ఇట్లు కరోనా-4

0
6

[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]

4

[dropcap]మీ[/dropcap]రేమనుకున్నా, ఎన్ని రీతులుగా స్పందించినా, విమర్శించినా నా ఉనికి, నా ప్రస్థానం దేనికైతే నిర్దేశించబడిందో దాన్ని నిర్వర్తించడానికి నేను నడుం బిగించాను. నా జాబితాలో తొలి ఐదు లక్షల కేసుల్ని జమేసుకోడానికి 140 రోజులు పడితే, తొలి లక్ష మరణాలకి 100 రోజులు తీసుకున్నాను. ఇప్పుడు 17 రోజుల్లో లక్ష మరణాల్ని జమ వేసుకున్నాను. నేను బలహీన పడ్డానా, మీరు బలపడ్డారా అన్నది మీరే ఆలోచించుకోండి.

అయితే ఒక్కో దేశం ఒక్కోలాగా నన్ను కట్టడి చేసాయి. చైనాని అతలాకుతలం చేశానని అబ్బురపడుతుంటే, పక్కనున్న వియత్నాం కొంతకాలం వరకూ నన్ను ఎద్దేవా చేసింది. వియత్నాం జనాభా 9.6 కోట్లు. పరిమిత వనరులతోనే 2003లో సార్స్‌ను, 2008లో ఏసియన్ ఫ్లూ ను సమర్థంగా ఎదిరించిన అనుభవంతో ఒక్క అడుగు కన్నెర్రతో వేశానో లేదో అక్కడి చిత్రకారులు నా మీద పై చేయిని చాటారు. మాస్క్‌ని ధరింప చేసిన ఆరోగ్య కార్యకర్తల్ని ప్రధాన కూడళ్లలో నిలబెట్టి అందరికీ మాస్క్‌లు అలవాటు చేయటమే కాక, దేశభక్తులైతే కనక ఇల్లు దాటి రాకండి అంటూ ఆంక్షలు విధించారు. లెడక్ హిప్ అనే చిత్రకారుడు ఆరోగ్య కార్యకర్తలతో కలిసి చేయి కలిపి నిలబడ్డ చిత్రం – ఆరోగ్య కార్యకర్త చెప్పింది వినాలి అన్న సంకేతాన్ని కల్గించింది. ‘లుమెన్’ రూపొందించిన ‘మాస్క్’ చిత్రం పోస్టర్లుగా దేశమంతా నిల్చింది. ‘పామ్ త్రంగ్ హ’ అనే కళాకారుడు రెండు స్టాంపులు డిజైన్ చేసి వైద్య సిబ్బంది నిబద్ధతకు జోహార్లు అర్పించారు.

ఫిబ్రవరి 1 నుంచే వ్యాధి నివారణకు అవగాహనతో అడ్డుకట్టలు వేసిన వియత్నాం మరణాల్ని నాకు అర్పణ చేయకుండానే నన్ను గెంటేసింది. ఆ తర్వాత కొంత మేరనే ఇబ్బంది పడిందనుకో, కొన్ని మరణాల్ని కూడా నా ఖాతాలో జమ వేసుకున్నాను. అయితే, మొదట్లో మరణాలతో ఊపిరి ఆగేంత పనైన న్యూజిలాండ్ చివర్లో నన్ను ఓడించి సవాలు విసిరింది. యాభై లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్ ఫిబ్రవరిలో తొలి కేసు నమోదైనప్పటినుంచీ మే 1 తర్వాత అంటే 65 రోజుల్లోనే కనీసం ఒక్క కేసు కూడా లేకుండా కట్టడి చేయగలిగింది. పౌరుల కదలికల్ని బ్లూ టూత్ టెక్నాలజీతో కనిపెడుతూ నన్ను అదుపు చేయగలిగింది.

ఇజ్రాయెల్ లాక్‌డౌన్ తీవ్రత లేకుండానే ఒక్కొక్క పట్టణంలో ఒక్కో వ్యూహాన్ని మార్చుకుంటూ నా మీద విజయాన్ని సాధించింది. ఆరేళ్ళ లోపు.. అరవై యేళ్ళ పైబడ్డ వారిని ఇంటికే పరిమితం చేసి మిగతా వారిని వారి వారి పనుల్ని చేయిస్తూ, సామాజిక దూరాన్ని పాటిస్తూ, రోగ నిరోధకతను పెంచుకుంటూ నన్ను నిర్వీర్యం చేస్తోంది. ప్రపంచ జనాభాలో దక్షిణాసియా జనాభా 23 శాతమే నని మీకూ తెలుసు కదా. అదే భారత్, నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లలో నష్ట తీవ్రత తక్కువగానే నమోదు కావడం మీరు గమనించారా..

కర్కాటక రేఖ నుండి మకర రేఖ మధ్య ఉండే ప్రాంతాలకి మలేరియాని ఎదుర్కొనే సామర్ధ్యం ఎక్కువ వుంటుంది కాబట్టి నా ప్రతాపం వారి మీద ఎక్కువ వుండదని నాకూ తెల్సు. HSA – MAR 27 B అనే సైన్యం… అదే మైక్రో RNA మిమ్మల్ని కాపాడుతుంటుంది అని మీ వాసిరెడ్డి అమర్‌నాథ్ చెప్పింది నిజమే.

నీకో గమ్మత్తైన సంగతి చెప్పనా, భారతదేశానికి సంబంధించిన మీరంతా కళాభిమానులు కదా, నదుల్ని కూడా మీరు కళాత్మకంగానే పిలుచుకుంటారుట కదా, అదే ‘గంగ యోగుల నది, గోదావరి కవుల నది, కృష్ణ శిల్పకారుల నది, యమున ప్రేమికుల నది, కావేరి సంగీతకారుల నది’ అని. భలే చిత్రంగా అనిపిస్తుంది కానీ, చరిత్రని పరిశీలిస్తే ఆయా నదుల పరీవాహక ప్రాంతాల చుట్టూ ఎదిగిన కళాకారులు అలాగే ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది యాదృచ్ఛికమో లేక ఆ నీటి మహాత్మ్యమో తర్వాత పరిశీలిద్దాం. కానీ ముందు నన్ను ఎదుర్కొన్న విధానాన్ని గమనిద్దాం.

ఎక్కువ ప్రతాపం లేకుండా కళాస్త్రాలతో నన్ను కట్టడి చేయడంలో మీ కళాకారులు సత్ఫలితాల్ని సాధించగలిగారంటే అందుకు కారణం మీకు కళల పట్ల ఉన్న మక్కువే. కళలు మనిషి అంతరంగ వికసనానికి దోహద కారకాలని మరోసారి నిరూపించారు. ఇంట్లో ఉంటే జనాభా లెక్కల్లో ఉంటాం, బయటికెళ్తే కరోనా లెక్కల్లో ఉంటాం అంటూ సున్నితంగా బెదిరిస్తూనే మీ మనుషుల్ని మీరు కాపాడుకున్నారు.

‘లోకా సమస్తా సుఖినో భవంతు’ అంటూ వందమంది గాయనీ గాయకులతో కలిసి 14 భాషల్లో ‘వన్ నేషన్, వన్ వాయిస్’ పేరుతో ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ ఆధ్యర్యంలో, లతా మంగేష్కర్ సారథ్యంలో పాడిన పాట నా మదిని దోచేసింది. 22 మంది గాయనీ గాయకులతో మీ గాన గంధర్విణి K.S. చిత్ర రూపొందించిన పాట 24 గంటల్లో మూడున్నర లక్షల వీక్షణాలు చూపించింది. 14 యేళ్ళ భారత సంతతి బాలిక సుచేత దుబాయిలో ‘సే నో టు పానిక్’ అనే ఆంగ్ల పాటతో పాటు 20 భాషల్లో పాడిన పాట సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది.

బిగ్ బీ…అదే మీ అమితాబ్ బచ్చన్ అండ్ టీం సినీ కార్మికుల సంక్షేమం కోసం వినియోగించేందుకు ‘ఫ్యామిలీ’ అనే షార్ట్ ఫిల్మ్ ని ఎవరింట్లో వారుండి నటించారు చూడండి.. అందులో సినీ స్టార్స్ అందరూ కూలింగ్ గ్లాసెస్ మర్చిపోయిన అమితాబ్ కోసం – దిల్జీత్ దొసాంజ్, రణబీర్ కపూర్, రజనీ కాంత్, చిరంజీవి, మమ్ముట్టి, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, ప్రసేన్ జిత్ ఛటర్జీ తో పాటు ఆలియాభట్, ప్రియాంక చోప్రాలు బలే బలే నటించారు. చూశావా, ఒకరినొకరు కనీసం కలుసుకోవటానికి కూడా టైమ్ లేని వారు పేద సినీ కార్మికుల కోసం ఎలా ఏకమయ్యారో… అది నా వల్లే కదా సాధ్యమైంది. నాకైతే ఆ షార్ట్ ఫిల్మ్ మల్టీస్టారర్ ఫిల్మ్‌గా అనిపించింది సుమా. ఆ తర్వాత బిగ్ బీ కుటుంబం అంతా నా బారిన పడినప్పటికీ త్వరగానే కోలుకున్నారు. మీ జనాల హీరో వర్షిప్ ఏ స్థాయికి వెళ్తుందో ప్రత్యక్షంగా చూసిన సందర్భం అది.

ఇలా ఎనెన్నో గమకాలు, జీవన గమనాలు చూస్తూ వెళ్తుంటే ఆశ్చర్యం, ఆనందం కలిగించక మానవు. వాటిని నువ్వూ తప్పక విని తీరాలి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here