జామ నిమజ్జనం

6
7

[నంద్యాల సుధామణి గారు రచించిన ‘జామ నిమజ్జనం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]స[/dropcap]రైన సమయానికే సికిందరాబాద్ స్టేషన్‌కు వచ్చిన దానాపూర్ ఎక్స్‌ప్రెస్ జనంతో కిటకిటలాడుతోంది. రిజర్వేషన్ కంపార్ట్‌మెంట్లలో రిజర్వేషన్ లేని వాళ్లు ఎక్కి బైఠాయించారు. రిజర్వేషన్ నంబరు చూపించినా లేవడం లేదు. పైగా ‘లేవం. ఏం చేసుకుంటారో చేసుకోపోండి’ అన్నట్టు ధీమాగా మాట్లాడుతున్నారు. కర్ర ఎవడిదైతే బర్రె వాడిదేనన్నట్టుగా వుంది పరిస్థితి.

“ఇది రిజర్వేషన్ క్లాస్. మేము రిజర్వ్ చేయించుకున్నాము. దయచేసి మీరు సీటు ఖాళీ చేయాలి” అని ప్రార్థనాపూర్వకంగా వేడుకున్నాడొకాయన అచ్చతెలుగులో.

“దేఖ్ భయ్యా! ఇస్ జమానేమే దోన్ హీ కిలాస్ హై. ఆద్మీయోంకా కిలాస్.. ఔర్ జాన్‌వరోంకా కిలాస్. హమ్ తో ఆద్మీహై! హమ్ కో కోయీ ఔర్ కిలాస్ మాలూమ్ నహీ!” అని తెలివి చూపాడొక బీహారీ యువకుడు.

“పంఛియోంకా కిలాస్ భీ హై.. సాంపోంకా కిలాస్ భీ హై. జో దూసరోంకా ఘోసలోంమే, ఘరోంమే, సీటోంమే ఘుస్ బైఠ్ తీ హై! ఆప్ ఉన్హోంమే కోంసా కిలాస్ కా హై?” అంటించాడు మరో హిందీ యువకుడు.. రిజర్వేషన్ చేయించుకుని, సీటు పోగొట్టుకున్నాడు పాపం!

ఇలా నాన్ ఏసీ రిజర్వేషన్ కంపార్ట్‌మెంట్లన్నింటిలో ఇదే గొడవ నడుస్తోంది. కాలుపెట్టే చోటు లేని కంపార్ట్‌మెంట్‌లో రోజున్నర పైగా ప్రయాణం ఎలాగో పాలుపోలేదు బాధిత జనాలకు. రైల్వే వాళ్లకు వీళ్ల కష్టాలు అర్థం కావా? మరిన్ని జనరల్ కంపార్ట్‌మెంట్స్ వేయవచ్చు కదా.. అందరి మనసులో మెదిలే ప్రశ్న ఇది. కానీ, జవాబు చెప్పే వాడెవడూ లేడు. హైదరాబాద్‌లో పనికోసం వచ్చే బిహారీ, ఉత్తర్ ప్రదేశ్ జనాలకు వాళ్ల ఊళ్లకెళ్లడానికి ఈ రైలొక్కటే శరణ్యం. తెలంగాణా నుంచి కాశీకి వెళ్లే ప్రయాణికులూ ఇందులోనే ప్రయాణిస్తారు.

ఎ.సి. త్రీటైర్ కంపార్ట్‌మెంట్‌లో ఈ సమస్య లేకపోవడంతో సుశీల, రామారావు పోర్టరు సాయంతో సామాన్లు చేర్చుకుని సర్దుక్కూర్చున్నారు. రామారావు తను ప్రత్యేకంగా చేతిలో పట్టుకొని, శ్రద్ధగా, భక్తిగా తెచ్చిన ఆ ప్లాస్టిక్ వైరుతో, కమలాల డిజైనుతో అల్లిన ఆ రోజారంగు సంచిని జాగ్రత్తగా సీటు కింద వెనక పక్కగా సర్ది, దాని ముందు, పక్కన ఇతర సూట్‌కేసులను, బ్యాగులను సర్ది నిశ్చింతగా కూర్చున్నాడు. సుశీల కిటికీ సీటులో కూర్చుని బయటికి చూస్తున్నది.

ఇంతలో ఎదుటి సీటులోకి, పక్కనున్న సీట్లలోకి ఓ కుటుంబం వచ్చి సామాన్లు సర్దుకొని, కూర్చుంటున్నారు. గట్టి గట్టిగా మాట్లాడుకుంటూ పెద్దవయసు భార్యాభర్తలు, వారి కొడుకు, కోడలు, ఒక చిన్న మనవడు వచ్చారు. సామాన్లన్నీ సర్దుకుంటున్నారు.

వాళ్ల సామాన్లలో అచ్చం తమ దగ్గరున్నటువంటి రోజారంగులో, కమలాల డిజైనులో అల్లిన ప్లాస్టిక్ వైరు బ్యాగు కనబడటంతో ఉలిక్కి పడి భర్త వైపు చూసింది సుశీల.

“మన సంచీ జాగ్రత్తగా వుంది కదండీ? వాళ్ల సంచీ కూడా అచ్చం మన సంచీ లాగే వుంది. చూస్తిరా?” అని ఆందోళనగా అన్నది సుశీల.

“దిగేటప్పుడు మనం జాగ్రత్తగా వుండాలండీ. ఆ సంచీ పైన మనలాగే వాళ్లు కూడా తెల్లటి టవల్ కప్పారు చూశారా?” అంది సుశీల దిగులు వ్యక్తం చేస్తూ.

“నేను సీటు కింద వెనక వైపు సర్ది పెట్టానులే! మరి ఏమీ ఫరవాలేదు. దిగేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది” అన్నాడు రామారావు భరోసా ఇస్తూ.

ఎదుటి సీటులో కూర్చున్న ఆవిడతో మాటలు కలిపింది సుశీల.

సుశీలా వాళ్లను గురించి అడిగింది ఎదురు సీటావిడ.

తాము కడప నించి వస్తున్నామనీ, అక్కడ తన భర్త జెడ్.పి. స్కూల్లో తెలుగు పండిట్‌గా పనిచేసి ఈమధ్యే రిటైరయ్యాడనీ, ఇద్దరు కొడుకులు, ఒకడు హైదరాబాదులో, మరొకడు ఢిల్లీలో వుంటాడనీ తమ వివరాలు చెప్పింది సుశీల.

ఎదురు సీటావిడ పేరు సూర్యావతి. వాళ్లు కాశీకే వెళ్తున్నారు. వాళ్లు అన్నవరం నుంచి వస్తున్నారు. వాళ్లాయన రామ శేషయ్య అన్నవరంలో పెద్ద బియ్యం వ్యాపారి. హైదరాబాదులో వాళ్ల చిన్నబ్బాయికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. అందుకే హైదరాబాద్ కొచ్చి, చిన్న కొడుకును, కోడల్ని చూసి కాశీకి బయల్దేరారట.

“కాశీకి యాత్ర చేయడానికి వెళ్తున్నారా?” అడిగింది సుశీల.

“ఆయ్.. మరేనండీ..” అన్నది సూర్యావతి.

“కాశీలో ఎక్కడ వుంటారు? రూమ్ బుక్ చేసుకున్నారా?” అడిగింది సుశీల.

“ఆయ్.. ఆ అవుసరం లేదండీ. మరేమో కాశీలో మా పెద్దమ్మాయి సత్తెభామ వుంటదండీ. అక్కడ మా యల్లుడికి ఇత్తడి వస్తువుల యాపారమండీ. మా యమ్మాయి మావగారు అక్కడ పట్టుచీరల యాపారం చేస్తారండీ. అక్కడ మా అన్నయ్యగారు వాళ్లు యెప్పుడో యాభైయేళ్ల కిందటే ఎల్లి సెటిలై పోయారండీ. కేదార్ ఘాట్‌లో లంకంత కొంపండీ ఆళ్లది. మేం పెతీ సంవత్సరం ఎల్తానే వుంటామండీ. ఈసారి అయితే మొక్కుబడి తీర్చుకోడానికి ఎల్తాన్నావండీ..” అంటూ, ఇంతలో భర్త యేదో అడిగితే అటు వైపు తిరిగింది సూర్యావతి.

‘తిరుపతికీ, ఇతర క్షేత్రాలకూ మొక్కుబళ్లుంటాయి గానీ, కాశీకి మొక్కుబడి గురించి కొత్తగా వింటున్నానేమిటబ్బా?’ ఆలోచనలో పడింది సుశీల.

ఆర్.ఏ.సీ. సీటులో కూర్చున్న సూర్యావతి గారి కొడుకు, కోడలు సంవత్సరం వయసున్న తమ కొడుకును సర్దుకోలేక యాతన పడుతున్నారు. వాడు సీటులో కూర్చోడు. ఒక్క చోట నిలవడు. అది పీకీ ఇది పీకీ, వచ్చీరాని నడకతో అటు పరిగెత్తీ, ఇటు పరిగెత్తీ నానా తిప్పలు పెడుతున్నాడు అమ్మానాన్న లిద్దరినీ.

భర్తతో మాటలు ముగించి సుశీల వైపు తిరిగింది సూర్యావతి. నల్లటి నలుపు, కొంచెం పొట్టిగా, బొద్దుగా వుంది. కానీ, కళకళలాడే మొహం, రూపాయంత బొట్టు, కళ్ల నిండుగా కాటుక, చెవులకు విసుర్రాళ్లంతటి పెద్దపెద్ద తెల్లరాళ్ల కమ్మలు, ముక్కు రెండు వైపులా పెద్దపెద్ద బేసరులతో పుష్యరాగాల ముక్కుపుడకలు, సవరం పెట్టి అల్లుకున్న జడను ముడి చుట్టుకుని, దాని చుట్టూ పూలదండ పెట్టుకుని మారువేషంలో వున్న లక్ష్మీదేవిలా వుంది సూర్యావతి. మెడలో మాత్రం నల్లపూసల గొలుసుతో సింపుల్ గా వుంది.. ‘కాశీప్రయాణం కాబట్టి బంగారం అంతా ఇంట్లోనే దాచి వచ్చి వుంటుంది..’ అనుకుంది సుశీల.

భర్తతో మాటలు ముగిశాక ఇటు తిరిగి.. సుశీలతో మాటలు మొదలుపెట్టింది.

“ఆయ్.. యావన్నారండీ.. మొక్కుబడి గురించి గదా అడిగారు. మరేం లేదండీ.. మా పెద్దాడు సత్తిబాబు పెళ్లాం.. అదే మా కోడలు చెంద్రకళకు పెళ్లయి అయిదేళ్ల యినా కడుపు పండలేదండీ. చెయ్యని నోము లేదమ్మా.. పాపం.. పిల్ల యెవరేది జెప్తే అవన్నీ జేసింది. అయినా ఫలితం రాలేదండీ..” అని కోడలి వైపు చెయ్యి చూపుతూ, ప్రేమగా చూస్తూ అన్నది సూర్యావతి.

“మరేం చేశారు? ఎలా పుట్టాడు ఈ పిల్లాడు?” ఆత్రుతగా అడిగింది సుశీల.

“అంతా ఆ కాశీఇశ్వేశ్వరుడి దయండీ. మా యాయిన వాళ్ల మేనత్త ఒకావిడి ఓ రోజు మా యింటి కొచ్చిందండీ. మా అన్నారంలో ఆళ్ల చుట్టాల పెళ్లి కొచ్చి మా యింటో దిగిందండీ. మా కోడలికి పెళ్లయి అయిదేళ్లయినా పిల్లలుట్ట లేదని ఆవిడతో చెప్పి, కళ్లనీళ్లెట్టుకున్నానండీ. అప్పుడు ఆ పిన్ని గారు నా కళ్లు తుడిచి, “ఏడవమాకు సూరీడూ! నీకు మంచి ఉపాయం నేను చెవుతా గదా! నేను చెప్పినట్టు కాశీ ఇస్వేస్వరుడికి మొక్కావంటే యాడాది తిరక్కుండా మనవణ్నెత్తు కుంటావు చూడు!” అని అసలు ఇషయం చెప్పిందండీ.

ఆవిడకు పిల్లలు పుట్టకపోతే వాళ్లత్తగారు ఆవిడినీ, వాళ్లాయన్నీ కాశీకి తీసికెళ్లి శివుడి ముందర నిలబెట్టి, ‘స్వామీ.. నా ఇల్లు పీతితో (చంటిపిల్లల మలమూత్రాలతో) అలికితే.. నీ ఇల్లు నేతితో అలుకుతా’ అని మొక్కించిందంటండీ. ఆ తర్వాత సొంవత్సరానికంతా ఆవిడకు పండంటి కొడుకు పుట్టాడట! ఆయనకు కాశీ ఇస్వేశ్వరుడని పేరు పెట్టుకుందంట.

“ఆ పైన కొన్నాళ్లకు కాశీకి వెళ్లి, స్వామికి బిడ్డను సూపించి, “సామీ! నీకు మొక్కుకున్నందుకు నా ఇల్లు చంటిపిల్లాడి మలమూత్రాలతో అలికించావు. మరి నీ ఇంటిని నేను నేతితో అలకాలని వచ్చానయ్యా” అని చెప్పుకొని, శివలింగం పైన నెయ్యి పోసి, గుడిలోపల కొద్దిగా నెయ్యితో అలికి, తిరిగి అదంతా కుంకుడు రసంతో రుద్ది, శుభ్రం చేసి, విశ్వనాథునికి అభిషేకం చేయించి, మొక్కు తీర్చుకుందంటండీ. మా కోడలినీ అలాగే సెయ్యమన్నదండీ.. అలా రెండేళ్ల కింద మొక్కించామండీ. అదుగో అలా వుట్టాడండీ..ఆ దొంగ సచ్చినాడు.. సూడండీ..యెలా గోల చేసేస్తావున్నాడో..అదిగో ఆడి మొక్కు తీర్చుకోడానికే ఎల్తన్నా మండీ” మనవడి వైపు మురిపెంగా చూస్తూ కిలకిల నవ్వింది సూర్యావతి.

ఇలాంటి మొక్కు గురించి ఎప్పుడూ వినని సుశీల ఆశ్చర్యంగా చూస్తూ వుండిపోయింది.

“అవునూ.. అమ్మాయిని కాశీకి ఎలా ఇచ్చారమ్మా? అంత దూరాభారం పిల్లనెలా పంపావు?” అని అడిగింది సుశీల.

“ఇవ్వకేం చేస్తావండీ.. ఛస్తామా? మేనరికం అయిపాయే! ‘సత్తెభామ పుట్టినప్పుడే.. అది నా కోడలయి పోయింది. అది నా హక్కు. కాదని ఎవడంటాడో అనమను. ముందు ఆడి కాళ్లిరగ్గొట్టి, ఆ పైన లగ్గాలు పెట్టిస్తాను’ అని మొండికేసిందండీ మా యాడబడుచు. అయినా దూరం అన్నమాటే తప్ప వొద్దన డానికేమీ లేదండీ.. బాగా వున్నోళ్లు. మా అన్నయ్యగారు బోల్డు సంపాయించారు. అల్లుడు గారు కూడా చాలా తెలివైన వోడండీ.. మా పిల్లను బంగారంలా చూసుకుంటున్నారండీ. పెళ్లయిన కాణ్నుంచీ ఆళ్లన్నా యాడాదికో రెండు సార్లు వొస్తారండీ.. ఆళ్లక్కుదరకపోతే మేవైనా రైలెక్కేస్తావండీ.. మా కోమటాయనకి కూతురంటే మా గారం లెండి! అలా చాలాసార్లు ఎల్లావండీ.. ఉత్తరదేశమంతా చూసేశాం లెండి!” అంటూ కళ్లూ చేతులూ తిప్పుతూ చెప్పింది సూర్యావతి.

“మీరూ యాత్ర కోసమేనాండీ కాశీకి ఎల్తుంట? ఎక్కడ దిగుతున్నారేంటి?” ఆరా తీసింది సూర్యావతి.

“మా అత్తగారు రెణ్నెల్ల కిందట కాలం చేశారండీ.. ఆవిడ అస్థికలు నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాం. అక్కడ శృంగేరీమఠంలో రూమ్ బుక్ చేశారు మావారు” అంది సుశీల భర్త వైపు చూస్తూ.

“అయ్ బాబోయ్! ఆ అస్థికలూ అవీ రైల్లోకి అట్టుకొచ్చేశారాండీ.. పిల్లలు పాపలున్నచోట ఇలా తెచ్చేస్తే ఎలాగండీ? యేదైనా తేడా చేస్తే ఎలాగండీ బాబూ!” చేతులు నలుపుతూ కంగారు పడిపోయింది సూర్యావతి.

“అలాంటి భయాలు యేవీ పెట్టుకోవద్దు సూర్యావతిగారు! మా అత్తగారు మహా భక్తురాలు. తొంభైయ్యేళ్లు బతికి తృప్తిగా దాటుకున్నారు. ఆవిడ వల్ల ఎవరికైనా ఆశీర్వచనమే గానీ, భయాలేమీ వుండవండీ!” సుశీల నెమ్మదైన స్వరంతో అనునయంగా చెప్పింది. అయినా శాంతించలేదు సూర్యావతి.

“అయ్ బాబోయ్! అయ్ బాబోయ్! అయ్ బాబోయ్! చూశారా? ఇటు సూడండీ.. ఆళ్లతో మళ్లా మాట్టాడొచ్చు. అస్థికలట్టుకొచ్చార్ట ఈళ్లు.. అయినా రైల్లోకి అలాంటివి అట్టుకు రావొచ్చా? అయినా ఆళ్లతో గొడవెందుకు గానీ, మనకు పక్కనే మైనా వేరే సీట్లు దొరుకుతాయేమో సూడండి! ఎల్లిపోదాం! అస్థికలున్నచోట పిల్లాణ్ని పెట్టుకుని ఎలావుంటామేటి?” అని భర్త భుజం మీద గట్టిగా తడుతూ చెప్పింది సూర్యావతి, ఆందోళన నిండిన మొహంతో. ఆయన ముఖంలోనూ రంగులు మారాయి. అయినా తమాయించుకున్నాడు.

“పిచ్చమొఖమా! మరి పక్క కంపార్ట్‌మెంటు లోకి మారినా అక్కడ మాత్రం అస్థికలుండవని నీకేమైనా తెలుసుద్దా? కాశీ కెళ్లే వాళ్లు ఇలాంటి పనుల మీదే ఎల్తారు మరి! అసలు కాశీయే మహా శ్మశానమట! శ్మశానానికెళ్తా అస్థికలకు బయపడటం దేనికి? పిచ్చపిచ్చ బయాలు పెట్టుకోమాక! అయినా నీకు ఎక్కడబడితే అక్కడ సీట్లియ్యడానికి ఇదేమైనా మీ బాబు యేపించిన సొంత రైలను కుంటున్నావేంటే సూరీడూ? పక్క బోగీల్లో సీట్లు దొరక్క తన్నుకుంటున్నారు తెలుసా? పంతులుగారూ, ఆయమ్మా మంచి మనుషుల్లాగా వున్నారు. ఆయమ్మతో మాట్లాడి మంచి మంచి ఇసయాలు దెలుసుకో!” మందలింపుతో సముదాయింపును కలగలిపాడు శేషయ్య.

కానీ, సూర్యావతికి మనసులో బెంగగానే వుంది. సుశీలకు ఈ వ్యవహారంతో మనసు చివుక్కుమన్నది. కిటికీలోనించి బయటకు చూస్తూ కూర్చుంది.

మధ్యాహ్నమయింది. అందరూ తమతో తెచ్చుకున్న భోజనాలు తిని, బాక్సులు కడుక్కోని, మధ్య సీటు వాల్చి, నిద్రకు ఉపక్రమించారు.

ఓ గంటసేపు పడుకుని లేచి, బెర్తు వాల్చేసి, చాయ్ వాలా తెచ్చిన చాయ్ తాగేశారు రామారావు, సుశీల. తర్వాత చెరో పుస్తకం తీసుకుని రామారావు రామకోటి, సుశీల శివకోటి రాయడం మొదలుపెట్టారు.

సాయంత్రం అయింది. రామారావు గారు పంచె, టవలూ, ఓ ప్లాస్టిక్ మగ్గూ వగైరా తీసుకుని వెళ్లి స్నానం చేసి వచ్చారు. సంచీలోనుంచి సంధ్యావందనం సామగ్రి అంతా బయటకు తీసి, వేరుగా రాగిసీసాలో తెచ్చుకున్న నీళ్లతో తన సీటులోనే కూర్చుని సంధ్య వార్చేసుకున్నాడాయన.

ఎదురు సీటులో కూర్చున్న శేషయ్య ఆశ్చర్యపోతూ.. “అయ్ బాబోయ్! పంతులుగారూ! రైల్లో కూడా సంధ్య వారుస్తున్నారటండీ.. నేనైతే సంధ్య మర్చిపోయి చాలాకాలం అయిందనుకోండి. మా అయ్య కాలమై పోయాక మానేసినట్టే అనుకోండి!” అన్నాడు.

“అలా మానేస్తే ఎట్లాగయ్యా! ఎంత మంచి వ్యవస్థలో పుట్టారు మీరు? మీ కోమట్లు చేసిన దానధర్మాలు, భక్తిప్రపత్తులు, సామాజికసేవ ఎవరు చేసినారు గనుక! పార్వతీదేవి వాసవిగా మీ ఇళ్లలోనే పుట్టింది కదండీ. ఆమే, గాయత్రీదేవీ వేరువేరా? ఎట్టి పరిస్థితుల్లోనూ సంధ్య మానకూడదు నాయనా!” అన్నాడు రామారావు.

తర్వాత సంధ్యావందనం గొప్పదనం గురించి చాలాసేపు రామ శేషయ్యకు చెప్పాడు రామారావు. సత్తిబాబూ కూర్చుని విన్నాడు.

“అయ్ బాబోయ్! ఇంత గొప్పదనం ఈ సంధ్య వార్చడంలో వుందని నాకు తెలవదండీ. గతంలో విన్నాను గానీ, మమనసుకు పట్టలేదండీ. మీరు చెప్తే మనసుకు హత్తుకుపోయిందండీ. కాశీ కెళ్లాక మొదలెట్టేస్తానండీ! అసలు మా ఊళ్లో అమ్మవారి శాలలో మా కులస్థులందరినీ పిలిచి, మీ చేత అందరికీ సంధ్యావందనం గురించి చెప్పించాలని వుందండీ.. మీరు తప్పక రావాలండీ..” రామారావు చేతులు పట్టుకుంటూ అన్నాడు శేషయ్య.

“మీరు పిలుస్తే రావాలనే వుంది గానీ, నేను దీనికోసం అంతదూరం రావడం ఎందుకయ్యా! మీ వూళ్లో ఒక మంచి బ్రాహ్మణ్ని పిలిచి, చెప్పమంటే చెబుతాడు” అన్నాడు రామారావు శేషయ్య చేతుల్ని అభిమానంగా నొక్కి వదిలేస్తూ.

సూర్యావతి, చంద్రకళ పిల్లాడికి యేదో తినిపించడంలో మునిగిపోయారు.

“రోజూ సాయంత్రం భజన చెయ్యడం మాకు అలవాటండీ. మేం భజన చేస్తే మీకు ఇబ్బందేం లేదు కదా?” అని శేషయ్యతో అన్నాడు రామారావు.

“అబ్బే! అదేం మాటండీ.. మేవూ వింటామండీ.. పాడండీ.. మా యావిడి గూడా భజన అంటే చెవికోసుకుంటదండీ..” అన్నాడు శేషయ్య ఉత్సాహం చూపుతూ.

సూట్‌కేస్‌లో నుంచి కీబోర్డ్, కంజీర బయటికి తీసింది సుశీల. ఆమె కీబోర్డ్ వాయిస్తూ వుంది. ఆయన కంజీర మోగిస్తూన్నాడు. ఇద్దరూ కలిసి భజనలు పాడుతున్నారు. ఆ రైలు బోగీ వాతావరణమే మారి పోయింది. పక్క కంపార్ట్‌మెంట్ లలో వుండే వాళ్లు కొందరు వచ్చి, సీట్లలో సర్దుకుని కూర్చుని, మరికొందరు నిల్చునీ, తామూ గొంతు కలిపి పాడారు. చప్పట్లు చరిచారు. పక్క కంపార్ట్‌మెంట్‌లో వుండే మిలటరీ జవాన్లలో ఒకతను పాటలకు అనుగుణంగా నాట్యం చేయసాగాడు. మరి కొందరు అతన్ని అనుసరించారు. “జయపాండురంగ హరే విఠలా..” అని పాడుతుంటే.. పదేపదే అదే భజన కావాలని అడిగి పాడించుకున్నారు. సుశీల గాత్రమాధుర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు.

ఇక సూర్యావతి అయితే సుశీల చేతులు పట్టుకుని కళ్లకద్దుకుంది. “ఎంత బాగా పాడారు ఒదిన గారూ!” అని వరుస కూడా కలిపింది.. అస్థికల మాట మరిచిపోయి.

మరుసటి రోజు పొద్దున కూడా రామారావు స్నానం, సంధ్య యథావిధిగా పూర్తిచేశాడు. శేషయ్య, సూర్యావతి మళ్లీ రామారావు, సుశీల చేత భజనలు పాడించుకుని ఫోన్‌లో రికార్డు చేయించుకున్నారు.

శేషయ్యా, రామారావు గాఢ స్నేహితులయిపోయారు. రామారావును ‘గురువుగారు’ అని ఓసారీ, ‘పంతులుగారూ’ అని ఓసారీ పిలవడం మొదలుపెట్టాడు శేషయ్య. తన వ్యాపారం, లాభనష్టాలూ అన్నింటి గురించీ చెప్పాడు రామారావుకు. రామారావు అతని ఇంటి వాస్తు, దుకాణం వాస్తు అన్నీ తెలుసుకుని, ఎక్కడెక్కడ.. ఏయే మార్పులు, చేర్పులు చెయ్యాలో పేపర్ మీద గీసి చూపించాడు రామారావు.

అతని చెయ్యి చూసి సాముద్రికం చెప్పాడు. ఆయన చెప్పినవన్నీ నిజమేనని ఒప్పుకున్నాడు రామశేషయ్య.

సూర్యావతి చెయ్యి చూసి, “ఈ అమ్మాయిని పెళ్లాడావు చూస్తివా.. అక్కడయ్యా.. మీకు అదృష్టం కలిసి వొచ్చింది. ఈ చెయ్యి ఎందులో పెడితే అక్కడ లక్ష్మి తాండవమాడు తుంటుందయ్యా! ఈవిడకు చెప్పకుండా నువ్వే పనీ చెయ్యకు! అమ్మాయిని నొప్పించకు” అని చెప్పాడు రామారావు.

“అలా చెప్పండి అన్నయ్యగారూ! అలా గడ్డెట్టండి ఈయినికి. ఓ… తనకే అన్నీ తెలుసనుకుంటాడు.. నా మాట ఓక్కటి పడనీయడండీ..” భర్త పైకి దండెత్తింది సూర్యావతి.

నవ్వుతూ “తగ్గూ తగ్గూ..” అన్నాడు శేషయ్య.

ఇది చూసి పక్క కంపార్ట్‌మెంట్ వాళ్లందరూ ఒక్కొక్కరుగా వచ్చి చెయ్యి చూపించుకున్నారు. పండిట్ జీ.. మాతాజీ అని గౌరవిస్తూ, అందరూ దండాలు పెట్టి వెళ్లారు రామారావుకూ, సుశీలకూ.

తాము కాశీనుంచి వచ్చాక రామారావు దంపతులిద్దరూ తప్పక అన్నవరం రావాలనీ, తమ ఆతిథ్యం స్వీకరించాలనీ కోరాడు రామ శేషయ్య.

అలాగే వాళ్లు తిరుపతికి వచ్చిన ప్పుడల్లా కడపలో దిగి, తమ ఇంట్లో నాలుగు రోజులుండి పోవాలని రామారావు శేషయ్యను కోరాడు. ఇద్దరూ సరేనంటే సరేననుకున్నారు.

ఫోన్ నంబర్లు, అడ్రసులు ఫోన్ లలో నోట్ చేసుకున్నారు.

సుశీల, సూర్యావతి కూడా ప్రాణ స్నేహితురాళ్లలా మారిపోయారు.

“కాశీలో కేదార్‌ఘాట్‌లో కేదారేశ్వరస్వామి గుడి వుంది కదండీ. అక్కడికి ఎడం వైపు ఆరో దుకాణం మా యల్లుడిదండీ. ఆ ఎనక మూడో ఈదిలో మా యమ్మాయ్ గారిల్లండీ. మీరు, అన్నయ్యగారూ తప్పక రావాలండీ.. దుకాణం కాడి కొస్తే పనోళ్లతో ఇంటికి పంపిస్తాడండీ మా యల్లుడు. మా యల్లుడి పేరు రాంకృష్ణండి. దుకాణం మీద ఈరభద్రస్వామి పేరుంటదండీ. అసల ‘తెలుగు సేఠ్‌జీ’, ‘కిట్టూ సేఠ్‍జీ’ అంటే ఆ చుట్టుపక్కల అందరికీ ఫేమసండీ..” అల్లుడి గురించి గర్వంగా చెబుతూ సుశీలను ఆహ్వానించింది సూర్యావతి.

“తప్పక వస్తాం సూర్యావతిగారూ! దూరదేశంలో మనవాళ్లెవరైనా వుండటం అదృష్టం కదమ్మా!” అంది సుశీల.

ఆ రోజు రైలు రెండుమూడు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఆడవాళ్లిద్దరూ వంటలూ వార్పులూ గురించి మాట్లాడుకున్నారు. తాను ఆవకాయ ఎలా పెట్టేదీ, ఆవకాయ లోకి వెల్లుల్లి రేకల్ని చిన్నచిన్న దండలుగా గుచ్చి ఎలా ఊరవేసేదీ, ఆ వెల్లుల్లిపాయల కోసం పిల్లలు ఎలా గొడవపడేదీ వివరించింది సూర్యావతి.

తాను పెద్ద పెద్ద భక్ష్యాలు ఎలా చేస్తుందో, చారుపొడి, సాంబారు పొడీ ఎలా చేస్తుందో వివరించింది సుశీల.

వ్రతాలూ, పెళ్లిళ్లూ, పద్ధతులూ, పేరంటాలూ వగైరా మీద నడిచింది మాటామంతీ. తాను, తన అత్తగారు, తోడికోడళ్లూ అందరూ శ్రావణ మంగళవారం, శుక్రవారం పేరంటాలకు వెండి క్యారేజీలు తీసుకుని ఎలా వెళ్తారో, ఒక్కో క్యారేజీలో తాంబూలాల్లో ఇచ్చిన సెనగలు, చలిమిడీ కలిసిపోకుండా విడివిడిగా ఎలా ఇంటికి తెచ్చుకుంటారో వివరించింది సూర్యావతి.

ఆపైన గవ్వలాట ప్రసక్తి వచ్చింది. తాను, అత్తగారు, తోడికోడళ్లతో, ఆడబడుచులతో ఎలా గవ్వలాట ఆడేదో, ఎవరైనా మోసంతో తనను ఓడిస్తే ఎలా వీథులెక్కి పోట్లాడేదో వివరించింది సూర్యావతి. ఆశ్చర్యంతో వింటూ వుండిపోయింది సుశీల.

చివరికి వారి నిరీక్షణ ఫలించి కాశీ స్టేషను రానేవచ్చింది.

రైలు ఆగీ ఆగకుండానే కాశీ నుంచి పాట్నా, దానాపూర్ వెళ్లేవాళ్లు రైలును చుట్టుముట్టేశారు. అన్ని బోగీల్లోకీ ఎక్కేశారు. ఏసీ కంపార్ట్‌మెంట్లను కూడా వదలలేదు. దిగేవాళ్లను దిగనీయకుండా దిగ్బంధనం చేసేశారు.

పక్క కంపార్టుమెంటులోని మిలటరీ జవాన్లు జనాన్ని పక్కకు నెట్టి ఈ రెండు కుటుంబాలనూ, పక్కనున్న మరికొందరినీ కిందికి దింపారు.

పాపం.. సామాన్లన్నీ వాళ్లే దించారు. రామారావు శేషయ్యకు నమస్కారం చెప్పి, మళ్లీ కాశీలో కలుద్దామని చెప్పాడు. శేషయ్యా ఆదరంగా సెలవు తీసుకున్నాడు. సుశీలా, సూర్యావతీ నవ్వుతూ వీడ్కోలు తీసుకున్నారు.

శేషయ్య కుటుంబాన్ని తీసికెళ్లడానికి వాళ్ల అల్లుడు పంపిన మనుషులొచ్చారు.

అప్పటికే చీకటి పడుతోంది. రామారావు, సుశీల సామాను సరిచూసుకుని ఆటో మాట్లాడుకుని శృంగేరీ శంకర మఠానికి చేరుకున్నారు. అక్కడ అంతా జనం కిటకిటలాడుతున్నారు.

శృంగేరిస్వామివారి తరఫున అక్కడేదో కార్యక్రమం అనుకోకుండా యేర్పాటు కావడంతో శృంగేరి నుంచి చాలామంది వచ్చారనీ, కాబట్టి ఇక్కడ గది ఇవ్వలేమనీ చెప్పారు అక్కడి నిర్వాహకులు. కావాలంటే అక్కడికి కాస్త దూరంలోని మరో మఠంలో గది యేర్పాటు చేస్తామని, అసౌకర్యానికి చింతిస్తున్నామనీ వాపోయారు.

ఆ గదికి చేరుకుని, స్నానాలు చేసి, దొరికిందేదో తినేసి ఆ రోజుకు విశ్రాంతి తీసుకున్నారు ఆ దంపతులు.

పొద్దున్నే లేచి, అక్కడున్న తెలుగు పురోహితులను మాట్లాడుకుని, ఆ రోజే అస్థినిమజ్జనం చేసే యేర్పాటు చేసుకున్నాడు రామారావు.

గంగ ఒడ్డున ఒక చోట కూర్చోబెట్టి, యేర్పాట్లన్నీ చేసుకున్నాడు పురోహితుడు.

“అయ్యా! అస్థికలు, చితాభస్మం బయటికి తీయండి..” అని మంత్రాలు చెప్పడంలో మునిగి పోయాడు పురోహితుడు.

రామారావు రోజారంగు కమలాల డిజైనున్న సంచీని దగ్గరికి లాగి, పైనున్న తెల్లటి టవల్ తీసేసరికి గుప్పున జామపండ్ల వాసన తగిలింది. తొంగిచూస్తే దానిలో తన తల్లి అస్థికల బదులు పెద్ద పెద్ద జామపళ్లున్నాయి. సుశీల కూడా ఆశ్చర్యపోయింది. ఆమెకు ఎంత అదుపు చేసుకుందామన్నా సాధ్యం కాని నవ్వు వచ్చింది. రామారావూ ఫక్కున నవ్వేశాడు.

తను సర్దుకుని,

“అయ్యో! అట్లా నవ్వుతావేంటి సుశీలా! ఎంత పొరబాటయింది మన వల్ల! శేషయ్యా వాళ్ల సంచీ మనకొచ్చింది. కానీ, పాపం.. వాళ్లకు మన అస్థికలు వెళ్లాయి. ఎంత భయపడిపోయి వుంటారు పాపం? ముందు ఫోన్ చేస్తానుండు” అని ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవడం లేదు. స్విఛాఫ్ అయినట్టు తెలుస్తోంది.

పురోహితుడు విషయం తెలుసు కుని, “వాళ్లు కేదార్‌ఘాట్ లోనే కదా వుంటారన్నారు. పక్కనే లెండి. నేనూ వస్తాను పదండి. వెళ్లి అస్థికలు తెచ్చుకుందాం!” అన్నాడు.

“అమ్మా! మీరు ఇక్కడే కూర్చోండి. అరగంటలో వచ్చేస్తాం!” అని ఇద్దరూ వెళ్లారు.

శేషయ్య చెప్పిన గుర్తులతో వాళ్ల అల్లుడి దుకాణాన్ని గుర్తుపట్టారు. కానీ, దుకాణం మూసేసివుంది. చుట్టుపక్కల వున్న దుకాణా దారులను అడిగితే.. “షాప్‌ను రీమాడల్ చేస్తున్నారనీ, ఇప్పుడు నారదఘాట్‌కు వాళ్ల దుకాణం మార్చారనీ” చెప్పారు. ఇల్లు గురించి అడిగితే ఎవరూ చెప్పలేక పోయారు.

ఇంటికోసం కేదార్‌ఘాట్ మొత్తం గాలించారు. కానీ, ఇల్లు వాళ్లకు దొరకలేదు.

నారదఘాట్‌లో దుకాణం జాడా తెలియలేదు. కాళ్లీడ్చుకుంటూ రెండుగంటల సేపటి తర్వాత వచ్చారిద్దరూ.

ఇప్పుడు యేం చెయ్యాలా.. అని తర్జనభర్జనలు పడింతర్వాత పురోహితుడు ప్రత్యామ్నాయంగా ‘నారాయణబలి’ చేయిస్తాననీ, అస్థికలు దొరకనివాళ్లకు చేయించే క్రతువు ఇప్పుడు జరగనిమ్మనీ, అస్థికలు దొరికితే మళ్లీ ఆ ప్రక్రియ అంతా తాను డబ్బుతీసుకోకుండా జరిపిస్తాననీ రామారావును ఒప్పించాడు. కార్యక్రమం జరిగి పోయింది. ఇప్పుడీ జామకాయలను యేం చెయ్యాలనే ప్రసక్తి వచ్చింది.

“గంగార్పణం చేసెయ్యండి. మళ్లీ గదికేం తీసుకెళ్తారు? అస్థికలనుకుని తెచ్చినవాటిని ఎలా తినగలుగుతారు?” అని సలహా ఇచ్చాడు పురోహితుడు.

జామకాయలన్నింటినీ భక్తిగా గంగమ్మలో జారవిడిచాడు రామారావు.

“మా సత్తెభామ కిష్టమని మా తోటలో కాసిన జాంకాయలు అట్టు కెళ్తున్నామండీ..” అని సూర్యావతి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి సుశీలకు.

గదికి చేరుకున్నారిద్దరూ.

కాశీలో వున్నన్ని రోజులూ రోజూ పొద్దునా సాయంత్రం కేదార్‌ఘాట్ అంతా తిరిగి వెతుకుతూనే వున్నారు. కానీ, శేషయ్యవాళ్ల జాడ కనిపెట్టలేకపోయారు సుశీలా రామారావు.

తిరిగి వారం రోజుల తర్వాత హైదరాబాద్‌కు వెళ్లి, అక్కడి నుంచి కడపకు చేరుకున్నారు. రామారావుకు లోలోపల తన అమ్మ అస్థికలు యేమైవుంటాయోనని దిగులుపడుతూనే వున్నాడు. తన తల్లి.. పరమ శివభక్తురాలు.. ఆమె అస్థికలను గంగలో నిమజ్జనం చెయ్యలేకపోయానే.. అని దిగులు పడసాగాడు. వచ్చినవాళ్లందరితోటీ.. ‘జామకాయలను నిమజ్జనం చేశాం’ అని హాస్యంగా చెబుతున్నా లోలోపల శేషయ్య కుటుంబం ఆ అస్థికలను ఏం చేసివుంటారో.. యే చెత్తకుండీ లోనో పడేసివుండరు కదా.. అని బెంగటిల్లుతున్నాడు రామారావు.

నెలరోజుల తర్వాత యేదో పని వుండి తను పనిజేసిన స్కూలుకు వెళ్లాడు రామారావు.

“అయ్యా! మీకేదో జాబు వచ్చిందండీ. వారమైంది. పంపుదామని మరిచేపోయాను” అంటూ ఓ ఉత్తరాన్ని చేతిలో పెట్టాడు హెడ్ మాస్టరు.

అది శేషయ్య కాశీ నుంచి రాసిన జాబు. ఆత్రంగా చదివాడు రామారావు.

రామారావు గురువుగారండీ!

నమస్కారాలండీ! మనం రైలు దిగేటప్పుడు బ్యాగులు తారుమారైనాయి కదండీ. ఇంటికెళ్లాక చూసుకుంటే విషయం అర్థమైందండీ. మా యావిడ లబోదిబోమంది. నేను, మా బావగారూ జాగ్రత్తగా ఆ సంచీని తీసి దాచామండీ. ఫోన్ చేసి మీతో చెబ్దామని చూస్తును గదా.. ఫోన్ లేదు. రైల్లోనించి దిగేటప్పుడు ఎవరో కొట్టేశారని అర్థమైంది.

మీరు శృంగేరీ శంకరమఠంలో గది బుక్ చేసుకున్నారన్న విషయం గుర్తొచ్చి, మరుసటి రోజు పొద్దున్నే మఠానికొచ్చి వాకబు చేస్తే ‘ఇక్కడ ఆ పేరుగలవాళ్లెవళ్లూ రూము తీసుకోలేద’న్నారండీ. అక్కడికీ మా బావగారు ఆ చుట్టుపక్కలనున్న సత్రాలన్నింటిలో వాకబు చేస్తే.. ఎక్కడా మీ జాడే దొరకలేదు.

‘సరేలే.. మా అల్లుడి దుకాణం గుర్తులు మీకు తెలుసుగదా.. మీరు తెలుసుకుని వచ్చేస్తార్లే’ అనుకున్నానండీ.

అప్పుడు చెప్పాడండీ మా బావగారు ‘దుకాణంలో రిపేరీలు, మార్పులు చేయించడానికని, దుకాణాన్ని నారదఘాట్ కు మార్చారని.

అయ్యో! ఈ అవకాశం కూడా పోయిందేనని బాధపడ్డాను. గంగ ఒడ్డునా, దేవాలయంలో.. ఎక్కడి కెళ్లినా మీ కోసం వెతుకుతూనే వున్నాము. వారం రోజులయ్యాక, ఇక మీరు కడపకు వెళ్లిపోయి వుంటారనుకున్నానండీ.

మా బావగారితో మాట్లాడి, ఓ బ్రాహ్మలబ్బాయిని మీ అమ్మగారి అస్థినిమజ్జనానికి కర్తగా కుదుర్చుకుని, ఓ పురోహితుడి చేత యథావిధిగా కార్యక్రమం చేయించా మండీ.

ఇప్పుడు దానికి ఖర్చులు ఎంత య్యాయో, ఆ డబ్బు నాకెలా అందజెయ్యాలో అని ఆలోచించ బోకండి.

ఆవిడి మీకు తల్లి అయితే, నాకూ తల్లేనండి. మరో మాట మాట్టాడకండి మరి! నాకు ఆ మహాతల్లికి సేవజేసే అవకాశం వచ్చిందను కుంటాను. ఏ జన్మలోనో ఆవిడి బిడ్డనయ్యుంటానండి. ఋణానుబంధం చూడండి.. ఎంత చిత్రమో!

మీకు ఇప్పుడు మనసు స్తిమితపడి వుంటదని అనుకుంటున్నాను. మీరు కడపలో జెడ్.పి. స్కూల్లో పనిజేశానని చెప్పారు కదండీ. మీకు ఎలాగైనా ఈ ఉత్తరం చేరుతుందని అనుకుని, ఆ యడ్రసుకు రాస్తున్నానండీ. చిన్నవూరే కాబట్టి స్కూలువాళ్లు మీకు ఈ ఉత్తరం చేరుస్తారని అనుకున్నానండీ.

అడ్రసులు, ఫోన్ నంబర్లూ అన్నీ ఉత్తరంలో ఇచ్చానండీ. మా యావిడ మీకు దండాలు చెప్ప మన్నదండీ..

సెలవండీ పంతులుగారూ!

భవదీయుడు

సముద్రాల రామ శేషయ్య వ్రాలు.

జాబు చదవడం పూర్తయ్యేసరికి మనసు దూదిపింజలా తేలికైంది రామారావుకు. రామ శేషయ్య మంచితనం, కేవలం రైల్లో అయిన పరిచయంతో అంత ఖర్చుపెట్టి మనిషిని పెట్టి, తన తల్లికి అస్థినిమజ్జనం చేయించడం, పైగా దానికయిన డబ్బు తాను తిరిగి తీసుకోనని చెప్పడం, తానూ ఆవిడకు కొడుకులాంటి వాడినేనని చెప్పడం ఎంత విశేషం! ఎంత మంచి సంస్కారం! ఇలాంటి మంచిమనిషి తనకు పరిచయం కావడం కేవలం తన అదృష్టమే ననుకున్నాడు. ‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా..’ అని ఇలాంటివారి గురించే చెప్పి వుంటారనిపించింది. వాళ్లు తమతో పరిచయాన్ని తేలిగ్గా తీసుకుని అస్థికలను యే చెత్తకుండీలోనో పడేసి వుండవచ్చు. కానీ, ఎంత చక్కగా సమస్యను పరిష్కరించాడు? మనస్ఫూర్తిగా రామశేషయ్యను, ఆయన కుటుంబాన్నీ ఆశీర్వదించాడు రామారావు.

ఇంటికెళ్లి నిదానంగా ఫోన్ చెయ్యాలని అనుకున్నాడు. అమ్మకు జరగవలసినవి అన్నీ సక్రమంగానే జరిగాయన్న నిశ్చింతతో ఇంటివైపు నడిచాడు రామారావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here