జగన్నాథ పండితరాయలు-26

2
11

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[కాలక్రమంలో మరో ఏడాది గడుస్తుంది. ఇంట్లో కూర్చుని దారా ఇచ్చిన భగవద్గీతని నిదానంగా అధ్యయనం చేస్తుంటాడు జగన్నాథుడు. కామేశ్వరి పక్కగా కూర్చుని కొన్ని శ్లోకాలను చదువుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఉసురుసురంటూ, చెంగుతో మొహం, మెడా తుడుచుకుంటుంది. ఆమెకేసి తదేకంగా చూసిన జగన్నాథుడు ఈ మధ్య ఆమెలో అలసట కనిపిస్తున్నదని అనుకుంటాడు. మనసులో ఓ ఆలోచన మెదలగా కామేశ్వరి ముఖ లావ్యణాన్ని ప్రశంసిస్తూ ఓ శ్లోకం చదువుతాడు. ఎప్పుడు పడితే అప్పుడు తన గురించి అలా శ్లోకాలు చదవద్దని అంటుంది. అదే సమయానికి శాస్త్రి, సుభాషిణి అక్కడి వస్తారు. శాస్త్రి గురువు గారు రాసిన ఓ శ్లోకాన్ని చదివి, చాలా గొప్ప భావమని మెచ్చుకుని, మరికొన్ని శ్లోకాలు గడగడా చదువుతాడు, ఆనంద తాదాత్మ్య భావనతో ఉద్విగ్నుడవుతాడు. మిగిలిన ముగ్గురూ అంతర్ముఖీనంగా మౌనం వహిస్తారు. అందరికీ లోటాలతో మజ్జిగ తెచ్చి ఇస్తుంది సుభాషిని. కాసేపు కావ్యాల గురించి మాట్లాడుకుంటారు. దారా భగవద్గీతకు చేసిన అనువాదాన్ని పరిశీలిస్తూ, దారా భావాలను శాస్త్రికి వివరిస్తాడు జగన్నాథుడు. అప్పుడు అరబ్బీ, పారశీక భాషల్లో జగన్నాథుడు సాధించిన పట్టును ప్రస్తావించి, గురువుగారిని అభినందిస్తాడు శాస్త్రి. కామేశ్వరి భర్తకేసి అభిమానంగా చూస్తుంది. జగన్నాథుడు తన దృష్టిని గ్రంథంపైకి మరలుస్తాడు. 1641 సంవత్సరం జనవరి మొదటివారంలో పాదుషావారి పిలుపు మేరకు రాజమందిరానికి వెళ్తాడు జగన్నాథుడు. అప్పుడు తాను లాహోర్ వెడుతున్నట్టు తెలిపి, ఎర్రకోట పనుల్లో లాహౌరీ గారికి సహాయంగా ఉండమని జగన్నాథుడికి చెప్తాడు పాదుషా. సరేనంటాడు జగన్నాథుడు. సంగీత సాహిత్య కార్యక్రమాల్ని కొనసాగించమని చెప్తాడు పాదుషా. తరువాత పాదుషా సైగ నందుకుని అసఫ్‍ఖాన్ – వృందావన్ దేవాలయం బాధ్యతలను రాజపుత్ర పాలకుడు జయసింహ మహారాజుకు అప్పగించే విషయం ప్రస్తావిస్తాడు. ఆ విషయంలో జగన్నాథుడి సలహా అడుగుతాడు. ఆ ఆలోచన మంచిదేనని, ప్రభువుల సౌజన్యానికి హిందువుల అదనపు గౌరవం అందుతుందని జగన్నాథుడు అంటాడు. వృందావన్ లోని అన్ని ఆలయాలను జయసింహ మహారాజుకు అప్పగించి, అందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేయమన్న దారా అభిప్రాయాన్ని బలపరుస్తాడు జగన్నాథుడు. ఆ సమావేశం ముగిసాకా, దారా మందిరంలోకి వెళ్ళి అతను అనువదిస్తున్న భగవద్గీత గురించి కాసేపు మాట్లాడుతాడు జగన్నాథుడు. పాదుషా లాహోర్ వెళ్ళిపోతాడు. అక్కడి రాజు జగత్‍సింగ్ పటానియాతో ఇబ్బందులొస్తున్నాయని, అసఫ్‍ఖాన్ సరిగా వ్యవహరించలేకపోయాడని, తానే స్వయంగా అక్కడికి వెళ్ళాడు పాదుషా. 1641 మార్చి నెలలో లాహోర్‍లో ‘నౌరోబ్’ ఉత్సవం, ‘షబ్ – ఏ – బరత్’ భక్తి శ్రద్ధలతో జరుగుతాయి.  జూలై నెలలో పాదుషా తులాభారం జరిపించుకుని, ఆ ధనాన్నంతా పేదలకూ, సామాన్యులకు పంచి, తాను సంతోషించి, ప్రజల్ని సంతోషింపజేస్తాడు. ఈ వార్తలన్నీ ఢిల్లీ చేరి, దారా నుంచి జగన్నాథుడికి తెలుస్తాయి. ఇక చదవండి.]

అధ్యాయం-46

[dropcap]రో[/dropcap]జులు మామూలు దినచర్యతో గడిచిపోతున్నై.

ఢిల్లీలో జగన్నాథునికిప్పుడు తగినంత విరామమే. లాహౌరీ పిలిచినప్పుడు వెళ్ళి వస్తున్నాడు. తోచిన సలహాని చెప్పి వస్తున్నాడు. ముఖ్యమైన కార్యక్రమం దారా భగవద్గీతని చూడటం.

రాయముకుందుడు ఢిల్లీ వచ్చాడు. వృందావన్ దేవాలయ వ్యవహారం గురించి విని జగన్నాథుడినీ, దారానీ అభినందించాడు. అసఫ్‌ఖాన్ చొరవలేకుండా ఆ ప్రతిపాదనని పాదుషా అంగీకరించి ఉండడనీ ఆయనకు తెలుసు. అందుకనే ఆయన్ని కలిసి కృతజ్ఞతలు చెప్పివచ్చాడు.

ఆ వేళ –

రాయముకుందుడు జగన్నాథుని ఇంటికి వచ్చాడు..

సంభాషణలో సాహిత్య విషయాలు కదిలాయి. దారా భగవద్గీత, ఉపనిషత్తుల అనువాదాల గురించి వివరించాడు జగన్నాథుడు. ఆయన జగన్నాథుని రచనల గురించి కూడా ఉత్సుకతతో విచారించాడు. లోపల పనిలో ఉన్న కామేశ్వరి వచ్చి కూర్చుంది. తానుగా చేస్తున్న గ్రంథ విషయికమైన వివరాల్ని చెప్పింది.

“నిజానికి ఈ సవరింపులూ, సర్దటాలే అసలు రచనకంటే కష్టమైన పని. ఆ అవకాశం లేకా, ఓపిక చాలకా నావి ఎన్నో రచనలు అటకమీదే మూలుగుతున్నై” అన్నాడు రాయముకుందుడు.

“తప్పదు స్వామీ. భవిష్యత్తరాలకు మనం అందించేవి అవే కదా” భార్య వైపు చూస్తూ అన్నాడు జగన్నాథుడు.

“నిజమే కానీ, కామేశ్వరిని చూడు. ఆమె ముఖంలో బాగా అలసట కనిపిస్తున్నది.”

“అవును స్వామీ. నేనూ అదే చెబుతున్నాను” అన్నది సుభాషిణి. “నా సంగతి సరేలెండి. మీ పని కానీయండి” అని లేచి లోపలికి వెళ్లింది కామేశ్వరి.

రాయముకుందుడు చెప్పసాగాడు, “చూడు జగన్నాథా! అసఫ్‍ఖాన్ వారి గుణగణాల గురించి నీకూ పూర్తిగా తెలుసు. పాదుషా వారు లేని ఈ సమయంలో సామ్రాజ్య వ్యవహారాలు సమస్తమూ చూస్తున్న సమర్థుడు ఆయన. హిందు సానుభూతిపరుడు. హిందీ సంస్కృతాలపై ఆదరం గల వ్యక్తి. కవిపండితులు ఆయన్ని, ‘కవి కల్పతరువు’గా వర్ణించటం మనకు తెలుసు. మరొక విశేషమూ నాకు తెలుసు. ఆయనకు బ్రహ్మ జిజ్ఞాస కూడా వుంది.”

వింటున్నాడు జగన్నాథుడు. “అవును. దారావారూ ఇలాగే చెబుతూ వుంటారు.” అన్నాడు శాస్త్రి కల్పించుకుని.

“అందుకని నాదొక చిన్న సూచన. అసఫ్‍ఖాన్ వారి గురించి నీవేమైనా వ్రాస్తే బాగుంటుంది” అని ముక్తాయింపు పలికాడు రాయముకుందుడు.

తేరి చూశాడు జగన్నాథుడు. అరటి పండు వొలిచి చేతిలో పెట్టినట్టే ఉంది కదా! “అయితే మరో కావ్యం ఆవిర్భవిస్తుంది. శుభం..” అని శాస్త్రి ఉత్సహించాడు.

“బాగుంది. కొత్త కావ్యం. సరి” అని నిర్లిప్తంగా అంటూ ప్రవేశించింది కామేశ్వరి. చేతిలో ఏవో తినుబండారపు పళ్లేలు తెచ్చి అందించింది. తీసుకుని తినటం మొదలెట్టారు. వెనకే సుభాషిణి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది.

“నా మనసులో మాటని నీ చెవిన వేశాను.” రాయముకుందుని మాటలకు, “మంచి సలహా గురువుగారూ” అన్నాడు శాస్త్రి. ఈ సలహా తనకు మరో బాధ్యతని అంటగడుతున్నా-జగన్నాథుడు ప్రశాంత మనస్కుడయ్యే ఉన్నాడు. కొంత తడవుకు, “సరే కానీయండి స్వామీ. మీ మాటను కాదంటానా? అలాగే” అని సమాధానమిచ్చాడు. “శుభం” అని రాయముకుందుడూ, శాస్త్రీ- ఒకేసారి అన్నారు.

కామేశ్వరేమో, “శుభమే కానీ, ఆ వ్రాసేదేదో ఒకేసారి వ్రాసి పూర్తి చేయండి స్వామీ..” అన్నది. నవ్వాడు రాయముకుందుడు. “తప్పకుండా.. అలాగే.. భయపడకు. నీకు అదనపు పనిపెట్టను లేవోయ్. సరేనా..” అని హాస్యమాడాడు జగన్నాథుడు!

అయితే గ్రంథనామం ‘అసఫ్ విలాసం’ అనుకుంది జగన్నాథుని మనసు!

***

ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న కట్టడాల స్థలాల దగ్గరికి రోజూ వెళ్లవలసి వస్తోంది జగన్నాథుడికి. లాహౌరీ అలా పిలిపిస్తున్నాడు. పని ఒత్తిడి, తిరుగుడూ ఎక్కువైంది.

ఇటు దారా పనీ సగంలో ఆగిపోయింది. రాయముకుందుడు సూచించిన అసఫ్ విలాసం గురించి అసలు ఆలోచన చేసే వ్యవధి దొరకటం లేదు. శాస్త్రికీ సంగీతపాఠం చెప్పలేక పోతున్నాడు.

పరిస్థితులు ఇలా ఉండగానే, కామేశ్వరి నరాల బలహీనతతో, నిస్సత్తువతో పూటలు గడపటం మొదలైంది. ఆమెలో పూర్వపు ఉత్సాహం కరువయింది. ఇంటి పనులూ, వంట పనులూ సుభాషిణే చూసుకుంటున్నది.

ఆ రోజు – జగన్నాథుడు మధ్యాహ్న సమయంలో ఎర్రకోట నిర్మాణ పనుల నుండి రోజూలాగా భోజనానికి వచ్చాడు. మంచం మీద నడుము వాల్చి ఉన్న కామేశ్వరి భర్తను చూసి మంచం లోనుంచీ పైకి లేవబోయి, లేవలేక మంచంలోనే కూలిపోయింది.

జగన్నాథుడు కంగారుపడినా తననుతాను సంబాళించుకుని ఆమెను పట్టుకుని లేపి కూర్చోబెట్టటానికి ప్రయత్నించాడు. కానీ, ఆమె నడుము నిలవటం లేదు. బాధతో గిలగిల్లాడింది.

శాస్త్రీ, సుభాషిణీ తత్తర బిత్తరలాడి ఏంచేయాలో తెలియక జగన్నాథునివైపు చూస్తూ నిశ్చేష్టులయ్యారు. భవనం బయట కాపలాదారులకు, సేవకులకూ చెప్పి వైద్యుని పిలిపించారు. ఆయన ఎన్నివిధాల ప్రయత్నించినా ఆమె లేవలేకపోయింది. పైగా తీవ్రమైన నడుమూ, వెన్నునొప్పి, పళ్లబిగువున ఎంతగా ఏడుపుని ఆపినా బాధని భరించటం ఆమెవల్ల కావటంలేదు. చివరికి వైద్యుడే ఏదో అరకుని త్రాగించి మరో రెండు గుళికలు ఇచ్చి రాత్రికి వెయ్యమని చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత కొంత సేపటికి ఆమె నిద్రలోకి జారింది.

జగన్నాథుని మనసు కలవరం చెందింది. దైహికంగానూ చెప్పుకోలేని అశక్తత ఆవహించింది.

తర్వాత నాలుగు రోజులూ అలాగే గడిచాయి. ఐదవ రోజున వెళ్లి దారాకి ఈ పరిస్థితి తెలిపి రాజవైద్యుని రప్పించాడు. ఆయన తన చికిత్స ప్రారంభించి మందులు ఇచ్చి వెళ్లాడు. ఆమె బాధ బాధగానే వుంది.

రోజులు గడుస్తున్నాయి.

కామేశ్వరి దినచర్యలో కనీసం దైవకార్యాలు కూడా తానుగా చేసుకోలేని పరిస్థితి వచ్చింది.

అన్నీ మంచములోనే. రోజులో ఎక్కువ భాగం మందుల ప్రభావంతో మత్తు నిద్ర. అప్పుడప్పుడు కళ్లు తెరచి చూసి మళ్లీ నిద్రలోకి జారుతోంది.

సాధారణంగా భర్త గుణాల్నే స్మరించుకుంటూ గలగలలాడుతూ వుండే ఈమె-ఈవేళ కృశాంగిగా-ఎంతగా పిలిచినా పలుకక కన్నులు మూసుకుని అలా పడుకునే వుంటోంది. ఆమెను ఆ స్థితిలో చూడలేక పోతున్నాడు జగన్నాథుడు. దుఃఖం పొగిలి పొంగి వస్తోంది. జగన్నాథుని ఆలోచనా శ్లోకమే; తలపూ శ్లోకమే, శోకమూ శ్లోకమే గదా! ఆయన మనస్సు అనేక విధాలుగా మూలుగుతోందిప్పుడు-

మంత్ర శాస్త్రవేత్తగానూ తన ప్రయత్నం తాను చేస్తున్నాడు.

పక్షం తిరిగింది. రాత్రుళ్లు కామేశ్వరి మంచం పక్కన కూర్చుని ఆమె సేవలోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు జగన్నాథుడు. మానసికంగా బలహీనమైనప్పుడు-భగవద్గీతలోని ఏదో ఒక శ్లోకం పెదవుల మీద కదలి ఉపశమనాన్నిస్తున్నది.

ఆవేళ-రాత్రి రెండవ జాము జరుగుతున్నది. జగన్నాథుని మనసు అస్తిమితంగా ఉన్నది. తోచీతోచని మనస్సుతో, ‘అసఫ్ విలాసం’ని వ్రాయటం మొదలుపెట్టాడు. దాన్ని ‘ఆఖ్యాయిక’ ప్రక్రియలో రచిస్తున్నాడు. కృతిభర్తగా అసఫ్‌ఖాన్‌ని ఇలా వర్ణించాడు.

అథ సకలలోక విస్తారిత మహోపకార పరం పరాధీన మానసేన, ప్రతి దిన ముద్య దనవద్య గద్య పద్యాద్యనేక విద్యావిద్యోతి తాంతః కరణైః కవిభిరుపాస్య మానేన, కృతయుగీకృతకలికాలేన, కుమతి తృణజాల సమాచ్ఛాదిత వేద వనమార్గ విలోకనాయ సముద్దీపిత తర్కదహన జాలేన, నవాచా సఫ ఖానమనః ప్రసాదేన, ద్విజకుల సేవా హేవాక క్రియా వాఙ్మనః కాయేన, మాధవకుల సముద్రేందునా, రాజముకుందేనాధిష్ఠితేన, సార్వభౌమ శ్రీషాజహాన్ ప్రసాదాధిగత పండిత రాజపదవీవిరాజితేన, త్రైలింగ కులావతం సేన, పండిత జగన్నాథేన, ‘అసఫ్ విలాసాఖ్యే’ – య మాఖ్యాఇతా నిరమీయత సేయమనుగ్రహేణ సహృదయాణాం అనుదిన ముల్లాసితా భవతాత్.

మళ్లీ కామేశ్వరి మీదికి దృష్టి మరలింది. రోగగ్రస్తయై మంచాన పడివున్న ఆమెని చూసి భారంగా నిట్టూర్చాడు.

అటు ఆమెపై తదేక దృష్టితో ఆలోచనలో పడితే, “సంతాపయామి కిమహం/భావం భావం ధరాతలే ‘హృదయం’ “ (ఈ లోకంలో పరిగెత్తి పరిగెత్తి నా హృదయాన్ని బాధపెట్టవలసిన అవసరమేముంది) అని ఏవేవో జవాబులేని తలపులు గుండె గొంతుకలో కొట్టాడుతున్నై.

మనసు మరల్చుకుని ‘అసఫ్ విలాసం’లోకి వెళ్తే, శ్లోకం వచ్చింది. తానే వ్రాసుకున్నాడు. అసఫ్‍ఖాన్ గురించిన వర్ణన:

“సుధేవ వాణీ వసుదేవ మూర్తిః, సుధాకరశ్రీ సదృశీ చ కీర్తిః

పయోధి కల్పామతి రాస ఫేందోః, మహీతలేఽ న్యస్య నహీతి మన్యే”

..వారం రోజులు గడిచిపోయాయి.

కామేశ్వరి పరిస్థితి మరీ దిగజారింది.

ఆ రాత్రి –

అస్తవ్యస్తపు ఆలోచనలతో, వికలమైన మనసుతో భారమై జగన్నాథుడి మేధ అలసిపోయింది. ఎప్పటికో కునుకు పట్టింది.

కొంతసేపటికి ఉలిక్కిపడి నిద్రమత్తు నుండీ తేరుకుని – భార్యని చూస్తే – కామేశ్వరి దేహం చల్లబడి కొయ్యబారి వుంది. నిద్రలోనే ఆమె అసువులు బాసింది!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here