జాగిలాలు

0
10

[box type=’note’ fontsize=’16’] “ఒకానొక విధ్వంస విద్వేషపూరిత సమాజం నిండిన మహానగరం. ఒక పక్క అంతులేని సంపద, మరొక పక్క అంతంలేని దారిద్య్రం” అంటూ సమాజంలో వస్తున్న మార్పులకు సైన్స్ ఫిక్షన్ జోడించి మధు చిత్తర్వు వ్రాసిన కథ “జాగిలాలు“. [/box]

[dropcap]”త[/dropcap]ప్పదా….?” అడిగాడు విప్లవ్.

“తప్పదు” గంభీరంగా అన్నారు సిద్దయ్య గారు.

మాట్లాడుతుంటే ఆయన కళ్ళల్లో ఏదో ఎర్రటి మెరుపు. దట్టంగా పెరిగిన తెల్లటి గడ్డం, మీసం ఆయన వణికే పెదాలని దాచి ఉంచినా గొంతులో కాఠిన్యం, పట్టుదల, స్పష్టంగా ఉన్నాయి.

“మురికి నది కివతల ఇక్కడ అరుణా కాలనీలో పిల్లలు పాలు తిండీ లేక చచ్చిపోతున్నారు. పెద్దవాళ్ళయితే ఓర్చుకోగలరు. పిల్లలు ఎలా? నది కవతల కుబేరా హిల్స్‌లో అంతులేని సంపద, ఆహారం… ఎన్నాళ్లీ దోపిడీ? మీరు నలుగురు వెంటనే బయలుదేరండి!”

రంగు వెలిసిన పాత డెస్క్‌టాప్ కంప్యూటర్ దగ్గర ఉన్న పాడ్ పైన మౌస్‌తో క్లిక్ చేసాడు. రంగుల తెర మీద ముందు చుక్కలు చుక్కలు మెరిసి తరవాత గూగుల్ మ్యాప్స్ ప్రత్యక్షం అయ్యాయి.

కుబేరా కాలనీ రోడ్ నెంబర్ 2, ఆ తరవాత సుప్రియా మాల్, నక్షత్రా హోటల్… ఆ తరవాత ఉంది ఆ ఇల్లు. ఇల్లేమిటి, పెద్ద భవనం. దాని వెనక ఎతైన ప్రహరీ గోడలు కొండరాళ్ళతో కట్టినవి, వాటిని ఆనుకొని గోడౌన్‌లు… వరసగా మూడు ఉన్నాయి. ఆ ఇల్లు సేఠ్ అలోక్ దాస్‌దని నా ఉద్దేశం. ఒక దాంట్లో అంతులేని ఆహార పదార్ధాలు ఉన్నాయి. నిల్వ చేసి తరవాత ఎక్కువ ధరకి అమ్ముతారు!”

 “బ్రెడ్డూ పాల డబ్బాలా?”

“నిల్వ ఉండే డబ్బా ఆహారాలు. బ్రెడ్ కాకపోవచ్చు. ఇతర రకాల దిగుమతి అయిన కేక్స్, బిస్కట్ డబ్బాలు, ఘనీభవించి వేడి చేసుకుంటే తినగలిగే పీజ్జాలూ ఇలాంటివి.”

 “మరి కాపలా, సిసి కెమెరాలూ ఇలాంటివి ఏమీ లేవా?”

“సేఠ్ కుటుంబంతో వారం రోజుల క్రిందట అమెరికా వెళ్ళాడు. ఇంకో నెలకి కానీ రాడు. బయట కాపలా ఏమీ లేదు, కానీ ఎక్కడో సిసి కెమెరాలూ తప్పక ఉంటాయి. పోలీస్ స్టేషన్‌కి కలిపే అలారం ఉండవచ్చు. సిసి కెమెరాలు బద్దలు కొట్టి గోడౌన్ తాళాలు విరగగొట్టి లేదా పాస్‌వర్డ్ ఉంటే బ్రేక్ చేసి మీ పిక్ అప్ వ్యాన్‌లో ఆహారం వేసుకుని తిరిగి రావాలి. అదీ మీ నలుగురి పని!”

విప్లవ్, సాదిక్, అరుణిమ, నాగరాజు.

నలుగురూ హైటెక్ మనుషులే! కంప్యూటర్ విజ్ఞానం, బ్రేక్ ఇన్స్, లాకర్లు బీరువాలు తెరవడం అన్నీ అనుభవంలో తెలుసు. అందరూ అరుణా కాలనీ పరిస్థితి తెలిసిన వాళ్ళే!… కానీ…

అరుణిమ అంది, చిందర వందరగా వున్నా పొడుగాటి జుట్టూ, బొట్టు లేని నుదురూ, మాసిపోయిన బ్లూ జీన్స్,యెర్ర రంగు టీ షర్ట్… భుజాన హెచ్చరికగా కనిపిస్తున్న రైఫిల్… బహుశా కలష్నికోవ్ కావచ్చు.

“ఏమీ సెక్యూరిటీ లేకుండా అంత మాల్ సేఠ్ అలా వదిలి వెళ్ళడు దాదా!”

“అయితే మాత్రం ఏమైంది? ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర పవర్ కట్ చేయండి! సిసి కెమెరాల లెన్స్‌లు బద్దలు కొట్టండి! అప్పుడు ఏం సమస్య? ఎలెక్ట్రానిక్ తాళాలు తీయడం మాత్రం విప్లవ్ చేయగలడు. ఎలక్ట్రిక్ పవర్ మళ్ళీ జనరేటర్‌తో వచ్చే లోపల మీరు ఆహారం ప్యాకెట్లు అన్నీ ట్రక్‌లో వేసుకుని వేగంగా వచ్చేయాలి. ఒక్క అరగంట చాలు, అంతే!”

“ఆ తరవాత పోలీసులు వెంటాడటం…”

సిద్ధయ్య గారు కొద్దిగా దగ్గి అన్నారు. “అది కూడా ఆలోచించాను. ఈ రోజు ఎక్స్ కన్వెన్షన్ హాలు టెక్నాలజీ నగర్‌లో పెద్ద వివాహం జరగబోతోంది. మంత్రుల కుటుంబాలకీ సినీ తారల కుటుంబాలకీ పెద్ద ఎత్తున విందు. నగరంలోని ధనవంతులూ ప్రఖ్యాతి చెందినవారూ అంతా హాజరు అవుతారు. పోలీసు బలగం అంతా అక్కడే ఉంటుంది అని ‘లోపలి వారి’ సమాచారం. కాబట్టి ఈ రాత్రే మంచి సమయం. వెళ్ళండి! వెళ్ళాలి! ఇక్కడ పిల్లలు చనిపోతున్నారు!”

***

సమీప భవిష్యత్తులో… ఏదో ఒకానొక విధ్వంస విద్వేషపూరిత సమాజం నిండిన మహానగరం. ఒక పక్క అంతులేని సంపద, మరొక పక్క అంతంలేని దారిద్య్రం. రెండు ప్రాంతాల మధ్యా ప్రవహించే మురికి నీళ్లు నిండిన నది. ఇప్పుడు దానిలో నీరు కూడా ఎండిపోయింది. దాని వొడ్డున చెట్లు వాడి మోడులై పోయాయి. నిరంతరం అంతులేని వేడి. ఆకాశంలో ఎగిరే పిట్టలు కూడా అలిసి ఎగరలేక కాలి కింద పడిపోతున్నాయి.

కరువు… భవిష్యత్ విధ్వంసక సమాజంలో ధనికులు, పేదవాళ్ళు మాత్రమే మిగిలారు.

మధ్య తరగతి అదృశ్యం అయింది. రెండు వర్గాలకీ అంతరం పెరిగి పోయింది.

వాతావరణ కాలుష్యం, భూమి అంతా ఉష్ణోగ్రత పెరగడం (గ్లోబల్ వార్మింగ్) వల్ల ఆహార ఉత్పత్తులు పడిపోయాయి.

కానీ టెక్నాలజీ పురోగతి వల్ల కుబేరా హిల్స్ ఇంకా ఇతర నగర ఆవాసాలు మాత్రం కళ కళలాడిపోతున్నాయి.

…మాల్స్, హోటల్స్… బటన్ నొక్కితే డ్రోన్స్‌తో ఇంటికే పిజ్జాల సరఫరా. ఆటోమాటిక్‌గా డ్రైవర్ లేకుండా నడిచే కార్లు. ఇది కాక ఇళ్ళకి అంతులేని భద్రత. నిత్య కళ్యాణం పచ్చ తోరణం కాకపోయినా, హరితం లేక పోయినా రోజూ మద్యం, సంగీతం, నృత్యంతో విందులూ ఉత్సాహాలకీ అంతులేని సమావేశ మందిరాలు మాత్రం రద్దీ గానే ఉంటాయి.

ఎక్కడి నుంచి ఎక్కడికో సమాచారం ఇచ్చిపుచ్చుకునే వ్యాపారాలు, ఇక్కడ వ్యవసాయం క్షీణించిపోయినా ఎండిపోయిన బీడు భూములయినా కుబేరా హిల్స్‌కి మాత్రం అంతులేని ఆహారం దిగుమతి చేసుకునే సంపద ఉంది. అది బిట్ కాయినో, లేక అంతర్జాతీయ ఎలెక్ట్రానిక్ ద్రవ్యమో ఏదయినా సరే అది అంతులేని సంపదే!

… వారికి సమస్యే లేదు!

మురికి నది కివతల… కరువు! క్షామం… దొరకని ఆహారం, నీరూ.

తిరగబడితే తరిమే సైన్యం లాంటి సెక్యూరిటీ పోలీస్!

ఆకాశాన్నంటే ధరలు!

ఎన్ని ఇళ్లల్లో వెట్టి చాకిరీ చేస్తే వారం రోజుల తిండి దొరుకుతుంది!

కుబేరా హిల్స్‌లో జనం వినోదాల్లో మునిగి తేలుతుంటే, వారికి నది ఇవతల వాళ్ళు చాకిరీ చేస్తుంటారు!

వికృత భవిష్యత్తులో మహానగరంలో జరుగుతున్నదిదే!

సిద్ధయ్య గారు హూంకరించారు.

“వెళ్ళండి! మీరు యోధులు!

 బుద్ధి బలం ఉపయోగించండి!

…ఆహారం కోసం… పిల్లల ప్రాణాల కోసం!”

 ***

 పాత కారు. దాని వెనకాల ఒక ట్రైలర్.

 కానీ బాగా పరుగెడుతుంది

 సామాను కోసం దానికి ట్రైలర్ బిగించారు.

 ముందు సీట్లో అరుణిమ

 వెనక విప్లవ్,నాగరాజు.

 డ్రైవింగ్ సీట్లో సాదిక్.

 కారు మురికి నది మీది బ్రిడ్జి దాటి కొత్త నగరంలోకి ప్రవేశించింది.

 చెక్ పోస్ట్! సెక్యూరిటీ పోలీస్!

 వాసన చూసి ఆర్.డీ.ఎక్స్ బాంబులని కనిపెట్టే పోలీస్ కుక్కలు!

 “ఐడీలు ఇవ్వండి! ఎందుకు? ఎక్కడికి ఇంత రాత్రి వెళ్తున్నారు?” అడిగాడు డ్యూటీలో ఉన్న ఒకే ఒక్క ముసలి రక్షక భటుడు.

“ఆమె భర్త కి సీరియస్‌గా ఉంది.”

అరుణిమనీ మూలుగుతున్న విప్లవ్‌ని చూపించి చెప్పాడు సాదిక్ “గుండె నొప్పి”

విప్లవ్ గుండె పట్టుకుని అబ్బా అని మూలుగుతున్నాడు.

“ధన్వంతరి హాస్పిటల్ ఎమర్జెన్సీకి తీసుకుని వెళుతున్నాం.”

రబ్బర్ మ్యాట్ కింద కలష్నికోవ్ కాలికి తగులుతోంది.

 “ఓకే “అన్నాడు సెక్యూరిటీ పోలీస్.

కొంచెం అనుమానం వచ్చినా ఎమర్జెన్సీ కదా అని సరిపెట్టుకున్నాడు.

“బీద జనానికి కూడా ధన్వంతరికి పోయేటంత పైసలుంటాయా? ఏమోలే ఈ రోజుల్లో!” అందుకనే మెటల్ డిటెక్టర్ తీయలేదు. అఫ్ కోర్స్, అదే అతని ప్రాణాన్నికాపాడింది.

ఇన్నోవా కారు పిక్ అప్ ట్రైలర్‌తో సహా చెక్ పోస్ట్ దాటి దాదాపు నిర్మానుష్యంగా ఉన్న కొత్త నగరపు రోడ్ల మీద పరుగెత్త సాగింది.

***

“చూసి రా!” అన్నాడు విప్లవ్: “ఏదో సెక్యూరిటీ ఉండక పోదు.”

నాగరాజు కారు దిగి అటూ ఇటూ చూసి వచ్చాడు. ఎల్రక్ట్రిక్ స్థంభాలకి రెండు కెమెరాలు చిన్నవి తగిలించి ఉన్నాయి. గార్డులు ఎవరూ లేరు. గేట్‌కి ఎలెక్ట్రిక్ అలారం ఉండచ్చు. ఎందుకనో ఇల్లు అంతా మాత్రం చీకటి గానే ఉంది. ఎవరూ లేరు.

రెండు రాళ్లు చేతి కందించాడు విప్లవ్. “ముందు కెమెరాలు పగల గొట్టు! కెమెరాలు పోయినాక నేను ట్రాన్స్‌ఫార్మర్ పేలుస్తాను. కరెంట్ పోయినాక గేట్ తీద్దాం.. మాకు నువ్వు సిగ్నల్ ఇవ్వగానే మేము వస్తాం. సాదిక్! నువ్వు డ్రైవింగ్ సీట్లోనే ఉండు! నేనూ అరుణిమ వచ్ఛేదాకా ఇంజిన్ ఆన్‌లోనే ఉంచు! ఒక వేళ అలారం మోగితే పోలీస్ పెట్రోల్ వచ్చే లోపల మనం పారిపోవాలి ‘మాల్’ తో!”

…ఒక ధన్ మనే శబ్దం. ఠప్ మనే వెలుతురుతో కుబేరా హిల్స్ ట్రాన్స్‌ఫార్మర్ పేలింది. నల్లటి తారు రోడ్డు మీద నీడలు పొడుగ్గా అంతా చీకటి నిండి ఎక్కడిదో చారలుగా వెలుగు. అద్దం పగిలిన మెత్తని చప్పుడు. కారు తలుపు తీసి వచ్చి అరుణిమ విప్లవ్ గేట్ దగ్గరకి వచ్చి దాని పైకి పాకసాగారు. ఇద్దరు యెర్రని మాస్కులతో ముఖాలు కవర్ చేసుకున్నారు. ఎవరికీ కనబడరు.

గేటు దూకి కాంపౌండ్‌లో చిరుత పులుల్లా మెత్తని అడుగులతో…

“ఆ వెనకే గోడౌన్స్! పద!” అంది అరుణిమ.

ఏ అలారం మోగలేదు.

నాగరాజు సైగ చేసాడు.

“గోడౌన్ షట్టర్ నంబర్ త్రీ చూడు. అక్కడ ఎలెక్ట్రానిక్ లాక్ ఉందా లేక మామూలు తాళం కప్పనా?”

నాగరాజు మౌనంగా కదిలాడు. అక్కడికి వెళ్లి థమ్స్ అప్ అన్నట్లు బొటన వేళ్ళు రెండూ పైకి ఎత్తి చూపాడు. ఆశ్చర్యంగా ఉంది! అమ్మయ్య! మామూలు తాళాలే!

విప్లవ్ అన్నాడు “నేను తాళం ఓపెన్ చేస్తాను. షట్టర్ తీయగానే నువ్వు లోపలికి పోయి బాక్సులు ఒకటొకటే మోసుకుపోయి నాగరాజ్‌కి ఇవ్వు! కనీసం పది కావాలి. ఆ తర్వాత నేను వచ్చేస్తాను. మళ్ళీ గేట్ దూకాలి https://indegenerique.be/acheter-viagra-generique-belgique/. బాక్సులు ఒక్కటొక్కటే అవతల పడేసి కారు ట్రైలర్‌లో సర్దాలి. డ్రైవర్ ఒక్కడే వాటిని తీసుకుని వెళ్ళిపోతాడు. మనం వేరు వేరు దారుల్లో నడిచి పాత బ్రిడ్జి మీదుగా మన కాలనీకి వెళ్ళిపోతాం. ఓకే?”

“ఓకే!” తల ఊపారు అరుణిమ నాగరాజ్.

చిన్న పిన్‌తో తాళం కెలికాడు.తేలిక గానే ఓపెన్ అయింది.

అరుణిమ లోపలి దూసుకుపోయింది. సెల్ ఫోన్ టార్చ్ వెలుగులో బాక్సులు.

దిగుమతి అయిన హాలండ్ మిల్క్ డబ్బాలు, అమెరికన్ బ్రెడ్, ఫ్రోజెన్ ఫుడ్ డబ్బాలు, బిస్కట్ టిన్స్! ఒక్కొక్క బాక్స్ తీసుకుని బయటికి రావడం నాగరాజుకు అందివ్వడం. అతను రెండేసి బాక్సులు గేటు దాకా తీసుకు వెళ్లడం బయట వ్యాన్‌లో పెట్టడం.

ఆఖరి బాక్స్ తీసింది.

‘ఠప్!’మన్న చప్పుడుతో ఒక పెద్ద తుపాకీ పేలింది. బాక్స్ వెనక ఉందేమో! అరుణిమ తల వంచింది. బులెట్ లాంటి షాట్ ఏదో బాక్స్ వెనక నుంచి వచ్చింది. వెనక గోడ లోంచి గుర గురా చప్పుడు. లోహపు ముక్కలు రాపిడి అవుతున్న ధ్వని. మిణుగురు పురుగుల్లా నిప్పురవ్వలు గాలిలో.

నాలుగు కాళ్ళు, యెర్రని వెలిగే కళ్ళు, కోరలు. మూడడుగుల ఎత్తు. వంటి మీద గోధుమ ఎరుపు రంగు కల్సిన బొచ్చుతో ఒక్కసారి మీదకి దూకింది కుక్క! కుక్క కాదు భయంకర జాగిలం. ఆల్సేషియనా? బుల్ డాగా? అది మొరుగుతోంది…. కానీ యాంత్రిక స్వరంతో… వికృతంగా… భౌ…! భౌ…! గుర్! గుర్…

విప్లవ్ అరిచాడు “అరుణిమా పారిపో!అది యంత్రపు జాగిలం. రోబో డాగ్! “

జాగిలం క్షణంలో పంజా విసిరింది. ఆమె చేతి మీద గాట్లు! రక్తం!

అరుణిమ నిశ్చేష్టురాలై ఒక క్షణం తరవాత వెనుదిరిగి పరుగెత్త సాగింది.

విప్లవ్ ఫోన్ తీసి నొక్కి, “సాదిక్! పారిపో! వ్యాన్‌తో! మేం ఇక్కడే ఉంటాం”అని అరిచాడు.

ఎక్కడో ఒక అలారం గుడ్లగూబలా మూలుగుతూ మోగసాగింది

జాగిలం మొరగడమే కాకుండా వారి మీద ముందు కాళ్ళతో దాడి చేయసాగింది.

విప్లవ్‌ని కరవనే కరిచింది. ఇప్పుడు బయటకు పరిగెత్తాడు.

“నాగరాజ్! ఇదే సెక్యూరిటీ! ఉండనే ఉంది! ఇది రోబో డాగ్! పారిపో!”

ముగ్గురూ వేగంగా పరిగెత్తసాగారు. గేట్ ఎక్కి దూకి నీడల్లో కలిసిపోయారు.

***

చీకట్లో కూడా ఇన్‌ఫ్రా రెడ్ కెమెరాతో చూస్తాయి యంత్రపు కళ్ళు! మొత్తం రోడ్డంతా స్కానింగ్ చేశాయి.

యంత్రపు జాగిలం మెదడులో దూరంగా మూడు మెరిసే చుక్కలు పరుగెడుతున్నాయి.

అది వాటిని ముందు రెండు వెనక రెండు కాళ్ళతో గెంతుతూ భయంకరమైన వేగంతో వెంటాడసాగింది. అది గంటకి 90 కిలోమీటర్లు వేగం సాధించగలదు. దానికి వాళ్ళ వేగం, ఉనికి తేలికగా తెలిసిపోతోంది.

అరుణిమ గన్ తీసి గురి చూసి ఒక జాగిలాన్ని షూట్ చేసింది. నిప్పురవ్వలు తెల్లటి పొగ. వాటిలోంచి దూసుకుని మళ్ళీ జాగిలం పరుగెడుతోంది. బుల్లెట్లకి లొంగని యంత్రాలు!

దూరాన కుబేరా హిల్స్ పోలీస్ స్టేషన్ లో అలారం మోగసాగింది..

***

విప్లవ్ కాలు జారి ఒక గుంటలో పడ్డాడు. చుట్టూ చెత్త కుప్పలు. గ్యార్బేజ్ పోసిన గుట్టలు. ఇక్కడ దాకుంటే తప్పించుకోవచ్చు.

….దూరాన గుర గుర ధ్వని.

జాగిలం ఇటే వస్తోంది. కొంచెం పక్కన మరొక చెత్త కుప్పలో అరుణిమ ఏడుస్తూ “నో…నో…” అంటోంది.

జాగిలం ఆమె మీద విరుచుకు పడి యంత్రపు కోరలతో ఆమె మెడలోని కండరాలని గుచ్చేస్తోంది.

విప్లవ్‌కి అర్థం అయింది. జాగిలం పంజా విసిరినప్పుడు తమ చేతుల్లో మైక్రోసెన్సార్లు గుచ్చబడ్డాయి. అవి పొజిషన్ సెన్సార్లు. వాటి వల్ల దానికి తాము ఎక్కడున్నా తెలిసి పోతోంది. వెంటాడుతోంది.

అరుణిమ గావుకేక పెట్టి ఒక్క క్షణంలో నిశ్శబ్దం అయిపొయింది.

“రన్! రన్!” ప్రాణం కోసం. నాగరాజ్ పక్క రోడ్డు లోంచి అరిచాడు “ఏమైంది?”

మరు క్షణం కెవ్వున అరిచాడు. జాగిలం పంజాలు అతని చేతిలో…

విప్లవ్ అరిచాడు.”నాగరాజ్! అది రోబో డాగ్! నీ చేతిలో సెన్సార్ గుచ్చింది. పరుగెత్తు! నీ దగ్గర చాకు వుంటే కత్తితో కోసి సెన్సార్‌ని తీసెయ్యి!”

మరు క్షణం గుర గుర ధ్వని. అది తన వైపే వస్తోంది.

కాలనీలో కొన్ని చెట్లున్నాయి ఇంకా వాటి పక్కన టార్పాలిన్ కప్పిన లారీలు ఆగిఉన్నాయి. విప్లవ్ చెట్ల మీదగా పాకుకుంటూ ఎక్కి లారీ మీద టార్పాలిన్ కప్పిన సామానులు పైన ఎక్కి కూర్చున్నాడు.

జాగిలం గెంతుకుంటూ రానే వచ్చింది. గుర గుర మంటూ లారీ ఎక్కడానికి ట్రై చేస్తోంది. జారిపోతోంది. కీ చైన్‌లో స్విస్ నైఫ్ తీసాడు. జాగిలం గాటు పడ్డ చోట పెద్ద గాయం చేశాయి. చాకుతో గాయం కెలికాడు. అమ్మా అన్నాడు అప్రయత్నం గానే అరుస్తూ బాధకి. చిన్న గుండ్రటి లోహపు గింజ… గ్లోబల్ పొజిషనింగ్ బయో సెన్సార్! రక్తసిక్తమైన దాన్ని తీసి దూరంగా విసిరేశాడు.

రక్తం కారి పోతోంది. చొక్కా తీసి చించి గాయం మీద గట్టిగా కట్టుకున్నాడు.

జాగిలం మొరగడం మానేసి సెన్సార్ విసిరేసిన వేపు పరుగెత్తింది.

లారీ పైన నీడల్లో కాసేపు చేయి గట్టిగా నొక్కిపట్టుకుని కూర్చున్నాడు కదలకుండా.

సైరన్లు మోగించుకుంటూ పోలీస్ వ్యాన్‌లు వెళ్లిపోతున్నాయి.

***

సాదిక్ ఎండిపోయిన నది ఇసుక నేల మీదికి కారుని దూకించాడు.

అది కొద్దీ సేపు ప్రయాణించి తర్వాత బురదలో కూరుకు పోయింది. కదలడం లేదు.

ఫోన్ తీసి “సిద్ధయ్య మాస్టర్! వాళ్ళందరూ రోబో డాగ్స్‌కు చిక్కుకు పోయారు. నేను మురికినదిలో పాత బ్రిడ్జికి కిలోమీటర్ దూరంలో వున్నా. జీ.పీ.ఆర్.ఎస్.లో చూడండి నన్ను. ఎవరినైనా పంపండి. ప్యాకెట్లు తీసుకెళ్తారు. నేను పారిపోతున్నాను” అని చెప్పాడు.

 ***

సిద్దయ్య గారు ఫోన్ తీశారు. కాసేపటిలో నలుగురు యువకులు వచ్చారు.

వాళ్లకి చెప్పారు.”కారుంది!పాత బ్రిడ్జి దగ్గర. త్వరగా వెళ్లి సరుకు తీసుకు రండి!”

***

సాదిక్ చీకట్లలో నడుచుకుంటూ నదీగర్భంలో కలసి పోయాడు.

అరుణిమ కొనఊపిరితో చెత్త కుప్పల మధ్య పడుకుని ఆలోచిస్తోంది. “ఇప్పుడు పోలీసులు పట్టుకుంటే అంతా అభాసై పోతుంది.”

విప్లవ్ అనుమానం రాకుండా గాయాన్ని అంగీ గుడ్డతో నొక్కి పట్టుకుని మెల్లిగా రోడ్డు మీద నడుస్తున్నాడు.

నాగరాజ్ చీకట్లలో పరుగెడుతున్నాడు.

దూరాన సెన్సార్ విసిరి వేయబడ్డ ప్రాంతంలో రోబో జాగిలం మోర ఎత్తి మొరుగుతోంది.

వున్నట్లుండి అరుణిమ మూలుగు ఆపి చెవులు రిక్కింది విన సాగింది.

మొరుగు… ఒకటి కాదు చాలా జాగిలాలు అరుస్తున్నట్లు గుర్‌మనే ధ్వని. విప్లవ్ ఆగిపోయాడు.

నేల మీద యంత్రం పరుగెత్తినట్లు చప్పుడు. రెండు జాగిలాలు యెర్రని కళ్ళతో పరుగెత్తుకుని వస్తున్నాయి.

నాగరాజు ఒక్కడే చీకట్లలో పరుగెత్తుతున్నాడు.

ఒక భయంకరమైన క్షణంలో విప్లవ్‌కి అర్థం అయింది.

శరీరం అంతా చిన్న చిన్న గాయాలై నెత్తుటి తుప్పరలు రాసాగాయి.

ఒకటి కాదు వేల లోహపు ముక్కలు వొళ్ళంతా.!

ఆ బులెట్ పేలినప్పుడు కొన్ని వేల బయో సెన్సార్లు చిన్న చిన్న అణువులుగా తమ శరీరాల్లో గుచ్చుకుపోయి ఉంటాయి..

ఒకటి తీసినా లాభం లేదు. మిగిలినవి ఉన్నాయి.

జాగిలాల నుంచి తప్పించుకునే మార్గం లేనే లేదు.!

…అతను పరుగెత్త సాగాడు.

…నాగరాజు కూడా పరుగెత్తుతున్నాడు,

వాటి లోపల అమర్చిన బాటరీ శక్తి సాయంతో అంతులేని వేగంతో యాంత్రిక జాగిలాలు వారి వెనక పరుగెడుతున్నాయి.

వాటి యంత్రపు కళ్ళకి చిమ్మ చీకట్లో కూడా పరుగెత్తే మనుషులు ఎర్రటి చుక్కలలా కనిపిస్తున్నారు.

వాటి కాళ్ళలోనూ నోటి లోనూ పదునైన కోరలున్నాయి. వాటిలో ప్రాణాలు తీసే విషాలు ఉండచ్చు!

….దూరం దగ్గరవుతోంది.

ఒకానొక విధ్వంస విద్వేషపూరిత భవిష్యత్తులో ఒక రాత్రి చీకటి దట్టంగా అలుముకుంది.

00000

Inspiration from a news item

SpotMini robots, first unveiled by Boston Dynamics in June 2016, could become commonplace following CEO Marc Raibert’s announcement Friday at a conference that his company will begin selling the robots to businesses next year. They might appear outside construction zones — surveying the sites and collecting building data — or outside offices, where they could use their cameras to provide security. They could also be used to get into hard-to-reach spaces, such as the stairwells of skyscrapers, where they could check for explosives or “bad things” that shouldn’t be there, Raibert said.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here