ఇట్లు కరోనా-6

0
6

[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]

6

[dropcap]సం[/dropcap]గీత థెరపీ విషయానికొస్తే మనిషి స్వర యంత్రంగా పాటలు పాడుతున్నప్పుడు జరిగే ప్రకంపనల వల్ల మెదడులోని నాడీ కండరాలు ఉత్తేజభరితమై నెర్వ్ బ్లాకులు కూడా కరిగిపోయేలా స్ఫూర్తిని కలిగిస్తాయి. ఆ స్ఫూర్తితో వ్యాధుల పైన జరిగే యుద్ధంలో మనిషే విజయం సాధిస్తాడని ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ చెప్పిన మ్యూజిక్ థెరపీతో తేటతెల్లమైంది. నా విషయంలోనూ అది నూటికి నూరుపాళ్లు నిజమైంది. నా మీద వచ్చినన్ని పాటలు మరే వ్యాధిమీదా రాలేదు. చిన్ని చరణ్, ఆదేశ్ రవి, సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, స్వర్ణ – ఇలాంటి హేమా హేమీలందరూ నా పాటల్ని పాడుకున్న వాళ్ళే.

రంగుల చికిత్స గురించి నీకిక చెప్పేదేముంది. విన్సెంట్ వాంగో, లియోనార్డో డావిన్సీ, రవివర్మ – వీళ్ళంతా వాడిన కలర్స్ ఒత్తిడిని తగ్గించి ఉత్తేజాన్ని అందించాయి. హాస్పిటల్స్‌లో వాడే ఆకుపచ్చని రంగు స్ఫూర్తిని కలిగించేందుకే కదా. ఇలా కలర్స్ థెరపీతో కూడా ఎంతో మంది ఆర్టిస్టులు నన్ను ఎదుర్కొన్నారు.

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నా మీదికి ఏకంగా పంచాస్త్రాల్నే సంధించారు. పాటలతో అవగాహన కల్పిస్తూ 6 పాటల్ని కలిపి ఏకాస్త్రంగా సంధించారు. శివరంజని రాగంలో కర్ణాటక సంగీతంలో ఒక పాటని చేసి సంగీత శరాన్ని నా మీద వేశారు. జానపద శైలిలో ఒగ్గు ప్రక్రియలో వినూత్నంగా నేను విస్తరించకుండా ఉండేందుకు అవసరమైన విధానాలను ఉస్తాద్ రవి బృందం తెలియజేశారు. పద్మాలయ ఆచార్యతో హరికథ, చిందు కళాకారుడు గడ్డం సమ్మయ్య యమధర్మరాజు వేషంతో వేసిన పద్యాస్త్రం, యువదర్శకుడు ఎన్‌.ఎన్‌.జి. దర్శకత్వంలో రెండు ప్రచార చిత్రాల్ని నిర్మించారు. ఇవన్నీ ప్రజలకు అత్యంత ఇష్టమైన జానపద రీతిలో ఉండడం విశేషంగా చెప్పుకోవాలి.

నన్ను ఎదుర్కొనేందుకు హోమ్ క్వారంటైన్‌లో ఉన్న తెలుగు సినీ దిగ్గజాలు నాగార్జున, చిరంజీవి తదితరులు రూపొందించిన అవగాహనా చిత్రం విశేష ఆదరణని పొందింది. TV వాళ్ళు కూడా ఎన్నెన్నో అవగాహనా చిత్రాలు రూపొందించారు. ఎక్కడో పేపర్లో ప్రచురితమైన ఒక కవితతో స్ఫూర్తి పొందిన గాన గంధర్వుడు S.P. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అందరికీ తెలిసిందే. అడవి రాజబాబు రాసిన పాట కూడా యూ ట్యూబ్ లో బహుళ ప్రజాదరణ పొందింది.

మేయర్ సతీమణి శ్రీదేవీ రామ్మోహన్ నిర్వహణలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట ఎంత బాగా ప్రాచుర్యాన్ని సాధించిందో నేను చెప్పాల్సిన పని లేదు. అంతెందుకు ఆదేశ్ రవి వలస కూలీల వెతల మీద రూపొందించిన పాట కూడా అందరి చేతా కన్నీళ్లు పెట్టించింది. ఆ పాట మీద ఒట్టేసి చెప్తున్నా… మీ కళాకారుల పోరాటం… అవగాహన కలిగించేందుకు ప్రయత్నించిన తీరు అద్భుతం. నా మీదొచ్చిన పాటల్లో నాకు బాగా నచ్చిన పాటలు అవి. డాక్టర్లకు నీరాజనం అర్పిస్తూ దీపికా రెడ్డి గారు, వారి కూతురు శ్లోకతో కలిసి రూపొందించిన నృత్య రూపకం నా మీద అతి బలమైన అస్త్రాన్నే సంధించిందనే చెప్పాలి.

ఇవన్నీ కూడా నేను ఎంత విస్తరించాలని ప్రయత్నం చేస్తున్నకొద్దీ నన్నంతగా కట్టడి చేస్తున్న సృజనాత్మక అస్త్రాలు. మనం పోరాడాల్సింది వ్యాధితో, రోగితో కాదు – అంటూ నా మీదొచ్చిన క్యాప్షన్ కూడా నాకు బాగా నచ్చింది. మీ వాళ్ళకోసం మీ మనసు పడ్డ వేదన, చూపిన దాతృత్వం రాక్షసినైన నా హృదయాన్నే కదిలించి వేసింది. ఏ కళారూపమైనా నిద్రిస్తున్న సమాజాన్ని తట్టి లేపుతుందంటానికి మీరు చూపించిన ఈ సృజనాత్మక రీతినే సజీవ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

మనిషికుండే సహజ గుణాలు కారుణ్యం, దాతృత్వం, చేయూతలంటారు. ఈ కష్టకాలంలో సాటి మనుషుల కోసం మీరు పడ్డ తపన, చేసిన సేవ, మనసు నిండుగా అందించిన చేయూత నన్ను కదిలించి వేశాయి. పసి పిల్లల నుండి పండు ముదుసలి వరకూ తమ స్థాయిని మించి సహకారాన్ని, సహానుభూతిని అందించారు. వారిలో కొందరినైనా నేను ప్రస్తావించటం సముచితంగా ఉంటుందని భావిస్తున్నాను.

లాక్‌డౌన్ కాలంలో ఆరోగ్యం బాగోలేక ఇబ్బంది పడుతున్న తండ్రి మోహన్ పాశ్వాన్‌ని సైకిల్ మీద కూర్చొబెట్టుకొని 1200 కిలోమీటర్లని వారం రోజుల్లో అధిగమించి గుర్గావ్ నుండి బీహార్ చేరుకున్న జ్యోతి కుమారి, ఇవాంకా ట్రంప్ ప్రశంసతో పాటు, ప్రపంచ నెటిజనుల అభిమానాన్ని పొందటం ఇక్కడ ప్రస్తావించాల్సిందే.

‘దానమివ్వని వాడు ధన్యుడు కాలే’డని వేమన చెపితే, ‘దాన గుణం లేనివాడు భూమికి భార’మని శ్రీనాథుడు ఘంటాపథంగా చెప్పిన మాటని మీరిప్పటికీ ఆచరించడం నాకు ఆనందం కలిగించింది. అత్యంత ధనవంతుడికి, అతి పేదవాడికి మధ్య ఉన్న భేదం ఒక రోజుకు సరిపడా ఆకలి, ఒక గంటకు సరిపడా దాహం అన్నది ఎంతో నిజం కదా. 18 గంటల పాటు పనిచేస్తూ హరే కృష్ణ సంస్థ ద్వారా నడిచే మీ అన్నపూర్ణ క్యాంటీన్ల సంఖ్య గణనీయంగా పెరగటం, రోజూ రెండు లక్షల మందికి పైగా భోజన వితరణ జరగటం, ఇతరుల దాతృత్వంతో లక్ష మందికి అన్నదానం జరగటం ఎంతో గొప్పగా అనిపించిది నాకు. వారణాసికి చెందిన విమలా దివాన్ కు 82 ఏళ్ళు.. తాను క్యాన్సర్ వ్యాధిగ్రస్తురాలు, అయితే మాత్రం ఏంటిట అంటూ తన చుట్టూ వున్న కూలీల కోసం పెన్షన్ డబ్బుతో భోజనాలు పెడుతూ.. “క్యాన్సర్‌నే జయించాను, కరోనా నన్నేం చేస్తుంది” అంటూ సాటి మనుషుల్ని ఆదుకున్న తీరు, ధైర్యంతో నన్ను ఛాలెంజ్ చేసిన విధానం నన్ను ప్రభావితం చేసింది.

తన రెండు ఫ్లాట్స్‌ను, ఈ ఆపదలో వైద్యులకు, నర్సులకు ఉచితంగా ఇచ్చిన కలకత్తా వాసి సుచనా సాహి, ఉత్తరాఖండ్ లోని చమేలీ జిల్లా వాసి 60 ఏళ్ల దేవకీ భండారీ తాను దాచుకున్న 10లక్షల రూపాయలని PM ఫండ్‌కి విరాళంగా ఇచ్చిన ఉదారత, మిజోరంలోని ఐజ్వాల్‌లో 95 ఏళ్ల వితంతువు ఎంఝాక్ లీ యానీ తన ఒక నెల పెన్షన్ 14000 రూపాయల్ని అందిస్తూ చాటిన ధైర్యం, నీకు ముచ్చటగా అనిపిస్తున్నాయి కదూ. సింగపూర్‌లో వెల్డర్‌గా పనిచేస్తున్న సూర్యారావు చనిపోతే ఇక్కడ వీడియోలో చూస్తూ చలించిన భార్య శ్రావణిని, పిల్లల్ని ఆదుకున్న కాలనీవాసుల ఔదార్యం చూసి నేను కరిగిపోయాను. ప్రాణాల్ని అంకెల్లోకి తర్జుమా చేస్తున్న ఈ దశలో సౌదీ రాజకుటుంబంలో 150 మందికి పైగా చికిత్స చేయించుకోవడం, బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కూడా క్వారంటైన్ తో పాటు చికిత్స తీసుకోవటం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశమే కదా. ఇటలీలో 100 మంది వైద్యులు బలికావటం గురించి విన్నారు కదా. చెన్నైలో, ముంబైలో ఎంతో మంది మీడియా సిబ్బంది, బ్యాంకర్స్ నా బారిన పడలేదూ… 103 ఏళ్ళ ఆడా జానుస్సో అనే బామ్మ రోమ్‌లో ధైర్యంతో నన్ను ఎదుర్కొని డిశ్చార్జ్ అయినప్పుడూ, ఇరాన్‌కు చెందిన 103 ఏళ్ల అవ్వ ఖావర్ అహ్మదీ, కెర్మన్‌కు చెందిన శతాధిక వృద్ధుడు కోలుకోవడం, ESI కోయంబత్తూరులో 10 నెలల పిల్లాడు తన డాక్టరైన తల్లి, నానమ్మ, పని వాళ్ళతో పాటు కోలుకొని ఇంటికి వెళ్ళినప్పుడు నాకు తెల్సింది ధైర్యమే మానవాళి సహజ ఆయుధమని.. అప్పుడు అర్థం అయింది నా పతనం తథ్యం అని.

కేరళ ‘షీటాక్సీ’ మహిళలు తమ సాటి మహిళల కోసం అందించిన చేయూత, మధ్యప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ‘పల్లవి జైన్’కి కరోనా సోకినా సరే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సేవలు చేసిన విధానం, కేరళలో నజీబ్ అనే చేపలు పట్టుకొని బ్రతికే వ్యక్తి ఆటోలో వాటర్ ట్యాంకర్ పెట్టుకొని, హేండ్ వాష్ పట్ల అవగాహన కలిగిస్తూ, రసాయనాలు పిచికారీ చేస్తూ ఎంతో పరిశుభ్రతావగాహనని కలిగించిన విధానం గొప్పగా కదిలించింది. అసోం లోని జోర్హాట్ జిల్లా కలెక్టర్ రోషిణి విశాఖ వాసే..తన రెండేండ్ల కొడుకుని, 65 ఏళ్ల అమ్మానాన్నల్ని వదిలి తానొక్కతే రెండో అంతస్థులో వుంటూ విధుల్ని అంకిత భావంతో నిర్వర్తించిన తీరు గొప్పది కదా, ‘ఇప్పుడే కాదు రేపటి దేశ ఆర్థిక రంగం పునర్ వృద్ధి కోసం, మీరు ఇతరుల కోసం ఏదో ఒకటి వదులుకునే గుణాన్ని అలవాటు చేసుకోండి, నేను మధ్యాహ్న భోజనం మానేస్తున్నాను’ అంటూ మీ అందరి కోసం తొలి అడుగు వేసిన రాజస్థాన్ చూర్ జిల్లా కలెక్టర్ సందేశ్ నాయక్ ఇచ్చిన సందేశంలో వున్న బలాన్ని ఏమని చెప్పను? ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటూ ఇంకా ఎంతో మంది స్ఫూర్తిదాయక జీవితాలని నీకు మరోసారి పరిచయం చేస్తాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here