[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘జాతీయ వృక్షం మర్రిచెట్టు’ అనే రచనని అందిస్తున్నాము.]
[dropcap]“జు[/dropcap]ట్టు జడలు కట్టి యుండు
కానీ సన్యాసి కాదు
ఎర్రెర్రెని పిల్లలుందు
కానీ మనిషి కాదు”
అంటూ పొడుపు కథ అడిగితే ‘మర్రిచెట్టు’ అనే సమాధానం వస్తుంది.
చల్లని చెరువులు, ఆ చెరువుల గట్లపై శాఖోపశాఖలుగా విస్తరించిన మర్రిచెట్లు. ఆ చెట్లనిండా వందలాది భారతదేశ పల్లెటూళ్ళలోని అందమైన దృశ్యాలు.
హిందువులు – ఈ చెట్టును పవిత్రమై చెట్టుగా భావిస్తారు. అంతేకాదు మర్రిచెట్టు మన జాతీయ వృక్షం కూడా! మర్రిచెట్టు విత్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ మహావృక్షాలుగా పెరుగుతాయి. మర్రికాయలు ఎర్రగా చిన్నవిగా చెట్టునిండా ఉంటాయి. మర్రికాయలు మృదువుగా పియర్ ఆకారంలో అసంఖ్యాక విత్తనాలతో నిండి ఉంటాయి. కాయలోని గుజ్జు తియ్యగా ఉండటం వలన వీటిని తింటారు. చెట్టు ఎంత పెద్దదో కాయలు అంత చిన్నవి. వీటి వేర్లు భూమిపైకే కనిపిస్తూ ఉంటాయి. దీనికి ప్రధాన లక్షణం ఊడలు.
చెట్ల యొక్క కొమ్మలు ఊడలుగా మార్పు చెంది కిందికి దిగి నేలలోకి చొచ్చుకుపోతాయి. ఈ చెట్లు చాలా పెద్దగా ఉండటం వలన గాలులకూ, వర్షాలకు పడిపోకుండా ఈ ఊడలు ఊతమిస్తాయి. ఈ చెట్లను ‘ఎపిఫైట్లు’ అంటారు. వీటి విత్తనాలు బీటలు వారిన గోడల్లో, వంతెనల్లో కూడా పెరుగుతాయి. ఎలాంటి అననుకూల పరిస్థితుల్లోనైనా పెరుగుతాయి. రహదారి పక్కనున్న చెట్లు దారిన బోయే బాటసారులకు నీడను ఇస్తాయి.
మర్రిచెట్టు ‘మోరేసి’ కుటుంబానికి ‘రోజేలిస్’ క్రమానికి చెందిన చెట్టు దీనిని సంస్కృతంలో ‘వట వృక్షము’ అంటారు. దీని శాస్త్రీయ నామము ‘ఫైకస్ బెంగాలెన్సిస్’.
శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీదనే విశ్రాంతి తీసుకుంటాడు. అందుకే ఆయనను ‘వటపత్రశాయి’గా కొలుస్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు “మర్రిచెట్టు యొక్క వేళ్ళు భూమిపైకి కనిపిస్తాయి పైనుండే కొమ్మలేమో నేలలోకి చొచ్చుకుపోతాయి. వీటి ఆకులేమో పురాణ శ్లోకాలు” అని. శివుడు దక్షిణామూర్తి రూపంలో మర్రిచెట్టు కిందనే తపస్సు చేశాడట. నిరంతరంగా సాగే సృష్టికి అనంతమైన జీవనానికి గుర్తుగా మర్రిచెట్టును చెప్పుకుంటారు. మనం దర్శించుకునే ఏ దేవాలయంలో చూసినా మనకు మర్రిచెట్టు దర్శనమిస్తుంది. మన భారతీయులు మర్రిచెట్టును పవిత్రమైనదిగా భావించటం వల్లే గుడులలో పెంచి పూజిస్తున్నారు దేవుడితో సమానంగా.
భారతదేశంలోని అనేక పల్లెటూళ్ళలో మర్రిచెట్టు నీడనే కూర్చుని అనేకమైన గ్రామ విషయాలు చర్చించుకుంటారు. ఈ చెట్టు చుట్టూతా అరుగు కట్టుకుని దానినే రచ్చబండ ఉపయోగిస్తారు. మర్రిచెట్టు నీడనే ఓ చిన్న దేవతా విగ్రహాన్ని పెట్టి పూజించడం మనకు అలవాటు. భారతదేశంలో వ్యాపారాన్నీ ఈ చెట్టు కిందనే జరిగేవి. వర్తకులు కందిపప్పు, చింతపండు లాంటి వస్తువులను ఈ చెట్లకింద కూర్చునే అమ్ముకునేవారు. ఈ వ్యాపారులను ‘బనియాలు’ అంటారు. ఆ విధంగా ఈ చెట్టుకు ‘‘బనయాన్ ట్రీ’ అనే పేరు వచ్చింది. గుజరాతీ భాషలో ‘బనియా’ అంటే వ్యాపారి అని అర్ధం. 1634వ సంవత్సరం నుంచి ఇంగ్లీషు రచయితలు ఈ చెట్టును ‘బనయాన్ ట్రీ’ గా పిలవడం మొదలు పెట్టారు.
లావుగా మందంగా ఉండే మానులతో అనేక శాఖలతో దీర్ఘ వృత్తాకార ఆకులతో చిన్న చిన్న ఎర్రని పండ్లతో మర్రిచెట్టు పెద్ద పెద్ద ఊడలతో జడలు విరబోసుకున్న దెయ్యంలా కనిపిస్తుంది. ఆకులు మెత్తగా, మెరిసే ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుల మొగ్గలు అన్ని ‘ఫిగ్ ట్రీ’ ల వలె రెండు పొడవైన వృంతాలతో కప్పబడి ఉం టాయి. ఆకు పెరిగే కొద్దీ పత్ర వృంతాలు రాలిపోతాయి. మర్రిచెట్లు వయసు పెరిగే కొద్దీ అడ్డంగా పెరుగుతుంటాయి. ఎక్కడికక్కడ ఊడల్ని నేలలో దింపేసి ఎకరాలకు ఎకరాలు వ్యాపించుకుంటూ వెళ్ళిపోతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి 35 కి.మీల దూరంలో ‘తిమ్మమ్మ మర్రిమాను’ అనే ఒక మర్రిచెట్టు ఉన్నది. ఇండియన్ బొటానికల్ గార్డెన్స్ లెక్కల ప్రకారం ఇది 200 సంవత్సరాలు పైబడిన వయసు కలది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వృక్షంగా పేరు గాంచినది. దీని కొమ్మలు ఎనిమిది ఎకరాల మేర వ్యాపించి ఉన్నాయి. 1989 వ సంవత్సరంలో ఈ చెట్టు ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ లలోకెక్కింది. అలాగే కోల్ కతాలో ‘ద గ్రేట్ బనయాన్’ పేరుతో ఒక మర్రిచెట్టు 250 సంవత్సరాల వయసు కలిగి ప్రఖ్యాతి పొందినది. అలాగే బెంగుళూరు శివారు ప్రాంతాలలో ‘దోడా అలాబా మారా’ అనే పేరుతో నున్న మర్రిచెట్టు సుమారు రెండున్నర ఎకరాలలో వ్యాపించి ఉన్నది. గుజరాత్ లోని కబీర్వాడ్ ప్రాంతంలో 300 సంవత్సరాల వయసు పైబడిన మర్రిచెట్లు ఉన్నాయి. అలాగే కాంబోడియాలోని ‘ఆంకోర్‌వాట్ దేవాలయం’లో అతి పెద్ద మర్రిచెట్లు పెరిగాయి.
భారతదేశంలోని అనేక పల్లెటూళ్ళలో మర్రిచెట్లే రచ్చబండలుగా మారి గ్రామస్తులకు చర్చా వేదికలుగా ఉపయోగపడతాయి. అందుకే ఇది మన జాతీయ వృక్షంగా రూపుదిద్దుతుంది.