జగన్నాథ పండితరాయలు-8

10
10

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[శేషవీరేశ్వరుని ఇంట చర్చలు సాగుతుంటాయి. శేషవీరేశ్వరుడు, జగన్నాథుడు. వారికి దూరంగా నాగేశుడూ, శాస్త్రీ మాట్లాడుకుంటుంటారు. వాతావరణం ఆహ్లాదంగా ఉండడంతో పనులు ముగించుకుని వచ్చిన పర్వతవర్థని, కామేశ్వరి కాస్త దూరంగా కూర్చుని మాటల్లో పడతారు. మాటలో ఓ మధ్యలో కామేశ్వరి ఓ శ్లోకాన్ని గానం చేయగా, అద్భుతంగా ఉందని అనుకుంటుంది పర్వతవర్థని. శేషవీరేశ్వరుడు అడిగితే ఆ శ్లోకం భావాన్ని చెబుతుంది కామేశ్వరి. తరువాత తానో శ్లోకం చదువుతాడు నాగేశుడు. ఇంతలో గుర్రపుబళ్ళు రాగా, ప్రయాణానికి సిద్ధమవుతారు శేషవీరేశ్వరుడూ, జగన్నాథుడూ. ఆ ప్రయాణంలో గత సంవత్సరం ‘జాతర’ రోజున జరిగిన ఘటనలని గుర్తు చేసుకుంటాడు జగన్నాథుడు. అప్పట్లో కాలభైరవాలయం వద్ద జంతుబలిని ఆపడానికి ప్రయత్నిస్తాడు జగన్నాథుడు. కానీ అతని మాట వినరెవరు. తాము జాతరకి కనీసం నెల ముందు వచ్చి వారిని చైతన్యవంతులని చేసి ఉండాల్సిందని అంటాడు నాగేశుడు. వర్తమానంలోకి వస్తాడు జగన్నాథుడు. ఈ ఏడాది జాతరకు నెల ముందే రెండు గ్రామ పెద్దలను ఒప్పించడానికి ఈ ప్రయాణం కట్టారు. రెండు గ్రామాల పెద్దలను ఒకదరికి చేర్చి  నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు జగన్నాథుడు. మారడానికి ఒక అవకాశం కల్పించుకోమని కోరుతాడు. ఇక చదవండి.]

అధ్యాయం-10

[dropcap]రా[/dropcap]త్రి భోజనాల తర్వాత –

సాయంత్రం జరిగిన జాతరకు సంబంధించిన విషయాలే నలుగురి మధ్యా నలిగాయి. “జగన్నాథుని మాట తీరులో ఒక ఆకర్షణా ఆలోచనా ప్రేరణా వున్నయ్ కామేశ్వరీ. అతను స్ఫురద్రూపి మాత్రమే కాదు, సామాజిక శ్రేయస్సుకు జనాన్ని కదిలించగలిగిన స్ఫూర్తిదాత కూడా” అని నవ్వుతూ ఇంట్లోకి నడిచాడు శేషవీరేశ్వరుడు. పర్వతవర్థని ఆయన్ని అనుసరించింది. చూపులతోనే భర్త పైన అనురాగ హర్షాన్ని వర్షించింది కామేశ్వరి.

-పదిహేను రోజులు గడిచాయి.

ఆవేళ సాయంత్రం-బోధనా కార్యక్రమాలు ముగిశాయి. ఆరుబయట రాతితిన్నె మీద కూచున్నారు శేషవీరేశ్వరుడూ, జగన్నాథుడు. పక్కన శాస్ర్తీ, నాగేశుడూ.. సంభాషణ-విద్యార్జన, క్రమశిక్షణ మీదకి మళ్లింది. “గురువుగారు దృఢంగా, కొంచెం కోపంగా కొట్టొచ్చినట్లు పాఠం చెబుతారనుకుంటున్నారు విద్యార్థులు.” బెరుకు బెరుగ్గానే అన్నాడు శాస్త్రి.

చురుగ్గా చూశాడు జగన్నాథుడు. మరుక్షణం ఆయన మొహం మీద మందహాసం ప్రతిఫలించింది. “అలబ్ధశాణోత్కషణా నృపాణాం/నజాతుమౌళా మణయో వసంతి॥”.. అంటూ శ్లోకాన్ని చదివాడు.

(సానపెట్టి శుద్ధి చేయనిదే వజ్రం మహారాజుల మకుటాన్ని అలంకరించడు. కదా!) భావాన్ని పైకే అన్నాడు శాస్త్రి. “అదంతే. ‘వజ్రాదపి కఠోరాని మృదూని కుసుమాదపి’ పద్ధతి!” అని తలపంకించాడు శేషవీరేశ్వరుడు. జగన్నాథుడికి ఆ రోజుల్లో ముంగండలో తండ్రి బోధన, శిక్షణ, తమ్ముడి నిరసనా గుర్తుకొచ్చాయి.

“సరిగ్గా మీ అయ్యవారి గురించి కూడా జనం ఇలాగే అనుకుంటున్నారు” అంటూ ప్రవేశించింది కామేశ్వరి. వెనకే పర్వత వర్థని. ఇద్దరి చేతుల్లో వున్న ఫలహారపు దొన్నెల్ని అందరికీ అందించారు.

“ఏమిటి విశేషం కామేశ్వరీ” అడిగాడు శేషవీరేశ్వరుడు.

“ఇవాళ అనంతపురం నుండీ మనకు వతనుగా కూరగాయలు ఇచ్చే కుంతీ, భానుమతీ వచ్చారు. జాతర గురించి మీరు మాట్లాడిన విషయాల మీద పెద్ద చర్చే జరిగిందట. చాలా వాదోపవాదాలు జరిగాయన్నారు.”

‘శుభం’ కామేశ్వరి మాటలకడ్డువస్తూ అన్నాడు శాస్త్రి. “గురువుగారి ప్రమేయం వుంటే మంచి తీర్మానాలే వస్తాయిలే” నాగేశుని మాటలకు “కానీండి చూద్దాం” అన్నాడు శేషవీరేశ్వరుడు.

జగన్నాథుడు ఆలోచనలో మునిగాడు. తరతరాలుగా జనంలో పేరుకుపోయిన భయంవలన ఏర్పడిన మూఢవిశ్వాసాలు అంతత్వరగా మాసిపోవు. ఆ భయాలు ఎవరో అంకురింపజేస్తారు. మరెవరో ప్రవృద్ధం చేస్తారు. ఆ భయాలు పోవాలంటే ఏదో చేయాలనే ‘చికిత్సావిధానాల్ని’ చాపకింద నీరులా ప్రవహింపజేస్తారు. క్రమేణా సంఘంలో ‘కర్మ’ పద్ధతులు, క్రియారూపాలు స్థిరత్వం పొండుతాయి. ఇదీ ఇప్పుడున్న సమాజస్థితి.

“ఈ కర్మకాండకు ఒగ్గిన మనుషుల్ని నిరసించీ, ద్వేషించీ ప్రయోజనం లేదు. వారు అనుసరిస్తున్న ‘తంతు’ మూలాల్ని పెకలించగలగాలి. అప్పుడే ఈ దురాచారాల మొక్కలు, వృక్షాలూ, అడవులుగా తయారయ్యే ప్రమాదాన్ని అరికట్టగలం. వ్యక్తినీ, వ్యవస్థనీ మార్చటమంటే – పిల్లి మెడలో గంటకట్టడమే..! దాన్ని సాధించుకోవటానికి లక్ష్యం పెద్దది. మనకున్న సాధనాలు పరిమితమైనవి. పూనుకున్న కార్యం మనుషుల చిత్తవృత్తికీ, ప్రవర్తనకీ సంబంధించినది. ఆ రెండూ ఎప్పుడూ ‘యథాతథస్థితి’లో పడి సాగిపోదామనే లక్షణాల్ని ఆకర్షిస్తాయి. ప్రత్యామ్నాయాలు చూపి పరిణామాల్ని ఎంత విశదం చేసినా అంతత్వరగా ఆశించిన మార్పురాదు” అని ఆగి “అందుకనే చెప్తున్నాను. చూద్దాం. కానీయండి” అన్నాడు శేషవీరేశ్వరుడు.

“నా వరకూ నాకు గురువుగారి మాట సత్ఫలితాన్నిస్తుందనే ఆశవుంది” అన్నాడు. నాగేశుడు. ‘అవును, కవీ విద్వాంసుడే కాదు జగన్నాథుడు సాంఘిక సంస్కరణాభిలాషి కూడా’ అనుకున్నాడు శేషవీరేశ్వరుడు.

అందరూ మౌనంగా ఫలహారం పూర్తిచేశారు. శేషవీరేశ్వరుడు, నాగేశుడూ, శాస్త్రి నిష్క్రమించారు. కామేశ్వరీ, పర్వతవర్ధనీ తమ పనుల్లోకి వెళ్లిపోయారు.

జగన్నాథుని ఆలోచనల్ని ఆకు గలగలలు కదిలించసాగాయి. మనసంతా అస్తిమితంగా వుంది. ఏదో భావోద్వేగం, ఆగ్రహం, చికాకు, నిస్పృహలో.. మిణుగురుల్లా ఆశ-ఆనంద వీచిక.. తల విదిలించి నవ్వుకున్నాడు. ఇన్నీ ఒక్కసారి కలుగుతున్నాయంటే తనలో జీవశక్తి అలలెత్తుతున్నదనే అనిపించింది. ‘ఇదే నా ఆయుధం’ అనీ అనిపించింది.

సంధ్యావందనానికి సమయమైంది. లేచి ఇంట్లోకి నడిచాడు.

***

కాశీ విద్యాపీఠానికి కొద్ది దూరంలోనే ఉమామహేశ్వరాలయం. విశాలమైన ప్రాంగణం. కాశీలోని పండితవర్గం, భాషాశాస్త్రకారులూ, వివిధ ప్రక్రియా విద్వాంసులూ చేరారు.

ప్రాంగణంలో వాతావరణం వేడిగా వున్నది. గాలి బిగదీసింది. ఉత్తరీయాలతో చెమట తుడుచుకుంటూ, కొంగులతో విసురుకుంటూ, ఉసురుసురంటూ నిట్టూర్పులు విడిచేవారితో అక్కడంతా అలజడిగా వుంది.

ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసిన ఘనుడు భట్టోజీ కనుక ఆహూతులకూ, అనాహూతులకీ కొదవలేదు. సమావేశ స్థలం జనసమ్మర్దంతో నిండుగా వుంది. విశాలమైన రాతి అరుగుమీద మిత్ర, శిష్యపరివారంతో భట్టోజీ కొలువై వున్నాడు. ఒక పక్కగా వరదరాజ పండితుడు. ఆయన లఘు, మధ్య, సార, సిద్ధాంత కౌముదులు-వ్రాసి ప్రసిద్ధుడైన వాడు. మరో ప్రక్కన నీలకంఠుడు – ‘శబ్దశోభ’ వ్యాకరణ గ్రంథ రచయిత కూర్చుని వున్నాడు..

శేషవీరేశ్వరుడూ, జగన్నాథుడూ శిష్య, విద్యార్థి గణంతో ముందు వరుసలోనే వున్నారు. వారి వెనుకగా పర్వతవర్థనీ, కామేశ్వరీ, ఇతర స్త్రీలూ కూర్చున్నారు.

వరదరాజు పండితునికి పక్కగా కొండుభట్టు కూడా కూర్చుని వున్నాడు. ఈయన భట్టోజీ సోదరపుత్రుడే. భట్టోజీ ‘కారికల’ మీద ‘భూషణ’ వ్యాఖ్యని వ్రాసినవాడు. ముందుగా కొండుభట్టు లేచి నిలబడి గొంతెత్తి మాట్లాడటం మొదలెట్టాడు. ఈ మధ్య శేషవీరేశ్వరుడూ, జగన్నాథుడూ కలిసి అనంతపురం, రామాపురం బృందాలతో కలిసి, అక్కడ ఏటా జరుగుతున్న ‘జాతర’ గురించి చేసిన చర్చల్ని విస్తారంగా ప్రస్తావించాడు. అయితే, ఎక్కడా వారి పేర్లు చెప్పలేదు. ‘కొందరు’ అనే పదాన్ని మాత్రమే వాడాడు.

“కర్మవిదూఱులు కాశీసంప్రదాయ ఆచారవ్యవహారాల్లో ఇలా తలదూరుస్తుంటే, పరిణామాలు తీవ్రంగా వుండవా?” అని ప్రశ్నిస్తూ, ఆచార్య, పండిత, పురోహిత వర్గాలన్నీ ఈ అనాచార ప్రయత్నాల్ని నిరసించాలనీ, తగిన చర్యలు తీసుకోవాలనీ కోరుతూ కూర్చున్నాడు.

నీలకంఠుడూ, వరదరాజ పండితుడూ ఇతర పెద్దలూ కొండుభట్టు చెప్పిన విషయాల్నే పునరుక్తం జరిపారు. చర్విత చర్వణం చేశారు. ఆ తర్వాత నలుగురైదుగురు ఆ అంశాల్నే పిష్టపేషణం చేశారు. శ్రోతల నుంచీ కూడా కొన్ని గొంతులు లేచాయి.

అప్పటి వరకూ మౌనంగా కూచుని వున్న భట్టోజీ లేచి చేతిలోని పొన్ను కర్రని పోటుగా ఆధారం చేసుకుని ఒకింత పక్కకి వంగి నిలబడ్డాడు. భుజం మీది పట్టు శాలువని సర్దుకున్నాడు.

“జరిగిన ఘటన మీకిప్పుడు పూర్తిగా అవగాహనకి వచ్చిందని భావిస్తున్నాను. సంఘటనకి కారకులైన వారిది దుడుకు మనస్తత్వం, ఆచార వ్యతిరేకత, సంప్రదాయ ఉల్లంఘన-వారి లక్ష్యం, విశృంఖలవర్తనం. కర్మవిదారణం-వారి తత్త్వం. కాశీ పండిత వర్గానికి అలిఖిత ప్రవర్తనా నియమావళి వున్నది. అది కర్మానుసరణని తిరస్కరించేవారిని ఉపేక్షించదు” అని అక్కడ ఆపి అస్తిమితంగా కూర్చుండి పోయాడు.

వేదిక మీది పెద్దలూ, సమావేశస్థలంలోని ప్రేక్షకులలో కొందరు కలకలంగా వివరం లేని సంభాషణల్లోకి దూకేశారు.

గురువుల వైపు చూసి ఒక్క ఉదుటున లేచాడు నాగేశుడు.

“దయచేసి అందరూ వినండి” అని గొంతెత్తి గంభీరంగా అరచి “నడుస్తున్న చర్చ అదృశ్య చిత్రణగా, అస్పష్టభాషణంగా ఉండనక్కర్లేదు. గాలిలో బంతి ఆటలూ, కరవిన్యాసాలూ అక్కర్లేదు. ఆ సంఘటనకు కారణం, ప్రేరణ అన్నీ మా గురువులవే. వారే పూనుకుని ఐచ్ఛికంగా, వాంఛితంగా, ఆవశ్యకంగా తలపెట్టిన ఒక మంచి పని అది. సామాజిక ప్రయోజనం, సంఘ అభ్యుదయం, పురోగమనం మిళితమై వున్న అవసర చర్య అది”

“కర్మ వ్యతిరేకతని మేము ఎంతమాత్రమూ అంగీకరించం” అంటూ అతని మాటల్ని అడ్డుకున్నా రెవరో.

“కర్మానుసరణంకి మా గురువులూ మేమూ కూడా వ్యతిరేకులం కాదు. దుష్కర్మలకి మాత్రమే వ్యతిరేకులం” దృఢంగా ఉన్నాయి నాగేశుని మాటలు.

“ఏది దుష్కర్మ? తరతరాలుగా వస్తున్న ఆచారాలా? ప్రజల విశ్వాసాలా?”

“ఆచారాలు కావు అవి – దురాచారాలు. విశ్వాసాలు కావు, అవి మూఢవిశ్వాసాలు.” నాగేశుడు.

“అలాగని మీరనుకుంటే చాలదు. దేశాంతరం నుండి వచ్చి ఇక్కడి సంప్రదాయ వ్యవహారాల్ని ఒల్లక, పెద్ద పోటరుల్లా తల లెగరేసి మీ జెండాలు పాతటానికి యత్నిస్తుంటే చూస్తూ కూర్చోవటానికి మేమేమీ చేతగాని సన్నాసులం కాదు” భట్టోజీ క్రీగంట కొండుభట్టు వైపు మెచ్చుకోలుగా చూశాడు.

“మీరెవరో మాకు బాగా తెలుసు” నాగేశుని మాటలకు వేదిక నవ్వింది.

“ఏం తెలుసు గోంగూర!”

ఆ మాట ఈ వైపున గల అందరికీ ముల్లులా గుచ్చుకుంది.

గమనిస్తున్నాడు జగన్నాథుడు. సమయజ్ఞత, ఉచితజ్ఞత కలిగిన మేధావి.

శేషవీరేశ్వరుని మనసునిండా ఆలోచనలు కలగాపులగంగా అలముకున్నై. లోలోపల ఉడికిపోతున్నాడు. భట్టోజీ మనసులోని ఈర్ష్యాద్వేషాలు, మదమత్సరాలూ బయటికి వస్తున్నాయి. తన తండ్రి శేషశ్రీకృష్ణ పండితుని మరణం తర్వాత భట్టోజీకి తానంటేనూ, తన వారంటేనూ కంటగింపుగా ఉన్నది. చులకన భావంతో మాటల్ని తేలుకొండిలా పొడుస్తూనే వున్నాడు. ఈ ఘటనతో వివాదం ‘నెగడు’ రాజుకుంది. మంట పైకి లేస్తోంది. ఒక విధంగా అది మంచిదే. ఈసారి జగన్నాథుడు భట్టోజీ పడగమీద కొడితేగానీ ప్రజలకు కూడా తమ పాండిత్యం, సామాజిక బాధ్యతతో తాము చేసే పనుల ఔచిత్యం తెలిసిరావు. తమది ఆధిపత్యం కోసం పోరుకాదు. అస్తిత్వ చైతన్యం!

నాగేశుడు లేచాడు. “ఊకదంపుడు ఆపండి. నిజంగానే గోంగూర సంగతి మీకు తెలియజేస్తాం. దాని పులుపునీ రుచి చూపిస్తాం. సిద్ధమేనా? దమ్ముంటే శాస్త్ర చర్చ జరపండి. ఆచారం-ఆచారం-అంటూ గొంతు చించుకుంటున్నారు గదా. ఆ ఆచారాన్ని ఉతికి ఆరేస్తాం. మీ కర్మ సిద్ధాంతానికి జవాబు చెబుతాం”.

నీలకంఠుడి వైపు చూశాడు కొండుభట్టు. వరదపండితుడి కళ్లల్లోకి చూశాడు. నీలకంఠుడు. అతను చూపు మరల్చుకుని భట్టోజీ మొహంలోకి చూశాడు.

భట్టోజీ తలవూపుతూ తన ఆమోదాన్ని సూచించాడు. ఆ అంగీకారాన్ని ఆసరాగా తీసుకుని “రండి అయితే” విసురుగా అన్నాడు కొండుభట్టు.

వెంటనే శేషవీరేశ్వరుడూ, జగన్నాథ బృందం వేదిక మీదికి వెళ్లారు.

శాస్త్ర చర్చ మొదలు పెట్టమని వరదరాజు వైపు చూస్తూ సూచన చేశాడు భట్టోజీ. వరదరాజు నిదానంగా ఎత్తుకున్నాడు. “మనిషై పుట్టినందుకు జీవితలక్ష్యం వుండాలి. మనిషికి పరమపరమోత్తర లక్ష్యం మోక్షసాధనమే. మోక్ష సాధన ప్రక్రియలో భక్తిదే ప్రాథమ్యం. భక్తి నవవిధాచరణ వల్లనే సాధ్యం. ఆ నవవిధానాల సారమే కర్మాచరణం. వాటిలో కామ్యకర్మలే మనుషులకు ఇహతారణ సాధనాలు. కనుక కర్మోల్లంఘనం అనాచారం. భ్రష్టత్వం” అని కొంచెం ఆగి చుట్టూ చూశాడు.

“బాగుంది-వివరణ. కానీ..” అన్నాడు భట్టోజీ.

“సమస్త విశ్వం భగవంతుని చేతుల్లో ఉన్నది. ఆ భగవంతుడు సత్యం అధీనంలో ఉన్నాడు. ఆ సత్యం ఋషిప్రోక్తం. వారు ధర్మాత్ములు. ఆ ధర్మాత్ముల్ని మనం పూజించాలి. వారు చెప్పిన మార్గంలో నడవాలి. ఆ మార్గమే కర్మాచరణం.”

ఇది వింటున్న వారిలో ఎక్కువ మంది తలలు అంగీకార సూచకంగా ఊగుతున్నాయి. ఈ పక్కన నాగేశుడికి ఉద్వేగం హెచ్చుతోంది. ఈ ప్రాథమిక ఉపోద్ఘాతాలు, ఉపన్యాస ఫణితీ చాలు, ఆపమని చెప్పాలని అతని తహతహ. జగన్నాథుని వైపు చూశాడు. ఆగమని సైగ చేశాడు జగన్నాథుడు. అస్తిమితంగానే ఉసురుసురని మౌనం వహించాడు నాగేశుడు.

ప్రేక్షకులలో నుంచీ ఎవరో ఒకరు ఆమాట అనాలని జగన్నాథుడు ఆశిస్తున్నాడు. అతనికి ఆ నమ్మకం వుంది. జ్ఞానం, పాండిత్యం, విద్వత్తు ఒక్కరి గుత్త సొత్తేమీ కాదు. ఇదీ ఆయన విశ్వాసం.

కొద్ది క్షణాల తర్వాత ఒక పండితుడు లేచాడు, “ఇదంతా ప్రాథమికాంశాల ప్రస్తావన. అంతేగాక, కర్మల్ని జీవికగా చేసుకుని బతుకుతున్న అర్చక వర్గం వారి ప్రచారం. ప్రజలచేత కర్మలు చేయించనిదే వారు బతకలేరు. అదీ అసలు కారణం. అందువలన మీరు కర్మానుసరణం సంగతిని పక్కన పెట్టి అనంతర ఉన్నత సోపానమైన జ్ఞానం సంగతి మాట్లాడండి” అన్నాడు.

మాట్లాడింది ఎవరా అని చూస్తే జగన్నాథునికి ఠక్కున గుర్తుకొచ్చింది. ఉపద్రష్ట వెంకట రామశాస్త్రి శిష్యుడు – శ్రీనివాసుడు! ఆ విషయాన్ని తన పక్కనే వున్న శంకరశాస్త్రితో చెప్పాడు. లిప్తకాలంలో అది శ్రవణ శుభగభాషణగా వీరి వారందరికీ చేరింది. శేషవీరేశ్వరుడు నవ్వు మొహంతో “బాగుంది” అన్నాడు.

శ్రీనివాసుని మాటలు వరదరాజుకూ, అతని సమూహానికి చిరాకు కలిగించాయి. “మీరెవరో తెలియదు. అయినా మిమ్మల్ని గౌరవిస్తూ, ఆ మార్గానికే చర్చని మరలిస్తాము” అని, భట్టోజీకేసి చూశాడు. ఆయన సరేనన్నట్లుగా కనుసైగ చేశాడు.

“ముద్గలోపనిషత్–అంటుంది కదా ‘తమ్ యథా యథా ఉపాసతే తదేవభవతి’ అని, బృహదారణ్యకోపనిషత్తేమో ‘పుణ్యానైపుణ్యేన కర్మణాభవతి, పాపఃపాపేనేతి’ అంటే సత్కర్మల ద్వారా మాత్రమే మనిషి మంచి వాడుగా మారతాడు. దుష్కర్మల ద్వారా చెడ్డవాడుగా మారతాడు అనేది సత్యం” అంటుంది.

“ఇదీ ముందు విచారణీయాంశం. ఏది సత్కర్మ? ఏది దుష్కర్మ?” అంటూ రక్కున మాటల్ని దూకించేశాడు నాగేశుడు.

జగన్నాథుడు తనలో తను నవ్వుకున్నాడు. “వాడి పిలకని వాడే ఇతని చేతికి బాగానే అందించాడు” అన్నది కామేశ్వరి భర్త కళ్లల్లోకి చూస్తూ, ‘అవును’ అన్నట్లుగా కనుచికిలించాడు జగన్నాథుడు.

“యద్యదాచరతిశ్రేష్ఠ, తత్త దేవోతరోజనః/సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే” అన్నాడు భగవానుడు. కనుక, మా గురువుల వంటి శ్రేష్ఠుల ఆచరణనే మేమూ, అన్యులూ ఆచరించాలి.” కొండుభట్టు వివరణ!

“కానీ, మీవంటి విద్వాంసులు ఆసక్తిరహితంగా, ఫలాపేక్ష లేకుండా కదా కర్మాచరణ చేయవలసినది. కానీ, మనకు ఉన్నదే ఫలాపేక్ష కదా! మరి తమబోంట్లు చేయించే కర్మల వలన సామాన్యులు ఇంకా ఇంకా అజ్ఞాన కూపంలో కూరుకుపోతున్నారు”.

భట్టోజీకి అర్థమైంది. తాము చెప్పే మాటల నుండి అర్థాన్ని తీసుకుని ఎదురు బాణాల్ని సంధించదలచుకున్నాడు జగన్నాథుడు. కనుక, ఇక తాను రంగప్రవేశం చేయాలని నిర్ణయించుకుని, లేచి నిలిచి, గొంతు సవరించుకుని హెచ్చరిక నిచ్చాడు. ప్రాంగణం నిశ్శబ్దమైంది.

“మనం ఇక్కడికి చేరింది శాస్త్ర చర్చకు. కయ్యానికీ, వియ్యానికీ, అంతోఇంతో సమత్వం ఉండాలి. మేము ఔదార్యంతో ముందుకొస్తున్నాం. మీలో ఎవరో ఒకరు మాత్రమే మాతో సంవాదం, చర్చా చేయవచ్చు. అంతే”- చెప్పి ఠీవిగా కూర్చున్నాడు.

శేషవీరేశ్వరుడు జగన్నాథుడివైపు చూశాడు. జగన్నాథుడు లేచాడు. ఒక గిరి వృక్షం తల వూచినట్లు, ‘సరే’ అన్నట్టు తల పంకించాడు. ధీరంగా నిలబడ్డాడు. ‘జయహో’ అంటూ నినాదాలు సభలో పెద్దపెట్టున వెల్లువైనాయి. కరతాళధ్వనులూ మ్రోగాయి.

వేదికపై వున్న అందరికీ నమస్కరించి, ‘శాస్త్ర చర్చని చేసే వాడిని నేను’ అంటూ కూర్చున్నాడు.

“యచచిత్తాస్ తన్మయోభవతి గుహ్యం ఏతత్ సనాతనమ్” అని మైత్రాయనీయ ఉపనిషద్వాక్యంని ఉటంకిస్తూ భట్టోజీ వ్యంగ్యాత్మకంగా జగన్నాథుని వైపు చూశాడు.

“మనోహి ద్వివిధం ప్రోక్తమ్- శుద్ధంచ అశుద్ధమేవచ/అశుద్ధం కామసంపర్కాత్; శుద్ధమ్ కామ వివర్జితమ్” అని అదే ఉపనిషత్తులోని మరో శ్లోకాన్ని స్పష్టమైన ఉచ్చైస్వరంతో చదివాడు జగన్నాథుడు.

సభలో దాని అర్థాన్ని కొంచెం బిగ్గరగానే అందించారెవరో, ‘మనసు రెండు విధాలు శుద్ధమ్, అశుద్ధమ్- అని. ఇహానికి సంబంధించిన కోరికలతో సంపర్కం ఉంటే అశుద్ధమ్, స్వేచ్ఛగా, స్వచ్ఛంగా వుంటే శుద్ధమ్’.

ఇటువైపు మహిళా జనానికి వినిపించేటట్లుగా, “పరిశుద్ధమైన మనసే మానవాభ్యుదయానికి త్రోవ” అన్నది పర్వతవర్థని. అందరూ చప్పట్లు కొట్టారు. వేదిక మీది నుంచీ ‘నిశ్శబ్దం’ అంటూ హెచ్చరిక వచ్చింది. సవ్వడి తగ్గి సభ నిశ్శబ్దమైంది.

‘ధర్మం ఏమిటి?’ అనే ప్రశ్నతో తన చర్చని ప్రారంభించాడు భట్టోజీ. శ్రుతి స్మృతి పురాణాల్లోని ఉటంకింపులతో చర్చ ముందుకు సాగింది.

“ధర్మం మూలం వేరు, అర్థం శాఖ; కామం-పుష్పం; ఫలం-మోక్షం” భట్టోజీ చెప్పుకొచ్చాడు.

“వైశేషిక సూత్రాల దర్శకుడు కణాదుడు తెలిపిన ‘యతః అభ్యుదయ నిశ్శ్రేయసః సిద్ధిః సహః ధర్మః’ అనే సూక్ష్మ సూత్రాన్ని స్పష్టం చేశాడు” అని మళ్ళీ కొనసాగిస్తూ ‘ఏదైతే అభ్యుదయాన్నీ, లౌకిక సంపదలను, దుఃఖ నివారణను, శాశ్వతానందాన్నీ కలిగిస్తుందో అదే ధర్మం’ అనీ అర్థమైంది”.

“వేదోక్తమైన ధర్మం రెండు రకాలు. ప్రవృత్తి మొదటిది. అదే జగత్తు స్థితికి కారణం. అదే ప్రాణికి కార్యరంగంలో తోడ్పడుతుంది. రెండవది నివృత్తి. అది మోక్షానికి హేతువవుతుంది. అయితే, సామాన్యులు, సాధారణ మానవులు నివృత్తి గమ్యాన్ని చేరుకోవటానికి ప్రవృత్తి మార్గం ఒక సోపానం. అందువలన వారికి కర్మానుసరణం ఆవశ్యకం. అదే వారందరికీ ధర్మానుసరణం. కనుక-కర్మాచరణం ధర్మంలో భాగం. ధర్మాచరణమంటే కర్మాచరణమే. కనుకనే కర్మ మార్గంలో ఉన్నవాడు క్రియాలోపం లేకుండా క్రతువులు నిర్వహించాలనేది మా బోధ. వేదం కూడా ఈ కర్మకాండనే బోధించింది”.

జగన్నాథుడి మొహం వెలిగింది. “క్రియాలోపం లేకుండా అనేమాట వాడారు. చక్కని పదం అది. కర్మకాండకు బద్ధుడైన సామాన్యుడు చేసే పనిలో నిశ్చయంగా క్రియాలోపం వుంటుంది. కారణం – అతను చేసే పనికి రావలసిన ఫలితాన్ని పొందకుండా చేసేవి-మూడు అవకాశాలు. అవి మొదటిది అసంభావన, రెండవది సంశయభావన, మూడవది పక్కతోవకు తోసే విపరీతభావన. వీటివలన క్రియాలోపం లేకుండా చూసుకోలేడు. అథవా చూసుకోగలిగినా కర్మమార్గంలో సంపూర్ణంగా రాణించలేడు. అతనిది ఎప్పుడూ జారుడు మెట్లమీది నడకే. కనుక లక్ష్యం సాధించలేడు. ఒకవేళ ఈ మూడూ లేకపోతే-కర్మ మార్గం కంటే వేగంగా జ్ఞానమార్గం అతన్ని తరింపజేస్తుంది కదా.”

ఆ తర్వాత భట్టోజీ భాగవతాన్నీ, పూర్వ మీమాంసనీ ఆధారం చేసుకుని వాదించాడు. ‘గతి-స్థితి’ తెలిసిన కాలజ్ఞుల బోధ ఇంతమాత్రమే కాదు” అని జగన్నాథుడు ఇంకేదో చెప్పబోతుంటే, భట్టోజీ ఆపి, ‘తమ్ యథాయథా ఉపాసతే తద్వైవ భవతి” అని ముద్గళ ఉపనిషద్వాక్యాన్ని చెప్పి, “కనుక ఎవరు ఎలా భగవంతుని ఉపాసన చేస్తారో ఆ విధంగానే మారుతారు. కాబట్టి కర్మాచరణమే మోక్ష సాధనమార్గాల్లోని అత్యంత సులభమైన విధానం” అన్నాడు.

జగన్నాథుని పెదవుల మీద చిరునవ్వు మెరిసింది.

“చరాచర సృష్టికి శుద్ధచైతన్యం బ్రహ్మమేనని ఋగ్వేదం తీర్మానించింది. బ్రహ్మమంటే ఎక్కడో లేదు. ఆద్యంతరహితమై సర్వ వ్యాపకమైన చైతన్యం! దేహమనే ఉపాధిలోనే మనిషి జ్ఞాన సముపార్జకుడై ‘నేనే ఆత్మస్వరూపుణ్ణి’ అనే సత్యాన్ని దర్శించి ముక్తిని పొందుతాడు అంటుంది యజుర్వేదం. సామవేదమేమో ‘ఉన్నది ఒక్కటే. అది పరబ్రహ్మమే’ అంటుంది. ఇక అధర్వణవేదం కూడా జీవాత్మ పరమాత్మల అభేదాన్నే ప్రవచించింది” అంటూ నాలుగు మహావాక్యాల సారాన్ని విడమరచి చెప్పాడు. అవే ప్రజ్ఞానం బ్రహ్మ, తత్త్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ. పూర్వమీమాంసకు ఆధారభూతమైన కర్మాచరణంలోని సత్యం ఉపరిస్పర్శ మాత్రమేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. నిత్యకర్మానుష్టానం మనిషికి ఎంత అవసరమో అంతవరకే దాని స్థానం. ఆపైన కావలసింది జ్ఞానానుష్ఠానమే. ఆ జ్ఞానంలోని అంతస్తత్వం సర్వప్రాణికోటిలో సమానమై వెలిగే ప్రజ్ఞానమే. అదే బ్రహ్మ అని ధ్రువీకరించాడు. ‘కుర్యాద్విద్వాం స్తథాసక్తః చికీర్షుర్లోక సంగ్రహమ్’ అన్న భగవానుని సూక్తిని చెప్పాడు. “అవును. జ్ఞాని సైతం లోకహితార్థమై, ఆసక్తి రహితుడై కర్మల్ని ఆచరించాలి” అని చెబుతూ, “అందువల్లనే మా ఉత్తర మీమాంస కర్మద్వేషి కాదు. మేమూ కర్మిష్టులమే. కాకుంటే మా కర్మానుష్ఠానం నిత్యకర్మలను పాటించే వరకే పరిమితం. ‘శాస్త్రాణ్యాకలితాని నిత్య విధయస్సర్వేపి సంభావితాః’- ఇదీ మా సిద్ధాంతం”.

అక్కడ ఆపేశాడు. “అందుకనే మేము కామ్యకర్మల జోలికి పోము. అమాయక జనాన్ని బలులూ, జాతరలూ అంటూ దుష్కర్మల పాలు జేయం మీలాగా” అంటూ అరిచాడు నాగేశుడు.

“అదే మీ దుర్మార్గం” అంటూ సభలో ఎవరో లేచి పెద్దగా కటువుగా అన్నారు

“దుర్మార్గం చేస్తున్నదీ, చేయిస్తున్నదీ ఎవరో ప్రజలు క్రమేణా తెలుసుకుంటున్నారు. మీ నోటికి ఝడిసే పరిస్థితి మారుతోంది లెండి” అన్నాడు శాస్త్రి.

“ముందు ఇక్కడ మీ నోటితో ఝడిపించకూడదు. తోక ఝాడించనూ కూడదు. జరుగుతున్నది శాస్త్ర చర్చ” అని తీవ్రస్వరంతో హెచ్చరించాడు నీలకంఠుడు. శాస్త్రి ఏదో చెప్పబోయి, జగన్నాథుడి సైగతో మిన్నకుండిపోయాడు.

“జరుగుతున్న చర్చ సామాన్యమా? అందునా మీమాంస. అంటే వివేచించటం, వితర్కించడం, విచికిత్స చేయడం. ఆషామాషీ పోచికోలు వ్యవహారం కాదు. మేము ‘అథాతో ధర్మ జిజ్ఞాస’తో మొదలెట్ట నవసరం లేదు” అన్నాడు భట్టోజీ.

“అక్కర్లేదు. బ్రాహ్మణుల సూత్రాలూ, కర్మక్రమాలూ, అపర విద్యా విషయాలూ-ఇప్పుడు పునరుక్తం చేయనక్కరలేదు. మాకు అవన్నీ అరచేతి ఉసిరికలే” అన్నాడు శేషవీరేశ్వరుడు.

ఆయన చర్చలోకి దిగటంతో భట్టోజీ కోపంతో ఊగిపోతూ, “చర్చలో అన్యుల ప్రమేయం వుంటే మేము అంగీకరించం. అది అలిఖిత శాసనోల్లంఘన అవుతుంది జాగ్రత్త” అని “పర్యవసానం మీ ఓటమి ప్రకటనే అవుతుంది” అన్నాడు.

వేదికపై గంభీర వాతావరణం నెలకొంది.

కొన్ని నిముషాల తర్వాత “కానీయండి” అన్నాడు వరదరాజ పండితుడు.

జగన్నాథుడు “మేము ‘అథాతో బ్రహ్మజిజ్ఞాసే’ అంటున్నాము” అని ఉత్తర మీమాంస బాదరాయణ సూత్రాల్లో సమన్వయాచ్ఛయాన్ని ఉటంకిస్తూ ఉపనిషద్వాక్యాల్ని బ్రహ్మంతో సమన్వయం చేశాడు. ప్రజ్ఞానమే బ్రహ్మమని తేల్చాడు. బ్రహ్మమే ప్రపంచంగా ఎలా రూపుదిద్దుకున్నదో చెప్పి, అందువలన జగత్తు బ్రహ్మము కన్నా వేరైనది కాదని ధ్రువీకరించాడు. జీవబ్రహ్మముల సంబంధం అధ్యాస వలన ఎలా ఏర్పడినదీ విశదీకరించాడు. అధ్యాస తొలగితే మోక్షం సంప్రాప్తిస్తుంది అంటూ అవిద్య తొలగటమంటే జ్ఞానప్రాప్తి అని రూఢి చేశాడు.

అప్పుడు భట్టోజీ, “మీరు ఎన్నెన్ని వివరణలు ఇచ్చినా, ఉపనిషత్తులు చూపినా కర్మల్ని త్యజించలేమనేకదా చెప్తున్నారు” అన్నాడు.

“అవును. కర్మల్ని త్యజించకూడదు. కర్మల్లో మాత్రమే చిక్కుకోవడాన్ని త్యజించాలి. నిష్కామ కర్మాచరణం కావాలి. నిష్కామకర్మ అకర్మకాదు” అంటూ దానికి వివరణగా-భగవద్గీతని ఉదహరించాడు జగన్నాథుడు. “నిరాశీర్యత చిత్తాత్మాత్యక సర్వపరిగ్రహః/శారీరం కేవలం కర్మకుర్వన్నా ప్నోతి కిల్బిషమ్’ – అని భగవానుడు అర్జునుణ్ణి ఆలంబనగా చేసుకుని మానవజాతికంతటికీ చేసిన బోధ ఇదే కదా” అంటూ

“మేము చెప్పేదే మీరూ చెబుతూ మేము చేసే కర్మాచరణని నిరసిస్తున్నారు. దీన్నే వితండవాదం అనేది” భట్టోజీ స్వరంలో వ్యంగ్యం తొంగిచూసింది.

“కాదు. కర్మజ్ఞాన యోగాల మూలాల్ని అర్థం చేసుకోవలసిన ఆవశ్యకతని చెబుతున్నాము. పునర్జన్మ రాహిత్యం పేరుతో, మోక్షం పేరుతో దాని సాధన మార్గాల్లోకి పెద్దలు ప్రవేశపెట్టిన సామాజిక దురాచారాల్నీ, అవాంఛితాల్నీ తిరస్కరిస్తున్నాము. భగవత్తత్వంలోని ఆత్మజ్ఞాన ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తున్నాము.”

వెంటనే భట్టోజీ “ఔషధం పేరు ఉచ్చరిస్తూ ఉన్నంతమాత్రాన వ్యాధి తగ్గదు. మీరు చెప్పే జ్ఞానం అటువంటిదే” అన్నాడు.

జగన్నాథుడికి నవ్వొచ్చింది. “మీరు వివేక చూడామణి ప్రసక్తి తెస్తున్నారు. బాగుంది. అదే వివేక చూడామణి – ఈ దేహమే సర్వస్వం అని భావిస్తూ దానితో భోగాలను అనుభవించేవాడు ఆ కర్మచేత తనను తాను చంపుకొన్న వాడవుతాడు అని చెబుతోంది. ‘అవిద్యలో మునిగి విషయ వాసనల్లో తేలుతూ ఉండేవారు అంథులకు మార్గం చూపే అంధులు వారు’ అన్నది కదా కఠోపనిషత్తు” అన్నాడు.

ఇంతలో అదాటున సభలో ఒకమూల నుంచీ ఒక కంకరరాయి విసురుగా వచ్చి శాస్త్రికి తగిలింది. “ఎవర్రా అంధులు? ఆంధ్రుల పేరే అసలైన అంధులు” అనే పొలికేక వినవచ్చింది.

వేదిక మీద అందరూ “ఎవరు? ఎవరిది? ఎవరు రాయి విసిరింది? అంటూ లేచి నిలబడి పెద్దగా అరిచారు.

అటు సభలో కలకలం రేగింది. ఒక మూలగా అరుపులూ, కేకలూ రాళ్లు రువ్వుకోవటం మొదలయినై. ఒక్క ఉదుటున నాగేశుడు జనంలోకి జొరబడుతూ పరిగెత్తాడు. ‘ఈ దుర్మార్గాన్ని సాగనీయకూడదు. ఖచ్చితంగా ఇది భట్టోజీ వర్గం వారి పనే” అంటూ తానూ బయటికి ఉరికాడు శాస్త్రి.

“మాటలు మీరకండి. ఇలాంటి దుందుడుకుతనమంతా మీ పనే” అన్నాడు వరదరాజు.  “అవును.. అవును. విచ్చృంఖలత్వంతో మమ్మల్ని ఎదుర్కోవాలను కుంటున్నారు మూర్ఖశిఖామణులు. వదిలేయండి. పదండి” అంటూ వేదికదిగి విసవిసా తన శిష్యబృందంతో వెళ్లిపోయాడు భట్టోజీ.

“ఆపండి. ఈ ఆరోపణలు.. ఇక చాలు. ఆడలేనమ్మ సామెతగా ఉంది పరిస్థితి” వారంతా వినేలాగా పెద్దగా అంటూ, జగన్నాథుని జబ్బపట్టుకుని కిందికి దిగాడు శేషవీరేశ్వరుడు.

సభలో మాత్రం తిట్లు, దీవెనలూ, అక్కడక్కడా ముష్టి ప్రహారాలూ సాగుతున్నై. దూషణభూషణ తిరస్కార పండిత సభ కాస్తా ఖండన ముండన రసాభాస సభగా ముగిసింది.

***

“కాశీ పండితులని నీ తెలివితో ఇబ్బందికి గురిచేయటం కాదు. పాండిత్యం, విద్యాధైర్యం వుంటే చర్చలో నన్ను ఓడించు” అని జగన్నాథుడికి సవాలు విసిరాడు శశిభూషణుడు. సవాలు తెచ్చిన వాడు ఓ పిల్లకాకి!

‘ఊరకవులూ! పిల్లకాకులూ! కాస్త వాగుడు కట్టి పెట్టండి? పశువూ పశుపతీ తప్ప తక్కిన వారందరూ పారవశ్యంతో శిరకంపం చేసేటట్లు కవిత్వం చెప్తున్నాడు జగన్నాథుడు. గోలచేయకుండా ఊరుకోండి” అని గురువుగారు ఎప్పుడో అలాంటివారికి సమాధానం చెప్పారు”. “మొన్నీ మధ్యనేగా-చీటికి మాటికీ మీమీద కాలు దువ్వుతున్న భైరవ స్వామికి మా గురువుగారు శృంగభంగం చేశారు. బహుశా-మీ శశిభూషణులవారు విని వుండరీ వృత్తాంతం” అని వెటకరించాడు. శాస్త్రి.

పిల్లకాకికి కోపం వచ్చింది. చిరచిరలాడాడు. విసవిసా వెళ్లి రుసరుసలతో శశిభూషణుడికి ఈ మాటలన్నీ చెప్పాడు. అటూ ఇటూ వార్తలూ, సవాళ్లూ నడిచాయి.

సభ ఏర్పాటయింది.

ఒక్క భాగవతాన్ని ఆధారం చేసుకుని శివకేశవ అభేదతత్త్వం మీద చాలా చర్చ జరిగింది. చివరికి జగన్నాథుడు ఇచ్చిన కఠోపనిషత్తులోని శ్లోకసారంతో నిరుత్తరుడై సంభ్రమాశ్చర్యాల్లో మునిగాడు శశిభూషణుడు. జగన్నాథుని పాండిత్యానికీ, సమన్వయ ప్రతిభకూ, ఉదహరింపుల లోకజ్ఞతకూ, బహుగ్రంథాల నుండి చేసిన ఉటంకింపులకు-’జయహో’ అనక తప్పలేదతనికి. స్వయంగా తానే శతసహస్ర ప్రశంసలతో జగన్నాథుని నవరత్న ఖచిత గండ పెండేరంతో సత్కరించి పాదాభివందనం చేశాడు! కాశీ పండితవర్గంలో ఇది పెద్ద పరిణామం!

విషయం విన్నాడు భట్టోజీ. మనసు రగిలిపోయింది. కనక్‌లాల్ స్వయంగా విన్నాడు, చూశాడు కూడా. నిజానికి శశిభూషణునికి పెద్ద వత్తాసు నిచ్చింది ఈయనే. కవినామధేయుడు. ఘంటాకృష్ణుని బాపతు. జగన్నాథుని సాహిత్య విజయానికి మనసులో కుతకుతలాడిపోయాడు.

ఇలాంటి వార్తలకి కాశీలో ప్రత్యేక చాటింపు లేమీ అక్కర్లేదు. ఆనోటి నుంచీ ఈనోటివరకూ, చెవుల మధ్యగా పాకిపోతాయి. గంగా ప్రవాహంపై నుండీ వీచేగాలి. తరగలలో నిరంతరం వార్తలే! ఈ ఘాట్ నుంచీ ఆ ఘాట్‍కి నిదానంగానైనా నిక్కచ్చిగా వెళతాయి.

స్పర్థలు మరింత రాజుకున్నాయి.

శశిభూషణ్ ఆగ్రా వెళ్లిపోయాడు. కనకలాల్ కాశీలోనే వుండి తన వందిమాగధ పరివారంతో, భట్టోజీ శిష్యులతో తన కవిత్వ ప్రతిభ గురించీ, పాండిత్య ప్రకర్ష గురించీ ప్రచారం చేయించుకోవటం మొదలెట్టాడు.

ఆరోజు సాయంత్రం,

శంకరశాస్త్రికి సంగీత పాఠం చెప్తున్నాడు జగన్నాథుడు. కామేశ్వరీ అక్కడే కూర్చుని వుంది. మధ్యలో వచ్చాడు చక్రపాణి. అతను శేషశ్రీకృష్ణులవారి శిష్యవర్గంలో వాడే. జగన్నాథునికి సన్నిహితుడు. అసిఘాట్‌కి వెనగ్గా చిన్న గురుకులాన్ని నడుపుకుంటున్నాడు. అందువలన జగన్నాథుని అరుదుగా కలుస్తూ వుంటాడు.

భట్టోజీ ‘ప్రౌఢమనోరమ’ విమర్శను అక్షరం అక్షరం చదివి ఆ విమర్శలోని డొల్లతనాన్నీ, కుటిలవక్రభాష్యాన్నీ చీల్చి చెండాడాలని ప్రస్తుతం లోతైన పరిశీలన చేయడంలో నిమగ్నమై ఉన్నాడు. తన గ్రంథం ‘మనోరమా విమర్దనం’ కాబోతున్నదని ప్రకటించాడు కూడా.

సంగీత పాఠం అయింది.

చక్రపాణి అన్నాడు, “కనక్‌లాల్‌కి అతిశయం, భేషజం ముదిరిపోయాయి. మీకో విషయం తెలిసి ఉండదు. స్వర్ణకారుని ఎవర్నో పట్టుకుని ఒక నకిలీ గండపెండేరాన్ని చేయించుకుని, ఏదో చెట్టుకింద సభ తీర్చి శిష్యులచేత ఆ గండపెండేరాన్ని తొడిగించుకున్నాడుట. చివరికి కొండుభట్టు కూడా అక్కడా ఇక్కడా దీన్ని గురించి హేళనగా చెప్తున్నాడుట!”

నవ్వుతూ కామేశ్వరి వైపు చూశాడు జగన్నాథుడు. “ఏమన్నా శ్లోకం చెప్తావేమిటి?” కళ్ళు చికిలిస్తూ అన్నాడు. ఆమె సన్నగా నవ్వింది.

“అయి! వహసి లలాటే ఖడ్గ! శృంగంయదేకం/నను కథమపి తస్మా దృష్యశృంగేణ తుల్యః/ మహిష ఇవ చతుష్పాజ్జంతురే వాసి జాత్యా/పరుషతమ తను స్త్వం నీదతాతే క్వయాతి?” అంటూ చదివింది.

వినగానే ‘ఓసి ఖడ్గమృగమా! నీకు నుదుటి మీద కొమ్ము ఉంది సరే. దానితో నువ్వు ఋష్యశృంగ మహర్షితో సమానమవుతావా? నువ్వు నాలుగుకాళ్ళ జంతువువి అంతే” అని భావాన్ని చెప్పి “గురువుగారు చెప్పిన శ్లోకమే” అన్నాడు శంకరశాస్త్రి.

“అవును. అదేగదా ఈ సందర్భానికి నప్పేది” అని నవ్వింది కామేశ్వరి. “ఆమె నా అర్ధాంగి శాస్ర్తీ!” అంటూ తానూ నవ్వాడు జగన్నాథుడు.

కామేశ్వరి చిరునవ్వుతో లోనికి వెళ్ళి ఫలరసం తెచ్చింది. అందరూ తీసుకున్నారు.

“ఇది చెబుదామనే వచ్చాను. చీకటి పడుతోంది. వస్తాను మరి.” అంటూ చక్రపాణి లేచినట్లే లేచి మళ్ళీ కూర్చుని – ఖండదేవుని పూర్వ మీమాంస వివరణల మీద జగన్నాథునితో సందేహాల్ని తీర్చుకొని ఆ తర్వాత ఎప్పటికో కదిలాడు.

***

ఉమా మహేశ్వరాలయం ఘటనతో భట్టోజీ మనసులో వైరభావం ఎసరు నీళ్ళలా తెర్లుతోంది. ఆయన శిష్యులూ, పురోహితవర్గం అందరూ శేష వీరేశ్వరుడు, జగన్నాథుని పేరంటేనే మండిపడుతున్నారు. గంగానది ఘాట్లవద్ద, సాయంత్రం హారతి సమయంలోనూ ఇదే చర్చ జరుగుతోంది.

ఒక పథకం ప్రకారం భట్టోజీ తన వారితో ప్రత్యేకించి జగన్నాథుడు కర్మ విదూఱుడనీ, అనాచార పరాయణుడనీ – అతన్ని ఇలాగే వదిలేస్తే కాశీ పరువు ప్రతిష్ఠల్ని గంగలో కలుపుతాడనీ ప్రచారం చేయించసాగాడు. ఈ ప్రచారానికి ఉప్పూకారం కలుపుతూ, అందువల్లనే జగన్నాథునీ, శేషవీరేశ్వరుణ్ణి రాళ్ళ దెబ్బలతో తరిమికొట్టారనీ చెప్పించసాగారు.

జగన్నాథుడు పెద్దగా పట్టించుకోకపోయినా, ఆయన శిష్యులు బాధపడసాగారు. శరీరం పంచభూత నిర్మితమంటారు కదా! పృధ్వీతత్త్వం వారు మందమతులు. అంతగా ఏమీ అర్థం కాదు. జలతత్వం వారైతే చంచల స్వభావులు. అగ్ని తత్వంవారు – తీవ్రమనస్కులు. వాయుతత్వంవారికి జవసత్వాలు ఎక్కువ. ప్రతిపనిలో వేగం ఎక్కువ. ఆకాశ తత్త్వం మనుషులది శాంత స్వభావం. ఆధ్యాత్మికంగా, జీవన తాత్వికతా ధోరణితో సమస్థితిలో ప్రవర్తిస్తూ వుంటారు.

నాగేశుని శరీరంలో అగ్నితత్త్వం కాస్త అధికం. దానివలన ఏ భావమైనా తీవ్రంగానే ప్రదర్శితమవుతూ ఉంటుంది. సంతోషం కానీ, భక్తిగానీ, వినయంగానీ, ప్రేమగానీ – అతనిలో తీవ్రంగానే ఉంటుంది. శాస్త్రిలో వాయుతత్వం ఎక్కువ. వేగం ఎక్కువ. ఏతా వాతా ఇద్దరూ కలిసి – అగ్ని, వాయువూ!!!

చాలాసార్లు, చాలాసేపు భట్టోజీనీ, ఆయన వందిమాగధ పరివారాన్నీ నిష్కర్షగా ఎదుర్కోవాలనీ, వెంటనే మనం శాస్త్రచర్చల్లో మన శక్తిసామర్థ్యాలు చూపించకపోతే, మనల్ని అసమర్థులుగా చిత్రించి వాళ్ళు ఇంకా ఎక్కువగా పేట్రేగి పోతారనీ ఉల్లిత్తుల్లా ఎగిరెగిరి పడ్డారిద్దరూ. శేషవీరేశ్వరునిది ఆకాశతత్త్వం. జగన్నాథునిలో కంటే కూడా ఆయనలో ఆ స్వభావం మరికొంత ఎక్కువ. అందువలనా, వయసు వలనా కూడా ఆయన తక్షణ ప్రతిస్పందన అవ్యక్తం.

జగన్నాథుడు చిరునవ్వుతో “యుద్ధకళలో తెలివైనవాడు యుద్ధం చేయకుండానే విజయం సాధిస్తాడు. సంయమనంతో అవగాహనతో విజయానికి తానుగా చేయవలసిన చర్యలకంటే, ప్రతికక్షులు అనేక బలహీనతలతో చేసే చర్యల్నే ప్రేరేపిస్తాడు. వారిని అరచేతిలో నిప్పు కణికల్ని పట్టుకుని చిందులు తొక్కేటట్లు చేస్తాడు” అని, ‘అర్ధమైందా’ అన్నట్లు చూశాడు.

“అయ్యీ కానట్టూ వుంది” అన్నాడు నాగేశుడు. “మనమీద ఈర్ష్యతో మన ప్రతిపక్ష బృందమంతా తమకు తామే ఏదో ఒక సభ పెట్టటం, చర్చలేపటం, దుష్ప్రచారం చేయటం. ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోతున్నాయా లేదా? అవన్నీ మనకు విజయావ కాశాలవుతున్నై కదా! వారి అసూయ మనబలం. అదీ సంగతి” జగన్నాథుడు వివరించాడు.

ఇప్పుడు నాగేశుడి మొహం తేటపడింది. “అవును. పెద్ద విశ్లేషణే ఇది” అన్నాడు – తనకు తాను చెప్పుకుంటున్నట్టు.

శాస్త్రి అంతర్ముఖీనుడై వున్నాడు. జగన్నాథుని మాటలలో ఏదో మహత్తువుంది. మహిమ వుంది. ఆత్మజ్ఞాన ప్రబోధమే ఉంది. లోకజ్ఞతతో పాటు లౌక్యమూ వుంది. వ్యూహ నిర్మాణమూ, ప్రతివ్యూహచ్ఛేదనా కూడా వున్నాయి. గురువుగారికున్న జ్ఞానం భట్టోజీకి లేక పోగా, ఆయన బుద్ధి అంతా అజ్ఞానంతో కూడి వున్నది. జగన్నాథునిలో నైర్మల్యం వుంది. అవతలివారు మనోమాలిన్యంతో నిండి వున్నారు.

రోజులు గడుస్తున్నాయి. క్రమేపీ జగన్నాథునిలోని విద్వత్తు జనానికి తెలిసివస్తోంది. భట్టోజీ అసలు రంగు బయటపడుతున్నకొద్దీ – జనం ఆయన్ని తృణీకరించటం జరుగుతోంది. నెమ్మదిగా జనంలో జగన్నాథుని పట్ల ఆరాధనాభావం పెరుగుతోంది. ‘జగన్నాథుడు వ్యక్తి కాదు శక్తి. భట్టోజీ సామూహిక భేషజం – అది వాపు!!’ ఇలా మౌన సంభాషణం చేసుకుంటున్నాడు శాస్త్రి.

వీరందరికంటే – పర్వతవర్థని ఎక్కువ వేదనని అనుభవిస్తున్నది. కారణం – స్త్రీ సమూహంలోనూ ఇది చర్చ కొస్తున్నది. వెటకారాలూ, నిష్ఠురాలూ ఎక్కువైనై.

అయితే, కామేశ్వరి గర్భవతి కావటం వలన భట్టోజీ వర్గం వ్యవహారాలు తెలిసినా, విన్నా, ఆయా విపరీతాల గురించి సమయాన్ని వ్యర్థం చేయటం లేదు. పర్వతవర్థని మాట్లాడినా, ఇది అంతా నిత్యజీవన పోరాటమే కదా అని ఆమెతో అనీ, తనకు తాను చెప్పుకునీ – మానసికంగా సర్దుకుపోతోంది.

పరిస్థితులు ఇలా ఉండగానే కాశీ సంస్కృత విద్యాలయంలో కొందరు పండితులు వేదాల తిరువెంగళాచార్యులవారి మహోపన్యాసాన్ని ఏర్పాటుచేశారు. ఆయన అలంకార శాస్త్ర ప్రవీణుడు. రామాయణ మహాభారత ధర్మసూక్ష్మ వివరణలో ధీనిధి. తీర ఆంధ్రదేశం నుండి వచ్చినవాడు. కాశీలో కొంతకాలం ఉండి ఉత్తరభారతమంతా పర్యటిస్తూ ఉంటాడు. ఇటీవల కొన్నేళ్ళుగా మధురలో ఉంటున్నాడు.

జగన్నాథుడు అలంకారశాస్త్రంలో నూతనత్వం సాధించటానికీ, తనదైన సిద్ధాంతాల్ని ప్రపంచించటానికీ – అప్పటికే ఆలోచనలు చేస్తున్నవాడు. కనుక, ఈ సభ పట్ల ఉత్సాహం కలిగించాయనకు.

ఆవేళ సభ – ప్రసంగాంశం రామాయణంలో ఇంద్ర – విష్ణు పారమ్యం. ఆ అంశం నుండి వాల్మీకి రామాయణంలో ప్రయోగించిన కొన్ని అలంకార విశేషాల్ని వేదాలవారు చెప్పబోతున్నారని తెలిసింది. అందువలన, వేదాలవారి ఉపన్యాసం పట్ల ఉత్సుకత పెరిగి – ఉత్సాహవంతులు ప్రాంగణంలో కూడారు. శేషవీరేశ్వరుడూ, జగన్నాథబృందం కూడా అక్కడికి చేరుకున్నారు.

కవీంద్రాచార్యులు, రాయముకుందుడు వంటి పెద్దలు తమ తమ శిష్యులతో ఢిల్లీ నుండి, జయపురం నుండి వచ్చారు. జగన్నాథునికి వారితో ప్రత్యక్ష పరిచయం లేకున్నా వారిద్దరి గురించీ తన తండ్రి పేరుభట్టు ప్రస్తావించే ఉన్నాడు. భట్టోజీ ఆయన శిష్యులు కూడా వచ్చి కూచున్నారు.

ఆచార్యుల వారు రామాయణంలో ధ్వని పూర్వకంగా వాల్మీకి లోకానికి అందించిన ఇంద్రపారమ్యాన్ని గురించి ఎంతో లోతైన విశ్లేషణని అందించారు. ఆ తర్వాత ఆలంకారిక విశేషాల్నీ చెప్పారు.

భట్టోజీ వర్గంలో ఎవరో ఒకాయన లేచి, ‘కర్మదూషణ ఋషి దూషణే కదా! ఋషి దూషణ దైవదూషణే కదా!” అంటూ ఒక అసందర్భపు ప్రశ్నని విసరి, ‘వీటన్నిటికీ పాల్పడేవారు ఛండాలత్వం అంటించుకున్నట్లే కదా’ అని అతి తెలివిగా, వ్యంగ్యంగా జగన్నాథునిపై గూఢదూషణం చేశాడు.

వేదాలవారికి కాశీలో ఉండే పండిత స్పర్థలు తెలుసు. జగన్నాథుడి ప్రతిభాప్రాభవానికి దాసోహమనలేక ఈసుతో రాళ్ళు రువ్వుతున్న భట్టోజీ వర్గం గురించీ వినే ఉన్నాడు. అసలు ఆ ప్రశ్నకి మొలక అర్థమైంది. క్షణం సేపటిలో తెప్పరిల్లి, నవ్వుతూ అన్నారు. “పదాలు మాత్రమే వినీ, చదివీ- వాటి ఉపరి స్పర్శ పనికిరాదు. వాటి అంతరార్థమూ, వాటి వెనుక నున్న కార్యకారణ ఔచిత్యమూ వంటివి కూడా విచారించాలి. కన్ను చూసిన దానిని బుద్ధితో విచక్షించుకోవాలి. లేకుంటే పాక్షిక నిర్ణయాల రొంపిలో దిగబడిపోతాము” అని ఆగి అందరి వైపూ దృష్టి సారించి, తిరిగి భట్టోజీ సమూహం వద్ద చూపు నిలిపాడు.

తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ, “ఋషులు కొన్ని ధర్మ నిర్దేశాల్ని చేస్తారు. వాటి సూక్ష్మవిచారం లేకుండా కొందరు పెద్దలు కర్మలోకి, క్రియలోకి తమ స్వప్రయోజనాల్ని జొనుపుతారు. సాధారణ ప్రజల్లో ‘సరే’ ‘కాబోలు’ ‘పోనీలే’ అనే తత్త్వం ఉన్నవాళ్లే ఎక్కువ, అందువలన ఆ కర్మలూ, క్రియలూ సాగిపోతూ వుంటాయి. అయితే, ఋషులు నిర్దేశించిన ధర్మాల్ని పరిరక్షించవలసింది పాలకులు. అది వారి బాధ్యత. ఆ బాధ్యత విస్మరింపబడితే సమాజం విభిన్న ఆలోచనలు కలిగిన భిన్నభిన్న సమూహాలుగా చీలిపోతుంది. అందుకే ఈ స్పర్థలు” అని గట్టిగానే అన్నారు.

ఆచార్యుల వారు చెప్పిన విషయంలోని సూక్ష్మ విచారం, చెప్పిన విధానంలో కొన్నిమాటల్ని ఊది పలుకుతున్న స్వరాల ఉదాత్త అనుదాత్త ఫణితీ మరెవ్వరికీ ఆ ప్రశ్నని కొనసాగించే అవకాశమివ్వలేదు.

భట్టోజీ రుసరుసలాడుతూ శాలువా సవరించుకుంటూ లేచాడు. ఆయన శిష్యగణమంతా కూడా లేచారు.

సభ ముగిసిందనే ప్రకటనా వచ్చింది. ప్రాంగణంలో ఎవరి అభిప్రాయం వారిదిగా, ఎవరికి వారు మాట్లాడుకుంటూ లేచారు కొంతమంది కిచకిచలూ, పకపకలూ సాగిస్తున్నారు. పక్కపక్కగా వెనకా ముందుగా ఒకర్నొకరు తట్టుకుంటూ, రాసుకుంటూ పూసుకుంటూ తోసుకుంటూ వెళ్ళసాగారు. వారిలో కొందరినోట భట్టోజీ అతి తెలివిగా వేయించిన ప్రశ్న గురించి నిరసన వినవచ్చింది. కొందరేమో ఏ వివరమూ అందని పిచ్చిమాటలు మాట్లాడుకుంటూ వికటంగా ఆత్మముగ్ధత్వంతో సాగుతున్నారు.

వేదిక మీదికి వెళ్లి ఆచార్యుల వారికి అభివాదం చేశారు శేషవీరేశ్వర జగన్నాథులు. వారి వెనుకగా నిలిచారు శిష్యులు. కవీంద్రాచార్యులవారూ, రాయముకుందుడూ జగన్నాథుని అంజలి స్వీకరించి ఆయన భుజం తట్టి ఆశీర్వాదాలు పలికారు.

ఆ తర్వాత వేదాల వారితో కొద్దిసేపు ఇష్టగోష్టి జరిపి ఇల్లు చేరుకున్నారు వీరంతా.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here