జాగృతి

0
9

[box type=’note’ fontsize=’16’] ఎంవిఆర్ ఫౌండేషన్ 2019 ఉగాది సందర్భంగా నిర్వహించిన డా. పాలకోడేటి అప్పారావు స్మారక కథానికల పోటీలో ‘ప్రచురణార్హమైన కథల’ని న్యాయనిర్ణేతలు ఎంపిక జేసిన కథ. రచన మంజులా శ్రీనివాస్. [/box]

[dropcap]”న[/dropcap]గరంలోని ప్రముఖ షాపింగ్ మాల్‌లో బాంబ్ బ్లాస్ట్! భారీ యెత్తున ప్రాణనష్టం!! క్షతగాత్రులను గాంధీ హాస్పిటల్‌కి తరలింపు! మృతుల సంఖ్యపై స్పష్టత రావలసివుంది!

హుటాహుటిన వైద్య-పోలీసు బృందాలు ఘటనాస్థలికి చేరుకుంటున్నాయి! మృతులలో ఎక్కువగా చిన్నారులున్నట్లు సమాచారం !!

ఘటనాస్థలంలోని తాజా పరిస్థితులను మీడియా బృందంవారు ఎప్పటికప్పుడు తమతమ ఛానళ్ళలో ప్రసారం చేస్తున్నారు!!”

***

అక్కడ…

అందరి రోదనలూ, వేదనలతో మార్మోగిపోతోంది ఆ ప్రాంతమంతా!

“అయ్యో…. అయ్యో…. భగవంతుడా – అప్పుడే నా బిడ్డను తీసుకుపోయావా? మేమేం పాపం చేశాం తండ్రీ!”

“వామ్మోఁ …. నా మనవడు రాత్రే బర్త్ డే పార్టీ జరుపుకున్నవాడు ఏమైపోయాడు?”

మతిస్తిమితం తప్పిపోతున్న ఆక్రందనలు!

“డాక్టరుగారూ- డాక్టరుగారూ…. నా కూతుర్ని బతికించయ్యా, నీ కాళ్లట్టుకుంటాను! అమ్మా నర్సమ్మా – అవసరమైన మందేదైనా ఉంటే వెంటనే చెప్పమ్మా… అది లేకపోతే నా తాళి అమ్ముకొనైనా సరే… కొనుక్కొత్తాను!” ఓ తల్లి భయాందోళనల ఘోష !

స్టెచర్ల మీద క్షతగాత్రుల తరలింపులు ! కొద్ది సేపటికే కొంతమంది ప్రాణాలు నిర్జీవమై మృతజీవులుగా తిరుగుప్రయాణం !

ఆస్పత్రి సిబ్బంది ఉరుకులూ పరుగులూ.., డాక్టర్ల, నర్సుల కేకలతో అక్కడంతా దాదాపు బీభత్సంగా మారిపోయింది.

అలా వరుసగా మూడు రోజులు గడచిపోయాయి !

***

నాలుగో రోజు వాతావరణం మెల్లగా సద్దుమణిగింది….

అర్జంటు కేసుల వార్డు విభాగంలో వరుసగా అమర్చిన బెడ్ పై పేషంట్లు కొనవూపిరి స్థాయి నుంచి విముక్తులై పూర్తిగా ఊపిరి పీల్చుకుంటూ తేలిగ్గా కూర్చొనివున్నారు.

పదమూడో బెడ్ దగ్గర- సుమారు నలభై, నలభైయ్యయిదేళ్ల వయసున్న వ్యక్తి మోకాళ్ల చుట్టూ చేతులు చుట్టుకొని వాటి మధ్యలో గడ్డం ఆన్చి పరధ్యాసలో లీనమైవున్నాడు.

“హలో… హలో… మిస్టర్ విశ్వా!”

ఎవరో పిలిస్తే నెమ్మదిగా తలెత్తాడు. ఒక యువతీ, యువకుడు చేతిలో పెన్నూ, ప్యాడుతో నిలబడివున్నారు. వాళ్ళవంక ప్రశ్నార్థకంగా చూశాడు విశ్వ.

“జర్నలిస్టులం!” పరిచయం చేసుకున్నారు వాళ్ళు. ఆసక్తి కనబరచలేదతను. తనని కాదన్నట్లుగా ఎటో చూడసాగాడు.

“చూడండి… మీ కేస్ షీట్ చూశాము. సీనియర్ ఇంజనీర్ అని తెలిసింది. దయచేసి మేమడిగే నాలుగైదు ప్రశ్నలకి జవాబిస్తే చాలు- ఎక్కువసేపు మేముండం, అంతకంటే ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టం!” అన్నాడు యువకుడు.

“ఊఁ….” లోస్వరంలో బదులిచ్చాడు విశ్వ.

“ఆరోజు ఏం జరిగింది? ఘటనాస్థలానికి మీరెందుకెళ్లారు?”

“షాపింగ్‌కి!” అన్నాడు శూన్యంలోకి చూస్తూనే.

“ఎవరెవరు వెళ్లారు?”

“నేనూ, నా భార్యా, ఇద్దరు పిల్లలు!”

“పిల్లలెవరూ? ఇద్దరూ పాపలేనా? బాబులా?”

“కాదు… ఒక పాప, ఒక బాబు!”

“ఓ…..” అంటూ ఒకరిముఖాలొకరు చూసుకున్నారు సానుభూతిగా.

“అక్కడేం జరిగింది?”

“నా పిల్లలిద్దరినీ బూడిదగా చూశాను!” గొంతు గద్గదమైంది.

“మరి మీ భార్య?”

“తను కూడా…”

“ఇప్పుడు మీకెలా ఉంది?”

“చనిపోయిన వారి పరిస్థితి కంటే ఘోరంగా ఉంది…” గొంతులో వేదనకి చెందిన జీర.

అర్థం కాలేదు వాళ్ళిద్దరికీ. వార్డ్ బాయ్‌ని పిలిచి రెండు కుర్చీలు తెప్పించుకొని కూర్చున్నారు. విశ్వ చెప్పేవన్నీ గబగబా నోట్సులో రాసుకుంటున్నారిద్దరూ..

“అంటే ఏ విధంగా?” మళ్లీ అడిగారు.

“చనిపోయిన వాళ్ళయితే హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. బ్రతికున్నవాళ్ళకి ఆ అవకాశం లేదుగా! నేను నా అందమైన కుటుంబాన్ని కోల్పోయాను!” అతని కళ్ళు ఊరుతున్నాయి.

“కూల్ డౌన్ ప్లీజ్! మీ మానసిక పరిస్థితి గురించి చెప్పండి కాస్త!” అతన్ని శాంతపరుస్తున్నారు వాళ్ళు. అతను మంచినీళ్లు తాగి ఓ కన్ను మూసుకున్నాడు…

“నేను చెప్పలేను… చెప్పకుండా చచ్చిపోలేను. నేనది మర్చిపోవాలి… దయచేసి నన్ను నిద్రపోనివ్వండి! మర్చిపోవాలీ…” పలవరింతలోకి మారిపోయాడు ఉన్నఫళంగా.

“అలా అనకండి… అసలక్కడ ఆ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పండి!” కొద్దిగా గాబరా పడ్డారు వాళ్ళు.

“అమాయకుల ప్రాణాల్ని అర్ధాంతరంగా హరించడానికి అంతర్ధానంగా జరిగిన మారణహోమం అది! ఎవరు చేశారో తెలీదు, ఎందుకు చేశారో తెలీదు… అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటున్న దుర్మార్గపు చర్య… ఈ ఘాతుకం!”

“వాళ్ళు ఉగ్రవాదులేనా?”

“ఎవరైతేనేం… అభంశుభం తెలియని ఎందరో అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నారు. క్షుద్రుల చర్యలకి ఇంతకన్నా గట్టి సాక్ష్యం ఇంకేముంటుంది?” సూటిగా చెప్పలేకపోతున్నాడతడు.

చిత్రంగా చూశారిద్దరూ- “ఆ ఘటనపై మీరెలా ఫీలవుతున్నారు?”

“దేని గురించి?”

“యాక్సిడెంటల్‌గా జరిగిన ఈ విషాదం గురించి! మీరు కోల్పోయిన మీవాళ్ళ గురించి!” అతని కళ్ళముందు భార్యాబిడ్డల రూపాలు మెదిలాయి

“వారితో మొన్నటిదాకా అందమైన జీవితం గడిపాను. ఇప్పుడు వాళ్ళులేని జీవితం నరకంగా ఉంది! నా భార్య అప్పుడప్పుడూ ఆకాశం గురించీ, ప్రేమ గురించీ మధురమైన స్వరంతో పాటలు పాడేది. మరికొన్నిసార్లు ప్రపంచ విషయాల గురించీ, నదులూ- పొలాలూ- అడవులూ- గుళ్ళూచరిత్రలూ – సినిమాల గురించీ ఎన్నో చెప్పేది. నేనూ, నా పిల్లలూ అవి వింటూ నిద్రపోయేవాళ్ళం!”

అతనికి జరిగిన విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి….

***

“ఒరే నానీ, చిన్నీ… రండర్రా! ఇవాళ మీకో కొత్త కథ చెప్తాను!” కేకేసి పిలిచింది మధులత. ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి తల్లి ముందర నిల్చున్నారు. చటుక్కున ఇద్దర్నీ చెరోప్రక్క చెవులు పట్టుకొని బాత్రూమ్ లోకి లాక్కుపోయిందామె. స్నానం అంటే ఇద్దరికీ అయిష్టం! రోజూ ఏదో వొకటి ఆశపెట్టి తీస్కెళ్లి స్నానాలు చేయిస్తుంది.

***

మధు అద్భుతమైన భార్య! తన దగ్గరుంటే ఎంత కష్టమైనా సంతోషంగానే అనిపిస్తుంది. ఇలాంటి భార్యల్ని ఆ సంఘటన ద్వారా ఎంతమంది పోగొట్టుకున్నారో?!

విశ్వ మాటల్లో ధ్వనిస్తున్న ఆర్తిని అబ్బురంగా వింటున్నారు ఆ జర్నలిస్టులు.

“నేను ఏదైనా పని చేయదల్చుకుంటే ముందుగా తనకి చెప్పి చీవాట్లు తిన్నాకగానీ చేయను. అది నా అలవాటు! ఎందుకంటే ఆ చీవాట్లే నన్ను తప్పొప్పుల క్రమాన్ని గుర్తుచేస్తూ నడిపిస్తాయి. ఆ పెద్దరికమే నా వెన్ను తట్టినట్లుగా అనిపిస్తూ ఉంటుంది!”

అప్రయత్నంగా జర్నలిస్టు కళ్ళు చెమర్చాయి అది విని.

“నా కుటుంబంతో నేను సాగించే జీవితాన్ని అంతం చేయాలన్న విపరీత బుద్ది పుట్టిందెవరికో? చైతన్యం పొక్కిన మనిషి మనిషినే రక్కాలా? రాబోయే కాలం మంచివాళ్ళు కాని మనుషులతో నిండబోతోందని అర్థమౌతోంది. ఇక చెప్పుకోవడానికి చరిత్రలుండవ్… అంతా చరిత్రహీనమే!”

“బంధాలపై మమకారం అంత ముఖ్యమైనదంటారా?” అడిగాడు ఆ యువకుడు. విశ్వ వెంటనే మాట్లాడలేదు. రెండు నిమిషాల తర్వాత నుదుటి పై వేలితో రుద్దుకున్నాడు – “ఓ పసిబిడ్డను ‘రాత్రిపూట బయటకు వెళ్లవద్దు… ప్రమాదం!’ అని చెబితే… ఆ మాటలోనే దాగున్న భద్రతాభావనకి అసలు ఎవరూ కదలరు. దానికోసం ప్రతి హృదయం ఎదురుచూడదా? ఏ మనిషీ మరొకరి తోడు లేకుండా ఉండలేడుగా!” అన్నాడు.

ఇద్దరూ జవాబివ్వలేదు.

***

“నాన్నా- నాన్నా… ఈ రోజు మా స్కూలుకి సెలవు కదా… మమ్మల్నీరోజు షాపింగ్ కి తీసుకెళ్లాల్సిందే! లేదంటే మేం అన్నం తినం!” మొండిగా వాదిస్తున్నారు పిల్లలిద్దరూ.

మధులత వైపు చూశాడు విశ్వ సందేహంగా – ఏం చేద్దాం?” అన్నట్లుగా.

“ఈరోజు వద్దులేమ్మా! మంచి పిక్చర్‌కి వెళదాం, షాపింగ్‌కి ఎల్లుండి వెళదాం!” అందామె ఇద్దర్నీ దగ్గరికి తీసుకొని ప్రేమగా తలలు నిమురుతూ..

“ఉహు…. ఈరోజే వెళ్లాలి! ఎందుకుంటే నా క్లాస్‌మేట్ జగన్ వాళ్ళ మమ్మీడాడీతో అదే షాప్‌కి వస్తున్నాడట… నాతో బెట్ కట్టాడు – ‘నువ్వూ రా… చూద్దాం!’ అని! మరి నేను గెలవొద్దా? వాడే గెలవాలా?” అన్నాడు కొడుకు మొండిగా..

“వార్నీ… ఇదొకటుందా? చిన్నవాళ్ళు- ఈ వయసులో మీకు బెట్లేమిట్రా వెధవా?!” సున్నితంగా మందలించింది మధులత.

“వెళ్లాల్సిందే! నేను రాకపోతే క్లాసులో నన్ను వాడు అందరిముందూ కామెంట్ చేసి ఎగతాళి చేయిస్తాడు. నేను స్కూలు మానేస్తాను!” ఏడ్పు మొదలెట్టబోయాడు వాడు.

నొసలు చిట్లించిందామె. భర్తవైపు చూసింది – ‘వెళ్లామా?’ అన్నట్లుగా, తలూపాడు తను ‘నీ ఇష్టం!’ అన్నట్లుగా. సంతోషంగా పిల్లల వంక చూస్తూ అంది – “సరేనర్రా… మీ ఇష్టం, నానీ- గెలుపు నీదే!”

“హ్హయ్య్….” అంటూ సంతోషం పట్టలేక గంతులు వేయసాగారిద్దరూ

మధులత విశ్వతో అంది- “వీడికింత చిన్నవయసులోనే అవమానమెందుకు తోటివాళ్ళతో? ఈ వయసులో తమ కోరిక తీరకపోతే అస్తమానం ఏడుస్తారు. వాళ్ళ ఏడుపొక్కటే ఆయుధం! అదే ఇష్టం… అదే పరిష్కారం కదా! అందుకే తీస్కెళదాం!”

తేలిగ్గా నిట్టూర్చాడతను – “పిల్లల సతాయింపు తల్లులు భరిస్తారేమోగానీ… తండ్రులు భరించలేరు. వాళ్ళిష్టం… నీయిష్టం! మీ ఇష్టాలన్నీ నా నెత్తికో కష్టం!” అన్నాడు.

“ఊఁ…. తప్పుతుందా మరి! రెడీ కండి!” అంది. గంట తర్వాత బయల్దేరారంతా.

***

“ఇప్పుడేం ఆలోచిస్తున్నారు?

“నోరెండిపోతే నీళ్లు తాగితే దాహం తీరుతుంది. ఇప్పుడు హృదయమే ఎండిపోయింది. ఈ దాహం తీరేది కాదు…” ఎటో చూస్తూ పొడిగా అన్నాడు విశ్వ..

“మరేం చేయాలనుకుంటున్నారు?”

“సెలవెరుగని జీవితాలు… ప్రతీక్షణం వ్యాపారంలో భాగమే! మనుషులు నిజంగా ఎంత గొప్పవాళ్ళో? ఒకరి జీవితాన్ని సమూలంగా నష్టపరచడానికి సిద్ధంగా ఉంటారు!” నిరసనగా అన్నాడు.

“ఉగ్రవాదుల ఉద్రేకమండీ అది! దాన్ని మార్చడానికి మీలాంటి మేధావులు ప్రయత్నించలేరా?”

“అలాంటి మాటలు చెప్పకూడదు!” అతని మాటల్లో అమాంతం చురుకూ, గరుకూ వచ్చేశాయి.

“స్పృహలేని ఉద్రేకాలకీ, పగా-ప్రతీకారాలకీ విముక్తి ఎక్కడా? శత్రువు వికృతానందాల కోసం మంచివాళ్ళంతా బలైపోవాల్సిందే! చచ్చిపోయిన వాళ్ళని లేపి మరీ శాంతి లేకుండా చేయగలరు వాళ్ళు! అంతా అశాంతి-అన్యాయం, అరాచకత్వం-అమానుషత్వం… అన్నిటికీ మించి అవివేకం!”

ఆ ఇద్దరి హృదయాలు బాధతో, ఇరువురి ముఖాలు సానుభూతితో నిండిపోయాయి.

“సార్… ఇలాంటి క్షోభ ఇంకా ఎన్నాళ్లు అనుభవించాలి?”

నవ్వాడు విశ్వ- సూటిగా… నర్మగర్భంగా- “ఒకరినొకరు చంపుకునేదాకా, ఈ యుగం అంతమయ్యేదాకా!

“మనం- మనం’ అంటూ ఎంతో గొప్పగా మానవత్వపు కబుర్లు చెప్పుకుంటాం. ఏ సమయంలో ఎవడికి రాక్షసబుద్ధి పుడుతుందో తెలియదు… అంపశయ్యపై జీవితాలు ఎలా నిలుస్తాయి సార్? మహానుభావులు పూర్వకాలంలో ఎన్ని కష్టనష్టాలు భరించి మనకి స్వాతంత్ర్యాన్ని అందించారో కదా… దానికి సంబంధించిన స్పృహైనా లేకుండా పిచ్చికుక్కలై దేశాన్ని ముక్కలు చేస్తున్నారు! ” ఆ జర్నలిస్టు యువకుడిలో ఉద్రేకం పెల్లుబుకింది.

ఆ జర్నలిస్టు యువతి కూడా అదే భావంతో- “ఏమిటి సర్- ఈ చరిత్రలూ… చెరికలూ?! ప్రక్కప్రక్కనే ఉంటూ ప్రశాంతంగా, పద్ధతిగా, నిశ్చింతగా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎప్పుడూ ఏదో విప్లవం, యుద్ధం లాంటివి జరగాల్సిందేనా? ఒకరిపై మరొకరు పగలూ, ప్రతీకారాలు తీర్చేసుకోవడమేనా? అలాంటప్పుడు ఎందుకు సర్… ఈ జీవితాలూ, ఈ జన్మలూ?” అంది.

“దాస్యం తల్లీ…. తనలో తానే అంతర్గతంగా చీకటిలో నడిచే మనిషి ఎప్పటికీ ఎదగలేడు. ఏళ్లనుంచీ అది గడ్డకట్టుకుపోయిన ఘనపదార్థమే! ఆశ-అసూయ, ద్వేషం-ఈర్ష్య, అబద్దం – అసహనం… ఇవే రకరకాల ముసుగులు తొడుక్కొన్న ఉగ్రవాదంగా రూపుదాల్చి, అరాచకంగా విరుచుకుపడుతూ ఇలాంటి బీభత్సాలు సృష్టిస్తున్నాయి!”

“వాళ్ళకు మనసూ, మమకారం లాంటి భావాలేమీ ఉండవా?”

“జీవితపు రుచి తెలియనివాళ్ళకి, జీవనమాధుర్యం అర్థంకాని వాళ్ళకి అవెందుకుంటాయ్?”

“వాళ్ళిలా తయారవడానికి కారణాలేమిటి?”

“ముందే చెప్పాను కదా- ‘అరాచకత్వం-అమానుషత్వం…. అని! దానినెవరూ తప్పించలేరు…. ఎవరికి వారు ఆ అజ్ఞానంలోంచి బయటకి రావడానికి ప్రయత్నించనంతవరకూ!”

“మృగాల నుంచి మనుషులుగా మారినతర్వాత తిరిగి మృగాలుగా మారిపోతున్న ఈ ప్రక్రియ సరైనదేనా? ఇదేనా మనుషులుగా మనం సాధించిన పరిపక్వత? నీతి-న్యాయం, దయా-దాక్షిణ్యం లాంటి మనిషితనపు విలువల గురించిన ఆలోచనే లేదా?”

విసుగు ఆవరించింది. విశ్వకి – “నన్ను ఈ రాత్రికి వొంటరిగా వదిలేసి వెళ్లండి… నేను చచ్చిపోవాలి!”

ఇద్దరూ ఉలిక్కిపడ్డారు- “అదేంటి సర్… అలా అంటున్నారు?

“నా గతాన్ని గుర్తు తెచ్చుకోవాలి… నా మధురమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని శాంతంగా పడుకోవాలి. కోల్పోయిన జీవితాన్ని మాటలతో, చేతలతో ఎవరూ తిరిగివ్వలేరు! ”

“మీతో చాలా మాట్లాడాలనివుంది సర్…”

“నేను రాజకీయ జాతికో, అధికార గణానికో, వ్యాపార వర్గానికో, మేధావి కోవకో దినవాడిని కాదు. నేను చాలా మామూలు, సాధారణ, సగటు మనిషిని! దోపిడీ, హింస, కాచకత్వాలతో నిండిపోయిన ఈ వ్యవస్థలో అసలే ఒంటికాలిపై అతికష్టమ్మీద నిలదొక్కుకుంటూ జీవనం సాగించే నాకు- ఇప్పుడు ఆ ఒక్కకాలు కూడా భూమ్మీద స్థిరంగా నిలదొక్కుకోలేకపోతోంది. ఇంకా ఈ మనుషులు ఎంతమందిని మృత్యుదేవత వొడిలోకి పంపుతారో?! అవి చూస్తూ పైశాచికంగా ఆనందించేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూంటే… వాళ్ళనీ, వారి అకృత్యాల్నీ ఆపే దిశగా యత్నాలు చేయకుండా శవాల మీద రాజకీయం చేస్తూ తమ స్వలాభం చూసుకొనే స్వార్థపరుల్ని చూస్తూంటే… నా మనో స్టెర్యం క్షీణించిపోతోంది!”

ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇద్దరికీ ఎవరిమీదో తెలియని కోపం, ఆవేశం తన్నుకొచ్చాయి. ఉగ్రవాదుల గురించి మనసులోనే నిరసించారు.

విశ్వ నవ్వుతున్నాడు…

అతని కళ్ళముందు భార్యాపిల్లలు పక్షుల్లా పైకెగురుతూ నవ్వుతూ చేతులూపుతున్నారు…..

అతడు నవ్వుతూనే ఉన్నాడు… విషాదంగా… విశాలంగా… విశ్వవ్యాప్తంగా…

జరిగిన- జరుగుతున్న- జరగబోయే మారణకాండల పట్ల, భయానక- బీభత్స- అరాచక కృత్యాల పట్ల ఇంకేం చేయాలో… ఏంచేస్తే అవి సమసిపోతాయో తెలియని నిస్తేజంగా…

‘ఎవరికి వారే… యమునా తీరే’ అన్నట్లుగా….

ఎవరూ ఎవరికీ బాధ్యులు కారు’ అని అర్థమైనట్లుగా… ఇంకేమీ లేదన్నట్లుగా !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here