జగన్నాథ పండితరాయలు-20

2
10

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[జగన్నాథుడి ఢిల్లీ ప్రయాణం దగ్గర పడుతుంది. ఇంట్లో ఒంటరిగా ఏ కాలక్షేపం లేకుండా ఉండడం కష్టంగా ఉందని అంటుంది కామేశ్వరి. ఆమెకి ధైర్యం చెబుతాడు జగన్నాథుడు. ఢిల్లీకి వెళ్ళిన జగన్నాథుడు అసప్‍ఖాన్, లాహోరీలతో కలిసి నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి పనులను పరిశీలించి వస్తాడు. బసకి వచ్చేసరికి కాశీ నుంచి వచ్చిన శంకరశాస్త్రి ఎదురుపడతాడు. తన భార్య సుభాషిణితో సహా వచ్చానని చెప్తాడు. అతన్ని ముందుగా శేషవీరేశ్వరుడు, పర్వతవర్థని గురించి అడిగి, ఆపై కాశీ విశేషాలు తెలుసుకుంటాడు. రాజోద్యోగులు కావేరి అనే గుజరాతీ మహిళని జగన్నాథుని బసలో ఇంటిపనులకు నియమిస్తారు. సుభాషిణి ఆమె సహాయంతో పనులు చేస్తూ ఉంటుంది. ఒకరోజు అసఫ్‌ఖాన్ జగన్నాథుడిని పిలిపిస్తాడు. శాస్త్రిని వెంటబెట్టుకుని వెళ్ళి పరిచయం చేస్తాడు జగన్నాథుడు. కనక్‌లాల్ తరచూ వచ్చి తన పాండిత్యాన్ని ప్రదర్శించే అవకాశం కల్పించమని వేడుకొంటున్నాడని అసఫ్‍ఖాన్ చెబుతాడు. అలాగే చేయమంటాడు జగన్నాథుడు. సభ ఏర్పాటవుతుంది. ఆ సభలో కనక్‍లాల్ కాస్త వెటకారంగా మాట్లాడుతాడు. అసఫ్‌ఖాన్ కోపం తెచ్చుకునే లోపు జగన్నాథుడు కనక్‌లాల్‌ని సున్నితంగా హెచ్చరించి – సభ సాఫీగా సాగేట్టు చూస్తాడు. తన పొరపాటును గ్రహిస్తాడు కనక్‌లాల్. ఆయన కావాలనుకుంటే నిష్కల్మషమైన మనసుతో ఆగ్రా రావచ్చని ప్రకటిస్తాడు అసఫ్‌ఖాన్. సభ ముగిసాకా, కనక్‍లాల్‌ని మరోసారి హెచ్చరిస్తాడు జగన్నాథుడు. ఇంటికి వచ్చేసరికి కావేరీనీ వెతుక్కుంటూ అహమ్మదాబాద్ నుంచీ వచ్చిన పదిమంది స్త్రీ పురుషులు కనబడతారు. గుజరాత్‌లో కరువు పరిస్థితి తీవ్రంగా ఉందని, ఆ వివరం పై అధికారులకి తెలియజేయాలని వారు ఇక్కడికి వచ్చారని తెలుస్తుంది. వారితో మాట్లాడి సమస్య తీవ్రత తెలుసుకుంటాడు జగన్నాథుడు. మర్నాడు అసఫ్‌ఖాన్‌ని కలవాలని ఆయన భవనానికి వెళ్తే అక్కడ ఉండడు, జగన్నాథుని కూడా ఆగ్రా వచ్చేయమన్నారని తెలుస్తుంది. ఓ ఉద్యోగి ద్వారా అహ్మదాబాదు నుంచి వచ్చిన వారికి సహాయం చేయించి, జగన్నాథుడు ఆగ్రా బయలుదేరుతాడు. ఇక చదవండి.]

అధ్యాయం-36

[dropcap]జ[/dropcap]గన్నాథుడూ, శాస్త్రీ, సుభాషిణీ ఆగ్రా చేరారు.

జగన్నాథుడూ, కామేశ్వరీ కూడా శాస్త్రి దంపతులను తమతోనే వుండమని కోరారు. వారి కోరికని కాదనలేక శాస్త్రి దంపతులు అక్కడే వుండిపోయారు.

కామేశ్వరి ఆనందానికి అంతులేనట్టయింది. ఆమె హడావిడి అంతా ఇంతా కాదు. ఆమెకు-తాము కాశీ వచ్చినప్పుడు శేషవీరేశ్వరుడూ, పర్వతవర్థని దంపతులు వారింటిలోనే వుంచుకుని, అక్కడ నుండీ ఢిల్లీ చేరిన దాకా, కడుపులో పెట్టుకుని చూసుకున్నవారి ఆప్యాయతానురాగాలు – కళ్ల ముందు కదలినై చెమర్చిన కళ్లను కొంగుతో తుడుచుకుని పనిలోపడింది.

ఆ వారంలోనే కులపతిమిశ్రా పరిచయం అయ్యాడు. అతనూ జగన్నాథుని వద్ద సంగీతాన్ని సాధన చేసిన శిష్యుడే. ప్రత్యేకించి హిందూస్తానీ సంగీతంలోని కొన్ని రాగాల మీద ప్రత్యేకమైన పట్టు వుంది అతనికి.

శాస్త్రీ, మిశ్రా-అభ్యాసంలో, సాధనలో-శ్రుత పాండిత్యంలా కామేశ్వరికీ, సుభాషిణికీ సంగీత అధ్యయనం అయాచితంగానే లభిస్తున్నది.

జగన్నాథుడు దారా చదువుని పునఃప్రారంభించాడు. ఆర్నెల్లకాలం ఇట్టే గడిచింది.

అసఫ్‌ఖాన్ నుండీ పిలుపుగానీ, ఇతర సందేశాలుగానీ లేవు. దారాతో ఆ ప్రసక్తి తేలేదు-జగన్నాథుడు.

పాఠశాల భవనం, గురుకుల ప్రాంగణం సిద్ధమైనట్టు తెలిసింది. కానీ, వాటి ప్రారంభాన్ని అసఫ్‌ఖాన్, పాదుషావారూ తేల్చాలి.

ఆవేళ దారా తాను పూర్తిచేసిన మహర్షుల జీవిత చరిత్ర గ్రంథాల్ని చూపి వాటి వివరాలను జగన్నాథునికి చెబుతున్నాడు. అక్కడ వారిద్దరే వున్నారు. ఆ రెండు గ్రంథాలు-ఒకటి ‘సాఫినిన్ అల్-ఔలియా, రెండవది- ‘సకినితో అల్-బెలియా’-

అప్పుడు వచ్చాడు అసఫ్‌ఖాన్. ఆశ్చర్యం వేసింది. అభివాదాలు, పరామర్శలు అయిన తర్వాత, చుట్టూ కలయజూసి, “ఠీక్ హై.. ఎవరూ లేరు. మనం మాట్లాడుకోవచ్చు” అని చెప్పుకొచ్చాడు అసఫ్‌ఖాన్. “పండిట్‌జీ.. పాదుషావారూ, మేమూ కూడా వేరే రాచకార్యాల్లో క్షణం తీరిక లేకుండా వున్నాము.” అని ప్రారంభించి కొనసాగించాడు. “ఒక పక్కన కోటలో కొన్ని నిర్మాణాల మరమ్మత్తులు, కొన్ని కొత్తగా నిర్మించటం-ఇవి సాగుతున్నై. మరో వైపు మాకు ప్రధాన సమస్య ఒకటి తలెత్తింది. దక్కన్ రాజ ప్రతినిధి ఖాన్‌జాన్ లోడీ పట్ల పాదుషావారు కనికరం చూపి ఆగ్రాలో ఉండమంటే, చెప్పకుండా దక్కన్ పోయి తిరుగుబాటు మొదలెట్టాడు. షాజీనీ, ముర్తుజానీ నమ్ముకుని వారికి గులామ్ చేతులు మోడ్చాడుట! మొగలాయీ సైన్యంతో ఆటలా? ప్రభువుల వ్యూహం ఫలితంగా – షాజీ – ఇతన్ని ఒంటరిని చేసి తప్పుకున్నాడు. చేసేది లేక అక్కడి నుంచీ బుందేల్‌ఖండ్ దారిపట్టాడు. ప్రస్తుతానికి ప్రభువులు పోరుని ఆపమన్నారు. అందువలన మాకు ఈ కాస్త విరామం దొరికింది.”

జగన్నాథుడికి పరిస్థితి అర్థమైంది. పాత సంగతులు గుర్తుకొచ్చాయి. లోడీ గుర్తుకొచ్చాడు. పూర్వం అతను నూర్జహాన్ జుంటాలోని సైనికాధికారిగా పరిచయం. అంటే-డక్కన్ నుంచీ ఆమె అతన్ని లాడీ బేగం కోసం పిలిపించిందన్నమాట.

“పాదుషా వారి పట్టాభిషేకం కాగానే ఆగ్రా చేరుకున్నప్పుడు ఆ లోడీ చాలా వినయాలు చూపించాడు. అంటే అవన్నీ నక్క వినయాలన్నమాట. వెనుకటి గుణం మారలేదు. అతను నూర్జహాన్ మనిషి అని తెలిసికూడా పాదుషావారు పెద్ద మనసుతో క్షమించారు. దుష్టబుద్ధి.. ఏంచేస్తాం.. ఫలితం అనుభవిస్తున్నాడు..” దారా మాటలతో ప్రస్తుతంలోకి వచ్చాడు జగన్నాథుడు.

వెంటనే అన్నాడు అసఫ్‌ఖాన్, “ఎక్కడిదాకా పారిపోయినా అతను మనవారి చేతిలో చావాల్సినవాడే.. ఇప్పుడు వాడి వ్యవహారం కాదు, అసలు ప్రధాన విషయం వేరే సంక్షోభం తలెత్తింది. ఆ లోడీ, వాడి జుంటా అస్తవ్యస్త పరిపాలన వలన దక్కన్‍లో, ఖాందేష్‌లో కరువు విజృంభించింది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ దుర్మార్గుడి వలన మనకు ఈ రూపంలో దొంగదెబ్బ తగిలింది. నమహరామ్.”

జగన్నాథుడు అసఫ్‌ఖాన్ వైపు చూశాడు. అతని పిడికిళ్లు బిగిసి వున్నై. దవడ కండరాలు బిర్రెక్కినై మొహం కందగడ్డలా మారింది.

దారా చూశాడు. “తాతగారూ, మీరు సమర్థులు..” ఒక్కటే మాట. అసఫ్‌ఖాన్ ముఖకవళికలు లిప్తకాలంలో మారేయి. పెదవుల మీద అరనవ్వు. ఏ వాతావరణ పరిస్థితిలోనైనా ఆయనకి మనవడి పిలుపు అమృతపుజల్లు. పైగా ఇప్పుడు అదనపు ఆత్మవిశ్వాసానికి ఊపిరులూదుతున్న పొగడ్త! “సహీబాత్ బేటా!” అన్నాడు మెచ్చుకోలుగా.

జగన్నాథుడు మాట కలిపాడు. “ప్రభువులూ, మీరూ, మహబత్‌ఖాన్ సాబ్ ముందు ఏ సంక్షోభం అయినా తేలిపోతుంది సాబ్’.

“హాఁ” అని తలపంకించాడు. “అయినా, రేపు పాదుషా వారు ఆంతరంగిక సమావేశం జరుపనున్నారు. రాయముకుందుల వారూ, మీరూ వస్తున్నారు. సమయం నిర్ణయం అయిన తర్వాత మీకు అశ్వ శకటాన్ని పంపుతాను. ఇలాంటి సమస్యలకి మంచీ చెడూ చెప్పగలిగిన మీవంటి వారు తప్పక ఉండాలి.”

“జరూర్ సాబ్” అన్నాడు జగన్నాథుడు. దారా గురువుగారి వైపు కళ్లు విచ్చి చూశాడు. ఆ చూపులనిండా ఎప్పుడూ ఆరాధనా భావమే తొణికిసలాడుతూ వుంటుంది.

డక్కన్ కరువు ప్రస్తావన అసఫ్‌ఖాన్ వారి ముందు తన నుండి గానీ, రాయముకుందునినుండి గానీ, రాకపోవటం మంచిదే అయింది అనిపించింది. ఊపిరి పీల్చుకున్నాడు. కానీ, అహమ్మదాబాద్ సంగతి?

మర్నాడు- అసఫ్‌ఖాన్ చెప్పిన అంతరంగిక సమావేశం జరిగింది. అహమ్మదాబాద్ లోని కరువు సమస్యే అధికంగా చర్చకు వచ్చింది! అంటే ఈ పరిస్థితీ వారికి తెలిసిపోయింది!

కరువు నివారణకు అనేక సలహాలూ, చర్యల పట్టికలూ వచ్చాయి.

జగన్నాథుడు తానుగా రెండు సలహాల్ని ఇచ్చాడు. ఒకటి- వెంటనే అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేకించి – అహమ్మదాబాద్ నగరం, కచ్ వంటి ప్రదేశాల్లో-తీసుకోవలసిన అత్యవసర చర్యలు, రెండవది గంజి కేంద్రాల ఏర్పాటు. రాయముకుందుడు అందుకుని ఉచిత వంటశాలల ఏర్పాటు ఆవశ్యకతనీ చెప్పాడు. పాదుషా వీటన్నింటికీ ఆమోదముద్ర వేశాడు.

గుజరాత్ రాజు ప్రతినిధి షేర్‌ఖాన్‌ని మార్చమని సలహా ఇచ్చాడు మహబత్‌ఖాన్. పాదుషా అంగీకరించలేదు. డక్కన్‌లో ప్రస్తుతం ఎవ్వరూ లేరు. మాధోసింగ్‌ని తాత్కాలికంగా ఉంచాడు. డక్కన్, ఖాండేష్ గుజరాత్ వ్యవహారాల్ని కూడా-ఆగ్రా నుంచే పర్యవేక్షించటం మంచిదని అభిప్రాయపడ్డాడు అసఫ్‌ఖాన్. షాజహాన్ ఇదే మంచి సూచనగా అంగీకరించాడు.

సమావేశం ముగిసింది. అసన్ పండితరాయలుతో, రాయముకుందునితో కొద్ది సేపు గడిపి, పాఠశాల గురించి మాట్లాడి, వారికి కృతజ్ఞతలు చెప్పి, “ఇప్పుడింక రాజోద్యోగులకూ, అధికార్లకూ స్పష్టమైన వివరమైన ఆదేశాలు వెళ్లాలి” అంటూ వెళ్లిపోయాడు.

రాయముకుందుడూ, జగన్నాథుడూ తమ తమ బసలకు బయల్దేరారు.

***

చైత్ర మాసానికి కుసుమాంజలి పడుతోంది ప్రకృతి.

ఆవేళ – గురుకులానికీ, పాఠశాల భవనానికీ ప్రారంభోత్సవం.

అక్కడంతా పండగ వాతావరణం నెలకొని ఉన్నది.

కవి పండితులు, విద్వాంసులు, శాస్త్రవేత్తలు, సంగీతకారులు, కళాకారులు.. గొప్ప సమ్మేళనం. ‘కళ’ ‘కళ’లాడుతోంది -ప్రాంగణం.

రాయముకుందుడు, విద్వత్తులో వారికి సరియైన జోడు అనదగిన ‘కవీంద్రా చార్య సరస్వతి’ జోషి, కులపతిమిశ్రా, హరినారాయణమిశ్రా వేదిక దిగువన నిలిచి సంభాషించుకుంటున్నారు.

ఆగ్రా వచ్చి పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరిన కనక్‌లాల్ చేతులు నలుపుకుంటూ-అటూ ఇటూ అందరినీ పలకరిస్తున్నట్టు తిరుగుతున్నాడు. వేదికకు ఈవల శాస్త్రి-పరిచారకులకు ఏదో సూచనలిస్తూ హడావిడి పడుతున్నాడు. ఇతర ఆహూతులూ-ఎక్కువ సంఖ్యలోనే వున్నారు. ప్రత్యేకించి దారా ఆహ్వానం అందుకుని కామేశ్వరీ, సుభాషిణీ కూడా వచ్చారు.

ప్రాంతాలు వేరు, భాషలు వేరు, సంస్కృతీ వేరు, సంప్రదాయాలూ భిన్నమైనవి. కానీ, అంతరాత్మ ఒక్కటే, అది భారతీయమైన విద్యా సంస్కృతి కళాత్మకత! అదే అందరి మధ్యనా హృదయ సాన్నిహిత్యానికి సూత్రబంధనం.

జగన్నాథుడూ, దారా ప్రవేశమంటపం పక్కన నిలబడి అసఫ్‌ఖాన్ వంటి ప్రముఖుల కోసం చూస్తున్నారు.

అసఫ్‌ఖాన్, ఆయన ప్రక్కగా జహనారాబేగం విచ్చేశారు.

వారు ప్రాంగణంలోకి రాగానే పెద్దపెట్టున హర్షధ్వానాలు చేస్తున్న ఆహ్వానితులతోపాటు జగన్నాథుడు, దారా స్వాగతం పలికారు.

వచ్చి ముందు వరుసలో కూర్చున్నారు – జహనారా, అసఫ్‍ఖాన్. ఆయన ప్రక్కగా రాయముకుందుడూ, కవీంద్రాచార్యులు, జహనారా వెనుకగా కామేశ్వరీ, సుభాషిణీ.. దారా వేదిక పైకి ఎక్కి తాతగారినీ, సోదరినీ ఆహ్వానించాడు. వారిద్దరూ వేదిక మీదికి వెళ్లారు. మరోమారు హర్షధ్వానాలు!!

దారా ముందుగా రాయముకుందుని మాట్లాడమన్నాడు. ఆ తర్వాత కవీంద్రాచార్య, జగన్నాథుడు – పాఠశాల ప్రాముఖ్యతని గురించీ, గురుకులం ఆవశ్యకత గురించీ చెప్పి, దారా చొరవని అభినందించారు.

అసఫ్‌ఖాన్ లేచి ‘పాదుషా వారికీ, దారాకీ సకలకళలపట్ల గల అభిరుచికీ, అభిమానానికీ చిహ్నాలుగా అనేక కట్టడాలు, నిర్మాణాత్మక కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, వాటిలో ముందుగా ఈ గురుకుల పాఠశాల సిద్ధమయింద’నీ చెప్పాడు.

జహనారా బేగం లాంఛనంగా గురుకులం నామఫలకం మీది ముఖమల్ తెరని తొలగించి ప్రారంభించింది. కరతాళ ధ్వనులు మార్మోగినై.

“మీ అందరి భాగస్వామ్యంతో షాజహాన్ పాదుషావారి ఏలుబడి చరిత్రలో స్వర్ణయుగంగా మారాలి. పండితరాయలు వారూ, దారా వంటి అసామాన్య ప్రతిభామూర్తులు భవిష్యత్తరాలకు స్ఫూర్తి ప్రదాతలుగా అజరామరంగా నిలిచి పోవాలి. దానికి ఈ గురుకులం, పాఠశాలా దోహదం కావాలి. అందరికీ అభినందనలు” అని శుభాకాంక్షలు చెబుతూ కూర్చుంది.

కొద్దిసేపు దారా తాను పండితరాయలు వద్ద పొందుతున్న శిక్షణా-బోధనల్ని గురించి చెప్పాడు.

కవీంద్రాచార్య సరస్వతి లేచి వేదిక మీదికి వచ్చి, “దారావారు ఉపనిషత్తుల్ని అనువదిస్తున్నారు. వారికి ‘యోగవాశిష్ఠం’ని కూడా అనువదించాలనే కోరిక ఉన్నట్టు తెలిపారు. అందుకు సహకరిస్తూ నేను చేసిన హిందీ అనువాద ప్రతిని వారికి అందజేస్తున్నాను,” అని ప్రకటించి దానిని దారాచేతికిచ్చారు. కృతజ్ఞతలు చెబుతూ దానిని స్వీకరించాడు దారా.

సభ ముగిసింది. అందరూ నెమ్మదిగా బయటికి కదిలారు.

చివరికి దారా, జగన్నాథ, శాస్త్రి దంపతులు మిగిలారు. జగన్నాథుడు తన మనసుని మధనపెడుతున్న సందేహాన్ని బయట పెట్టాడు. దారాని ఉద్దేశించి అడిగాడు, “మహబత్‌ఖాన్ వారు రాలేదేం?” అని.

“వారు అజ్మీరు వెళ్లిపోయారు. పాదుషావారు ఆయన్ని అక్కడ రాజప్రతినిథిగా నియమించారు” అని ఒక్కక్షణం ఆగి, “సాదుల్లా ఖాన్ గారిని కూడా అత్యవసరంగా ఖాండేష్ వెళ్లి అక్కడి కరువు పరిస్థితినీ, పాలనా వ్యవహారాల్నీ జాగ్రత్త చేసి రమ్మని పంపారు. ఆయనా ముందు ‘జలగాంవ్’ వెళ్లారు.”

వీళ్లు ఇలా మాట్లాడుకుంటూ వుండగానే ఒక శకటం వచ్చి ఆగింది. అందులోనుండీ ఔరంగజేబు దిగాడు. అతన్ని చూస్తేనే, “మీరు వెళ్లండి పండిట్‌జీ, నేను తర్వాత వెళ్తాను” అన్నాడు దారా.. అందరూ సెలవు తీసుకుని బయలుదేరారు.

***

సంవత్సరాలు గడుస్తున్నై, ఫిబ్రవరి 1631.

షాజహాన్ పాలన – రాజ్యాన్ని అస్తవ్యస్తత నుండి తేరుకునేలా చేసింది. బుందేల్‌ఖండ్‌కి పారిపోయిన ఖాన్‌జాన్ లోడీ కలింగర్ యుద్ధంలో నిహతుడైనాడు. మాథోసింగ్ – లోడీనీ, ఆయన కొడుకు అజీజ్‌ఖాన్‌ని కూడా వధించాడు. హుస్సేన్‌షా పరిపాలన నుండి దౌలతాబాద్‌ని విముక్తం చేసి తన పతాకని స్థాపించాడు. ఆయనని బందీని చేశాడు. అటు బెంగాల్ రాజప్రతినిధి ఖాశింఖాన్‌కి ఇచ్చిన తీవ్రమైన ఆజ్ఞల వలన, అతనూ పాదుషా కఠిన నిర్ణయాల్ని అమలుపరిచాడు. దానితో అక్కడ పోర్చుగీసువారి బెడద తీరింది. బుందేల్ ప్రాంతం కూడా వీరి ఏలుబడిలోకి వచ్చింది. మంత్రాంగంలో ముఖ్యుడుగా పండితరాయలుకి పాదుషా వారి గౌరవాదరాలు పుష్కలంగా లభిస్తున్నాయి. న్యాయపరంగా, ధర్మపరంగా తీసుకోవలసిన నిర్ణయాలేకాక, ఇతర క్లిష్ట పరిస్థితుల్లోనూ అసఫ్‌ఖాన్, పాదుషా – ఇరువురూ జగన్నాథుని పరిణత సూచనలని తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో అవి సత్ఫలితాలనే ఇస్తున్నాయి.

కవి పండిత గోష్ఠులతో, ధార్మిక సమావేశాలతో, సామాజికాభ్యుదయ వ్యవహారాల చర్చలతో రోజులు గడుస్తున్నాయి.

దారా అధ్యయనం సజావుగా సాగుతున్నది. అతను ఒకవైపు ఉపనిషత్తుల అనువాదపు పనేకాక, భగవద్గీతని నిశితంగా చదువుతున్నాడు. గురువుగారి వ్యాఖ్యానం అతని ఆలోచనలకు రోజురోజుకూ కొత్త గవాక్షాల్ని తెరుస్తున్నది. పండితరాయలు శిక్షణ ఆయన సంధించే ప్రశ్నలతో దారా ప్రతిభ నవనవోన్మేషమౌతోంది. సోదరుని చదువుని పర్యవేక్షిస్తున్నది జహనారా. తద్వారా తానూ అంతో ఇంతో నేర్చుకుంటున్నది.

గురుకులంలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. దారా చొరవ వలన జగన్నాథుని అంగీకారంతో ముస్లిం విద్యార్థులు వచ్చి చేరారు. వారిలో జ్ఞానతృష్ణని కలిగించటంలో ఇద్దరూ కృతకృత్యులైనారు. శాస్త్రి, కనక్‍లాల్ కూడా పాఠాలు తీసుకుంటున్నారు. సామాజికంగా, ముందు చూపుతో, జగన్నాథుడు చేసిన సూచన సాకారం కావటం పాదుషా మెప్పు పొందింది. పాలకులలో ప్రజల్లో పెద్ద పరిణామాన్నే తెచ్చింది ఈ కార్యక్రమం.

అసఫ్‌ఖాన్ పర్యవేక్షణ తగ్గింది. ఆయన ఇప్పుడు డక్కన్, గుజరాత్, సింథ్-మూడు సుభాల వ్యవహారాల్నీ పర్యవేక్షించవలసిన బాధ్యతల్లో ఉన్నాడు. వీటికి తోడు ఆగ్రా కోటలో పునర్నిర్మాణాలు, కొత్త నిర్మాణాల పనుల్నీ చూడవలసిన బాధ్యతలూ ఉండనే ఉన్నాయి.

కనక్‌లాల్ ద్వారా కాశీ విశేషాలు వివరంగానే తెలిశాయి. రామాపురం, అనంతపురం గ్రామాల్లో జంతుబలులు కూడా ఆగిపోయాయన్న వార్త జగన్నాథునికి చాలా తృప్తినిచ్చింది. ఆయా ఊళ్లలోని యువజనులు – జగన్నాథుని అప్పటి మాటలని-వారిలో వారు తర్కించుకుని, పెద్దలకు ఎదురుతిరిగి వారిని సమాధానపరచి – క్రమేపీ మూఢాచారాలను మానిపించారు. అందులోని పెద్ద విజయం ఇది.

కనక్‌లాల్ మాటలో అత్యుత్సాహమూ, చాతుర్యమూ, వెటకారమూ, వ్యంగ్యం-అన్నీ ఉన్నై, ఈ నేపథ్యం అసఫ్‌ఖాన్‌కి తెలిసిపోయింది. పాదుషా వారికి తెలియదు. ఆతని గుణవిశేషాలు పాదుషా వారికీ తెలిసే సంఘటన ఒకటి యాదృచ్ఛికంగా జరిగింది. ఆవేళ-

దారాకి భగవద్గీత పదహారో అధ్యాయాన్ని మొదలుపెడుతున్నాడు జగన్నాథుడు. కనక్‌లాల్, శాస్త్రి, కులపతిమిశ్రా కూడా వున్నారు. ఆ సందర్భంలో పాఠశాలకు వచ్చాడు పాదుషా. ఆయన వెంట ఆయన అంగరక్షకులు తప్ప ఎవ్వరూ లేరు.

వచ్చి కూర్చుని, “మీరు కానీయండి పండిట్‌జీ, మేమూ వింటాం” అన్నాడు. జగన్నాథుడు అక్కడున్న వారిని పరిచయం చేసి, తన పాఠాన్ని కొనసాగించాడు. మొదటి మూడు శ్లోకాలూ చదివి దైవీగుణ సంపదని అర్థవివరణ చేసి, నాలుగవ శ్లోకం చదివి, ఆసురీ సంపదని చెప్పాడు.

“దైవీగుణ సంపద ముక్తిదాయకం. ఆసురీగుణ సంపద బంధహేతువు అంటున్నాడు భగవానుడు” అని “నీవు ఎటూ దైవీ సంపదతో పుట్టిన వాడవు. కనుక శోకింపవలదు-అని ధైర్యం చెబుతున్నాడు. షహజాదా వారికి ఈ వాక్యం చక్కగా అన్వయిస్తుంది” అని దారా వైపు చూశాడు. దారా వినయంగా తలవంచుకుని కూర్చున్నాడు.

పాదుషా వారు నవ్వుతూ, “బాగుంది, కానీ, పండిట్‌జీ. కొంతమందికి మంచివాడు కూడా ముంచే వాడుగా కనిపిస్తాడు కదా!” అన్నాడు. దారా ఠక్కున తలెత్తి తండ్రి వైపు చూశాడు.

“అందువలన దైవీ గుణ సంపద కలవాడు కూడా జాగ్రత్తగానే ఉండాలి” అన్నాడు పాదుషా.

జగన్నాథుడు ఏదో చెప్పబోతుంటే, కనక్‌లాల్ అందుకున్నాడు, “అసలా శ్లోకంలో ‘ఆసురీ గుణ సంపద’ అంటాడేమి స్వామీ. ఆసురీగుణ పట్టికని కూడా సంపద అంటే ఎలా స్వామీ?” అన్నాడు- ‘సంపద’ పదాన్ని నొక్కి వదులుతూ..

పాదుషా కనక్‌లాల్ వైపు చూసి భ్రుకుటి ముడిచాడు, “కనక్‌లాల్ సాబ్ చతురులే.. సాంకేతికాంశాల్ని చాతుర్యంతో పట్టుకుంటారు” అన్నాడు.

“నిజాన్ని చెప్పేవాడికి చాతుర్యం కావాలి జహాఁపనా” అన్నాడు కనక్‌లాల్ ఒకింత ఆత్మ ముగ్ధత్వంతో. “ఆఁ.. హా..” అని దీర్ఘంతీసి, “భగవద్గీత హిందువులకు ఆరాధ్యగ్రంథం. దానిలో భాషా దోషాల్ని ఎంచకూడదు కదా కనక్‌లాల్ గారూ! ప్రతిభ మంచిదే కానీ, అతి తెలివి కొన్ని చోట్ల నహీ చలేగా” అన్నాడు.

ఒక్కసారిగా వాతావరణం గంభీరమైంది. మందిరంలో నిశ్శబ్దం పరచుకుంది. కనక్‌లాల్ మొహం చిన్నబోయింది. నేలచూపులు చూశాడు.

జగన్నాథుడు ఆ సంభాషణని పొడిగించదలచుకోలేదు. పాదుషా వారిని గురించి కనక్‌లాల్‌కి తెలియదు. ఆయన అధ్యయనం గట్టిది. కళాసాహిత్య సమరాంగణ చక్రవర్తి ఆయన! వెంటనే ఆ తర్వాతి శ్లోకాన్ని అందుకున్నాడు. ఆ అధ్యాయంలో మరో పది శ్లోకాలు అయిన తర్వాత పాదుషా వారు వెళ్లిపోయారు.

అప్పుడు – జగన్నాథుడు కనక్‌లాల్‌తో, “పండిట్‌జీ.. జ్ఞానం వీచే తెమ్మెరలాంటిది. ఆహ్లాదించిన వారికి ఆహ్లాదించినంత సుఖం. ప్రభువులు సంగీత, సాహిత్య, కళా శాస్త్రాల్ని బాగా చదివిన పండితులు. రసహృదయులు. స్వయంగా గాయకులు, పారశీకంలో కవిత్వాభినివేశమూ ఉంది” అన్నాడు.

గురూజీ తండ్రిని గురించి ఈ విధంగా చెప్పటం దారాకి చాలా సంతోషం కలిగించింది. మెప్పుదలని చూపుల్లో నింపాడు.

క్షణాల తర్వాత ఒక్కమాట అన్నాడు దారా. “చేతనత్వం అనేది అన్వేషణలో ఉంది. నిజమే కానీ, అది రంధ్రాన్వేషణ కారాదు కదా!” అక్కడ ఉన్న అందరూ దారావైపు చూస్తూ “సహీ బాత్” అన్నారు. ఆనాటికి పాఠం ముగిసింది.

అందరూ కదిలారు. జగన్నాథుడూ, దారా – గురుశిష్యులిద్దరూ ఒక శకటంలో ఎక్కారు. ఇది మామూలే- ప్రతిరోజూ అదే కార్యక్రమం. జగన్నాథుడు వద్దన్నా దారా దీన్ని అలవాటు చేసుకున్నాడు. గురువుగారిని ఇంటి వద్ద దించి తాను తన భవనానికి వెళ్తాడు.

దారిలో దారా శ్లోకాన్ని అందుకున్నాడు.

“రేరే ధుత్తూర! భిత్తేః పరిమృదిత మృదః క్వాపి కోణే జనిత్వా

ప్రాప్యాభిభ్యాం తదాఖ్యాం కనక మితి పునః కాంచన స్యాపి లోకే

మందం మందం స్మరారే ర్మణి మకుట తటే తత్ర లబ్ధ్యావకాశమ్

నో జానీషేక లేశం స్మరసి చ న పునఃపూర్వవృత్తాంత లేశమ్”

(ఓరి ధుత్తూరమా! ధూర్తా! ఎక్కడో వో చెత్తలో పుట్టేవు. కనకం పేరుపెట్టుకుని నెమ్మదిగా బంగారాన్ని అనుకుని మురిసిపోతున్నావు. నెమ్మదిగా శివుడి తలమీది కెక్కావు. అక్కడే ఉన్న చంద్రుని చులకనగా చూస్తున్నావా? గతంలోని నీ బతుకుని అప్పుడే మరిచిపోయావా? (ధూర్త అనే శబ్దానికి ఉమ్మెత్త అనీ, మోసగాడు అనీ అర్థాలున్నాయి.) ఇద్దరూ నవ్వుకున్నారు!

అధ్యాయం-37

పాదుషా వారు ఉదయాన్నే కబురు చేశారు. ఇప్పుడు మధ్యాహ్నమైంది. జగన్నాథుడు శకటం కోసం ఎదురు చూస్తున్నాడు.

నడి వేసవి. పెనం మీది గింజల్లా మాడిపోతున్నారు జనం. మిన్నూ మన్నూ పెంధూళితో ఏకమై పోతున్నై. అప్పటికెప్పుడో వాపీకూప తటాకాలన్నీ ఎండిపోయినై. తోటలూ దొడ్లు, వాడా వీడు నిప్పచ్చరమైన దుస్థితి. చెట్లన్నీ రంగుమార్చుకుని దుమ్ములో పొర్లాడి లేచి నిలబడిన ఆకతాయిల్లా నిలబడి ఉన్నై. ఆకు అల్లల్లాడటం లేదు. అవిశెచెట్లమీద, చింతచెట్లమీద వివిధ భంగిమలలో కూర్చునీ, నిలబడీ కనువిందు చేస్తూ వుండే నెమళ్ళు ఏ స్థావరం చేరుకున్నాయో కనపడకుండా పోయినై.

వాతావరణం మనసుకు ఇరుగ్గా వుంది. దేహం చిరచిరలాడుతున్నది. బయటికి వెళ్ళాలనే ఉత్సాహం లేదు. కానీ, పాదుషావారి ఆజ్ఞ.

ఉన్నట్టుండి (ఆంధీ) దుమ్ము తుఫాను రేగింది!

గాలీధూళీ ఈడ్చి ఈడ్చి కొడుతున్నై. సేవకులు నలుగురూ భవనం తలుపుల్నీ, కిటికీ రెక్కలనూ మూస్తూ హడావిడి పడుతున్నారు. కేటాయించిన స్థలాల్లో నిలిచే అవకాశం కూడా లేకుండా దుమ్ము పేరుకుంటోంది. లోపలికి వచ్చి గోడవారగా నిలబడ్డారు.

ఇంట్లో వాళ్ళు మూలలు వెతుక్కుని కూర్చున్నారు. వాళ్ళని చూస్తూ సేవకుల్ని చూస్తూ – తన భావనా ప్రపంచంలోకి తాను నడిచాడు జగన్నాథుడు. కొద్దిసేపటి తర్వాత “శాస్ర్తీ! ఏమిటోయ్ ఈ ఝంఝామారుతం పొగరు” అంటూ “జాతం ప్రాభవ మద్యతే విధివశాత్ కించి త్తదప్యం తతో ఝంఝామారుత!” అనే శ్లోకాన్ని చదివాడు.

“మహబాగా చెప్పారు. దీని ప్రతాపం తాత్కాలికం. ఈ భాగ్యానికే ఇంత మిడిసిపాటు!” అన్నాడు శాస్త్రి. “గురువు గారికి సమయ నేపథ్యమే ఎప్పుడూ కవిత్వ సందర్భాన్ని కూరుస్తుంది. చూశారా.. మనమేమో తుఫాన్‌ని చూస్తూ కూచున్నాం. గురువుగారు శ్లోకాన్నిచ్చారు” అన్నది సుభాషిణి. “గురువుగారి శ్లోకాల్లో కాలం నాలుగో సింహం – అంటూ ఒకసారి చాలా వ్యాఖ్యానాన్ని ఇచ్చాడు నాగేశుడు” అన్న శాస్త్రి మాటలకు, “చెప్పు.. చెప్పు.. మిగిలిన మూడూ..?” అడిగింది కామేశ్వరి ఉత్సాహంగా.

“సంఘటన, భావశబలత, రమణీయార్థ ప్రతిపాదిక శబ్ద సముచ్ఛయం. అది అంతా అలంకారమయం కదా – గురువుగారి కవిత్వం” అని విశదం చేశాడు. “అవును సుభాషిణీ. ఇలా అలవోకగా పలికిన శ్లోకాలు శతసహస్రం ఉన్నై. నేను రాసి భద్రం చేసినవి కాక, పోయినవి ఎన్నెన్నో” అన్నది కామేశ్వరి బాధపడుతూ. “వాటి సేకరణ, జాగ్రత్త చేయడం – మన బాధ్యత మరి” శాస్త్రి అన్నాడు.

వీరిలా మాట్లాడుకుంటూ ఉండగానే, ఓ ప్రక్క నుంచీ చల్లటి గాలీ, మరోవైపు నుంచీ టపటపా చినుకులు మొదలయినై.

“ఇదే ఆంధీ లక్షణం. అంతలో ఏడుపు, అంతలో నవ్వూ!” అన్నాడు శాస్త్రి పెద్దగా నవ్వుతూ. “ప్రకృతి చిత్రమైన పోకడలు పోతూ వుంటుంది”. చిరునవ్వుతో అన్నాడు జగన్నాథుడు. “అదే మరి, సుఖదుఃఖాల జంజాటపు హెచ్చరిక” అన్నది కామేశ్వరి వేదాంత ధోరణిలో. “అసలు రహస్యం ఇంకోటి వుంది” అన్నది సుభాషిణి ఊరిస్తున్నట్లుగా. “చెప్పండి శ్రీమతిగారూ” అన్నాడు శాస్త్రి నాటకీయంగా. స్వరాన్ని బాగా తగ్గించి “ఏలినవారి ఆగ్రహానుగ్రహాల ప్రకటనల లాగా” అన్నది సుభాషిణి.

“నిజం.. నిజం.. మొత్తానికి సృష్టిలో, దృష్టిలో భిన్నత్వం, ఏకత్వం, వైచిత్రీ, వైవిధ్యం – అన్నీ కదులుతున్నై- వ్యాఖ్యానాల్లో! వాటన్నిటి సమాహారమే సమదర్శనం” అని నవ్వాడు జగన్నాథుడు.

బయటి నుంచీ శకటసారథి పిలిచాడు.

“సరి” అంటూ లేచి బయలుదేరాడు జగన్నాథుడు.

***

జగన్నాథుడు వెళ్ళేసరికీ – పాదుషా, ఎవరో ముగ్గురు పెద్దమనుషులతో మాట్లాడుతున్నాడు. పాదుషా ప్రక్కన అసఫ్‌ఖాన్ కూర్చుని ఉన్నాడు.

అభివాదాల తర్వాత, అసఫ్‌ఖాన్ ఆ ముగ్గురినీ పరిచయం చేశాడు, “అబ్దుల్ హసన్, ఉస్తాద్ మన్సూర్, బిషన్‌దాస్  – సుప్రసిద్ధ చిత్ర శిల్ప కళాకారులు. మీకు తెలియదేమో -జహంగీర్ వారి ఆస్థానంలోనూ ఉండేవారు వీరు” అని, “మన పాదుషావారి సూచనల మేరకు శీష్‍మహల్, ముసమ్మాన్ బుర్జ్- వంటి కొత్త కట్టడాలకి – అందాలూ, అలంకారాల విషయాలు చూస్తున్నారు” అని వివరణనిచ్చాడు.

కొద్దిసేపటికి ఆ ముగ్గురూ వెళ్ళిపోయారు.

“తమరు ఎప్పుడు వచ్చారు?” అసఫ్‌ఖాన్‌ని అడిగాడు జగన్నాథుడు.

“మామగారు ఎప్పుడైనా వచ్చేస్తారు. వారు ఇక్కడా వుంటారు. అక్కడా వుంటారు. ఎక్కడైనా వుంటారు. మీ శ్రీకృష్ణుడు లాగా” నవ్వుతూ అన్నాడు పాదుషా.

“వద్దు.. వద్దు.. నన్ను అంతవాణ్ణి చేయకండి” అన్నాడు అసఫ్‌ఖాన్.

పాదుషా చిరునవ్వే సమాధానమయింది.

కొద్దిసేపటి మౌనం తర్వాత పాదుషా, “పండి‍ట్‌జీ, ఒక సంకటం వచ్చింది” అంటూ మొదలెట్టాడు.

“సెలవీయండి”

ఇప్పుడు అసఫ్‍ఖాన్ చెప్పసాగాడు.

“గోల్కొండ, బిజాపూర్ ప్రభువులు కూడా, పాదుషావారి ఏలుబడికి తలవంచారు. మన పంటికింది రాయిగా మిగిలింది – ఖాందహార్. ఆ వ్యవహారం స్వయంగా ప్రభువుల పర్యవేక్షణలో వుంది. అదను చూసి విరుచుకు పడుతుంది. మన సైన్యం” అని “ఇలా రాజకీయంగా కొంత స్తిమితం చిక్కింది. అనుకుంటున్న తరుణంలో కొత్త తలనొప్పి తగులుకుంది” అని ఆగాడు.

పాదుషా కలుగుజేసుకుని, “నిజం చెప్పాలంటే ఈ తలనొప్పిని ఒకవిధంగా మనమే తెచ్చుకున్నాం” అన్నాడు.

“మునుపెన్నడో, ఎవరో ముస్లిం పెద్దలు మూకుమ్మడిగా వచ్చి హిందువులు ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక దేవుని పేరుతో దేవాలయ నిర్మాణం చేపట్టటం, దాన్ని మధ్యలోనే ఆపేయటం, ఏ రాజపుత్రుల విరాళం కోసమో, వితరణ కోసమో పోయి అర్థిస్తూ ఉండటం. ఈ అసంపూర్ణ నిర్మాణాలన్నీ అలా మొండేలుగా ఉండటం పెద్ద ఇబ్బందిగా తయారైందని పాదుషా వారికి ఫిర్యాదు చేశారు” అన్నాడు అసఫ్‌ఖాన్.

“మేము వెంటనే వాటిని కూల్చేయమనీ, అంతేగాక కొత్త కట్టడాలు ఏవీ మొదలుపెట్టకూడదనీ – ఫర్మానా ఇచ్చాము” అని “అప్పుడు మీరు రాజధానిలో లేరు లెండి” అన్నాడు పాదుషా.

“ప్రభువుల ఆజ్ఞ ఆసరాతో, అత్యుత్సాహంతో రెచ్చిపోయి ముస్లిం మూకలు కొందరు ఇలాంటి సందర్భాల్ని దుర్వినియోగం చేయటం సహజమే కదా! అలాంటి వారు ఆ అసంపూర్ణ కట్టడాల్నీ, మరికొన్ని అసలు దేవాలయాల్ని కూడా విచక్షణ లేకుండా కూలగొట్టారు. దీనివలన పాదుషా వారికి చెడ్డపేరు”.

జగన్నాథుడు మందహాసంతో “చందనపు చెట్టు గొప్పతనం ఎలా ఉందంటే తనకు అపకీర్తి తెచ్చే నాగుపాముల్ని కూడా భరిస్తూనే ఉంటుంది” అన్నాడు.

“అవును. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు మీ వాళ్ళంతా అలజడీ, నిరసనలూ.. వాళ్ళూ వీళ్ళూ కలబడి కొట్టుకు చావటం..” అసఫ్‌ఖాన్ ఆగాడు.

“పండిట్‌జీ.. మీరు మా ప్రభుత్వంలో ధర్మాధికారి పదవిలో ఉన్నారు! ప్రధాన న్యాయమూర్తి కన్నా పైవారు. ఈ సంక్షోభ నివారణకు సలహా చెప్పండి” పాదుషా అన్నాడు.

విషయాన్ని చల్లగా వివరించి ఇద్దరూ మౌనం వహించారు.

జగన్నాథునికి మనసు కలచినట్లయింది. పరిపాలన మహమ్మదీయులది. వారి అధికారానికి లోబడే హిందువులు జీవనం కొనసాగిస్తున్నారు. అక్బర్ పాదుషా అవలంబించిన మతసూత్రాలు దాదాపు అన్నీ ఆచరణలో ఉన్నాయి. అక్కడక్కడా విభేదాలూ, వివక్షలూ క్షేత్రస్థాయిలో కొన్ని అరాచకాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ, మొత్తం మీద హిందూముస్లిమ్‌ల సఖ్యత కొనసాగుతున్నది. దీనికి పాలకుల బలం ప్రముఖ కారణమైతే, పాలితుల తప్పనిసరి అణకువా కారణమే! ఇప్పుడు జరుగుతున్నది అవాంఛనీయమైన ఘటనే. సమస్య క్లిష్టమైనదే. పరిష్కారానికి ఉన్న మార్గం ఒక్కటే. అది పాదుషా హిందూ సమాజానికి చేసిన మంచి పనులన్నింటినీ ప్రజల ముందు ఉంచటమే!

ఇదే సలహాని ఇద్దరికీ చెప్పాడు. పాదుషా మొహం వెలిగింది. అసఫ్‌ఖాన్ ఆలోచిస్తున్నాడు. ఆయన సందేహాన్ని ఊహించి అన్నాడు జగన్నాథుడు. “రాజధానిలో హిందూ సమాజం పెద్దలు వున్నారు కదా! వారిని పిలిపించి మాట్లాడదాం. వారు సమాధానపడితే, ఆ విషయం కింది శ్రేణులకు చేరటం వెంట వెంటనే జరిగిపోతుంది. అన్ని గొడవలూ సద్దుమణుగుతాయి.”

“బాగుంది. పాదుషా వారు అనుజ్ఞ ఇస్తే, ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయిస్తాను”. అన్నాడు అసన్, “అచ్ఛా హై.. బహుత్ బహుత్ షుక్రియా పండిట్‌జీ” అని అభినందించాడు పాదుషా.

ఆ తర్వాత, జరుపబోయే సమావేశంలో చెప్పవలసిన అంశాలమీద చర్చించుకున్నారు. ఒక అవగాహన కుదిరింది.

జగన్నాథుడు సెలవు తీసుకుని వచ్చేశాడు.

హిందూ పండితుల్నీ, సామాజిక కార్యకర్తల్నీ, ఇతర ముఖ్యుల్నీ సమావేశ పరచటానికి వారం పైనే సమయం పట్టింది.

ఆవేళ-

సమావేశం గురుకులంలో ఏర్పాటయింది. అసఫ్‌ఖాన్, దారా, రాయ ముకుందుడూ, జగన్నాథుడు మాత్రమే ప్రభుత్వ పక్షంగా కూర్చున్నారు. శాస్త్రి ప్రేక్షకుల్లో ఉన్నాడు.

ప్రాథమిక చర్చలూ, అభిప్రాయాల ఖండనముండనలూ అయిన తర్వాత చివరగా జగన్నాథుడు మాట్లాడాడు. “జరిగిన యథార్థం, వాస్తవ స్థితిగతులు అన్నీ యిప్పుడు మన కందరికీ తెలిసినై. పాదుషావారికి ఏ దురుద్దేశాలూ లేవనీ వివరించారు అసఫ్‍ఖాన్ వారూ, షహజాదా దారావారూ! దీనికి దాఖలాగా ఒక్క ముఖ్య విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను – మళ్ళీ భద్రావతీ నదీతీరంలో కరౌలీలో గల మదన్ మోహన్ దేవాలయాన్ని మరమ్మత్తులు చేయించింది పాదుషా వారే గదా! అక్కడ ఘంటానాదాన్ని అడ్డుకుంటే ఎవరయినా శిక్షార్హులు అనే ఫర్మానాని పక్కాగా జారీ చేసింది కూడా పాదుషా వారే కదా!”

“అవును.. అవును..” అని కొందరు ఠక్కున సమాధానం చెప్పారు.

“అంతే కాదు. కేశవరాయ్ దేవాలయానికీ, మన్ కామేశ్వర్ దేవాలయానికి దారావారు అవసరమైన మరమ్మత్తులు చేయించి భక్తులకు అదనపు సదుపాయాలు సమకూర్చారా లేదా?” రాయముకుందుడు అన్నాడు.

“అవును.. ఇదీ వాస్తవమే” మరోవైపు ఒకరిద్దరి జవాబు.

“ఇప్పుడు మనమంతా ఒక అవగాహనకు వద్దాం. గతం నాస్తి. కొత్త దేవాలయాలు నిర్మించుకో దలచుకుంటే – స్థలం గురించీ, ప్రాంతం గురించీ ఇతర సమస్యలు ఏవీ లేకుంటే ప్రభుత్వం అనుమతిస్తుంది. హిందూ ముస్లిం భాయీ భాయ్ శాంతియుతంగా కలిసి జీవిద్దాం!” ఈ మాటలు అసఫ్‌ఖాన్ అనటం బాగా పనిచేసింది. అందరూ “ఠీక్ హై.. ఠీక్ హై..” అన్నారు..

“మీరీ నిర్ణయాల్ని ఇతర ప్రాంతాలకి తెలియజేయండి. పరిస్థితులలోని వేడి చల్లబడుతుంది” అన్నాడు దారా. అలాగే అన్నట్టుగా తలలు ఊగినై.

సమావేశం ముగిసింది. అందరూ వెళ్ళిన తర్వాత అసఫ్‌ఖాన్, “పండిట్‌జీ, మీ సలహా చక్కగా పనిచేసింది” అని ధన్యవాదాలు తెలిపాడు.

అప్పుడు గంభీరముద్ర దాల్చాడు జగన్నాథుడు. క్షణాల తర్వాత శ్లోకాన్ని చెప్పాడు.

అసఫ్‌ఖాన్‌కి అర్థమైంది. దారా అన్నాడు, “చక్రవర్తి కల్పవృక్షమైతే మంచిదేకానీ, అడిగినవారికి అడిగినట్లు వరాలివ్వకూడదు. కొంచెం వివేకమూ కావాలంటున్నారు. గురువుగారు”

అవునన్నట్లుగా తల పంకించాడు అసఫ్‌ఖాన్. అంతా చూస్తున్న శాస్త్రి కళ్ళనిండా వెలుగే! ఆ వెలుగు సర్వం పండితరాయల పట్ల ఆరాధనాభావమే!!

***

నదీరాబాను బేగమ్‌తో దారా వివాహం వైభవోపేతంగా జరిగింది. జహనారా సర్వమూ తానే అయి నిర్వహించింది ఆ శుభకార్యాన్ని, ఆ సందర్భంలో సంగీత సాహిత్య సమ్మేళనాలు జరిగాయి. లాల్‌ఖాన్ అతని కుమారుడు కుశాల్‌ఖాన్ ఖల్వంత్ ప్రత్యేక సంగీత కచ్చేరీ చేసి శ్రోతల్ని అలరించారు. సాహిత్య సమావేశంలో జగన్నాథుని ద్రుపద్‌లు ప్రత్యేకాకర్షణగా ప్రశంసలు పొందాయి.

***

ఇది జరిగిన కొన్ని నెలల్లోనే పాదుషా కుడిబుజం వంటి మహబత్‌ఖాన్ మరణించాడు. పాదుషా, బంధుమిత్రులు, రాజోద్యోగులూ అందరూ ఎంతో చింతించారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here