జగదీష్ రాజ్ యొక్క బీరకాయ-బిర్యానీ కథ

0
6

[dropcap]ఎం[/dropcap]త సేపు బయట పెత్తనాలు చేసి రావడం, ఊళ్ళో వాళ్ళ పనులు నెత్తి మీద పెట్టుకుని తిరిగి వొచ్చి అలసిపోవడం, ఎవరో ఒకరల్ని మంచి మార్గంలోకి మార్చాలి అని తాపత్రయం, డబ్బులు ఇచ్చినా ఇవ్వక పోయినా వ్యాపారాలు ఎదగటానికి సహాయం చేయడం; స్పీచెస్ ఇమ్మని వాళ్ళు-వీళ్ళు పిలిస్తే వెళ్లి మెమెంటోలతో ఇల్లంతా నింపడం, అప్పుడప్పుడు చెత్త మనుషులు- ఫన్నీ సందర్భాలు కనపడినప్పుడు ప్రకాష్ రాజ్ లోపలికి ప్రవేశిస్తే జగదీష్ రాజ్‌గా మారిపోవడం ఇవి కొన్ని నా నిత్యకృత్యాలు మా ఆవిడ ప్రకారం; కొంత నిజం కూడా ఉందనుకోండి! ☺️☺️

వీటికి తోడు పొద్దున్నే లేచి పేపర్ ఎప్పుడు వస్తుందో ఆశగా చూచి ఎగ్జామ్స్‌కు రెడీ అవుతున్నట్టు చాలా సీరియస్‌గా చదివి, మళ్ళీ ఎన్‌టీవీ, టీవీ5, సాక్షి, టీవీ 9…. ఇలా ఉన్న ఛానెల్స్‌ను మార్చి మార్చి ఆ కొట్టుకుని- తిట్టుకొనే వాళ్ళను చూసి ఎంజాయ్ చేయడం అవసరమా అని అనిపించుకోవడం మాములే.

ఇది కాదన్నట్టు పొద్దున్న లేస్తే వాట్సప్ (పని అంతా దానిలోనే ఉంది), ఫేసుబుక్, పనికి మాలిన ఫోన్ కాల్స్‌తో కడుపు నిండుతుందా అనే ప్రశ్న ఒక వైపు.

ఇంట్లో పూచీక పుల్ల పట్టుకొనేది లేదు, ఇంట్లోకి ఏది అవసరం అనేది పట్టించుకునేది లేదు. చెప్పాలి అంటే ఇంటి విషయాలు పిల్లల విషయాలు ఏమైనా మా ఆవిడ చేసుకోవడమే. యాక్టివా వేసుకుని చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ పిల్లలతో ‘డాడీ డ్రైవింగ్ చాలా స్లో’ అనే కామెంట్స్ తీసుకు వొచ్చింది. పిల్లలు అంటే బాగా కేర్, అన్ని రకాలుగా వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలి అనే ప్రయత్నం ఆమెది. అన్ని అమర్చిపెడుతుంటే మనకి నొప్పి లేకుండా మన పని మనం చేసుకుంటున్నాము అన్నమాట.

3 నెలల క్రితం అమ్మాయి చెన్నై నుండి  సెకండ్ యియర్ బిటెక్ ఎండింగ్ సెలవులకు వొచ్చి మాదాపూర్‌లో 20 రోజులు అప్రెంటిస్ కోసం వెళ్ళటానికి ప్లాన్ చేసింది. రోజూ కార్‌లో డ్రాప్ చేసి రండి అని మా ఆవిడ రిక్వెస్ట్, నేను షరా మాములే – “మీ ఏర్పాటు మీరు చేసుకోండి నాకు కుదరదు” అని. మళ్ళీ ఉచిత సలహా ‘బస్‌లో గాని, ఆటోలో గాని వెళ్ళమను లేదా నువ్వే దింపు’ అని.

అమ్మాయి బస్‌లో వెళుతుంది ఒకరోజు, అప్పుడప్పుడు మా ఆవిడ దింపడం – తెచ్చుకోవడం. మధ్యలో ఎప్పుడైనా ఆటో ఇలా 19 రోజులు అయిపోయాయి.

ఇంకా లాస్ట్ వర్కింగ్ డే రోజు అమ్మాయి లేట్ అయ్యింది అని కంగారు పడుతుంటే యాక్టివా మీద తొందరగా తీసుకుని వెళ్ళాలి అనే ప్రయత్నం మా ఆవిడ చేసింది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ చాలా స్లో; ఒక పక్క తొందరగా వెళ్ళాలి అనే కంగారు.

ఒక్కసారి దేవుడు చిన్న కుదుపు ఇచ్చాడు. ముందు వెళ్ళే బైకర్ సడన్‌గా ఆగి వెనక్కి వచ్చాడు, అంతే ఇద్దరు బండి మీద నుండి పడ్డారు. ఇద్దరు వేరే వాళ్ళ హెల్ప్‌తో లేచారు. అమ్మాయికి పెద్ద దెబ్బలు తగల లేదు – ఈమెకు తగిలినా చెప్పలేదు. ఆఫీస్ దగ్గర జరిగింది కాబట్టి అమ్మాయి ఆఫీస్‌కు వెళ్ళింది. ఈమె అలాగే ఇంటికి వొచ్చి నాకు మధ్యాహ్నం ఎప్పుడో చెప్పుంది. అంత పెద్ద దెబ్బలు కాదంటే సాయంత్రం 5 గంటలకు ఇంటికి వొచ్చా. ఆమె నడక తేడాగా ఉంటే  ఏమిటని చూస్తే మోకాలి దగ్గర, చీలమండ దగ్గర వాపు ఉంది. నడవటం ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్‌కు వెల్దాము అంటే రేపు వెల్దాము అని ఆమె అనడం. మళ్ళీ నెక్స్ట్ రెండు రోజులు తర్వాత అమ్మాయి చెన్నై వెళ్లే హడావిడి. తర్వాత అమ్మాయి చెన్నై వెళ్ళిపోయింది.

ఇక ఒక రోజు పనులు అన్ని పక్కన పెట్టి మా ఫామిలీకి ఆప్తులు, యోగా గురూజీ శ్రీ ఆర్. యెస్. ప్రసాద్ జీ సూచన మేరకు ఆర్థోపెడిక్ ఎక్స్‌పర్ట్ కె.పి.హెచ్.బి.లో డా.స్కంద కుమార్ గారి దగ్గరకు తీసుకు వెళ్ళాను. ఎక్స్-రే చూసి ఆయన “క్రాక్ లేదు లేదు కానీ అక్కడ లిగ్మెంట్ చిన్నగా టేర్ అయ్యింది, దానికి మెడిసిన్ లేదు. సిక్స్ మంత్స్ టైం పడుతుంది హీల్ అవ్వడానికి, కొన్ని ఎక్సర్‌సైజెస్ చెయ్యాలి. క్రీప్ బ్యాండేజ్ లేదా యాంకిల్ సాక్స్ గానీ వేసుకోవాలి. చిన్నగా నడవొచ్చు కానీ, బయటకు వెళ్లాడాలు, బండి నడపడాలు చేయొద్దు” అన్నారు.

ఇప్పుడు నుండి నాకు జీవితం లో నిజమైన పరీక్ష స్టార్ట్ అయ్యింది. ఎప్పుడు ఇంటి పనిలో హెల్ప్ చెయ్యని నేను తప్పని సరి పరిస్థితులలో ఇంట్లో పనులు – పిల్లల పనుల్లో హెల్ప్ చెయ్యడం ; కూరగాయల ఆదివారం కాలనీ లో పెట్టె బండి దగ్గర  కొనడం, personal బ్యాంకింగ్ కు వెళ్లడం, గ్రోశరీస్ తేవడం లాంటివి అలవాటు చేసుకున్నాను.

ఇప్పుడు కథలో మీరు ఎదురు చూస్తున్న బీరకాయ విషయం వచ్చేసింది.

వినాయక చవితి సందర్భంగా కొన్ని రకాల వెచ్చాలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఎర్రగడ్డ రైతు బజార్‌లో తెమ్మనమని మా ఆవిడ కోరిన మీదట పండగ సోమవారం ఉందంటే శనివారం వెళ్ళాను.

అన్ని ఒకొక్కటి కొనుక్కుని కార్‌లో పెట్టుకుని మళ్ళీ కొన్ని కూరగాయలు కొనాలి అని లోపలికి వెళ్ళాను. ఎక్కువగా నేను బాగా పెద్ద – పేద వాళ్ళు దగ్గరే కొంటాను. అన్ని కొన్నా బెండకాయలు కొనలేదు అని వెళ్ళాను ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఇష్టంగా తినేది బెండకాయలు కూర.

అక్కడ ఒక పెద్దావిడ- పెద్దాయన బెండకాయలు, బీరకాయలు పెట్టుకుని ఉన్నారు. “ఎలాగవ్వా బెండకాయలు?” అంటే “20 రూపాయలు బాబు” అంది ఆమె. కేజీ నా అర కేజీనా అని అడిగా ఆశ్చర్యంగా. ఎందుకంటే  ఫ్రెష్‌లు – బాస్కెట్లలో రేట్ తెలుసు కాబట్టి. వాళ్ళు “కాదు బాబు కెజి 20 రూపాయలే” అన్నారు. కెజి వెయ్యమన్నా. మరీ 20 రూపాయలు బిల్లింగ్‌తో వాళ్లకు ఉపయోగం ఏముంది అని మళ్ళీ ఇంకో కేజీ వెయ్యమన్నా.

ఇప్పుడు అసలు ట్విస్ట్! ఆమె “బాబూ బీరకాయలు బాగున్నాయి. కెజి 30/- అవి కూడా తీసుకోండి” అని అడిగింది.

అంతే నా లోకి ప్రకాష్ రాజ్ ఎంటర్ అయ్యాడు. అప్పుడు నేను జగదీష్ బాబు నుండి జగదీష్ రాజ్ అయ్యాను.

“అవ్వా నీకు తెలుసా? బీరకాయలు ముప్పై అని కొంటే నాకు 300 ఖర్చు అవుతుంది. ఆ మూడు వొందలు ఇస్తావా బీరకాయలు కొంటాను” అన్నాను.

అంతే వాళ్ళు షాక్ – వాళ్ళతో పాటు పక్కన ఉన్న మడిగల వాళ్లు కూడా.

అప్పుడు చెప్పా “బీరకాయ కూర ఉండితే ఇప్పుడు పిల్లలు తినడం లేదు, ఆ రోజు బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకుంటున్నారు (నిజం). బీరకాయలు వొండడం ఎందుకు? బిర్యానికి 300 ఖర్చు పెట్టడం ఎందుకు అని అసలు బీరకాయలు ఇంట్లో వొండడం మానేశాము. మీకు ఇప్పుడైనా అర్ధం అయ్యిందా మీరు ఎంత నేరం చేస్తున్నారో! ముప్పై రూపాయలకు బీరకాయలు అమ్మి 300 రూపాయలు బిర్యానికి మీ కస్టమర్లతో ఖర్చు పెట్టించడం అవసరమా” అన్నాను.

ఆ ఇద్దరు పెద్ద దంపతులు ‘బీరకాయలు అమ్మితే ఇంత విషయం జరుగుతుందా’ అని నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉన్నారు, ఆ పక్కన ప్రేక్షకులు కూడా.

ఇంతలో ఫోన్ మా ఆవిడ దగ్గర నుండి. “ఎప్పుడో వెళ్లారు రైతు బజార్‌కి, ఇంకా రాలేదు ఇంటికి. అక్కడ ఎవడైనా తలకు మాసినవాడు దొరికాడా? తొందరగా రండి. ఇంటి దగ్గర పండగ పనులు ఎవరు చేస్తారు?” అంది.

‘దేవుడా నువ్వు ఉన్నావ్’ అనుకుంటూ జగదీశ్ రాజ్ గా మారాను నేను. 😀😀

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here