జగన్నాథ పండితరాయలు-2

4
10

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

అధ్యాయం-1

[dropcap]కో[/dropcap]నసీమ, ముంగండ అగ్రహారం.

పెద్దచెరువుగట్టు. గట్టుకు పెడగా రావిచెట్టు. చెట్టుకింద రచ్చబండ.

సాయంకాలపు ఎండ నీడల్ని పరుస్తోంది.

రాతిబండ మీద జగన్నాథుడు. ఎదురుగా చెరువులో నీటి కదలికల్ని చూస్తున్నాడు. మేధలో తండ్రి చెబుతున్న మహాభాష్యం కదులుతోంది. మనసులో పరిపరి సాహిత్య భావాలు తొణికిసలాడుతున్నై.

జగన్నాథుడికి కొంచెం దూరంలో మంత్రవాది పరమేశ్వరశాస్త్రి చేతిలోని తాళపత్ర గ్రంథాన్ని తిరగేస్తున్నాడు. రచ్చబండమీద వాయవ్యంగా కూచుని పరిటి గోపాలం, యాళ్ల చంద్రం కుటుంబ విషయాలు మాట్లాడుకుంటున్నారు. “నీకు తెలుసుగా మావా. నేరకపోయి మా తమ్ముడు ఆస్తిని అమ్ముకుని కుటుంబాన్ని అంబాజీపేటకి మార్చుకున్నాడు. నే చెబితే విన్లేదు. వ్యాపారంలోకి దిగి చేతులు కాల్చుకున్నాడు. ఇప్పుడు ఆకులు పట్టుకుని లాభమేముంది?” అంటున్నాడు గోపాలం దిగులుగా.

“రాశులు రాల్చి పొయ్యటానికి అవతలి వాళ్లేమైనా పిచ్చోళ్లా, వెఱ్ఱోళ్లా? అందుకనే, కొత్తచోట మన శక్తియుక్తుల్ని తెలుసుకుని అడుగెయ్యాలి, మసలుకోవాలి”.

మాటలు వినిపిస్తున్నా. తన ఊహల్లో గిరికీలు కొడుతున్న మాటలు ఇవే!

యథాలాపంగా చూపు మరలింది. చెరువుమెట్ల మీద.. పదిహేను పదహారేళ్ల పిల్ల. చేతిలో కడవ. నీళ్లకోసం వచ్చినట్టుంది.

ఆమెకు పక్కగా ఇద్దరు పడుచుకుర్రాళ్లు. భంగిమల్ని చూస్తుంటే ఎకసెక్కాలాడుతున్నట్లనిపించింది.

రేవులో వేరే మనుషులు లేరు.

రాతి అంచుకు జరిగి, కాలు నేలకానించి, అంగవస్త్రాన్ని సర్దుకుని అడుగువేశాడు.

చెరువు దగ్గరికి నడుస్తున్నాడు..

మాటలు స్పష్టమైనై. “పండు తయారైందిరా!”

వేగంగా మరో అడుగు..

“చేతిలో రాలుతుందేమో చూడు..”

మరో రెండడుగులు..

ఆమె కలవరపడుతోంది. కాళ్ళల్లో అదురు. వణుకుతున్నట్టు తెలుస్తోంది.

అంతే! ఆ మాటన్నవాడి పళ్లు రాలేట్టు తగిలింది. చెంపదెబ్బ! గ్రుడ్లు చేతికొచ్చినట్లైంది. తల తిరిగిపోయింది.

రెండోవాడు బిత్తరపోయాడు.

క్షణంలో.. ఇద్దరూ పరుగు లంకించుకున్నారు. ఎవరి సంతానమో తెలుసుకొనే అవకాశం జారిపోయింది.

నింపాదిగా ఆ పిల్లతో “నువ్వెళ్లమ్మా, నీళ్లు తీసుకుని వెళ్లు” అన్నాడు జగన్నాథుడు. చీరకొంగుతో మొహం తుడుచుకుందామె. చూపులతోనే కృతజ్ఞతని తెలిపింది.

“ఎవరమ్మాయివమ్మా” అడిగాడు. ఆమెని చూస్తే అవివాహిత అనిపించింది.

“పిన్నింటి రామ్మూర్తిగారు-మా నాన్నగారు” చెప్పింది.

ఆమె రేవుకేసి నడిచింది.

జగన్నాథుడు వెనక్కి తిరిగి, అడుగుకదల్చాడు.

“ఊరు మారుతోంది. పరిస్థితులు బాగాలేవు” అన్న తండ్రి మాటలు గుర్తుకొచ్చినై. నడక సాగింది.

అవునవునంటున్నట్టు మూలేశ్వరస్వామి దేవాలయంలో గంట మోగింది.

ఎదురుగా దేవాలయ గోపురంపైన బంగారు కలశం మీద సూర్యకాంతి ధగధగమెరుస్తూ ఆహ్వానం పలుకుతోంది.

“బంగారు కలశం మిడిసిపడుతోంది” – పక్కగా వచ్చి చేరాడు రామచంద్రుడు. జగన్నాథుడి తమ్ముడు.

‘అంతస్తత్త్వ విచారణ ప్రణయినో లోకాబహిర్బుద్ధయః’ అని శ్లోకం చెప్పాడు జగన్నాథుడు.

“అవును. ఇవ్వాళా రేపూ అంతర్గతసారాన్ని గ్రహించాలనేంత జిజ్ఞాస ఎవరికుందిలే. పైపై మెరుగులకు భ్రమసి గౌరవించటమే లోకరీతి!” అని, అంతలోనే “రేవులో ఏదో జరిగినట్లుంది..?” అని అడిగేడు.

“అయితే, దూరం నుంచీ గమనించావన్నమాట..” అంటూ జరిగింది చెప్పాడు, జగన్నాథుడు.

“ఇటీవల మన అగ్రహారంలో కొత్త పోకడలు కనిపిస్తున్నై” అన్నాడు రామచంద్ర అడుగుల అలికిడికి ఇద్దరూ పక్కకి చూశారు.

ఇందాకటి పిన్నింటివారి పిల్లే. నడుమున కడవతో తొలగి నడుస్తూ పక్కవీథికి మళ్లింది.

తనలో తను అనుకుంటున్నట్టు – “శాఖిన్యోనే విరాజంతే, ఖండ్యంతే చందనద్రుమాః’ అన్నాడు జగన్నాథుడు.

“అవును. అడవినిండా చెట్లే మంచి గంధపు చెట్లకే గొడ్డలి దెబ్బలు! బాగుంది!” భావాన్ని తనకు తాను విశదం చేసుకున్నాడు రామచంద్ర.

దైవదర్శనం చేసుకుని వడివడిగానే ఇంటికి చేరారు అన్నదమ్ములు.

***

వారం రోజుల నుంచీ తగ్గిన చలి ఉన్నట్టుండి నిన్నటి నుండి ముదిరింది. రాత్రి భోజనాలైనై.

అత్తమామలకు కావలసిన మంచినీటి చెంబులుంచటం వంటి ఏర్పాట్లు పూర్తి చేసుకుని, వారికి పాదాభివందనం చేసి, నిదానంగా – మండువా లోగిలిలో పడమటి భాగానికి నడిచింది కామేశ్వరి.

ముందు వసారా గదిలో రామచంద్ర. ఆముదం దీపంముందు ఏదో చదువుకుంటున్నాడు. కదిలింది.

పడకగది గుమ్మం దగ్గర నిలిచి, వొకసారి వెనక్కి చూసింది. అక్కణ్ణుంచీ చూస్తూంటే అత్తమామల గదిలో దీపం కనిపిస్తోంది.

తలుపు వేసి లోపలికి వెళ్లటమా, వేయకుండా ప్రవేశించటమా? – ఇదీ బిడియం! ఇదీ ముగ్ధ సందేహం!

లోపల పందిరిమంచం మీద అస్తిమితంగా కువకువలాడుతున్నాడు జగన్నాథుడు. గమనించాడు. భార్య సంకోచిస్తోంది. అత్తమామల చాటు కోడలు! మంచం దిగి, సన్నగా నవ్వుతూ ఆమెని సమీపించాడు. ఆమె నడుంమీద చేయివేసి దగ్గరికి పొదువుకుంటూ లోపలికి అడుగులు వేయించాడు. ఒక కాలితాపుతో సున్నితంగా తలుపు వేశాడు. కామేశ్వరిని మంచం మీద కూచోబెట్టాడు.

ఆమె తమలపాకుల పళ్లేన్ని ఒడికి చేర్చింది. జగన్నాథుడు భార్య పక్కకి చేరేడు. తల వంచి భార్య కొనగోళ్ల లాలిత్యాన్నీ, మేని లావణ్యాన్ని ఆనందించసాగేడు. ఆమె తన వలపుల రాణి. చిన్ననాటి నుండి పరిచయమే. కలిసి మెలిసి తిరిగినవారే. అయినా ఈ దాంపత్య బంధం?! అనుభవాలూ, ఆనందం చేయీచేయీ కలిపి అనురాగమయం చేస్తున్నాయి. రోజురోజుకీ నవంనవంగానే ఉంది-జీవనవల్లరి!

కామేశ్వరీ-భర్తను ఓరగంట చూసుకుంది. చామనచాయ. స్ఫురద్రూపి. కోడెవయసు. శిఖని కేశసంపద. విశాలమైన కళ్లు. వెడదయురం, నిశితమైన చూపు!

ఇద్దరి మనసులూ మాధుర్య భావనలతో నిండి ఉన్నై, భార్య చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆమె వక్షసంపదపై చూపు నిలిపి శ్లోకం చెప్పాడు. “అప్పుడు రేగిపండ్లను గేలిచేస్తున్నై, ఆపై ఉసిరికల్ని అధిగమించాయి. ఆ తర్వాత మామిడిని అపహసించినై. ఇప్పుడిక దానిమ్మని పోపొమ్మంటున్నవి.”

కామేశ్వరికి భర్త కొంటెదనం అర్థమైంది. సిగ్గు ముంచుకొచ్చింది. చిరుకోపంతో విసురుగా పక్కకి జరిగి, “చాల్లెండి గడుసుదనం. రసికరాజులకి ఇటువంటి కవిత్వం కాక మరేమొస్తుంది?’ అని ముచ్చటగూర్చే మూతిబిగింపుతోనే, తమలపాకు చిలకల్ని నోటికి అందించింది. వాటిని అందుకుని, ఆమె చుబుకాన్నెత్తి “శ్లోకాన్ని పూర్తిచేయొద్దా?” అని కన్నుగీటాడు. “చీ పొండి!” అంటూ కినుక చూపింది. వంగి ఆమె దగ్గర ఊసులా చెప్పేశాడు. ఓ చిలిపి స్పర్శనూ ఇచ్చాడు. “అబ్బ! మరీ పచ్చి శృంగారం!” అని అతని గుండెల్లో మొహం దాచుకుంది. ఆమె మనసు మాత్రం భర్త శ్వాసించిన ‘కరిశాబకకుంభలక్ష్యాః’ పదాల్లోని అనిర్వచనీయత చుట్టూ పరిభ్రమిస్తోంది.

జగన్నాథుడేమో అనుభవానందాన్ని గ్రోలటానికి ఉద్యుక్తుడౌతున్నాడు.

***

హయగ్రీవోపాసనా, అనుష్ఠానం ముగించి పూజగది నుండి బయటికి వచ్చాడు జగన్నాథుడు.

ఎదురుగా వసారాలో ఒదిగి నిలబడి వున్నది సరమ్మత్త. మహాలక్ష్మితో ఏదో మాట్లాడినట్లుంది. ఆమె కళ్లల్లో నీరు.

చూశాడు జగన్నాథుడు. పక్కనే ఉన్న ముక్కాలిపీటని ఆమె ముందుకు జరిపి కూచోమని సూచన చేశాడు.

కూచుంది. ‘ఏం అత్తా – ఇంత పొద్దుటే వచ్చావ్?” అడిగాడు. ఆమె నిలువరించుకోలేకపోయింది. మాటలు తడబడుతూంటే “రేవతి సంసారం చట్టుబండలైపోయిందిరా అబ్బాయ్. నా అల్లుడి ప్రవర్తనేం బాగాలేదు” అని నోటికి కొంగుని అడ్డం పెట్టుకుని గొల్లుమంది.

జగన్నాథుడు నిశ్చేష్టుడైనాడు. కొన్ని వాస్తవాలు విన్నప్పుడూ, అవి మన ఊహకు ఎన్నడూ అందనివి అయినప్పుడూ మనసు కలతపడుతుంది. గొంతు మూగపోతుంది.

సరమ్మని నెమ్మదించనిచ్చాడు.

క్షణాలు గడిచినై.

ముకుపుటాల్నీ, కళ్లనీ చీరచెంగుతో తుడుచుకుని అన్నది సరమ్మ, “మీ మిత్రుడు ఇంత దౌర్భాగ్యుడౌతాడని కలలోకూడ అనుకోలేదురా జగన్నాథం”.

నోరు మెదపలేదు జగన్నాథుడు. ముక్కాలి పీట మీద కూచున్నాడు. రేవతి భర్త శేఖరం కళ్ల ముందు మెదిలాడు. అతను తన మిత్రుడే. ఇసుకపూడివాడు. తల్లిదండ్రులు లేరు. ఒక్కతే అక్క, అక్కా బావల సంరక్షణలోనే పెరిగాడు. మగదక్షతలేని సరమ్మత్త రేవతికి పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే, నిజానికి తానే ఈ సంబంధాన్ని చూపించాడు. రేవతి ఆమెకు మూడోపిల్ల, పెద్దకూతుళ్లిదరినీ కలిగిన కుటుంబాల్లోనే పడేసింది. మొండెపులంకలో ఒకామె, గన్నవరంలో ఒకామె సర్వతోభద్రంగా ఉన్నారు. రేవతి పెళ్లయి ఏడాది నిండిందేమో. ఇంతలోనే ఈ పరిణామం!

“వాడికి పూర్తిగా చెప్పు వదినా” అంటూ అటుగా వచ్చి పెరటివైపు వెళ్లింది మహాలక్ష్మి. “ఊఁ’అని దీర్ఘం తీసింది సరమ్మ,

జరిగిన ఘటనల్ని, వాస్తవాన్ని మళ్లీ మళ్లీ తన వేదనగా చెప్పుకొచ్చింది సరమ్మ, అవన్నీ తెంచిపోసిన పూసల్లా ఉన్నా, వాటిలోని దారం విశదంగా కనబడుతోంది. జగన్నాథుడికి, పెళ్లయిన తర్వాత రేవతిని తీసుకువెళ్లి అక్కా బావల ఇంట్లోనే కాపురం పెట్టాడు శేఖరం. నాలుగు నెలలు అంతా సవ్యంగానే గడిచింది. ఉన్నట్లుండి రేవతితో అత్తగారింటికి వచ్చి, “మా అక్కాబావా నన్ను వేరే కాపరం పెట్టుకోమన్నారు. నేనేదైనా పని చూసుకోవాలి. ఈలోగా రేవతిని ఇక్కడే ఉండనీయండి” అని ఆమెను దించి తాను వెళ్లిపోయాడు.

మరో రెండు నెలలు గడిచినై. అప్పుడు తెలిసింది-శేఖరం రాజమండ్రిలో ఎవరో మహమ్మదీయ యువతితో కాపరం చేస్తున్నాడు! రేవతి బావలూ, సరమ్మా పెళ్లి నిగ్గదీస్తే, తెగించి ‘అవును నేను దాన్ని వదల్లేను. కావాలంటే రేవతినీ పంపండి’ అని సమాధానం! ఏడుపులూ, మొత్తుకోళ్లూ!

చాలాసేపు చర్వితచర్వణంగా అవే వృత్తాంతాలు!

చాలా సేపటి తర్వాత అన్నాడు, “అప్పుడప్పుడూ వస్తున్నాడంటివిగా. ఈసారి శేఖరం వచ్చినప్పుడు కబురు చెయ్యి. నేను వచ్చి మాట్లాడుతాను” అని.

మహాలక్ష్మితో మాట్లాడి వెళ్లిపోయింది సరమ్మ.

క్షణాలు గడిచినై. తాను రాస్తున్న ‘సుధాలహరి’ సూర్యస్తుతిని చేతిలోకి తీసుకున్నాడు జగన్నాథుడు.

“నూతులు తవ్వితే బేతాళాలు పుట్టాయిట. అట్టా ఉందీ వ్యవహారం. అదుపులేని మగపొగరు”

కసికసిగా వినవచ్చింది మాట. పక్కకి చూస్తే-కామేశ్వరి! పూలబుట్టని సర్దుతున్నది!

***

అప్పటికప్పుడే స్నానాదులు ముగించుకున్నది కామేశ్వరి.

అత్తమామలు లేచే వేళ. వెళ్లి వారిద్దరి పాదాలకీ నమస్కరించింది. వారి దీవెనలు తీసుకుంది. “సుపుత్రాప్రాప్తిరస్తు” అన్నది మహాలక్ష్మి కోడల్ని మురిపెంగా చూస్తూ, “తథాస్తు” అన్నాడు పేరుభట్టు.

కామేశ్వరి సిగ్గుపడి చెంగున వెనక్కి తిరిగింది. పక్కన చిరునవ్వుతో కళ్లు చికిలిస్తూ జగన్నాథుడు!

***

ఆ నెలలోనే శుభవార్త.

కామేశ్వరి గర్భవతి. పేరుభట్టు దంపతులకు ముచ్చటే ముచ్చట. అసలే మురిపెపు కోడలు. ఆపైన మనవడినో, మనవరాలినో ఇవ్వబోతోంది.

జగన్నాథునిలో కొత్త చైతన్యం తరగలెత్తుతోంది. పలుకులో, నడకలో ఒక గర్వపు విలాసం. తాను తండ్రి కాబోతున్నాడు.

ఇల్లు నందనంలా శోభిస్తోంది. రోజూ పండగలా ఉన్నది. ముగ్గురూ కలిసి కామేశ్వరిని అపురూపంగా చూసుకుంటున్నారు. ఆరోగ్య చిట్కాలన్నీ జాగ్రత్తగా చేస్తున్నారు.

ఏడవ నెలలో సీమంతం చేసి కామేశ్వరిని పుట్టింటివారు తీసుకువెళ్లారు.

నెలలు నిండినై. తేలిగ్గా ప్రసవమైంది. మగపిల్లవాడు. నామకరణం జరిగింది. ‘మాధవదీక్షిత సూరి’ అని పెట్టారు.

కామేశ్వరి పుట్టింటి నుండీ తిరిగి వచ్చింది. మనవడితో కాలక్షేపం చేస్తూ మురుసుకుంటున్నారు-పెద్ద దంపతులు.

నెలలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నాయి.

మాధవుడికిప్పుడు ఏడేళ్లు.

ఉపనయనం అయింది. వేదాధ్యయనం సాగుతోంది.

ఉషోదయం. పాఠశాల అంతా వేదఘోషతో మార్మోగుతోంది.

పేరుభట్టు ప్రశిష్యులు శిష్యులచే పనసని వల్లెవేయిస్తున్నారు. మాధవుడు ఒక పక్కగా కూర్చుని వ్యాకరణ సూత్రాల్ని కంఠస్థం చేస్తున్నాడు.

అటు – జువ్విచెట్టు నీడలో – కొడుకులిద్దరితో భాగవత గోష్ఠి సలుపుతున్నాడు పేరుభట్టు. ఏకాదశస్కంధం. పదమూడో అధ్యాయం. హంసరూపియై శ్రీ మహావిష్ణువు చేసిన తత్త్వోపదేశఘట్టం. పదిహేడు శ్లోకాలు. వివరణ సాగుతోంది.

జగన్నాథుడు ఆ తర్వాతి అధ్యాయాల్లో సాగిన అంశాల్ని కూడా తఱచి తన వ్యాఖ్యానాన్ని అందిస్తున్నాడు. పేరుభట్టు కొడుకు ప్రజ్ఞని ఆస్వాదిస్తున్నాడు.

రామచంద్ర మనసు ఇక్కడ లేదు. గమనించాడు తండ్రి. కోపమొచ్చింది. విద్యార్థి ఎవరు పాఠంమీద శ్రద్ధ పెట్టకపోయినా ఆయన సహించలేదు. ‘రామచంద్రా!’ అరిచాడు.

ఉలిక్కిపడ్డాడు రామచంద్ర. జగన్నాథుడూ కళవళపడ్డాడు. “అన్న చెబుతున్న ఆత్మతత్త్వవిచారసారాన్ని చెప్పు” అడిగేడు పేరుభట్టు. రామచంద్రకి మాట పెగల్లేదు.

“చీ..” అనుకుంటూ విసురుగా అక్కణ్ణుంచీ వెళ్లిపోయాడు తండ్రి. వెళ్తూ, వెళ్తూ.. ‘నీకు చదువురాదు’ అని వేష్టపడ్డాడు.

రామచంద్ర మొహం చిన్నబోయింది. తలవంచుకుని కూచున్నాడు. నిముషాలు గడిచినై. జగన్నాథుడు తమ్ముడి భుజం తట్టాడు. రామచంద్ర తలెత్తి చూశాడు. కళ్లనిండా నీళ్లు! అన్న చూపుల్లో అనునయం రామచంద్రని తేరుకొనేట్టు చేసింది. అప్పుడు అన్నాడు, “నిన్నటికి నిన్నా – పూర్వమీమాంసలో అక్షింతలు వేశారు. నా బుర్రకేమో ఆ కర్మప్రాధాన్యం రుచించదు.”

“అవును. నా అభిరుచీ ఉత్తరమీమాంస మీదే కదా.. దానికేంలే” అని, క్షణం ఆగి తమ్ముడి చెయ్యిపట్టుకుని “ఒక అభిమాన విషయాన్ని సాకల్యంగా తెలుసుకోవాలంటే నిజానికి దానికి విరుద్ధమైన దానినే ఎక్కువ శ్రద్ధగా చదవాలి. అప్పుడే మన విషయ పరిజ్ఞానం గట్టిగా ఉంటుంది. మన నిర్ణయాన్ని నిబద్ధతతోనూ చెప్పగలం. అవతలి శాస్త్రంలోని లొసుగునీ అంతే స్పష్టంగా చూపగలం”

“ఏమో.. నాన్నగారితో నాకు శిక్షణ కంటే శిక్షే ఎక్కువగా ఉంది” అని ముఖం ముడుచుకుని కడగా జరిగాడు. “ఆయన జ్ఞానంమీద ఆయనకి గర్వం ఎక్కువ!” అని సణిగేడు.

విస్తుపోయాడు జగన్నాథుడు. ఎంతమాట అంటున్నాడు వీడు? నాన్నగారికి గర్వమా? పోనీ, నిజమే అనుకున్నా ఆయనకు గాక మరెవ్వరికి ఉండాలి గర్వం? ఆ ధీధిషణా, దర్పం – వీడు అర్థం చేసుకోలేదా! “వీడికి కొంత తెలియజెప్పాలి” అని అనుకున్నాడు. నిదానంగా మొదలెట్టాడు.

“చూడు తమ్ముడూ. పేరుభట్టుగారు మన నాన్నగారు కావటం మన అదృష్టం. పూర్వ పుణ్యఫలం. గురుదండనని ఒక అవసరంగానే భావించాలి. ముడివజ్రాన్ని కిరీటంలో పొదవుతారా? సానబెట్టిన వజ్రానికే కదూ విలువ! అయినా నీకు తెలియనిదేముంది?” అని.

“శ్రీమద్ జ్ఞానేంద్ర భిక్షోరధిగత సకల బ్రహ్మ విద్యా ప్రపంచః

కాణాదీరాక్షసాదీరపి గహనగిరో యో మహేంద్రాదవేదీత్

దేవాదేవాధ్యగీష్ట స్మరహర నగరే శాసనం జైమినీయం

శేషాంక ప్రాప్తి శేషామల భణితి రథూత్సర్వ విద్యాధరోయః!!”

‘పాషాణాదపి పీయూషం/స్యందతే యస్య లీలయా

తం వందే పేరుభట్టాఖ్యం/లక్ష్మీకాంతం మహాగురుమ్!!”

అంటూ పరోక్ష నమస్కారంగా చదివాడు, “అంతటి మహాపండితుని పుత్రులం మనం. జాగ్రత్తగా మసలుకోవాలి కదూ?” అన్నాడు సౌమ్యంలోనే మందలింపుని కలగలిపి.

రామచంద్రుడు గునిశాడు. “ఆ కవిత్వ వ్యవహారం చెబితే మంచిది నాకు”

“అంటే- ‘పాండిత్య హీనాః కవయోభవంతి’ అన్న నానుడిని ఋజువు చేస్తావాయేం? పిచ్చిగా ఆలోచించక చదువుమీద శ్రద్ధ పెట్టు” అన్నాడు జగన్నాథుడు. రామచంద్రుడు అన్నవైపు గుర్రుగా చూస్తూ, “సరేలే” అని పైపంచె సర్దుకుని లేవబోయాడు.

ఇంతలో వెంకటశాస్త్రి వచ్చాడు. అతడు వీళ్ల సహాధ్యాయే.

“ఏం శాల్మలితరూ! ఇలా వచ్చావ్?” పరిహాసంగా పలకరించాడు రామచంద్ర, బూరుగు చెట్టులా పొడుగ్గా, కొంచెం లావుగా ఉంటాడు వెంకటశాస్త్రి. అందుకని మిత్రులు అతన్ని ఇలాగే గేలిచేస్తూ ఉంటారు.

రోజులో వాతావరణం ఎగుడుదిగుడుగా ఉంటోంది. రాత్రి చలి. పగలు గాలిలో వెచ్చదనం. వెంకటశాస్త్రి ముఖమంతా చెమటపట్టి ఉంది. వగరుస్తూ చెప్పాడు, “ఏటి ఒడ్డున పెద్ద కొట్లాట జరుగుతోంది. మీరు చూడాలి. రండి”.

సన్నగా నవ్వాడు జగన్నాథుడు. ‘అంటే వీడు ఇప్పటివరకూ నదీ స్నానంలోనే ఉన్నాడా యేం?’ అనిపించింది. ఆ నవ్వులోని భావాన్ని గ్రహించలేనంత తెలివిలేని వాడేంకాదు వెంకట శాస్త్రి. “నేను వ్యాకరణ పాఠం అయిన తర్వాతే నదీ తీరానికి వెళ్లాను” అన్నాడు సంజాయిషీ ధోరణిలో.

“ఎందుకు మహాశయా? కొట్లాట జరగబోతోందని ముందే వర్తమానం వచ్చిందా?” వెటకారం చేశాడు రామచంద్ర.

“కాదు.. కాదు..” అని తడబడ్డాడు వెంకటశాస్త్రి.

“నాకు తెలుసులేదా వెంకటా. అమ్మమ్మతో పద్మిని నది దగ్గర కొస్తుంది కదూ?” అన్నాడు జగన్నాథుడు.

పద్మిని శాస్త్రి భార్య. ఇంకా కాపరానికి రాలేదు. భార్యాభర్తల చిన్నతనపు ముచ్చట్లలో ఇదో దోబూచి ఆట! “ఒరేయ్. పద్మినీ వాళ్ల అమ్మమ్మ కరిగించిన సీసం లాంటి మనిషిరోయ్. జాగ్రత్త” రామచంద్ర,

“ఇంతకీ మీరు వస్తారా, రారా?” అంటూ తలెత్తి జగన్నాథునికేసి చూశాడు.

నుదుట విభూతి రేఖలు. మధ్యగా గంగమట్టి తిలకం. చెంగావిరంగు ధోవతి. వల్లెవాటుగా అత్తాకోడళ్లంచు ఉత్తరీయం. చెవులకు కుండలాలు. కోటేరులాంటి ముక్కు పాండిత్య తేజంతో ఫాలభాగం వెలుగుతోంది. ముఖవర్చస్సులో కలగలిసిన రాజవైభవ దర్పం మెరుపులీనుతోంది.

“పద వెళ్దాం” అన్న జగన్నాథుడి మాటకు ఉలిక్కిపడ్డాడు వెంకటశాస్త్రి. ఉత్తరీయం సర్దుకుంటూ కదిలాడు జగన్నాథుడు. తమ్ముడూ, మిత్రుడూ అతన్ని అనుసరించేరు.

అధ్యాయం-2

ముంగండ. సాంఖ్యాయనీ నదీతీరం –

వాతావరణమంతా రణగొణధ్వనీ రాళ్ళవానగా వుంది. వాదనలు, ప్రతివాదనలు, మనుషులమీద మనుషులు కలబడటానికి ఉవ్వెత్తున లేవటాలూ జరిగిపోతున్నై. నదీతీరంలో సాగరఘోష!

జరిగిందేమిటి? జనం కలకలం మధ్య మాటలు..

“ఎన్నడైనా ఈ ఊరి కుర్రాళ్ళు ఇలా బరితెగించారా?”

“పిల్లని అల్లరిచేయటమంటే తప్పా తప్పున్నరా..”

“సున్నంలో ఎముకలు మిగలకుండా తన్నండి వెధవల్ని”

“ఆడపిల్లకి రక్షణ లేకుండా పోతే ఊరెందుకూ? ఊళ్లో పెద్దరికాలెందుకూ?” “అదుపులేని గుర్రాలు అగడ్తలు దాటడమంటే ఇదేగదూ!”

వివరాలేం కావాలింకా, జగన్నాథుడి మనసు వికలమైంది.

ఖండవిల్లి వారమ్మాయిని పరిటి వారి యువకులు అల్లరి పట్టించారు. ఆ పిల్ల ఏడుస్తూ పోయి తల్లిదండ్రులకి చెప్పింది. ఆవేశం రేగింది. ఆందోళన మోగింది. పౌరుషం సాగింది. కల్లోలం చెలరేగింది. కర్రలు లేచినై!!

క్షణం ఆలోచించాడు జగన్నాథుడు. తృటిలో ఇరుపక్షాల వారి మధ్యకూ దూకాడు. “ఆగండి!” – సింహగర్జన లాంటి అరుపు! మత్తేభ ఘీంకారం!! శాసన ప్రకటన లాంటి ఆజ్ఞ!! ధీరగంభీర కాహళీధ్వని!

ఘోష సద్దుమణిగింది. గొంతులు గొణుగుడుకి దిగి, గొణుగుడు పళ్లు నూరటాలైనై

“మాలాంటి వారిదంతా దుడుకుతనం, ఉడుకురక్తం. కానీ, మీరేంటి ఇలా రెచ్చిపోతున్నారు. తలలు పగిలితే ఏం మిగులుతుంది?” ఆగాడు, జనం అతన్ని చూస్తున్నారు. తమని తాము చూసుకుంటున్నారు. ఎదుటివారిని పరికిస్తున్నారు. పక్కవారిని గమనిస్తున్నారు.

“మిగిలేది విరిగిన కర్రలూ, పగిలిన బుర్రలూ, తెగిన కాళ్లూ చేతులు” –

“ఏం చెయ్యాలి మరి. ఈ దౌర్జన్యం సాగనివ్వాలా?” ఖండవిల్లి వారి పెద్దాయన

రుసరుసలాడేడు.

“అఖ్ఖర్లేదు….”

ఠక్కున నిశ్శబ్దం నెలకొన్నదక్కడ. జగన్నాథుడేం చెబుతాడో వినాలని జనమంతా ఊపిరి బిగబట్టి నిలబడ్డారు.

కావాలని క్షణాల్ని గడవనిస్తున్నాడు జగన్నాథుడు. అతనికి తెలుసు ఒక పరిమితికి మించి నిశ్శబ్దాన్ని భరించడం కష్టం..

ఈ లోగా ఎవరో అననే అన్నారు, “చెప్పు”.

“ఆ పిల్లాడి తల్లీ, తండ్రీ ఎక్కడ?”

“ఇరుగో-” ఎవరో వాళ్ళని ముందుకు తోశారు. కళవళ పడుతున్న మొహాలు, వణుకుతున్న కాళ్లు. స్వేదంతో తడిసిన దేహాలు!!

జగన్నాథుడు ఖండవిల్లి వారి పెద్దాయన్ని చేతులు పట్టుకుని జనం మధ్యకు తీసుకువచ్చాడు. “చెప్పు మాఁవా, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం చెయ్యాలి. పిల్లల నడత చెడితే పెద్దల తప్పే అంటారు కదా!”

మళ్లీ ఘోష చెలరేగింది. తర్జన భర్జనలతో బహువిధాలుగా చర్చించుకోసాగారు. పెద్దాయన ఏంచెప్పాలో తోచని అయోమయ స్థితిలో దిక్కులు చూస్తూ నిలబడిపోయాడు. పిల్లవైపు వారి గొంతులు లేచినై. “పిల్ల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పమనండి!”

‘అవును. అవు’నంటూ కోలాహలం చేయసాగారు జనం.

పిల్ల తల్లిదండ్రులు ఉత్కంఠతో చూస్తున్నారు. పిల్లవాడి తల్లిదండ్రుల కళ్ళల్లో అలజడి. నేలచూపులు చూస్తూ తత్తరపడున్నారు. పిల్లవాడివైపు వాళ్ళు “చెప్పొద్దు.. క్షమాపణలు గిమాపణలూ.. ఏ హుకుం నహీ చలేగా..” “పిల్లగాళ్లేదో పరాచికాలాడి వుంటారు. పెద్దోళ్లకా దండన?” “మేం ఒప్పుకోం..”

“సరే.. క్షమాపణ చెబితే అయిపోతుందా? మన సంతృప్తికి అదేనా చెలియలికట్ట. దానితో మళ్లీ మళ్లీ పిల్లలెవరూ మన పిల్లల్ని అల్లరి చేయరా? చెప్పండి..” తీవ్ర స్వరంతో శంఖనాదంలా మాటలు వదిలాడు జగన్నాథుడు. “చచ్చిన పాముని చంపడం గొప్పతనమా. వాళ్లని చూడండి.” కొందరికి ఆ మాటలు రుచించలేదు.

“వాళ్లకూ పరిస్థితి అర్థమైంది. ఏం చెయ్యాలో కూడా తెలిసింది. తమ పిల్లల్ని అదుపులో పెట్టుకోవాలనే తమ బాధ్యతనీ వాళ్ళిప్పుడు గ్రహించలేదంటారా?”

అందరికీ ఒళ్ళంతా మంచులో తడిసినట్లయింది. ఉన్నట్టుండి ఆలోచనలో పడ్డారు జనం. జగన్నాథుడి మాటలు వాళ్లకి ఇప్పుడు సబబుగా తోస్తున్నాయి. పరిస్థితి అలావుండగానే పిల్లవాడి తల్లిదండ్రులు ఖండవిల్లివారికి ‘క్షమించండం’టూ చేతులు జోడించారు. వారి కళ్లనిండా నీళ్లు!! కృతజ్ఞతలతో జగన్నాగుడి వైపు చూశారు.

పరిస్థితి పరిష్కారమైనందుకు యువకులంతా జగన్నాథుడికి జేజేలు పలికారు. పెద్దలంతా ‘బాగుంది.. బాగుంది’. అంటూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

నెమ్మదిగా జనం కాళ్ళు కదిలినై. జగన్నాథుడి కాళ్ళు పిల్లవాడి తల్లిదండ్రుల అడుగుల్ని అనుసరించాయి.

జగన్నాథుడి నడకకి తన నడకని జోడించాడు వెంకటశాస్త్రి. వెంకటశాస్త్రి భుజం మీద జగన్నాథుడి ఆత్మీయ స్పర్శ! ఆ ప్రక్కగా రామచంద్రుడూ నడుస్తున్నాడు.

***

పొద్దుగూకింది. బహుళ నవమి. మసక వెన్నెల నేల మీదా పరచుకోవాలని ప్రయత్నిస్తున్నది. బాదంచెట్టు కొమ్మలూ, ఆకులూ అడ్డగిస్తున్నై. చెట్టుకింద అరుగు. అరుగుమీద జగన్నాథుడు.

అనుష్టానం. దేవతార్చనా పూర్తయినై. అంగవస్త్రాన్ని నడుముకూ, మోకాళ్లకూ చుట్టుకుని ఊయల భంగిమలో కూర్చుని వున్నాడు. అరుగుపరంగా నులకమంచంమీద పేరుభట్టు ఆకాశాన్ని చూస్తున్నాడు. మనసులో కూడా మసక మసగ్గా ఆలోచనలు.

తరం మారుతున్నది. దానితో మనుషుల స్వభావాలూ, పరిస్థితులు, పరిసరాలూ మారిపోతున్నై. మతమన్నది వ్యక్తుల అభిమతమని నమ్ముతూ వచ్చిన కాలం చాలా మార్పుల్ని తెస్తోంది.

ఊరు చెడిపోతోంది. తలచుకుంటే ఒక అవాంఛనీయమైన జీవన దృశ్యం కళ్లముందు కనిపిస్తోంది. వేద వేదాంగాలూ శాస్త్రాధ్యయనం, తర్కవ్యాకరణ

మీమాంసాదులు పూర్తయినాయి జగన్నాథుడికి. ఏక సంథాగ్రాహి.. కొడుకుని గురించి తలపోస్తూ మంచంలో లేచి కూర్చున్నాడు. జగన్నాథుడిని పరీక్షగా చూశాడు. బ్రాహ్మీమయమూర్తిగా, తేజస్విగా కనిపిస్తున్నాడతడు.

ఆ మధ్య ఒకరోజు పండితవర్యులు కొందరు అతిథులుగా వచ్చారు. వారంతా ఔత్తరాహులు. సంభాషణ కలాపమంతా శాస్త్ర చర్చల్లోకి నడిచింది. అప్పుడు – జగన్నాథుడు- ధీరంగా.

“అపివక్తి గిరాంపతిః స్వయం యదితాసా మధిదేవతా పినా

అయ మస్మి పురోహయానన స్మరణోల్లంఘిత వాఙ్మయాంబుధిః”

“బృహస్పతే వస్తాడో, వాణియే వస్తుందో రమ్మనండి. హయగ్రీవమంత్ర స్మరణంతో వాఙ్మయ పారావారాన్ని తరించి వచ్చి నిలబడ్డాను-రమ్మనండి” అని ధీరంగా నినదించి, క్షణం ఆగి, “అన్నట్లుగా వుంటాడు పండితుడు” అని ముక్తాయింపు నిచ్చాడు.

ఎంతటి ఆత్మశక్తి వీడికి! తన పాండిత్యం మీద, తన ధీశక్తి మీద, తన పరిపూర్ణత మీద అమేయమైన విశ్వాసం! ఈ ధీధిషణలు, మనోనిబ్బరం ముంగండకు పరిమితమై వెలిగిపోకూడదు. ‘స్పర్థయా వర్ధతే విద్యాః’ సాటి వారిలో ఔననిపించుకోవాలి. సమశక్తిగల జ్ఞానులలో రాణించాలి.

పేరుభట్టు ఆలోచన ఈ రీతిగా సాగుతుండగా.. సరిగా ఇలాంటి తలపుల్లోనే మునకలు వేస్తున్నాడు జగన్నాథుడు.

***

రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే వుంది. నల్లమబ్బులతో చీకట్లు ముసిరాయి. మధ్యాహ్నం మూడు గంటలకే రాత్రయినట్లుగా వుంది.

శేఖరం వచ్చాడని కబురు చేసింది సరమ్మత్త.

గదిలో మంచం మీద పడుకున్న జగన్నాథుడికి ఆలోచనల్లోనే నిముషాలు దొర్లిపోతున్నాయి. రేవతీ శేఖరంల జీవిత వాస్తవమే మనసుని వేధిస్తున్నది. అనుభవానికి భావనకీ మధ్యన వున్నది అఖాతం. అనుభవం గాలిలో దీపమా? మరి భావన నిశ్చలమైన ఆదర్శమా? లైంగిక చర్యకీ-ప్రేమభావనకూ మధ్య ఎంత వ్యత్యాసం వున్నది. శరీర ధర్మానికి సంబంధించినవే అయినా కేవలం యాదృచ్ఛికం అనవచ్చునా? ఆకర్షణ ఎప్పుడూ అవకాశాన్ని వెతుక్కుంటుందా? అవకాశం అవసరాన్ని కల్పిస్తుందా? ఆ స్థితి కోరికల్ని ఎగదోస్తుందా?

సంఘం ఆమోదించని సంబంధాల విలువ ఏపాటిది? ఇంటిలో లేని లైంగిక స్వేచ్ఛని శేఖరం బయట వెతుక్కుంటున్నాడా? రేవతి భర్తకి అనుకూలవతే నంటున్నది కదా సరమ్మత్త, అనుకూలవతి అయినంతమాత్రాన అభిరుచులు కలిసిపోతాయా? ఆరు నెలలు కలిసివుంటే వారు వీరవుతారంటారు కానీ, అది ఎంత వరకు నిజం. అంతఃకరణ మైనం లాంటిదా? మనిషి మనస్సూ, వర్తనా-సిద్ధాంతాలకూ, నీతి సూత్రాలకూ ఎంతవరకూ లొంగుతాయి? శేఖరం చర్య పురుషాధిపత్యానికి ఉదాహరణ కదూ!’ లేచి కూర్చున్నాడు. ఇలాంటి వ్యవహారాల్లో పరిష్కారానికి ప్రయత్నించకపోతే నిశ్శబ్దంగా చీకటి గుహల్లోకి వెళ్లిపోవడమే అవుతుందనిపించింది.

“ఏమిటీ-వర్షం సూర్యస్తుతిని భావన చేయిస్తోందా?” అంటూ లోపలికి వచ్చింది కామేశ్వరి. అటు చూశాడు. ఆమె పెదవులపై పిన్న నవ్వు. శిరీష కుసుమ పేశలమైన రసరేఖ అనుకున్నాడు. ‘సూర్యస్తుతి కాదు.. శేఖరం దుష్మతి’ అని నవ్వేడు.

నీళ్లని అందుకుని తాగేడు.

“రేవతి అదృష్టం బాగా లేదు”.

“అదృష్టం అంటే దృష్టం కానిది కదా కామూ. అది ఎప్పుడూ కనపడనిదే” “సరి” అని మంచం పక్కన ముక్కాలిపీటిపై కూచుంది. “చెప్పండి” అన్నది. “స్త్రీకి రెండు జీవితాలు: ఒకటి ఈడది. మరొకటి ఆడది” అని నవ్వాడు.

“అదేమాట పురుష పుంగవులకీ నప్పుతుందేమో” అని ఆగి “మీ శేఖరం లాగా” అంటూ కొంటెగా చూసింది.

“గడుసుమాట” అని “మన సామాజిక వ్యవస్థలో భర్త ప్రవర్తన ప్రభావం భార్య మీదా, కుటుంబం మీదా, దగ్గరి సంబంధీకుల మీదా పడుతుంది”.

“ఏమైనా ఈ వికారాలకి ఇక్కడ చుక్కపెట్టే విధానం ఆలోచించండి. ఆ అర్భకురాలి కావురం నిలపాల్సిన వారు మీరే”

“మరి మీరు?” అని రెట్టించాడు-పరిహాసంగా.

ఆకాశం ఉరిమింది. ఎక్కడో పిడుగుపడింది. కామేశ్వరి ఉలిక్కిపడింది.

“నేను మాత్రం ‘సర్దుకుపోవాలి తల్లీ’ వంటి సలహాలివ్వను. ఆ మగమహారాజు కాళ్లకీ చేతులకీ బంధనాలు వెయ్యాల్సిందే”

“అమ్మో.. చాలా నిఖార్సయిన నిర్ణయమే!” అని “అలాగే చూద్దాం” అన్నాడు. “చూద్దాం కాదు.. చేద్దాం” అంటూ నవ్వింది.

“గడసరివే కాదు, చమత్కారివే” తానూ నవ్వాడు జగన్నాథుడు. ఇంతలో మాధవుడు వచ్చాడు ‘అమ్మా’ అంటూ.

‘ఆఁ’ అని కొడుక్కి సమాధానమిచ్చి “అవును మరి.. ఈ శ్రీవారి శిష్యరికం కదా” అని భర్త వైపు చూస్తూ నిమ్మళంగా లేచి అడుగు కదల్చింది.

“ఎంతటి అందం, లావణ్యం!” అనుకున్నాడు జగన్నాథుడు. మధురభావనతో గుండె పండింది!

***

జగన్నాథుడు, శేఖరం ఒకరి ఎదురుగా మరొకరు –

చాలా సమయం గడిచింది.

జగన్నాథుని కళ్ళల్లోకి చూడలేక, తలదించుకుని కూచుని వున్నాడు శేఖరం. “ఆమె కూడా నన్ను ప్రేమిస్తున్నది” నీళ్లు నమిలాడు..

నవ్వొచ్చింది జగన్నాథుడికి, “చూడు శేఖరం. ప్రేమ అంత చౌక వస్తువేం కాదు. ఆరాధనకీ, ఇష్టానికీ పరమావధిగా నిలిచేది ప్రేమ. నిజంగా అది నీ రేవతి హృదయగతంగా వుంది. రాజమహేంద్రి నేల సాహచర్యం నిన్ను యాదృచ్ఛికంగా ఆ మనిషి పట్ల ఆకర్షణని కలిగించింది. అంతే! వింతల్లో ఒక వింత ఏమిటో తెలుసా? చెడు అలవాటు విషయంలో మనసు అయస్కాంతమైపోతుంది. చివరికి అది ఒక ఊబిలాగా ముంచేస్తుంది”.

శేఖరం ముఖకవళికల్ని గమనిస్తూ ఆగిపోయాడు.

“ఆమె సంగతి నీకు తెలీదు. ఆమె అందం ఎంతటివారినైనా కట్టి పడేస్తుంది. మనం కావ్యాల్లో చదివే రసరంజని. రాగమంజరి. సంగీతంలోనూ ఆమె అందెవేసిన చెయ్యే. వాటికీ నేను దాసుణ్ణి అయ్యాను.” శేఖరం మాటల్ని మధ్యలో ఆపుతూ – జగన్నాథుడు

“కావచ్చు. రేవతికీ సంగీతం బాగానే వచ్చుకదా! ఆ విషయం నీకు తెలుసు. కానీ, ఆమె నిన్ను అలరించటానికి అహరహమూ తన అందాల్ని ఒలకపోస్తూ అదే వ్యాపకం మీద ఉండదు. ఎంతగా మనసుకు నచ్చేపనే అయినా ఆమె సంసారి, సంస్కారవతి కనుక-కొన్ని కౌటుంబికమైన, సాంఘికమైన పరిధుల్లో ఒదిగిపోవడం జరుగుతుంది. కులస్త్రీలకున్న ఆ విధమైన పరిమితుల్ని మనం తెలుసుకోవాలి.” కొంత సమయం నిశ్శబ్దంలో కరిగిపోయింది.

జగన్నాథుడు లేచి నిలబడ్డాడు. శేఖరం కూచునే వున్నాడు.

“నరమ్మత్త అత్తకావటం నీ అదృష్టాల్లో మొదటిది. రెండవది రేవతి వంటి సుగుణవతి నీ భార్య కావడం. ఇంతవరకూ ఆమె నీతో తన బ్రతుకు నిస్సారమనీ, నిరర్థకమనీ భావించలేదు. అదే జరిగితే ఆలోచించు. అసలు సూటిగా నిన్నోమాట అడుగుతాను. సమాధానం చెప్పు. అటు నీ అక్కాబావలూ, ఇటు నీ భార్యా వాళ్ల గడప త్రొక్కనీయకపోతే-నువ్వు రేవు దాటగలవా? చాలా పార్శ్వాలు గల సమస్య ఇది. ప్రేమ, సాన్నిహిత్యం, మనసుల కలయిక, సాహచర్యం, బాంధవ్యం ఇవన్నీ భార్యాభర్తల మధ్య సాంఘికంగా ఆమోదం పొందిన ధర్మాలు”.

‘నీ రాజమహేంద్రి వ్యవహారం కేవలం కొనుగోలు విధానాన్ని అనుసరించినది. దానిని సంఘం హర్షించదు’ అని ఆగి మళ్లీ అన్నాడు.

“ఇంకో రహస్యం చెబుతా విను. గోతిలో పడిన నిన్ను చూసి నీ అత్తా, భార్యా గోలపెడ్తుంటే, వినీ, చూసీ దాన్ని కానీ ఖర్చులేని వినోదంగా ఆనందపడతారు ఊరిజనం. అందరి ముందూ చులకనవుతావు.”

జగన్నాథుని మాటని మధ్యలో ఆపుతూ, “నాకు పాఠం బాగా చెప్తున్నావ్. కానీ, మీ మరదలికి కూడా చెప్పావా..” అని నవ్వేడు శేఖరం. కూర్చున్న భంగిమని మార్చుకున్నాడు.

“అవును. మన మైత్రిలో ఉన్న వెసులుబాటు అది అని నాకు తెలుసు. మగవానిగా నీలో అహం బిగుసుకుపోతుందిప్పుడు. నా పట్ల కూడా వ్యతిరేక భావాలు పుట్టుకొస్తాయి. ఫర్వాలేదు. నేను సరమ్మత్తకి చెబుతాను. నా సలహా విని రేవతిని తీసుకుని ఎటన్నా వెళ్లిరా. అన్నిటినీ మించి దాంపత్య బంధం లోని శక్తి, సాహచర్యంలోని మాధుర్యం, మీ సాప్త పదీనంలో అనుభవానికి వస్తాయి. నెమ్మదిమీద నీకే అర్థమౌతుందిలే..”

జగన్నాథుడి మాటల్ని ఆలోచిస్తున్నట్టు, ప్రస్తుతాన్ని వితర్కించుకుంటున్నట్టు, భవితవ్యాన్ని ఆస్వాదిస్తున్నట్టు – మౌనంగా కూచుండిపోయాడు శేఖరం. మనసులో తీవ్రమైన మథన తర్వాత వివేకం పురుడు బోసుకుంది. “నీ మాటెందుకు కాదనాలి. సరే.. ఏ అద్భుతం జరుగుతుందో అదీ చూద్దాం” అంటూ లేచాడు శేఖరం. .

“చివరగా ఒక మాట.. ధర్మం, ప్రశాంతత, సత్యం, జ్ఞానం, ఆనందం-అన్నీ నీకవగతమౌతాయిలే” అని ఒక్కొక్క మాటనీ విడదీసి వివరిస్తున్నట్టుగా పలికాడు జగన్నాథుడు. “ప్రపంచమంతా వైరుధ్యాల పుట్టరా, ఎన్ని విరుద్ధ ప్రకృతులు గల జంతువులు సముద్రంలో సహజీవనం చేయటంలేదూ-మనమెంత? అయినా రేవతి వివేకవతి. రేపటి నుండీ భర్తకి అనుకూలవతి. నాకు తెలుసులే పద” అంటూ తానూ కదిలాడు జగన్నాథుడు.

మర్నాడు సాయంత్రం జగన్నాథుడు ‘పార్వతీరాజేశ్వర స్వామి’ దేవాలయానికి బయల్దేరుతుంటే వెంకటశాస్త్రి వచ్చి చెప్పాడు, ‘శేఖరం, రేవతీ-పెద్ద చెరువు గట్టుకు పెడగా రావిచెట్టు కింద రచ్చబండ మీద కూర్చుని-నవ్వుల పువ్వులు రువ్వుకుంటూ కబుర్లాడుకుంటున్నార’ని.

జగన్నాథుడు వారి జీవనహేలకు తాను చోదకుడు కాగలిగినానని సంతృప్తిగా ఊపిరిపీల్చుకున్నాడు.

వారం తర్వాత సరమ్మత్త వచ్చి, కూతురూ అల్లుడి సఖ్యతని మాటల్లో గలగలలాడించింది.

జగన్నాథుడికి ఇన్ని మినపసున్నుండల్ని అందించింది!

***

వారం గడిచింది.

ఆవేళ

గృహ ద్వారం దగ్గఱ.. ఓర వాకిలి నుండి కామేశ్వరి మోముని గమనించాడు జగన్నాథుడు. ఆమె మీనలోచనగా వుంది. ఇటు మామగారున్నారు. లోపల అత్తగారు మహాలక్ష్మమ్మ వంట పనిపూర్తి చేస్తోంది. భర్తని పిలవటానికి బిడియంగా వుంది కామేశ్వరికి. అర్థమైందతనికి. వస్తున్నానన్నట్టుగా సూచన చేశాడామెకు. ముసిముని నవ్వులతో లోనికి వెళ్లిపోయింది కామేశ్వరి.

ఉన్న భంగిమ మార్చి అరుగుమీద పక్కకి తిరిగి కాళ్లు నేలకు ఆనించి కూర్చున్నాడు. ఈ అలికిడికి పేరుభట్టు కూడా పక్కకి చూశాడు. .

“దక్షిణ దేశం పర్యటించి వద్దామని వుంది నాన్నగారూ!” తన మనసులోని మాటను బయటపెట్టాడు జగన్నాథుడు.

కొడుకు మాటలకు విభ్రమానికి లోనయ్యాడు పేరుభట్టు. తలెత్తి పరీక్షగా కొడుకుని చూశాడు. తన మనసుని చదివిన వాడిలా చెబుతున్నందుకు విస్మయం చెందాడు. అయితే తన తలపుల్లో ఉత్తరదేశం వున్నది. వీడు దక్షిణదేశం అంటున్నాడు. మంచిదే. ఇదొర అవకాశం. అనుభవం లోకజ్ఞతని నేర్పుతుంది అనుకున్నాడు.

“మంచి ఆలోచనే వెళ్లిరావచ్చు” అన్నాడు. క్షణమాగి “విజయవాటిక వెళ్లి కనకదుర్గమ్మని దర్శించుకుని, కొండవీడు చూడు. వెంకటగిరి ప్రభువు వెలుగోటి రాయుడప్ప నాయని వారిని దర్శించు. వారి సంస్థానం కళాసాహిత్య పోషణలో పేరు గడించినదట. తిరుమలస్వామిని దర్శించుకో. అటుపిమ్మట చంద్రగిరి వెళ్లు. అక్కడ రెండవ శ్రీరంగరాయ ప్రభువులు సంగీత సాహిత్య కళాప్రియుడని విన్నాము. వారి పుత్రులు రామదేవరాయలువారు. ఆ తర్వాత, తంజావూరు వెళ్ళు. ప్రభువు రఘునాథ నాయకుని గురించి చెప్పేదేముంది. వారి భార్య రామభద్రాంబ స్వయంగా కవయిత్రి. అప్పయ్య దీక్షితులవారు కూలంకష ప్రజ్ఞానిధి. అన్నిటికీ మించి వారు ఆంధ్రాభిమానులు.”

తండ్రివైపు నిశితంగా చూస్తూ, “అవును. వారి చతుర్మతసారం, పరిమళ, ఆనందలహరి చంద్రిక, శివార్క మణిదీపిక వంటి ముఖ్య గ్రంథాల్ని మీరు మాకు పరిచయం చేశారు కదా” అన్నాడు.

“అవును. దీక్షితులవారి అలంకార గ్రంథం ‘కువలయానందం’ దేశ ప్రసిద్ధి పొందింది కదా!”

“అవును. దానికి వారి చిత్రమీమాంసనీ పరిశీలనాత్మకంగానే చదివాను నాన్నగారూ. వాటి గురించి నా అభిప్రాయాలు వేరుగా వున్నాయి.”

“సహజమే కదా. నీకు అలంకారశాస్త్రం, మీమాంసా-రెండూ అభిమాన విషయాలు కదా!” అన్నాడు వేరుభట్టు.

జగన్నాథుని మనసులో శ్లోకం తరగలెత్తింది.

“దిగంతే శ్రూయంతే మదమలినగండాః కరటినః…” ‘మృగరాజు’ అని అనిపించుకొన్న సింహం తన వాడి గోళ్ళ పాండితిని ప్రదర్శించటానికి తగిన ‘ఉజ్జీ’ లేనందుకు వాపోవుతున్నది” ఆత్మవిశ్వాసంతో దీర్ఘ ఉచ్ఛ్వాసం కలిగింది. నవ్వుకుని తలపంకించాడు.

“భోజన వేళ అయింది కదూ” అంటూ మహాలక్ష్మమ్మ వచ్చింది. ఆమె కొంగు పట్టుకుని మాధవుడు. భోజన సమయంలో పేరుభట్టు కొడుకు ఆలోచన గురించీ, తానూ దానికి ఔనన్న సంగతి గురించి చెప్పాడు.

వెనుక గుమ్మంలో నిలుచున్న కామేశ్వరి వీరి సంభాషణని విన్నది. ఆమె బేల మనసుని పరిపరి ఆలోచనలు ముసురుకున్నాయి.

***

రాత్రి గడుస్తోంది. తాను విన్న విషయం చాలా కలత పెడుతోంది-కామేశ్వరిని. మంచం మీద మసలుతోంది.

జగన్నాథుడికీ నిద్రరావడం లేదు. కొడుకు నిద్రపోతున్నాడు.

భర్తని చూసింది కామేశ్వరి. కళ్లు తెరుచుకుని ఇంటి పైకప్పు వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు. అతన్ని ప్రశ్నలు అడగటానికి భయపడుతోంది.

“దక్షిణదేశ పర్యటనకి రేపు బయలుదేరుతాను” చెప్పేశాడు. పక్కకి తిరిగి కామేశ్వరిని చూశాడు. ఆమె కాళ్లూ, చేతులు ముడుచుకుని అతనివైపే తిరిగి వుంది. ఆమె కళ్లనిండా నీరు. ఆదరంగా ప్రేమగా కొనగోటితో కన్నీటిని తుడిచాడు. చుబుకాన్ని ఎత్తి కళ్లు చికిలిస్తూ అన్నాడు, “నిన్నూ మాధవుని వదలివెళ్లటానికి నాకూ బాధగానే వుంది. కానీ, సముపార్జించిన సంగీత సాహిత్యాల ప్రావీణ్యాన్ని కావిడి పెట్టెలో పెట్టి మూతవేస్తే ఎలా? సాధించిన విద్యలు ప్రజల పరం కావాలి. లోకాన్ని చూస్తేనే అనుభవపాఠాలు నేర్చేది. అనుభవం కొన్ని గుణపాఠాల్ని కూడా నేర్పుతుంది. అవి పురోగమనానికి రెక్కమానులౌతాయి. అయినా చాలా శాస్త్రాల సారాన్ని అనుశ్రుతంగానే సాధించుకున్న దానివి. నీకు వేరే చెప్పాలా ఏమిటి?” అన్నాడు ఆత్మీయంగా.

ఈ మాటలు చల్లగా ఆమె హృదయాన్ని ఆర్ద్రం చేశాయి. ఉద్వేగం తగ్గింది. క్రీగంట భర్తని చూసింది. తమకంగా భార్యని కౌగిలిలోకి తీసుకున్నాడు. కామేశ్వరి శృంగార రసాధిదేవతల ముగ్ధమనోహర కళావిలాసిని అయింది. ‘జగన్నాథుడు’ ‘రసగంగాధరుడై ‘భామినీ విలాసాన్ని’ అనుభూతిపరం చేసుకుంటున్నాడు.

రాత్రి గడిచి పోతోంది!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here