ఇట్లు కరోనా-3

0
8

[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]

3

[dropcap]ఒ[/dropcap]క్కసారి చరిత్రను పునరావృతం చేసుకుందాం – ఈ 300 ఏళ్లలో 40 సార్లు ప్లేగుగా మేము మీ మీద ప్రతిదాడి చేస్తూనే వచ్చాం. హోం క్వారంటైన్ అనే పదం ది గ్రేట్ ప్లేగ్ ఆఫ్ లండన్ తర్వాతనే మీ మనుషులు నేర్చుకున్నారు. మశూచికి ఎడ్వర్డ్ జెన్నర్ అనే బ్రిటన్ సైంటిస్ట్ 1796లో టీకాను కనుగొన్న తర్వాతే కదా 1980లో WHO గర్వంగా భూమిపై మశూచి తొలిగిపోయిందని ప్రకటించగలిగింది. అంటే మశూచి మీద మనిషి గెలిచాడని ప్రకటించుకొని ఇప్పటికి 40 ఏళ్ళు అయిందన్న మాట. మానవాళి పురోభివృద్ధిలో అదొక గొప్ప మలుపుగా చెప్పుకుంటూ ఈ మధ్యే మీరు పండుగలు చేసుకున్న విషయం నాకు గుర్తుంది.

ఆ తర్వాత కూడా మొదటి ప్రపంచ యుద్ధానంతరం స్పానిష్ ఫ్లూ గా వ్యాపించి ఎంతో మందిని బలితీసుకున్నాం. పోలియో, మశూచి, జికా, ఎబోలా, నిఫా, సార్స్, స్పానిష్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ.. ఇలా ఎన్నెన్నో. రూపాలు, వేషాలు, పేర్లు మార్చుకున్నాం కానీ.. మా లక్ష్యం మానవాళిని దెబ్బకొట్టడమే అన్నది ఈపాటికి మీకు అర్థమై ఉండాలి.

అంతా నా గురించే చెప్తున్నా కానీ, నేను గమనించిన నీ గురించి కూడా కాస్త విశ్లేషించనీ.. నీదెంత చిత్రమైన మనస్తత్వమో తెల్సా.. నిజాలు చెప్తే అబద్ధాలని కొట్టి పారేస్తావ్. అబద్ధాలు చెప్తే నిజాలివి అంటూ ప్రచారం చేసేస్తావ్. ఏది మంచో ఏది చెడో, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో నీ విచక్షణని ఉపయోగించి మాత్రం తెలుసుకునే ప్రయత్నం చెయ్యవు. ఏమిటలా చికాగ్గా నొసలు ముడిచావ్? డిసెంబర్ లోనే చైనాలోని నేత్ర వైద్యుడు డా. వెన్ లియాంగ్ మిమ్మల్ని ఎంతగా ఎలర్ట్ చేసాడు.. సార్స్ లాంటి కొత్త వ్యాధి మనిషికి సోకుతుందనీ, ఎప్పుడూ చూడనంత జననష్టం సంభవించ వచ్చని సామాజిక మాధ్యమాల్లో పెడితే మీరు నమ్మారా? పైగా పిచ్చివాడంటూ ఎద్దేవా చేసారు, కొట్టిపారేశారు. నాకు ఇంత మంది ఆహారంగా మారటానికి దోహదం చేసింది ఆ మీ అలసత్వం కాదా?

బహుళ నక్షత్ర వాదాన్ని ప్రతిపాదించిన అంతరిక్ష శాస్త్రవేత్త గీయర్ డానో బ్రూనో ని 1600 సంవత్సరంలో రోమ్ నగరంలో భూ కేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నాడంటూ అది చర్చి నియమావళికి వ్యతిరేకమంటూ సజీవ దహనం చేసిన చరిత్ర మీది కాదా? మనిషి కోతి నుండి ఉద్భవించాడని చెప్పినందుకు డార్విన్‌ని తీవ్రంగా హింసించి తన మీద ఎన్నో దాడులు చేసిన వ్యక్తిత్వాలు మీవి కావా? చెదపురుగులు తమ ఒంటిపై ఉండే వెంట్రుకలతో వుంటాయంటే పగలబడి నవ్వి పిచ్చివాళ్ళుగా ముద్ర వేసిన తరం మీది కాదా?

అంతెందుకు 170 ఏళ్ల క్రితం హంగేరీ డాక్టర్ ఇగ్నెస్ సిమిల్ వైజ్ ఆరోగ్య రక్షకి చేతులు కడుక్కోవడమే ఉత్తమ మార్గమంటే మీరంతా ఎగతాళి చేశారు కదా. మరి అలాంటి శాస్త్రవేత్తే లూయీ పాశ్చర్ క్రిముల్ని అధ్యయనం చేసి చేతుల శుభ్రత లేకపోవడం వల్లనే ఇన్ఫెక్షన్‌లకి గురౌతున్నామని చెప్తే ఆహా… ఓహో అంటూ ఆకాశానికేత్తెసారు. ఎప్పుడెత్తుతారో, ఎప్పుడు పడదోస్తారో మీకే తెలియాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఏమిటలా బిగుసుకు పోయావ్, ఉత్తరం మొత్తం చదివాక, అప్పుడు నీ స్పందన తెలియజేద్దువుగానిలే.

చరిత్రలో జరిగిన ఒక్కో సంఘటనా చూస్తుంటే మీకు మేము ఎన్నో సార్లు హెచ్చరికలు జారీ చేసామని అర్థం అవుతూనే ఉంది. అయినా మీరు గ్రహించటం లేదు. దోమల కారణంగా పనామా కాలవ నిర్మాణ సమయంలో 50 వేలమంది కూలీలు చనిపోవడంతో ఫ్రెంచ్ వారు కాలవ నిర్మాణాన్ని వదిలి అర్ధాంతరంగా వెళ్లాల్సి వచ్చింది. ఇన్నివేల సంవత్సరాలు గడిచినా పరిశుభ్రతే మీ ఆరోగ్య బలమన్నది మాత్రం ఇప్పటికీ మీరు గుర్తెరగడంలేదు. అసలిప్పటికైనా గ్లోబల్ హేండ్ వాషింగ్ డే (అక్టోబర్ 15) వుందన్న సంగతి మీలో ఎందరికి తెలుసో నిజాయితీగా చెప్పండి చూద్దాం. కుటుంబానికో ఇల్లు కట్టుకోలేరుగానీ దోమలకి మురుగుకాల్వల ఇళ్ళు మాత్రం మా బాగా కట్టిస్తుంటారు. పైగా ప్రేమకీ దోమకీ పేరులోనే కాదు పనితీరులోనూ పోలికలున్నాయంటూ దోమ కుడితే బోదకాలు వస్తుందని, ప్రేమ కుడితే బాధ కలుగుతుందని సెటైర్లు వేసుకుంటూ బతికేస్తుంటారు. ఏదో ఇప్పుడు స్వచ్ఛభారత్ అంటూ కాస్తైనా శుభ్రత పాటిస్తున్నారు గానీ, అబ్బో అంతక్రితం మరీ దారుణంగా ఉండేవారు.

ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం బారిన పడి ప్రతి ఏడాదీ దాదాపు కోటి మంది వరకూ మరణిస్తున్నారు. అందులో 25 లక్షల వరకూ మీ భారతీయులే ఉన్నారు. పరిశ్రమలే జాతికి జీవనాడులంటూ మీరు తయారు చేసిన పారిశ్రామిక ఉత్పత్తుల మూలంగా ఏర్పడే కాలుష్యం కారణంగా 10 నుండి 15 లక్షల మంది చనిపోతున్నారనేది మీ గణాంకాలే చెప్తున్నాయ్. భారతదేశంలోని ఎక్కువమంది పరమ పవిత్రంగా భావించే గంగానదిలోకి 97 పట్టణాల నుండి 300 కోట్ల మురుగు నీరు చేరుతూ కాలుష్య కాసారంగా మారుస్తున్న సంగతి మీకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తూ ఉండిపోతున్నారు. అంతెందుకు, ఇండియాలో 450 నదులున్నప్పటికీ దాదాపుగా 85 శాతం వరకూ కాలుష్యం బారిన పడ్డాయన్న సంగతి ప్రపంచ గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవం. మీ చేతలతోనే మీ సాటివారిని చంపుకుంటున్న మీరు మమ్మల్ని హంతకులుగా, మానవజాతి మీద ఉగ్రదాడిగా అభివర్ణించడం ఎంతవరకూ సమంజసం? మీకు మీరు చేసుకునే హాని కన్నా మేం చేస్తున్న హాని పెద్దదేనంటారా?

ఎలా జరిగినా ఎందుకు జరిగినా నా ఎంట్రీ మొదలైంది. నా ప్రస్థానంలో ఏం చూసానో నీతో పంచుకోవాలని ఉంది. మనస్సుతో వింటానికి సిద్ధపడు మరి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here