జగన్నాథ పండితరాయలు-22

0
15

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[అసఫ్‍ఖాన్ మందిరంలో ఆయనా, జగన్నాథుడు ఉన్న సమయంలో జగన్నాథుని ప్రతిభని పొగిడి హిందూ మహ్మదీయ సఖ్యతకు జగన్నాథుడి కృషి అమోఘమని ప్రశంసిస్తాడు. అవి తన మాటలే కాదు పాదుషా అభిప్రాయాలు కూడా అని చెబుతాడు. ఇంతలో పాదుషా వారిద్దరిని రమ్మని కబురు చేస్తాడు. తాను కాశ్మీరం వెళ్ళదలచానని, తనతో బాటు జగన్నాథుడినీ, శాస్త్రిని కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానిస్తాడు. అక్కడి సంగీత సాహిత్య రంగాల ప్రముఖులకు మార్గదర్శనం చేయమని కోరుతాడు. తనకీ ఆహ్వానం దక్కలేదని అసూయ పడతాడు కనక్‍లాల్. గురుకులంలో బోధన అనంతరం చర్చ రాజ్యవ్యవహారాలపైకి మళ్ళుతుంది. గురువు గారి కాశ్మీరం ప్రయాణం గురించి గుర్తు చేస్తాడు దారా. అక్కడే ఉన్న కనక్‍లాల్ అసూయతో మాట తూలుతాడు. దారా విస్తుబోయి ఏదో అనబోయే లోపు, జగన్నాథుడు చూపులతోనే వారిస్తాడు. అక్కడ్నించి వెళ్ళిపోతాడు కనక్‍లాల్. కశ్మీరంలో పండితరాయ దంపతులు, శాస్త్రి దంపతులు అన్ని సందర్శనీయ ప్రాంతాలను దర్శిస్తారు. భంభర్‍లో ఏర్పాటయిన సంగీత, సాహిత్య ఉత్సవాలకు పాదుషా, అసఫ్‌ఖాన్ చేరుకుంటారు. వారితో పాటు సైన్యాధికారి ముజాఫర్ కూడా వస్తాడు. మొదటి రోజు ఉదయం సాహిత్యోత్సవం, రెండవ రోజు సాయంత్రం సంగీత సమ్మేళనం నిశ్చయమవుతాయి. సాహిత్యోత్సవంలో జగన్నాథుడి ప్రతిభాపాటవాలు సభికులకు వెల్లడవుతాయి. ప్రభువుల, తోటి సాహితీవేత్తల ప్రశంసలు పొందుతాడు. పాదుషా తమ బృందంతో కలిసి అక్కడి కళాభవనం సందర్శిస్తాడు. ఆ భవన నిర్మాణ కౌశలానికి అంతా అబ్బురపడతారు. ఒక్కో వేదిక మీద అక్కడ ఉన్న శిల్పచిత్ర ఆకృతుల గురించి వివరిస్తాడు భంభర్ రాజోద్యోగి. వాటన్నింటిని పాదుషా కోసమే నిర్మింపజేశానని చెప్తాడు భంభర్ పాలకుడు భూపతి. మూడవ వేదిక మీద ఉన్న ‘లవంగి’ చిత్రాలకు అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తాడు జగన్నాథుడు. లవంగి చిత్రపటాలను చూసి ఉద్విగ్నతకు లోనవుతాడు పాదుషా. జగన్నాథుడు కూడా భావనోద్వేగాల్లోనూ, ఉత్తేజిత స్పందనల్లోనూ లీనమై ఉంటాడు. జగన్నాథుడు చెప్పిన కొన్ని శ్లోకాల పట్ల అభ్యంతరం చెబుతుంది కామేశ్వరి. శాస్త్రి గురువుగారిని సమర్థిస్తాడు. సంగీత ఉత్సవంలోనూ జగన్నాథుడు విశేషంగా ఆకట్టుకుంటాడు సభికులని. జగన్నాథుడికి, డైరింగ్‍ఖాన్‌కి తులాభారం ఏర్పాటు చేస్తాడు పాదుషా. ఆ డబ్బుని పేదవారికి పంచుతాడు. ఇంతలో భంభర్‍లో మతఘర్షణలు చెలరేగడంతో ఆగ్రా ప్రయాణం వాయిదా పడుతుంది. పాదుషా వారితోనూ, ఇతర ఉన్నతాధికారులతోనూ సమావేశమైన జగన్నాథుడు ఆ సమస్యకి ఒక పరిష్కారం చెబుతాడు. దాన్ని ఇరువర్గాల వారు ఆమోదించడంతో అక్కడ శాంతి నెలకొంటుంది. పాదుషా జగన్నాథుని అభినందిస్తాడు. అంతా ఆగ్రాకి బయలుదేరుతారు. ఇక చదవండి.]

అధ్యాయం-40

[dropcap]జగ[/dropcap]న్నాథుడు బృందం ఆగ్రా తిరిగి వచ్చి తన దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమైంది.

ఆ వేళ పండితరాయలకు గురుకులంలో అఖండ స్వాగతాన్ని ఏర్పాటు చేశాడు దారా. కొందరు సంగీత సాహిత్యకారుల్నీ ఆహ్వానించాడు.

విశేషమేమంటే ఢిల్లీ నుండీ వంశీధరమిశ్రుడు వచ్చి ఉన్నాడు. దారా వారి అనుజ్ఞతో కొన్నాళ్ల క్రితం ఆయన్ని ఇక్కడికి రావించారట. ఈ సంగతి చెప్పి, “నూర్జహాన్ బేగమ్ ప్రాపకంలో బ్రతికినవాడు. ఇప్పుడు రోజులు కష్టంగా ఉన్నాయని బాధ పడుతున్నాడు. కనక్‌లాల్ ఆయన తరఫున ఘోషించాడు. సరే రమ్మన్నాను. ఎంత చెడ్డా పండితుడే కదా!”

అవునన్నట్టు తలవూపి, “షహజాదా వారిది గొప్ప మనసు. వారి ఔదార్యం దొడ్డది” అని మెచ్చుకున్నాడు జగన్నాథుడు.

కార్యక్రమం మొదలైంది.

సంగీత సాహిత్యాల్లో అమేయ ప్రజ్ఞని చూపి పాదుషా వారిని అలరించి వచ్చిన తన గురువుపట్ల ఎంతో గౌరవాన్ని చూపి, బహుమానాల్ని అందజేశాడు దారా.

“సంగీతంలో పన్నెండు రాగాలలో ద్రుపద్‌ని గానం చేసి మెప్పుపొందటమే గాక, వాగ్గేయకారుడుగా ఆశువుగా గీతాల్ని వినిపించిన గాన సముద్రుడుతన గురువు” అని పొంగిపోయాడు. “వీటన్నింటికీ మించి పండితరాయ పదవిలో ధర్మనిర్ణయాన్ని చేస్తూ, న్యాయమార్గాన్ని సూచించి పాదుషా వారిని క్లిష్ట సమయాల్లో సమస్య నుంచీ ఆడుకొంటున్న సద్యఃస్ఫూర్తిమంతుడు గురువుగారు” అని ఉద్విగ్నంగా ఆరాధనా భావంతో ప్రశంసించాడు.

ఆ సభలో కనక్‌లాల్ ఉన్నాడు. దారా చెప్పినదంతా విన్నాడు..

కాశ్మీరం, భంభర్‍లని కన్నులారా చూడకపోయినా, మనోయవనిక మీద దృశ్యావిష్కారం కావించుకున్నాడు. ఆయన పాలిట కాశ్మీరం తీసుకుపోకపోవటమే ఒక గోరు చుట్టు వంటిదైతే, అటుపై భంభరంలో జగన్నాథుడికి ఏకంగా తులాభారం జరగటం ఆ గోరుచుట్టు మీద రోకటి పోటు వంటిదయింది. అంతకుమించి – ఇక్కడ – ఇప్పుడీ పొగడ్తలూ.. సన్మానాలూ..! కడుపు రగిలిపోతోంది. కంటగింపయింది. తన పక్కన కూర్చున్న వంశీధరునితో గొణుగుతూనే ఉన్నాడు.

ఆ కార్యక్రమమంతా అయింది. ఎటువారు అటు వెళ్లారు. దారా, జగన్నాథుడూ, శాస్ర్తీ, ఒకరిద్దరు శిష్యులూ మిగిలారు. వారికి దగ్గరగా వచ్చాడు కనక్‌లాల్.

కనక్‌లాల్ మనసు నిలవటం లేదు. అట్టిది, ఇట్టిది అని గానీ చెప్పటానికి సాధ్యం కాని మనోవేదన అది. కారణం అది ఈర్యాజనితం! కడుపు మంట చల్లారాలంటే మాట బయటపడాలి, పడింది ఇలా – “ఒక్క విషయం మాత్రం నా వంటివాడికి మళ్లీ స్పష్టమైంది. ‘విష్ణువుగానీ, శివుడుగానీ చివరకు ఆ రాత రాసిన బ్రహ్మ కూడా తలరాతను మార్చలేడు’ అంటారు. నా విషయంలో ఇదే సత్యమనిపిస్తోంది – షహజాదా సాబ్”

ఆశ్చర్యంగా చూశాడు శాస్త్రి. జగన్నాథుడేమీ ఆశ్చర్యపోలేదు.

దారామాత్రం నవ్వి ఊరుకున్నాడు. కానీ, అంతలోనే ఏదో స్ఫురించినట్లు- “సౌమ్యత్వం, ఆత్మనిగ్రహం స్వచ్ఛమానసం – ఇవన్నీ అంత తొందరగా అబ్బవు కొందరికి” అన్నాడు.

కనక్‌లాల్ విన్నాడు. ఆయనకి ఇది చెంపదెబ్బలాంటిదే. కానీ, ఆయన స్వభావం ఈ దూషణ భూషణ తిరస్కారాలకి అతీతమైపోయింది. వంశీధరుని వైపు చూసి రహస్యంగా, “చూశావా-వీళ్ల పొగరు!” అన్నాడు. ఏమనాలో తెలియక దిక్కులు చూశాడతను.

“గురువుగారు వచ్చేశారు కనుక, మేము మా పాఠాలు మొదలుపెట్టుకుంటాం. రేపటి నుండీ కొత్తగా వచ్చి చేరేవారికి మీరూ, వంశీధరులవారూ బోధన మొదలుపెట్టండి, బాగుటుంది.” అని పండితరాయలవైపు చూశాడు దారా. “అలాగే” అన్నాడాయన.

కనక్‍లాల్, వంశీధరుడూ ‘తప్పద’న్నట్టుగా తలలూపారు.

అందరూ బయటికి కదిలారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here