ఇట్లు కరోనా-21

0
8

[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]

21

[dropcap]‘ప్ర[/dropcap]భుత్వం నచ్చకో ప్రభుత్వ పథకాలు నచ్చకో మేం రిజెక్ట్ చేయలేదు సార్. మేం మా ఊరిని స్వయం పోషకంగా తయారు చేసుకోవాలనుకుంటున్నాం.. మేం లాభాల బాటలోనే ఉన్నాం.. సాయం అవసరం లేని చోట అప్పనంగా వచ్చే ఆదాయాన్ని తీసుకోవటం కూడా మంచిది కాదు కదండి. అవసరం వున్న వాళ్ళు ఎన్నో కోట్ల మంది ఉన్నారు. వారికి ఉపయోగపడుతుంది కదా అని మేము వద్దనుకున్నాం. పైగా ఉచితంగా వచ్చేవి ఏవీ మేము ఇష్టపడం. మా కష్టంతో సాధించుకోవాలన్నది మా ధ్యేయం’ చాలా స్పష్టంగా చెప్పాడు ఆ యువకుడు. ‘అంటే మీ ఊరిలో రైతుబంధు, నిరుద్యోగ భృతి, వితంతు పెన్షన్లాంటి పథకాలు తీసుకోలేదా’ ఆశ్చర్యంగా చూస్తూ అడిగారు ముఖ్యమంత్రి.

‘క్షమించండి.. వాటి అవసరాలు మాకు రాలేదు. మాలో నిరుద్యోగులు ఎవరూ లేరు. వితంతువులు అంటారా.. విధి వంచించి ఎవరన్నా అలా అయినా మళ్ళీ వివాహాలు మేమే చేస్తాం. అందరి పిల్లలు ఏ న్యూన్యతా భావం లేకుండా కల్సే పెరుగుతారు. కాకపోతే వ్యవసాయధికారులు వస్తూనే వుంటారు. ఇంకుడు గుంతలు.. పీహెచ్సీ సెంటర్లలో మా పిల్లల వ్యాక్సిన్లు అవన్నీ మామూలే. పైగా పశువైద్య శిబిరం కూడా ప్రభుత్వానిదే వుంది’.

‘మీరేం చేస్తుంటారు’ అడిగారు ముఖ్యమంత్రి.

‘నేను ఐఐఎంలో చదివి కార్పోరేట్ ఉద్యోగం చేసి ఎందుకో నచ్చక రిజైన్ చేసి ఈ ఊరొచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాను. ఇక్కడున్న యువత అంతా ఒక్కమాట మీద వుంటాం. అదే ప్లానింగ్‌తో మా ఊరికి కావాల్సిన గుడ్లు, మాంసం కోసం కోళ్ళఫామ్స్‌ని, గొర్రెల పెంపకాన్ని, డైరీని, లైబ్రరీని సామూహికంగా నిర్వహించుకుంటున్నాం. మా కోసం ఓ 30 పడకల ఆసుపత్రిని మేమే కట్టుకున్నాం. ప్రతి 6 నెలలకోసారి ఊరందరిని టెస్ట్ చేస్తాం. మా ఆడవాళ్ళ డెలివరీలు ఇక్కడే అవుతాయి.. నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం. ప్రతి 6 నెలలకి ఓసారి రెడ్‌క్రాస్ వారు మా ఊరుకొచ్చి రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తారు. మా యువతంతా విధిగా రక్తాన్ని దానం చేస్తాం.’

చర్చ పక్కదారి పడుతున్నట్టుగా గ్రహించింది ఆ మహిళ. ఈలోగా స్కూల్ వదిలినట్టుంది పిల్లలంతా పొలోమంటూ వీధుల్లోకి వచ్చేశారు. అందరూ ఆరోగ్యంగా, పరిశుభ్రంగా కళకళలాడుతూ సీతాకోక చిలుకల్లా వున్నారు.

‘వీరెవరికి వాహనాలు లేవా అందరూ నడిచే వెళ్తున్నారు’ ఓ విలేఖరి తెలివైన ప్రశ్న వేశాననుకుంటూ చూశాడు.

‘మా ఊర్లో మొత్తం తిరిగినా ఓ 2 కిలోమీటర్ల వ్యాసార్థం కూడా వుండదు. పిల్లలు అందరూ నడిచే వెళ్ళాలి. రైతులు పొలానికి సైకిళ్ళ మీద వెళ్ళొచ్చి అత్యవసరం అయితే తప్ప వాహనాలు వాడం. అదిగో ఆ పెద్ద షెడ్ వుంది చూశారుగా.. అక్కడ ఓ 50 కార్లుంటాయి. ఓ 50 ద్విచక్రవాహనాలుంటాయి. ఓ 50 ట్రాక్టర్లుంటాయి. వాయు, శబ్ధ కాలుష్యాల్ని వీలైనంత తగ్గించటానికి శరీరానికి ఎక్కర్‌సైజ్ల కోసం ఇలా చేస్తాం..’

వీళ్ళు చెప్తుంది నిజమేనా అన్నట్టు ప్రతి ఇంటిముందు చూసుకుంటూ వెళ్ళారు. ఎక్కడా వాహనాలు కన్పించలా.. వీధి చివరన ఓ పెద్ద ఆవుల షెడ్లో ఎన్నో వందల ఆవులు కన్పించాయి. దాని పక్కనే ఆవుల ఆశ్రమం అన్న పెద్ద బోర్డ్ వుంది. ‘ఇదేంటి’ అన్నారో విలేఖరి.

దానికి అక్కడున్న యువకుడు ముందుకొచ్చి ‘వయసుడిగిన ఆవుల్ని కబేలాకి ఇవ్వం.. వాటి అంతిమ ఘడియల వరకు ఇక్కడే సంరక్షిస్తాం’ చెప్పాడు.

తల్లిదండ్రులే ఇంటికి బరువని వృద్ధాశ్రమాలకు తరుముతున్న రోజుల్లో ఆవుల కోసం ఆశ్రమాన్ని నిర్మించిన ఈ ఊరి మానవీయతని శ్లాఘించకుండా ఉండలేకపోయారు ముఖ్యమంత్రి.

ఎన్నో వందల మొక్కలు.. పెద్ద పెద్ద చెట్లున్నప్పటికీ ఎక్కడా అపరిశుభ్రత కనిపించటం లేదు. ప్రతి వీధిలో మాత్రం రెండు గోతులు వాటి మీద ఇనుప చట్రాల మూతలు కన్పిస్తున్నాయి. వాటి మీదకి మంత్రిగారి దృష్టి వెళ్ళిందని గ్రహించిన అక్కడి మహిళ..‘ ఇది వేపాకు కాల్చేందుకు వాడ్తామండి. ప్రతి వారంలో రెండు రోజులు వేపాకును ఈ గొయ్యిలో వేసి బొగ్గులేస్తాం. వేపాకు పొగ ఊరంతా వ్యాపిస్తుంది. ఒక్కదోమ కూడా ఉండదు. ఎలాంటి సూక్ష్మజీవులైనా చనిపోతాయి’ చెప్పింది వాటిని చూపిస్తూ..

ఎడం పక్కగా వరుసగా కట్టిన ఇల్లు కన్పించాయి. ఒకేలా చిన్నగా ‘ఏంటవి’ అడిగారు.. అవి మా ఊరిలో పనికొచ్చే వారికి ఇబ్బంది రాకుండా ఉండేందుకు కట్టించాం. ప్రతి కుటుంబానికి రెండు రూంలు వచ్చేలా.. ఓ వంద ఇళ్ళు కట్టాం. మా ఊరిలోకి వచ్చిన ఏ వ్యవసాయ కూలీ కూడా వెళ్ళాలనుకోడు. వాళ్ళ పిల్లలకి కూడా మా పిల్లల వసతులన్ని ఫ్రీగా కల్గిస్తాం. సంవత్సరానికి సరిపడా ధాన్యాన్ని అందిస్తాం.

అదేంటీ ‘ప్రశాంత్ సదన్’ అని కనిపిస్తోందీ, పెద్ద పర్ణశాలగా అనిపిస్తోందీ – ప్రశ్నించారెవరో.

‘అది ఆస్పత్రి కంటే ముందు దశ వారికోసం మేం ఏర్పాటు చేసుకున్న ఆరామం సార్. ఊర్లో ఎవరికైనా జలుబొచ్చినా, జ్వరం వచ్చినా, ఏదన్నా అంటురోగం వచ్చినా ముందు ఇక్కడికే వస్తారు. తగ్గేంతవరకూ వీలుని బట్టి చూసుపోతూ ఉంటాం. కుటుంబాలు ఇబ్బంది పడకుండా, ఊరంతా జబ్బున పడకుండా ఇలాంటి ఏర్పాటు చేసారు మా యువతరం.’ చెప్పటం ఆపాడు సర్పంచ్. వాళ్ళ ముందుచూపుని అభినందించకుండా ఉండలేకపోయాడు సీ.యం.

ఎక్కువ ఇళ్లన్నీ తాళాలేసే ఉండటం గమనించాడు ఓ విలేఖరి. అదే ప్రశ్నని అడిగాడు. వీళ్ళంతా పట్నానికి వలస పోయారా అని.

‘మాకు పట్నాలనుండి వలసలే తప్ప ఈ పల్లె నుండి వలసలు ఉండవు. పండగలెప్పుడొస్తాయా, వేసవి సెలవలు ఎప్పుడొస్తాయా అని పట్నంలో ఉన్న మా పిల్లలందరూ పల్లెకు రావడానికి ఎదురు చూస్తుంటారు.’ గర్వంగా చెప్పింది ఓ మహిళ.

‘అంతేకాదు, మేం ఎవ్వరం ఖాళీగా ఇంట్లో కూచోలేం. భర్తలతో పాటు సగం మందిమి పొలాలకెళతాం. కొంతమందిమి కుట్టు మిషన్‌ల దగ్గరికి వెళతాం. ఇలా ఎవరికి తోచిన పని ఊరి కోసం అందరం కేటాయించుకొని చేస్తాం. ఎక్కడైతే సుఖాలు ఎక్కువైతాయో అక్కడ రోగాలు, అనారోగ్యకరమైన ఆలోచనలూ ఉంటాయని మేం అందరం అనుకుంటాం.’

‘అవును ఇక్కడ ఏ ఇంట్లో కూడా టీ.వీ. వినపడట్లేదే, దాన్ని కూడా బ్యాన్ చేసారా?’ నవ్వుతూ అడిగాడొక విలేఖరి.

‘మేము వ్యక్తిగత ఇష్టాలకంటే సామూహిక అభీష్టాలకే ప్రాధాన్యతనిస్తాం. పంచాయితీ ఆఫీసులో పెద్ద హోమ్ థియేటర్ ఉంటుంది. కంప్యూటర్ సెంటర్ కూడా పిల్లల కోసం అక్కడే నిర్వహిస్తాం. ఒక గంట వార్తలు చూస్తాం. తొమ్మిది గంటల కల్లా నిద్రపోతాం. ఏడు గంటలు నిద్ర ఉండాలన్న దాన్ని అందరం పాటిస్తాం.’

నిజంగా ఎలాంటి ఊరొకటి ఉండాలని నీకూ అనిపిస్తోంది కదా మానవా, నాకైతే ఆ ఊరిలో ఏదో పెళ్లి సందడి వినిపిస్తున్నట్లుగా ఉంది. నన్నెట్లాగూ పిలవరు గానీ, నువ్వెళ్లి పెళ్లి భోజనం చేసేసి, నన్ను కట్టడి చేస్తున్న విషయాలేంటో తెలుసుకొని చెబుదూ..

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here