జగన్నాథ పండితరాయలు-11

2
11

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[కాశీ వాతావరణమంతా, హఠాత్తుగా అవ్యక్తమైన భయం గుప్పిట్లో చిక్కుకుంటుంది. కొందరు మత పరమైన ఘర్షణల్నీ రగుల్పుతారు. ఆగ్రాలో పరిస్థితులు త్వరత్వరగా మారుతుంటాయి. పాలనలో నూర్జహాన్ ప్రభావం ఎక్కువవుతుంది. జహంగీర్ నామ మాత్ర మహరాజు అవుతాడు. వారసులలో రాజ్యాధికారం కోసం కుమ్ములాటలు ప్రారంభమవుతాయి. రాజ్యంలో కల్లోలం ప్రారంభమవుతుంది. మౌల్వీలు కాశీ అంతటా రెండు ముఖ్యమైన (అప)వాదాల్ని విస్తృతంగా ప్రచారం చేశారు. కాశీ పండితుల్లో కొందరు ఈ పరిస్థితుల్ని జయపురం పాలకుడైన మొదటి సవాయీ రాజా జయసింహునికి తెలిపి తమ బాధల్ని వివరిస్తారు. ఆయన తన మిత్ర రాజులతో మంతనాలు సాగించి, జగన్నాథుడు మాత్రమే మౌల్వీలకి సరియైన సమాధానం చెప్పగలడని నిర్ణయించుకుంటారు. జాతర పర్యవసానంగా అనంతపురం, రామాపురం గ్రామాల్లో మనుషుల మధ్య తీవ్రమైన కక్షలూ కార్పణ్యాలూ పెరిగి, కల్లోలం చెలరేగుతుంది. వారి మూఢ విశ్వాసాలకు తోడుగా ఆ ప్రాంతాలలో వివిధ రోగాలు ప్రబలి అనేకమంది బలవుతారు. ఇదే రోగానికి జగన్నాథ, కామేశ్వరిల రెండవ కుమారుడు పసివాడు బలవుతాడు. కామేశ్వరి కృంగిపోతుంది. కొన్నాళ్ళకి కాశీలో పరిస్థితులు సర్దుమణుగుతాయి. కానీ మౌల్వీలు పండితుల మధ్య స్పర్థలు మాత్రం ఇంకా ఎక్కువవుతాయి. ఇంతలో రాజదూతలు వచ్చి జగన్నాథుడిని, శేషవీరేశ్వరుడిని కలుస్తారు. జయపురం మహారాజావారి లేఖ అందిస్తారు. అందరూ కలిసి చర్చించుకుని, తమ ఆమోదం తెలుపుతారు.  అరబ్బీ, పారశీకం, ఉర్దూ భాషల్లో తగిన పాండిత్యం సంపాదించేందుకు జగన్నాథుడు ఆజ్మీర్ వెళ్ళాలని శేషవీరేశ్వరుడు సూచిస్తాడు. జగన్నాథుడికి మూడు నెలల సమయం చాలునని అంటాడు. జగన్నాథుడు ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియనీయకూడడని అంటాడు. దూతలకి ఆమోదం తెలియజేయగానే, రాజు గారు తగిన ఏర్పాట్లు చేసేస్తారు. ఇక చదవండి.]

అధ్యాయం-17

[dropcap]మూ[/dropcap]డు నెలలూ ఇట్టే గడిచిపోయాయి. జగన్నాథుడు కాశీకి తిరిగి వచ్చాడు.

ఎక్కడో దూరంగా రాత్రి రెండు జాముల నౌబత్తు మోగింది.

జగన్నాథుడికి నిద్ర కరువైంది. అతని ఆందోళనంతా కామేశ్వరి గురించే. తాను అజ్మీరు నుండి తిరిగి వచ్చినా ఆమెలో సంతోషం కనిపించటం లేదు. ఇంకా ఆమెను కొడుకు పోయిన దుఃఖం బాధిస్తున్నది. గర్భశోకం తల్లికే అనుభవైక వేద్యం. మాధవుడి తలపూ ఉండనే ఉన్నది.

దానికి తోడు-త్వరలో మౌల్వీలతో జరుగనున్న వాదం కూడా ఆమె మనసుని కలచివేస్తున్నట్లు తెలుస్తూనే వుంది. నిన్న శిష్యుల పాఠం పూర్తిచేసుకుని లోపలికి వస్తే, నిర్వేదంగా నిరుత్సాహంగా ఒకమాట అన్నది ఆమె, “మనకెందుకండీ ఈ పోరాటాలూ, ఆరాటాలూ” అని.

తాను గతుక్కుమన్నాడు. చాలాసేపటికి తేరుకుని ఆమెని సముదాయించాల్సి వచ్చింది. “రోటిలో తలదూర్చి రోకటిపోటుకు వెరవటం తగునా కాము” అన్నాడు ఆమె చుబుకాన్నెత్తి కళ్లల్లోకి చూస్తూ. ఆ కళ్లల్లో గతంలోని మెరుపూ, తళుకూ గోచరించలేదు. విజ్ఞురాలు కనుక, ఆ సంభాషణని పొడిగించకుండా “అయినా, వాదంలో విజయం మీదే కదా!” అంటూ మాటనీ, సన్నివేశాన్నీ మార్చింది.

పక్కన కామేశ్వరి మసలింది. జగన్నాథుడి ఆలోచన మరలింది. ఒత్తిగిలి తిరిగి ఆమెని చూశాడు.

ఒక్కసారిగా కళ్లు తెరిచిందామె. తననే చూస్తున్న భర్తని ఆశ్చర్యంతో చూస్తూ లేచి కూర్చుంది. అతని చేతిని తనచేతిలోకి తీసుకుంటూ “ఏమిటీ ఆలోచిస్తున్నారు. నిద్రపోకుండా?” అంది.

“ఇవాళ దట్టంగా మబ్బు పట్టింది. వర్షం వస్తుందేమో” అన్యమనస్కంగా అన్నాడు. అది అసందర్భ సమాధానమని ఇద్దరికీ తెలుసు.

ఆమె సన్నగా నవ్వి, ముంగురుల్ని సరిచేసుకుంది. విడిన జడను కొప్పుగా చుట్టుకుని, మంచం దిగి కడగా వెళ్లింది. ఆమె తిరిగి మంచం దగ్గరికి వచ్చేసరికీ జగన్నాథుడు ముసుగుతన్ని కళ్లు మూసుకుని నిద్రని ఆహ్వానిస్తూ ధ్యానంలో ఉన్నాడు.

కామేశ్వరి తానూ నడుం వాల్చింది. తనకు తానే చెప్పుకుంటున్నట్లు “వాడు ఉండి వుంటే, ఈయన వ్యవహారాల ధ్యాసకి పగ్గం వేసేవాడు” అనుకుని నిట్టూర్చింది.

జగన్నాథుడు ఠక్కున దుప్పటి ముసుగుతీసి భార్య కళ్లల్లోకి చూస్తూ ఆమెవైపు తిరిగాడు. “అసలు సంగతి నీ మనసుకే కాదు, నాకూ తెలుసు. వాడి ఆలోచనల నుంచీ బయటపడలేకపోతున్నావు కదా” అంటూ లాలనగా దగ్గరికి తీసుకున్నాడు.

కాల స్ఫురణ దృష్ట్యా అసమయమైనా – ఇద్దరి కళ్లూ చెమర్చినై.

ఎక్కడో కుక్కలు మొరుగుతున్నై.

***

కాల ప్రస్థానం, పరిణామం ఎప్పుడూ అనూహ్యమైన అంశాలే. కాలానికి ఎదురీది వాస్తవాన్ని మసిపూసి మారేడుకాయని చేయాలనే దుష్టబుద్ధికీ, దాని ప్రయత్నాలకీ కాలమే సమాధానం చెప్తూ ఉంటుంది.

హిందువుల ఉజ్జ్వల చరిత్రనీ మహోజ్వల గతాన్నీ, మహామేధావులైన వెనుకటితరం మహనీయుల్నీ-ధ్వంసం చేయటానికి కొందరి మూర్ఖత్వం, మత్సరం ఎంతగా ప్రయత్నిస్తూ వున్నా, వాటికి ఎదురు దెబ్బలూ, వెనుక తాపులూ – తగుల్తూనే ఉన్నాయి.

కాశీలో మౌల్వీల పరిస్థితీ ఇలాగే వుంది. ఇప్పటి ఘటనలు వారి అవిద్యనీ, అసూయనీ రచ్చకెక్కేటట్లు చేశాయి.

జయపురం మహారాజు పనుపున అక్కణ్ణుంచీ మహావిద్వాంసులూ, హిందూ పండితులూ కాశీ వచ్చారు. అలాగే, ఉదయపురం నుండి పండితులు వచ్చారు. అలా వచ్చిన వారిలో సామ్రాట్ జగన్నాథుడూ వున్నాడు. చిత్రంగా గతంలో ఒకసారి మౌల్వీలతో తలపడి వారిని ఓడించినవాడు ఆయన. వీరికి సమంగా మౌల్వీలు కూడా అజ్మీర్ నుండి, ఢిల్లీ నుండి ముస్లిం పండితుల్ని పిలిపించారు.

కాశీలో హిందూ, ముస్లిం-కవి, పండిత, విద్వాంసుల మధ్య గొడవలకి ఒక చుక్క పెట్టాలనే ఉద్దేశంతో పాదుషా కూడా ఢిల్లీ నుండి అసఫ్ ఖాన్‌నీ, రాయముకుందునీ కాశీకి పంపించాడు. అసలు ఈ సూచన కూడా జయసింహుని నుంచే పాదుషాకి అందింది.

ముందుగా నిర్ణయమైన రోజున చాలా పెద్ద ఎత్తున మహాసభ జరిగింది.

మహాసభకు ప్రత్యేకంగా కటకం నుంచీ సహదేవభట్టు వచ్చాడు. ఆయన గతంలో చాలాసార్లు కాశీలోని ముస్లిం పెద్దలతో జరిగిన వాదాలలో-వారికి శృంగభంగం చేసిన దిట్ట. అలాగే శ్రీనివాసుడు, వేదాలవారూ, చక్రపాణి వంటి వారంతా ఉత్సాహంతో వచ్చారు. శశిభూషణుడు, కనకలాల్ కూడా హాజరైనారు. జగన్నాథుడు అపజయం పొందితే సంతోషించేవారు సరేసరి!

మౌల్వీలు మరో వ్యూహము పన్నారు. కాశీనగరం ఫౌజ్‌దారుని వేడుకొని, ఆయన తరఫున కొందరు రాజోద్యోగుల్ని సభకు రప్పించుకున్నారు. ఆ అట్టహాసాన్నీ, వారి వత్తాసునీ చూసి-జగన్నాథుడు బేజారెత్తి జంకుతాడని వారి ఆశ.

కానీ, జగన్నాథుడు ధిషణలోనే కాక, లౌక్యంలోనూ, సమయజ్ఞతలోనూ దిట్టతనం చూపగల ఘనుడు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ వాదాలతో సంబంధం లేదనీ, ఇది కేవలం శాస్త్ర సాహిత్య పరమైన చర్చ అనీ చెప్పి, వారిని అంగీకరింపజేసి, మహాసభలో వారు కేవలం ప్రేక్షకులుగా ఉండేటట్లు చేశాడు.

జగన్నాథుడు చెప్పిన వివరణకు అంగీకార సూచనగా తలలూపి నవ్వుకున్నారు. వారు. ఆ నవ్వులో చాలా అర్థాలు దాగి ఉన్నాయి.

మౌల్వీలు సవాలు విసరిన రెండు వాదాల మూలాల్నీ విచ్ఛిన్నం చేశాడు జగన్నాథుడు.

‘ప్రసిద్ధమైన సంస్కృతం-అరబ్బీ భాష నుండి పుట్టింది’ అనే వాదాన్ని- ఆ వాదంలో మౌల్వీలు అనాలోచితంగా వాడిన ‘ప్రసిద్ధ’ అనే పదంతోనే తిప్పికొట్టాడు. అసలు తన వాదాన్ని ప్రారంభించటమే ఒక నూతన విధానంలో ప్రారంభించాడు జగన్నాథుడు. చేతిలో డమరుకం ధరించి దానిని ఆడిస్తూ, అప్పుడు ప్రభవిస్తున్న శబ్దాలు ఏమిటో సభికుల్నే చెప్పమంటూ… వాటిని వరుసగ సుద్దముక్కతో ఒక చెక్కబల్లమీద వ్రాయిస్తూ చూపించాడు. ఇదీ ‘సంస్కృతం’ ఆవిర్భావమని శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. అందువల్లనే అది ‘దేవభాష’ అని ధృవీకరించాడు.

ఆ తర్వాత –

సంస్కృతం దేవభాషగా ఋషి ప్రోక్తంగా, వేదభాషగా సుమారు ప్రపంచంలోని 875 భాషలకు మాతృభాషగా ఎలా ప్రసిద్ధి పొందిందో ఉదాహరణలతో నిరూపించాడు. పురాతనమైన సంస్కృతం-మహా అయితే క్రీ.పూ. 12వ శతాబ్దం నుండి పుట్టిన అర్వాచీనమైన అరబ్బీ నుండి పుట్టటం- ‘కూతురికి తల్లి పుట్టిందన్నట్టవుతుంద’ని పరిహాసాస్పదంగా దెబ్బకొట్టాడు! ఆ క్రమంలో అరబ్బీ భాష పుట్టు పూర్వోత్తరాల్ని వివరించాడు. ఆ భాష పరిఢవిల్లిన ప్రాంతాల భౌగోళిక సామాజిక విశేషాల్నీ చెప్పాడు. హిబ్రూ, అరబిక్, సిరియన్ భాషల పుట్టువునూ చారిత్రకంగా వివరించాడు.

మౌల్వీల రెండవ వాదానికి – అసలు విత్తూ, వేరూ లేకుండా పూర్వపక్షం చేశాడు. పరశురాముడి దండయాత్రల్లో క్షత్రియులంతా వధింపబడినా, ఆ సమయంలో గర్భిణులుగా ఉన్న ఏ స్త్రీనీ – పరశురాముడు వధించినట్లు పురాణ గాథలు గానీ, ఇతిహాస కథలుగానీ, చారిత్రక విశేషాలుగానీ తెలుపలేదు. కనుక, వారందరి సంతానం – ఆ తర్వాత క్షత్రియులుగానే ఉద్భవించి, పెరిగి పెద్దవారైనారు. వివిధ రాజ్యాల స్థాపన చేశారు. వారి వంశాలన్నీ దోసపాదుల్లా విస్తరిల్లాయి- అని అనేక ఉదాహరణలిచ్చాడు. మౌల్వీలు మౌనం వహించారు. తలలు వంచారు.

మహాసభలో జగన్నాథుని వాదనా పటిమకీ, విజయానికి శేషవీరేశ్వరుడూ, శంకరశాస్త్రి, నాగేశుడూ వంటి వారందరికీ పరమసంతోషం కలిగింది.

***

కాశీలో జగన్నాథుడు తన ప్రతిపాదనలతో సాధికారమైన వివరణలతో వాదంలో మౌల్వీలను ఓడించాడనే వార్త- చైత్రంలా ఒక్కసారిగా విరిసింది. పండిత వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. జగన్నాథుడి ప్రతిభకు అపూర్వ ప్రచారం లభించింది.

మౌల్వీలతో సభ ముగిసిన వెంటనే అసఫ్‌ఖాన్, రాయముకుందుడు ఢిల్లీ వెళ్లిపోయారు. రాజోద్యోగులు వెళ్లి జగన్నాథుడి విజయాన్ని ఫౌజ్‌దారుకి తెలియజేశారు. అతను ఆ వార్తని ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న జహంగీర్ పాదుషా వారికి అందజేశాడు. భోగి, మకర సంక్రాంతి వెళ్లిపోయాయి.

జయపురంలో మహాసభ.

జయసింహ మహారాజు రాజప్రసాదం ఉత్సవ సంరంభంతో కాంతులీనుతోంది. ఆ మహెూత్సవకారకుడు జగన్నాథుడు. అది అతని సత్కార సభ!

హిందువుల విశ్వాసాల్ని హేళనచేస్తూ, వారి ఆచార వ్యవహారాల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజాబాహుళ్యంలో అవాంఛనీయ విద్వేషాల్ని రెచ్చగొడుతున్న కాశీ మౌల్వీలకి శృంగభంగం కావించిన మహావిద్వాంసుడు జగన్నాథునికి సత్కారం!! అంతకుముందే కనకలాల్, భట్టోజీ వంటి అహంభావ కుహనా పండితబ్రువులకు కూడా తన శాస్త్ర సాహిత్య పాండిత్య పటిమతో ‘జాగ్రత్త’ చెప్పిన పుంభావ సరస్వతి జగన్నాథునికి సన్మానం!

అందమయిన ప్రకృతి. ఆహ్లాదకరమైన వాతావరణం.

జగన్నాథ దంపతులకు వేద పండితుల ఆశీర్వాద స్వాగతం, మంగళ తూర్య ధ్వనుల ఆహ్వానం!

అంతా కోలాహలం! కవి పండిత ప్రకాండుల సమ్మేళనమది. వేదిక మీద మీర్జారాజా బిరుదాంకితులు జయసింహ మహారాజు ప్రభువు, పక్కగా రాణీ శుక్మతీ దేవి.

వేదికకు కుడివైపు రాయముకుందుడు, ఆయన పక్కగా కవీంద్రాచార్య సరస్వతీ ఆసీనులై ఉన్నారు. మరొక సుప్రసిద్ధ పండితుడు శ్రీ పురుషోత్తమ సాహిత్యాచార్యులూ అదే వరుసలో ఉన్నారు. ఎడమవైపు మొదటి పీరం మీద ఖండదేవ మిశ్రుడు కూర్చున్నారు. ఆయన జగన్నాథుని తండ్రి పేరుభట్టుకు గురువు.

జగన్నాథుడు ఆయనను ఇదే తొలిసారిగా చూడటం. వెళ్లి ముందుగా పెద్దలందరికీ పాదాభివందనం చేశాడు. తండ్రి పేరు చెప్పి, తన పరిచయం చేసుకున్నాడు. తెలిసిందన్నట్లుగా నవ్వుతూ తల పంకించాడాయన. ఆయన పక్కగా శేషవీరేశ్వరుడు, పర్వతవర్థని కూర్చుని వున్నారు. ఆ వరుసలోనే శంకరశాస్త్రి, నాగేశభట్టూ వున్నారు.

మహారాజూ, రాణీ గద్దె దిగి వచ్చి జగన్నాథుడినీ, కామేశ్వరినీ తాముగా వేదిక మీదికి తోడ్కొని వెళ్లారు.

జ్యోతి ప్రకాశనంతో సభాప్రారంభం జరిగింది.

రాయముకుందుడు లేచి కాశీఘటనల్నీ, జగన్నాథుని విజయాల్నీ స్థూలంగా వివరించాడు.

అందరి మొహాల్లో ఆనందం –

జయసింహ మహారాజు జగన్నాథుని మాట్లాడమన్నాడు.

ముందుగా జయసింహ మహారాజు గుణగణాల సమూహాన్నంతా ఒకే ఒక్క శ్లోకంలో అన్యాపదేశంగా – ‘తుమ్మెదలు చేసే స్తుతిస్వరాలకీ, ఝంకారాలకీ, మరొకరైతే పొంగిపోయేవారే కానీ, మహావృక్షం మాత్రం ఆ పొగడ్తలకు వినయంతో తలవంచుకుంది’ అని చదివాడు.

సభ కరతాళ ధ్వనులతో మార్మోగింది.

ఆ వెంటనే కాశీలో మౌల్వీలని ఉద్దేశించి మళ్లీ అన్యాపదేశంగానే శ్లోకాన్ని చదివాడు.

‘బూరుగు చెట్టు పూలు ఎర్రగా పైకి ఆకర్షణీయంగా కనిపిస్తాయి కానీ, ఆ పూలకు పరిమళమూ లేదు. ఈశ్వరపూజకు అర్హతా లేదు’ అని భావం!

‘సెహబాస్’ నినాదాలు పెల్లుబికాయి.

నాగేశుడు శంకరశాస్త్రితో “గురువుగారు శతక సముచ్చయంలోనిదే మరో శ్లోకం చెబుతారిప్పుడు” అన్నాడు.

చిత్రంగా అతను ఊహించినట్లే మరో శ్లోకాన్నీ చదివాడు, జగన్నాథుడు.

“గరతి శర్జదినవర్షతి, వర్షతి వర్షాసు నిస్వనోమేఘః॥

నీచో వదతినకురుతే, నవదతి సుజనోకరోత్యేవ॥

(“శరత్కాల మేఘం ఊరికే ఉరుముతుంది. వర్షం కురియదు. నీచుడూ అంతే. ఆర్భాటంగా వదరుతూ ఉంటాడు కానీ, ఏ మంచి పనినీ చేయడు. వర్షాకాల మేఘం ఉరుములు లేకుండా వర్షిస్తుంది. సజ్జనుడూ అంతే. ఆర్భాటం లేకుండా మంచిపని చేసి చూపుతాడు)

విద్వాంసులూ, ఇతర కవి పండితులూ లేచినిలిచి కరతాళధ్వనులతో అభినందనలు తెలిపారు.

ఆ తర్వాత – కనకాభిషేకం జరిగింది. చీనిచీనాంబరాలతో పుష్పకిరీటంతో సత్కారం జరిపేడు మహారాజు. వేదవిదులు ఆశీస్సులిచ్చారు. కామేశ్వరిని మహారాణి సత్కరించింది. అప్పుడు తన ధీరగంభీరస్వనంతో జయసింహమహారాజు ఇలా ప్రకటించాడు. “మహాపండితులు, సంగీత సాహిత్య శాస్త్ర కోవిదులు, మంత్రద్రష్టలు అయిన జగన్నాథుల వారికి ఈ కవి పండిత సదస్సు సమార్షమైన ‘కవిసార్వభౌమ’ బిరుద ప్రదానం చేస్తున్నది.”

సభికులంతా లేచి ముక్తకంఠంతో “అద్భుతం, అవశ్యం” అన్నారు. “ప్రత్యేకించి రాయముకుందులూ, కవీంద్రాచార్య సరస్వతి వంటి పెద్దలు ఈ పట్టంపై వారి చేవ్రాలు నుంచి, జగన్నాథుల వారికి ప్రదానం చేయవలసినదిగా కోరుతున్నాము” అన్నారు.

క్షణాల మీద ఆ కార్యక్రమం జరిగింది.

సభ సంతోషతరంగితమయింది

ఆ వెంటనే “ఈ శుభసందర్భంలో మరో ప్రకటననీ చేస్తున్నాము. కాశీలోని మా సంస్కృత కళాశాలలో ముఖ్యపండితునిగా అంటే ప్రధానాచార్యునిగా ఈ జగన్నాథుల వారిని నియమిస్తున్నాము. వారికి అనుకూలమైన రీతిలో ఏ నిర్బంధమూ లేకుండా వారీ పదవీ బాధ్యతల్ని ఇష్టమైనంతకాలం నిర్వహించవచ్చు!”

మరోసారి హర్షధ్వానాల అభినందనలతో సభ ముగిసింది.

మరునాడు –

మహారాజు పర్యవేక్షణలో వీడ్కోలు ఏర్పాట్లు జరిగాయి. వారం తర్వాత జగన్నాథ దంపతులు జయపురం నుండి కాశీ బయలుదేరారు – బంధు, మిత్ర, శిష్య-పరివారంతో.

జయపురంలో ఉన్న చివరివారం రోజుల్లో ఆ నగర వైభవాన్నీ, దర్శనీయ స్థలాల్నీ జగన్నాథ దంపతులకు విశదంగా చూపించారు రాజోద్యోగులు. ఆయా దృశ్యాల్ని మనోయవనికమీద చిత్రించుకుంటూ తన్మయభావంతో భర్తవైపు చూసింది కామేశ్వరి.

వీరు కాశీ చేరేలోగానే అటు ఢిల్లీ, ఆగ్రాల్లోనూ, ఇటు కాశీలోనూ ఈ విజయోత్సవ వార్తలు జనం నాలుకలపై నర్తించసాగినై.

అధ్యాయం-18

“అయ్యా” అంటూ ఒక ఆగంతకుడు పిల్చాడు.

‘ఎవరో వచ్చారం’టూ జగన్నాథుడూ, కామేశ్వరీ ఇద్దరూ ఇంటి బయటకు వచ్చారు.

ఎదురుగా ఒక నడివయస్సు వ్యక్తీ, పక్కన ఎనిమిది తొమ్మిదేళ్ల పిల్లవాడూ.

వాలకాన్ని బట్టి తెలుస్తూనే ఉన్నది- వాళ్లు ముస్లిములు.

“ఏం కావాలి?” జగన్నాథుడు అడిగాడు.

“కూచోండి స్వామీ” అంటూ, నిదానం వహించాడు ఆ వ్యక్తి. మీరు కూచుంటే కానీ చెప్పనన్న తరహాలో నిలిచే వున్నాడు. జగన్నాథుడు ముక్కాలి పీటపై కూచున్నాడు. ఆయన పక్కగా నిలబడింది కామేశ్వరి.

“నా పేరు సలీం. ఊళ్లో వడ్రంగి పని చేసుకుంటూ బతుకుతున్నాను. వీడు నా కొడుకు సయ్యద్. స్వామీ, మీరు పెద్దవారు. పెద్ద చదువులు చదివినవారు. మా మౌల్వీలకే పాటం చెప్పారంట. ఊరంతా అనుకుంటున్నారు. నా బేటాకి తెలుగు వచ్చినంతగా ఊర్దూ రాదు. మాలో ఎవరికీ తెలుగు అంతగా రాదు. ఇరుగుపొరుగు పిల్లలతో తిరుగుతూ వారి సావాసంలో తెలుగుని పట్టుకున్నాడు. మీ గురుకులంలో పడేసుకుని నాలుగు తెలుగు, సంస్కృతం ముక్కలు నేర్పించండి స్వామీ”

అతని మాటలకు ఆశ్చర్యపోతూ మొహమొహాలు చూసుకున్నారు దంపతులిద్దరూ. అప్పుడే శేషవీరేశ్వరుడూ, పర్వతవర్థనీ బయటికి వచ్చారు. “ఏమిటి విషయం జగన్నాథా?” అడిగాడు శేషవీరేశ్వరుడు. వివరం చెప్పింది కామేశ్వరి. శేషవీరేశ్వరుడు కూడా ఆశ్చర్యంతో జగన్నాథుని వైపు చూశాడు.

క్షణాలు గడిచాయి.

“ఇప్పటికే మనల్ని కాశీ పండితవర్గం, కులీనులనుకునేవారూ ఏదో ఒక మిషతో, అపనిందతో, అపవాదంతో చిన్నచూపు చూస్తున్నారు. ఈ సలీంకి చదువు చెప్పటానికి అంగీకరిస్తే, వాళ్లందరికీ మంచి తీపిని అందించినట్టే. లొట్టలేసుకుంటూ కాశీ అంతా ప్రచారం చేసి రచ్చచేస్తారు”

శేషవీరేశ్వరుని మాటలకు, “అవును. కనక్‍లాల్, భట్టోజీ పంచాయతీకి పిలవ్వొచ్చు” అన్నది పర్వతవర్థని.

“నువ్వేమంటావ్?” అన్నట్టు కామేశ్వరి వైపు చూశాడు జగన్నాథుడు.

“శ్రద్ధావాన్ లభతే జ్ఞానం” అనే అన్నాడు భగవానుడు. శ్రద్ధ అంటే గురు, వేదాంతాది శాస్త్ర బోధనల్లో విశ్వాసమే. ఈ బాలుడికి శ్రద్ధ ఉన్నట్టే తోస్తున్నది. ఆ తండ్రికీ మీపై విశ్వాసం ఉన్నది” అని మిన్నకుండింది కామేశ్వరి.

సలీం కళ్లల్లో పని సానుకూలం కాబోతున్నదన్న సంతోషం కదిలింది. కూచున్నాడు. తండ్రి పక్కనే తానూ కూచున్నాడు సయ్యద్.

ఆవరణ నిశ్శబ్దంలో మునిగింది.

చాలాసేపటికి శేషవీరేశ్వరుడు, “ఆశ్రమ ధర్మాన్ని విచక్షణ చేస్తే – మన నీతులు ధర్మాల పఠన పాఠనల ద్వారా వ్యక్తిగత అభివృద్ధి, సమతుల్యత, సంతోషం మాత్రమే మనం సాధించవలసిన విజయాలు కావు. వ్యక్తిగత అభ్యుదయం ద్వారా సామాజిక అభ్యుదయం, వైయక్తిక నీతిద్వారా సామాజిక నీతి, వ్యక్తిగత విమోచనం ద్వారా సామాజిక విమోచనం-సాధింపబడాలి. ఇదే శాస్త్రాల ఆశయం. జీవితంలో ఎదిగిన గురుస్థానీయుడు ఆ ఆశయసాధనలో తన స్వాభావిక భావోద్వేగాల్ని సంతృప్తిపరచుకొనే స్వేచ్ఛా స్వాతంత్ర్యాల్ని కూడా కలిగే వుంటాడు. ఆ మార్గంలో పయనం ద్వారానే మానవ జీవనానికి సంపూర్ణత్వం సిద్ధించేది. అందువలన సామాజికాభ్యుదయ సాధన, పరిరక్షణకూడా. ఆశ్రమధర్మాల కిందకే వస్తాయి” అన్నాడు.

“దాహార్తుడికి నీరు నిచ్చినట్లు, జ్ఞానార్తునికి విద్యగరపటమూ ధర్మనిర్వహణలో భాగమే అవుతుంది” అన్నది పర్వతవర్థని.

సలీం వైపు చూస్తూ మెల్లగా అన్నాడు జగన్నాథుడు, “సరే, సలీం.. రేపటి నుంచి సయ్యద్‌ని గురుకులానికి పంపు. రేపు ఉదయం వచ్చి ఇతర వివరాలన్నీ మా శాస్త్రి దగ్గర తెలుసుకో.”

సలీం అమిత సంతృప్తితో తల ఊపి, కైమోడ్చాడు.

సయ్యద్ తనంతట తానుగా వచ్చి మగవాళ్ళిద్దరికీ పాదాభి వందనం చేశాడు. ఆ పిల్లవాడి చర్యకు ఆడవాళ్ళిద్దరూ ముచ్చటగా దరహసించారు. మర్నాటి నుంచీ సయ్యద్ విద్యాభ్యాసం మొదలైంది.

వారం తిరిగేసరికీ కాశీలోని పండిత వర్గాల్లో ఇదే చర్చ. జగన్నాథుడు ఒక ముస్లిం పిల్లవాడిని గురుకులంలో చేర్చుకున్నాడనీ, హిందూత్వాన్ని భ్రష్టుపట్టిస్తున్నాడనీ-చెవులు కొరుక్కోవటం; ఇక ఇకలూ పకపకలూ..

నాగేశుడూ, శాస్త్రి, చక్రపాణి వంటి వారు ఈ వార్తల్ని గురువులకు చేరవేసినా వారు నవ్వేసి ఊరుకున్నారు.

రోజులు వెనక్కి జారుకుంటున్నాయి. భట్టోజీ వర్గం ఇలాంటి ప్రచార పర్వానికి పరిమితమైంది. అంతకుమించి జగన్నాథ, శేషవీరేశ్వరులతో సంవాదాల్లోగానీ, సమావేశాల్లోగానీ తలపడే ధైర్యం చేయలేదు. దీనికి మొదటి కారణం – పాదుషా దంపతుల నుంచీ జగన్నాథుడు మెప్పుపొంది, వారి ఆహ్వానాన్ని కూడా పొందటం. జగన్నాథుని పై ఏమైనా దూకుడుని ప్రదర్శిస్తే ఫౌజుదారు తమ తోకలు కత్తిరిస్తాడనే భయం మనసులో ఉండటం రెండవ కారణం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here