్రీట్, ట్రాక్) వ్యూహంతో ఈ గడ్డుకాలాన్ని అధిగమించారు కదా. హెర్డ్ ఇమ్యూనిటీని సాధించారు కదా. అయినా, మీ గొప్పదనాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కావట్లేదు. భారతదేశంలోని ప్రతి ఇంట్లోని వంటగదీ ఓ వైద్యశాలనే, అందులోని పోపుల డబ్బా ధన్వంతరి మీకిచ్చిన వరమే. అందులోని ప్రతి దినుసూ ఆరోగ్యపు మేలుకొలుపే.

మీ దగ్గర సెలవు తీసుకొనే ముందు నేనొక రెండు కథల్ని మీకు జ్ఞాపకం చేద్దామనుకుంటున్నాను. ఒకటేమో ఖలీల్ జీబ్రాన్ చెప్పింది, మరొకటి జాతక కథల నుండి కాస్త మార్పుతో గ్రహించింది. ఓ మర్యాద తెలిసిన తెలివైన నక్క సామాన్య గొర్రెతో ఇలా అందిట… “మా ఇంటిని సందర్శించి మమ్మల్ని పావనం చెయ్యొచ్చు కదా” అని. అప్పుడా గొర్రె “మీ ఇల్లు మీ పొట్టలో లేకపోతే మీ ఇంటిని సందర్శించడం మాకూ గౌరవ ప్రదమే” అంటూ తప్పించుకు వెళ్లిపోయిందట. ఆ గొర్రె కున్నంత తెలివి కూడా మీకు లేకపోతే ఎలా? నక్కల్లాగా ఎన్నో వ్యాధులు మిమ్మల్ని కబళించాలని కాచుకొని కూర్చున్నాయి. మీరు తెలివి తెచ్చుకోవడమే తరువాయి.

జాతక కథల్లోని ఒక కథ ప్రకారం ఒక అడవిలో జింకలన్నీ సంఘటితంగా, ఒక సమూహంగా బ్రతకడాన్ని చూసిన ఒక సింహం రోజుకొక జింక చొప్పున తినేయడం ప్రారంభించింది. అది చూసి కలత చెందిన జింకలన్నీ తమలో తెలివైన జింక ఏం చెప్పినా పాటిద్దామని ఒప్పందం చేసుకున్నాయ్. అందరి సమ్మతితో తెలివైన జింకగా గుర్తింపు పొందిన ఓ వృద్ధ జింక సింహం ఆహారం లేకుండా పది రోజులు మాత్రమే బ్రతక గలుగుతుంది కాబట్టి, మనం ఒక 20 రోజులు గుహలు దాటి బయటకు రాకుండా ఉంటే దాని పీడ విరగడై పోతుందని భరోసా ఇచ్చింది. మరి ఆహారమో అన్నాయ్ కొన్ని జింక పిల్లలు. మనం ఆహారం కాకుండా ఉండాలంటే కొన్ని రోజులు పస్తులు తప్పవు. మన ఓపికే మనకు పెద్ద బాసట అంది నమ్మకంగా. ఎంత కష్టమైనా ఈ ఒప్పందాన్ని ఎవరూ మీరకూడదు, ఇది మీ ఒక్కరికే కాదు యావత్ మన జాతికి సంబంధించిన అంశం అని గట్టిగా చెప్పింది. తానిచ్చిన భరోసాతో జింకలన్నీ సింహానికి కనపడకుండా గుహల్లోనే తల దాచుకున్నాయ్. ఎంత వెతికినా సింహానికి ఒక్క జింక పిల్ల కూడా దొరకలేదు. ఆకలేసిన సింహం గడ్డి తినలేదు కదా.. కొన్ని రోజులకి సింహం నీరసంతో చచ్చిపోయింది. ఆ తర్వాత జింకలన్నీ ఆనందంగా కాలం గడిపాయి. చూసారుగా, ఒక్క కట్టుబాటు ఎంత చక్కటి భవిష్యత్తుని అందించిందో.. ఇప్పుడు సింహం లాంటి దాన్నే నేను, ఆవురావురుమంటూ మిమ్మల్ని తినటానికి వచ్చేసాను. తెలివితో మీరు మీ ఇంట్లో ఉన్నంత కాలం మాత్రమే సురక్షితంగా ఉండగలిగారు. సామాజిక దూరం పాటించినప్పుడు మాత్రమే నేను మీ మీదకు వేస్తున్న యమపాశం నిర్వీర్యం అయింది. నన్నింత బాగా కట్టడి చెయ్యగలిగారు కదా, మీ గురించి ఆలోచిస్తూ నిద్రపోయానేమో, నాకు భలే కలొచ్చింది. ఆ గ్రామంలోకి నాకు నో ఎంట్రీ అట. హమ్మయ్య నీ మొహంలో ఎంత ఆనందమో, ఆ గ్రామం గురించి తెల్సుకోవాలంటే ముందు నువ్వు నన్ను కట్టడి చెయ్యగలిగిన అంశాలేంటో ఆలోచిస్తూ ఉండు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here