ఇట్లు కరోనా-20

0
7

[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]

20

[dropcap]రై[/dropcap]తునగర్‌లో ప్రతి ఇల్లునూ ఆసక్తిగా చూస్తూ వెళుతున్న ముఖ్యమంత్రి ఒక చోట ఆగారు. ‘ఇక్కడ సర్పంచ్ ఎవరయ్యా’ అడిగారు ముఖ్యమంత్రి ఆ జిల్లా మంత్రిని. ఆయన సమాధానం ఇవ్వకముందే ఆ ఊరి జనాలు 10 మంది నిలబడ్డ ప్రదేశం నుండి ఓ 40 ఏళ్ల వ్యక్తి చకచకా నడిచొచ్చి నమస్కరించారు. ఎక్కడికెళ్ళినా ఎదురొచ్చి బ్రహ్మరథం పట్టే జనాల్ని చూసిన రాజకీయవేత్తలకి ఆ ఊరి జనాల వైఖరి అర్థం కాలా.. ఆ 10 మంది తప్ప జనాలెవరూ లేరు వీరిని ఎదుర్కోవటానికి. అదో పెద్ద ఆశనిపాతంగా అన్పించింది రాజకీయ నాయకులకి..

దాన్ని లోపలే దిగమింగుతూ జిల్లా మంత్రి సర్పంచ్ పక్కకి వచ్చి నిలబడ్డాడు. ‘చెప్పు నాగేశ్వర్రావ్ ఏమిటీ మీ ప్రత్యేకత’ అన్నారు. ‘చెప్పటం కంటే చూడటం బాగుంటది సార్’ అన్నాడతను వినయంగా.. పదమంటూ ముందడుగు వేశారు సీఎం గారు..

ఆ ఊరి పేరు ‘రైతునగర్’ పేరు గొప్పగా వుంది. ‘ఎవరన్నా వ్యక్తి పేరుతోనో, పల్లె పేరుతోనో పిలుస్తారు కానీ ఇలా రైతు నివసించే నగర్‌గా పెట్టలేదు’ అన్నారు మెచ్చుకోలుగా.. దానికి ఉప సర్పంచ్‌గా ఆ పక్కనే ఉన్న మహిళ నవ్వి ‘అదిగో ఆ కన్పిస్తున్నదే ముందు మా గ్రామం సార్. ఇక్కడ కొచ్చిన రంగనాయకులు అనే వ్యక్తి ఇచ్చిన స్ఫూర్తితో ఇలా కొత్త ‘రైతునగర్’ని నిర్మించుకున్నాం’ చెప్పింది పాత రైతునగర్‌ని చూపిస్తూ..

‘మీ ఊరిలో కరోనా కేస్ ఒక్కటి కూడా లేదా.. మొత్తం గ్రామాన్ని కట్టడి చేసుకున్నారా’ ఆరోగ్యమంత్రి ఆసక్తిగా అడిగారు. ‘కట్టడి చేసుకుంటే వైరస్ ఆగుతుందా సార్.. కంటికి కనపడని క్రిమి అది. ఎట్లాగైనా రావచ్చు. వస్తుంది కూడా.. కానీ సంవత్సరాల తరబడి ఓ ప్రణాళికాబద్ధ జీవితంతో మేము వ్యాధుల్ని గెలిచాం’ అని గర్వంగా చెప్పాడు సర్పంచ్.

‘ఏం చేశారేమిటి.. పేడ కళ్ళాపీలు.. వేప గుగ్గిలాల మంటలతోనా’ వ్యంగ్యం ధ్వనించింది ఓ విలేఖరి గొంతులో..

‘మీరంతా సనాతన మన ఆచారాన్ని అలా చిన్నచూపు చూడబట్టే భారీ మూల్యం చెల్లించుకున్నాం. ఆరోగ్యమంతా మన అలవాట్లు, ఆచారాల్లోనే వుంది’ అంటూ ‘సార్ ఈ ఇల్లు చూడండి’ అన్నాడు ఓ ఇంటి ముందాగుతూ..

చుట్టూ పండ్ల చెట్లతో.. ఓ మూల ఇంకుడు గుంతతో.. ఓ మడి కూరగాయలతో.. ఓ పక్క తులసి, అలోవిరా వనంతో, ఇంటి ముందు కళ్ళాపి చల్లి తీర్చిదిద్దిన ముగ్గుతో ముచ్చటగా వుంది. ఓ పక్క ఓ ఆవు కూడా వుంది..

‘మా ఊరిలోని ప్రతి ఇల్లు ఇలాగే వుంటుంది సార్.. ఆవు పేడతోనే మేము కళ్ళాపి చల్లుకుంటా.. ఆవు ఉత్పత్తులనే వాడ్తాం. నల్లేరు, అలోవిరా మొక్కని ఇంటిముందు గుమ్మానికి  కట్టామని మూఢనమ్మకం అనుకోకండి. పసుపు, ఆవుపేడ, అలోవిరా ఇంట్లోకి క్రిముల్ని రానివ్వవు. తులసి మొక్క ఎక్కడుంటే అక్కడ పిడుగు కూడా పడదని చెప్తారు. తులసివనంలో శవాన్ని వుంచినా పాడవదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. అంతెందుకు మన తాజ్‌మహల్ కాలుష్యం వల్ల మసకబారుతుందని గ్రహించే కదా లక్ష తులసి మొక్కలు పెంచుతున్నారు. తులసి మొక్క  విలువ తెలిసిన జపాన్ వాళ్ళు కూడా మనని చూసే ప్రతి ఇంట్లో తులసిని పెంచుతున్నారు.

అంతేకాదు సార్ వారానికి ఓ రోజు అంటే ప్రతి ఆదివారం సెనగబద్దంత (వేపాకు నూరి పసుపు వేసిన) గోళీల్ని ఊరంతా పరగడుపున తాజాగా వేసుకుంటాం. అల్లం, దనియాలు, దాల్చిన చెక్క, వాము, జీలకర్ర కషాయాన్ని తాగుతాం. పల్చటి మజ్జిగలో శొంఠి వేసుకొని తాగుతాం. ఎండాకాలమంతా రాగి జావని ఊరంతా పంచుతాం. గ్రామ పంచాయితీలో జొన్న రొట్టెల్ని ప్రతి సాయంత్రం తయారు చేయిస్తాం.  ఏ మందులు వేయకుండా మేము సాగు చేసుకున్న కూరగాయలతో వండుకున్న కూరల్నే తింటాం.’

‘అదేమిటి ప్రతి ఇంట్లో ఏదో గొట్టాలు కన్పిస్తున్నాయి’ అడిగాడొక ఇంజనీరు.. ఇంటి వెనుకగా వస్తున్న గొట్టాలు చూపిస్తూ..

“అది ‘గోబర్ గ్యాస్ ప్లాంట్’ సార్.. మేము గ్యాస్ కూడా కొనం.. ఆవులుంటాయి కదా వాటి పేడతోనే గోబర్ గ్యాస్ తయారు చేసి వాడుకుంటాం.”

‘ఊరి మధ్యలో ఇదేమిటి ఇంత విశాలమైన స్థలాన్ని ఖాళీగా పెట్టారు’ నడవటాన్ని ఆపి అడిగారు ముఖ్యమంత్రి.

‘ఇదిగో ఆ పక్క కన్పించేది మా పాఠశాల సార్. అక్కడ కూడా ప్లే గ్రౌండ్ వుంది. కానీ ప్రతి ఉదయం 4.30కి మా వూరిలో బెల్ మోగగానే స్కూల్ పిల్లలు.. యువత విధిగా ఈ గ్రౌండ్‌కి రావాల్సిందే. ఓ గంట యోగ జరుగుతుంది. ఆ తర్వాత ఓ గుడ్డు.. ఏదో ఓ గట్క అంటే రాగి, మక్కజొన్న ఏదోఓటి ఓ గ్లాసు తాగి వెళ్ళాల్సిందే. ఆ తర్వాత పిల్లలంతా ఎండలో కూర్చుని ఓ గంట సాముహికంగా చదువుకుని హోంవర్క్ చేసుకుని ఇళ్ళకి వెళ్ళిపోతారు. సూర్యరశ్మిని మించిన సూది మందు లేదని మా ప్రగాఢ నమ్మకం.. అదే మా ఆరోగ్యసూత్రం కూడా..’

‘అక్కడేంటి అంత మంది ఉన్నారు. అది వైన్సా’ అడిగాడొక విలేఖరి దూరంగా చూపిస్తూ.. ‘ మా ఊర్లో వైన్ షాపులు వుండవు బాబు. అది గానుగ నూనె బట్టి. ఈ రోజు బుధవారం కదా. గానుగ పట్టి ఎవరికి కావల్సిన నూనె వారికి అందజేస్తాం. మేము గానుగ నూనె వాడ్తాం.. వంటల్లోనూ, వంటికి కూడా..’

‘అబ్బో.. బలే పొదుపు చేస్తున్నారే. కూరగాయలు మీరే పండిస్తారు.. పాలు మీవే. గ్యాస్ కొనరు.. గోబర్ గ్యాసే వాడ్తారు. నూనె కూడా గానుక నూనే అదీ కూడా మీ వ్యవసాయ క్షేత్రాల్లోని పల్లీ, నువ్వులతోనే పండించుకుంటారా’ నవ్వుతూనే అడిగాడు ఆరోగ్యమంత్రి.

‘నిజం చెప్పారు బాబూ.. మా ఊరి మొత్తానికి కలిపి ఓ 3వేల ఎకరాల చేనుంది. మేమంతా సామూహిక వ్యవసాయం చేస్తాం. ముందు ఇంటి అవసరాలు చూస్తాం. వడ్లు, పప్పులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, గోధుమలు, నువ్వులు, జొన్నలు, మక్కలు వేశాక ఆకుకూరల మడులు పెడ్తాం. కరివేపాకు, కొతిమీర కూడా  కొద్దిగా వేస్తాం. ములగాకు, కాయల కోసం కొంత పెడ్తాం. ఇలా ఈ ఊరిలో వున్న 300 ఇళ్ళకు ఏడాదికి సరిపోను మేమే పండించుకుంటాం. ఆ తర్వాత మా పంచాయితి ఆఫీసులో సామూహిక భోజనాల కోసం అన్ని వస్తువులు నిల్వ చేస్తాం. ప్రతినెల ఒకరోజు ఊరంతా కల్సి భోంచేస్తాం..’

అంతలోకి మంత్రిగారి చెవిలో ఏదో ఊదాడు వారి పీఏ. ‘మీకు ప్రభుత్వం అంటే పడదా.. ప్రభుత్వ పథకాల్ని తీసుకోరంట’ కాస్త విసుగ్గా కరుగ్గా అడిగారు వ్యవసాయ మంత్రి.

ఈ సారి సర్పంచ్ మౌనం దాల్చాడు. ఆ ప్రక్కనే వున్న యువకుడు చిరునవ్వుతో ముందుకొచ్చాడు.

ఎందుకు ఆ పల్లె ప్రభుత్వ పథకాలు నిరాకరించిందంటావ్.. అహంకారమా..అభిజాత్యమా ఆలోచించు.. ఆ యువకుడు ఏం చెప్పుంటాడో…

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here