జగన్నాథ పండితరాయలు-23

1
11

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[ఆగ్రాకి తిరిగివచ్చిన జగన్నాథుడి బృందంలోని వారంతా తమ తమ పనుల్లో నిమగ్నమవుతారు. గురుకులంలో జగన్నాథుడికి అఖండ స్వాగతాన్ని ఏర్పాటు చేస్తాడు దారా. సంగీత సాహిత్యకారులని పిలిచి కార్యక్రమం ఏర్పాటు చేయిస్తాడు. దానికి ఢిల్లీ నుంచి వంశీధరమిశ్రా వస్తాడు. అతడు ఇక్కడెందుకు ఉన్నాడో దారా చెబుతాడు. దారా ఔదార్యాన్ని ప్రశంసిస్తాడు జగన్నాథుడు. సంగీత సాహిత్యాల్లో అమేయ ప్రజ్ఞని చూపి పాదుషా వారిని అలరించి వచ్చిన జగన్నాథుడి పట్ల ఎంతో గౌరవాన్ని చూపి, బహుమానాల్ని అందజేశాడు దారా. గురువు గారి ప్రతిభను ఎంతగానో ప్రశంసిస్తాడు. ఆ సభలో కనక్‍లాల్ కూడా ఉంటాడు. కశ్మీరు వెళ్ళలేకపోవటం ఒక బాధ, భంభర్‍లో జగన్నాథుడి తులాభారం వల్ల కలిగిన అసూయతో రగిలిపోతాడు కనక్‍లాల్. తన పక్కన కూర్చున్న వంశీధరునితో గొణుగుతూనే ఉంటాడు. కార్యక్రమం ముగిసాకా, దారాతో మాట్లాడి, తన ఈర్ష్యను బయటపెట్టుకుంటాడు. దారా నవ్వి ఊర్కొని, కొన్ని క్షణాల తరువాత – ఆత్మనిగ్రహం అంత తొందరగా అబ్బదు కొందరికి – అని అంటాడు. చెంపదెబ్బ లాంటి ఈ మాటలు కనక్‍లాల్ విన్నప్పటికీ, ఏమీ పట్టించుకోడు. పైగా, వంశీధరుడితో రహస్యంగా – చూశావా, వీళ్ళ పొగరు – అని అంటాడు. గురువుగారు వచ్చేశారు కనుక తామిద్దరం అధ్యయనం సాగిస్తామని; కొత్తగా వచ్చినవారికి వంశీధరుడిని, కనక్‍లాల్‌ని పాఠాలు చెప్పమంటాడు దారా. వాళ్ళిద్దరూ తప్పదన్నట్లు తలలూపుతారు. అందరూ అక్కడ్నించి బయల్దేరుతారు. ఇక చదవండి.]

అధ్యాయం-41

[dropcap]సం[/dropcap]వత్సరాలు గడుస్తున్నాయి. 1638.

రాజకీయంగా పాదుషా వారి పరిస్థితులు ఒక స్తిమిత స్థితికి చేరాయి. మహాబత్‌ఖాన్ మరణించాడు. దానితో డక్కన్- వ్యవహారాల్నీ అసఫ్‌ఖానే చూస్తున్నాడు.

షాజహాన్ తన కొడుకైన ఔరంగజేబుని కూడా రాజ్యపాలనలో భాగస్వామిని చేసి అసఫ్‌ఖాన్ శిక్షణలో పెట్టాడు. ప్రత్యేకంగా డక్కన్ లోని ముఖ్య వ్యవహారాల్ని ఔరంగజేబుకి వివరంగా తెలియజేస్తున్నాడు – అసఫ్‌ఖాన్. దీనికి మరో కారణం అసఫ్‌ఖాన్ పని ఒత్తిడి. ఆయన ప్రధాన వజీరే కాకుండా గుజరాత్, సింధ్ పాలన వ్యవహారాల పర్యవేక్షణ కూడా ఆయన బాధ్యతగా ఉన్నది.

షాజహాన్ అనుసరించిన సైనిక వ్యూహాల వలన, ఆఫ్ఘనిస్థాన్ సమస్య కూడా కొంతముందుకు వచ్చింది. ఈ విషయంలో పండితరాయలు ఇచ్చిన సలహా రాజనీతి పాఠంగా షాజహాన్ మెప్పు పొందింది.

మొత్తం సఫావిద్‌ల రాజ్యంపై దండయాత్ర కంటే కేవలం తమ దృష్టిని ఖాందహార్‌కి మాత్రమే పరిమితం చేసుకుంటే అనుకూల ఫలితం వస్తుందనేది పండితరాయలు సూచన.

ఈ సూచనని అమల్లో పెడుతూ అటునుంచీ నరుక్కొచ్చాడు అసఫ్‌ఖాన్. ఖాందహార్ సైన్యాధికారి ఆలీమరద్‌ఖాన్‌ని చక్రబంధనం చేసి లొంగిపోయేటట్టు చేశాడు. అతను మొగలాయీలకు దాసోహమన్నాడు. అంతేగాక, తనకు షాజహాన్ ఆశ్రయం, పాదుషా రాజ్యంలో ముఖ్యపదవీ ఇచ్చేటట్లయితే వెనువెంటనే ఖాందహార్ నగర తాళం చెవుల్ని మీ చేతిలో పెడతానని ముందు కొచ్చాడు. కొట్టకుండానే కాయ రాలి చేతిలో పడినట్లుయింది. ఈ ఒడంబడికకు వెంటనే పాదుషా అంగీకారం లభించింది. ఆలీమరద్‌ఖాన్‌ ఖాందార్ నగరాన్ని మొగలాయీ సైన్యాధికారి కిలీజ్‌ఖాన్ చేతిలో పెట్టి అందించాడు.

ఈ ముఖ్య ఘటనకు ప్రేరణ, సూచన జగన్నాథుడు కావటంతో పండిత రాయలు ప్రాముఖ్యం రాచనగరులో మరింతగా వర్ణశోభితం అయింది.

ఆగ్రా కోటలో-

అటు షాజహాన్ జీవితాశయాలైన కళాకృతులు – దివాన్ – ఏ ఖాన్ – దివాన్ -ఏ-ఆమ్, శేషమహల్ నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయి.

ఈ సాఫల్యాల మధ్య పండితరాయల ద్వారా సానుకూలమైన మరొక ముఖ్య పరిణామం – సామ్రాజ్యంలో అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ మద్యం విక్రయం చేయరాదనే పాదుషా ఫర్మానా.

బీదాబిక్కీ సామాన్యులంతా ఈ ఆజ్ఞలకి చాలా సంతోషించారు. దీనికి రాజోద్యోగుల నుంచీ కొంత వ్యతిరేకత ఎదురైనా ఇది సామాజికంగా ఒక విప్లవాత్మక చర్యగానే పరిగణింపబడింది.

అలాగే, ధర్మాధికారిగా పండితరాయలు పాదుషా వారికి మరో సూచన కూడా చేశాడు. అది సామ్రాజ్యంలో జంతు వధశాలల్ని నిషేధించటం. పాదుషా ఈ సలహాకీ సమ్మతిస్తూ, ఫర్మానా విడుదల చేశాడు.

పాదుషా వారికీ, పండితరాయలుకీ ప్రశాంత జీవనం ప్రారంభమైంది.

***

దారా, పండితరాయలు ఇప్పుడు ఎక్కువ సమయం శాస్త్రచర్చలలోనూ, ఉపనిషత్తుల అనువాద విషయాల్లోనూ వేదాంత వివరణల్లోనూ గడుపుతున్నారు.

ఇరవై అయిదు ఉపనిషత్తుల అనువాదం అయింది. దారా ఒక ఉద్యమంగా జీవితాశయంగా ఆ కార్యక్రమంలో నిమగ్నుడై ఉన్నాడు. 50 మంది పండితుల్ని ఈ కార్యక్రమానికి నియమించాడు. మరో ప్రక్కన శాస్త్రిని కూర్చోబెట్టుకుని భగవద్గీతకి అర్థవివరణని తనకోసం తయారు చేయిస్తున్నాడు.

గురుకులంలో విద్యార్థుల సంఖ్య కూడా బాగా పెరిగింది. వారికి వలసినంత భోజన వసతి సదుపాయాలు ఏర్పాటు పెద్ద ఎత్తునే చేయిస్తున్నాడు దారా.

కనక్‌లాల్, వంశీధరమిశ్రా, ఇంకా ముల్లా మొహమ్మద్, మన్సూర్ వంటి ఉర్దూ పారశీక ఉపాధ్యాయులు కూడా అక్కడే ఉండి గురుకులంలోని విద్యార్థుల బోధనావసరాలు చూస్తున్నారు.

ఈ మధ్య కాశీనుండి కులపతిమిశ్రా కూడా వచ్చి చేరాడు.

అటు విద్యావిషయికంగా, ఇటు సంగీత సాహిత్య కళా విషయికంగా పండిత రాయలు గురుస్థానీయుడుగా – దారా, షాజహాన్ పాదుషాకు అభిమానపాత్రుడైనాడు. రాచనగరులో, రాజోద్యోగుల్లో పండితరాయల పేరూ, ప్రతిష్ఠా ఉన్నతంగా శోభిస్తున్నై, ఇప్పుడు అసలే ఈర్ష్యాసూయల కుమ్మపొగలో ఉక్కిరి బిక్కిరవుతున్న కనక్‌లాల్ వంశీధరమిశ్రా వంటి వారి దురాలోచనల సర్పం పడగ విప్పుకుంది.

దీపావళి నాలుగు రోజులుంది.

గురుకులంలో విద్యార్థులంతా ఉత్సాహంగా దీపోత్సవ నిర్వహణకి ఏర్పాట్లు చేసుకున్నారు.

గురుకులంలోనే నివాసం ఉంటున్న కనక్‌లాల్, వంశీధరమిశ్రా జగన్నాథుని దీపావళి పర్వదినాన తాము చేయబోయే విందుకు రమ్మని ఆహ్వానించారు. సరేనన్నాడు జగన్నాథుడు.

ఆ వేళే దీపావళి.

మధ్యాహ్నం విందు. జగన్నాథుడు వచ్చాడు. అతనితో పాటు శాస్త్రీ వచ్చాడు.

ప్రత్యేక శ్రద్ధతో జగన్నాథుడికీ, శాస్త్రికీ పదార్థాలని వడ్డన చేయించారు – కనక్‌లాల్, వంశీధరుడూ.

విందు పూర్తయి తాంబూల చర్వణం చేస్తున్న జగన్నాథుడికి ఉన్నట్టుండి తల తిరిగినట్లయింది. శాస్త్రితో చెప్పాడు. అతను కనక్‌లాల్ వాళ్లకి చెప్పి ముందు జగన్నాథుని తీసుకుని తాము వచ్చిన అశ్వశకటంలోనే ఇంటికి చేరుకున్నాడు.

ఇంటికి వచ్చీరాగానే జగన్నాథునికి వాంతులూ, బేదులూ, అపస్మారకంలోకి వెళ్లిపోయాడు. శాస్త్రికీ తలతిరగటం మొదలయింది.

కామేశ్వరి, సుభాషిణీ తత్తర లాడారు. గుండెలవిసినై. వెంటనే రాజోద్యోగులకీ వార్త తెలిపి అత్యవసరంగా వైద్యుని రప్పించారు.

జగన్నాథునికీ, దారాకూ గల మైత్రీ సంబంధం తెలిసి ఉన్న వైద్యుడు ఏకంగా మరో ఇద్దరు సహాయకులతో వచ్చాడు. చికిత్స ప్రారంభించాడు. ఆహారం విషమయమైందని వెల్లడించాడు.

సంజెవేళకి జగన్నాథుడు కళ్లు తెరిచాడు. శాస్త్రికి వ్యాధి తీవ్రం కాలేదు. తల త్రిప్పటంతోనే ఆగింది. తెల్లవారే సరికీ రాచనగరుకి చేరింది వార్త. దారా స్వయంగా తానే జగన్నాథుని నివాసానికి వచ్చాడు. పరామర్శించి వైద్యులకూ, ఉద్యోగులకు తగిన సూచన లిచ్చి అక్కణ్ణుంచీ సరాసరి పాఠశాలకు వెళ్లి ఇతరులకు ఏమయినా అనారోగ్యం కలిగిందా అని విచారించాడు. అంతా క్షేమంగా వున్నారు. ఎక్కడో పొరపాటు జరిగిందని కనక్‌లాల్ వాళ్లూ చెప్పారు.

కానీ, దారాకి సందేహం కలిగింది. ఇది కావాలని చేసిన దుశ్చర్య అని విచారణ చేపట్టాడు.

నాలుగు రోజుల తర్వాత వంట వారిలో ఒకరి ప్రమేయాన్ని పసిగట్టారు. అతనిని ఎంత నిగ్గదీసినా నిజం బయటపడలేదు. కేవలం జగన్నాథునికీ, శాస్త్రికీ ఇచ్చిన పాయసంలో మాత్రమే ఏదో లోపం జరిగిందనే మాట మీదే నిలిచాడు ఆ వంట మనిషి. తాబట్టిన కుందేలుకు మూడేకాళ్ల సామెత అయింది. అతనికి ఉద్యోగం నుండి ఉద్వాసన పలికాడు దారా. వ్యక్తిగతంగా గురువుగారినీ, శాస్త్రినీ క్షమాభ్యర్ధన చేశాడు దారా.

అంతా తెలిసీ ఏమీ తెలియని స్థితిగా వుంది వాతావరణం.

కనక్‌లాల్, వంశీధరుడూ మొసలి కన్నీరు కార్చారు. వారిని శిక్షించటానికి నిశ్చయించుకున్నాడు దారా. జగన్నాథుడే ఔదార్యంతో వదిలేయించాడు. శాస్త్రి అన్నాడు – “గురువుగారి అతి మంచితనం ఇలాంటి ప్రమాదాలే తెచ్చి పెడుతుంది.”

నవ్వాడు జగన్నాథుడు. “వేదం – ‘నువ్వు మనిషివి కావాలి’ అంటుంది. మనం మనుషులమే గదా! ఇంకా మనుషులం కావటం ఏమిటి? ఏమిటీ- అంటే మనలోని అంతర్గత శత్రువుల్ని జయించటం. అవేమిటో తెలుసుగా – అరిషడ్వర్గాలు. వాటిని జయించటానికి బదులు ఆ స్వభావాలను చూపించి తనకు శత్రువులనుకునేవారిని దాష్టీకంతో, మోసంతో జయిద్దామని ప్రయత్నిస్తారు కొందరు. గుఱ్ఱానికి చక్కగా గుగ్గిళ్లు పెట్టు. వాటిని తింటూ అది తోక ఆడిస్తూ వుంటుంది. కుక్క కూడా అంతే. దాని తోకకు కర్రలు కట్టి సాఫీ చేయగలమా?”

విన్నాడు దారా.

ఆ వారంలోనే కనక్‌లాల్‌కి, వంశీధరుడికి ఉద్వాసన జరిగింది. వారిద్దరూ మూటాముల్లే సర్దుకుని కాశీ వెళ్లిపోయారు.

వారు తన దగ్గర సెలవు తీసుకోవటానికి వస్తే చెప్పాడు దారా. “కరచ్ఛేదనమో, శిరచ్ఛేదనమో కాకుండా పోతున్నారు. అది కూడా గురువు గారి మంచితనమే.”

పాదుషా వారికి ఈ వృత్తాంతం తెలియనీయవద్దని వేడుకున్నారు వాళ్లు. ఆ విషయాన్ని దారా ఆ తర్వాత జగన్నాథునికి చెప్పాడు.

“ఈ దుర్ఘటన తర్వాత నాకు చాలా భయంగా వుంది” అన్నది సుభాషిణి.

“అంతా ఆ హయగ్రీవమూర్తి కృప” అని గాలిలో దేవుడికి దణ్ణం పెట్టింది కామేశ్వరి.

ఒకరోజు పాదుషా తన ఆంతరంగికుల్నీ, ప్రధానుల్నీ, ఉన్నతాధికారుల్నీ అందరినీ సమావేశపరచాడు.

పక్కన కొడుకులు దారా, ఔరంగజేబు, మురద్ బక్ష్ కూడా ఉన్నారు. గద్దెకి దిగువన సాదుల్లాఖాన్ వంటివారు, అసఫ్‌ఖాన్, జగన్నాథుడూ వున్నారు.

మనం రాజధానిని ఢిల్లీకి మార్చనున్నామని ప్రకటించేశాడు.

దీనితో ఎవ్వరూ ఏమీ సలహాలు ఇవ్వటానికి అవకాశం లేకపోయింది.

అసఫ్‌ఖాన్ లేచి, “ప్రభువులు చాలా ఆలోచించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగ్రాలో పాలనా పరమైన ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. నగరవీధులు ఇరుకుగా ఉండి పాదుషా వారి రాకపోకలకూ కష్టంగా ఉంది.”

“మరో ముఖ్యమైన కారణం మొగలాయీ సామ్రాజ్యంలో ఉన్న ప్రధాన సుబాలు-లాహెర్, కాశ్మీర్, అవధ్, అలహాబాద్, మాల్వా, అజ్మీర్, ఢిల్లీలలో – ఢిల్లీ అనేక కారణాల వలన మనకు కీలకస్థానం” సైనికాధికారి సాదుల్లాఖాన్ అన్నాడు.

“ఇవన్నీ ఇలా ఉంచండి. మరో ప్రధాన కారణం పాదుషా వారు ఢిల్లీలో ఎర్రకోట నిర్మాణంతో పాటు ‘షాజహాన్‍పురా’ పేరుతో కొత్త నగరాన్ని నిర్మించపూనుకున్నారు” దారా చెప్పాడు.

“అయినా, ఇప్పటికీ ఢిల్లీ మన రాజకీయ పాలనా కేంద్రంగా ఉండనే ఉంది. జహంగీర్ పాదుషా వారు కూడా ఇక్కడ నుంచే ఎక్కువ కాలం పరిపాలన చేశారు. పరిపాలనకూ, రాచవారికీ అవసరమైన హంగులూ, భవనాలూ అందుబాటులో ఉండనే వున్నాయి” అసఫ్‍ఖాన్ అన్నాడు.

“మీరంతా ప్రయాణాలకు తగిన ఏర్పాట్లు చేసుకోండి” అని నిష్క్రమించాడు పాదుషా.

కొందరు మాట్లాడుకుంటూనూ, కొందరు మౌనంగానూ బయటకు నడిచారు. దారా, జగన్నాథుడు ఓ పక్కగా నిలిచివున్నారు. వారి దగ్గరగా వచ్చాడు ఔరంగజేబు. జగన్నాథుడు అభివాదం చేశాడు. తలపంకించి, “ఏమి దారావారూ! హిందూ పండితులు బోధలు బాగా తలకెక్కించుకుంటున్నారు కదా! జాగ్రత్త. వారు చెప్పే నీతుల్లో రాజ్యపాలనకు ప్రయోజనకరంగా ఉండే ఏ ఒక్కదాన్నైనా గుర్తుంచుకోండి. ఎందుకైనా మంచిది. ఎప్పుడైనా ఉపయోగపడుతుందేమో” అని వెటకారం ధ్వనించేలా అన్నాడు.

దారా, జగన్నాథుడూ ఇద్దరూ పేలవంగా నవ్వారు. అతను డక్కన్ రాజప్రతినిధిగా ఉండి మంచి విజయాలు సాధించిన ఉత్సాహంలో ఉన్నాడు. నిజాం షాహి వంశపాలనని అంతం చేసి అక్కడి యువరాణి దిల్‌రాస్‌బాను బేగంని పెళ్లి చేసుకున్నాడు. అలాగే, బగ్‌లానా రాజపుత్రుల్నీ గెలిచి ఆ రాజ్యాన్నీ మొగలాయీ సామ్రాజ్యానికి అదనపు చేర్పుగా ఇచ్చాడు. అంతకు ముందే బుందేల్‌ఖండ్ పాలకుడు జఝర్‌సింగ్‌ని ఓడించాడు.

క్షణం విరామం తర్వాత దారా అన్నాడు, “మాదంతా విడివిడిగా ఉన్న వాటిని అన్నింటినీ కలిపి చూసే ‘సాత్విక జ్ఞానం’, ఉపయోగ పడకుండా పోదు.”

“ఏమైనా జాగ్రత్త. గ్రంథ క్రిములు కాబోకండి” అని వెళ్లిపోయాడు.

దారా జగన్నాథుడిని తన మందిరానికి రమ్మని చెప్పి, తాను లోపలి కక్ష్యలో నుండీ వెళ్లిపోయాడు.

జగన్నాథుడు బయటికి నడిచాడు. అది రాచమర్యాద. అభ్యంతర మందిరాలకు లోపలి కక్ష్య నుండీ ప్రవేశించే అనుమతి ఎవ్వరికీ ఉండదు. రాచవారు ప్రత్యేకంగా తమతో రమ్మని ఆహ్వానిస్తే తప్ప.

అక్కడికి వెళ్తుంటే మందిరం వెలుపల సందర్శకుల ఆసనం మీద కూర్చుని వున్నాడు శాస్త్రి. ఇంటి నుంచీ ఇద్దరూ కలిసే వచ్చారు. సమావేశానికి లోపలికి వెళ్లబోతూ, అతన్ని అక్కడే వుండమని చెప్పి, జగన్నాథుడు మాత్రమే పాదుషా వారి సమావేశానికి వెళ్లాడు.

ఇప్పుడు ఇద్దరూ కలిసి దారా మందిరానికి వెళ్లారు. శాస్త్రి అభివాదాన్ని స్వీకరిస్తూ నవ్వి, “మీరూ వచ్చారా.. బాగుంది” అంటూ పలకరించాడు.

“గురువుగారూ! మీకూ, మీ కుటుంబానికి కొంత అసౌకర్యం తప్పదు, క్షమించాలి” అన్నాడు దారా.

“అసఫ్‍ఖాన్ వారు ఇప్పటికే ఢిల్లీలో పాఠశాల భవనాన్ని కేటాయించి ఉంచారు. మీరూ, మీ కుటుంబసభ్యులూ మాతోనే ప్రయాణం. మీ వస్తు సంభారం మా వాహనాల్నే అనుసరించి వస్తాయి. మా బేగం నదీరాబాను గారికీ ఈ విషయాలన్నీ వివరించాను. వారూ సంతోషించారు” దారా చెప్పాడు.

“మా యెడల మీ ప్రత్యేకత శ్రద్ధకు ధన్యవాదాలు” అంటున్న గురువుని వారించి, “అది నా బాధ్యత గురూజీ” అన్నాడు దారా కైమోడ్పుతో.

“ప్రయాణం రోజునీ సమయాన్నీ నిర్ణయించి మీకు కబురు చేస్తాను”.

“సరే”నని సెలవు తీసుకుని వచ్చేస్తుంటే, మళ్లీ వెనక్కి పిలిచి, “ఢిల్లీలో గురువుగారికి తలకు మించిన భారాలు చాలానే ఎదురవుతాయనిపిస్తోంది. మరీ ముఖ్యంగా నా నుండే” అన్నాడు నవ్వుతూ.

“ఫర్వాలేదు.. గురువుగారు ఆ మాట ఎప్పుడో చెప్పారు” అంటూ

“నైర్గుణ్య మేవ సాధీయో ధిగస్తు గుణగౌరవమ్/శాఖినోఽన్యే విరాజంతే, ఖండ్యంతే చందనద్రుమాః” అన్నాడు శాస్త్రి.

(నిజానికి లోకంలో మంచివాళ్లకే కష్టాలు. అడవిలో మంచిగంధపు చెట్లే నరకబడుతాయి.)

శాస్త్రి మాటలకు నవ్వుకున్నారంతా.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here