ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి -16

0
6

[box type=’note’ fontsize=’16’] శ్రీమతి ప్రమీలా రాణి ఈరంకి రచించిన ‘ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఉ[/dropcap]దయం పదకొండు గంటలయ్యాక తల్లికి చెప్పి సంహిత ఇంటికి బయలుదేరింది రవళి. ఆదిలక్ష్మికి కూతురు అక్కడికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు.

“వద్దు రవళి, అలాంటి పిల్ల నీ స్నేహితురాలంటే నిన్ను అలాగే అనుకుంటుంది లోకం” అంది.

“నిన్నటిదాకా మేము చెట్టాపట్టాలేసుకుంటే చూడలేదా ఈ లోకం. తను ఇంట్లోంచి వెళ్ళిపోయినంత మాత్రాన మా స్నేహం విడిపోయినట్టేనా. అయినా నీ మాట కాదన్నందుకు ఏమీ అనుకోకు, వెళ్ళీ వాళ్ళని చూసి వస్తాను.”

స్నేహ కూడా రవళితో బయలుదేరింది. వీళ్ళు వెళ్ళేటప్పటికి డాక్టరు గారు లోపలినుంచి వస్తూ ఎదురయ్యారు. ఆయన వెనుకే నీరజ.

“డాక్టరు గారు వచ్చారేమిటి నీరజా, ఎవరికి ఒంట్లో బాగోలేదు.”

“అక్క వెళ్ళిపోయిందని నాన్నగారు చాలా బాధపడ్డారు. ఆయనకు మైల్డ్‌గా పెరాలసిస్ వచ్చింది. అందుకే డాక్టరుగారిని పిలిచాను”

“అమ్మ ఎలా వున్నారు?”

“రా… చూద్దువుగాని”

శకుంతల గారు వీళ్ళను చూసి ఇవతలికి వచ్చింది. అందరూ ముందు వరండాలో పేము సోఫాలో కూర్చున్నారు. ఆ చివర నుంచి మాలతీమాధవం తీగ గాలికి వూగుతూ సంహిత కోసం చూస్తున్నట్టు వుంది. ఆనాడు సంహిత తెచ్చిన కుక్కపిల్ల కుక్కగా మారి సంహిత కోసం బెంగపెట్టుకున్నట్టు ముడుచుకు పడుకుంది. పెట్టిన పాలు కూడా తాగలేదు. చాలాసార్లు ఈ ఇంటికి వచ్చింది తను సంహిత కోసం. ఇప్పుడు వచ్చింది సంహిత కోసమే.

“మీ ఫ్రెండ్ చూశావా ఎంత పనిచేసిందో… దానికి మేం ఏం లోటు చేశాం చెప్పు? ఆడింది ఆటగా పాడింది పాటగా పెంచాము. అలాంటిది ఇలా చెప్పా చెయ్యకుండా వెళ్ళిపోతుంది అనుకోలేదు.”

శకుంతల ఏడవడం లేదు. తెల్లటి మనిషి, ఎర్రగా అయిపోయిన కళ్ళు, మొహం. రేగిపోయిన జుట్టు, నలిగిపోయిన బట్టలు.

“నేను ఎప్పుడైనా పిల్లల్ని అదుపులో పెట్టేదాన్ని. దెబ్బలాడేదాన్ని… ఆయన ఎన్నడూ వాళ్లని ఏమీ అనేవారు కూడా కాదు. అందులో సంహితను ఏమీ అననిచ్చేవారు కూడా కాదు. ఆడపిల్లలు మన ఇంట్లో వుండేది ఇరవై ఏళ్ళే. ఆ కొద్దికాలం వాళ్లని మందలించడం ఎందుకు అనేవారు. ఆ మాట నిజం చేస్తూ ఇరవై ఏళ్ళు రాగానే వెళ్ళిపోయింది వాడి తోటి. ఇద్దరికీ ఉద్యోగాలు లేవు, ఎలా బ్రతుకుతారు.”

“నీరజా, ఉత్తరం ఏదైనా…” అడిగింది రవళి.

నీరజ ఉత్తరం తీసుకుని వచ్చింది. అందులో ఇలా ఉంది.

“నీరజా! నేను భార్గవ్‍తో వెడుతున్నాను. ప్రస్తుతం ఎక్కడికో మాకే తెలియదు. నా బట్టలు కొన్ని పట్టుకు వెడుతున్నాను. నగలు ఏమీ తీసుకువెళ్ళడం లేదు. బీరువాలోంచి అయిదువేలు తీసుకున్నాను.

నీరజా! మిమ్మల్ని బాధపెడితే క్షమించండి. అమ్మకు, నాన్నగారికి నువ్వే ధైర్యం చెప్పాలి. రవళిని, స్నేహను నువ్వు కలిసినప్పుడు ఈ విషయం చెప్పు. అసలు మీరు ఆ ఊళ్ళో ఉండవద్దు. నీతో వైజాగ్‍కి అమ్మను, నాన్నను తీసుకునిపో… లేదా హైదరాబాద్ వెళ్ళిపొండి.

సంహిత”

రవళికి ఏడుపు వచ్చేసింది. ఆమె కళ్ళలో నీళ్ళు చూసి నీరజకు, స్నేహకు ఏడుపు వస్తోంది. రవళే తేరుకుంది. శకుంతల పక్కనే కూర్చుని…

“ఏడవకండమ్మా… మనం బాధపడితే సంహితకు మంచి జరుగదు. ఆమె బాగుండాలని భగవంతుడిని ప్రార్థిద్దాం” అంది.

“నీరజా కాఫీ అయినా తాగారా?” అడిగింది.

తను ఇంటినుంచి భోజనం తేవాల్సింది అని అనుకుంది.

“ఆ… తాగాము. పనిమనిషి వచ్చి అక్క గురించి అడిగింది. ఏదో జవాబు చెప్పాము. ఇవాళ కాకపోతే రేపైనా తెలియకుండా వుంటుందా? రవళీ, అక్క చెప్పినట్టు మేము వీలైనంత తొందరలో ఈ వూరునుంచి వెళ్ళిపోతాము. అప్పుడు చెప్పగలనో లేదో…” నీరజ ఏడ్చేసింది.

“బాధపడకు నీరజా. నా సహాయం ఏం కావాలన్నా చేస్తాను. అన్నం వండనా తిందురుగాని….”

“వద్దు రవళి తినాలని లేదు” అంది శకుంతల.

రవళి వూరుకోలేదు. దగ్గర్లో ఉన్న హోటల్‍కి వెళ్ళి టిఫిన్ తెచ్చిపెట్టింది. యాపిల్స్ కనబడితే కొని ఫ్రిజ్‍లో పెట్టింది. హ్యండ్ బ్యాగ్‍లో నుండి డబ్బులు తీస్తుంటే…. ఇవన్నీ సంహిత చేసిన అలవాట్లే. ఆమె కన్నీటి చుక్క బ్యాగ్‍లో పడింది.

రోజులు గడిచిపోతున్నాయి. నీరజ ఫోన్ చేసి వాళ్ళ అన్నయ్యను పిలిచింది. అతనిప్పుడు డాక్టర్ చందు. అతను వచ్చాక పనులన్నీ చకచకా జరిగిపోయాయి. అతన్ని ఇంట్లో పెట్టి నీరజ వైజాగ్ వెళ్ళి తన సామానులు తెచ్చుకుంది. ఇక్కడి సామానులన్నీ లారీలో వేసి హైదరాబాద్ పంపించేశారు.

సంహిత బట్టలు, వస్తువులు పనిమనిషి పిల్లలకు, పేదవారికి పంచిపెట్టేశారు. అలా ఇస్తుంటే నీరజకు, శకుంతలగారికి దుఃఖం ఆగలేదు. ఏ డ్రెస్సు కొన్నా, ఏ వస్తువు కొన్నా అందులో సంహితకు తన ముద్ర వుండాలి. గారం చేసి, పేచి పెట్టి కొనిపించుకుంది ఇవన్నీ.

“అక్క వస్తువులు నీకేమైనా కావాలా రవళీ” అడిగింది నీరజ.

“వద్దు, సంహితను అనుక్షణం గుర్తుచేసే ఈ పరిసరాలు, జ్ఞాపకాలు చాలు” అంది రవళి బాధపడుతూ.

ముకుందరావుగారు రైలు ఎక్కలేరు కాబట్టి రాజమండ్రి దాకా టాక్సీలో వెళ్ళి అక్కడినుంచి ఫ్లైట్‍లో హైదరాబాద్ చేరుకుంటారు. కారు ఇంటి ఓనరుకే అమ్మేశారు. ఇంటి తాళాలు, కారు తాళాలు ఇంటి ఓనరుకే యిచ్చారు. కారు కదిలిపోయింది.

కాళ్ళకి బండలు కట్టినట్లు కదలనంటుంటే బలవంతంగా ఇంటికి నడిచి వచ్చారు స్నేహా, రవళి.

“వచ్చారా రవళి…. వెళ్ళిపోయారా వాళ్ళు” అడిగింది ఆదిలక్ష్మి.

“వెళ్ళిపోయారమ్మా. ఇంక పార్కుకి రెండు వీధుల అవతలవున్న ఇంటికి వెళ్ళనక్కరలేదు” భోరుమంది రవళి.

***

కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకుంది రవళి. టీనేజ్‍లో ఏర్పడే స్నేహాలు, ప్రేమలు చాలా స్వచ్ఛంగా బలంగా ఉంటాయి. ఆ తర్వాత తను ఎవరితో అంత గాఢంగా స్నేహం చేయలేకపోయింది. ఇంట్లో వుంటే జ్ఞాపకాలు భరించలేక ఎం.కాంలో చేరింది తను.

నీరజ వెళ్ళిన పదిరోజులకు ఉత్తరాలు రాసింది. హైదరాబాద్‍లో కొద్దికొద్దిగా తాము సెటిల్ అవుతున్నామని. ప్రస్తుతం తండ్రి లాంగ్ లీవ్‍లో ఉన్నాడని, వి.ఆర్.యస్. తీసుకునే ఆలోచన కూడా వుందని. పిన్నిగారు బాగా ఆదుకుంటోందని. చందు వైద్యం వల్ల తల్లీ, తండ్రీ కోలుకుంటున్నారని రాసింది.

దాదాపు సంహిత వెళ్ళిన నెలరోజులు తర్వాత తన దగ్గర నుండి ఉత్తరం వచ్చింది.

“రవళీ!

ఎలా వున్నావు? నామీద కోపంతో వున్నావనుకుంటాను. నీకు చెప్పే వ్యవధి లేక యిలా వచ్చేయవలసి వచ్చింది. వచ్చిన వెంటనే నీకే ఉత్తరం రాయాలనిపించింది. కానీ యింటినుండి బయలుదేరిన వారంవరకూ మేము తిరుగుతూనే వున్నాము. మా వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారో లేదో తెలియదు. ఒకవేళ రిపోర్టు యిస్తే మేము తొందరగా దొరకకూడదని తప్పించుకు తిరిగాము. మొదట గుడిలో, తర్వాత రిజిస్టర్ ఆఫీసులో మా పెళ్ళి జరిగింది. ప్రస్తుతం తను ఒక ఫ్యాక్టరీలో మెకానిక్‍గా చేరాడు. నేను అదే ఆఫీస్‍లో క్లర్క్‌గా చేరాను.

రవళీ! నేను ఇలా భార్గవ్‍ను పెళ్ళి చేసుకోవడం మీకెవరికీ నచ్చదని నాకు తెలుసు. కాని నేను ఏ కారణాల వల్ల ఇలా చేశానో చెబుతాను విను. నన్ను మావాళ్ళు చిన్నప్పటి నుండీ గారం చేసిన మాట వాస్తవమే. వాళ్ళ పెళ్ళయిన చాలా కాలానికి నేను పుట్టానని చాలా అపురూపంగా చూసేవారు. డాడీ ఆఫీసరు కావడంతో మంచి దర్జాగా వుండేవాళ్ళం. అమ్మకు, నాన్నగారికి వాళ్ళకు ఇంత అందమైన కూతురు పుట్టిందని అందరికీ ప్రదర్శించడం ఒక సరదా. అందరూ నాకిచ్చే ఇంపార్టెన్స్ నాలో ఒక విధంగా అహంకారాన్నే పెంచింది. అందరిలో అన్నింటిలో నేనే ముందుండాలి. దానితో నాకు స్నేహితులు, అందులో మగ స్నేహితులు బాగానే వుండేవారు.

నేను చెప్పేది నా వయసు పన్నెండేళ్ళున్నప్పుడు సంగతి. ఈ ప్రపంచమంతా ఆనందమయం. అందులో బాధకి, దుఃఖానికి తావు లేదు. నేనెప్పుడూ నవ్వుతూ వుండేదాన్ని. నా చుట్టూ ప్రపంచం అలాగే వుండాలి. అప్పుడే అమ్మ నన్ను కొంచెం కంట్రోల్ చెయ్యడం మొదలుపెట్టింది. కానీ ఎందుకో ఎవరైనా వద్దూ అన్న పనే మనిషికి చెయ్యాలనిపిస్తుంది.

మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక పార్టీలో నాకు ఈ భార్గవ్ పరిచయం అయ్యాడు. అతను మా ఫ్రెండ్ లతకు కజిన్ అని తర్వాత తెలిసింది. అతను పరిచయమైన నెలకే ప్రేమ అంటూ మొదలుపెట్టాడు. నేను తమాషాకి అతనితో స్నేహం మొదలుపెట్టాను. అతనికి నేనంటే చాలా ఇష్టం. అలా అలా మా స్నేహం ప్రేమగా మారింది. అతనికి నేనంటే ఉండే ఇష్టం ముందు ఈ చిన్న చిన్న లోపాలు నాకు కనిపించలేదు.

నిజానికి మనం ఇంటర్మీడీయట్ సెకండియర్లో వుండగా లత పెళ్ళికి హైదరాబాద్ వెళ్ళాను గుర్తుందా… అప్పుడే… అప్పుడే…. అతనితో విడదీయరాని బంధం ఏర్పడింది. అర్థమైందనుకుంటాను…..”

రవళి గుండె వేగంగా కొట్టుకుంది.

“అందుకే మా అమ్మానాన్నలకు నీరజకు నీకు ఎవరికీ అతను నచ్చకపోయినా మీరు వద్దన్నా నేను అతన్నే పెళ్ళి చేసుకున్నాను. ఈ విషయాలు ఇంత వివరంగా ఎవరికీ చెప్పనవసరం లేదు. రవళీ! నేను డాడీ ఉద్యోగరీత్యా ఎన్నో వూళ్ళు చూశాను. ఎంతోమందిని చూశాను. చాలామందితో స్నేహం చేశాను. కానీ నీలా పద్ధతి, అమాయకత్వం, సిన్సియారిటీ గల మనిషిని ఎక్కడా చూడలేదు. అదీ ఆ వయసులో…. నేను ఎన్నోసార్లు మగపిల్లలతో స్నేహాల గురించి ప్రలోభపెట్టాను. అయినా నువ్వు చలించలేదు.

నువ్వంటే నాకు చాలా ఇష్టం సంహితా అని నువ్వు అనేకసార్లు అన్నావు. కానీ నువ్వంటే నాకు ప్రేమ రవళి. ఇష్టం కన్నా పైమెట్టు. నా బలహీనత అను బలం అను… నా చుట్టూ వున్న వాళ్ళు మైనపుముద్దల్లా నా మాట వింటూ నా చుట్టూ తిరగాలనుకుంటాను. కానీ నువ్వు నీ వ్యక్తిత్వం నిలబెట్టుకుంటూ నాతో స్నేహం చేశావు. ఇలా రాస్తూ వుంటే ఎంతైనా వుంటుంది. మైడియర్ ఫ్రెండ్, ఆనాడు ఇల్లు దాటి వచ్చేస్తుంటే ఒక్కసారి నిన్ను చూడాలని ప్రాణం కొట్టుకుంది. కానీ అది వచ్చే పరిస్థితి కాదు. చివరిగా ఒక్కమాట. నేను బాగానే వున్నాను. నేను ఎక్కడవున్నా నీ స్నేహ వాత్సల్యం నన్ను కాపాడుతుందని నా నమ్మకం. మళ్ళీ ఎప్పుడో యిలాగే ఉత్తరం రాస్తాను. ప్రస్తుతానికి వుంటాను. స్నేహకు నా ఆశీస్సులు.

ఎప్పటికి

నీ సంహిత.”

“అదేమిటక్కా సంహిత రాసిన ఉత్తరం చింపేస్తున్నావ్” రవళికి కాఫీ తెచ్చిన స్నేహ అడిగింది.

“ఏం లేదు స్నేహ. తన విషయాలేవో తను రాసింది. అవి అందరికీ తెలియడం ఎందుకు?”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here