జగన్నాథ పండితరాయలు -1

6
11

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

సాహిత్య స్ఫూర్తి పతాక

[dropcap]తె[/dropcap]లుగువాడి ప్రజాప్రాభవాన్నీ, ప్రతిభావ్యుత్పత్తుల ధిషణనీ ఉత్తర హిందూ స్థానంలో పతాక స్థాయిలో నిలిపిన యుగ సాహితీ వేత్త – జగన్నాథ పండితరాయలు. ఆయన కవి, పండితుడు. సంగీతకారుడు, అలంకారశాస్త్ర శేఖరుడు. ఏకంగా ఎనిమిది భాషల్లో కవిత్వం చెప్పగలిగిన పండిత ప్రకాండుడు. తర్క, వ్యాకరణ, వైశేషిక, మీమాంసాది అనేక శాస్త్ర పారంగతుడు. హయగ్రీవోపాసకుడు. ఏకసంథాగ్రాహి; వాగ్గేయకారుడు. ప్రతివాద భయంకరుడు. మొగలాయీ చక్రవర్తుల కొలువులో న్యాయ ధర్మ శాస్త్రాధికారి. అంతకుమించి మతాతీత సామాజికాభ్యుదయానికీ, వ్యక్తి వికసనానికీ నిబద్ధతతో కృషి చేసిన సంస్కర్త.

భామినీ విలాసం, లహరీ పంచకం, జగదాభరణం, శతకసముచ్చయం – వంటి సార్వకాలికమైన సాహిత్య గ్రంథాలేకాక, ‘రసగంగాధరం’ అలంకారశాస్త్ర గ్రంథ రచనతో ప్రపంచ సాహిత్య శాస్త్రకారుల్లో నిలువెత్తు సంతకంగా నిలిచిన మేధామూర్తి-జగన్నాథుడు.

ఇంతటి అసమాన సాహిత్యానుష్ఠానమూర్తిని ‘లవంగి’ కథతో ముడిపెట్టి పాండిత్య పంచాననుడి వ్యక్తిత్వానికి మలినాన్ని పులిమింది లోకవదంతి. అది కేవలం అసూయామత్సరగ్రస్తులు చేసిన దుర్మార్గం అని సాక్ష్యాధారాలతో విజ్ఞులూ, పరిశోధకులూ నిరూపించారు. ఇది నేను ఈ రచనకు పూనుకోవటానికి ముఖ్యకారణం. పండితరాయలు ప్రతిభా సర్వస్వానికి జయహారతి నందించాలనే ఒక ఉద్విగ్న చిత్తశుద్ధికీల మరో కారణం.

ఈ నవల చారిత్రకాంశాలు, సాహిత్య గ్రంథాలు ఆధారంగా రచింపబడింది. గ్రంథరూపం నవలా ప్రక్రియ కనుక కథనాన్ని సంపుటనాత్మకమూ, శిల్ప భరితమూ చేయటానికి – అవసరమైనంత మేరకు స్వేచ్ఛతో, స్వాతంత్ర్యంతో కల్పనని ఆశ్రయించటం జరిగింది.

నవల జగన్నాథుడి ముంగండ జీవితంతో మొదలైంది. కాశీ, జయపురం, ఢిల్లీ, ఉదయపురం, ఆగ్రా వంటి ఆనాటి ముఖ్య నగరాల్లో పండితరాయల ఉజ్జ్వల, వైభవోన్నత చైతన్య సాహిత్య ప్రస్థానం చిత్రణతో నడిచింది. మంగళారంభం, మంగళ మద్యం, మంగళాంతం కావాలనే శుభాకాంక్షతో జగన్నాథుడు తన గంగాలహరి శ్లోకాలు – కాశీ/గంగా ఘాట్‌లో పఠింపబడటాన్ని చూసి ఆనందించిన పుణ్యావిష్కరణతో, ధన్య ఘట్టంతో నవల ముగిసింది.

జగన్నాథుడి కథ అక్కడ ముగియలేదు. ఆ తర్వాతి గాథ చరిత్రాభినివేశం, ఉత్సాహం కలిగిన వారికి పఠనీయం.

ఈ నవలా రచనలో నాకు అత్యంత ఉపయుక్తమైన గ్రంథాలు:

  1. శ్రీ జగన్నాథ పండిత రాజ సత్యచరిత్ర -ఖండవిల్లి సూర్యనారాయణ శాస్త్రి.
  2. జగన్నాథ పండితరాయలు – శిష్టా ఆంజనేయశాస్త్రి
  3. పండితరాయల భావతరంగాలు – డాక్టర్ మహీధర నళినీమోహన్.
  4. జగన్నాథ పండిత రాయల భామినీ విలాసము. డా. పుట్టపర్తి నారాయణాచార్యులు (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి).

ఇవికాక ఆంధ్రాంగ్లాల్లో జగన్నాథ పండితరాయలకు సంబంధించిన ప్రస్తావనతో, ఉటంకింపులతో అనేక లఘుదీర్ఘ వ్యాసాల్నీ గ్రంథాల్నీ, చారిత్రక డాక్యుమెంట్లనీ, అంతర్జాలంలో లభ్యమౌతున్న అనేక ఆకరాల్నీ – సంప్రతించాను.

ఆయా గ్రంథకర్తలందరికీ – ప్రత్యేకించి మొదటి నలుగురికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ‘లవంగీ సంగ గాథ’ (ఖండవిల్లివారి ప్రయోగం) యొక్క అసంభావ్యత గురించీ, ఆధార రాహిత్యాన్ని గురించి – ఖండవిల్లి వారి పుస్తకం పంచమ ప్రకరణంలో అంశాల వారీగా వివరంగా ఉల్లేఖింపబడింది.

సుమారు 50 ఏళ్లుగా నా మననంలో సతమతమై – ఈనాటికి ఇలా వెలుగు చూస్తున్న ఈ నవల – 6,500 పద్యాల మహాకావ్యం నా ‘శ్రీ పదచిత్ర రామాయణం’ లాగానే, ఒక విశిష్ట రచనగా, సాహితీలోకం ఆదరణని పొందుతుందని ఆశిస్తున్నాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here