జగన్నాథ పండితరాయలు-6

7
13

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[సహదేవభట్టు సభలో పూర్వమీమాంసనీ, ఉత్తర మీమాంసనీ కలగాపులగం చేసి   మాట్లాడతాడు. జగన్నాథుని సైగతో శంకరశాస్త్రి అతడు చెప్పమన్న శ్లోకాన్ని చెప్తాడు. అది విన్న సహదేవభట్టు ముఖం నల్లబడుతుంది. అక్కడ్నించి విసురుగా వెళ్ళిపోతాడు. ఆనాటి సభ ముగుస్తుంది. కాశీలో జరిగే అన్ని పండిత సభల్లోనూ జగన్నాథుడిదే పైచేయిగా వుంటుంది. అన్ని చోట్ల శేషవీరేశ్వరుని తన గురువని పేర్కొంటూ గౌరవిస్తాడు. కానీ మహారాష్ట్ర పండితులు లోలోపల కుళ్ళుకుంటారు. వారు భట్టోజీ దీక్షితుల వారి రాక కోసం వేచి ఉంటారు. పండిత సభల్లో అద్భుతమైన శ్లోకాలలో తన జ్ఞానాన్ని ప్రదర్శిస్తుంటాడు జగన్నాథుడు. భట్టోజీ శిష్యులు రుసరసలాడుతారు. ఓ రాత్రి జగన్నాథుడు, కామేశ్వరి మాట్లాడుకుంటుంటారు. మాధవుడు గుర్తొస్తున్నాడని చెబుతుంది. చాలాసేపు ముంగండ కబుర్లు చెప్పుకుంటారు. ఆ తరువాత తాను గర్భవతినని చెప్తుంది కామేశ్వరి. ఈ శుభవార్తని తల్లిదండ్రులకు ఎలా చేరవేయాలా అని ఆలోచిస్తాడు జగన్నాథుడు. ఇక చదవండి.]

అధ్యాయం-8

[dropcap]శే[/dropcap]షవీరేశ్వరుడు, జగన్నాథుడూ దుర్గాదేవి ఆలయానికి వచ్చారు. దర్శనం, అర్చన కార్యక్రమాలు పూర్తయినై. బయటికి వచ్చి ఓ ప్రక్కగా కూర్చున్నారు.

భట్టోజీ ఆయన శిష్యులూ వచ్చారు. శేషవీరేశ్వరుడు లేచి నిలబడి ఎదురేగి నమస్కారం పెట్టాడు. పక్కనున్న జగన్నాథుని పరిచయం చేశారు. జగన్నాథుడూ వినయంగా అవనతంగా నమస్కరించాడు.

జగన్నాథుని నిశితదృక్కులతో పరికించి ‘అఁహాఁ’ అని దీర్ఘం తీస్తూ ముందుకు సాగిపోయాడు-ఆయన.

వీరూ పక్కకి వచ్చి వో అరుగుమీద కూర్చున్నారు. శేష వీరేశ్వరుడు, “భట్టోజీ గారి గురించి కొంత చెప్పాను కదా” అంటూ “ఆయన శివాలయపు అర్చకుడే అయినా గొప్ప విద్వాంసుడు. వ్యాకరణంలో అసామాన్య ప్రతిభామూర్తి- మా నాన్నగారు శేష శ్రీ కృష్ణులవారి ప్రశిష్యుడు. పూర్వమీమాంసలోనూ ఆయన దిట్ట. మా నాన్నగారి సిద్ధాంతకౌముది, మనోరమ గూడా నీకు మీ నాన్నగారు చెప్పారు కదా! మహాగ్రంథాలు అవి. జైమినీ పండితుడు అని అప్పయ్యదీక్షితుల వారి ముద్ర కలిగిన వాడీ భట్టోజీ. దక్షిణాదిలో చాలా నెలలు గడిపి తిరిగి వచ్చాడన్నమాట. ఈయన శిష్యుల బలగమే పెద్ద అండ. చాలా సంఖ్యలో వున్నారు” అని “ఎటొచ్చీ మా నాన్నగారు దివంగతులైన తర్వాత మా మీదా, మా ఇంటిమీదా శీతకన్నేశారు. అంతకుముందు ఆయన శేషం వారింటికి పెద్ద కొడుకనే పేరు. అకారణంగా ఆయన మాకు దూరమయ్యారు.” అన్నాడు.

ఇంతలో భట్టోజీవారూ, వారి శిష్యబృందం గర్భాలయంలో నుండీ బయటకు వచ్చి కూర్చున్నారు. “అయితే, మీ దేశవాసి నొకణ్ణి రప్పించావన్నమాట” శేషవీరేశ్వరు నుద్దేశించి భట్టోజీ పరామర్శ. ఆ వెటకారానికి ఆయన మనస్సు కలుక్కుమంది. అయినా, పైకి మామూలుగానే “మనకు బాగా కావలసినవాడే. పేరుభట్టు వారి కుమారుడు”.

“పండిత పుత్రుడనీ విన్నాను” అని వ్యంగ్యోక్తిని విసిరాడు.

గురువుగారి హాస్యానికి శిష్యులు బెకబెకలాడారు

“సహవాసానికి ఇలాంటివారు కావాలిగదా” అని, శిష్యులవైపు దీమసంగా చూశాడు. వారంతా మళ్లీ హేళనధ్వని చేస్తూ వికటహాసం చేశారు.

జగన్నాథుడికి ఆ ఎత్తిపొడుపు నచ్చలేదు. మనసులో ముల్లు గుచ్చుకున్నట్లయింది. ‘శిష్యుల ద్వారా అంతా తెలుసుకున్నాడన్నమాట’ అని అనుకున్నాడు. ముఖకవళికలు మారాయి. తన భావాన్ని స్ఫుటంగా శ్లోకరూపంలో అన్నాడు.

దీన్ని నువ్వే చెప్పు: “కోకిలతో సహవాసం యోగాన్ని బ్రహ్మ నీ మొహాన్న రాయలేదు. ఏం చేస్తాం. అలాగే అరు-అరు”

భట్టోజీ ముఖం మాడిపోయింది. పళ్లు పటపట లాడినై.

లేచి నిలబడి భుజంమీద ఉత్తరీయం చేతిలోకి తీసుకుని విసురుగా దులపరించుకుంటూ బయటికి నడిచాడు. శిష్యవర్గమూ వీళ్ళిద్దరినీ కొరకొర చూస్తూ గురువుగారిని అనుసరించారు.

శేషవీరేశ్వరుడు ఈ ఘటనకు బాధపడుతూ, “జగన్నాథా, ఆయన పౌరుషాన్ని దెబ్బకొట్టే శ్లోకం చెప్పావు. అప్రియాన్ని కటువుగా, కవితాత్మకంగా చెప్పావు. ‘యదార్థవాదీ-బంధువిరోధీ’ అని ఉండనే వుంది కదా సూక్తి!” అంటూ “ఏమైనా మనం జాగ్రత్తగా ఉండాలి” అని తనకు తాను చెప్పుకుంటున్నట్టుగా పైకే అన్నాడు.

విన్నాడు జగన్నాథుడు. ఆయన ఆవేదనని అర్థంచేసుకున్నాడు. “శ్రీకృష్ణ పండితుల ‘ప్రక్రియాకౌముది’ నీ, దానికి మీరు వ్రాసిన ‘ప్రసాదము’ వ్యాఖ్యానాన్నీ చదివాను. గురువుగారి గ్రంథాన్ని ఖండిస్తూ ‘ప్రౌఢ మనోరమ వ్యాఖ్యానం రాశారన్నారు. కదా! దాన్ని నేను చదవాలి.” అన్నాడు జగన్నాథుడు.

“నాన్నగారి జీవిత కాలంలోనే భట్టోజీ ఆ పని చేశాడు. నిజానికి ఆ మనస్తాపం ఆయన్ని ఎంతో క్రుంగదీసింది. వారి ఆరోగ్యం చెడిన కారణంతో, వారు గానీ, నేను గానీ భట్టోజీతో తలపడలేకపోయాం. భట్టోజీది తాను చెప్పిందే వేదం అనే స్వభావం. ఆ గుణం ఆయనకు ఆయన గురువు అప్పయ్యదీక్షితుల వారి నుంచీ సంక్రమించిందంటారు కొందరు”

ఇద్దరూ లేచి తమ తమ ఆలోచనలతో మౌనంగా ఇంటివైపు నడిచారు. వందగజాలు పోగానే, నాగేశభట్టు ఎదురైనాడు.

జగన్నాథుని కంటే చిన్నవాడు. అయినా అప్పటికే పండిత ప్రకాండుల్నీ, శాస్త్ర విదుల్నీ తన ధీధిషణతో ఎదుర్కొంటున్నాడు. శేషవీరేశ్వరుని ద్వారా జగన్నాథుని పరిచయం కాగానే, ఆ స్ఫురద్రూపి ఆకర్షణకీ, విద్యాతేజస్సుకీ అబ్బురపడి ఆయన్ని తన విద్యాగురువుగా భావిస్తున్నవాడు. వీరిద్దరికీ అభివాదం చేసి వెనక్కి తిరిగి వారితో నడక మొదలెట్టాడు.

“ఏమిటి విశేషాలు నాగేశా?” అడిగాడు శేషవీరేశ్వరులు.

“వరదరాజు, నీలకంఠుడూ జంటగా వెళ్తూ ఎదురైనారు. వారి గురువుగారు భట్టోజీ, మిగిలినవారూ శివాలయానికి వెళ్లినట్లున్నారు. వరదరాజూ వాళ్లూ పలకరింపు మిషతో నన్ను నిలవేసి, “ఏమోయ్, మీ పుంజు కూత పెడుతున్నదే” అని ఎత్తిపొడుపు మొదలెట్టారు. నాకు అర్థమైంది. దుర్గాలయంలో ఏదో జరిగి వుంటుందిలే అనుకొని, ‘ఇప్పుడే ఏమైంది? ముందున్నది ముసళ్లపండుగ’ అని వచ్చేశాను. కుళ్లుకు చస్తున్నారు. గురువుగారు మంచి అన్యాపదేశ శ్లోకమే చెప్పివుంటారు” జగన్నాథుని చూస్తూ అన్నాడు.

మాట పొడిగించకుండా తాను కొట్టిన అక్షరఘాతాన్ని వినిపించాడు – జగన్నాథుడు. నాగేశుడు కళ్లలో మెరుపు నిగారించింది. “అయితే, నా సమాధానం నిజంగా వారికి భావ్యర్థ సూచకమే” అన్నాడు. “తథ్యమే అది” అన్నాడు జగన్నాథుడు. వారిద్దరి వైపు తన చూపుల వాత్సల్యాన్ని ప్రసరింపజేస్తూ అడుగుల వేగాన్ని పెంచాడు శేషవీరేశ్వరుడు.

అటు సూర్యుడూ నడినెత్తి మీదికి వస్తున్నాడు.

***

సాయంత్రం నాలుగు గంటలు. గంగాతరంగాల మీదుగా చల్లగాలి పయనిస్తున్నది. వాతావరణం ఆహ్లాదంగా ఉంది.

జగన్నాథుడు సంగీత సాధన చేస్తున్నాడు. శాస్త్రి శ్రుతి కలుపుతున్నాడు. ఎదురుగా పర్వతవర్థని, కామేశ్వరి కూర్చుని వున్నారు. ఓ ప్రక్కగా నాగేశుడు, కొందరు శిష్యులూ కూర్చుని జగన్నాథుని స్వరరాగ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఆయన సాధన అంతా ఇప్పుడు హిందూస్థానీ సంగీతం మీద కేంద్రీకృతమై వుంది. ముంగండలో కర్నాటక సంగీతంలో తనదైన వైదుష్యాన్ని సాధించాడు. అదంతా-తండ్రి శిక్షణ, కామేశ్వరి చోదకత్వంలోని చిత్తశుద్ధీ, తన నిబద్ధత వలన సాధ్యమైంది. ఇప్పుడు హిందుస్థానీ సంగీతంలో కఠోర పరిశ్రమకి కారణం – ఉత్తరాది వారిని మెప్పించాలంటే కర్నాటక సంగీతం చాలదు. చాలా రాగాలు రెండు బాణీల్లోనూ స్వామ్యం కలిగినవే అయినా, దేని ప్రస్తారం, విధానం దానిది.

వివిధ గమకాల పునర్ధానంతో రాగం ముక్తాయింపు అయింది. సుదీర్ఘ రాగ ప్రస్తారపు సుడిలో చిక్కుబడినవారు తేరుకున్నారు.

శ్రోతల కళ్ళల్లో మెరుపుతో జగన్నాథుని మనసున తృప్తి విరిసింది. వెంకటరామశాస్త్రి వచ్చాడు. ఆయన పూర్వీకులు ఉపద్రష్టవారు, ముంగండ వాసులే. ఎప్పుడో కాశీ వచ్చి స్థిరపడ్డారు. దగ్గరి బంధువుల ఇళ్లల్లో పెళ్లిళ్లకూ, శుభకార్యాలకు మాత్రమే ఆంధ్ర ప్రాంతానికి వీళ్ల రాకపోకలు.

నెలరోజుల క్రితం హరిశ్చంద్రఘాట్లో పరిచయమైనాడు శాస్త్రి. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ విశ్వనాథ దేవాలయం దాకా నడిచారు. అప్పుడు తమ గత చరిత్ర చెప్పాడాయన.

ఆ సందర్భంలోనే జగన్నాథుని మేనమామ చెరుకూరి లక్ష్మీపతి ప్రసక్తి వచ్చింది. లక్ష్మీపతికీ వేంకటరామశాస్త్రి తండ్రికీ మైత్రి ఉండేదని తెలిసింది. ఆ విధంగా ఇప్పుడు తామిద్దరూ దగ్గరివారు కావటంతో పరస్పరం ఒకరికొకరు తమ సంతోషాన్ని వ్యక్తపరుచుకున్నారు. అప్పటి నుంచీ రామశాస్త్రి జగన్నాథుని తరచు కలుస్తూనే వున్నాడు.

కామేశ్వరి నీళ్ళు తెచ్చి ఇచ్చింది. ఆమె వైపు పరీక్షగా చూస్తూ “జగన్నాథం.. అమ్మా నాన్నలకు అమ్మాయి గర్భవతి అనే శుభవార్త తెలియజేశావా?” అడిగాడు శాస్త్రి.

భార్యాభర్తలు ఒకరితో ఒకరు చూపులతో సంభాషించుకున్నారు. క్షణాల తర్వాత జగన్నాథుడే అన్నాడు. “అదే ఆలోచిస్తున్నాం. ఆంధ్రదేశం వెళ్లేవారెవరూ తటస్థపడలేదు శాస్త్రీ. శేషవీరేశ్వరులూ తెలిసిన వారిని విచారిస్తున్నారు..”

“బాగానే వుంది. ఈ ప్రస్తావన రావటం మంచిదే అయింది. మా బావమరిది వచ్చేవారంలో మన ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. ప్రయాణం నిర్ధారణ కాగానే మీరు చెబుతాను”.

కామేశ్వరి ముఖంలో సిగ్గుతో కూడిన మెరుపు తొంగిచూసింది.

వీక్లీ మాటలు మాట్లాడుకుంటూ వుండగానే శేషవీరేశ్వరుడూ, పర్వతవర్థనీ వచ్చారు. విషయాలు తెలిసినై.

ఆడవారిద్దరూ ఇంట్లోకి వెళ్లారు.

శేషవీరేశ్వరుడూ రామశాస్త్రి, నాగేశుడూ కబుర్లలో పడ్డారు. జగన్నాథుడు వింటూ కూచున్నాడు. శాస్త్రి వో పక్కగా వెళ్లి సంగీతాభ్యాసంలో నిమగ్నుడైనాడు.

“తులసీదాస్ వారు ఇప్పుడు శతాధికవృద్ధులు. వీలైనప్పుడల్లా ‘రామచరిత మానస్’ ని తమ గళంలో వినిపిస్తున్నారట. ఈ రోజు సంకట మోచన్ దేవాలయంలో ఆ కార్యక్రమం వున్నదిట. శ్రోతలు చాలామంది వెళ్తారక్కడికి. ఇది చాలా మంచి అవకాశం” రామశాస్త్రి అన్నాడు.

“ఆ మహానుభావుని దర్శనమే పాపహరణం. మనమూ వెళ్దాం” అని ఆగి మళ్లీ, “ప్రాచీన దృశ్యాల్ని ఎన్నిటినో మోస్తున్న ఈ కాశీ నగరానికి ఆధునిక సృజనావిష్కరణ ఆ సంకట మోచన హనుమాన్ మందిరం. అది ఆ తులసీ మహాశయుని మానస పుత్రిక. హనుమాన్ సాక్షాత్కారంతో పునీతమైన భూక్షేత్రం” అన్నాడు శేషవీరేశ్వరుడు.

“అవును. కొత్త నాగరికత పురివిప్పుకుంటున్న క్లిష్ట తరుణంలో ‘మానస్’ ఈ జాతి అందుకున్న అపూర్వ ఉపాయనం” అంటూ లేచాడు నాగేశుడు.

అందరినీ ఉద్దేశించి జగన్నాథుడో మాట అన్నాడు, “కాలం ఇరుపార్శ్వాల్నీ ధరించే కదులుతూ వుంటుంది”.

అతనివైపు ప్రశ్నార్థకంగా చూశారందరూ.

“అదే. ప్రభవం ఒకటి; విలయం ఒకటి; వాంఛితం ఒకటి; అవాంఛితం ఒకటి”

‘ఓహో…’ అని తలపంకిస్తూ చిరునవ్వు నవ్వాడు శేషవీరేశ్వరుడు.

“జగన్నాథుడు చెప్పేవి కొన్ని నాకు వెంటనే అర్థం కావు. నా అవస్థని అర్థం చేసుకుని అతనే అర్థవివరణ నిస్తాడు” అని పెద్దగా నవ్వాడు రామశాస్త్రి.

జగన్నాథుడు గంభీరంగా “చిత్రంగా చాలా సందర్భాల్లో ఈ ద్వంద్వాలన్నీ ఒక దానిలో ఒకటి లీనమౌతాయి. ఒకటి హీనమై, ఒకటే నిత్యమై ప్రవహిస్తూ వుంటుంది”

“ఈ అంశం-తెలిసిన వాస్తవంలా అనిపిస్తున్నది. మహోన్నత అక్షరీకరణం వలన భావం నా మనసుని మథిస్తున్నది” అన్నాడు నాగేశుడు.

“మానస్ ధ్వని ప్రతిధ్వనులవలన, నాద నినాదాల వలన ఈ జాతికి కొంత భావైక్యత, కొంత సనాతన ధర్మైక్యత కలుగుతాయని చెబుతున్నాడు జగన్నాథుడు. హీనమైన ఆధునిక అవాంఛనీయ ధోరణులు కొన్ని బలహీనమవుతాయి. కొన్ని నశించనూ వచ్చు” అన్నాడు శేషవీరేశ్వరుడు.

కొద్దిసేపు నిశ్శబ్దం అక్కడ రాజ్యమేలింది.

“మనమూ సంకటమోచన్ వైపు కదులుదామా ఇక” నిశ్శబ్దంలోంచి తెప్పరిల్లి అన్నాడు శేష వీరేశ్వరుడు. శాస్త్రి నవ్వి “సంకటమోచన్ వైపు కదలటం సర్వతోభద్రం వైపు కదలటమే కదా” అన్నాడు. “సర్వధా!” అని తానూ నవ్వాడు నాగేశుడు.

కామేశ్వరి లోపలి నుంచీ చిరుఫలాహారాలను తెచ్చి వారి ముందర పెట్టింది.

***

దశాశ్వమేథ్ ఘాట్‌కి ఒకింత ఈవల –

ఆరుబయలు. సాయంసంధ్య –

గంగా జల పానం చేసి కదులుతున్నాయి పిల్లమేఘాలు. కమ్మ తెమ్మెర ఆహ్లాద స్పర్శనిస్తున్నది.

అక్కడే పండిత సభ.

ప్రాంగణంలో రావిచెట్టు క్రింద రాతితిన్నె, దాని మీద భట్టోజీ, ఆయన ప్రియశిష్యులు. ఎదురుగా-పచ్చిక మీద సామాజికులు, పండిత వర్గం. జగన్నాథుడు, శేషవీరేశ్వరుడు, నాగేశుడు, శాస్త్రి వీరితో పాటు పర్వతవర్థని, కామేశ్వరి కూడా వచ్చారు. రామశాస్త్రి రాలేదు. వీరంతా ఒక ప్రక్కగా కంబళ్ళు పరచుకుని కూర్చున్నారు.

భట్టోజీ కొన్ని కొన్ని వేదాంత వాక్యాలు ఎంత గంభీరమైనవో చెబుతూ తన ఉపన్యాసాన్ని మెదలెట్టాడు.

“భేదశ్రుతులు-‘భోక్తాభోగ్యం ప్రేరితారం చమత్వా’ మొదలైనవి. ఇక్కడ విశ్వం వేరు. ఈశ్వరుడు వేరు. ఇది ద్వైతం. అభేదశ్రుతులు’ – ‘ఏకమేవాద్వితీయం; నేహనా నాస్తి కించిత్’ వంటివి. శరీర వాచి శబ్దాల కన్నిటికీ శరీర పర్యంతం స్వరూవైక్య తాత్పర్యాన్ని కల్పించేవి. ఇది అద్వైతం.

విరుద్ధంగా తోచే భేదాభేద శ్రుతుల విరుద్ధాన్ని పరిహరిస్తూ వాటిని సమన్వయపరుస్తుంది – విశిష్టాద్వైతం”.

-ఇలా వివరణలిస్తూ, అద్వైత సిద్ధాంత విశేషాన్నీ, ప్రాథమ్యాన్నీ, సంభావ్యతనీ ఉగ్గడిస్తూ, దానికి వేద ప్రమాణాల్ని ఉదహరిస్తూ, ఉపనిషత్తుల్లోకి వచ్చాడు.

‘సర్వవ్యాపి నమాత్మానం క్షీరే సర్పరివార్పితమ్’ పిండిన పాలలో నెయ్యి వ్యాపించి ఉన్నట్టే భగవానుడు సమస్త చరాచర వస్తువులలో వ్యాపించి ఉన్నాడు.. ఇలా.. ఆ తర్వాత-ఆత్మసాక్షాత్కారానికి ఉపనిషత్తులు నిర్దేశించిన మార్గాల్ని-వివేకం, సమబుద్ధి, భక్తి-అనే మూడింటినీ అనేక ఉదాహరణలతో వివరిస్తూ- కర్మ, జ్ఞానయోగ సాధనల్లోకి వచ్చాడు. భగవద్గీత, ముండకోపనిషత్తు, కఠోపనిషత్తుల్లోని వాక్యాల్ని ఉటంకించాడు. చివరికి ‘యజ్ఞోవైవిష్ణుః’ ‘సమస్త సృష్టి పరమాత్మ యొక్క యజ్ఞం’ ‘జ్ఞానాత్ ఏవ మోక్ష’ అంటూ జ్ఞానయజ్ఞం విశేషాలు చెప్పాడు. ముక్తాయింపుగా ‘జ్ఞాన అజ్ఞానం రెండు భిన్నధ్రువాలు. అజ్ఞానంలో అంటే లౌకిక భోగాలలో మునిగిపోయి వున్నవారు-అంధులకు మార్గాన్ని చూపే అంధుల వంటివారు. గిరగిరా అక్కడే తిరుగుతూ ఉండే మూర్ఖులు” అంటూ ముగించారు.

శిష్యులంతా కరతాళధ్వనులు చేశారు.

“ఇవన్నీ తెలిసీ, ఇతరులకు తెలివీ, మనిషి ఎందుకు భౌతిక భోగాలలో-అదే-అవిద్యలో చుట్టూతా వందిమాగధులతో తిరుగుతూ వుంటాడు. స్వామీ?” ఒక మూలనుంచీ ఎవరో అడిగారు.

భట్టోజీ ముఖకవళికలు మారాయి. శిష్యులవైపు చిరాకుగా చూశారు. “నీ ప్రశ్నే అవిద్యకు ఉదాహరణ రా మూర్ఖా” అని ఒక శిష్యుడు కోప ప్రకటనం చేస్తూ ఒంటికాలిమీద లేచాడు.

ఉద్వేగంతో లేచి నిలబడ్డాడు నాగేశభట్టు. భట్టోజీ శిష్యుల్ని ఉద్దేశించి, “తాను మూర్ఖుడై వుండి, తనకే అన్ని శాస్త్రాలూ తెలుసుననుకుంటూ, ఇతరుల్ని మూర్ఖులను కోవటం గురించే కదా వివరించింది – మీరు చెప్పిన ముండకోపనిషత్తు సారం?” అని ప్రశ్నించాడు.

ఇంతలో సమూహంలోని ఒకరు, “అసలు ముండకోవనిషత్తు అంతస్సారం – వేదకర్మానుసారులంతా మూఢులనే కదా స్వామీ!” అనే ప్రశ్న వేశాడు.

సభలో కలకలం రేగింది.

“అంతా కలగాపులగంగా వుంది. ఈ ప్రవచనాలు వేటిలోనూ స్పష్టత ఉండదు. ఈ స్వామి ఎప్పుడు ఏది చెప్పినా అంతే!” అంటూ ఒకవైపు నుండి నలుగురైదుగురు లేచారు.

జగన్నాథుడు శేషవీరేశ్వరులవైపు చూసి లేచి నిలబడ్డాడు. ఆయన ‘సరే’ అన్నట్టు తలపంకించాడు. “ఒక్కక్షణం ఆగండి!” ఘంటానాదంలా వినిపించిన ఆ స్వరానికి ఎవరన్నట్టుగా చుట్టూ చూస్తూ అంతా నిశ్శబ్దమైపోయారు. గళం సవరించుకుని మొదలు పెట్టాడు జగన్నాథుడు.

“కర్మ, జ్ఞాన భేదా భేదాల గురించిన చర్చ చాలా కాలం నుంచీ జరుగుతున్నదే. ఉపనిషత్తులు కర్మమార్గాన్ని మొదట్లో నిరసించినవే. కానీ, ఆ తర్వాత ‘య ఏవం వేద’ వంటి ప్రశంసలు వచ్చాయి. కైవల్యోపనిషత్తులో శతరుద్రీయం జ్ఞాన సాధనంగా చెప్పబడింది. ఛాందోగ్యోపనిషత్తులో పంచాగ్ని ఉపాసన కనపడుతుంది. స్త్రీమూర్తిగా అమ్మవారిని పూజించటమే గదా కేనోపనిషత్తులో చెప్పింది. కనుక వేదాల్నీ, ఉపనిషత్తుల్నీ కలిపే అర్థంచేసుకోవాలి. ఇక, జ్ఞానయోగసాధకునికి శ్రద్ధ అత్యంత ఆవశ్యకం. ఔషధం పేరుని పదేపదే స్మరిస్తూ వుంటే రోగం తగ్గదు. దాన్ని సేవించాలి. అపరోక్షానుభవం లేకుండా శబ్దాచ్చారణ వలన ఉపయోగం లేదు”.

“కర్మలన్నీ జ్ఞాన యజ్ఞంతో ముగుస్తాయి. కనుక ఫలసిద్ధి జ్ఞానం. దాని సాధన క్రమంలో సోపానం కర్మాచరణం. మీమాంసలోకి వెళితే ఈ జటిలత్వం నుంచీ కొంత స్పష్టతతో బయటపడవచ్చు. ‘క్రియాసిద్ధిః సత్యేః’ అని మరచిపోకూడదు. దాన్ని మరో సందర్భంలో చూద్దాం” అని కూర్చున్నాడు.

చాలామంది శ్రోతలు కరతాళధ్వనులు చేశారు.

పక్షులు గూళ్లకి చేరుతూ నిశ్శబ్దంగానే రెక్కలల్లార్పుల శబ్దాలు చేస్తున్నాయి! శేషవీరేశ్వరుల బృందమంతా లేచి కదలబోతుంటే ప్రాంగణంలో ఒక ప్రక్కనుంచీ ఎవరో, “భట్టోజీ మహాశయులు ఇకనుంచీ కాస్త జాగ్రత్తగా ప్రవచనాలివ్వాలి” అని అన్నారు.

భట్టోజీ ముఖకవళికలు మారాయి. చెమట కమ్మింది. గొంతుకు ఏదో అడ్డం పడినట్లయింది. ఇంతలో-భట్టోజీ శిష్యవర్గంలోని ఒకరు, “ఇట్టాంటి పిల్లకాకులకేం తెలుసు ఉండేలు దెబ్బ, పొండిరా” అనేంతలో భట్టోజీనే స్వయంగా గొంతు పెకల్చుకుని ఓ విసురు విసిరాడు. “ఎన్ని కొక్కిరాయి వేషాలు వేసినా, శేషం-శూన్యమే. వీరప్రతాపాలు ఉపాధ్యాయ వృత్తిలో మిగలాల్సిందే”

శేషవీరేశ్వరుని ముఖంపై విచ్చాయ కదిలింది. జగన్నాథుడు గొంతెత్తి శ్లోకం చదివాడు.

“లీలాలుణ్ఠితశారదాపుర మహా సంపద్భరాణాం పురో

విద్యాసద్మ వినిర్గ శతణముషోవల్లన్తి చేత్పామరాః

ఆద్యశ్వః ఫణినాం శకున్తశిశవో దన్తావలానాం శశాః

సింహానాంచ సుఖేన మూర్థని పదందాస్యన్తి సాలాకాః”

(శారదాపుర సంపదద్వైభవం కలిగిన మహాపండితులు వారు. వారి యిండ్లముందు గింజల్ని ఏరుకు తిని తాము పండితులమని విర్రవీగుతూ వుంటారుట కొందరు. ఇక కొంత గౌరవం కూడా అబ్బిందా నెత్తిన పిల్లపిట్టలు కొలువు తీరుస్తాయి. ఏనుగులను కుందేళ్లు బెదిరిస్తవి; సింహాల నెత్తిన గుంటనక్కలు కాపురం పెడతాయి).

ఆ వెంటనే ధీరంగా చకచకా నడవసాగేడు. అయిష్టంగా అడ్డం తొలగి దారి ఇచ్చారు – భట్టోజీ శిష్యులు. జగన్నాథుని వెనకగా శేషవీరేశ్వరులు, నాగేశుడూ, శాస్త్రీ, ఆడవారిద్దరూ కదిలారు! వీరి ఆలోచనలో గంగా హారతి వేళ!

జగన్నాథుని మనసున ఏదో రసపదం కదులుతోంది!!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here