జై శ్రీరామ్

5
8

[box type=’note’ fontsize=’16’] శ్రీరామనవమి సందర్భంగా, అవిషేక్ గుప్తా ఆంగ్ల కథ ‘జై శ్రీరామ్‘ని కస్తూరి మురళీకృష్ణ  స్వేచ్ఛానువాదం చేసి తెలుగులో అందిస్తున్నారు. [/box]

[dropcap]లం[/dropcap]కలో తన భవంతిపైన నుంచుని ఉన్నాడు రావణుడు. సాయం సమయం అది. దూరంగా సముద్రం నీరు ఆకాశం కలిసిపోతున్నట్టున్నాయి. అయితే అతడి దృష్టి ఆ సుందరమైన దృశ్యం వైపు లేదు. అతడికి సముద్రానికి ఆవల కదలికలు తెలుస్తున్నాయి. చీమల్లా కదిలే వానరులు కనిపిస్తున్నారు. అతడి భృకుటి ముడిపడింది.

‘లంకను నాశనం చేస్తామన్న ధైర్యంతో వస్తున్నారు వాళ్ళు’ అనుకున్నాడు రావణుడు.

‘రానీ… సముద్రం దాటి లంకలో అడుగు పెట్టినప్పుడు తెలుస్తుంది వాళ్లకు రాక్షస శక్తి. తాము జన్మించిన క్షణాన్ని తిట్టుకునేట్టు చేస్తాను. నా చేతులతో స్వయంగా వాళ్ళ కాళ్ళూ, కీళ్ళూ విరిచేస్తాను’ పళ్ళు పట పట కొరికాడు రావణుడు.

నెమ్మదిగా శయన మందిరంలోకి వెళ్ళాడు.

చీకూ చింతా లేకుండా హాయిగా నిద్రిస్తోంది మండోదరి.

సర్వం నాశనమయ్యే భయంకరమైన ప్రమాదం పొంది వుందన్న ధ్యాస కూడా లేదు.

గత రెండు రాత్రుళ్ళు రావణుడికి నిద్రలేదు. సేనా నాయకులతో యుద్ధ వ్యూహం చర్చిస్తూ గడిపాడు. అన్ని కోణాల నుంచి లంక భద్రత విషయం ఆలోచించారు. శత్రువులను నిర్జించే పథకాలు వేశారు. అన్నీ సిద్ధమయ్యేసరికి యుద్ధోత్సాహం అందరినీ ఆవహించింది.

రాముడి సేన లంక చేరడం కోసం ఆత్రుతగా ఎదురుచూడటం ఆరంభించారు.

యుద్ధం గురించి ఆలోచిస్తూ రావణుడికి విసుగు వచ్చింది. తన మనస్సును యుద్ధం నుంచి మళ్ళించాలి.

పాత్రలో మద్యం నింపుకున్నాడు.

కానీ నరనరాన పాకుతున్న మత్తు అతడికి సీతాదేవి చేసిన అవమానాన్ని గుర్తు చేసింది. మరోసారి ఆమె రావణుడిని తిరస్కరించింది.. ఆమె పరుష వాక్యాలు శరాఘాతాలై రావణుడి మదిని తొలుస్తున్నాయి. ఆ అవమానం అగ్ని అయి భగ్గుమంది. కోపం దావానలంలా ప్రజ్వరిల్లింది.

సీతకు తగిన గుణపాఠం నేర్పాలి. రాముడి తలను బహుకరించాలి. అప్పుడు కానీ ఆ అహంకారం అణగదు, ఆత్మాభిమానం తగ్గదు.

తల విదిల్చాడు రావణుడు.

మత్తు ఆనందాన్ని కలిగించే బదులు బాధను మరింత పెంచుతోంది. అతడి దృష్టి మళ్ళాలంటే మత్తు సరిపోదు.

తల్పంపై హాయిగా నిద్రిస్తున్న మండోదరి వైపు నడిచాడు రావణుడు.

***

సభలో రావణుడు తన అధికారులతో యుద్ధ ప్రణాళికలు చర్చిస్తున్నాడు. ఎంతగా చర్చిస్తే, అంతగా వారి విశ్వాసం పెరుగుతోంది.

లంక దుర్బేధ్యమైనది. శత్రువు శక్తిమంతుడు కావచ్చు, జిత్తులమారి కావచ్చు. కానీ తమ శక్తి అపరిమితం. అంతలో అతడికి ఇటీవలె హనుమంతుడు జరిపిన లంకాదహనం గుర్తుకువచ్చింది. ‘ఈ హనుమంతుడిని అదుపులో పెట్టేందుకు ప్రత్యేక పథకాలు వేయాలి’ అనుకున్నాడు రావణుడు.

‘వాడు కనుక నాకు చిక్కితే వాడి చర్మం వలుస్తాను’ పళ్ళు పట పట లాడించాడు.

ఇంతలో హఠాత్తుగా సభలో కలకలం చెలరేగింది.

హడావిడిగా తత్తరపాటుతో సభలో ప్రవేశించిన వార్తాహరుడు క్రిందపడ్డాడు. వాడి తత్తరపాటు, భయం అందరిలోనూ వెరపు కలిగించింది.

“మహారాజా…. చెడువార్త.. రాముడి సైన్యానికి మంత్రశక్తి, అద్భుతమైన శక్తి ఉన్నట్టుంది” కంగారుగా చెప్పాడు వార్తాహరుడు.

“పిచ్చి మాటలు మాట్లాడకు. సరిగ్గా చెప్పు. ఏమైందో?”

“వాళ్ళు రాముడు దేవుడని, విష్ణువు అవతారమని నమ్ముతున్నారు. దానికి ఇవాళ నిరూపణ కూడా లభించింది. రాముడికి నిజంగానే దైవశక్తులు ఉన్నాయి.”

రావణుడి దవడలు కోపంతో బిగుసుకున్నాయి.

“రాముడు దేవుడా? ఏమి దైవిక శక్తులున్నాయి రాముడికి? నువ్వేం చూశావు?”

“ప్రభూ… రామ నామ జపం ఎలాంటి పరిస్థితులోనయినా విజయం కలిగిస్తుంది. రామసేన సముద్రంపై వారధి నిర్మించాలని విఫల ప్రయత్నాలు చేసింది ఇన్నాళ్ళూ. వాళ్ళకి పడవలు లేవు. వారధి నిర్మించకపోతే సముద్రం దాటి లంకను చేరలేరు. అందుకని వారధి కట్టడం తప్పనిసరి. వారధి కట్టడం కోసం వాళ్ళు విసిరే బండలు, రాళ్ళు, చెట్లు సముద్రంలో మునిగిపోతున్నాయి. కానీ ఈ రోజు వాళ్ళు రాళ్ళు సముద్రంలో తేలే విధానం కనుగొన్నారు. ఇది నా కళ్ళతో చూశాను. అద్భుతం. వాళ్ళు ఇది దైవ శక్తి అనుకుంటున్నారు. వారధి నిర్మిస్తున్నారు.”

సభలో రణగొణధ్వని పెరిగింది. అందరూ ఏదో మాట్లాడుతున్నారు.

రావణుడు గర్జించాడు.

“ఇదెలా సాధ్యమయింది?”

“ప్రభూ… వాళ్ళు రాళ్లను నీళ్ళల్లోకి విసిరేముందు రామనామాన్ని జపిస్తున్నారు. ‘జై శ్రీరామ్’ అన్న నినాదాల నడుమ రాళ్ళను నీళ్ళల్లోకి విసురుతున్నారు. రామనామశక్తి వల్ల రాళ్ళు నీళ్ళపై తేలుతున్నాయి. స్థిరంగా ఉంటున్నాయి. ఇది నిజం. రామనామ జపం వల్లనే ఇది సాధ్యమని, ఇక విజయం తథ్యమని వాళ్ళు నమ్ముతున్నారు.”

ఈ మాటలు వినడంతోనే సభలో ఉన్నవారందిరిలో భయం ప్రవేశించింది. రాముడి క్రోధం నుండి తమని రక్షించమని దేవుడిని ప్రార్థించసాగారు సభికులు.

ఇది గమనించాడు రావణుడు.

ఆత్మవిశ్వాసం లేని సేన ఎంత శక్తిమంతమైనదైనా విజయం సాధించలేదు. తానేదో సత్వరం చేయకపోతే ఈ ఆత్మవిశ్వాసరాహిత్యం కార్చిచ్చులా పాకిపొతుందని గ్రహించాడు రావణుడు.

‘రాముడు కనుక దైవమే అయితే, రాముడు దైవిక శక్తులు కలవాడే అయితే ఇక లంక నాశనం తప్పదు. తమకు దిక్కెవరు? తమని రక్షించేదెవరు?’ అందరి ముఖాలలో నిరాశ, నిస్పృహలు, భయం స్పష్టంగా కనబడసాగాయి.

ఇంతలో ఒక పెద్ద నవ్వు అందరి ఆలోచనలను అడ్డుకుంది.

ఎవరిదా నవ్వు?

ఆశ్చర్యంగా అందరూ రావణుడి వైపు చూశారు.

‘రావణుడికి ఏమైంది? రాముడి శక్తికి పిచ్చి పట్టలేదు కదా?’

పడీ పడీ నవ్వాడు రావణుడు.

తన నవ్వుతో అందరి దృష్టినీ రాముడి నుంచి తనవైపు మళ్ళించడంలో కృతకృత్యుడయ్యానని రావణుడికి అర్థమైంది. సంతృప్తిగా నిట్టూర్చాడు.

“మిమ్మల్ని చూస్తే నాకు నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు. పేరుకు రాక్షస వీరులు. కానీ ఒక చిన్న మాయను చూసి పిల్లుల్లా వణికి పోతున్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. రాముడు దేవుడు కాదు. ఒక చిన్న ఇంద్రజాలాన్ని చూసి దేవుడని భ్రమపడకండి. రాళ్ళు నీళ్ళల్లో తేలటమే కదా! ఆ పని నేను చిన్నప్పుడు పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆటల్లో ఆడేటప్పుడు చేసేవాడిని” అన్నాడు.

సభికులు ఒకరివైపు ఒకరు అపనమ్మకంగా చూసుకున్నారు.

“మీకు నా మాట మీద నమ్మకం కలగడం లేదా? నాతో రండి. ఇప్పుడే సముద్రంలో రాళ్ళు తేలే మాయను నేను చూపిస్తాను. రాముడు దేవుడు కాదు. అంత భీకరమైన శక్తులున్న వాడు కాదు. రండి.”

***

సముద్ర తీరం వద్ద ఇసుక వేస్తే రాలనంత మంది రాక్షసులు వచ్చి చేరారు. రావణుడు చేసే అద్భుతాన్ని దర్శించడం కోసం రాక్షసులు విరగబడిపోయారు.

దూరం నుంచి సముద్రపు హోరుపై తేలుతూ వానరులు చేసే రామనామ జపం ‘జై శ్రీరామ్’ సన్నగా వినిపిస్తోంది. సముద్రపు హోరు కూడా స్పందించి ‘జై శ్రీరామ్’ అంటున్నట్టుంది.

“నా లంకా ప్రజలారా! మీరు మన గొప్పదనం మరిచి వేరేవాడి గుణ గానాలు చేయటం మానండి. మన గొప్పతనాన్ని నెమరు వేసుకోండి. మాయమాటలు, మాయల తంత్రాలకు భయపడకండి. జాలి, కరుణ లేని కఠినమైన రాక్షసులం మనం. మనల్ని చూసి అందరూ భయపడాలి కానీ, మనం ఒకరిని చూసి, అదీ మానవుడిని చూసి భయపడటం అర్థం లేనిది!”

అందరూ రావణాసురుడికి జయజయధ్వానాలు చేశారు.

“రాముడు దేవుడు కాడని నిరూపిస్తాను. రాళ్ళు నీళ్ళపై తేలటంలో దైవత్వం లేదు, ఇదొక వైజ్ఞానిక ప్రక్రియ. ఒక ప్రత్యేక పద్ధతిలో రాళ్ళను సముద్రంలోకి విసిరితే అవి తేలతాయి. చూడండి” అన్నాడు రావణుడు.

ప్రజలలో ఉత్సుకత హెచ్చింది.

రావణుడు సముద్రం నీళ్ళ దగ్గరకు వెళ్ళి ఒక్క క్షణం ఆగాడు. దీర్ఘంగా ఊపిరి తీసుకున్నాడు. బలంగా రాయిని సముద్రంలోకి విసిరాడు.

ఆశ్చర్యం!

నీళ్ళను తాకిన రాయి మునిగినట్టే మునిగి పైకి తేలింది. స్థిరంగా ఉంది.

రాక్షసుల ఆశ్చర్యానికి అంతులేదు.

వాళ్ళు తమ కళ్ళని తామే నమ్మలేకపోయారు.

అంతలో జయజయధ్వానాలు సముద్రపు హోరును దాటి ఆకాశాన్ని తాకాయి.

అందరూ రాళ్ళు పుచ్చుకుని బయలుదేరారు.

రావణుడు వాళ్ళని ఆపాడు.

“శత్రువులు కట్టవలసిన వారధిని మనం కట్టి వాళ్ళ పని సులువు చేయటం భావ్యమా? పొండి. ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో యుద్ధానికి సిద్ధం కండి. మనిషికి, వానరులకు భయపడే రాక్షసులింకా పుట్టలేదని నిరూపించండి” అన్నాడు రావణుడు.

“వానరసేనను అంతం చేస్తాం. విరుచుకు తింటాం” అని అరుస్తూ రావణుడికి జయజయధ్వానాలు చేశారు రాక్షసులు.

హఠాత్తుగా రాక్షస సేన నుండి వినిపించే జయజయధ్వానాలు వానరులను నివ్వెరపరిచాయి.

రాముడి ముఖం చిరునవ్వుతో వెలిగిపోయింది.

***

రావణుడు చూపిన మహాద్భుతం లంకంతా వ్యాపించింది. ప్రజలు అంతా ఆ విషయమే చర్చించుకోసాగారు.

ఆ రోజు రాత్రి శయన మందిరంలో ప్రవేశించిన రావణాసురుడిని మండోదరి అడిగింది.

“ఈ రోజు తమరేదో మహాద్భుతం చూపించారని విన్నాను…”

“ఏం విన్నావు?”

“రాయిని నీటిపై తేలేట్టు చేశారని. ఇది నిజమా?”

“ఈ వార్త  నీదాకా వచ్చిందా? అవును. నిజమే. అదేమీ గొప్పదైవ శక్తి కాదని నిరూపించడం కోసం చేయాల్సి వచ్చింది.”

“కానీ మీరు ఎన్నడూ ఇలాంటి అద్భుతాలూ, మాయలపై ఆధారపడలేదు. అందుకే నాకు నమ్మబుద్ధి కావటం లేదు…”

రావణుడు నవ్వాడు. “మండోదరీ, నీ దగ్గర నేనేమీ దాచను. దాచలేను. కానీ నేను చెప్పే విషయం మన మధ్యే ఉండాలి.”

తల ఊపింది మండోదరి.

“మండోదరీ! యుద్ధం కేవలం వీరత్వంతోటే గెలవటం ముఖ్యం కాదు. యుద్ధంలో గెలవాలంటే ఆత్మ విశ్వాసం ఉండాలి. శత్రువు కన్నా తాను అధికుడు అన్న భావం ఉండాలి. సైన్యంలో ఏ మాత్రం న్యూనతా భావం కలిగినా, దాన్ని వెంటనే రూపుమాపకపోవటం ప్రమాదకరం. వారి భయాలను తొలగించి, వారికి విశ్వాసాన్నివ్వాలి.  స్ఫూర్తినివ్వాలి. అందుకని మాయ చేయక తప్పలేదు. నేను దైవాన్ని ప్రార్థించాను. ఆ ప్రార్థనా బలంతో రాయి నీటిలో తేలింది. రామసేనలా నేనూ ప్రార్థన ద్వారా రాయి నీటిలో తేలేట్టు చేశాను. వారు పైకి ప్రార్థించారు, నేను మనసులో ప్రార్థించాను. అంతే తేడా, కానీ ఫలితం ఒక్కటే.”

“ఇంతకీ మీరు ఏ దేవుడిని ప్రార్థించారు? మీ ప్రార్థనందుకున్న ఆ గొప్ప దేవుడెవరు?” నవ్వుతూ అడిగింది మండోదరి.

రావణుడి ముఖం నవ్వుతో నిండిపోయింది.

“శత్రువులు ఏ దేవుడిని ప్రార్థించారో నేనూ ఆ దేవుడినే ప్రార్థించాను, ‘జై శ్రీరామ్’ అని” చెప్పాడు.

***

ఆంగ్ల మూలం: అవిషేక్ గుప్తా

తెలుగు: కస్తూరి మురళీకృష్ణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here